Tuesday, 19 November 2019

English Medium is the Democratic Right of Underprivileged

English Medium is the Democratic Right of Underprivileged
అభద్రలోకపు ప్రజాస్వామిక హక్కు ఇంగ్లీషు మీడియం

డానీ  

  వర్గ సమాజపు సమీకరణలకన్నా కులవర్గ సమాజపు సమీకరణలు సంక్లిష్టంగా వుంటాయి. ఇప్పటి వరకు సంపన్న, ఎగువ మధ్య, మధ్య తరగతులకు చెందినవారిని పాలకవర్గం అంటున్నాం; దిగువమధ్య, పేద సమూహాలని పాలితవర్గం అంటున్నాం. ఇది ఆర్థిక విశ్లేషణ మాత్రమే. సాంఘీకార్థిక (socio-economic) విశ్లేషణకు సాంస్కృతిక అవగాహన కూడ కావాలి. పెత్తందారీ కులాలు, అణగారిన కులాలు రెండూ ఇటు పాలక వర్గంలోనూ అటు పాలిత వర్గంలోనూ వుంటాయి. అంత మాత్రాన అవి రెండూ ఒకటికానేకావు. పాలకవర్గంలో అత్యధిక శాతం పెత్తందారీ కులాలు, అత్యల్ప శాతం అణగారిన కులాలు వుంటాయి. ఈ సమీకరణని భద్రలోకం అనాలి.  అలాగే, పాలితవర్గంలో అత్యధిక శాతం అణగారిన సమూహాలు, అత్యల్ప శాతం పెత్తందారీ కులాలు వుంటాయి.  ఈ సమీకరణని అభద్రలోకం అనాలి.         

            రెండు వందల సంవత్సరాల బ్రిటీషు పాలనతో పాటూ  అది తెచ్చిన వలస భాషాసంస్కృతులు పోయివుంటే దేశీయ భాషలు వికసించడానికి అవకాశాలు వుండేవి.  కానీ అలా జరగలేదు.  ఆర్థికరంగంలో  విదేశీ పెట్టుబడులు గతంకన్నా పెద్ద వరదలా వస్తున్నాయి. విదేశీ కంపెనీలను తీసుకు రాగలిగినవారే రాజకీయ రంగంలో సమర్థులుగా చెలామణి అవుతున్నారు. రాజకీయార్ధికరంగంలోని విలువలే సాధారణంగా విద్యా సాంస్కృతిక రంగాల్లోనూ కొనసాగుతాయి. ప్రత్యక్ష వలస పాలన కాలంలోనూ లేనన్ని విదేశీ వస్తువులు, సాంప్రదాయాలు మన ఇళ్ళు జీవితాల్లోనికి వచ్చేశాయి. పిల్లలు అభివృధ్ధి చెందిన దేశాల్లో స్థిరపడాలనే జీవితాశయం మనలో బలపడుతోంది. ఐటి ఉద్యోగాలకు విదేశీ ద్వారాలు తెరుచుకున్నాక మన సమాజంలో ఇంగ్లీషు గిరాకి మరీ  పెరిగిపోయింది. గతం నుండే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు మొదలు పోలీసు స్టేషన్ల వరకు కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నాయి. అధికారం మొత్తం తన చుట్టూ తిరుగుతుండడంతో మొదట్లో అనుసంధాన భాషగావున్న ఇంగ్లీషు  ఇప్పుడు మనకు అప్రకటిత అధికార భాషగా మారిపోయింది. మాతృభాషలకు ఉపయోగపు విలువలు మాత్రమే మిగలగా,  ఇంగ్లీషుకు మారకపు విలువ కూడా అదనంగా చేరింది. ఈ వాస్తవాన్ని ముందు అందరూ గుర్తించాలి.     

      రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్థ శతాబ్దం క్రితం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు  అరుదుగా వుండేవి. అందువల్ల భద్రలోకం కూడ అభద్రలోకంతోపాటు తెలుగు మీడియం పాఠశాలల్లోనే ‘కంబైన్డ్ స్టడీస్’ చేసేది. భద్రలోకపు స్థాయి, అవసరాలకు అనుగుణంగా  అప్పటి తెలుగు మీడియం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు వున్నతంగా వుండేవి. 1971లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పడి, కళాశాల విద్యలోనూ తెలుగు మీడియంను అనుమతించాక విద్యారంగంలో కులవర్గ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి. తెలుగు మీడియంకన్నా ఇంగ్లీషు మీడియం మెరుగైనదనీ, అందులోనూ స్టేట్ సిలబస్ కన్నా సెంట్రల్ సిలబస్ నాణ్యమైనదనే ఒక కొత్త విలువ బలంగా ముందుకు వచ్చింది. భద్రలోకం మొత్తం ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూళ్ళకు మారిపోవడంతో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూంలు, బ్లాక్ బోర్డులు,  బెంచీలు, గాలి, వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు సహితం లేకుండాపోయాయి. మరోవైపు, ప్రభుత్వ విద్యారంగంలో అధ్యాపక సంఘాల సంఖ్య పెరిగింది. అధ్యాపకుల జీతాలు పెరిగాయి; విద్యా ప్రమాణాలు మాత్రం ఘోరంగా పడిపోయాయి.  అభద్రలోకం మాత్రమే గతిలేక తెలుగు మీడియంలో మిగిలిపోయింది.

         ప్రాధమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఇదే పరిస్థితి వుంది.  అల్పాదాయవర్గాలకు చెందిన  భవన కార్మికులు, ఆటో డ్రైవర్లు సహితం తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు పంపించడం మొదలెట్టారు. ప్రమాదం ఏ దశకు చేరిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సహితం తమ పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలల్లో చేర్చడానికి భయపడిపోతున్నారు. ఫలితంగా అభద్రలోకానికి నియత విద్య మీదనే నైరాశ్యం ఏర్పడే ముప్పు వచ్చింది.

            ఇంగ్లీషు రాకపోవడాన్ని ఒక భాషా వైకల్యంగా మార్చేసిన యాభై ఏళ్ళ చారిత్రక పరిణామాల్ని సీనియర్ మేధావులు గుర్తించడంలేదు. తాము తెలుగు మీడియంలోనే చదివి గొప్పవాళ్ళయినట్టు ఒక అర్థ సత్యాన్ని  ప్రచారం చేస్తున్నారు.  మరోవైపు, అభద్రలోకం ప్రభుత్వాన్ని చౌక బియ్యం, పక్కా ఇళ్ళు,  వృధ్ధాప్య పెన్షను, కార్ పోరేట్ ఇంగ్లీషు వైద్యం  కావాలని అడిగినట్టు ఇప్పుడు తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య కావాలని అడుగుతోంది. వైయస్ జగన్ నిర్వహించిన చారిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా పేదజనం ఆయనతో చెప్పుకున్న కష్టాల్లో కాన్వెంటు ఫీజుల భారం  ఒకటి. ఆ మేరకు ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు మూడు నాలుగు విడతల్లో ఇంగ్లీషు మీడియంలోనికి మార్చాలని ముఖ్యమంత్రి  జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుండి ఇది అమల్లోనికి రానుంది. ప్రతి తరగతిలోనూ విద్యార్ధుల ఛాయిస్ ను బట్టి తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్ట్‍ గా తప్పనిసరిగా వుంటుంది.  ఇది అందరూ ఆహ్వానించవలసిన పరిణామం.  

       అభద్రలోకానికి ఇంగ్లీషు మీడియం విద్య అందిస్తారనగానే భద్రలోకం ఉలిక్కి పడింది. పురాతన కాలంలో విద్య నేర్చే శూద్రుల్ని కఠినంగా శిక్షించేవారట. ఇప్పుడు అభద్రలోకానికి ఇంగ్లీషు దకక్కుండచేయడానికి మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక నడుం బిగించింది. ప్రతి మనిషికీ పుట్టడానికి ముందే తల్లిగర్భంలోనే మాతృభాష పరిచయం అవుతుంది. పుట్టాక కూడ ఆ వాతావరణంలోనే పెరుగుతాడు కనుక ఎవరికైనా నేర్చుకోవడానికి మాతృభాష చాలా సౌలభ్యంగా వుంటుంది. మనిషి జీవితంలో మాతృభాష అనేది స్కూళ్లకు ముందూ వుంటుంది, ఆ తరువాతా వుంటుంది. స్కూళ్ళలో మాత్రమే మాతృభాష పుట్టి పెరుగుతుందని అమాయకులు మాత్రమే భావిస్తారు.

     మాతృభాష అనగానే తెలుగు ఉర్దు మాత్రమే గుర్తుకువస్తాయి. తమిళ కన్నడ మళయాళ గుజరాతీ సమూహాలే కాకుండా సవర, జాతాపు తదితర ఆదివాసీ భాషల సమూహాలూ అనేకం వుంటాయి. ఆ యా భాషలు మాట్లాడేవాళ్ళకు వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యా బోధనకు అవకాశాలు లేవు. మాతృభాష పేరు చెప్పుకుంటూ   అధికార భాషలో విద్యాబోధన సాగిస్తున్నారు. ఆ అధికార భాష సంఘం ప్రచురించే పుస్తకాల్లోని కృతక ఆంధ్రము కన్నా ఇంగ్లీషు చదవడమే చాలా సులువుగా వుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నది భద్రలోకమే అనేది చాలా స్పష్టం. అప్పట్లో ప్రైవేటు విద్యను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ విద్యను బలహీనపరిచిందీ వీళ్ళే. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల ఆధిపత్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్నదీ భద్రలోకమే.

    మాతృభాష పరిరక్షణ కోసం పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు దాదాపుగా వుండరు. నియత విద్య ప్రయోజనమే ఉపాది. మాతృభాష అవసరాన్ని గుర్తించిన వాళ్ళు ఇంటి దగ్గర వాటికి వేరే ఏర్పాట్లు చేసుకుంటారు. భాషా మైనారిటీలు సాధారణంగా అలా చేస్తుంటారు.

          సమాజంలో అందరూ ఉద్యోగాల కోసమే చదువుతారుగానీ అందరికీ ఉద్యోగాలు రావు. అత్యుల్లాసమైన (Volatile) ఉపాధిరంగంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్ కు గిరాకీ వుంటుంది. 1970లలో కామర్స్ చదివితే చాలు బ్యాంకు ఉద్యోగం వచ్చేస్తుంది అనేవారు. 1990లలో Y2K సమస్య వచ్చినపుడు బిటెక్ మాత్రమే కాదు ఏదో ఒక్క సాఫ్ట్‍ వేర్ భాష వచ్చినా ఉద్యోగాలు వచ్చాయి. గిరాకీ సరఫరా సూత్రం అన్నింటా వుంటుంది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంకు అలాంటి  క్రేజ్ వుంది. మార్కెట్లో ఉపాధి అవకాశాలే లేనపుడు ఏ మాధ్యమంలో చదివితే ఏమిటనే? వాళ్ళూ వున్నారు. “కూటికీ పేదోణ్ణేకానీ; కులానికి కాదు” అనే మాట మన సాంస్కృతిక రంగంలో వినపడుతూ వుంటుంది. ఉద్యోగం రాకపోయినా ఇంగ్లీషు వచ్చినవాళ్ళు అలాంటి సాంస్కృతిక  గౌరవాన్ని ఆస్వాదించే  వాతావరణం మన సమాజంలో వుంది.

               ఆర్థిక రంగంలో అభద్రలోకానికి భద్రలోకానికి మధ్య సాగే ఘర్షణే ఇప్పుడు విద్యారంగంలో తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియంల  వివాదంగా వ్యక్తం అవుతోంది. నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ సంస్థల్లోలో సామాజికమైనారిటీ విద్యామెజారిటీగా మారుతుండగా, సామాజికమెజారిటీ విద్యామైనారిటీగా మిగిలిపోతోంది. ఈ అసమానత్వం ఇంకెంత కాలం కొనసాగాలీ? ఇంగ్లీషు మీడియంలో చదవాలని ఆశిస్తున్న ప్రతి పేద కుటుంబానికీ ఆ అవకాశం కల్పించాలి. ఇప్పుడు అభద్రలోకపు ప్రజాస్వామిక హక్కు ఇంగ్లీషు మీడియం.

       అభద్రలోకంలో ఇంగ్లీషేతర మాధ్యమాల్లో చదవాలనుకునే వారు కూడ వుంటారు.  వారిది కూడ ప్రజాస్వామిక హక్కే. అంచేత కనీసం ఐదవ తరగతి వరకైనా ఇంగ్లీషేతర మాధ్యమాలకు కూడ ఛాయిస్ వుండాలి. పేరెంట్స్ మీట్స్‍ పెట్టి వాళ్ళు కోరుకునే మీడియం ఇంగ్లీషో, మాతృభాషో తేల్చాలి. ఆ సర్వేఫలితాలను బట్టి పాఠశాలల్ని వర్గీకరించాలి; పునర్ వ్యవస్థీకరించాలి.      

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైలు  : 9010757776


రచన : 11 నవంబరు 2019
ప్రచురణ : 14 నవంబరు 2019, ‘ఇంగ్లిష్‌ ఓ ప్రజాస్వామిక హక్కు’  శీర్షికతో ప్రచురించారు.

https://www.sakshi.com/news/guest-columns/usha-s-danny-articles-english-medium-education-1241462

https://epaper.sakshi.com/c/45937990?fbclid=IwAR1ejasT-cte9MWxhcvkerBMivkscGLIRqBxYYI5v0XcxlCiAO2CQU_QIOg

నాలోని కథకునికి “పోరాట మిత్రులు’ చాలా అన్యాయం చేశారు.

నాలోని కథకునికి “పోరాట మిత్రులు’ 
చాలా అన్యాయం చేశారు.


డియర్ సురేష్,

గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ ఇంటర్వ్యూ కు నీ అనువాదాన్ని ఇప్పుడే  చదివాను. ఆంధ్రజ్యోతిలో నీ  వ్యాసం లింకు ఎందుకో ఓపెన్ కావడం లేదు. అది కూడ చదవాలని ఎదురు చూస్తున్నాను.

మార్క్వెజ్  ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు  నా జీవితంలోని అనేక అంశాలు గుర్తుకు వచ్చాయి. మొదటిది మా అమ్మమ్మ. ఆమెకు జానపద కథలు అనేకం వచ్చు. రోజూ మాకు నిద్రపోయే ముందు ఒక కథ చెప్పేది. వాటిల్లో దయ్యాలు, భూతాలు మాయలు మంత్రాలు అన్నీ వుండేవి.

అలా మా సమీప బంధువుల్లో ముహమ్మద్ షరీఫ్ అని ఒకడు వుండేవాడు. వాడు ఈ లోకంలో కన్నా ఇతర గ్రహాల్లో ఎక్కువగా వుండేవాడు. “ఎరా నిన్న కనిపించలేదేంటీ?” అని అడిగితే  “చంద్రలోకానికి వెళ్ళానుగా. చంద్రుని కూతుర్ని పెళ్ళిచేసుకున్నాను” అని మొదలెట్టేవాడు. తీరిక వుంటే ఒక గంటకు పైగా ఆ కథను నడిపించేవాడు. అలా రోజుకో ఎపిసోడ్ అల్లేసే వాడు. ఆ కథల్లో మా ఉర్లో వాళ్లందరి పాత్రలూ కేరికేచర్లుగా వుండేవి. అంతటి కల్పన శక్తి  గల  మనుషుల్ని నేను ఇంత వరకు చూడలేదు. 

            నేను 1980లో జప్తు అని ఒక కథ రాశాను. అందులో మా అమ్మమ్మ, ముహమ్మద్ షరీఫ్ ల ప్రభావంతో రాసిన అభూత కల్పన దృశ్యాలు వుంటాయి. గోర్కి ‘దాంకో మండే గుడెలు’ కూడ నాకు ఒక ప్రేరణ. ప్రచురణ కోసం సృజనకు పంపించాను. ఆ కథను సృజన సాహితీ మిత్రులు రెండుసార్లు చదివి అంతిమంగా తిరస్కరించారు. కథా వస్తువు బాగుంది శిల్పం బాగోలేదనో, శిల్పం బాగుంది కథా వస్తువు బాగోలేదనో కారణాలు చెప్పారు. అంతిమంగా వాళ్ళు చెప్పింది ఏమంటే పోరాట కథలు రాయాలని. ఆ రోజుల్లో పోరాట కథలు రాసే ప్రాంతీయ, భౌగోళిక అవకాశం కేవలం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అల్లం రాజయ్యకే వుంది. ఆ పిదప బిఎస్ రాములుకు వుంది. మరి ఇతర ప్రాంతాల వాళ్ళు ఏం రాయాలీ? అనేది సందేహంగానే వుండిపోయింది.  ఆ సమయానికి అది ఒక మంచికథ అని నేను భావించాను. అచ్చుకాకపోవడంతో నేను చాలా నిరుత్సాహ పడ్డాను. కుంగుబాటుకు కూడ గురయ్యాను.

            అప్పటికి నాకు మార్క్వెజ్ తెలీదు. మ్యాజికల్ రియలిజం కూడా తెలీదు. తెలిసుంటే గట్టిగానే వాదించి వుండేవాడిని. అలా నాలోని కథకునికి నా  విరసం “పోరాట ప్రాంత మిత్రులు’ చాలా అన్యాయం చేశారు. దాదాపు 35 యేళ్ల తరువాత కొంచెం శైలి మార్చి ‘మదరసా మేకపిల్ల’ రాశాను. నేను 1980 నుండే మ్యాజికల్ రియలిజం శైలిని కొనసాగించి వుంటే చాలా బాగుండేదని అప్పుడప్పుడు బాధగా వుంటుంది.

ఆంధ్రజ్యోతి వ్యాసం కూడ పంపితే ఆనందిస్తాను.

మిత్రుడు
డానీ

Wednesday, 23 October 2019

One step backward for a great victory


One step backward for a great victory
గొప్ప విజయం కోసం ఒక అడుగు వెనక్కి
22 అక్టోబరు 2019

            బాబ్రీ మసీదు స్థలాన్ని ముస్లిం సమాజం సుప్రీం కోర్టు సమక్షంలో కొన్ని షరతులతో  హిందూ సమాజానికి అధికారికంగా ఇచ్చివేయాలనే నా సూచన మిత్రులు చాలామందికి నచ్చలేదు.  వాళ్ళు నా సూచనలోని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని వీక్షించకుండ తాత్కాలిక నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు. 

            బాబ్రీ మసీదు సమస్య మొదట్లో ఒక గల్లీ వ్యవహారం. ఇప్పుడది దేశ సాంస్కృతిక వ్యవహారం. సంఘీయులు ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన తమ లక్ష్యమని 1989లోనే ప్రకటించారు. వాటిల్లో మొదటిది నెరవేర్చుకున్నారు. రెండోది నెరవేర్చుకోవడం దాదాపుగా ఖాయం అయిపోయింది. మూడోదాన్ని  నెరవేర్చుకోవడానికి రంగం సిధ్ధం అయింది. రక్షణాత్మక స్థితిలో వున్న ముస్లిం సమాజం చేయగల గొప్ప పనేమిటీ అనేది ఇప్పుడు ప్రాణప్రద అంశం. 

            లాహోర్ లోని షహీద్ గంజ్  గురుద్వారను శిక్కులకు  అప్పగించడమేగాక ఆ కట్టడంలోని మసీదు చిహ్నాలను తొలగించడానికి కూడ పాకిస్తాన్ లో మెజార్టీగా వున్న ముస్లిం సమాజం ఉదారంగా వ్యహరించింది. ముహమ్మద్ ఆలీ జిన్నా సహితం ఈ ప్రతిపాదనకు అంగీకారాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి పరిస్థితి వర్తమాన భారత సమాజంలో లేదు.

            రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ,  హిందూత్వ శక్తులకు గుణపాఠం నేర్పాలనీ చాలా మంది జెనరిక్ మాటాలు మాట్లాడుతున్నారు. కొందరయితే ఉద్యమాలు, విప్లవాలు అంటున్నారు. దానికి తగ్గ వాతావరణం లేకపోవడమేకాదు; ఈ సలహాలు ఇచ్చేవారు సహితం తాము చెప్పే సూచనల్ని పాటించడానికి సిధ్ధంగానూ లేరు. ప్రస్తుతం అసలు ఎవరి దగ్గరా కార్యక్రమం లేదు.

            దేశంలో వాతావరణం ఎలా వుందంటే మతం వేరు మతతత్వం వేరు అనే అవగాహన చాలా మందికి లేదు. హిందూత్వవాదుల్ని విమర్శిస్తుంటే సాధారణ హిందువులు సహితం నొచ్చుకుంటున్నారు. సాధారణ హిందువుల్ని నొప్పించి ముస్లింలు సాధించగలిగేదీ ఏమీవుండదు. వినాశనాన్ని కోరి తెచ్చుకోవడంతప్ప.

            ముస్లిం సమాజం ఆవేశంతో రగిలిపోయే  సందర్భంకాదు ఇది. దౌత్య నీతిని ప్రదర్శించాల్సిన సమయం ఇది. నిజానికి ఆవేశంతో రగిలిపోయేవారు ఫేస్ బుక్ ను వదిలి బయటికి రావడంలేదు. తాను సన్నధ్ధంకాకుండా ప్రగల్భాలతో ప్రత్యర్ధిని రెచ్చగొట్టేవారు మూర్ఖులు. అలాంటి ప్రమాదం కూడ ఒకటి భారత ముస్లిం సమాజానికి లోపలి నుండి పొంచి వుంది.

శాంతి ఒప్పందమే ఒక మహత్తర విజయం

బాబ్రీ మసీదు వివాదం సమసిపోయినంత మాత్రాన భారత ముస్లింల సమస్యలు పరిష్కారం అయిపోవు. పరిష్కారం కావల్సిన సమస్యలు అనేకం వున్నాయి. భవిష్యత్తులో అనేక కొత్త సమస్యలు సహితం పుట్టుకు వస్తాయి. ముస్లింలకు ఇప్పుడు కావలసింది ఒక నైతిక విజయం. అన్ని విధాలా దుష్ప్రచారానికి గురయిన ముస్లిం సమాజం ఎక్కడో ఒకచోట టర్న్ ఎరౌండ్ అవ్వాలి. దక్షణాయనం ముగిసి ఉత్తరాయనం మొదలు కావాలి. చరిత్ర సవాలు విసిరినపుడు ముస్లింలు గొప్ప ఉదారంగా వ్యవహరిస్తారనే గట్టి సంకేతం బయటికి వెళ్ళాలి.

            బాబ్రీ మసీదు మొత్తం రెండున్నర ఎకరాల స్థలాన్ని హిందూ సమాజానికే ఇచ్చేయాలనే ప్రతిపాదన కొత్తదేమీకాదు. ప్రవక్త ముహమ్మద్ (PBUH) గారి ఆచరణ నుండే ఈ ఆలోచన వచ్చింది. చారిత్రక హుదైబియా శాంతి ఒప్పందంలోని అన్ని అంశాలూ మక్కా ఖురైషీలకు అనుకూలంగా వుండినాయి. ఇస్లాం ఉద్యమకారులకు సానుకూలంగా వున్న అంశాలు దాదాపు శూన్యం. చివరకు ముహమ్మద్ (PBUH) గారిని ఆ ఒప్పందంలో ఏమని సంభోదించాలి అన్న విషయంలోనూ పేచీలొచ్చాయి. వారిని ప్రవక్త అని పిలవడానికి మక్కా ఖురైషీలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆ ఒప్పందాన్ని సంతోషంగా అంగీకరించి ఎంతో ముందు చూపును ప్రదర్శించారు ప్రవక్త ముహమ్మద్.  

            ఆ చారిత్రక సందర్భంలో ముస్లిం సమూహాన్ని మక్కా ఖురైషీలు గుర్తించి వారితో ఒక ఒప్పందాన్ని చేసుకోవడమే ఒక విజయం. హిందూ ముస్లీం సమాజాలమధ్య ఒక ఒప్పందం జరగడమే ఇప్పుడు ఒక మహత్తర అంశం. ఎన్నింటిని వదులుకున్నా శాంతి ఒప్పందమే ఒక విజయం.  ఇప్పుడు ముస్లిం సమాజానికి కావలసింది అలాంటి దృక్పథం.

            హిందూ సమాజం శ్రీరాముని పేరిట కట్టుకునే కొత్త మందిరానికి పక్కలోనో, దగ్గరలోనో బాబ్రీ మసీదు నిర్మించాలనే ప్రతిపాదన కూడ సరైనది కాదు.  అయోధ్య  పట్టణంలోనే హిందూ సమాజం సహకారంతోనే మరో మసీదు నిర్మించుకోవచ్చు.

ఇప్పటి సామాజిక వాతావరణం చాలా విషాదకరంగా వుంది. పౌర ఉద్యమాలు, న్యాయపోరాటాల పాత నిర్వచనాలు మారిపోయాయి. వాటి మీద ప్రజల స్పందనల తీరూ మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ అత్యాచారాల్ని ఎవరయినా ఖండిస్తుంటే సాధారణ హిందూ సమాజానికి కోపం వస్తోంది. ముస్లింలు రాజకీయ యుధ్ధం చేయడానికి ముందు సాధారణ హిందూ సమాజపు సానుకూలతను పొందాల్సిన అవసరం ఒకటుంది.

మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి


మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి

          మా అమ్మానాన్నలు భిన్న పార్శ్వాలు. మా నాన్న emotional; మా అమ్మ organizer. ఆ రెండు లక్షణాలు రెండు పార్శ్వాలుగా నాలో వున్నాయంటారు సన్నిహితులు.  నాలోని emotional పార్శ్వానికి వారసుడు మా పెద్దాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి. వాడు artist and technician.  నాలోని organizer పార్శ్వానికి వారసుడు మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి. వాడు గొప్ప crisis manager.   సన్నిహితుల్లో ఎవరికి ఎంతపెద్ద సమస్య వచ్చి పడినా చిటికెల్లో పరిష్కారం చూపించే స్తోమత అనిల్ ది.

          కులనిర్మూలన ఒక ఆదర్శంగా వున్నప్పుడు పిల్ల పేర్ల చివర్ల కులాలను ఎందుకు పెట్టారు అని మమ్మల్ని కొందరు అడుగుతుంటారు. మావి భిన్నమతాలు కులాల కలయిక అని చాటి చెప్పడానికే ఆపని చేశాము. అదో ఆదర్శం.

          నేను వేసుకోవాల్సిన డ్రెస్సు, షూస్,  పెట్టుకోవాల్సిన కళ్ళజోడు, వాచీలు చివరకు తాగాల్సిన మద్యం బ్రాండ్లు కూడ మా అనిలే నిర్ణయిస్తుంటాడు. “Poor man’s luxuries drink Mansion House and rich man’s impoverish drink Johnny Walker Red label. And you are still dwelling between them” అంటాడు. కుటుంబ వ్యవహారాల్లో నాకో సలహాదారుడు అవసరమైనపుడు అనిల్ నే సంప్రదిస్తాను.  నాకు సలహా ఇవ్వగల సమర్ధుడు వాడు.

           ఈ మధ్య వాడొక మాట అన్నాడు. “నాన్నా! మమ్మల్ని పెంచడానికీ, చదివించడానికీ, జీవితంలో స్థిరపడేలా చేయడానికీ నువ్వు అనేక త్యాగాలు చేసివుంటావు. ఏదైనా టూరిస్ట్ స్పాట్‍ కు వెళ్ళాలనుకుని వెళ్ళివుండవు. ఏదైనా పెద్ద బ్రాండు మందు తాగాలనుకుని తాగివుండవు. ఎవరైన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగుకు వెళ్ళాలనుకుని వెళ్ళి వుండవు. ఇప్పుడు మనకు వెసులుబాటు వుంది. వాటినన్నింటినీ నెరవేర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అన్నాడు. వాడు నాకు నచ్చాడు.

          పెద్దయ్యాక ఇన్ని పెద్ద మాటలు చెపుతాడని వాడు పుట్టినపుడు తెలీదు. ఇప్పుడు ఇన్ని పెద్ద మాటలు చెపుతుంటే వాడు పుట్టినందుకు ఆనందంగా వుంది.

Happy Birthday Anil !.

“ఖుష్‌ బూ గుజరాత్‌ కీ”


“ఖుష్‌ బూ గుజరాత్‌ కీ”

ఏ రంగంలో అయినాసరే  సూపర్ స్టార్ గా వెలిగినవాళ్ళు కొన్ని అన్యాయాలు, అక్రమాలు, తొలినాటి సన్నిహితులపట్ల విశ్వాసఘాతుకాలు, కొత్త ప్రభువులపట్ల విధేయతలు కొనసాగిస్తారు. అవన్నీ అమితాభ్ బచ్చన్ కూడ కొనసాగించాడు. వాటన్నింటిని professional obligations గా భావించి మన్నించేయవచ్చు. కానీ గుజరాత్ నరమేధం తరువాత నెత్తురోడిన శవాల కమురు వాసన దేశమంతా వ్యాపించి వున్నపుడు “ఖుష్‌ బూ గుజరాత్‌ కీ” అంటూ వాణిజ్య ప్రచారం సాగించిన  అమితాభ్ ను క్షమించడం చాలా కష్టం. 

          చాలామంది గమనించలేదుగానీ మోదీ, అంబానీ, అమితాభ్ త్రయం రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ఒక అవగాహనతో కొనసాగారు. కొనసాగుతున్నారు.

రాయాల్సిన సమయంలో ఖదీర్ బాబు మాత్రమే రాయగలిగిన పోస్ట్ ఇది.  అమితాభ్ కోసం రాళ్ళెత్తిన ముస్లిం కూలీల్లో నర్గిస్ కూడా వుంది.

Thursday, 10 October 2019

జ్ఞాన సిధ్ధాంతపు ఆచరణ


 జ్ఞాన సిధ్ధాంతపు ఆచరణ

            ఈ ప్రపంచం మనం తెలుసుకోలేనిది ఏమీ కాదు. మనం దీన్ని తెలుసుకోగలం. మార్చగలం కూడ. అయితే చారిత్రక, సామాజిక పరిమితులవల్ల మన జ్ఞానానికి పరిమితులుంటాయి. మన పరిమితుల్ని మనం గమనించడం ముఖ్యం. మన ముందు ఒక తక్షణ సమస్య వున్నప్పుడు దానికి పరిష్కారం ఏమిటీ? ఆ పరిష్కారానికి ఎవరెవరి సిధ్ధాంతాలు దోహదపడుతాయి? దానికి కార్యాచరణ ఏమిటీ? ఆ కార్యరంగంలో మన కన్నా ముందు ఎవరయినా కృషి చేశారా? వాళ్లు  ఏం చేశారూ? ఏం చేస్తున్నారూ? ఆ దిశగా వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటీ? వాళ్ల అనుభవం మనకు ఏ మేరకు పని వస్తుందీ? అవి సరిపోకపోయినా పనికిరాకపోయినా మనం ప్రతిపాదించాల్సిన కొత్త విషయాలేమీటీ? దాని కోసం ఆచరించాల్సిన కొత్త మార్గాలేమిటీ? అని మాత్రమే మనం ఆలోచించాలి. ఆ క్రమంలో నిన్నటి వరకు మనం అభిమానించిన తాత్విక గురువుల్ని సహితం విమర్శనాత్మకంగా పునర్ ముల్యాంకనం చేయడానికి కూడ వెనుకాడకూడదు. వాళ్ళను తక్కువగా చూడాల్సిన పనిలేదు. ఒక చారిత్రక దశలో గొప్పగా వెలిగిన సిధ్ధాంతాలు మరో చారిత్రక దశలో మసక బారవచ్చు. లేదా కొత్త పదునును సంతరించుకోనూ వచ్చు.  ఇది మన జ్ఞాన సిధ్ధాంతపు ఆచరణగా వుండాలి.  ప్రతి విషయంలోనూ పాత narratives మారుతూ వుండాలి.

Wednesday, 9 October 2019

RTC Strike in Telangana

RTC Strike in Telangana 
తెలంగాణలో ఆర్టీసి సమ్మె

TSRTC నష్టాలకు కారణం యాజమాన్యం; ED లు.
కార్మికులు పోరాటం వాళ్ల మీద చేయాలి.

ఆక్యుపేషన్ రేషియో 73 శాతానికి పెరిగినా TSRTC నష్టాల్లో వుందంటే దానికి కారణం ఎవరూ? యాజమాన్యం.

కార్మిక సంఘాలు చెపుతున్నట్టు డీయిల్ ఆదా, టైర్ల జీవితం,  ఆక్యుపేషన్ రేషియో పెరిగిన మాట నిజమే అయితే నష్టాలు ఎలా వస్తున్నాయీ?

వివిధ బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీల బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం TSRTC కి తక్షణం చెల్లించాలి.

ఆర్టీసి సమ్మె వంకతో తమ జీతభత్యాలను మళ్ళీ పెంచుకోవడానికి ప్రభుత్వోద్యోగులు పావులు కదుపుతున్నారు. ఇది ప్రజా వ్యతిరేకం.

TSRTC  సమ్మెను అవకాశంగా మార్చుకుని తెలంగాణలో కేసిఆర్ వ్యతిరేక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలని కేంద్రంలోని అధికార పార్టి ఆశిస్తోంది.

మావోయిస్టు పార్టి  TSRTC సమ్మెను బలపరచడం ఇంకొక చారిత్రక తప్పిదం.

(స్నేహ టీవీలో పబ్లిక్ డిబేట్ లో వెలిబుచ్చిన అభిప్రాయాలు)

రచన : 9 అక్టోబరు 2019

 ట్రేడ్ యూనియన్లకు నేను వ్యతిరేకిని. వాళ్లు బ్యూరాక్రసీలో భాగం. ఈ విషయాన్ని నేను

గతంలో చాలాసార్లు  చాలా స్పష్టంగా చెప్పి వున్నాను. మరొక్కసారి చెపుతున్నాను. సమాజంలో

కూలీలు దీనికి వంద రెట్లు కష్టాల్లో  వున్నారు. వాళ్ల గురించి ఈ  యూనియన్లు  సమ్మేలు

చేయవెందుకూ?  RTC EDలు  ఒక్కొక్కరి జీతం నెలకు లక్షన్నర రూపాయలు పైమాటే.

సమాజంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఒకవైపు గగ్గోలు పెడుతూ ప్రభుత్వోద్యోగుల పదవి

విరమణ వయస్సు పెంచమనడం  ఏ లాజిక్కూ?

ట్రేడ్ అంటే వాణిజ్యం
ట్రేడ్ యూనియన్ అంటే వాణిజ్య కూటమి

వృత్తి సంఘం  అనే అర్థం వుందనీ తెలుసు. రా వి  శాస్త్రీ గారు ఆల్రెడీ వాడారు.

 ఈ ట్రేడ్ యూనియన్లు సంఘటిత రంగంలోనే పనిచేస్తాయి. అసంఘటిత రంగాన్ని గాలికి

వదిలేస్తాయి. కమ్యూనిస్టు పార్టీలకు సంఘటిత రంగంలోనే  ఆదాయం వుంది. పోలీసుల

జీతాలను కూడ పెంచేది ఈ ట్రేడ్ యూనియన్లే.

ప్రజలకు బిపిఎల్ ద్వార లాభం జరుగుతున్నదని మీరు భావిస్తే వాళ్ళ ఆదాయం మేరకే

జీతాలు తీసుకుని  తెల్ల కార్డూ మీద వాళ్లు పొందే బెనిఫిట్స్ అన్నీ పొందండి.

ప్రభుత్వం పన్నుల ద్వార వసూలు చేసేదానిలో అత్యధిక భాగం ఉద్యోగుల జీత భత్యాలకు

పోతుందని గుర్తు పెట్టుకుంటే మంచిది.

ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం దేనికీ? ఉద్యోగవర్గాన్ని పోషించడం దేనికీ?

సామాన్య ప్రజల మీద సానుభూతి వున్న ప్రభుత్వ ఉద్యోగులు 10 శాతం అయినా వుంటారా?

సామాన్యులు ఎప్పుడయినా ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళి లంచం ఇవ్వకుండా పని చేయించుకో గలిగారా?

నేను కావాలనే మీ లాంటి వాళ్లు చదవాలనే ఇలాంటి పోస్టులు పెడతాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించడంతప్ప ఇప్పటి ట్రేడ్ యూనియన్లు చేసేదేమిటీ?

గారూ ! ప్రభుత్వోద్యోగులు సహితం ప్రభుత్వయంత్రాంగంలో భాగమే అని కూడా కార్ల్ మార్క్సే చెప్పాడు. బ్యూరాక్రసీని అనేక తిట్లు తిట్టాడు


ఆర్టిసి సమ్మె గురితప్పింది

నేను ముందుగానే కొన్ని విషయాలు చెప్పాను.

మొదటిది; వివిధ బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీల బకాయిల్ని TSRTC కి తక్షణం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను.

రెండోది; ఆర్టీసి కార్మికులు తమ యాజమాన్యానికి వ్యతిరేకంగా  పోరాడాలి అని సూచించాను.  అపార మౌళిక సదుపాయాలున్నా సంస్థ నష్టాల్లో వుందంటే  వాళ్ళే కారకులు.  

మూడోది; నేను చాలా కాలంగా చెపుతున్నదే; ప్రభుత్వోద్యోగుల జీత భత్యాలను పెంచడానికి నేను స్పష్టంగా వ్యతిరేకం. వాళ్ళకు పెరగాల్సిన దానికన్నా చాలా పెరగడమేగాక స్వభావరీత్యావాళ్ళు  సాధారణ ప్రజలకు వ్యతిరేకులు. ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో కుక్కను దులిపితే నాలుగు కోట్ల రూపాయలు రలుతున్న రోజులివి.

నాలుగోది; ప్రభుత్వాలు పన్నుల రూపంలో  ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నదంతా ఉద్యోగుల జీత భత్యాలకే వెచ్చించడం తప్పు.

ఐదవది; సమాజంలో అనేక సమూహాలు కోట్ల మంది ఇంతకన్నా దయనీయ స్థితిలో బతుకుతున్నారు. వాళ్ల గురించి ఈ స్థాయిలో ట్రేడ్ యూనియన్లు ఎందుకు పనిచేయడం లేదూ?

ఆరవది;  అధిక ఆదాయం వున్న వారి ఆదాయన్నే నిత్యం పెంచేందుకు ప్రయత్నించడం అదేమి సామ్యవాదం. ఇతర సమూహాల ఆదాయాలను పెంచడం కోసం ఇంతటి అంకిత భావంతో కమ్యూనిస్టులు సంఘాలు ఎప్పుడయినా పనిచేస్తున్నాయా?

ప్రజాసంఘాలు ఇప్పుడు ఆర్టీసి అనగానే బయటికి రావడం బూటకం కాదా? రెండేళ్ల క్రితం బీఫ్ అమ్మకాలు వివాదంగా మారడంతో  కొన్ని వేల మంది  భయపడి ఆ వృత్తి నుండి తొలగిపోయి రోడ్డున పడ్డారు. నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టినపుడు హాకర్లు రోడ్డున పడ్డారు. ఈ ట్రేడ్ యూనియన్లు వాళ్లను ఈ స్థాయిలో  పట్టించుకున్నాయా?  ఇలాంటి డిస్ ప్లేస్ మెంట్లు ఇటీవల కొన్ని వందలు బహుశ వేలు   జరిగాయి. అప్పుడు ఎన్నడూ  లేని స్పందన ఇప్పుడు దేనికీ? ఇది సంఘటిత రంగం అనేకదా? ఇందులో నాయకుల స్వార్థం వుంది.


కింది వాళ్ళ బతుకు తెరువు సమస్యను  పరిష్కరించకుండ  పై వాళ్ళ ఆదాయాన్ని పెంచడం కోసం కృషిచేయడం సామాజిక నేరం.  జాతియోద్యమ కాలంలో అంబేడ్కర్ కూడా ఇదే విధానాన్ని అనుసరించాడు.  తమ తప్పుల్ని కాపాడుకోవడానికి మార్క్స్ నో మరొకర్నో కోట్ చేయడం ఇంకా అపచారం. తప్పును ఎత్తిచూపితే కేసిఆర్ తో అక్రమ సంబంధాన్ని అంటగట్టడం ఇంకా నీచం.  రాష్ట్ర కమ్యూనిస్టు అగ్రనేత  కేసిఆర్ కు ఎన్నికల్లో మద్దతు ప్రకటించి ఇంకా వారం రోజులు కాలేదు. వారికి చూపండి మార్క్స్ కోట్స్.  ఆర్టీసి సమ్మె  బిజేపికి కలిసి వచ్చిన అదృష్టంగా మారుతోందని గమనించకపోతే ఇక ఈ రాష్ట్రంలో ఆలోచనాపరులు దేనికీ?  

సంఘటిత రంగ ఉద్యోగుల్ని  సమర్థించే వాదనలే ఇవి. ఇందులో నాకేమీ కొత్త దనం అనిపించడంలేదు. 

నేను అసంఘటిత రంగ శ్రామికుల పక్షపాతిని.  


సంఘటిత రంగాన్ని ప్రమోట్ చేస్తూ జీవనోపాధి వెతుక్కునే జీవులు చాలా మంది వుంటారు.  వాళ్లతో నాకు పనిలేదు. 


ట్రేడ్ యూనియన్లు  అసంఘటిత రంగాన్ని వదిలేసి దశాబ్దాలు గడిచిపోయాయి.  కమ్యూనిస్టు 

సంఘాలతోసహా  ఇతర ట్రేడ్ యూనియన్లు అన్నీ  సంఘటిత రంగాన్ని ఆదాయ వనరుగా 

మార్చుకున్నాయి. ఇన్ని సార్లు సంఘటిత రంగంలో జీతాలు భత్యాలు పెంచుకున్నారుగా,  

అసంఘటిత రంగంలో గడిచిన ఐదేళ్లలో మీరు సాధించిన అలాంటి  విజయాలను చెప్పండి.  

సంఘటిత రంగానికీ అసంఘటిత రంగానికీ దూరం ఎంతగా పెరిగిపోయిందంటే మొదటిది 

రెండోదాన్ని 'నిమ్నకులం' అన్నట్టు చాలా చిన్న చూపు చూస్తుంది. అది నాకు  సమ్మతము 

కాదు.  

గడిచిన 30 యేళ్లలో ట్రేడ్ యూనియన్లు అసంఘటిత రంగంలో ఎంత కూలీ పెంచారూ? 

సంఘటిత రంగంలో  ఎంత జీతం పెంచారూ?  ఒక టేబుల్ పెట్టండి. దాని మీద  ఒక 

తులనాత్మక చర్చ చేద్దాము. అప్పుడు ఎవరు కళ్ళు తెరచి చూస్తున్నారో ఎవరు కళ్ళు 

మూసుకున్నారో   అర్థం అవుతుంది.  

అసంఘటిత రంగంలో  నెలకు పాతిక వేల రూపాయలు ముఫ్ఫయి వేల రూపాయలు  

డిమాండ్లు  చేయడం వరకూ సరే.  సంఘటిత రంగంలో అంకితభావంతో పనిచేసి డిమాండ్లను 

సాధించుకున్నట్టు అసంఘటిత రంగంలో నిజాయితీగా సాధించారా? 

ప్రగతి భవన్ వెళ్ళాల్సింది కమ్యూనిస్టు పార్టి సెక్రటరీ. నాకేం పనీ. 

పది శాతం వున్నారు అంటారు. నాకూ అభ్యంతరం లేదు. 


ఇంతటి లంచగొండుల జీతాలు పెంచమని ఉద్యోగ  సంఘాలు ఎందుకు పోరాటాలు  చేస్తుంటాయీ?  ఆర్టీసి సమ్మెకు మద్దతు పలకడానికి నిన్న అనేక సంఘాల వాళ్ళు వచ్చారు. ఆ పనిని వాళ్ళు అసంఘటిత కార్మికుల కోసం చేస్తారా? ఇదంతా ఒక కూటమి.  

.