Friday 26 August 2016

ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు

ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

-        డానీ
1     18.  ముస్లిం సమాజంలో సంస్కరణలు

       భారత  ముస్లిం సమాజంలో సంస్కరణలు జరగలేదనీ, అందువల్లే ఆ సమూహం సంస్కారహీనంగా వుంటున్నదనే అపోహలు బలంగా ప్రచారంలో వున్నాయి. ఈ అపోహలకు ప్రభావితులైన ముస్లిం ఆలోచనారులు కూడా లేకపోలేదు.  

ముస్లిం సమాజానికి సంబంధించి ప్రచారంలో వున్న అపోహల్ని నిగ్గు తేల్చే ముందు  సంస్కరణలకున్న పరిధీ పరిమితుల్ని అర్ధం చేసుకోవడం అవసరం. సంస్కరణలనేవి మొత్తం సమాజపు మార్పు అనే అభిప్రాయం చాలామందిలో చాలాకాలం వుండేది. పివీ నరసింహారావు- మన్మోహన్ సింగ్ లు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల పుణ్యాన సంస్కరణల సంకుచితత్వం అందరికీ బోధపడింది.

సంస్కరణలు, అధికారమార్పిడి, ఉద్యమాలు, విప్లవాలు  ఒకటికాదు. సమాజంలో వస్తున్న కొత్త ధోరణులకు అనుగుణంగా పెత్తందారీవర్గాలు అంతర్గతంగా స్వీయమార్పులు (స్ట్రక్చరల్ ఎడ్జస్ట్ మెంట్స్)  చేసుకోవడం సంస్కరణ. ఒక పెత్తందారీవర్గం ఇంకో పెత్తందారీవర్గాన్ని తప్పించి పాలన చేయడం  అధికార మార్పిడి. అణగారినవర్గాలు తమ కనీసపు హక్కుల్ని సాధించుకోవడం ఉద్యమం. అణగారినవర్గాలు ఏకమై పెత్తందారీవర్గాల్ని కూలదోసి తామే అధికారాన్ని చేపట్టడం విప్లవం. అధికార స్థానంలో పెద్దగా మార్పులు లేకుండానే కొత్త అవసరాలకు అనుగుణంగా పరిమాణాత్మక మార్పులు చేసుకోవడమే  సంస్కరణలు. అధికార స్థానాన్ని తలకిందులు చేసి గుణాత్మక మార్పును సాధించడమే ఉద్యమం,  విప్లవం.  ఎప్పుడయినాసరే సంస్కరణలు అనేవి పాలకవర్గాల వ్యవహారం. ఉద్యమాలు, విప్లవాలు అనేవి ప్రజల వ్యవహారం.

19వ శతాబ్దపు చివరి ఘట్టంలో మారుతున్న సమాజ వాతావరణానికి అనుగుణంగా, తమనుతాము సంస్కరించుకోవాల్సిన అవసరాన్ని బ్రాహ్మణ సామాజికవర్గం గుర్తించింది. సతీసహగమనం రద్దు, విధవా స్త్రీ పునర్ వివాహం వంటి సంస్కరణలు అలా వచ్చినవే.  

రాజా రామ మోహన రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలు ముస్లిం సమాజంలో ఎందుకు పుట్టలేదు అని కొందరు గడుసుగా అడుగుతుంటారు. అడగాల్సిన  ప్రశ్న అది కాదు. అసలు రాజా రామ మోహన రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు ముస్లిం సమాజంలో పుట్టాల్సిన అవసరం ఏ మొచ్చిందీ? అని.

రాజారామ్మోహన రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు సామాజికరంగంలో మహత్తరమైన పాత్రను పోషించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ అక్కరలేరు. వాళ్ళను అందరూ గౌరవించాల్సిందే. అయితే, వాళ్ళను భారతదేశపు సంఘసంస్కర్తలుగానో, ఆంధ్రదేశపు సంఘసంస్కర్తలుగానో  పేర్కొనడం అతివ్యాప్తిదోషం. ఇందులో రెండు పరిమితులున్నాయి. వాళ్ళు ఒక మత సామాజిక సమూహపు ఆచారాలను సంస్కరించారు. ఆ మత సమూహంలోనూ అతి తక్కువ జనాభాగల ఒకటి రెండు సామాజికవర్గాలకే వారి సంస్కరణలు పరిమితం.  వీరేశలింగం జరిపిన విధవాస్త్రీ పునర్ వివాహాలు కూడా బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణ సామాజికవర్గాలకు పరిమితమైన సంస్కరణ.  

ఆలోచనాపరులకు ఇక్కడ మరికొన్ని సందేహాలు రావాలి. బ్రాహ్మణ, వైశ్యేతర  సామాజికవర్గాల్లో సతీ సహగమనాన్నీ రూపుమాపిందెవరూ? విధవాస్త్రీ పునర్ వివాహాల్ని ప్రోత్సహించిందెవరూ? అనేవి ఆ సందేహాలు. వాటికి రెండు రకాల సమాధానాలు వుంటాయి. ఆ సామాజికవర్గాల సంస్కర్తల పేర్లు చరిత్రలో నమోదు కాలేదు అనేది ఒక సమాధానం అయితే, మిగిలిన సామాజికవర్గాల్లో అసలు ఆ దురాచారాలే  లేవనేది ఇంకో సమాధానం అవుతుంది. దురాచారమే లేనపుడు సంఘసంస్కర్త దేనికీ?  ఈ నియమం ముస్లిం సమాజానికి కూడా వర్తిస్తుంది.

సతీసహగమనం అనేది ముస్లిం సమాజంలో ఎన్నడూ లేదు. ముస్లిం వివాహ వ్యవస్థ ఒక ఒప్పంద స్వభావాన్ని (Contractual) కలిగివుంది కనుక  పురుషులేకాక స్త్రీలు సహితం విడాకులు పొందే సౌకర్యం, విధవా లేదా విడాకులుపొందిన స్త్రీల పునర్వివాహం దాని సాంప్రదాయంలో సహజంగానే వున్నాయి. అందువల్ల 19-20వ శతాబ్దాల్లో  హిందూ సమాజంలో మొదలయిన తొలి సంస్కరణలతో ముస్లిం సమాజానికి ఏమాత్రం పని లేకుండాపోయింది.  హిందూకోడ్ బిల్లు, విడాకుల చట్టం, మహిళలకు ఆస్తి హక్కు తేవడానికి జవహర్ లాల్ నెహ్రూ, శ్యాం ప్రసాద్ ముఖర్జీలతో 1950లలో అంబేడ్కర్ సాగించిన ముక్కోణపు పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకోండి. నిజానికి ముస్లిం సమాజం ఆ సంస్కరణలకన్నా అనేక అడుగులు ముందేవుంది. నిజం చెప్పాలంటే వెయ్యి సంవత్సరాలు ముందువుంది.  కొన్ని ధార్మిక సమూహాల్లో కొన్ని సామాజికవర్గాల్ని ముట్టుకోరాదనే సాంప్రదాయం వేల సంవత్సరాలుగా వుంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. మనిషి అనేవాడు మహత్తరమైన జీవికనుక మనిషి తారసపడితే ఆలింగనం చేసుకోవాలనేది  ముస్లీం సామాజిక అనుబంధాల విధానం.

1875లో మొహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీని మొదలెట్టి దాన్ని అలిగడ్‍ ముస్లిం యూనివర్శిటీగా అభివృధ్ధి చేసి ఇంగ్లీషు చదువుకొమ్మని ముస్లిం సమాజానికి పిలుపు ఇచ్చిన  సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆధునిక భారత ముస్లింల సంఘసంస్కర్త. మనుషులకు తెలియని విషయాలని బోధించండి అనేది అలిగడ్‍ ముస్లిం యూనివర్శిటీ నినాదం. (అల్లమ్ అల్ ఇన్సాన మా లమ్ యా లమ్) దేశవిభజనవల్ల ముహమ్మదాలీ జిన్నా కీర్తి మసకబారిందిగానీ, ఆయన కూడా గొప్ప రాజకీయ నాయకుడేకాక గొప్ప సంఘసంస్కర్త కూడా. 

పితృస్వామిక వ్యవస్థే
సమాజంలోని ఇతర మత సమూహాల్లాగే ముస్లిం సమాజం సహితం పితృస్వామిక వ్యవస్థే. పితృస్వామిక వ్యవస్థలో స్త్రీల మీద ఏదో ఒక స్థాయిలో వివక్ష వుంటుంది. అది ముస్లిం సమాజంలోనూ వుంది. అయితే, సాపేక్షకంగా మిగిలిన మత సమూహాలకన్నా ముస్లిం సమాజంలో స్త్రీలకు మెరుగైన హక్కులున్నాయి. ముస్లిం స్త్రీలకు ఆస్తిహక్కు, ఇష్టప్రకారం పెళ్ళిచేసుకునే హక్కు, విడాకుల హక్కు మొదటి నుండీ వుంది.  ఈ హక్కుల్ని సాధించుకోవడానికి ఇతర  మత సమూహాలకు శతాబ్దాలుకాదు శహస్రాబ్దాలు పట్టింది. కొన్ని ధార్మిక సమూహాల్లో ఇటీవలి కాలం వరకు స్త్రీలు విద్యకు అనర్హులు. దైవ భాషను చదవ్రాదని వాళ్ల మీద ఆంక్షలున్నాయి. ముస్లిం సమాజంలోని స్త్రీల మీద అలాంటి ఆంక్షలు లేకపోగా దైవ భాషను నిర్బంధంగా చదవాలనే నియమాలున్నాయి.

8.            భారత ముస్లీం ఉద్యమాలు
భారత ముస్లింల అస్తిత్వవాదం బాబ్రీ మసీదు  విధ్వంసం తరువాత  వేగాన్ని పుంజుకుంది. అయితే భారత ముస్లింల అస్తిత్వ సమస్య దాదాపు నూట అరవై యేళ్ల క్రితమే ఆరంభం అయింది. ఆ క్రమాన్ని గురించి విస్తారంగా కాకపోయినా  స్థూలంగా అయినా ప్రస్తావించాల్సిన అవసరంవుంది.

భారత ముస్లీం సమాజంలోని అసంతృప్తికి కారణాలు వలసపాలనలో మరీ ముఖ్యంగా నాటి ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం ఓటమిలో వున్నాయి. అప్పటి నుండి భారత ముస్లిం సమాజం ఒక పరాజిత సమూహంగా బాహ్యాత్మక అణిచివేతను నిరంతరం ఎదుర్కొంటున్నది. భారత ముస్లిం అస్థిత్వవాదానికి ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం ఓటమి మొదటి దశ యితే, భారత ఉపఖండం విభజన రెండవదశ. బాబ్రీమసీద్ విధ్వంసం తరువాత మొదలయింది మూడోదశ.

రాజ్యాధికారాన్ని కోల్పోయిన క్షత్రీయులకు శూద్రస్థానం ఇవ్వాలని మనుస్మృతి పేర్కొంది. మనువు పేర్కొన్న శూద్రులు ఇప్పుడు ఆర్ధికంగా మెరుగైన స్థితిలో వున్నారు గనుక  భారత ముస్లీంలని అందరికన్నా దిగువన ఆరోవర్ణంగా మార్చే క్రమం ఒకటి కొనసాగుతోంది.

భారత ముస్లింవాదం అంటే పరాజితుల ఆవేదన అని అర్ధం చేసుకోవచ్చు.  ఆవిధంగా 1857కు కొంచెం అటూ ఇటూగానే భారత ముస్లీంల  అస్తిత్వ సమస్య ముందుకు వచ్చింది. దశలవారీగా అలలలలుగా  సాగిన  వహబ్బీ, ఫరైజీ, నీలిమందు, ఖిలాఫత్, మోప్లా  ఉద్యమాలు తొలిదశ భారత ముస్లీం అస్థిత్వవాదానికి ప్రతీకలే.

భారత ఉపఖండంలో తొలి అస్థిత్వవాద ప్రజాసమూహం ముస్లీంలే అన్నా అతిశయోక్తికాదు.  వలస ఉపఖండంలో అనేక సామాజికవర్గాలు బ్రిటీష్ పాలకులతో ఏదో ఒక స్థాయిలో రాజీ కుదుర్చుకుని లబ్దిపొందడానికి ప్రయత్నించినా ముస్లీంలు మాత్రం నిరంతరం ఎక్కడో ఒకచోట తిరుగుబాటుదార్లుగా వుండేవారు. “ముసల్నానులు ధార్మిక విశ్వాసాల మూలంగా బ్రిటీష్ మహరాణి మీద తిరుగుబాటు చేస్తున్నారా? లేక వాళ్ళ ఆర్ధిక స్థితిగతులు నిజంగానే బాగోలేవా?” అని 1871 మే 30 న అధికారిక సమావేశంలోనే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మేయో ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ అంశాల్ని తేల్చడానికి  ఏర్పడిందే విలియమ్ హంటర్  కమీషన్.  లార్డ్ రిప్పన్ కాలంలో హంటర్ తన నివేదికను సమర్పించాడు.  భారత సమాజంలో ముస్లిం సమూహాల ఆర్ధిక స్థితిగతులు చాలా దయనీయంగా వున్నాయనీ, వారి కోసం తక్షణం ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని హంటర్ కమీషన్   నివేదిక సమర్పించింది. 

హంటర్ సిఫార్సులు అనేక దశల్లో అనేక మార్పులకు లోనయ్యి చివరకు 1932లో రామ్సే మెక్ డోనాల్డ్ బ్రిటన్ ప్రధానిగా వున్న కాలంలో కమ్యూనల్ అవార్డుగా అమల్లోనికి వచ్చాయి. అలా విద్యా ఉపాధిరంగాల్లో తొలి సారిగా రిజర్వేషన్ పొందిన ప్రజాసమూహంగా ముస్లింలు ఆవిర్భవించారు. పంజాబ్ లో అయితే ముస్లీంలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఫలితంగా ముస్లీం సమాజంలో ఊర్ధ్వ చలనం మొదలయింది. ముస్లిం సమాజం మీద అప్పటి రిజర్వేషన్ల  ప్రభావాన్ని వుభయ పంజాబ్, వుభయ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికీ  చూడవచ్చు. అయితే భారత ముస్లింలు అలా సాధించుకున్న రిజర్వేషన్  సౌకర్యం 1950 జనవరి 26న రద్దు అయిన ఫలితంగా ముస్లీం సమాజంలో అధోచలనం మొదలయింది.   

నియత సంస్థలకు ఒక నిర్మాణం, సభ్యత్వాలు, కార్యవర్గాలు, ఆఫీసు బేరర్లు, కోరం, మహాసభలు, తీర్మానాలు వంటివి వుంటాయి. ఆ అర్ధంలో భారత ముస్లిం సమాజం ఒక నియత సంస్థకాదు. దానికి నిర్మాణంలేదు. అయితే, ప్రత్యర్ధి శిబిరాన్ని నిలువరించాల్సి వచ్చినపుడు మొత్తం భారత ముస్లీం సమాజం సమిష్టిగా వ్యవహరిస్తుంది. ఆమేరకు అది ఒక సంస్థే; గానీ అనియత సంస్థ. నియత సంస్థ కానప్పటికీ అది ఎంతటి ప్రభావశీలంగా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూస్తూనేవున్నాం.
9.            ముస్లిం సమాజంలో భాషావివక్ష
తాను తెలుగులో రాస్తుండడంవల్ల తన మాతృసమూహం తనను చిన్నచూపు చూస్తున్నదంటూ ముస్లిం సమాజంలో భాషా వివక్షను తెచ్చే ప్రయత్నం కూడా స్కైబాబా చేశారు. ఇదొక అందమైన అబధ్ధం. తాను విమర్శిస్తున్నవాళ్ళు, తనను విమర్శిస్తున్నవాళ్ళు  కూడా తెలుగు రచయితలేన్న నిజాన్ని ఆయన దాస్తారు; లేదా సమయానుకూలంగా  మరచిపోతారు.

ముస్లిం జమాతులన్నీ ఆంధ్రప్రదేశ్ లోనేగాక తెలంగాణలోనూ ఉర్దూలోనేగాక తెలుగులోనూ ధార్మిక ప్రచారాన్ని సాగిస్తున్నాయి. జమాతే ఇస్లామీ హింద్  నిర్వహిస్తున్న తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ చిన్న సంస్థేమీ కాదు.

స్కైబాబాకు లోకం తెలియకగానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ, బెంగాలీ ముస్లింలు వారి మాతృభాషలైన తమిళ, కన్నడ, మళయాళి, బెంగాలీ, భాషల్లోనే ధార్మిక విధుల్ని ఆచరిస్తారు. బ్రిటీష్ ముస్లీంల మాతృభాష ఇంగ్లీషు కనుక వాళ్ళు ఇంగ్లీషులోనే ఖుద్బా పసంగాలు చేస్తారు. ఖురాన్ కు ఇప్పుడు ఒక్క తెలుగులోనే పన్నెండు రకాల అనువాదాలు అందుబాటులో వున్నాయి. వాటికి గిరాకీ రోజురోజుకూ  పెరుగుతూ వుంది.

వాస్తవాలు ఇలావుండగా తెలుగు రాస్తున్నందుకు తనను చిన్నచూపు చూస్తున్నారనండంలో అర్ధం ఏమిటీ? సానుభూతి  పొందడానికి అంగవైకల్యాన్ని నటించే కపట బిచ్చగాళ్ల వ్యవహారం ఇది.

10.       ఎవరయినా ముస్లింవాదులు కావచ్చు    
 “విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్గా మారింది” అనేది వారు తరచుగా చేస్తున్న ఇంకో ఆరోపణ.  ఇందులో స్కైబాబా  వారి సహజమైన శైలిలో చిన్న ట్విస్టు చేశారు. ముస్లింల పక్షాన ముస్లీంలేకాదు ముస్లిమేతరులూ పోరాడవచ్చు, ముస్లింలకన్నా బలంగానూ ముస్లీంవాదం చేయవచ్చు. ముస్లింల పక్షాన ముస్లిమేతరులు నిలబడడం ఒక మహత్తర విషయం.

కక్షీదారుడికీ అతని పక్షాన వాదించేవాడికీ ఒకే ధార్మిక విశ్వాసం వుండాల్సిన పనిలేదు. బాలగంగాధర తిలక్ మీద పెట్టిన మూడవ రాజద్రోహం కేసును వాదించి ఆయన్ను నిర్దోషిగా బయటపడేసినవాడు  ముహమ్మదాలీ జిన్నా. వారిద్దరి ధార్మిక విశ్వాశాలు పరస్పర విరుధ్ధమైనవనేది అందరికి తెలిసిన విషయమే.

అలా తాను ముస్లిం కాకుండానే ముస్లింవాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళతానని స్కైబాబా అంటే ముస్లింసమాజం వారితో అలాయిబలాయి ఆడుతుంది. ఇక్కడ నిర్వచించాల్సింది ముస్లింవాదుల్నికాదు; ముస్లింలని. ముస్లింలు, ముస్లింసమాజం లేకుండా ముస్లింవాదం, ముస్లింవాదులు వుండరు.


11.       విద్యారంగంలో ముందంజ

గత ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ టాప్ ర్యాంకర్ ఒక దళిత మహిళకాగా, రెండవ స్థానం ఉగ్రవాదుల కార్యక్షేత్రమైన కాశ్మీర్ కు చెందిన  ఒక ముస్లిం యువకునిది. మూడవ స్థానం పంజాబ్ కు చెందిన  శిక్కు యువకునిది. భారత విద్యా వైజ్ఞానిక రంగాల్లో దళిత, మైనారిటీల ముందంజకి ఇది తాజా ఉదాహరణ. ముస్లిం అమ్మాయిలు హిజబ్ వేసుకునే వాణిజ్య విమానాలు నడుపుతున్నారనిగానీ (సయ్యదా సల్వా ఫాతిమా), వినూత్న పరిశోధనలతో (మన్షా ఫాతిమా) గూగుల్ సైన్స్ ఫెయిర్ లకు ఎన్నికవుతున్నారనిగాని స్కైబాబాకు తెలీదు.

ముస్లింలందరూ మత సంస్థల ప్రభావంలో వుంటారనీ, వాళ్లంతా తమ పిల్లల్ని మదరసా (ధార్మిక పాఠశాల)లకు పంపిస్తుంటారనీ సంఘ్ పరివారం ఒక దుష్ప్రచారాన్ని సాగిస్తూ వుంటుంది. స్కైబాబా కూడా భారత ముస్లిం సమాజం గురించి దాదాపు అలాంటి అభిప్రాయాన్నే ప్రచారం చేస్తుంటారు.  “పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూన్నారు”  అంటూ వాపోతారు. అలాంటి వాళ్ళను నాబోటివాళ్ళు సమర్ధిస్తున్నారంటూ తరచూ తప్పుడు సంకేతాలను ఇస్తుంటారు. నిజానికి విద్యారంగంలో ముస్లింలు సాధిస్తున్న విజయాల గురించి  ఇంతకు ముందు పేర్కొన్న సంఘటనల వెనుక ముస్లీం ధార్మిక సంస్థల ప్రోత్సాహం వున్నట్టు స్కైబాబాకు తెలిసినట్టులేదు. రక్తహీనతలా  సమాచారహీనత కూడా ఒక జబ్బే. 



12.       ముస్లింలు వెనకబడలేదు అణిచివేయబడ్డారు  
భారత ముస్లిం సమాజం అనేక రంగాల్లో వెనుకబడివున్నదన్నది వాస్తవం. అయితే, అది స్కైబాబా చెపుతున్నట్టు అంతర్గత కారణాలవల్లకాదు; దాదాపు నూట అరవై సంవత్సరాల బాహ్యాత్మక అణిచివేత ఫలితం. వాళ్ళు ముందంజ వేయలేదు అనడంకన్నా ప్రధాన స్రవంతి వాళ్లను ముందంజ వేయనివ్వలేదు అనడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది. 

 నిజాం సంస్థానంలో ఉర్దూ అధికార భాషగా వున్న కాలంలో ఉస్మానియా యూనివర్శిటీ ఉద్రూ యూనివర్శిటీగా పేరుగాంచింది.  హైదరాబాద్ నిండా ఇప్పుడు ఇంగ్లీషు కోచింగ్ సెంటర్లు వున్నట్టు అప్పట్లో ఉర్దూ కోచింగ్ సెంటర్లు వుండేవి. ముస్లిం స్త్రీల అక్షరాశ్యత శాతం ఇప్పటి కేరళ రాష్ట్రం కన్నా మెరుగ్గా వుండేది. ఉర్దూను తప్పించి ఇంగ్లీషు, తెలుగుల్ని రాజభాషలుగా  ప్రవేశపెట్టడంతో రాత్రికి రాత్రి వాళ్ళు ‘నిరక్షరాశ్యులు’ అయిపోయారు. ఈ పరిణామాలపై అమెరికా తత్త్వవేత్త  మార్థా నస్ బామ్ ఒక విశ్లేషనాత్మక వ్యాసం రాశారు. స్కైబాబా అంతర్గత నిరక్షరాశ్యతను విమర్శిస్తారుగానీ బాహ్యాత్మక అణిచివేతను వదిలేస్తారు. అక్కడే వారితో వివాదం వస్తుంది. ఒకనాడు విద్యాలవాడగా విలసిల్లిన హైదరాబాద్ పాత బస్తీ ఇప్పుడు నిరక్షరాశ్యుల వాడగా శిధిలమైపోవడానికి కారణాలను వెదకాల్సిన సమయం ఇది. జో లోగ్  దూద్ సే జల్ జాతే హై వో ఛాంచ్ కో భీ ఫూంక్ ఫూంక్ కర్‍ పీతే హై!


13.           పేదవాళ్ళు కావడంవల్ల చదువుకొనలేరు


ముస్లిం సమాజంలో పేదవాళ్ళే అత్యధికులు అయినప్పటికీ  మధ్యతరగతియేగాక సంపన్న వర్గం కూడా వుంటుంది. ముస్లిం సంపన్నవర్గానికి ఎలాగూ స్వంత ఖర్చులతో పెద్ద చదువులేగాక విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా వుంటుంది. ముస్లిం మధ్యతరగతి కూడా కొంచెం కష్టపడైనా దేశీ చదువులు, ఇంకొంచెం కష్టపడి విదేశీ చదువులు సాధిస్తుంది.  ముస్లిం పేదవర్గాలు ఇతర మత సమూహాల పేదవర్గాలకన్నా ఆర్ధికంగా వెనుకబడి వున్నాయి. (ఈ అంశం మీద ఇప్పటికే అనేక వున్నతస్థాయి కమిటీలు నివేదికలు ఇచ్చాయి.)


ఉచిత విద్యా సౌకర్యం కల్పించినా కొన్ని పేద ముస్లిం కుటుంబాలు పిల్లల్ని స్కూళ్ళకు పంపలేని స్థితిలో వుంటాయి. వాళ్ళు తమ పిల్లల్ని చిన్న వయస్సులోనే పనులకు పంపుతుంటారు. పేద ముస్లిం పిల్లలకు లకు ఉచిత విద్య ఇస్తామన్నా సరిపోదు.  వాళ్ళ తల్లి దండ్రులకు ప్రభుత్వం కొంచెం  నష్టపరిహారం చెల్లించాలి.

ముస్లిం సంపన్నుల్లో కొందరు మైనారిటీ విద్యాసంస్థల్ని నిర్వహిస్తుంటారు.  లాభాపేక్ష వున్నప్పటికీ స్వజాతికి అధునిక విద్యను అందివ్వాలనేది ఈ సంస్థల లక్ష్యం. రంజాన్ నెలలో జకాత్ ద్వార, బక్రీద్ సందర్భంగా పశువుల తోళ్ళ దానం ద్వారా వచ్చిన నిధుల్ని ముస్లిం సమాజంలో విద్యావ్యాప్తికి దోహదం చేయడానికి కృషిచేసే ధార్మిక సంస్థలున్నాయి. పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చిన ముస్లిం విద్యార్ధులకు ఇంటర్ మీడియట్ లో ప్రోత్సాహకాలు అందించే ధార్మిక  సంస్థలున్నాయి. ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చిన వారిని జనరల్ కోటాలో సీట్లు పోందమనీ, తద్వార తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ముస్లిం కోటాలో సీట్లు సర్దుబాటు చేసే సంస్థలూ కొన్నున్నాయి.

ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివే ముస్లిం విద్యార్ధులకు ప్రోత్సాహకా;లు అందించే ధార్మిక  సంస్థలు కొన్నున్నాయి. జర్నలిజం తదితర వృత్తి విద్యా కోర్సులు చదివే ముస్లిం యువతీ యువకులకు  శిక్షణ అందించే ధార్మిక  సంస్థలు కొన్నున్నాయి. విమానం పైలట్, క్రీడలు  వంటి విశేష వృత్తుల్లో రాణించాలనుకునేవాళ్లకు ప్రోత్సాహకా;లు అందించే ధార్మిక  సంస్థలు కొన్నున్నాయి. ధార్మిక సంస్థలు నడిపే కొన్ని వృత్తివిద్యా శిక్షణా కేంద్రాల్లో ఈ వ్యాస రచయిత  లాంటివాళ్ళు ముస్లిం యువతీ యువకులకు శిక్షణ ఇస్తుంటారు. మొన్నటి వరకు జర్నలిజంలో శిక్షణ ఇచ్చిన ఆ ధార్మిక సంస్థలు ఇటీవల డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ లోనూ శిక్షణఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది.

ముస్లిం సమాజంలోని ఆనాధలు, అర్ధఅనాధలు, మరీ నిరుపేదల్ని చేరదీసి ధార్మిక విద్య నేర్పించే వ్యవస్థలూ వున్నాయి. వీటినే మదరసాలు అంటారు. అవి ఒక విధంగా అనాధాశ్రమాలు. సమాజంలోని అనాధలందరూ అక్కడికి చేరరుగానీ అక్కడ చేరేవాళ్లలో అత్యధికులు అనాధలు.

ముస్లిం విద్యాసంస్థలు తరచూ ధార్మిక గురువుల్ని ఆహ్వానించి భవనాల ఆవిష్కరణలు చేయించి గౌరవించుకుంటాయి.  అలాంటి సందర్భాల్లో ఆ ధార్మిక గురువులు ముస్లిం విద్యాసంస్థలు చేస్తున్న కృషిని మెచ్చుకుంటూనే ముస్లింలు ఇహలోక విజ్ఞానం మీద చూపుతున్న శ్రధ్ధను పరలోక జ్ఞానం మీద కూడా చూపాలని బోధ చేస్తుంటారు. ఇదొక లాంఛనపు వ్యవహారం. 

ఏ మత సమూహంలో అయినా ధార్మిక సంస్థలన్నీ పరలోకం గురించే ప్రచారం చేస్తాయి. అంతేతప్ప టెక్నికల్ సెమినార్లు పెట్టి గుండెమార్పిడి ఆపరేషన్ ఎలా చేయాలో, క్రయోజనిక్ విమాన ఇంజన్లని ఎలా తయారు చేయాలో వివరించవు.

ఇహలోక (దునియా తాలీమ్) వ్యామోహంలో పడిపోయి పరలోక (దీనీ తాలీమ్) భక్తి విశ్వాసాల్ని మరచిపోతున్నారని ధార్మిక సంస్ద్థలు  ఆవేదనను వ్యక్తం చేస్తుంటాయి. ప్రసవవైరాగ్యం, శ్మశానవైరాగ్యం లాగ అదొక లాంఛనం. స్వామీజీలు, ముల్లాల మాటల్ని విని చదువులు మానేసేవాళ్ళు దాదాపు ఎవరూ వుండరు. కమ్యూనిస్టులు కూడా బానిస విద్యా విధానం అంటూ నియత విద్యను తిట్టిపోస్తుంటారు. దాని అర్ధం వాళ్ళు ఆధునిక విద్యను అభ్యసించరనికాదు.

స్కైబాబాకు స్వీయ సమాజమూ తెలీదు, బయటి సమాజమూ తెలీదు.  ఆ అవగాహనాలేమితో  వారు   ముస్లీంలు చదువుకోకుండా ధార్మిక గురువులు అడ్డుపడుతున్నారని ఒక వ్యాసం రాస్తారు. అది అవాస్తవమనీ, అసందర్భమనీ  కొందరు  మందలిస్తారు. తాను ముస్లింలకు ఆధునిక విద్యను అందించాలని కృషి చేస్తుంటే వాళ్ళంతా అడ్దంపడుతున్నారని వారు ఇంకో అబధ్ధాన్ని ప్రచారంలో పెడతారు.


వారు అంతటితో ఆగరు. చంద్రముఖీ సినిమాలో జ్యోతిక పాత్ర తను చంద్రముఖీ అని భ్రమించినట్టు స్కైబాబా తాను రాజా రామ్మోహన రాయ్, కందుకూరి వేరేశలింగం పంతులూ, ఆంబేడ్కర్, చే గువేరా వగయిరా వగయిరాలుగా భ్రమిస్తుంటారు. ఇదో రకం మానసిక వ్యాధి.

నిజానికి కొన్ని వందల ధార్మికసంస్థలు ముస్లిం సమాజానికి ఆధునిక విద్యను అందించడానికి చేస్తున్న కృషిని తన ఖాతాలో వేసుకునే కుటిల  ప్రయత్నం చేస్తారాయన. గావ్ కా మిఠీ దుకాన్ పర్ దాదా కా ఫాతెహా అనే సామెత వుంది. ఊరి మిఠాయి దుకాణం ముందు నిలబడి  ఒకడు ఈ ప్రసాదం తాతకు అర్పితం అన్నాడట. స్కైబాబా ఆ జాతి మనిషి.

ప్రభుత్వపరంగా సహకారంవున్నాలేకున్నా స్వఛందంగా ముస్లిం సమాజంలో ఆధునిక విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషిచేస్తున ధార్మికసంస్థలు అనేకం వున్నాయి. కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ఇప్పుడు పది ముస్లిం మైనారిటీ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి.  మెడికల్, లా, బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్, ఫార్మసీ కాలేజీలు మరోపది వున్నాయి. సుల్తాన్ ఉల్ ఉలూమ్ సొసైటీ నిర్వహిస్తున్న ముఫ్ఫఖమ్ ఝా ఇంజినీరింగ్ కాలేజి (MJCET) విద్యాప్రమాణలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇవిగాక వృత్తి విద్యాకోర్సుల్లోనూ శిక్షణ ఇస్తున్న సంస్థలు కూడా వున్నాయి..

స్కైబాబాకు ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలీదు. ఏ మత సామాజికవర్గాల్లో అయినాసరే  ధనికవర్గం విద్యను కొనుక్కుంటుంది. మధ్యరగతివర్గం విద్యను అందుకుంటుంది. ప్రభుత్వ ఉద్దీపనచర్యలున్నవర్గం విద్యను పొందుతుంది.  ఈ మూడు సౌకర్యాలు లేని పేదజనం ఆధునిక విద్యను అందుకోలేరు.  దీనికి మతంతో పనిలేదు. అన్ని మతాల్లోనూ జరిగేది ఇదే.  మనుషులు చదువుకోకపోవడంవల్ల పేదవాళ్ళు  అవ్వరు;  వాళ్ళు పేదవాళ్ళు కావడంవల్ల చదువుకొనలేరు. ఆరోగ్యమే మహాభాగ్యం కాదు; మహాభాగ్యమే ఆరోగ్యం! ఆధునిక విధ్యను అందుకోవాలంటే ఇప్పుడు  ముస్లింలకు తగిన ఆస్థి అయినా వుండాలి; లేకుంటే ప్రభుత్వం ఉద్దీపనచర్యల్నైనా చేపట్టాలి. . స్కైబాబా ఆ దిశగా ఆలోచించాలి.

ముస్లింలకు ఆధునిక విద్యను అందించడానికి ఇంత భారీ ఎత్తున సాగుతున్న మహాయాగంలో స్కైబాబా ఎక్కడా లేరు. వుండరు. వారికి అక్కడ పరిచయం కాదుకదా ప్రవేశం కూడా లేదు. 


7.            అవిశ్వాసులు - కాఫిర్లు
విశ్వాసుల పక్షం వహించి స్కైబాబా రాసిన మరోవాక్యం “(ముస్లిం) శవంపై కాఫిర్ నీడ పడకూడదనే  (జమాత్ పెద్దల) తీవ్రవాదనలు (విశ్వాసుల్ని) మరింత ఇబ్బంది పెడుతున్నాయి” అనేది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యను ఉటంకిస్తున్నపుడు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో ఏ ఉద్దేశ్యంతో అన్నారో  చెప్పడం ఒక మేధో మర్యాద.  వారికి మేధస్సూ లేదు; మర్యాదలు తెలీవు. 

సంస్థల పనితీరు గురించి వారికి కనీస అవగాహన లేదు.  సమాజంలో ఏ సంస్థ అయినా ఒక నిర్దిష్ట ప్రజాసమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ వుంటుంది. ఆమేరకు దానికి వ్యతిరేకంగా మరో నిర్దిష్ట ప్రజాసమూహం కూడా తప్పక వుంటుంది. అసలు ప్రత్యర్ధి ప్రజాసమూహం అనేదే లేకపోతే సమాజంలో ఒక కొత్త సంస్థను పెట్టాల్సిన అవసరమేరాదు. ప్రత్యర్ధి ప్రజాసమూహాలు కల్పించే అడ్దంకుల్ని అధిగమించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాసమూహాల ఆశల్ని నెరవేర్చడమే ఏ సంస్థకు అయినా అంతిమ లక్ష్యంగా వుంటుంది.

కమ్యూనిస్టుసభల్లో  పెట్టుబడిదారుల్నీ,   దళిసభల్లో పెత్తందారీకులాలనీ,  స్త్రీవాద సభల్లో పురుషుల్నీ, తెలంగాణవాద సభల్లో  ఆంధ్రా ప్రాంతంవారిని విమర్శించినట్టు ముస్లీం జమాత్ సభల్లో  అవిశ్వాసుల్ని విమర్శిస్తుంటారు. సభ ఎవరిది అయినా జరిగే తీరు ఒక్కటే. ఇవన్నీ  గ్రాండ్ నేరేటివ్స్. సూర్యుడు తూర్పున ఉదయించినట్టు సాగే తధ్ధర్మక్రియ. అన్నిచోట్లా జరిగేదానిని పట్టుకుని కేవలం ఒక్క సమూహానికే అంటగట్టడం అర్ధసత్యం. అది అసత్యంకన్నా ఏమాత్రం తక్కువకాదు. 

ఇస్లాం విస్తరణ మతం. ముస్లిం సమాజం నిరంతరం తననుతాను కాపాడుకుంటూ ఇతరుల్ని ఆకర్షించే ప్రయత్నంలో వుంటుంది. ఆ క్రమంలో అది కొత్తగా ఆకర్షించేది అవిశ్వాసుల్నే. అంచేత, అవిశ్వాసుల గురించి ఇంత తీవ్రమైన వ్యాఖ్యల్ని జమాత్ లు చేయవు. ఒకవేళ ఎవయినా అతిశయంతో ఇలాంటి వ్యాఖ్యలు  చేసినా  నిస్సందేహంగా అది తప్పే. దాన్ని ఖండించి తీరాల్సిందే. 

ఇస్లాం నిఘంటువు ప్రకారం అల్లాను విశ్వసించేవారు విశ్వాసులు; అంటే ముస్లింలు. అలా విశ్వసించనివారు అవిశ్వాసులు. అవిశ్వాసుల్లోనూ రకాలు, దశలు వుంటాయి. అల్లాను తిరస్కరించేవారు  కాఫిర్లు. అల్లాతో పాటు ఇతర దేవుళ్ళను కూడా పూజించేవారు  ముష్రిక్కులు.   అల్లాను విశ్వసిస్తున్నట్టు నటించేవారు  మునాఫిక్కులు అంటే కపటులు. 

కాఫిర్ల గురించి ఖురాన్ లో   ‘అల్ కాఫిరూన్’ అనే సూరా వుంది. “మేము విశ్వసించే వాటిని మీరు విశ్వసించరు/ మీరు విశ్వసించేవాటిని మేము విశ్వసించము/  మేము ఆరాధించేవాడిని మీరు ఆరాధించరు / మీరు ఆరాధీంచే వాటిని మేమూ ఆరాధించము/ మీ మతం మీది; మా మతం మాది” అనే అర్ధంలో ఆ సూరా వుంటుంది.  ఇస్లామిక్ మతసామరస్యవాదానికి  నిరూపణగా చాలామంది ఈ సూరాను ఉటంకిస్తుంటారు. నేరుగా ఖురాన్ లోనే ప్రస్తావన వున్నప్పుడు  కాఫిర్ల గురించి ఇంతకు మించిన విధాన ప్రకటన  ముస్లిం సమాజానికి  మరొకటి వుండదు.

స్కైబాబాతో వచ్చే సమస్య ఏమిటంటే కాఫిర్లు, ఇస్లామీయత, ముస్లిమీయత, ఫాతెహాలు, దర్గాలు, ఖబరస్తాన్లు, పీర్ల పండగ వంటి ధార్మిక అంశాల మీద ఆయనే  చర్చను మొదలెడతారు. వారు ఎంచుకునే వేదికలు కూడా తరచూ ముస్లిం సమాజానికి బయట వుంటాయి. తద్వార ముస్లిం సమాజం మీద ఇప్పటికే వున్న అపోహల్ని వారి చర్యలు మరింత  పెంచుతాయి. నిజానికి ఈ అంశాల మీద ఆయనకు అవగాహనకన్నా అజ్ఞానమే ఎక్కువ. వాటిని సరిదిద్దడానికి పూనుకున్నవాళ్ళు అనివార్యంగా ధార్మిక సూత్రాలను ఉటంకించక తప్పని స్థితిని ఆయనే కల్పిస్తారు. ఒకవేళ ఎవరయినా అలా ఉటంకిస్తే “మొత్తంగా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు” అని వారే గగ్గోలు పెడతారు. వారు ఒక కపటి.

ఎక్కడో ఒక జమాత్ కు చెందిన ఒకానొకాయన అతిశయంతోనో, ఆవేశంతోనో ఒక మాట అన్నారే అనుకుందాం. దానివల్ల రెండు మత సమూహాల మధ్య దూరం పెరుగుతున్నదంటూ బాధపడుతున్న  స్కైబాబా మాటల్ని కూడా నమ్ముదాం.  అంతటి  సామరస్యవాది తనకు నచ్చని వాళ్ల గురించి ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా సహజంగానే వుంటుంది. ఇప్పుడు అదీ చూద్దాం.

తెలంగాణ ఉద్యమ కాలంలో వారు ‘తల్వార్’ అనే కవిత రాశారు. అందులో ”అరీ ఆంధ్రోడా! మా దేహాలు తల్వార్ లై లేస్తయ్ ..... .. పచ్చిచేపల్ని చీల్చినట్టు చీలుస్తం ” అని వీరంగం చేస్తారు కవి. (https://www.scribd.com/doc/46460845/Quit-Telangana-Singidi-Rachayitala-Sangham). వీరు రాసిన కవితాపంక్తులకన్నా తీవ్రమైనవా  “మీ శవాల మీద కాఫిర్ల నీడ పడకూడదు” అనే మాట? వారు ఒకరుకాదు ఇద్దరు. స్కైబాబా  “సాహిత్య అపరిచితుడు’.


యూదు, క్రైస్తవ, ఇస్లాం మతగ్రంధాల్లో తరచుగా కనిపించే పదం అవిశ్వాసులు. అవిశ్వాసుల గురించి బైబిల్ లో ఒక ఆసక్తికర పదం వుంటుంది.  Always trying to learn but never able to reach at a knowledge of the truth (2 Thimothy 3:7). 


26. మాతృసమూహాలు

 “అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు. స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృసమూహాలు ఓన్ చేసుకున్నాయి.  కాని ముస్లింవాదులకు పరిస్థితి లేదు అనేది వారి ఇంకో ఆరోపణ.

పురుషాధిక్యతకు వ్యతిరేకంగా స్త్రీవాదం పుట్టుకు వచ్చింది. హిందూవాదం లేదా బ్రాహ్మణవాదం లేదా పెత్తందారీకులాల అణిచివేతలకు వ్యతిరేకంగా  దళితవాదం ముందుకు వచ్చింది. వీటికి మాతృసమూహాలు  అంటే ఏమిటీ? అవి ఓన్ చేసుకోవడం ఏమిటీ?  స్త్రీవాదాన్ని పురుషులు ఓన్ చేసుకున్నట్టూ, దళితవాదాన్ని పెత్తందారీకులాలు ఓన్ చేసుకున్నట్టూ ఈ రచయిత భావిస్తున్నట్టున్నారు.  స్త్రీవాదాన్ని పురుషులు ఓన్ చేసుకున్నారోలేదోగానీ  ఇప్పుడు ఆ వాదాన్ని బలంగా  ఓన్ చేసుకుంటున్నది మాత్రం మార్కెట్.  అదేనా దాని మాతృసమూహం?  వర్తమాన సమాజ పరిణామాల గురించి కనీస అవగాహనవున్నవారెవరయినా ఇలాంటి వాక్యాలు రాయగలరా?

ఇలాంటి సంక్లిష్ట విషయాలు వారికి అర్ధం కాకపోయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కారణంగా కనీసం దాని మీద అయినా తగిన అవగాహన రచయితకు వుంటుందని ఆశిద్దాం.  రాజకీయార్ధిక రంగాల్లో ఆంధ్రా, రాయలసీమ (ఇప్పటి ఆంధ్రప్రదేశ్) ప్రాంతం వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారంటున్న   తెలంగాణ సకల జనులకు  మాతృసమూహం ఏదీ? ఆంధ్రా ప్రాంతం వాళ్ళా? వాళ్ళు ఓన్ చేసుకున్నారాపాపం ఆచార్య జయశంకర్ ఆత్మ శాంతించుగాక!


వారు రాసిన మూడు  వాక్యాల్లో ఒకటి  అజ్ఞానం; రెండు అబధ్ధం




Wednesday 24 August 2016

Allegations - SKY BAABAA


డానీ  ప్రతిస్పందన అంశాలు

స్కైబాబా ఆరోపణల నేపధ్యంలో ముస్లీం సమాజం మీద ముస్లిమేతరులలోనేగాక ముస్లింలలోనూ కొనసాగుతున్న అపొహలను  తొలగించాల్సిన అవసరాన్ని నేను గుర్తించాను. ఆక్రమంలో 30 అంశాల జాబితాను తయారుచేశాను.  ఈ జాబితా మీద మిత్రుల సూచనల్ని ఆహ్వానిస్తున్నాను. వీటిలో కొన్ని తీసివేయమనీ మీరు చెప్పవచ్చు. కొన్ని అదనంగా చేర్చమనీ చెప్పవచ్చు. మీ సూచనల కోసం ఎదురు చూస్తాను.  




1.    ఆరోపణలు
ముస్లిం సమాజం మీద 

1.            అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు.

2.            స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు పరిస్థితి లేదు.

3.            తెలుగులో రాయడంవల్ల వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.

4.            అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.

5.            ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి.

6.            తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి.

7.            నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది.

8.            కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి.

9.             మొత్తంగా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు.

10.       ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

11.       చస్తే శవంపై కాఫిర్ నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

12.       పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు.

13.       వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది

14.       నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.

ఆరోపణలు -డానీలాంటి వాళ్ళ మీద 

15.       పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండిందికానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
16.       విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్గా మారింది.

17.       ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు.

18.       ఇలాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.

19.       అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం.


డానీ  ప్రతిస్పందన అంశాలు

1.                ప్రవేశిక
2.                ఒక వివరణ
3.                సాంకేతిక విశ్లేషణ
4.                ఆరోపణలు – ముస్లిం సమాజం మీద,  డానీ వంటివారి మీద
5.                డానీ ప్తరిస్పందన అంశాలు
6.                లోకస్ స్టాండీ – సగం ముసల్మాన్
7.                సందర్భం
8.                సంవాదం ఆరంభం
9.                ముస్లిం అస్థిత్వవాదం
10.           ఇస్లాంవాద బాలారిష్టం
11.           మేక-పులివాదాలు
12.           పిర్యాదివాదం
13.           ధార్మికసిధ్ధాంతం  – కర్మకాండ
14.           స్కైబాబా బ్రాండు హేతువాదం
15.           గతించిన నాస్తిక-హేతువాదాలు 
16.           సామ్యవాదం నుండి అస్థిత్వవాదానికి
17.           మతరహితంకాదు; మతసామరస్యం   
18.           ముస్లిం సమాజంలో సంస్కరణలు
19.           భారత ముస్లీం ఉద్యమాలు
20.           ముస్లిం సమాజంలో భాషావివక్ష
21.           ఎవరయినా ముస్లింవాదులు కావచ్చు    
22.           విద్యారంగంలో ముందంజ
23.           పేదవాళ్ళు కావడంవల్ల చదువుకొనలేరు
24.           ముస్లింలు వెనకబడలేదు అణిచివేయబడ్డారు
25.           అవిశ్వాసులు - కాఫిర్లు
26.           మాతృసమూహాలు
27.           ముస్లింవాద సాహిత్యం
28.           బుర్ఖాలు
29.           కమాలుద్దీన్ కమ్ స్కైబాబా ముల్లాల భాష
30.           తుంటరి, కపటి, తంపులమారి

31.           భవిష్యత్ కార్యక్రమం