Sunday 23 September 2012

JINNAH, RUTIE, BOMBAY - A LOVE STORY


చరిత్ర 
జిన్నా, రూటీ, బొంబాయి - ఒక ప్రేమ కథ

                                                           - ఉషా యస్‌ డానీ
https://www.blogger.com/blog/post/edit/7435539703073908345/5050402726436190440

ఉగ్రవాదానికి నీతి, జాతి, మతం, దేశం, వర్ణం ఏదీ వుండదని ముంబాయి ముట్టడికి పాల్పడ్డ ముష్కరులు మరోసారి నిరూపించారు.

టెర్రరిస్టు చర్యల తీవ్రతను అంచనా వేయడానికి, చాలామంది, ఆ సంఘటనల్లో జరిగిన ఆస్థినష్టాన్ని కొలమానంగా తీసుకుంటుంటారు.  నిజానికి, ఉగ్రవాదుల లక్ష్యం ఆస్తినష్టంకన్నా అనేక రెట్లు ప్రమాదకరమైంది. ఉగ్రవాదుల రంగుల్లో విబేధాలు, గమనంలో తేడాలు వుంటాయేమోగానీ, వాళ్లందరి గమ్యం మాత్రం ఒక్కటే; సామాజికవర్గాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టడం.

          ముంబాయి  ముట్టడిలో  మిగిలిన  ఏకైక  సజీవదోషి, అజ్మల్‌ కసబ్‌  అనేకసార్లు తనకుతాను 'పాకిస్తాన్‌ దేశభక్తుడి'గా చిత్రించుకుంటున్నాడు. ఇదొక బూటకపు ప్రయత్నం. ఉగ్రవాదులకు ద్వేషంతప్పదేశమూ ఉండదు, భక్తీ వుండదు. పాకిస్తాన్‌ నుండి వచ్చిన ముష్కర మూకకు నిజంగా 'దేశభక్తే' వుంటే, వాళ్ళు ముంబాయిని లక్ష్యంగా చేసుకునేవారేకాదు. టాటాలకు చెందిన తాజ్ హోటల్  వైపు కనీసం కన్నెత్తి కూడా చూసేవారేకాదు.

బొంబాయి ప్రేమికుడు!
భారతీయులు మహాత్మాగాంధిని జాతిపితగా భావించినట్టు, పాకిస్థానీయులు ముహమ్మదాలీ జిన్నాను తమ జాతిపిత (బాబా  ఏ ఖౌమ్‌) గా భావిస్తారు. జిన్నా పుట్టింది కరాచీలోనే అయినా, పెరిగింది, చదివింది, ఉద్యోగం చేసిందీ, ఉద్యమాలు నడిపింది, ప్రేమాయణం సాగించిందీ, పెళ్లి చేసుకున్నది అన్నీ బొంబాయిలోనే. ఒక్కమాటలో చెప్పాలంటే, 72 యేళ్ల సుదీర్ఘ జీవితకాలంలో, పుట్టినపుడు ఓ మూడేళ్ళుచనిపోవడానికి ముందు ఓ పదమూడు నెలలు  మాత్రమే జిన్నా కరాచీలో వున్నాడు. మిగిలిన జీవితకాలంలో, అత్యధిక భాగం ఆయన బొంబాయిలోనే వున్నాడు.  జిన్నా బొంబాయి ప్రేమికుడు!

గాంధీజీ అప్పట్లో, బిర్లా, బజాజ్‌ కుటుంబాలతో సన్నిహితంగా వుంటే, టాటా కుటుంబంతో జిన్నా అత్యంత సన్నిహితంగా వుండేవాడు. జిన్నా భార్య రతన్‌ బాయి; రతన్‌ జీ దాదాభాయి టాటాకు మనమరాలు. అంటేజే.ఆర్‌.డి. టాటాకు మేనకోడలు. (అయితే, మేనకోడలికన్నా మేనమామే నాలుగేళ్ళు చిన్నవాడు)

పదహారేళ్ళకే పెళ్ళి
అంతకుముందు, పిన్నవయసులోనే జిన్నాకు పెళ్లయింది. బారిస్టర్‌ చదువుకు   వెళ్లడానికి ముందు, 1892లో, జిన్నాను అతని దాయాది ఇవిూ బాయితో పెళ్ళిచేశారు. అప్పుడు జిన్నా వయస్సు 16 సంవత్సరాలు, అయన భార్య వయస్సు 14 సంవత్సరాలు. భార్య కాపురానికి రాక ముందే జిన్నా ఇంగ్లండ్‌ వెళ్లిపోయాడు. జిన్నా ఇంగ్లండ్‌ లో వుండగానే, ఆయన  తల్లి, భార్య ఇద్దరూ  జబ్బుబారినపడి చనిపోయారు.  ఈ సంఘటనతో కృంగిపోయిన జిన్నా, దాదాపు ఇరవై యేళ్ళు మళ్ళీ పెళ్ళి జోలికి పోలేదు. బారిస్టర్‌ గా, రాజకీయ నాయకుడిగా సుప్రసిధ్ధుడైపోయాక, నలభయ్యవ పడిలో జిన్నా మళ్ళీ ప్రేమలో పడ్డాడు. 

విద్యార్ధి దశలోనే జిన్నా ఉదారవాద రాజకీయాలపట్ల ఆసక్తి పెంచుకున్నాడు. భారత రాజకీయాల కురువృధ్ధుడు దాదాభాయి నౌరోజీ అంటే అతనికి వల్లమాలిన అభిమానం. జిన్నా బారెట్లాలో చేరిన సంవత్సరమే దాదాభాయి నౌరోజీ, బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ కు, తొలిభారతీయుడిగా, ఎన్నికయ్యారు. లండన్‌ లో, రాజకీయ ప్రచారం, ఎంపీ కార్యాలయ నిర్వహణ తదితర విషయాల్లో దాదాభాయి నౌరోజీకి జిన్నా సహాయకుడిగా వుండేవాడు.       

బారిస్టరై ఇండియాకు తిరిగివచ్చాక, బొంబాయిలోసర్‌ ఫిరోజ్‌ షా మెహతా దగ్గర చేరాడు జిన్నా. 1905 నాటి బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో, అకౌంటెంట్‌ జనరల్‌  సి.హెచ్‌. హారిసన్‌ నాయకత్వంలోని 'కాకస్‌', కుట్రపూరిత పధ్ధతుల్లోఫిరోజ్‌ షా మెహతాను ఓడించింది.  'కాకస్‌ కేసు'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టి గెలిచాడు జిన్నా.  'కాకస్‌' సభ్యుడ్ని అనర్హుడిగా ప్రకటించి, ఆ స్థానంలో, ఫిరోజ్‌ షా మెహతాను మున్సిపల్‌  కార్పొరేషన్‌ సభ్యుడిగా నియమించాలని బొంబాయి హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దానితో బొంబాయి బార్‌  కౌన్సిల్‌ లోనే కాక, జాతియోద్యమంలోనూ జిన్నా పేరు మార్మోగింది. ఈ కేసులో జిన్నావల్ల    అనర్హత వేటుకు గురైన  'కాకస్‌' సభ్యుడు సులేమాన్‌ అబ్దుల్‌ వాహేద్‌ ముస్లిం కావడం ఇంకో విశేషం.

జిన్నా ప్రత్యక్ష గురువులు , దాదాభాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, ఇద్దరూ పార్శీలు కావడంతో, ఆ సామాజికవర్గంతో అతనికి విస్తృత సంబంధాలు ఏర్పడ్డాయి.

          తిలక్‌తో విభేదాలున్నా...
లోకమాన్య బాలగంగాధర తిలక్‌తో జిన్నాకు సైద్ధాంతిక విభేదాలు ఉండేవన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ వృత్తి విషయంలో జిన్నా అలాంటి వ్యక్తిగత విభేదాలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. న్యాయవాది అయిన తిలక్ 1897, 1908లలో తన మీద పెట్టిన రాజద్రోహం కేసుల్ని తనే వాదించుకున్నాడు. అయితే ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు భారీగా జైలుశిక్షలు పడ్డాయి. 1916లో తిలక్‌పై మూడోసారి రాజద్రోహం కేసు పెట్టినప్పుడు, జిన్నా ఒంటిచేత్తో ఆయన్ను నిర్దోషిగా బయటపడేశాడు. జిన్నా లౌకికతత్వానికి తిలక్ కేసు ఒక ఉదాహరణ.

జిన్నా పాకిస్తాన్‌ నిర్మాతేగానీ, అతను ఎన్నడూ మతతత్వవాదికాదు. లౌకికవాదిగానే జీవించాడు. ప్రజాస్వామికవాదిగానే మరణించాడు. అతను ప్రజాస్వామిక పాకిస్తాన్‌ కావాలని కోరుకున్నాడేతప్పా, మతరాజ్యాన్ని నిర్మించాలనుకోలేదు. ప్రజాస్వామిక భారతదేశంలో హిందువులు మెజారిటీగా వున్నట్లే, ప్రజాస్వామిక పాకిస్తాన్‌ లో ముస్లింలు మెజారిటీగా వుంటారు అన్నంత వరకే  అతను ఆశించాడు. 

జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనేది జిన్నా అభిలాష. జిన్నా రాజకీయాలు, సంభాషణా చాతుర్యంన్యాయవాదవృత్తి విశేషాలు, వేసుకున్న సూట్లు, వాడిన కార్లు, పెంచుకున్న కుక్కల గురించి చాలా కథనాలున్నాయి. కానీ, జిన్నా కళాసాహిత్యాభిమానం, సౌందర్యపిపాస, సునిసితత్వం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.

పాల్ రాబ్సన్ సంగీతం
షేక్స్‌ పియర్‌, జాన్‌ మిల్టన్‌ రచనలకు జిన్నా వీరాభిమాని.  లండన్‌ లో వున్నప్పుడు దాదాపు ప్రతిరోజూ నాటక ప్రదర్శనలకు వెళ్ళేవాడు. ఒక దశలో, షేక్స్‌ పియరియన్‌ కంపెనీలో చేరి, నాటకాలు వేయడానికి కూడా సిధ్ధమయ్యాడు. ఆఫ్రో-అమెరికన్‌ పౌరహక్కుల నేత, సోషలిస్టు, ప్రజాగాయకుడుపాల్‌ రాబ్సన్‌ సంగీతమంటే జిన్నాకు చాలా ఇష్టం. రాబ్సన్‌ పాట 'ద ఎండ్‌ ఆఫ్‌ ఏ పెర్ఫెక్ట్‌ డే'  అంటే అతనికి ప్రాణం. (శ్రీశ్రీ కవిత్వమూ, పాల్‌ రాబ్సన్‌ సంగీతమూ ఒక్కటే అన్న చెలం యోగ్యతాపత్రం గుర్తుందిగా!)

          తిలక్‌, అనీ బీసెంట్‌ లతో కలిసి, హోం  రూల్‌ ఉద్యమంలో చాలా చురుగ్గా  పాల్గొన్నాడు జిన్నా.  ఆ ఉద్యమం, 1916లో, జాతీయ కాంగ్రెస్‌ లో విలీనం అయిపోయాక  కాస్త సేదతీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అతనికి.  అప్పటి, జిన్నా క్లయింట్లలో  జౌళీరంగ దిగ్గజం సర్‌ దిన్‌ షా పెటిట్‌ ముఖ్యుడు. బోంబే ప్రెసిడెన్సీలో సంపన్న పారశీ కుటుంబం వాళ్లది. దిన్‌ షా పెటిట్‌ భార్య, సైలా టాటాజే.ఆర్‌.డీ. టాటాకు స్వయాన పెద్దక్క.        
దిన్‌ షా పెటిట్‌ వేసవి విడిది డార్జిలింగ్‌ లో వుండేది.  ముంబాయి ఎండ తీవ్రతని  తప్పించుకోడానికి, కొన్ని రోజులు డార్జిలింగ్‌ వచ్చి వుండమని, 1916 వేసవిలో, జిన్నాను ఆహ్వానించాడు దిన్‌ షా. జిన్నా డార్జిలింగ్‌ లో  వేసవి శెలవులు గడుపుతున్న సమయంలోనే, దిన్‌ షా పెటిట్‌ కుమార్తె రతన్‌ బాయి పరిచయం అయింది.

లేటు వయసులో ఘాటు ప్రేమ
రతన్‌ బాయిని సన్నిహితులు ముద్దుగా 'రూటీ' అని పిలిచేవారు. శౌందర్యం, ఐశ్వర్యం, మేధస్సు, జాతీయభావాలు, సంఘసంస్కరణాభిమానం కలగలిసిన అపురూప వ్యక్తిత్వం రూటీది. ఆమెకు  'ద ఫ్లవర్‌ ఆఫ్‌ బొంబాయి' అనే బిరుదు కూడా వుంది.

           జిన్నా వ్యక్తిత్వం రూటీని విపరీతంగా ఆకర్షించింది. జిన్నాను ఆమె ’జే’ అని పిలిచేది. మరోవైపు రూటీ అందాన్ని, ఆలోచనల్ని చూసి జిన్నా మైమరిచిపోయాడు. గాఢంగా ప్రేమలో పడిపోయాడు. అప్పుడు జిన్నాది 40 ఏళ్ళ లేటు వయస్సు. రూటీది 16 ఏళ్ళ లేత వయస్సు.

లవ్ స్పాట్ తాజ్ హోటల్
          జిన్నా, రూటిల పెళ్ళికి దిన్‌ షా పెటిట్‌ ఒప్పుకోనప్పటికీ, పెటిట్‌ అత్తవారైన టాటాలు మాత్రం జిన్నాతో పాత సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. తండ్రిని ఎదిరించి జిన్నాని పెళ్ళిచేసుకోడానికి రూటి సిధ్ధమైంది. అయితే, ఆమెకు యుక్త వయస్సు రావడానికి అప్పటికి ఇంకా రెండేళ్ళుంది. ఈ రెండేళ్ళూ  టాటాలకు చెందిన బొంబాయి తాజ్ హోటల్
ఆ ప్రేమికులకు 'లవ్‌ స్పాట్‌' గా మారింది. అప్పటికి, జె.ఆర్‌.డి. టాటా పన్నెండేళ్ల ముక్కుపచ్చలారని కుర్రాడు.

రూటీకి కూడా పాల్‌ రాబ్సన్‌ అంటే మహాభిమానం. ప్రతిరోజూ రాత్రి వీడ్కోలు తీసుకోవడానికి ముందు, ప్రేమికులిద్దరూ, తాజ్ హోటల్ బ్యాండ్‌ మాస్టర్‌ ను ప్రత్యేకంగా కోరి,  'ద ఎండ్‌ ఆఫ్‌ ఏ పెర్ఫెక్ట్‌ డే' ను పాడించుకునేవాళ్ళు. 

మొదటి నుండీ బొంబాయిలో జిన్నా సాయంకాలాలు తాజ్ హోటల్ లోనే గడిచేవి. ఆనాటి జాతియోద్యమ అగ్రనేతలు  తాజ్ హోటల్ లోనే జిన్నాను కలిసేవాళ్ళు. జిన్నాతో అలా తాజ్ హోటల్ లో సుదీర్ఘ సాయంకాలాలు పంచుకున్నవాళ్ళలో సరోజినీ నాయుడు పేరును ప్రముఖంగా చెప్పుకుంటారు. రూటీ మేజర్‌ గా మారిన ఫిబ్రవరి 20, 1918 రాత్రి, జిన్నాతో నిశ్ఛితార్ధం కూడా తాజ్ హోటల్ బాల్‌ రూం లోనే జరిగింది.

మరియమ్ బాయి
పెళ్ళికి ముందు రూటీ ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును మరియమ్‌ గా మార్చుకుంది. జిన్నా బొంబాయి నివాసం సౌత్‌ కోర్ట్‌ లో 1918 ఏప్రిల్‌ 19న మరియమ్‌, జిన్నాల వివాహం జరిగింది. మహమూదాబాద్‌ మహరాజు సర్‌ ముహమ్మద్‌ అలీ ముహమ్మద్‌  ఖాన్‌ స్వయంగా దగ్గరుండి పెళ్ళి వేడుకలు నిర్వహించాడు.
          జిన్నా, రూటీల మధ్య ఇంత ప్రేమ విరబూసినా వాళ్ళ దాంపత్యం మాత్రం సజావుగా సాగలేదు.  అప్పటికే జిన్నా, రాజకీయాల్లో తలమునకలై వున్నాడు. పెళ్లయ్యే నాటికే జిన్నా బ్రిటీష్‌ ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు.  భార్యా, పిల్లల కోసం ఎక్కువ  సమయం వెచ్చించలేకపోయేవాడు. 'ప్రేమికుడు జిన్నా'ను 'రాజకీయ జిన్నా' మింగేయడం మొదలెట్టాడు. మరోవైపు, అనుక్షణం జిన్నా తన పక్కనే వుండాలని రూటీ ప్రగాఢంగా కోరుకునేది. ముస్లింలీగ్‌ ఆఫీసును ఢిల్లీకి మార్చడంతో, జిన్నా  తన  కుటుంబానికి దాదాపుగా దూరమై పోయాడు. రూటీ తన నివాసాన్ని శాశ్వితంగా తాజ్ హోటల్ కు మార్చుకుంది. ఒంటరితనంతో అనారోగ్యం పాలయ్యి, 29వ యేట,  20 ఫిబ్రవరి 1929న తను పుట్టినరోజునే శాశ్వితంగా కన్ను మూసింది.

ఉద్వేగాన్ని ఆపుకోలేక..
జిన్నా స్వతహాగా అంతర్ముఖుడు. వ్యక్తిగత ఉద్వేగాలని ఇతరులతో పంచుకునేవాడుకాదు. అయితే, రూటీ చనిపోయినపుడు, ముంబాయి మజ్‌ గావ్‌ లోని ఖోజా షియా శ్మశానంలో, జిన్నా వెక్కివెక్కి ఏడ్చాడు. దేశవిభజన ఖరారయ్యాక, పాకిస్తాన్‌ వెళ్లడానికి ముందు, 1947 ఆగస్టు  మొదటి వారంలో, జిన్నా రూటీ సమాధిని చివరిసారి సందర్శించాడు. అప్పుడూ ఆతను  ఉద్వేగాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చేశాడు. జిన్నా జీవితకాలంలో, వ్యక్తిగత ఉద్వేగంతో బహిరంగంగా ఏడ్చిన సందర్భాలు ఇవి రెండే అని  ముహమ్మదాలి కరీం (ఎం.సీ.) చాగ్లా వంటి ఆయన సన్నిహితులు తమ అనుభవాల్లో రాసుకున్నారు. .

రూటీ చనిపోయాక జిన్నా ప్రతివారం మజ్‌ గావ్‌  శ్మశానానికి వెళ్ళేవాడు. రూటీ సమాధి ముందు నిలబడి, గతించిన ప్రియురాలి కోసం,  'ద ఎండ్‌ ఆఫ్‌ ఏ పెర్ఫెక్ట్‌ డే' పాటను 'కూనిరాగం' తీసేవాడు. 

జే ఆర్ డి అనుబంధం
రూటీ మరణం తరువాత కూడా జిన్నా, టాటాల అనుబంధం కొనసాగింది. జిన్నా ఏకైక సంతానం దీనా వాడియా, ఆమె సంతానం సస్లీ వాడియా (బాంబే డయింగ్‌ అధినేత), డయానా వాడియాలకు జే.ఆర్‌.డీ. టాటా సంరక్షకుడిగా వున్నాడు. జిన్నా ఆరోగ్య విషయాలను కూడా జే.ఆర్‌.డీ. పట్టించుకునేవాడు.  భారతదేశాన్ని వదిలి వెళ్ళడానికి ముందు, జిన్నాకు ఢిల్లీలో ఫిజీషియన్‌ డాక్టర్‌ జాల్‌ పటేల్‌, రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ జాల్‌ దాయేబూవ సమగ్ర వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో, బొంబాయి-ఢిల్లీ-కరాచీల మధ్య జిన్నా ప్రయాణ అవసరాల కోసం  టాటా ఎయిర్‌ లైన్స్‌ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.  ఆ విమాన సంస్థే తరువాతి కాలంలో, జాతీయమైఎయిర్‌ ఇండియాగా మారింది. 

పాక్ లోనూ అదే పాట
జిన్నా, 1947 ఆగస్టు 14, పాకిస్తాన్‌ తొలి గవర్నర్‌ జనరల్‌ గా పదవీ స్వీకారం చేశాడు. ఆ మరునాడుఆయన గౌరవార్ధం, కరాచీ క్లబ్‌ లో విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో బ్యాండు వాయించడానికి, ముంబాయి తాజ్ హోటల్ బ్యాండ్‌ మాస్టర్‌ కెన్‌ మాక్‌ బృందాన్ని ప్రత్యేక విమానంలో పంపించాడు జే.ఆర్‌.డీ. ఆ రాత్రి అతిథులంతా వెళ్ళిపోయాక, కెన్‌ మాక్‌ తో,  'ద ఎండ్‌ ఆఫ్‌ ఏ పెర్ఫెక్ట్‌ డే' పాటను ప్రత్యేకంగా పాడించుకుని విన్నాడట జిన్నా.

పాల్‌ రాబ్సన్‌ షష్టిపూర్తి ఉత్సావాలు
భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రు కూడా పాల్‌ రాబ్సన్‌  అభిమాని.  1958లో, రాబ్సన్‌ షష్టిపూర్తి ఉత్సావాలు జరపాలని భావించిన నెహ్రు, ఆ బాధ్యతను అప్పటి బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.సీ. చాగ్లాకు అప్పచెప్పారు. నెహ్రు నిర్ణయం రెండు విధాలుగా సాహసోపేతమైనది. ఒకవైపు, 'కమ్యూనిస్టు' పాల్‌ రాబ్సన్‌ పట్ల అప్పట్లో అమేరికా చాలా గుర్రుగా వుంది. మరోవైపు,   చాగ్లాకు, జిన్నా అనుచరుడనే పేరుంది. అయినప్పటికీ, పాల్‌ రాబ్సన్‌ - జిన్నాల అనుబంధం గురించి తెలిసిన నెహ్రు, ఉత్సవ నిర్వహణ  బాధ్యతల్ని నిర్వర్తించడానికి  చాగ్లాయే సరైన వ్యక్తి అని భావించారు.

ఆయన నెత్తివిూద దేశవిభజన నింద వుందికనుక, జిన్నా జీవితచరిత్రపై భారతదేశంలో కొనసాగుతున్న ప్రఛ్ఛన్న నిషేధాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ పాకిస్తానీయులకు ఏం రోగం?   'ప్రేమికుడు జిన్నా' గురించి వాళ్లకూ తెలియక పోవడం ఆశ్చర్యం. ముంబాయి విూద ముష్కర దాడి చేసినందుకు మాత్రమేకాదువాళ్ళ జాతిపిత 'ప్రేమమందిరం' విూద నెత్తురు చిందించినందుకు కూడా కసబ్‌  అదనపు శిక్షకు అర్హుడు!.

హైదరాబాద్‌
4 సెప్టెంబరు 2012



- ఉషా యస్ డానీ, 90102 34336 

Wednesday 25 July 2012

Tributes to Shivasaagar

శివసాగరునికి జోహార్లు   
ఉషా యస్ డానీ

స్వార్ధం శిరస్సును కసితో, గండ్రగొడ్దలితో నరక గలిగినవాడే నేటి హీరో
ప్రజను సాయుధంచేస్తున్న రివల్యూషనరీ నేటి కవి

సత్యముర్తి చనిపోయారు.

నక్సలైట్ ఉద్యమ పితామహుడు ఆయన. 1960వ దశకం చివర్లో, ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన చారూ మజుందార్ ను గుత్తికొండ బిలంలో  కలుసుకున్న ప్రతినిధి బృందానికి ఆయన నాయకుడు. అప్పటికి కొండపల్లి సీతారామయ్య ఇంకా (అధికారికంగా) నక్సలైట్ ఉద్యమం లొనికి రాలేదు అనుకుంటాను.

సత్యమూర్తి విప్లవ భావకవి. వర్తమాన పాలిమిక్స్ ను కవిత్వీకరించడంలో ఆయనకన్నా సమర్ధుడు తెలుగు సాహిత్యంలో ఇంతవరకు పుట్టలేదు.

1978 నుండి 1985 వరకు సత్యమూర్తి నాకు రాజకీయ ప్రేరణ.

ఆ సంవత్సరమే ఆయన పీపుల్స్ వార్ నుండి విడిపొయారు. ఆ సంవత్సరమే తెలంగాణ నల్సలైట్చ్ ఉద్యమంపై నిర్భంధం పెరిగింది.  ఆ సంవత్సరమే  కారంచేడు ఘోరం  జరిగింది. ఆ సంవత్సరమే దళితమహాసభ పుట్టింది. వర్గపొరాటాల పక్కన వర్గేతర అస్థిత్వవాద ఉద్యమాలకు నాంది కూడా ఆ సంవత్సరమే. ఆ విధంగా సత్యమూర్తి గుర్తుండిపొతారు.

సత్యమూర్తి చివరి రోజులు, జంగల్ సంతాల్ లా, చాలా బాధాకరంగా గడిచాయి. ఆయన పెద్ద కొడుకు, పెద్ద కోడలే ఆయన ఆలనా పాలనా చూశారు.

చివరి వరకూ సత్యమూర్తితో అనుబంధాన్ని కొనసాగించిన గన్నవరం మిత్రులు కాకాని సాంబశివరావు, ప్రసాద్ ఈ సందర్భంగా అభినందనీయులు.

నా ప్రేరణకు విప్లవ జోహార్ర్లు.

 ఏప్రిల్17, 2012
(ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 18 సంచికలో ప్రచురితం)

         

Tuesday 24 July 2012

Children without fathers


తండ్రులులేని పిల్లలు !!
ఏ.యం. ఖాన్ యస్ డానీ
అరుణ్ సాగర్ -  ఓరీ ఆర్యపుత్ర! (ఆంధ్రజ్యోతి 17 మే) సందర్భానుసారంగా వచ్చిన  ఒక  మంచి వ్యాసం.       
"క్వాలిటీ స్పర్మ్ లేనివాళ్ళంతా వర్మ్ కాంపోస్టుకు కూడా పనికిరారు". అనే వాక్యం సరదాగా అనిపిస్తుంది. అర్ధం చేసుకుంటే భయం వేస్తుంది. అది మన మీద మన భయం మాత్రమే కాదు. మొత్తం మానవజాతి అంతరించిపోతుందని భయం.    
పెద్దాపురం, అమలాపురం, రాజమండ్రి మెరకవీధిలో   కళావంతుల సామాజికవర్గానికి చెందిన మహిళలు ఒకప్పుడు  పెద్ద సంఖ్యలో వుండేవారు. వాళ్ళు, ఎర్రగా, ఎత్తుగా, గురజాడవారి మధురవాణిలా, చాలా అందంగా, చలాకీగా  వుండేవారు.  వుభయ గోదావరీ, ఉత్తరాంధ్ర ప్రాంత క్షత్రీయులు, వెలమదొరల సంపర్కంవల్ల వాళ్ళకు అంతటి అందం వచ్చిందని జనం చెప్పుకునేవారు.   
ఆస్తిని సంపాదించిన తరువాత, అందం మీద దృష్టి పెట్టడం అనేది అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. నల్లగావుండే కొన్ని ధనిక కుటుంబాలు, కులాలు, 'తెల్లబడ్డం'  కోసం, కళావంతుల మహిళలతో పిల్లలు కనేవారని ఒక ప్రచారం బలంగా వుండేది. ఇప్పటి సర్రోగసీకి కి అది సాంప్రదాయ రూపం అన్నమాట.
అందంగావున్న పేదింటి అమ్మాయిని, పెద్దింటివాళ్ళు, కట్నకానుకలు లేకుండానే, కొన్ని సందర్భాల్లో ఎదురుకట్నం కూడా ఇచ్చి, కోడలిగా తెచ్చుకొవడం  ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూ వుంటుంది. ఇలాంటి పెళ్ళిళ్ళలో, అమ్మాయి   అందంగా వుండాలనే షరతు వున్నప్పటికీ, కట్నకానుకల్ని తిరస్కరించడం అనే ఒక మానవత్వ అంశ కూడా వుంటుంది.      
ఇక్కడ అందమంటే  అమ్మాయి ఎర్రగా, ఎత్తుగా వుండాలని విడిగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికన్ జాతుల్లో, నలుపే శౌందర్య ప్రమాణంగా వుండేది. మరింత నల్లగా కనిపించడం కోసం మహిళలు తాపత్రయపడే సన్నివేశాలు మనకు ఆఫ్రికన్ సాహిత్యంలో కనిపిస్తాయి. అలెక్స్ హేలే 'రూట్స్ ' (ఏడుతరాలు) నవలలో నల్లటి ఆఫ్రికన్ మహిళలు మరింత నల్లటి గోరింటాకు  పెట్టుకుని తమ అందాన్ని పెంచుకునే సన్నివేశం వుంటుంది; మనవాళ్ళు ఎర్రటి గోరింటాకు పెట్టుకున్నట్టు.       
మనుషులు  ఎర్రగా, ఎత్తుగా వుండాలనే శౌందర్య విలువ మన సమాజంలో బ్రిటీషువాళ్ళు రావడానికి ముందే మొదలైందో, ఆ తరువాతే మొదలైందో ఒక పరిశోధన  జరగాల్సేవుంది. భారత సంతతిలో అత్యధికులైన హిందువులు పూజించే ప్రధాన దేవుళ్ళు 'నల్లవాళ్ళే'  అయినప్పటికీ ఈ ఎరుపు వ్యామోహం ఎలా పుట్టిందో  తెలుసుకోవడం  ఒక ఆశక్తికర అంశమే.  
సాంప్రదాయాన్ని  వాణిజ్యంగా మార్చి, ఉత్పత్తిని వుధృతం చేసి, వీధుల్లొ కుప్పలుగా పొసి అమ్మడమే మార్కెట్ చేసేపని. సాంప్రదాయ ప్రక్రియల్లొ ఏదో ఒక స్థాయిలో వుండే మానవత్వ అంశను మార్కెట్  ముందుగానే చంపేస్తుంది.                        
1960లలో వుధృతంగా  వచ్చిన కలల నవలల్లో కథానాయకుడు ఆరడుగుల అందగాడు. అతనికి పడవలాంటి చవర్లే(ట్) కారు వుండేది. అప్పట్లో చవర్లే కారంటే అంత గొప్ప. ఇప్పుడు చవర్లే కారు అనేది చిన్న విషయం. ఆడీ వంటి లగ్జరీ కార్లు నిముషానికి రెండు చొప్పున హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి.  మరి పెరట్లోకి ఆడీ కార్లు వచ్చాక చావిట్లోకి  ఆరడుగుల అందగాడో / అందగత్తో కూడా రావాలిగా? అదే ఇప్పుడు 'వికీ డోనర్స్ ' పుట్టుకకు మూలం! గిరాకీనిబట్టి సరుకును తయారువేయడం  పాతమార్కెట్ సూత్రం. ముందు సరుకును తయారుచేసి, దానికి గిరాకీని సృష్టించడం కొత్త మార్కెట్ సూత్రం.   
 భూస్వామ్య వ్యవస్థలో,  సామాజిక ఏర్పాటు, ఉత్పత్తి రంగంలో సాంకేతిక స్థాయిని  నిర్ణయిస్తుంది. పెట్టుబడీదారీ సమాజంలో,అందుకు భిన్నంగా,  పారిశ్రామిక రంగంలో వచ్చే సాంకేతిక అభివృద్ధే సామాజిక ఏర్పాటును నిర్ధారిస్తుంది.
మనకు అమెరికాతో సంపర్కం పెరిగిన తరువాత, మన సౌందర్య ప్రమాణాల్లో చాలా మార్పులు వచ్చాయి.  మనవాళ్ళు అమేరికాపోయి,అక్కడి దొరల్నో, దొరసానుల్నో పెళ్ళి చేసుకోవడంకన్నా, మనమే ఇండియాలొ దొరల్ని, దొరసానుల్ని ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచనే 'వికీ డోనర్స్ ' కు దారితీస్తుంది. గిల్లెట్ బ్లేడుల్ని, నైక్ షూలనీ మనం ఇండియా యూనిట్లలో ఉత్పత్తి చేస్తున్నంత  సులువుగా అమేరికా దొరలు,  దొరసానుల్ని ఇక్కడే మన ఇళ్ళల్లొనో, కాకుంటే ఆసుపత్రుల్లోనో, ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాదు,  ఇక్కడ కారు చౌకగా ఉత్పత్తిచేసి, కావాలంటే ఇండియా దొరలు, దొరసానుల్ని అమెరికాకు కూడా ఎగుమతి చేయవచ్చు. రివర్స్ ఎక్స్ పోర్ట్  అన్నమాట. వాణిజ్య సమతుల్యం కూడా సరిపొతుంది!!
సంతానం లేనివాళ్ళు సంతానం కోసం తాపత్రయపడడం మొదటిదశ మాత్రమే. పుత్రకామేష్టి యాగాలకు ఆధునిక రూపంగా సంతానసాఫల్య కేంద్రాలు రంగప్రవేశం చేయడం  రెండోదశ. పుట్టబోయే సంతానం రుపురేఖల్ని, వీలైతే భవిష్యత్తుని కూడా, నిర్ధారించడం (ప్రోగ్రామింగ్ చేయడం)  మూడోదశ.  విదేశీ  జాతిని స్వదేశంలొ సృష్టించి, విదేశాలకు ఎగుమతి చేయడం నాలుగోదశ.                         
పది శాతం లాభం కోసం పెట్టుబడీదారుడు  ఉరికంభం ఎక్కడానికి కూడా సిధ్ధపడతాడు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. మార్కెటింగ్ కోసం మనుషులు తమ జాతిని కూడా అమ్ముకోగలరని మార్క్సుకు కూడా తెలిసివుండదు. 
ఇప్పటికే మనం గౌరవించాల్సినవన్నీ గౌరవాన్ని కోల్పోయాయి. సమాజం కుటుంబస్థాయికీ, కుటుంబం దంపతుల స్థాయికీ  కుచించుకుపొయాయి. ఆ దంపతుల వ్యవస్థను కూడా విచ్చిన్నం చేయడానికే ఈ ప్రయొగాలు. ఇక ముందు,  పిల్లలకు, 'జన్మనిచ్చిన తండ్రీ  (స్పెర్మ్ డోనర్) కనిపించడు. కనిపించే తండ్రి జన్మనిచ్చినవాడుకాదు. ఇంతటి వత్తిడిలొ పిల్లలు, తండ్రులు కూడా బతకాల్సివుంటుంది. 
అమేరికాలో, ప్రస్తుతంవున్న చట్టాల ప్రకారం,  18 ఎళ్ళ వయస్సు వస్తేనేగానీ, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి వివరాలు  తెలుసుకోలేరు. అప్పటికి, ఆ పిల్లలు పెద్దాళ్ళయి, ఎలాగూ కుటుంబం నుండి విడిపొతారని అక్కడి శాసనకర్తలు భావించి వుండవచ్చు! ఈ అంశాన్ని తీసుకుని 2010లో 'ది కిడ్స్ ఆర్ ఆల్ రైట్ ' అనే సినిమా కూడా వచ్చింది.   
పురుషుల్లొ టెస్టోస్టేరోన్ హార్మోను ఉత్పత్తి క్రమంగా తగ్గిపొతోందనీ, స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోను  ఊత్పత్తి తగ్గి,  టెస్టోస్టేరోన్ హార్మోను ఉత్పత్తి పెరుగుతున్నదని ఆధునిక పరిశోధనలు చెపుతున్నాయి. ఇలాంటి పరిణామాలు, ఆధునాతన మాతృస్వామ్య వ్యవస్థను  నిర్మించవచ్చని కొందరు నమ్మవచ్చు. ఆ సంగతి ఎలావున్నా, పురుషజాతి మాత్రం అంతరించిపొతున్న జీవుల జాబితాలోకి ఇప్పటికే, చేరిపోయింది!  
భగవంతుడా! తండ్రులులేని పిల్లల్ని నువ్వే కాపాడాలి!
హైదరాబాద్
18 మే 2012

Is Poetry Becoming Obsolete?


ముస్లిం సాహిత్యసభ 


స్కై బాబా ఆధ్వర్యాన ఆదివారం సీఫెల్ లో జరిగిన సాహిత్య సభ బాగా జరిగింది. అంతర్జాతీయంగా ముస్లిం సాహిత్యంలో వస్తున్న మార్పులపై అఫ్సర్ చేసిన విశ్లెషణ ఆలోచనల్ని రేకెత్తించింది. 

సామాజిక పరిణామంలో మెధావులు జోక్యం చేసుకోడానికి, కవిత్వం ముసుగుగానో, వృధాగానో మారిపొయిందని అఫ్సర్ అనడం కొత్త పరిణామం. 

కవిత్వంపై అఫ్సర్ అభిప్రాయంతో నాకు ఒక విధంగా ఏకాభిప్రాయం వుంది. కవిత్వం అనేది అంతరించిపోతున్న సాహిత్య ప్రక్రియ అని నేను గట్టిగా అనుకుంటాను.కవిత్వం నిర్వర్తించాల్సిన చారిత్రక పాత్ర చాలాకాలం క్రితమే ముగిసిందని నా అభిప్రాయం. వర్తమానంలో వచనం, భవిష్యత్తులో ఉపన్యాసం సాహిత్య ప్రక్రియలుగా అగ్రపీఠం అందుకుంటాయి.

తెలంగాణ వ్యతిరేకులు కవిత్వ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని సభలో కొందరన్నారుగానీ అది వాదం కాదు; నిరాధారమైన ఆరోపణ.

ముస్లిం సమాజంలో ఉనికికి ప్రాతిపదికగావున్న కులం స్థానాన్ని మతం ఆక్రమిస్తున్నదని అఫ్సర్ గమనించిన అంశం కూడా కీలకమైనది. వర్తమాన హిందూ సమాజం కులాల ప్రాతిపదికగా విడిపొతుంటే, ముస్లిం సమాజం కులాల పరిధిని పక్కనపెట్టి అంతర్గత ఏకీకరణ దిశగా సాగుతోంది. రెండూ వేరువేరు దశలు.

New Trends among youth and suicides

యువత కొత్తపోకడలు - ఆత్మహత్యలు 


యువతరం పోకడల గురించీ, సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యల గురించీ ఇటీవల ఫేస్ బుక్ లో తరచూ ప్రస్తావన వస్తున్నది. ఈ రెండు అంశాల మీద జగతీ ధాత్రి వంటివారు చాలా ఆవేదనను వ్యక్తం చెస్తున్నారు.

నిజానికి ఈ రెండు సమస్యలు విడివిడి అంశాలు కావు. ఒకేపరిణామానికి రెండు వ్యక్తీకరణలు. ఇందులో ఇలాంటి వ్యక్తికరణలు చాలా వుంటాయి. ప్రతీ వ్యక్తీకరణ సాపేక్షకంగా నిజమే అనిపిస్తుంది. వాటిని విడివిడిగా చూస్తే అసలు సమస్య ఏ గుడ్డివానికీ అర్ధంకాని ఏనుగుగా మారిపొతుంది.

పెద్దలు నీతులు చెపుతారు. పిల్లలు రూల్సును బ్రెక్ చేస్తారు. పెద్దాళ్ళది ఛాదస్తం అని పిల్లలు అనుకుంటారు. పిల్లలది అరాచకత్వం అని పెద్దాళ్ళు అనుకుంటారు. ...... ఇలా మనం ఒక పెద్ద సామాజిక సమస్యను వ్యక్తులకు అంటగట్టి చర్చిస్తున్నాం.

వర్తమాన సమస్యకు వ్యక్తుల ప్రవర్తన (సబ్జెక్టివ్ ఎఫర్ట్ ) మాత్రమే కారణమయ్యేదయితే, దాన్ని పరిష్కరించడం కొంత సులువు కావచ్చు. కానీ, వస్తుగత పర్యావరణం (ఆబ్జెక్టివ్ కండీషన్స్ ) సంగతెంటీ?

మన, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇష్టాఇష్టాలతో సంబంధంలేకుండా, మనకు బయట, స్వతంత్రంగా మార్కెట్ అనే కామరూపి దెయ్యం ఒకటి వుంటుంది. అది అన్ని తరాల్నీ ఆకర్షిస్తూ వుంటుంది.

ఎప్పుడైనా నిన్నటి తరంతో పోల్చితే నేటి తరానికి, అన్ని రంగాల్లొనూ అవకాశాలు ఎక్కువ. అందువల్ల నిన్నటితరం రక్షణాత్మక (దిఫెన్సివ్) పధ్ధతుల్ని అనుసరిస్తుంది. నేటితరం దాడి (అఫెన్సివ్) విధానాల్ని అనుసరిరిస్తుంది. మార్కెట్ కు ఎప్పుడూ కొత్తతరలు, గత తరాలకన్నా, చాలా అనువుగావుంటాయి. నెటి పాతతరం కూడ నిన్నటి కొత్తతరమే కనుక అప్పుడు వాళ్ళూ మార్కెట్ ఆడించినట్టే ఆడివుంటారు.

కాలం గడిచేకొద్దీ మార్కెట్ కు ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. అది అగ్ని లాంటిది. ఆబగా తిని అజీర్తిని తెచ్చుకుంటుంది. అజీర్తిని పోగొట్టుకోవడానికి ఆబగా తింటుంది. (ఖాండవ దహనం గుర్తుందా?)
అది పాత తరాలనికన్నా కొత్తతరాలనే సులువుగా లొంగదీసుకుంటుంది. అదే అసలు సమస్య.

అందువల్ల మనం వ్యక్తుల ప్రవర్తన మీద చర్చను ఆపి వస్తుగత పర్యావరణం మీద చర్చను కొనసాగిస్తె ఎక్కువ ప్రయోజనం వుంటుంది.


.

Tribal and Delhi

ఆదివాసులు - హస్తినాపురం

సామాజిక వర్ణమాలకు (స్పెక్ట్రం) ఏడమ చివర్న ఆదివాసులుంటారు. కుడి చివర్న హస్థినాపురం వుంటుంది. అటు గిరిజనులుంటారు. ఇటు హొం మంత్రులు వుంటారు. 

బిర్సాముండా, గాం మల్లు దొర, అల్లూరి శ్రీరామరాజుల నుండి ఇవ్వాల్టి అరకులొయలో బాక్సైట్ వ్యతిరేకపోరాటం సాగిస్తున్న వారి వరకు ఒక వారసత్వం.

వల్లభాయి పటేల్ నుండి గొవింద్ వల్లభ్ పంత్, ఇందిరా గాంధీ, కాసు బ్రహ్మానంద రెడ్డి, పిసీ సేథీ, ఎల్కే అద్వానీ, షివరాజ్ పాటిల్, పి. చిదంబరం వరకు ఇంకో వారసత్వం.

ఇంకాస్త వెనక్కి వెళితే, ద్వాపర యుగంలో ఇటు తక్షకుడు, నాగులు,అటు శ్రీకృష్ణార్జునులు.

వర్ణమాలలో ఆ చివర ఈ చివర ఎప్పుడూ స్థిరమే. హోం మంత్రులు వాళ్ల అణిచివెతను మానలెదు. ఆదివాసులు వాళ్ల పోరాటాన్ని ఆపలెదు.

మారిందల్లా మధ్యనున్న సమూహాలే.

ఈ సమూహాల్లో సమస్య వచ్చినపుడు, అందరూ కాకున్నా, ఎక్కువమంది, గతంలొ ఎడమ వైపుకు చూసేవారు.

దాదాపు 45 యేళ్ళ క్రితం, నాటి యువతరానికి, డార్జిలింగ్ కొండల్లో, ఙానబోధ చేసినవాడు ఒక ఆదివాసి. జంగల్ సంతాల్. అతడే మా తరానికి గీతాచార్యుడు.

ఇప్పుడు కాలం మారింది. ఙానం కోసం జనం ఏడమవైపుకు కాకుండా, కుడివైపుకు చూస్తున్నారు.

కుడిపక్షం వాళ్ళను మింగేస్తోంది. ఆవహించేస్తోంది.

అదే ఇప్పుడు అసలు సమస్య!

జీవితాన్ని చిన్నది చేయకండి


జీవితాన్ని చిన్నది చేయకండి 


జీవితంలో దెబ్బతిన్నంత మాత్రానో
జబ్బు పడినంత మాత్రానో 
జీవితం అయిపోయినట్టుకాదు.
జీవితాన్ని మళ్ళీ చిగురింపచేయడానికి 
ఒక క్రమశిక్షణ కావాలి.
అంతకన్నా మరేదీ అఖ్ఖరలేదు.   
అది మనకు మనంగా 
అలవరచుకో గలిగితే మరీ మంచిది. 
అంత వరకూ సరదాగా గడిపేసి, 
ఒక్కసారిగా క్రమశిక్షణ అలవర్చుకోవాలంటే  చాలా కష్టం. 
అప్పుడు క్రమశిక్షణగా వుంటున్నవాళ్లని ఎంచుకుని 
వాళ్ళని అనుసరించాలి.   
అనుకరించినా తప్పుకాదు.
   
మీరు మారడానికి ఇప్పుడున్న వాతావరణం అనుకూలంగాలేకపోతే,
పాత సమూహాల్లో బతకడం మీకు అవమానకరంగావుంటె, వెంటనే 
పాత సమూహాన్ని వదిలిపెట్టి కొత్త సమూహంలోనికి ప్రవేశించండి.
బాధల్లో ఉన్నపుడు ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.  
నిజానికి ప్రపంచం చాలా విశాలమైనది.     
కొత్తచోట జీవితాన్ని జీరోతో మొదలేట్టండి. 
అలా జీరోతో మొదలేట్టడానికి సిగ్గుపడవద్దు.  
అతి తక్కువ సమయంలోనే మీరు కొత్తచోట అద్భుతాలు సృష్టించగలరు.

ఇది ఉపదేశం కాదు. అనుభవం.

నేను 1975లో జీవితాన్ని నాకు దక్కాల్సిన వాటాకన్నా ఎక్కువగా అనుభవించేశాను. 
దాని నష్టాలను కూడా భారీగా చవిచూశాను.
అడుగడుగున అవమానాలు. నైరాశ్యం. దాన్నే ఇప్పుడు డిప్రెషన్ అంటున్నారు. 

నేను మా వూరు వదిలి విజయవాడ వచ్చాను. 
అప్పటికి నాకు ఏ మాత్రం తెలీని కొత్త సమూహాంలొ చేరిపొయాను. 
అంతకుముందు వాళ్ళకు నేను తెలీదు. నాకువాళ్ళూ తెలీదు. 
జీవితంలో దెబ్బతిన్నవాళ్ళ దగ్గర ఒక గొప్ప పెట్టుబడి వుంటుంది.
అదే అనుభవం!
పాత అనుభవం కొత్త సమూహంలో గొప్పగా పనిచేస్తుంది. 

చనిపోతేనే మంచిదనిపించిన ఆ దశనుండి ఒక్కసారిగా చాలా మార్పులు వచ్చాయి. 
అంతకు ముందు నేను ఊహించడానికి కూడా సాధ్యం కాని అనేక విజయాలు సాధించాను.

ఈ గొప్పతనం నాదికాదు నేను ఎంచుకున్న కొత్త సమాజానిది.

జీవితాన్ని ప్రదర్శనగా మార్చేవాళ్లకు నేను దూరంగావున్నాను. 
నిరాడంబరంగా బతికేవాళ్ళను, తమబతుకు తాము బతుకుతూ కొంచెం సమాజం కోసం కూడా ఆలొచించేవాళ్లతో సహవాసం చేషాను. 

ఉద్యమాల్లో పనిచేయడం ఒక త్యాగం అని చాలామంది అనుకుంటూవుంటారు. 
నేను స్వ్వార్ధం అంటాను. 
ఉద్యమాల్లో పాల్గోనడంవల్ల నాకు ఆత్మస్థైర్యం పేరిగింది.  మునుపటి ఆత్మవిశ్వాసం తిరిగివచ్చింది. 
సోషల్ ప్రివిలేజెస్ కూడా పెరిగాయి.
మరోవైపు, వృత్తి నైపుణ్యం కూడా పేరిగి ఆ మేరకు అడ్వాంటేజెస్ కూడా పెరిగాయి. 

జీవితం మహత్తరమైనది దాన్ని చిన్నది చెయకండి. 
డిప్రెషన్ జీవితానికి శతృవు. దాన్ని తరిమి కొట్టండి.

ఈ విషయంలో నా సలహాలు ఏమైనా పనికివస్తే ఆనందిస్తాను. 

 నా సెల్ నెంబరు  90102 34336 కు ఎస్.ఎం.ఎస్ పంపవచ్చు. 

(నాకు తేలియని నెంబరు నుండి ఫోన్ వస్తే సాధారణంగా నేను రిసీవ్ చేసుకోను) 

పీపుల్స్ వార్ లో సత్యమూర్తి

పీపుల్స్ వార్ లో సత్యమూర్తి

ఉషా యస్ డానీ

పీపుల్స్ వార్ లో నేను ఒక విధంగా నిత్య అసమ్మతివాదిని. ఇటీవల నాడానీ వ్యంగ్యం’ పుస్తకావిష్కరణ సభలో వరవరరావు సార్ అన్నట్టు  పీపుల్స్ వార్ ప్రముఖులు నాతో జరిపినంత పొలిమికల్ డిబేటును మరొకరితో జరిపివుండరు. అయితే   దశలోనూ నేను పీపుల్స్ వార్ తో తెగతెంపులు చేసుకోవాలనుకోలేదు. జీవపరంగా మా అమ్మ నా అస్తిత్వమైనట్టు, సామాజిక, రాజకీయ అభిప్రాయాల్లో పీపుల్స్ వార్ నా అస్థిత్వం. పీపుల్స్ వార్ ను రద్దుచేసి మావోయిస్టుగా మార్చినపుడు నాకు చాలా బాధవేసింది. మా ఊరి పేరు మార్చేశారు  అన్నంత కోపం  కూడా వచ్చింది. అందుకే మావోయిస్టు పార్టీకి దూరంగా వున్నాను. 

పీపుల్స్ వార్ నుండి బయటికి వచ్చినపుడు నేను సంస్థాగతంగా తనతో కలిసి నడుస్తానని సత్యమూర్తి సార్ ఆశించారు. నాకది ఇష్టంగాలేదు. అయితే, వారితో వ్యక్తిగత స్థాయిలో అనుబంధాలను కొనసాగించాను. బహిరంగ జీవితంలొనికి వచ్చిన తరువాత, 1990లో తొలిసారి విజయవాడ వచ్చినపుడు ఆయన మా ఇంట్లోనే విడిదిచేశారువ్యక్తిగత అనుబంధాలు వేరు. సంస్థాగత సంబంధాలువేరు. నేను వారు పెట్టిన కొన్ని సంస్థల 'తో' వున్నానుగానీ, ఎన్నడూ సంస్థల 'లో' లేను.

1991 జులై 17 నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. సత్యమూర్తి సార్ విజయవాడ వచ్చినప్పుడెల్లా నన్ను కలవడానికి వచ్చేవారు. రాత్రి నేను డ్యూటీ దిగాక నిర్మానుష్యంగావున్న బందర్ రోడ్డు లోని ఏదో ఒక అరుగు మీద తెల్లవారే వరకు సిట్టింగు వేసేవాళ్ళం.

సత్యమూర్తి సార్ బీయస్పీలో చేరడం నాకు వచ్చలేదు. వారు ముదినేపల్లిలో  పోటీ చేయడం అస్సలు నచ్చలేదు."మిమ్మల్ని విముక్తి ప్రదాతగా చూడాలనుకున్న జనం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేని చేయమని అడగడం చౌకబారుగా వుంటుంది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం ఏం బాగుంటుందీ? అన్నాను. "నువ్వు ఎన్నికల బహిష్కరణ పాలసీ నుండి బయటికి రాలేదు" అన్నారు. తరువాత మేము కలవడం దాదాపు ఆగిపొయింది.

ఫొటో చూసి నేను 1991 నాటిది అనుకున్నా. కానీ, అది 1994 నాటిది అని తేలింది. బహుశ అది మా చివరి సిట్టింగ్ అయివుంటుంది.

తరువాత కూడా మేము కొన్నిసార్లు కలిశాం. అవి పాత కలియికలుకావు. నేనొక పాత్రికేయుడిగా, ఆయనొక వృధ్ధ రాజకీయ నాయకుడిగా! అంతే!

సత్యమూర్తి సారును మొన్న ఏప్రిల్ 17 తలుచుకున్నా,18 విజయవాడలో అంత్యక్రియలకు హాజరయినా, దానికి ప్రేరణ 1978-1985 నాటి సత్యమూర్తి సారే.

హైదరాబాద్
20  ఏప్రిల్ 2012