Monday 30 September 2013

రాయలాంధ్రకు నాయకులు కావలెను!!

రాయలాంధ్రకు నాయకులు కావలెను!! 
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

                                    ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదనేవాళ్ళు ఇంకా ఏవరైనా వుంటే వాళ్ళు బొత్తిగా అమాయకులైనా అయివుండాలి, పచ్చి అబధ్ధాలకోరులు అయినా అయివుండాలి.

        ఇటు తెలంగాణలో అయినా, అటూ రాయలాంధ్రలో అయినా ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడేవాళ్ళే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాస్తవ పరిస్థితుల్ని సరిగ్గా అర్ధంచేసుకుని, తమను నమ్ముకున్న ప్రజలు ఆశించే ఫలితాల దిశగా శ్రేణుల్ని నడపగల నాయకులు కనిపించడంలేదు. నాయకులుకానినాయకులు ఆడుతున్న కౄరపరిహాసంలో రాయలాంధ్ర ప్రజలు మరింతగా మోసపోతున్నారు.

        నాయకుడులేక భావోద్వేగాలు మాత్రమే చెలరేగిపొతే ఉద్యమాలు దారితప్పుతాయి. దాన్నే ఇప్పుడు రాయలాంధ్రలో చూస్తున్నాం. తల్లికి అన్నంపెట్టనివాడు కూడా రోడ్డెక్కి తెలుగుతల్లికి గర్భశోకం రానివ్వం అని శపథాలు చేయడం చూడ్డానికి బాగానేవుంటుంది. అవతలివాళ్ళు మా తెలంగాణతల్లి మాకుంది, మేము తెలుగు తల్లికే పుట్టలేదు మొర్రో అంటుంటే వంశవృక్షం పట్టుకుని తిరగడం ఏం వివేకం! అతిశయోక్తిగా వుండవచ్చుగానీ, "రాయలాంధ్ర వుద్యమానికి నాయకులు కావలెను" అనే ప్రకటన ఇవ్వాల్సిన దుస్థితి నిజంగానే దాపురించింది!

        1972  నాటి జై‌ఆంధ్రా ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటే, సమైక్యాంధ్ర ఉద్యమంలో నాయకత్వలోపం ప్రస్పుటంగా కనిపిస్తోంది. గౌతు లచ్చన్న, కాకాని వెంకట రత్నం, తెన్నేటి విశ్వనాధం, బీవి సుబ్బారెడ్డి  వంటి సీనియర్లు నాటి ఉద్యమాన్ని ముందుండి నడిపించగా, వెంకయ్య నాయుడు, వసంత నాగేశ్వరరావు వంటి రెండవతరం నాయకులు దానికి జవసత్వాల నిచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లా గలగల పారే సుంకర సత్యనారాయణ ఉపన్యాసాలు వినడానికి జనం తెగ ఆసక్తి కనపరిచేవారు. సుంకర ఉపన్యాసానికి కొనసాగింపే వెంకయ్యనాయుడు ఉపన్యాస శైలి.

        అప్పట్లో ఈ వ్యాసకర్త ఆంధ్రా నిరుద్యోగుల సంఘానికి కార్యదర్శి. దానికి అధ్యక్షుడు అమ్మనమంచి కృష్ణశాస్త్రి. "చారిత్రక సంధి సమయంలో ఆంధ్రజాతిని మేల్కొలిపి, కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన అశేష ప్రజానీకానికి వందనాలు" అని మొదలెట్టే గౌతు లచ్చన్న ఉపన్యాసాల్నీ ఆతరం ఇప్పటికీ మరిచిపోదు. భావోద్వేగాలను పట్టుకోవడంలో లచ్చనగారిది ప్రత్యేక శైలి. నాయకుడు, ఉపన్యాసకుడు ఏకమైపోయిన అదుదైన సందర్భం అది. అలా, భావోద్వేగాలను పట్టుకుని రాజకీయం నడిపే సామర్ధ్యం ఈతరం నాయకుల్లో కేసిఆర్ దగ్గర  కనిపిస్తుంది. 

        జైఆంధ్ర ఉద్యమానికి అసలు సిసలు సూత్రధారి  కాకాని వెంకటరత్నం. ఉద్యమం వుధృతంగా సాగుతున్నప్పుడు, పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. ఆ వార్త విన్న  కాకాని గుండె‌ఆగి చనిపోయారు. అప్పటికి ఆయన వ్యవసాయ, ఆరోగ్య శాఖల మంత్రి. కాకాని అంత్యక్రియలకు వెళ్లడానికి అప్పటి ముఖ్యమంత్రి పివీ నరసింహారావు సాహసించలేకపోయారు. ఒక మంత్రి అంత్యక్రియలకు కూడా ముఖ్యమంత్రి వెళ్లలేని పరిస్థితి వుందంటే ప్రభుత్వాన్ని రద్దు చేయక తప్పదని అప్పటి రాష్ట్రపతి వివి గిరి భావించారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో రాష్ట్రపతి పాలన సాగిన ఏకైక సందర్భం అది.

        వర్తమానానికివస్తే, తెలంగాణలో కేసి‌ఆర్ లా రాయలాంధ్ర ఉద్యమానికి కేంద్ర బిందువైన నాయకుడులేడు. ఇప్పుడు నాయకులుగా కనిపిస్తున్న వాళ్లందరిదీ గెస్ట్ అప్పీరియన్సు మాత్రమే! వేదిక ఎక్కి, హార్డ్ హిట్టర్లు వస్తున్నారు, బ్రహ్మాస్త్రం తెస్తున్నారు, పక్క రాష్ట్రాల ఉద్దండుల్ని మాట్లాడివుంచాం అని చెప్పేవాళ్ళేతప్ప, ఉద్యమానికి మేమే నాయకత్వం వహిస్తాం అనే గుండె ధైర్యంగలవాళ్ళు ఒక్కరూ కనిపించడంలేదు.


        నాటి తరం నేతల్ని నేటితరంలోనూ చూడాలనుకోవడం  అత్యాశే కావచ్చు.  కాకాని వెంకటరత్నం వంటి గట్టి నాయకుడు లేకపోయినా తప్పుకాదుగానీ, కేతిగాళ్ళు మీడియాలో ఫోకస్ కావడం ప్రమాదకరం! నాయకులు లేకపొతే పోయారు. ఉత్తేజ పరిచే ఉపన్యాసకులైనా వున్నారా? అంటే అదీ లేదు. వున్నవాళ్లలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కరే గుడ్డిలో మెల్ల. భూమన కరుణకర రెడ్డి వంటివాళ్ళు మాట్లాడగలరుగానీ వాళ్ళు ఆయా పార్టీల్లో ప్రధాన నాయకులుకాదు.

        ఇక పరుచూరి అశోక్ బాబు ఒక్కరే బండి లాగిస్తున్నారు. అయితే, ఆయన ప్రపంచం ఎన్జీవోల వరకే పరిమితం. భారత ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని సంకుచిత అర్ధంలో సిపాయిల తిరుగుబాటు అంటారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన-సమైక్య ఉద్యమాలని పరిమిత అర్ధంలో ఎన్జీవోల ఉద్యమం అనవచ్చు. ఎన్జీవోలకు నాయకులు వుంటారుగానీ, ఎన్జీవోలు సమాజానికి నాయకత్వం వహించలేరు! సమాజ ప్రయోజనాలు ఎన్జీవోలకన్నా చాలా విస్తృతమైనవి! దానికోసం రాజకీయ ఉద్యమం జరగాలి! తెలంగాణలో విభజన ఉద్యమం ఎన్జీవోల దశనుదాటి, రాజకీయ ఉద్యమంగామారి చాలాకాలమైంది. ఆలోటు రాయలాంధ్రలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడేది రైతులు. అయినా, ప్రస్తుత  రాయలాంధ్ర ఉద్యమం మీద రైతులు పెద్దగా ఆసక్తి కనపర్చడంలేదు. ఎన్జీవోల ఉద్యమం రైతాంగ ఉద్యమంగా మారాలంటే రాయలాంధ్రలో రాజకీయ ప్రక్రియ వేగవంతం కావాలి!

        సీమాంధ్రలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకీ ఆమోదాంశంలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలకే కాదు, కొత్తగా పుట్టి ఇంకా అధికారాన్ని ఆస్వాదించని జగన్ పార్టికి కూడా ఆమోదాంశం లేకపోవడం విచిత్రం.  

        ప్రస్తుత దశ తెలంగాణ ఉద్యమానికి తొలిగంట కొట్టింది బీజేపి. "ఒక ఓటు, రెండు రాష్ట్రాలు" దాని నినాదం. ఇప్పుడు ఆ పార్టీకి సీమాంధ్రలో ఒక్క శాసనసభ్యుడు కూడా లేడుగాబట్టి ఇప్పటికిప్పుడు ఆ పార్టికి ఇబ్బంది లేక పోవచ్చుగానీ, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై గంపెడు ఆశలు పెట్టుకున్న బీజేపికి సీమాంధ్రలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపితోపాటూ సిపి‌ఐది కూడా అధికారికంగా విభజన బాటే. ఆ పార్టి విశాలాంధ్ర నినాదాన్ని ఎప్పుడో వదులుకుంది. దానికిప్పుడు రాయలాంధ్రలో శాసనసభ్యులూ లేరు.

        రాష్ట్రంలో, సిపియం, యంఐయం రెండు మాత్రమే అధికారికంగా సమైక్యవాద పార్టీలు. కానీ, ఆ రెండు పార్టీలకు సీమాంధ్రలో ఒక్క శాసనసభ్యుడు కూడాలేడు. ఇదో వైచిత్రి! 

        రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారంలోవున్నది కాంగ్రెస్సే కనుక, ప్రస్తుతం ఆ పార్టీయే రాయలాంధ్రులకు తార్కికంగా ప్రధాన శత్రువు. ఎన్నికల పొత్తుపెట్టుకొని అందరికన్నా ముందు విభజనవాదుల్ని ప్రోత్సహించిన చరిత్ర కూడా కాంగ్రెస్ కు వుంది. ఆ పార్టి  ప్రజాప్రతినిధులు ఢిల్లీలో విభజనకూ,  నియోజకవర్గాల్లో సమైక్యతకూ మద్దతిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు!  వాళ్లలో కొందరు నేడోరేపో  యం.పీ. పదవులకు రాజీనామాలు చేయవచ్చుగానీ, ఇప్పటికే సమయం మించిపోయింది. రాయలాంధ్రలో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ తన పునాదిని తానే కూల్చుకుందని ఆ పార్టి పెద్దలే బహిరంగంగా చెపుతున్నారు!

        అధికార పార్టి మీద ప్రజల్లో కలిగే ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి భావిస్తోందిగానీ, కేసి‌ఆర్ తో కలిసి రాజకీయ కాపురం చేసిన చరిత్ర చంద్రబాబుకూ వుంది కనుక జనం ఆ పార్టీనీ నమ్మడం లేదు.

        రాయలాంధ్రలో ఆర్భాటంగా చేపట్టిన  ఆత్మగౌరవయాత్రను మధ్యలో ఆపి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసొచ్చారు చంద్రబాబు. వారు చేసిన హడావిడిని చూస్తే,  ఆంధ్రప్రదేశ్ ను విభజించమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి గతంలో  రాసిచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటారేమో అనిపించింది. చంద్రబాబు పాత లేఖను తీసుకోకపోగా "ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్  ఇస్తుంది. లేకపోతే రేపు నేను ప్రధానమంత్రికాగానే తెలంగాణ ఇస్తా"నన్న నరేంద్ర మోదీకి  "ఐ లవ్ యూ" అంటూ ఇంకో లేఖను ఇచ్చివచ్చారట! ఏనుక్కి కనిపించే దంతాలువేరు, నమిలే దంతాలువేరు. చంద్రబాబు ఢిల్లీ యాత్రకు కనిపించే కారణాలువేరు. కనిపించని కారణాలు వేరు.

        తెలంగాణాపై కాంగ్రెస్ ప్రకటన వస్తుందని పసిగట్టగానే, రాయలాంధ్రలో సమన్యాయం నినాదంతో అందరికన్నా ముందుగా రోడ్డెక్కిన పార్టి వైయస్సార్ కాంగ్రెస్. కానీ, చంద్రబాబును ఓడించడానికి తెలంగాణ అంశాన్ని వెలుగులోనికి తెచ్చిందే వైయస్ రాజశేఖర రెడ్డి అనే వాస్తవం ఆ పార్టికి శాపంగా వెంటాడుతూనేవుంది. రాజకీయాల్లో సన్ స్ట్రోకులేకాదు ఫాదర్ స్ట్రోకులూ వుంటాయి!

        రాయలాంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుది ఒక విషాదం అయితే జగన్ ది ఇంకో విషాదం. జగన్ ను ధర్మ విజేతగా ప్రచారం చేసుకోవాలని ఆయన పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. కాంగ్రెస్ పెద్దలేమో జగన్ ను విజితగా భావిస్తున్నారు. విజిత అంటే పందెపు సొత్తు. జగన్ ధర్మ విజితనా? అధర్మ విజితనా? అనేది అనవసర ధార్మికచర్చ.  

        "కాంగ్రెస్ కక్షగట్టి జగన్ ను జైల్లో పెట్టింది" అని వైయస్సార్ పార్టీ ప్రచార సారధులు ఇప్పటి వరకూ చెప్పిన మాటలు బెడిసి కొట్టాయి. ఇప్పుడూ కాంగ్రెస్సే అధికారంలో వుంది కనుక తార్కికంగా ఆ పార్టీయే జగన్ కు బెయిల్ ఇప్పించిందని నమ్మేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. నారుపోసినవాళ్ళే నీరుపోసినట్టు జెయిల్లో పెట్టినవాళ్ళే బెయిల్ ఇప్పిస్తారు అనేది వాళ్ళ నమ్మకం!

        వర్తమాన రాజకీయ భ్రష్టత్వానికి పరాకాష్ట ఏమంటే, విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలన్ని భావిస్తున్నట్టు తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. సమైక్యవాద నినాదం చేస్తున్న జగన్ రాష్ట్రం విడిపోతేనే తనకు మేలని భావిస్తున్నట్టు రాయలాంధ్రులు అనుమానిస్తున్నారు.

        సమైక్యంతప్ప మరేదైనా అంగీకారమే అని తెలంగాణవాళ్ళూ, సమైక్యంతప్ప మరేదీ కుదరదు అని సీమాంధ్రవాళ్ళూ తలపడుతున్నప్పుడు సమస్యను పరిష్కరించాల్సినవాళ్ళు ప్రత్యామ్నాయాలని అన్వేషీంచాలేతప్ప, సవాళ్లను విసరకూడదు. "ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అప్రకటిత అంతర్యుద్ధ పూర్వరంగ వాతావరణం ఏర్పడింది. అంచుకు చేరింది గానీ అదృష్ట వశాత్తు అదుపులోనే ఉంది. జాగ్రత్త పడకపోతే అదుపు తప్పదన్న పూచీ లేదు." అని సీనియర్ పాత్రికేయులు పొట్లూరి వెంకటేశ్వరరావు నెల క్రితమే  హెచ్చరించిఉన్నారు. ప్రజల్లో ఆమోదాంశంలేని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేసే బాధ్యతారాహిత్యపు ప్రకటనలతో వాతావరణం అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదు.

"కలిసుందాం రా!" వంటి కాలం చెల్లిన నినాదాల్ని పక్కనపెట్టి, వాస్తవ సమస్యలకు వాస్తవ పరిష్కారాల్ని సూచించి, వాటిని సాధించడానికి ఉత్తేజాన్నిచ్చే కొత్త నినాదాలతో కొత్త రాజకీయ పార్టి ఒకటి ఇప్పటికిప్పుడు రాయలాంధ్రలో ఆవిర్భవించాలి. ఇది చారిత్రిక అవసరం!
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
 28 సెప్టెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
29 సెప్టెంబరు 2013

 



Monday 23 September 2013

Chandrababu - Barometer of Alliance Politics

చంద్రబాబు : కూటమి రాజకీయాల భారమితి
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

        కవిత్వానికేకాదు, రాజకీయాలకు అనర్హమైనదీ ఏదీలేదు. ఒకే మాట, ఒకే భార్య, ఒకే భర్త, అనే మాటలు కూటమి రాజకీయాల్లో పనికిరావు. అన్యోన్య దాంపత్యం అనుకున్న కాపురం పెటాకులు కావచ్చు. అంత వరకు తిట్టిన తిట్లు తిట్టకుండ తిట్టుకున్న వాళ్ళు కలిసి కొత్త కాపురం పెట్టవచ్చు; రహాస్యంగానో, బహిరంగంగానో!

        స్వాతంత్రం వచ్చిన తొలి రెండు దశాబ్దాల్లో ఓటర్లకు పెద్ద ఆప్షన్లు వుండేవికావు. అయితే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టు. ఇందులో సింహ భాగం సహజంగా కాంగ్రెస్ దే. మూడవ శిబిరంగా భారతీయ జనసంఘ్ వుండేదిగాని దాని ప్రభావం ఢిల్లీ, తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో, అదీ చాలా పరిమితంగా మాత్రమే వుండేది. 1967 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, జనసంఘ్ చేతులు కలిపి కాంగ్రెస్ అధిపత్యాన్ని తొలిసారిగా దెబ్బతీశారు. డెబ్భయ్యవ దశకపు అత్యయిక పరిస్థితి, ఒక్క సిపిఐని మినహా,  దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేసింది.   1977 నాటి ఎన్నికల్లో, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతాపార్టీగా మారి అధికారాన్ని దక్కించుకున్నాయి.

        రాజకీయాల్లో ప్రతీదీ కొన్ని కొత్త విలువలతోనే ప్రవేశిస్తుంది. అయితే, ప్రకటించుకున్న విలువల్ని కోల్పోవడానికి దానికి ఎంతో కాలం పట్టదు.  స్వంత విలువలంటూ లేకపోతే, ఇంకొకరిని విమర్శిస్తూ చేపట్టిన అధికారం, ఎక్కువ కాలం కొనసాగదు. అత్యయిక పరిస్థితి నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆవిర్భవించిన జనతాపార్టీ తనదైన స్వంత పంథాలేక  మూడున్నరేళ్లలోనే ప్రాభవాన్ని కోల్పోయింది.

        జనతా పార్టీ వైఫల్యాలతో, 1980 ఎన్నికల్లో ఇందిరాగాంధి తిరిగి అధికారాన్ని చేపట్టగా, ఇందిరాగాంధి హత్యవల్ల వచ్చిన సానుభూతితో, 1984 ఎన్నికల్లో రాజీవ్ గాంధి విజయం సాధించారు. ఆ తరువాత, ఇప్పటి వరకు భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడా  లోక్ సభలో మేజిక్ ఫిగర్ 273కు చేరుకోలేదు. కూటమి రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కూటమి రాజకీయాల్లో ఆదర్శాలు తక్కువ. అవకాశవాదాలు ఎక్కువ.

        ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబుకు ఒక ప్రత్యేకత వుంది. కూటమి రాజకీయాల్లో వారు స్పెషలిస్టు ప్లేయరు. 1994 ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన  యన్టీ రామారావును ఏడాది తిరక్క ముందే గద్దెదించి అధికారంలో కొనసాగిన చరిత్రవారిది. ఎడమ పక్కన లెఫ్టిస్టు కమ్యూనిస్టుల్నీ, కుడిపక్కన రైటిస్టు బీజేపినీ పెట్టుకుని ఈ ఫీట్ ను సాధించారువారు. కూటముల ఏర్పాటు నైపుణ్యాన్ని ఆ తరువాతి కాలంలో  జాతీయ రాజకీయాల్లోనూ నాలుగైదు సందర్భాల్లో ప్రదర్శించారు చంద్రబాబు.    

        సమాజం తరచుగా, అతి వేగంగా పెనుమార్పులకు గురికాడాన్ని మనం ఇరాన్ లో చూడవచ్చు. అంచేత, ప్రపంచ గాలి ఎటువైపుకు వీస్తుందో తెలుసుకోవడానికి సమాజశాస్త్రవేత్తలు ఇరాన్ వైపు చూస్తారు. వాళ్లకు ఇరాన్ ఒక సమాజ భారమితి. ఇరాన్ ఆధునిక పోకడలకు పోతుంటే, ప్రపంచంలో పశ్చిమ గాలి వీస్తున్నదని అర్ధం. ఇరాన్ సాంప్రదాయ పునరుధ్ధరణకు పూనుకుంటుంటే ప్రపంచంలో తూర్పు గాలి వీస్తున్నదని అర్ధం. 

        రాష్ట్ర రాజకీయాల్లో ఏ గాలి వీచబోతున్నదో  తెలుసుకోవాలంటే చంద్రబాబు వైపు చూడాలి. రాబోయే పరిణామాలకు ముందుగా స్పందించే గుణం ఆయనకుంది.   ఒక విధంగా ఆయన కూటమి రాజకీయాల భారమితి. అయితే, ఆయన పెరట్లో కోకిల తొందరపడి ముందే కూస్తుంది. చాలాసార్లు తప్పుడు సంకేతాలూ ఇస్తుంది.

        ప్రపంచ వ్యాప్తంగా ఐటీ బూమ్ కొనసాగుతున్నప్పుడు చంద్రబాబు దాన్నీ సకాలంలో గట్టిగా పట్టుకున్నారు.  అది కలకాలం కొనసాగుతుందని భావించారు. దేశంలో వ్యవసాయం అంతరించి, మూడు, నాలుగు తరాల సాంకేతిక నైపుణ్యం వచ్చి పారిశ్రామికరంగం పరుగులు పెడుతుందని ప్రపంచబ్యాంకు చేసిన ప్రచారానికి ఆయన ఆకర్షితులయ్యారు. చంద్రబాబు అధికారానికి 2020 వరకు ధోకా లేదంటూ ప్రపంచబ్యాంకు ప్రాయోజిత సర్వేసంస్థలు తయారుచేసిన నివేదికల్నీ వారు నమ్మేరు. రాజధాని నగరం హైదరాబాద్ లో, దక్షణ, తూర్పు, ఉత్తర మండలాల్ని పక్కనపెట్టి, పశ్చిమ మండలంలో తన కలల సైబర్ రాజధానిని నిర్మించారు.

        అన్నీ అనుకూలంగా వున్న కాలంలో చంద్రబాబు అనుకున్నవన్నీ జరిగాయి. జాతీయ రాజకీయాల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పాయిలను ప్రధానుల్ని చేయడానికి చంద్రబాబు తిప్పిన చక్రం పనిచేసింది. దేవేగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానుల్ని చేయడానికి కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు పెద్ద విమర్శలు రాలేదుగానీ, వాజ్ పాయికి మద్దతు పలికినపుడు మాత్రం చంద్రబాబు లౌకిక పార్శ్వం విమర్శలకు గురైంది. ముస్లింల మనోభావాల్ని దెబ్బతీశారంటూ అప్పటి  భారీ పరిశ్రమల మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. అయితే, వాజ్ పాయిని సమర్ధించడం చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చింది. కార్గిల్ సెంటిమెంటు వాజ్ ప్రభుత్వాన్ని  1999 ఎన్నికల్లో గెలిపించగా, వాజ్ పాయిని నమ్ముకున్న చంద్రబాబు ఆ ఏడాది జమిలిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు.

        టిడిపి_బీజేపి రాజకీయ దాంపత్యానికి నరేంద్ర మోదీతో సమస్యలు మొదలయ్యాయి. 2002 లో సాగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీని చంద్రబాబు స్వల్పంగా విమర్శించినప్పటికీ బీజేపీతో దోస్తీని వదలలేదు. దీని ఫలితం 2004 ఎన్నికల్లో కనిపించింది. కార్గిల్ యుధ్ధం అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ గెలిపించగా, నరేంద్ర మోదీ మార్కు గుజరాత్ అల్లర్లు అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ ఓడించాయి.

        అన్నీ ప్రతికూలంగా వున్న కాలంలో ఎన్ని అనుకున్నా ఏవీ జరగవు. అలిపిరిలో నక్సలైట్ల బాంబు పేలుడు తరువాత, తన మీద సానుభూతి పవనాలు వీస్తాయని నమ్మి 2004లో ముందస్తు ఎన్నికలుకు వెళ్ళారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం ప్రపంచ బ్యాంకు అప్పటి ఛైర్మన్ జేమ్స్ వుల్ఫెన్షోన్ ను తలపించేది. సబ్సిడీ అన్న పదమే వారికి నచ్చేదికాదు. సాధారణంగా పాలకుల పేరే నగరాలకు వస్తుంది. చంద్రబాబు విషయంలో ఇది తలకిందులయింది.  హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి ఇష్టపడేవారు.  అరవై ఆరేళ్ళ స్వాతంత్రం తరువాత కూడా సగం మందికి ఆహార భద్రతలేని దేశంలో హైటెక్ పాలన ఎక్కువ కాలం నిలబడదు. చంద్రబాబు విషయంలోనూ అదే జరిగింది.

        అధికారాన్ని కోల్పోయాక చంద్రబాబు భారమితి దిక్కు మార్చింది. వారు అంతవరకు ప్రేమించినవాటిని దూరంగా పెట్టారు. అంతవరకు ద్వేషించిన వాటిని అక్కున చేర్చుకోవడం మొదలెట్టారు. బీజేపీతో దోస్తీకి కటిఫ్ చెప్పారు. సమైక్యతను చాటిచెప్పిన నోటితోనే రాష్ట్ర విభజనకు సరదాపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి  రాత పూర్వకంగా రాసిచ్చారు. సబ్సిడీ పేరు చెపితేనే మండిపడే వ్యక్తి ఆల్ ఫ్రీ బాబు గా మారిపోయారు.   అయినా వారిమీద హైటెక్ ముద్ర పోలేదు. 2009లో వరుసగా రెండో ఓటమిని చవిచూశారు.

        మతవాద రాజకీయాలు కొన్ని ఓట్లను సంపాదించిపెట్టేమాట నిజమే. కానీ, భారతీయుల్లో అత్యధికులు మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, మతవాద రాజకీయాల్ని అంతగా ద్వేషిస్తారు. ఆందుకే, అప్పటివరకు మతవాద శిబిరంలో అతివాదిగావున్న లాల్ కిషన్ అడవాణీ 2005 లో కరాచి వెళ్ళి సాక్షాత్తు మహమ్మదాలీ జిన్నా సమాధి దగ్గర నిలబడి పాకిస్తాన్ నిర్మాతను లౌకికవాది అని కొనియాడి వచ్చారు. అలా చేయకుంటే భారతదేశంలో ప్రధాని అభ్యర్ధికి ఆమోదాంశం రాదని వారికి తెలుసు. లౌకిక స్వరూపాన్ని సంతరించుకోవడానికి చంద్రబాబు కూడా అడవాణీ బాటలోనే నడిచారు. బీజేపీతో జట్టు కట్టినందుకు 2011 నాటి టీడిపి మహానాడులో వారు ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో కలిసేదిలేదని మరీ ఒట్టేశారు.
ఆ తరువాత కాంగ్రెస్ మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు చంద్రబాబు. రాష్ట్రంలో సంఖ్యా బలం సరిపోక సతమతమౌతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగుతున్నదంటే అది చంద్రబాబు పరోక్షసహకరమనే చెప్పాలి.  2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వాన యూపియే ప్రభుత్వం ఏర్పాటుకావడానికి అవసరమైతే సెక్యులరిజం ప్రాతిపదికన మద్దతు ఇస్తామని  టెన్ జన్ పథ్ కు తెలుగుదేశం అధినేత సంకేతాలు పంపించారని కూడా వార్తలు వచ్చాయి.

        కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపిన తరువాత చంద్రబాబు భారమితి మళ్ళీ దిక్కులు మార్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంవల్ల, తెలంగాణాలో టిఆర్ ఎస్, సీమాంధ్రలో జగన్ కాంగ్రెస్ బలపడి, తమ పార్టీ మాత్రం రెండు ప్రాంతాల్లోనూ  దెబ్బతినే పరిస్థితులొచ్చాయని తెలుగుదేశం అధినేత భావిస్తున్నారు. నేరుగా సమైక్య నినాదం అందుకోకున్నా అలాంటి అర్ధమే వచ్చేవిధంగా "ఆత్మగౌరవ" యాత్ర మొదలెట్టారు. ఈలోపులో, నరేంద్ర మోడీ, చంద్రబాబు మళ్ళీ రాజకీయ డేటింగ్ మొదలెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. టిడీపి వర్గాలు గట్టిగా ఖండించకపోవడాన్ని చూస్తుంటే, ఇవి నిప్పులేని పొగ కాకపోవచ్చు!

        సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల వ్యవధి వుంది. ఈ లోపులో చంద్రబాబు భారమితి మరెన్నో ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదు!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
 20 సెప్టెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
 24 సెప్టెంబరు 2013
<lang=eng>http://www.suryaa.com/opinion/edit-page/article-153817


Chandrababu -  Barometer of Alliance Politics  

Sunday 15 September 2013

నాయకులులేరు నినాదాలు కొనసాగుతున్నాయి

నాయకులులేరుగానీ, వాళ్ల నినాదాలే కొనసాగుతున్నాయి

పోతనామాత్యుడు తన శ్రీమద్భాగవతం కృతిని రాజులకు అంకితం చేయడానికి నిరాకరించాడు. రాజులిచ్చే ఆ "పడుపు కూడు" తిననన్నాడు. ఆ సందర్భంలో ఆయన రాసిన "బాలరసాలశాల నవపల్లవ కోమల కావ్య కన్నెకన్" పద్యం మనకు తెలుసు. రచయితలు, కవుల నైతికతకు సంబంధించి ఇవన్నీ మహత్తర విషయాలు. భాగవతం కథాంశం శ్రీమహావిష్ణువు అవతార విశేషాలయితే దాని కథావస్తువు ఆదర్శ భూస్వామ్యం. దీని అర్ధం ఏమంటే పోతనామాత్యుడు సమకాలీన రాజులు కొందర్ని వ్యతిరేకించినట్టు, రాచరిక వ్యవస్థను వ్యతిరేకించలేదు. భగవంతుని లీలల్ని వర్ణిస్తూ తాను సృష్టించిన రచన రాచరిక, భూస్వామ్య వ్యవస్థలకు సాంస్కృతిక బలాన్ని ఇస్తుందని పోతనకు కూడా  తెలిసివుండకపోవచ్చు. గమనానికీ గమ్యానికీ పొంతనలేని విషయాలు అనేకం సాహిత్యం, సమాజం, రాజకీయాల్లో జరిగిపోతుంటాయి.

సీమాంధ్రలో ప్రస్తుతం సాగుతున్న ఆందోళనను చూస్తుంటే, పోతనామాత్యుని ఉదంతమే గుర్తుకు వస్తుంది. అక్కడ ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరు. ప్రజలు వాళ్లను వీరోచితంగా తరిమేశారు.  సీమాంధ్ర ’ప్రజాప్రతినిధులు’ ప్రజలకు భయపడి ఢిల్లీలోనో మరో చోటో పలాయన జీవితాన్ని గడుపుతున్నారు. ఇవన్నీ సీమాంధ్ర ఆందోళనలో నిస్సందేహంగా మహత్తర అంశాలు. కానీ, ఇప్పటికీ వాళ్ళిస్తున్న నినాదం ఏమిటీ? వాళ్ల ’ప్రజాప్రతినిధులు’ 2008  లో  నేర్పిన  ’సమైక్య’ వాదమేకదా! మనం వ్యతిరేకిస్తున్నదానినే సమర్ధించడం ఒక రాజకీయ వైచిత్రి! సీమాంధ్రలో తక్షణం నినాదం మారాలి! అది మారితే సీమాంధ్ర ప్రజలు నిస్సందేహంగా అద్భుత విజయాలు సాధించగలరు.

సీమాంధ్రప్రాంతపు రెండు మూడు ఆధిపత్యకులాల ఆర్ధిక ప్రయోజనాలను కాపాడడం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతున్నదనే విమర్శ ఒకటి వున్నది. సరిగ్గా, అలాంటి విమర్శే తెలంగాణలో విభజనవాదంపై కూడా వుంది. ఉద్యమ ప్రయోజనాలని తమకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం ఆధిపత్య కులాలకు సహజంగానే వుంటుందిగానీ, ఏ ఉద్యమమైనా ఆధిపత్యకులాలకు మాత్రమే పరిమితమై సాగదు. ఇటైనా అటైనా విస్తృత ప్రజాశ్రేణులు కదులుతున్నప్పుడు ఆయా సామాజిక వర్గాలకు చెందిన అనేకానేక ఆకాంక్షలు ముందుకు వస్తాయి. అయితే, విభిన్న సామాజికవర్గాల ఆకాంక్షలు తెలంగాణ ప్రాంతంలో ముందుకు వచ్చినంతగా, సీమాంధ్ర ప్రాంతంలో రావడంలేదు. రానివ్వడంలేదు.

నాయకులు చేసిన తప్పులకు ప్రజల్ని శిక్షించడం అన్యాయమనే వాదన ఒకటి సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు వినిపిస్తున్నది. ఇలాంటి వాదన ఇంకాస్త ముందు వచ్చివుండాల్సింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.  ఆధిపత్యం కోసం ఇరుప్రాంతాల నాయకులు (పాలకవర్గాలు) ఘర్షిస్తున్నపుడు ప్రజల ముందు రెండు మార్గాలుంటాయి. మొదటిది, తమ ప్రాంతపు పాలకవర్గాలతో కలిసి వెళ్లడం. రెండోది, ఇతరప్రాంతపు ప్రజలతో ఐక్య సంఘటన కట్టడం. తెలిసిగానీ, తెలియకగానీ సీమాంధ్ర ప్రజలు నెల క్రితం వరకు తమ ప్రాంతపు పాలకవర్గాలతోనే కలిసి నడిచారు.

ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతకు పునాది వేస్తుందని చాలామంది ఆశించారు. "రాష్ట్ర విభజనతో నీరు, విద్యుత్తు వంటి 30 రకాల సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. వాటి బదులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఉత్తమం” అనేదే ఏపీ‌ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు చేసిన ప్రధాన వాదన. కలిసి వుండడంవల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగే మేలేంటో ఆ సభ చెప్పలేదు. సమైక్య నినాదంతో దాదాపు  లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ లో సమావేశమై, తెలంగాణలో ఒక్కరి సంఘీభావాన్ని కూడా పొందలేకపోయారంటే దాన్ని ఏమనాలీ? హాజరైన సభ్యుల పరంగా చూసుకుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సూపర్ సక్సెస్! కానీ, అదిచ్చిన సందేశం పరంగా చూసుకుంటే అట్టర్ ఫ్లాప్!

ఆంధ్రప్రదేశ్ లో విభజనవాదం పుట్టిందే ప్రభుత్వోద్యోగులవల్ల. రాష్ట్రపతి ఉత్తర్వుల్నీ, జోనల్ విధానాన్నీ, 610  జీవోనీ చిత్తశుధ్ధితో అమలుపరచివుంటే, తెలంగాణ ప్రాంతపు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసమ్మతి పుట్టేదేకాదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పుట్టిన అసమ్మతి క్రమంగా ఇతర రంగాలన్నింటికీ వ్యాపించి పెద్ద ఉద్యమంగా మారిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం! ఇప్పుడు ఎన్జీవోల నాయకత్వంలో సమైక్య ఉద్యమం నడపాలనుకోవడం అర్ధంలేని వ్యవహారం!

సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పంపిన సందేశాల్లో మరో కీలక అంశం, రాష్ట్రాన్ని సమైక్యంగావుంచి, పదిహేనేళ్లపాటు ఏలుకోమని కేసిఆర్ కు ఆఫర్ ఇవ్వడం. ఆరోజు తాను మంత్రి పదవి ఇచ్చివుంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలెట్టేవారేకాదని సీమాంధ్ర ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు అంటున్నపుడే, హైదరాబాద్ సభలో సామాజిక కార్యకర్త గొట్టిపాటి సత్యవాణి ఈ ప్రతిపాదన చేయడం విశేషం. ఇలాంటి ఆఫర్లు పాతికేళ్ల క్రితమే చేసివుండాల్సింది. ఇప్పుడు టూ లేట్!

యాభై ఏడేళ్ల ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్యలు ముఖ్యమంత్రి పదవిలో వున్నది పూర్తిగా ఏడేళ్ళు కూడా కాదు. నాలుగున్నరేళ్ళు ముఖ్యమంత్రిగావున్న జలగం వెంగళరావు స్వంత నియోజకవర్గం సత్తుపల్లి తెలంగాణలోనే వున్నప్పటికీ, ఆయన సీమాంధ్రుడే. గతాన్ని పక్కన పెట్టినా వర్తమానంలో మాత్రం జరుగుతున్నదేమిటీ? ముఖ్యమంత్రి, శాసన సభాధిపతి, డిజీపి, పిసిసి అధ్యక్షుడు అందరూ సీమాంధ్రులే! పంపకాలు అసమానంగా వున్నప్పుడు ఉద్యమాలు పుట్టుకురాకతప్పదు.

యధాస్థితిని మార్చడమే ఉద్యమం. యధాస్థితిని కొనసాగించడం ప్రతీఘాత ఉద్యమం. కలసి ఉండటం ప్రతిఘాతం కాదు. కలిసి ఉండాలని వత్తిడి చేయడం తప్పకుండా ప్రతీఘాతమే. యధాస్థితితో నష్టపోతున్న వాళ్ళు విడిపోవాలనుకుంటారు.  లబ్ది పొందుతున్నవాళ్ళు కలిసివుందామంటారు. అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్!

సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలు తమ కోసం పోరాడడంలేదు. తమ పాలకుల కోసం పోరాడుతున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రజల భుజాల మీద తుపాకి పెట్టి తెలంగాణ పాలకుల్ని అదుపు చేయాలనుకుంటున్నారు సీమాంధ్ర పాలకులు.

సీమాంధ్ర ప్రజలు తమ కోసం తామే పోరాడాలనుకుంటే వాళ్ల ముందు అనేక చారిత్రక  కర్తవ్యాలున్నాయి.  ఉత్తరాంధ్రా అడవిలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా  ఆదివాసులతో కలిసి వాళ్లు పొరాడవచ్చు. విశాఖపట్నంలో హిందూజాలు సృష్టిస్తున్న భీభత్సానికి వ్యతిరేకంగా పొరాడవచ్చు. కృష్ణా-గోదావరి బేసిన్ లో చమురూ, సహజ వాయువు తవ్వకాలు సృష్టిస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా పొరాడవచ్చు. చమురు కంపెనీల దోపిడికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. గోదావరి నది కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీరప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. అనంతపురం జిల్లాలో ఇనప గనుల అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా అనంతంగా కొనసాగుతూపోతుంది. ఈ పనుల్లో ఒక్కటయినా అక్కడి ప్రజలు చేస్తున్నారా? చేయ్యాల్సిన పనులు ఏవీ చేయకుండా మీడియాలో ప్రచారం వచ్చే పనులు మాత్రమే చేయడాన్ని ఏమనాలీ? ఇలాంటి తప్పులు తెలంగాణలో లేవనికాదు. అక్కడా తప్పులున్నాయి. ఎక్కువ తప్పులు ఎటున్నాయి అనేదే ఒక నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యం.

ఒకటి రెండుగా మారుతుంది. ఏకత్వంలో భిన్నత్వం. ఏ కుటుంబంలో అయినా  ఒక తరం వెనక్కు వెళితేచాలు ఆ విషయం అర్ధం అవుతుంది. ఏ కుటుంబమూ దీనికి మినహాయింపుకాదు.

పురుషాధిక్య దాంపత్యంలో ఏ భార్య కలిసివుందామనుకుంటుందీ? వాళ్ళిద్దరు కలిసి కొనసాగాలంటే భర్త తన జీవిత భాగస్వామికి సమానస్థాయి ఇవ్వాలి. లేకుంటే, ఆమె జీవితం నుండి తప్పుకోవాలి. ఆ రెండూ జరక్కపోతే,  భార్య ఎలాగూ విడాకులు తీసుకుంటుంది. అది చట్టబధ్ధం కూడా! విడాకుల్ని కూడా భర్త అడ్డుకుంటే ఆ భార్య ఏం చేస్తుంది? అనేది ఊహించడం పెద్దకష్టంకాదు.

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ :  90102 34336

హైదరాబాద్
13  సెప్టెంబరు  2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, 15  సెప్టెంబరు  2013 

Sunday 8 September 2013

ప్రజాగ్రహం

ప్రజాగ్రహం
టిఆర్ఎస్‌తో 2004లో కాంగ్రెస్ పొత్తు
2009లో కెసిఆర్‌తో తెలుగుదేశం
తెలంగాణ ప్రభావం 2009 ఎన్నికల్లో తక్కువే
కెసిఆర్ దీక్షతో మారిన సన్నివేశం
వ్యవస్థతో విసిగిపోతున్న ప్రజానీకం
స్వీయ ప్రయోజనాలకే పార్టీల ప్రాధాన్యం
తారుమారవుతున్న పార్టీల విధానాలు
సమైక్యం నుంచి విభజనకు...
విభజననుంచి సమైక్యానికి!
కొత్త నాయకులు, నినాదాలు, విలువలు అవసరం 


ప్రజల్లో ఇప్పుడున్నంత అలజడి స్వాతం త్య్ర భారత దేశంలో మునుపెన్నడూ లేదు. ప్రజల్లో అలజడి పెరిగితే అది ప్రజాగ్రహంగా మారు తుంది. ప్రజలు తెలంగా ణాను కోరుకుం టున్నారా, సమైక్యాం ధ్రాను కోరుకుంటున్నారా? అన్నది ఒక ఆసక్తికర ప్రశ్నేగానీ, ఏమాత్రం సందు దొరికినా ప్రజలు తమ అలజడిని వ్యక్తం చేయాలనుకుం టున్నారనేది అంతకన్నా ఆసక్తికర అంశం. 2009 ఎన్నికల తరువాత మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఈ అంశాన్నే ధృవీకరిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలన్నీ ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి, చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజాగ్రహాన్నీ, వివిధ పార్టీల మీద ప్రజల అభిమానాన్నీ అంచనా వేయడంలో నిపుణులు సహితం ఒకరకం గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

2009 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు ఏకమై, మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా భావించిన టీఆర్ఎస్‌కు కేవలం పది సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ మహానగరంలో టీఆర్ఎస్ బోణీ కూడా కొట్టలేక పోయింది. ఆ వెంటనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీఆర్ ఎస్ సాహసించ లేకపోయింది. 2009 ఎన్నికల గణాంకాలను విశ్లేషిస్తే, తెలంగాణవాదం చాలా తక్కువ స్థాయిలో ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.
ఆ ఏడాది నవంబరు నెలలో కేసీఆర్ నిరాహార దీక్ష ఆరంభించిన తరువాత సన్నివేశం మారిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలోకి తరలి వచ్చారు. దీన్నిబట్టి మనం రెండు రకాల నిర్ధారణకు రావచ్చు. మొదటిది, ప్రజాభీష్ఠానికీ- ఎన్నికలకూ సంబంధం లేదు అనేది. రెండోది, ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఏదో ఒక సందర్భం కోసం వెతుకుతున్నారు అనేది.
ప్రజాగ్రహాన్ని రాజకీయ పార్టీలు తరచుగా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుం టాయి. ఈ విషయం అర్ధంకాకుంటే మనకు సకల జనుల సమ్మె అర్ధం కాదు. ఈ రోజున సీమాంధ్రలో సాగుతున్న నిరసన ఉద్యమం అర్ధం కాదు. దీనికి గతంలో ఒక మహత్తర ఉదాహరణ 1978 నాటి రమీజాబీ కేసు. పద్ధెనిమిదేళ్ల ముస్లిం అమ్మాయిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా- తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. ఆ ఆందోళనలో పాల్గొన్నవారు అత్యాచారానికి వ్యతిరేకులా? ముస్లిం అమ్మాయికి జరిగిన అన్యాయానికి సానుభూతిపరులా? అనేది తేల్చడం చాలా కష్టం. వ్యవస్థతో విసిగిపోయిన జనానికి ఒక నిట్టూర్పు అవకాశం కావాలి. దాన్ని రమీజాబీ కేసు కల్పించింది.
సీమాంధ్రలో ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం సాగుతోంది. బహుశ, గతంలో ఎన్నడూ ఎక్కడా ఏ ఉద్యమంలోనూ లేనంత, పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రజల్లో పెరిగిపోతున్న అలజడికి ఇది తాజా ఉదాహరణ. అయితే, సమైక్యాంధ్ర అనేది వాళ్లకు ఒక నిట్టుర్పేగానీ, వాళ్ల సమస్యకు పరిష్కారం కాదు. సీమాంధ్రలో ప్రజాగ్రహానికీ, సమైక్యాంధ్ర నినాదానికీ సంబంధంలేదు. ప్రజల అలజడి వాస్తవం. నినాదం బూటకం. మొదటిది ప్రజల తిరుగుబాటు. రెండోది, రాజకీయ పార్టీల దారి మళ్ళింపు వ్యవహారం. గమ్యానికీ గమనానికీ సంబంధంలేని అసంబద్ధ పరిణామాలు- ఉద్యమాల్లో చాలా సార్లు జరుగుతాయి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటి, ఐదు వారాల క్రితం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు- జాతీయ కాంగ్రెస్ వ్యూహం గురించి రెండు రకాల వాదనలు బలంగా వినిపించాయి. వాటి సారాంశం ఏమంటే, తెలంగాణలో- కాంగ్రెస్, టీఆర్ ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుని, బీజేపి,- టీడీపీల్ని పక్కనపెడతాయనీ, సీమాంధ్రలో- జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని, టిడిపికి అడ్డుకట్ట వేసి, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపియేలో చేరుతుందనీ! ఇలాంటి వాదనలు సహజంగానే టిడిపి అధినేత చంద్రబాబుకు అసహనానికి గురిచేసి ఉంటాయి. రెండు ప్రాంతాల్లోనూ వాతావరణం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుందని అనిపించినప్పుడు ప్రత్యర్ధి పార్టీలు వేటికైనా ఆ మాత్రం అసహనం ఉంటుంది.

అయితే, ఈనాటి పరిస్థితికి చంద్రబాబు సహితం సమిధ నొక్కటి ధారబోసిన వారే! చంద్ర బాబు 2004 ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎన్నికల పొత్తును గట్టిగా తప్పుపట్టారు. తెలంగాణ వాదాన్ని సమర్ధించిన కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్నికల గణాంకాల్ని విశ్లేషించడంలో ప్రత్యేక నైపుణ్యమున్న చంద్రబాబు, కాంగ్రెస్ గెలుపునకు టిఆర్ఎస్‌తో పొత్తు మాత్రమే కారణమని నాలుగేళ్ల తరువాత కనుగొన్నారు. తాము గెలవాలన్నా కేసిఆర్‌తో పొత్తు తప్పదని వారు నిర్ధారరించు కున్నారు. తెలంగాణపై టీడిపి విధానాన్ని తేల్చడానికి ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఆధ్వర్యాన ఒక కమిటీ వేశారు. దాదాపు ఆరు నెలలపాటు ఇరు ప్రాంతాల ప్రజల మనో భావాల్ని సేకరించిన ఆ కమిటీ కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వాలనీ, కేసిఆర్ తో పొత్తు కుదుర్చుకోవాలనీ ఒక నివేదికను ఇచ్చింది. నాయుడు- కృష్ణుడు కమిటి నివేదిక ఆధారంగా తెలుగు దేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమేగాక, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి- తెలంగాణ ఏర్పాటుకు అంగీకార పత్రాన్ని ఇచ్చింది. ఆ క్రమంలోనే 2008 విజయ దశమి రోజున మంచి ముహూర్తం చూసి కేసిఆర్‌తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు.

ఇంత చరిత్రను నెత్తి మీద పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై అభ్యంతరం చెప్పడం వింత పరిణామమే. ఇలాంటి వింతలు ఇటీవలి రాజకీయాల్లో ఒక పరంపరగా సాగి పోతున్నాయి.
కాంగ్రెస్ హఠాత్తుగా తెలంగాణ ప్రకటించేసిందని చంద్రబాబు అంటున్న మాటల్లో అర్ధం లేదు. నిజానికి, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన అంగీకార పత్రంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ ఐదేళ్ళు తీసుకుంది. రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నదని చంద్రబాబు చేస్తున్న వాదన కూడా పస లేనిదే. రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసమే నిర్ణయాలు చేస్తాయి. అందులో కొత్తది గానీ, వింతైనది కానీ ఏమీ లేదు. మహా అయితే, 2009 ఎన్నికల్లో టీడిపి ఆశించినదాన్నే, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశిస్తోంది. దీన్ని తప్పు పట్టేవాళ్ళు తప్పు పట్టవచ్చు. కానీ, అలా తప్పుపట్టే నైతిక అర్హత టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్‌లకు లేదు. అన్ని పార్టీలు ప్రజలతో ఆడుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజల్ని ఫణంగా పెట్టి జూదం ఆడాయి!

తెలంగాణ జలాల్లో- తమ వలల్లో చేపలు పడబోవడంలేదని టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సరిగ్గానే అర్ధం అయింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు సీమాంధ్ర జలాల్లో వలలు విసిరే ప్రయత్నం చేస్తున్నాయి. షర్మిల, చంద్రబాబు బస్సు యాత్రల లక్ష్యం ఇదే!

కాంగ్రెస్ ప్రకటనలో- విభజన విధి విధానాల ప్రస్తావన, సీమాంధ్ర పునర్నిర్మాణం ప్రణాళిక లేవనేది చంద్రబాబు చేస్తున్న కొత్త వాదన. షర్మిల అంత లోతైన అంశాల జోలికి ఎలాగూ పోలేరు కనుక భావోద్వేగాలతో పని కానించడానికే పరిమితమయ్యారు. అయితే, 2004 లో ఆమె తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ భావోద్వేగాలను ఎందుకు పట్టించుకోలేదనే అంశాన్ని షర్మిల తెలివిగానో, అమాయకంగానో దాటవేస్తున్నారు. కానీ, చంద్రబాబు అలా దాటవేయ లేరు. నాయుడు- కృష్ణుడు కమిటీ నివేదికలో గానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖలో గానీ, ఇప్పుడు తాను మాట్లాడుతున్న విభజన విధి విధానాలు, సీమాంధ్ర పునర్నిర్మాణం ప్రణాళికల ప్రస్తావన ఉందో లేదో స్పష్టం చేయాలి.

సాధారణంగా ప్రతి ఉద్యమం కొన్ని కొత్త సామాజిక విలువల్ని ముందుకు తెస్తుంది. ప్రస్తుత సమైక్యాంధ్ర ఉద్యమంలో అలాంటి కొత్త విలువలు ఏమీ కనిపించడం లేదు; అరవై యేళ్ల నాటి కాలం చెల్లిన విశాలాంధ్ర నినాదం తప్ప. ఆ కోణంలో దాన్ని ఉద్యమం కాదన్నా తప్పు కాదు.

తుపాకీ గొట్టం సూటిగా లేకపోతే మందు గుండు వెనక్కి చీదుతుంది. లక్ష్యం ఆచరణ సాధ్యం కానిది అయితే, ఉద్యమాల్లో ప్రజల శక్తియుక్తులు వృథా అవుతాయి. ఈ అంశాన్ని సీమాంధ్ర ప్రజలు ఇప్పుడైనా గుర్తించాలి. ఇప్పటి వరకు వాళ్లను నడిపించిన సాంప్రదాయ నాయకుల్నీ, నినాదాల్ని, విలువల్ని పక్కన పెట్టి- కొత్త నాయకుల్ని, కొత్త నినాదాల్ని, కొత్త విలువల్ని ఎంచుకోవాలి. లేకపోతే, గడిచిన అరవై యేళ్లలో జరిగిందే, వచ్చే అరవై యేళ్లలో జరుగుతుంది.
ఎ.ఎం.ఖాన్ ఎజ్దాని (డాని)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)

Sunday 1 September 2013

Divorce and state Division

ఎగువ రాష్ట్రాల నీటి యుధ్ధం  

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


దంపతుల మధ్య పొసగనప్పుడు విడాకులు వినా మార్గంలేదు. అంతవరకు బాగానేవుంది. విడాకులంటే, జీవిత భాగస్వామిని  రోడ్దు మీద వదిలేయడం కాదుకదా! విడాకుల లాంఛనాలు, పరిహారాల విషయంలో ప్రతి ప్రజాసమూహానికీ సాంప్రదాయికంగా తమవైన విధివిధానాలున్నాయి.

మనం రాజకీయాల్ని పట్టించుకున్నంతగా, సామాజిక అంశాన్ని పట్టించుకోవడంలేదుగానీ, రాష్ట్ర విభజన అంశం రగులు తున్నట్టుగానే, గత మూడేళ్లుగా దాంపత్య విభజన అంశం కూడా నలుగుతోంది. ఇవి రెండూ సంబంధంలేని రెండు భిన్న విషయాలని చాలామంది అనుకోవచ్చు. స్వభావంలోనూ, విధివిధానాల్లోనూ ఇవి ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అంశాలని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సరైన సమయంలో ప్రారంభిస్తామని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబరులో ప్రకటిస్తున్న సమయంలోనే  వివాహ చట్టాల్ని సవరించాలంటూ  వివిధ మహిళా సంఘాలు జాతీయ స్థాయిలో ఆందోళన సాగిస్తున్నాయి. ఆ మేరకు, అప్పటి కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మెయిలీ  వివాహ చట్టాల సవరణ బిల్లు _ 2010 ని రూపొందించి, పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వివాహ చట్ట సవరణ అంశాలు రెండూ గత మూడేళ్ళుగా జాతీయ రాజకీయాల్లో నలుగుతూనే వున్నాయి. యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, జులై 30న  ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకారం తెలుపగా,  ఆగస్టు 26న వివాహ చట్టాల (సవరణ) బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

తరచిచూస్తే ఈ రెండు అంశాల మధ్య అనేక పోలికలు కనిపిస్తాయి. వీటిల్లో, ఒకటి  రాష్ట్ర విభజనకాగా, మరొకటి దాంపత్య విభజన. రాష్ట్ర విభజనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పెద్ద ఎత్తున అందోళనలు జరిగాయి; జరుగుతున్నాయి. వివాహ సవరణ బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగానూ ఆందోళనలు జరిగాయిగానీ అవి అంత హడావిడి సృష్టించలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల్లో భావోద్వేగాలే బలంగా పనిచేయగా, వివాహ సవరణ బిల్లు ఆందోళనలో హేతుబధ్ధత ప్రధానంగా పనిచేసింది. చివరకు, రాష్ట్ర విభజన అంశంపై, ఇప్పటికి, పార్టీల స్థాయిలో మాత్రమే  నిర్ణయం జరగ్గా, వివాహ సవరణ బిల్లు రాజ్యసభ అమొదాన్ని కూడా పొంది చట్టంగా మారిపోయింది.

ఈ రెండు పరిణామాలను గమనిస్తే, మనకు రెండు అంశాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. రాజకీయ పొరాటంకన్నా, మహిళలు సాగించిన ఆందోళనే సత్వర ఫలితాలని సాధించిందనీ, మొదటిదానికన్నా రెండోది అనేక విధాలుగా శాస్త్రీయమైనదనీ!

దాంపత్య విభజన సమయంలోనో, ఆ తరువాతో భార్యకు భరణం ఇవ్వడం అనేది పాత సాంప్రదాయమే. భార్యకు భారీగా భరణాలు ఇవ్వాల్సివచ్చిన కేసులు కూడా అనేకం వున్నాయి. వివాహం తరువాత, దాంపత్య కాలంలో,  పెరిగిన స్థిర చరాస్తుల్లో భార్యకు సగం వాటా ఇవ్వాలని గతంలో కొన్ని న్యాయస్థానాలు తీర్పు చెప్పివున్నాయి.  కొత్త చట్టం మరో అడుగు ముందుకు వేసింది. వివాహానికి ముందే భర్తకు  వారసత్వంగా వచ్చిన  స్థిరాస్తిలోనూ భార్యకు వాటా ఇవ్వాలని కొత్త చట్టం నిర్దేశించింది. వివాహ చట్టాల్లో నిస్సందేహంగా ఇది గొప్ప ముందంజ. రాష్ట్రాల విభజనల్లోనూ ఇలాంటి విలువలు రావల్సిన అవసరం వుంది.  


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపియే సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ విభజనకు పచ్చ జెండా వూపినతరువాత,  తెలంగాణ ప్రాంతాంలో ఉత్సాహం, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో నైరాశ్యం కనిపించడంలో అసహజమైనదేదీలేదు. రాయలసీమ, తీరాంధ్ర ప్రజలు ఇప్పటికీ సమైక్యాంధ్ర నినాదమే చేస్తూ వుండడమే బాధాకరం. రాయలాంధ్రులు ప్రత్యామ్నాయాల గురించి హేతుబధ్ధంగా ఆలోచించాలి

సమైక్యాంధ్ర అనే నినాదంపై వివాదాన్ని పక్కన పెడితే, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో సాగుతున్న ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.   కర్నూలులో జరిగిన కార్యక్రమంలో లక్ష మందికి పైగా పాల్గొన్నారు. విజయవాడలో, అనంతపురంలో కూడా ఇలాంటి భారీ ప్రదర్శనలు జరిగాయి. ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బధం పెరిగినపుడు ఉద్యమకారులు ప్రజల మధ్యనే ప్రవాస జీవితం గడుపుతారు. ఉద్యమాల్లో చేసిన మోసాలు బయటపడి ప్రజలు తిరగబడినప్పుడు ప్రజాప్రతినిధులు పలాయన జీవితం గడుపుతారు. ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్నది ఇదే! ఇన్నాళ్ళు సీట్లు, ఓట్ల ప్యాకేజీ రాజకీయాలు జరిపినవాళ్ళు ప్రస్తుతం ప్రజలకు భయపడి ఢిల్లీలో శరణర్ధులుగా వున్నారు. సాంప్రదాయక నాయకులు ఇప్పుడు సీమాంధ్రలోలేరు. సాంప్రదాయేతర ఆలోచనాపరులు చెప్పే మాటల్నీ వినే స్థితిలో  అక్కడి ప్రజలు లేరు. ఇదో నిస్పృహ విన్యాసం!

నీళ్లు, నిధులు, నియామకాల సమస్య గురించి రాయలాంధ్ర ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రతి మాటా అక్షరాలా నిజం. దానికి సమైక్యాంధ్రా యే పరిష్కారం అనడమే అమాయికంగా వుంది.  రోగం వాస్తవం. మందు బూటకం.

సీమాంధ్రులకు ఈ గోసాయి చిట్కాలను అక్కడి నాటు వైద్యులు అలవాటు చేశారు. 2009 లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ఆరంభిస్తున్నట్టు ప్రకటించినప్పుడు, సీమాంధ్రులు  అప్రమత్తం అయివుండాల్సింది. విభజనని ఆమోదించడానికి తమ షరతులను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి, వాటి సాధన కోసం ఈ నాలుగేళ్ళూ పొరాడి వుండాల్సింది. కానీ, అలా జరగలేదు. "చావుకు పెడితే లంఖణానికి దిగివస్తాడు" అన్నట్టు, "సమైక్యాంధ్రా అంటే కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి మన కోరికలన్నీ నేరవేరుస్తుంది" అని అక్కడి నాటు వైద్యులు నూరిపోశారు. భూతవైద్యులకు అలవాటు పడినవాళ్లకు ఆధునిక మానసిక వైద్య నిపుణులు ఆనరుకదా!

  మహమ్మారి జబ్బులకు ఎక్కువ రోజులు గోసాయి చిట్కాలు వాడితే, జబ్బు ముదిరి ప్రాణహాని ప్రమాదం ముంచుకు రావచ్చు.

ప్రస్తుతం, రాయలాంధ్రలో సాగుతున్న ఆందోళనను గమనిస్తే, తీరాంధ్ర వాళ్లకన్నా రాయలసీమవాళ్ళు వివేకాన్ని ప్రదర్శిస్తున్నారనిపిస్తోంది. రాయలసీమవాళ్ళ దగ్గర ప్లాన్_బీ, ప్లాన్_సీ, ప్లాన్_డీ లు కూడా వున్నట్టు కనిపిస్తోంది. మొదటిది, వాళ్ళు రాష్ట్రాన్ని సమైక్యాంగా వుంచాలని కోరుతున్నారు. రెండోది, రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటున్నారు. మూడోది, రాష్ట్ర విభజన తప్పదనుకుంటే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు. నాలుగోది, ఒకవేళ రాయలసీమను తీరాంధ్రతో కలిపి రాయలాంధ్ర చేయాలనుకుంటే, రాయలసీమకు రాజధాని నగరం ఇవ్వడంతోపాటూ, నికరజలాల వ్యవహారం తేల్చాలి అంటున్నారు.

విషాదం ఏమంటే తీరాంధ్రుల దగ్గర ప్లాన్ _వన్ తప్ప మరేదీలేదు. సాక్షాత్తు శ్రీరాముడు అంతటివాడే అంబులపొదిలో పది బాణాలు పెట్టుకుని యుధ్ధానికి వెళ్ళినట్టు చదువుకున్నవాళ్లకు, ఉద్యమానికి నాలుగు ఆప్షన్లన్నా వుండాలనే ఇంగితం లేకపోవడం అన్యాయం. ప్రస్తుతం రాయలసీమ ప్రజలు చేస్తున్న వాదనలు వంటివి రేపు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చేయవచ్చు.

ఇప్పుడు, రాయలసీమ, తీరాంధ్ర ప్రజలు చేయాల్సింది ఏమంటే, సమైక్యాంధ్ర చిట్కాని పక్కనపెట్టి, ప్రత్యామ్నాయాలను రూపొందించాలి. సిడబ్ల్యూసి ప్రకటన వచ్చాక, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు  ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ఒకదాన్ని ప్రతిపాదించారు. తరువాత ఎందుకో వారు మౌనంగా వుండిపోయారు. తెలుగుదేశం అధినేత చేసే ఇతర వివాదాస్పద వ్యాఖ్యల్ని అలావుంచినా, నిజానికి ఈ ప్యాకేజి  కొంచెం ఆచరణాత్మకమైనదే!  దాన్ని సాధించడానికి కేంద్రం మీద వత్తిడి తేవాలి.  ఆ ప్యాకేజీలో, అవసరాన్నిబట్టి, ఇతర అంశాల్ని కూడా చేర్చవచ్చు, రాష్ట్రాన్ని సమైక్యాంగా వుంచాలనే మాటతప్ప!

కుప్ప తగలబడి ఒకరు ఏడుస్తుంటే, పేలాలు ఏరుకుని ఆనందించేవాళ్ళు మరొకరుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇరుప్రాంతాల ప్రజలు తీవ్ర భావోద్వేగాల్లో మునిగివున్న సందర్భాన్ని చూసుకుని, ఎగువనవున్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు కృష్ణాజలాల హైజాక్ కు వలలు పన్నుతున్నాయి. కృష్ణా జలాల ట్రిబ్యునల్_2 గా పిలిచే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ముందు ఆ రెండు రాష్ట్రాలు వింతపోకడలు పోతున్నాయి.

గతంలో బచావత్ ట్రిబ్యూనల్ కృష్ణా నికర జలాలను చివరి చుక్జ్క వరకు మూడు రాష్ట్రాలకు పంచేసి, మిగులు జలాలను వినియోగించుకునే సౌకర్యాన్ని దిగివ రాష్ట్రమైన  ఆంధ్రప్రదేశ్ కు వదిలేసింది. ఈ మిగులు జలాల ఆధారంగానే, గత రేండు దశాబ్దాల్లో మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.  ఇప్పుడు మిగులు జలాల్లో తమకూ వాటలు కావాలని ఎగువ రాష్ట్రాలు వాదించడం కొత్త పరిణామం. దాని కోసం అవి ఎంచుకున్న సమయం మరీ అమానవీయం!

మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాదనలు ఏ స్థాయికి చేరాయంటే, రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపును అవి అడ్డంగా నిరాకరిస్తున్నాయి. రాయలసీమలో కృష్ణా ఆరగాణి ప్రాంతం (క్యాచ్ మెంట్ ఏరియా) లేనందువల్ల కృష్ణాజలాల్లో రాయలసీమకు వాటాలేదని వాదిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్ లోకన్నా తమ రాష్ట్రాల్లో కరువు ఎక్కువగా వుందికనుక, గతంలో, ఆంధ్రప్రదెశ్ కు కేటాయించిన నికరజలాల్ని తగ్గించి, వాటిని తమకు కేటాయించాలని వింతవాదనని ముందుకు తెచ్చాయి. "నికర జలాలైనా, మిగులు జలాలైనా మా అవసరాలన్నీ తీరిన తర్వాతే కిందకు వదులుతాం" అని ఆ రెండు రాష్ట్రాలు ఆగస్టు 27న ట్రిబ్యూనల్ ముందే తెగేసి చెప్పాయి.

సచివాలయంతో సబంధం వున్నవాళ్ళను ఎవర్ని అడిగినా 1982లో ఏడు నెలలు పాలించిన భవనం వెంకట్రామ్ ది అత్యంత బలహీన ప్రభుత్వం అని అంటారు. కానీ, అది నిజం కాదనిపిస్తోంది. భవనం వెంకట్రామ్ ప్రభుత్వంకన్నా బలహీనమైన ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు రాష్ట్రంలో  చూస్తున్నాం. హైదరాబాద్ లో మన ప్రభుత్వం పనిచేస్తున్న తీరు చూశాక, ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యూనల్ ముందు మన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఏపాటి వాదన వినిపించివుంటారో ఊహించడం కష్టంకాదు.

మనం ఇప్పుడు అన్నవస్త్రాల గురించి ఆరాటపడుతున్నాం. ఎగువరాష్ట్రాలు వున్న వస్త్రాలనే ఎత్తుకుపోయే పనిలో వున్నాయి! తెలంగాణ, తీరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఇప్పుడు ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించాల్సి వుంది. మూడు ప్రాంతాలూ సమైక్యంగా ఎగువరాష్ట్రాలపై నీటి యుధ్ధం చేయాల్సిన తరుణం వచ్చేసింది. దాయాదుల పోరు ఆ తరువాత కూడా కొనసాగించవచ్చు!!

(ఈ వ్యాసకర్త రాష్ట్ర విభజనను సంపూర్ణగా సమర్ధిస్తాడు. పంపకాల్లో, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలకు న్యాయం చేయడానికీ మరింతగా కృషి చేస్తాడు.)

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ ః 90102 34336

హైదరాబాద్‌
30 ఆగస్టు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక 1 సెప్టెంబరు 2013