Tuesday 24 April 2018

Mere laws are not sufficient


చట్టాలు చేస్తే సరిపోదు!

-        డానీ

హత్యాచారాలు వెలుగులోనికి వచ్చినపుడు సభ్యసమాజం సహజంగానే ఆవేశంతో ఊగిపోతుంది. దోషులకు కఠిన శిక్షలు విధించాలని కోరుతుంది.  మరణశిక్ష విధించాలనీ,  బహిరంగంగా ఉరి తీయాలనీ, పురాతన పధ్ధతుల్లో తల నరికేయాలనీ, బుడ్దకొట్టాలనీ (castration) అరబ్ దేశాల పధ్ధతుల్లో రాళ్లతో కొట్టి చంపాలనీ ఆందోళనకారులు ప్రభుత్వాలను కోరుతుంటారు. 2012 నాటి నిర్భయ హత్యాచారం సందర్భంగా మహిళా సంఘాలు ఇలాంటి ప్రతిపాదనలే చేశాయి.

ఆవేశంలో చాలామంది మరచిపోయే అంశం ఒకటుంటుంది. అదేమంటే క్రూరమైన నేరాలకు పాల్పడేవారిలో అత్యధికులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగివుంటారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన యన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వారి సామాజికవర్గానికి చెందినవాళ్ళే కారంచేడులో దళితుల మీద దాడిచేశారు. అలాగే, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేదురుమిల్లి జనార్దన రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వారి సామాజికవర్గానికి చెందినవాళ్ళే  చుండూరులో దళితుల మీద దాడి చేశారు. అధికారం, కులం, నేరం కలిసే వుంటాయన్న వాస్తవాన్ని ఈ రెండు హత్యాకాండలు నిరూపించాయి.

తమ వెనుక కాపాడుకునే వాళ్ళున్నారనే భరోసా వున్నప్పుడు నేరస్తులు మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తారు. చట్టాలు తమను ఏమీ చేయలేవనే ధీమాతో  (Immunity) విర్రవీగుతారు. ఎన్నికల్లో అడ్దమైన పధ్ధతుల్లో గెలవడానికి రాజకీయ పార్టీలకు ఇలాంటి అరాచకశక్తులు చాలా అవసరం. అంచేత అరాచకశక్తుల్ని పోషించడం, ఆపత్కాలంలో చట్టం బారి నుండి వారిని కాపాడడం రాజకీయ పార్టీలకు “పోల్ మేనేజ్ మెంటు”లో అనివార్యమైన ‘కర్తవ్యం’ అవుతుంది. అవసరమైనపుడు దీని కోసం వాళ్ళు న్యాయవ్యవస్థను సహితం వాడుకుంటారు.   

మక్కా మసీదు పేలుళ్ళు,  జస్టిస్ లోయా మృతి, గుజరాత్ అల్లర్ల కేసుల్ని వరుసగా కొట్టేస్తున్నపుడు న్యాయవ్యవస్థ మీద అనేక అనుమానాలు రావడం సహజం. నిందితులు తస్మదీయులు అయినపుడు వారికి శిక్షలు పడేలా చేయడానికి ప్రాసిక్యూషన్ అధికారులు అతి క్రియాశీలంగా వ్యవహరిస్తారు. నిందితులు అస్మదీయులు అయినపుడు వాళ్ళను శిక్ష నుండి తప్పించడానికి ప్రాసిక్యూషన్ అధికారులు తమ విధుల నుండి తప్పుకుంటారు. “నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది” అంటూ న్యాయమూర్తులు తమ చేతులు కడుక్కుంటారు. అధికారంలో వున్న పార్టీలకు ప్రాసిక్యూషన్ విభాగం అనేది న్యాయ వ్యవస్థలో గొప్ప సౌకర్యంగా వుంటుంది.  న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం తరచూ ప్రాసిక్యూషన్ విభాగం ద్వారానే సాగుతుంటుంది.

వందమంది దోషుల్ని వదిలేయవచ్చుగానీ ఒక్క నిర్దోషిని కూడా శిక్షించరాదనేది న్యాయవ్యవస్థకు మౌలిక విలువగా చాలామంది చాలా గొప్పగా చెపుతుంటారు. వంద మంది దోషుల్ని వదిలేసే పనిని ప్రాసిక్యూషన్ విభాగం చాలా చురుగ్గా చేస్తుంది. కొందరు నిర్దోషుల్ని కాపాడే పనిని మాత్రం వాయిదా వేస్తుంది. 

నిర్భయ చట్టం వచ్చినపుడు కఠినాతికఠిన శిక్షకు భయపడి మృగాళ్ళు ఇక తోక ముడుస్తారని, అత్యాచారం పేరు చెపితేనే భయంతో వణికిపోతారని విద్యావంతులైన మధ్యతరగతి ఉదారవాదులు  చాలా బలంగా నమ్మేరు. వాస్తవం ఏమంటే నిర్భయ చట్టం వచ్చాక దేశంలో హత్యాచారాల సంఖ్య పెరిగింది.

తమ కార్యకర్తలు హత్యాచారానికి పాల్పడినట్టు బయటికి తెలిసినపుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఇరకాటంలో పడుతుంది. ఆ సంఘటన కల్పిత కథ అని ఖండిస్తుంది. లేదా, దోషులు తమ పార్టీవాళ్ళు కాదని బుకాయిస్తుంది. సంఘ్ పరివారకులు అలాకాదు. బాధితులు ముస్లింలు అయినపుడు హత్యాచారాన్ని తమవాళ్ళే చేశారని ఘనంగా ప్రకటించుకుంటారు. అలా చెప్పుకోవడంవల్ల దేశంలో కరడుగట్టిన హిందూత్వవాదులు ఒకరకం రాక్షసానందాన్ని ఆస్వాదిస్తారనీ, అలా రెచ్చిపోయిన భావోద్వేగాలు సమీప ఎన్నికల్లో  తమకు ఓట్లుగా మారుతాయని వాళ్ళు నమ్ముతారు.

ఢిల్లీలోని రోహింగ్యా (మయన్మార్) శరణార్ధుల ఏకైక శిబిరం ఇటీవల అగ్నికి ఆహుతి అయిపోయింది. అందరూ దీన్ని ఒక ప్రమాదంగానే భావించారు. అయితే, బీజేపి యువజన విభాగానికి (బీజేవైయం) చెందిన మనీష్ చండేల “అవును. మేమే తగులబెట్టేశాం” అని సామాజిక మాధ్యమాల్లో ఘనంగా ప్రకటించి హఠాత్తుగా ‘హిందూజాతి రక్షకుడు’ అయిపోయాడు.  

నిర్భయ కేసులా కఠువా ఆసిఫా కేసు క్షణికావేశంలో జరిగిన ఒక యాధృచ్చిక సంఘటన కానేకాదు. జమ్మూ ప్రాంతం నుండి ముస్లింలని తరిమేయడానికీ, వాళ్లను భయభ్రాంతుల్ని చేయడానికి ప్రణాళికాబద్దంగా ఒక దేవాలయంలో దీర్ఘకాలం జరిపిన హత్యాచారం అది. వాళ్ళు మందిరాలను రాజకీయం చేస్తారు. మందిరాలలో పసిపిల్లల మీద హత్యాచారాలు చేస్తారు. పైగా అది ఒక మహత్కార్యంగా ప్రచారం చేసుకుంటారు!.

కఠువా హత్యాచారం నిందితుల్ని అరెస్టు చేయరాదంటూ ఏకంగా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర మంత్రులు ఊరేగింపులు, నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం, కేసు పెట్టకుండా బీజేపి అడ్వకేట్లు కోర్టు ఆవరణలో క్రైంబ్రాంచ్ అధికారుల్ని అడ్డుకోవడం వంటివి సభ్యప్రపంచానికి అనాగరీకంగా కనిపించవచ్చు. కానీ, అలాంటి అనాగరికమే తమ ఓటు బ్యాంకుని అలరించి పటిష్టంగా వుంచుతుందని సంఘ్ పరివారం నమ్ముతుంది. దక్షణాదిన ప్రతిష్టాత్మక కర్ణాటక ఎన్నికల్లో హిందూత్వ ఓట్ బ్యాంకును ఆకర్షించడానికి ఉత్తరాదిలో హత్యాచార కేసులు ఒక పరంపరగా సాగుతున్నాయని తెలుసుకోలేకపోతే వర్తమాన రాజకీయాలు మనకు ఇంకా అర్ధం కానట్లే!.

దేశంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే ట్వీట్ల ద్వార స్పందించే ప్రధాని నరేంద్ర మోదీ కఠువా దారుణం మీద వారాల తరబడి మౌనంగా వుండిపోయారు. ఈ ఘటన మీద అంతర్జాతీయ సమాజం సహితం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందిగానీ ప్రధాని మాత్రం మౌనాన్ని వీడలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధి క్రీస్టిన్ లగార్డే దౌత్య మొగమాటాన్ని సహితం పక్కన పెట్టి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించింది.   కామన్ వెల్త్ సభలకు లండన్ వెళ్ళిన మోదీ అంతర్జాతీయ వత్తిడికి  తలొగ్గి కఠువ, ఉనావ్ సంఘటనల మీద నోరు తెరవక తప్పలేదు. “పసిపిల్లల మీద సాగిన అత్యాచారం దేశానికి అవమానం. అయితే ఇలాంటి సంఘటనల్ని రాజకీయం చేయడం అంతకన్నా దారుణం” అన్నారు. అయితే, కఠువ దారుణం రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగిందన్న వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ప్రధాని అడ్దంగా ప్రయత్నించారు.   ప్రధాని మరచిపోయి వుండవచ్చుగానీ  చాలా మందికి ఇప్పటికీ గుర్తున్న విషయం ఏమంటే; నిర్భయ కేసును రాజకీయం చేసింది సాక్షాత్తు నరేంద్ర మోదీయే. 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  భాగంగా డిసెంబరు 1న అంబేడ్కర్ నగర్ లో జరిగిన బీజేపి సభలో మోదీ ప్రసంగిస్తూ “ఓటు వేసే ముందు ఒకసారి నిర్భయను గుర్తుకు తెచ్చుకోండి” అని పిలుపునిచ్చారు.

కఠువా కేసులో బాధితులు ముస్లింలు అయినప్పటికీ హిందూ సమాజం సహితం ఈ సంఘటన మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. హిందూ వేరు, హిందూత్వ వేరు అని మరొక్కసారి నిరూపించింది. స్వీయ సమాజం నుండే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పరిస్థితి చేయిదాటిపోతున్నదని తెలిసి మోదీ  ప్రభుత్వం ప్రమాద నివారణ చర్యలు చేపట్టింది. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలు జరిపిన వారిని ఉరి శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం  ఒక ఆర్డినెన్స్ ను తెచ్చింది.  

చట్టాలు కఠినంగా వున్నంత మాత్రాన దుష్టశిక్షణ జరిగినట్టుకాదు.   తమ వాళ్ళను శిక్షల నుండి కాపాడుకోవడం ప్రభుత్వాలకు పెద్ద కష్టమైన పనేమీకాదు. దళితుల మీద అత్యాచార నిరోధక చట్టం కింద అభియోగాన్ని  ఎదుర్కొంటున్న ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కాపాడుకోవడానికి రోహిత్ వేముల అసలు దళితుడేకాదని నిరూపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అడ్డదారులు తొక్కాయో మనకు తెలుసు.  ఇప్పుడు ఆసీఫా మీద అత్యాచారం జరగనేలేదనీ, ఉన్నావ్ కేసులో నిందితురాలు ‘మైనర్ బాలిక’ కాదని నిరూపించడానికి కమలనాధులు నడుముకు బెల్టులు బిగించారు. 

జాతీయ నేర ప్రశోధనా సంస్థ (ఎన్ సిఆర్ బి) గణాంకాల ప్రకారం 2015లో  మైనర్ బాలికల మీద అత్యాచారం నిందితులు   5, 361 మంది విచారణను ఎదుర్కొన్నారు. వీరిలో 1, 843 మందికి మాత్రమే శిక్షలు పడగా 3,518 మంది నిర్దోషులుగా బయటపడిపోయారు. అంటే, శిక్షల శాతం మూడో వంతు మాత్రమే వుంది. సుదీర్ఘ న్యాయవిచారణ కారణంగా అనేక నేరాలు కోర్టుల్లో నిరూపణకాక  దోషులు తప్పించుకుంటున్నారు.  బాధితులకు న్యాయాన్ని ఆలస్యంగా అందించడమూ న్యాయాన్ని నిరాకరించడమూ రెండూ ఒకటే!. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పిల్లల మీద అత్యాచారం కేసుల విచారణను  60 రోజుల్లోగా పూర్తి చేసేలా చట్టాలు తేవాలి.

ఏ దేశంలో అయినా చట్టాలు ఎంత కఠినంగా వున్నాయనేది ఎప్పుడూ ప్రశ్నేకాదు. చట్టాలను ప్రభుత్వాలు ఎంత పటిష్టంగా అమలు చేస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. నేరస్తుల్ని కాపాడే ప్రభుత్వాలున్నంత వరకూ చట్టాల్ని ఎంత కఠినంగా మార్చినా హత్యాచారాలు కొనసాగుతూనే వుంటాయి. ఉన్నావ్, కఠువా కేసులతో దేశం దద్దరిల్లుతున్న కాలంలోనే, ఇలాంటి నేరాలకు ఉరిశిక్షను విధిస్తూ ఆర్డినెన్స్ ను ఆయోదిస్తున్న  సమయంలోనే పశ్చిమ బెంగాల్ లో ఓ టీచర్ నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిల మీద తరగతి గదిలోనే నాలుగు రోజులు అత్యాచారం సాగించాడు! ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఈ టీచర్ ఇంట్లో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆరేళ్ళ పసిపాప మీద అత్యాచారం సాగించాడు. 

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు)

ప్రచురణ
ఎడిట్ పేజీ, మన తెలంగాణ, 25 ఏప్రిల్ 2018 

http://epaper.manatelangana.news/1631965/Mana-Telangana-City-Main/25-04-2018#page/4/2

ప్రచురణ
చట్టాల అమలులో నిజాయితీ కావాలి!

ఎడిట్ పేజీ, ప్రజాశక్తి, , 27 ఏప్రిల్ 2018 

http://www.prajasakti.com/Article/Neti_Vyasam/2031383

మొబైల్ :  9010757776

హైదరాబాద్
21 ఏప్రిల్ 2018

Chandrababu Delhi Flight One Month Late


బాబు విమానం నెల రోజులు లేటు

-        డానీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానం నెల రోజులు ఆలస్యంగా ఢిల్లీ చేరుకుంది. వారు విమానం ఎక్కడానికే నెల రోజులు ఆలస్యం చేశారంటే ఇంకా బాగుంటూంది.

టిడీపి-బీజీపి సంబంధాలేగాక, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు సహితం గట్టిగా దెబ్బతిన్న తరుణంలో చంద్రబాబు ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో విడిది చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద తమ పార్టి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల  మద్దతును కూడగట్టడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చినట్టు టిడిపి వర్గాలు చెపుతున్నాయి. అయితే, ఇందులో ఒక తిరకాసువుంది. జగన్ నాయకత్వంలోని వైసిపి, చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి విడివిడిగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులకు  మార్చి 19 నాటికే లోక్ సభలోని కాంగ్రెస్ సహా ఎన్ డిఏ యేతర పక్షాలన్నీ మద్దతు పలికాయి; తమిళనాడులో అధికారంలోవున్న ఏఐడియంకే ఒక్కటే దీనికి మినహాయింపు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యాకరణ దోషం వుంటోంది.  జరిగిన దానిని జరగబోయేదిగానూ, జరగబోయే దానిని జరిగిపోయినట్టుగానూ ప్రధాన రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నాయి. కేంద్ర నుండి భారీగా నిధుల్ని తెస్తాననీ, తెస్తున్నాననీ, తెచ్చేశానని భవిష్యత్, వర్తమాన, భూత కాలాల్లో చంద్రబాబు స్వయంగా గతంలో అనేకసార్లు ప్రకటించి వున్నారు. ఒక అబధ్ధాన్ని నిజంగా చిత్రించడానికి వారు అంతటితో ఆగలేదు ప్రధాని మోదీనీ, కేంద్ర ఆర్ధికమంత్రి అరున్ జైట్లీనీ ప్రసంసలతో ముంచెత్తారు. ఇప్పుడు తీరా ఐదో సంవత్సరంలో ప్రవేశించేసాక కేంద్రం నుండి నిధులు రాలేదని వారే అంటున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన కూడా ఇలాంటి వ్యాకరణ దోషంతోనే సాగింది. ఇప్పటికే మద్దతు ఇస్తున్న పార్టీలను  మద్దతు కోరడం ఏమీటీ? ఏది ముందూ? ఏది వెనకా? పోనీ కొత్తగా ఏదైనా ఒక పార్టీ మద్దతును అదనంగా కుడగట్టారా అంటే అదీలేదు. మద్దతు ఇస్తున్న పార్టీలకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా ఇప్పటి దాక అవిశ్వాసం నోటీసును స్పీకర్ స్వీకరించనేలేదు.  వారి చేత నోటీసును స్వీకరింపచేసే మార్గమేమిటో చంద్రబాబుకు కూడా తెలిసినట్టులేదు.
చంద్రబాబు ఢిల్లీ చేరడానికి ముందే వారితో సంబంధం లేకుండానే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఉపఎన్నికల్లో చిరకాల ప్రత్యర్ధులు మాయావతి, అఖిలేష్ యాదవ్ ఏకమై గొప్ప విజయాన్ని నమోదు చేయడంతో ఈ బాటలో అనేక ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి.

నరేంద్ర మోది నిరంకుశ పాలనను గద్దె దించాలంటే బీజేపి-ఆర్.ఎస్.ఎస్. లకు వ్యతిరేకంగా ఒక గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు కావాలనేది ఒక ప్రతిపాదన. తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనను బలంగా ప్రచారం చేస్తున్నారు.  చంద్రబాబు పర్యటనకు వారం రోజుల ముందు మమతా బెనర్జీ ఢిల్లీలో మూడు రోజులు మకాం వేశారు. శరద్ పవార్, సోనియా గాంధీలనేకాక బీజేపి అసమ్మతులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, శత్రుఘ్నసిన్హా తదితరుల్ని కూడా వారు కలిశారు. బెంగాల్ లో తృణాముల్ కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అయిన సిపియం జాతీయ ప్రధాన  కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే వున్నారు. అయితే, ఆ పార్టీలో మరో ముఖ్యనేత ప్రకాష్ కారత్ కాంగ్రెస్ మీద భిన్నాభిప్రాయంతో వున్నారు.

బీజేపి యేతర, కాంగ్రెసేతర ముడో ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు మరో పావు కదిలించారు. దీనినే ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు.  దీనికి పెద్దగా మద్దతు లభించకపోగా  కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ముడో ఫ్రంట్ అనేది ఎన్నికల గణాంకాల రీత్యా బీజేపికే అనుకూలంగా మారుతుందనేది వీటి సారాంశం. కొందరయితే మూడో ఫ్రంట్ అంటే ‘ మోదీ టీమ్-బీ’ అని కూడా అంటున్నారు.

గతంలో నేషనల్ ఫ్రంట్ లో  పరోక్షంగానూ,  యునైటెట్ ఫ్రంట్,  నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ లలో ప్రత్యక్షంగానూ చక్రం తిప్పిన చంద్రబాబు ఈసారి ఈ మూడు సమీకరణల జోలికి పోవడానికి జంకారు.  తన ఢిల్లీ యాత్ర రాజకీయం కాదని వారు  పదేపదే చెప్పింది అందుకే.  

జాతీయ పరిణామాల్ని చూస్తుంటే చంద్రబాబు అయినా, జగన్ అయినా ఏపీ ఓటర్ల ముందు నరేంద్ర మోదీ మీద చూపుతున్నంత అవేశాన్ని ఢిల్లీలో చూపడం లేదనిపిస్తోంది.  ఇద్దరూ మోది చంకలో పిల్లలే అనే మాట ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది.

చంద్రబాబు తరచూ యువకుడైన (కుర్ర) జగన్ కు పార్లమెంటు విధివిధానాలు  తెలియవని ఎద్దేవ చేస్తుంటారు.  ఆ రంగంలో తనకు 40 యేళ్ళ సుదీర్ఘ అనుభవం వుందని ఘనంగా చెప్పుకుంటుంటారు.  కానీ ఇటీవలి కాలంలో వారు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు వారి అనుభవానికి దీటుగా కనిపించడంలేదు.

అక్షరాల యుధ్ధంలో ప్రత్యర్ధి బలమైన స్థానం మీద దాడిచేయాలనీ, ఆయుధాల యుధ్ధంలో ప్రత్యర్ధి బలహీనమైన స్థానం మీద దాడి చేయాలని ఒక సామెత వుంది. ఏ ప్రభుత్వానికయినా ప్రాణప్రదమైన అంశం వార్షిక బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం పొందడం. బడ్జెట్ కు ఆమోదం పొందకపోతే గల్లాపెట్టెలో పైసా కూడా ప్రభుత్వం ముట్టుకోవడానికి వీల్లేదు.  అలాంటి అవకాశం ఏపీ రాజకీయ పక్షాలైన టిడిపి, వైసిపి లకు మార్చి మొదటివారంలో వచ్చింది. 

బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టిన అనంతరం  పార్లమెంటుకు శెలవులు ప్రకటించారు. ఆ తరువాత మార్చి 5న మళ్ళీ బడ్జెట్ సభావేశాలు మొదలయ్యాయి. నరేంద్ర మోదీ చివరి బడ్జెట్ లోనూ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేశారని అప్పటికే సుస్పష్టం అయిపోయింది. బడ్జెట్ లో సవరణలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అలాంటి సమయంలో, తమను అన్యాయం చేసిన బడ్జెట్ ను చంద్రబాబు అడ్డుకొని వుండాల్సింది. అలాంటీ అవకాశం పార్లమెంటరీ విధానాల్లోనే వుంది.

మార్చి 2నే చంద్రబాబు ఢిల్లీలో మకాంవేసి బీజేపియేతర శక్తుల మద్దతు కూడగట్టి మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటిసు ఇచ్చివుంటే జాతీయ రాజకీయాల్లో అసలు ఆట మొదలయ్యి వుండేది.  సభ సజావుగా లేదు కనుక అవిశ్వాసం నోటీసుకు మద్దతుదారుల్ని లెక్కించలేక పోతున్నాను అని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పుడు అంటున్నంత  సులువుగా అనగలిగేవారుకాదు.  ఎందుకంటే వెల్ లో గొడవ అవిశ్వాసం నోటీసుకే కాదు;  బడ్జెట్ ఆమోదానికి కూడా అడ్దంకే. ఆమోదిస్తే రెండూ ఆమోదించాలి; తిరస్కరిస్తే రెండూ తిరస్కరించాలి.

అవిశ్వాసం నోటీసు ఆమోదం పొంది సభలో చర్చ సాగి ఓటింగు జరిగినా నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోకపోవచ్చు. ఏమో! గుర్రం ఎగిరినా ఎగరవచ్చు! బీజేపీలోనూ మోదీ వ్యతిరేకత తక్కువగా ఏమీలేదనే మాట కూడా వినవస్తోంది.  అలాజరక్కపోయినా, ఏపీకీ ప్రత్యేక తరహా హోదా, 2014 చట్టం అమలు వంటి అంశాల మీద పార్లమెంటులో విస్తార చర్చ జరిగివుండేది.  అదే కదా మనం అంతా ఆశిస్తున్నదీ? అప్పుడు ఈ ఎంపీల రాజీనామాలు, ఆమరణ నిరాహార దీక్షలతో పనీ వుండేది కాదు.
 రాజకీయాలకు కొత్త అయిన జగన్ కు పార్లమెంటులో బడ్జెట్ ను ఎలా అడ్డుకోవాలో, ప్రధాన మంత్రిని ఎలా ఇరకాటంలో పెట్టాలో తెలిసి వుండకపోవచ్చు. కానీ నలభైయేళ్ళ అనుభవజ్ఞులైన చంద్రబాబుకు ఈ కిటుకు క్షుణంగా తెలుసుకదా!.  వారెందుకు బడ్జెట్ ఆమోదానికి తోడ్పడి గండం నుండి మోదీ తప్పించేశారూ? ఇందులో మనకు ఇప్పటికి తెలియనిది ఏదో వుంది. అది త్వరలో మన ముందుకు వస్తుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

ప్రచురణ
ఎడిట్ పేజీ, ప్రజాశక్తి,  7 ఏప్రిల్ 2018
http://www.prajasakti.com/Article/Neti_Vyasam/2025278

Tuesday 3 April 2018

చంద్రబాబు ఢిల్లీ యాత్ర కాంగ్రెస్ పై వైఖరే కీలకం


BIG STORY

చంద్రబాబు ఢిల్లీ యాత్ర
కాంగ్రెస్ పై వైఖరే కీలకం
-       డానీ

జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు రంగం సిధ్ధమైన దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు రావడం చర్చనీయాంశంగా మారింది.

దేశంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అందరిలోనూ చంద్రబాబుకు ఒక ప్రత్యేకత వుంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించగల సత్తా అందరికన్నా ఆయనకే ఎక్కువగా వుంది. 1996లో దేవేగౌడను, 1997లో ఐకే గుజ్రాల్ ను ప్రధాన మంత్రులుగా చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు ఆయనే కన్వీనర్. అలాగే  1998లో వాజ్ పాయిని ప్రధాని చేయడానికి ఏర్పడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఏ) – 1 కు కూడా ఆయనే కన్వీనర్ గా వ్యవహరించారు. 1997  ఏప్రిల్ నెలలో దేవెగౌడ తరువాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం సిపియం వృధ్ధనేత జ్యోతి బసుతో పాటూ చంద్రబాబుకు కూడా వచ్చింది.

ఎన్డీయేలో బీజేపియేతర ముఖ్యమంత్రుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మీద  ఎక్కువ విశ్వాసాన్ని ప్రకటించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దాదాపు  ఓ నాలుగేళ్ళు ఆయన నరేంద్ర మోదీని నెత్తి మీద పెట్టుకుని మోశారన్నా అతిశయోక్తికాదు. దానికి టిడిపి వర్గాలు చెప్పే సమర్ధన భిన్నంగా వుంటుంది. కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు తదితర పథకాలకు  నిధుల్ని తేవడానికి మోదీతో ‘అదనపు’ మైత్రి బంధాన్ని సాగించామని ఆ పార్టి నేతలు అంటున్నారు.

బీజేపి సీనియర్ నేతలయిన యశ్వంత్ సిన్హావంటివారైనా  మోదీ ప్రభుత్వాన్ని అడపాదడపా ఒక మాటైనా అన్నారేమోగానీ చంద్రబాబు గత నాలుగేళ్లలో మోదీనే కాదు మోదీ సన్నిహితుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి, హొంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జలవనరుల శాఖా మంత్రి  నితిన్ గడ్కరిని సహితం పల్లెత్తు మాట అనలేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదా బదులు ప్రత్యేక ఆర్దిక  సహాయం (ప్యాకేజీ) ఇస్తానని అరుణ్ జైట్లి ప్రతిపాదించినపుడు చంద్రబాబు నిస్సందేహంగా ఆమోదించేశారు. “కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?” అని అతి ఉత్సాహపు ప్రకటనలు చేశారు.

అయితే, చంద్రబాబుకు వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. వరుస నాలుగు కేంద్ర బడ్జెట్లలో ఆంధ్రప్రదేశ్ కు  తగిన న్యాయం చేయని నరేంద్రమోదీ మొన్నటి చివరి బడ్జెట్ లోనూ నిరాశే మిగిల్చారు. చివరి నిముషంలో ముప్పుని గమనించిన చంద్రబాబు ప్రమాద నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారుగానీ అప్పటికే ఆంధ్రప్రదేశ్ కు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుకు ఒక అనుకూల అంశం వుండింది. ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ చంద్రబాబుకన్నా చాలా చిన్నవారు. అయితే, జగన్ మొదటి నుండీ ఒక సెంటిమెంటుగా ప్రత్యేక తరహా హోదా అంశాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. దానికోసం నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్షను చంద్రబాబు భగ్నం చేయడమేగాక,  ప్రత్యేక తరహా హోదా కోసం ఆందోళన చేసేవారిని అరెస్టు చేసి జైళ్ళలో పడేస్తామని గట్టి హెచ్చరికలు చేశారు.  దానితో ప్రత్యేక తరహా హోదా  మీద జగన్  పేటెంట్ రైట్స్ పొందేశారు.

కేంద్రం చేసిన మోసం బయటపడ్డాక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక తరహా హోదా పెద్ద సెంటిమెంటుగా మారిపోయింది. ఈ పరిణామాలు జగన్ కు అనుకూలంగా మారిపోవడంతో  చంద్రబాబు ఖంగు తిన్నారు. ప్రత్యేక తరహా హోదాను విమర్శించిన నోటితోనే దాని జపం చేయక తప్పలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి యంపీలు ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి పార్లమెంటులో గళం విప్పారు. చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ నాయకత్వంలో పార్లమెంటు బయట దశావతారాలు ప్రదర్శించారు.   

ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయ ఎజెండాను జగన్ నిర్ణయిస్తారని  చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరు. జగన్ ప్రత్యేక తరహా హోదా అంటే చంద్రబాబు ప్రత్యేక తరహా హోదా అనక తప్పలేదు. జగన్ పార్టి ఎంపీలు మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం  పెడితే టిడిపి ఎంపీలు సహితం అవిశ్వాస తీర్మానం పెట్టక తప్పలేదు. తమ ఎంపీలు ఏపిల్ 6న రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని జగన్  ప్రకటించడంతో  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెద్ద కుదుపుకు గురయ్యాయి.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా గత ఏడాది వున్నంత పటిష్టంగా ఏమీ లేదు. లోక్ సభలో మొత్తం 545 సీట్లుండగా బీజేపికి స్వంతంగా  ప్రస్తుతం 273 సీట్లు మాత్రమే వున్నాయి. ఇది కనీస మెజారిటీ (మేజిక్ ఫిగర్) మాత్రమే.  తార్కికంగా ఇప్పుడు బీజేపి తన ఎన్డీఏ  మిత్రపక్షాల మీద ఆధార పడివుందని అర్ధం. ఇది గాక బీజేపిలోనే నరేంద్ర మోదీ వ్యతిరేకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదనే సంకేతాలూ వెలువడుతున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని సవాలుగా స్వీకరిస్తే బీజేపిలోని అసమ్మతి బయటపడిపోతుందని నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయం భయపడుతోంది.

ఇలాంటి చారిత్రక సందర్భంలో చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు విడిది చేయడం విశేషంగా మారింది.  బెంగాల్ ముఖ్యమంత్రి, తృణాముల్ కాంగ్రెస్‍ అధినేత్రి మమతా బెనర్జీ గత వారమే ఢిల్లోలో విడిది చేసి నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టడానికి ఒక ప్రయత్నం చేశారు.  ఆ వెంటనే చంద్రబాబు ఢిల్లీ చేరుకొని జాతీయ రాజకీయాల్లో మరో కలకలం రేపారు.  

వైయస్సార్ సిపీ, తెలుగు దేశం పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు కాంగ్రెస్ సహా ఎన్డీఏ యేతర పార్టీలు అనేకం మద్దతిచ్చాయి.  ఇప్పుడు చంద్రబాబు ఎన్డీయేలో బీజేపీయేతర పార్టీలతో కూడా చర్చిస్తారని అంటున్నారు. చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే  వివిధ  పార్టీల నాయకుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ సమస్యను వివరిస్తారని సమాచారం.  ఢిల్లీలో చంద్రబాబు వివిధ పార్టీల నేతలతో విందు దౌత్యం నడిపే అవకాశాలు కూడా వున్నాయి. ఇలా ఢిల్లీలో దౌత్యం నడిపే అవకాశాలు జగన్ కు అంతగాలేవు. ఆ విధంగా చంద్రబాబు ఈ విభాగంలో జగన్ కన్నా అనేక అడుగులు  ముందుకు వేసినట్టే.

అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొన్ని ఖాళీలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‍ మీద చంద్రబాబు వైఖరి  స్పష్టం కావలసివుంది. మోదీతో దోస్తీ రోజుల్లో చంద్రబాబు తరచూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసేవారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారనీ, రాజధానినగరం లేకుండా చేశారనీ, కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి గెంటేశారని సందర్భం వున్నా లేకున్నా వారు కాంగ్రెస్‍ ను విమర్శించే వారు. ఇప్పుడు వారు గుర్తించాల్సిన అంశాలు కొన్నున్నాయి. గత నాలుగేళ్ళలో కేంద్ర ఆదాయంలో రాష్ట్రావాటా (డెవల్యూషన్) గా వచ్చే నిధులు గాకుండా అదనంగా వచ్చిన ఇతర నిధులన్నీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ద్వారా వచ్చినవే.  ఆ చట్టాన్ని కాంగ్రెస్‍ అధినేత్రి సోనియా గాంధీ  అభిష్టం మేరకు రూపొందించారని తెలియనివాళ్ళెవరూ ఇప్పుడు లేరు. అలాగే రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న  అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కొత్తగా ఏర్పడబోయే అంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక తరహా హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‍ ప్రధాని. ఇప్పుడు చంద్రబాబు  అమలు చేయమని కేంద్రాన్ని కోరుతున్న 2014 చట్టం, ప్రత్యేక హోదా రెండూ కాంగ్రెస్ ఇచ్చినవే! కనుక కాంగ్రెస్ మీద చంద్రబాబు తన వైఖరిని పునఃసమీక్షించు కోకతప్పదు.   

కాంగ్రెస్‍ లోక్ సభా పక్షనాయకుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పకపోతే ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు అదనంగా సాధించిందేమీ వుండదు. కాంగ్రెస్‍ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అధినేత్రి సోనియాగాంధీని కూడా కలిస్తే   అప్పుడు చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం నిజంగానే జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

హైదరాబాద్
3 ఏప్రిల్ 2018


http://epaper.manatelangana.news/1604704/Mana-Telangana-City-Main/04-04-2018#page/4/2