Friday 30 August 2019

అతివాద సర్వసత్తాక జాతీయవాద ముప్పు


అతివాద సర్వసత్తాక జాతీయవాద ముప్పు

ప్రపంచంలో హిందువులకు వున్నది భారతదేశం ఒక్కటే అంటున్నారు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి  నరేంద్రమోదీజీ. వారు  ప్రస్తుతానికి కొంచెం ముసుగులో మాట్లాడుతున్నారుగానీ, వారు  చెప్పదలుచుకున్నది మాత్రం భారతదేశంలో వుండాల్సింది హిందువులు ఒక్కటే అని.
నరేంద్ర మోదీ పేరు వినగానే ఎవరికైనా  గుర్తుకు వచ్చేది 2002 నాటి గుజరాత్ నరమేథం. అప్పుడు మోదీజీ రాష్ట్ర ముఖ్యమంత్రి.   మారణహోమాన్ని సృష్టించకుండా దేశంలో గుజరాత్ వంటి అభివృధ్ధిని సాధించలేమని మోదీ అభిమానులు నమ్ముతున్నారు. అభివృధ్ధి పేరుతో దేశమంతా మారణహోమాన్ని సృష్ఠిస్తారేమోనని మోదీ వ్యతిరేకులు అప్పుడే ఆందోళన చెందుతున్నారు.  
స్థూల జాతియోత్పత్తి (జిడిపి) పెరుగుదల రేటు గుజరాత్ లో ఎక్కువగా వున్నమాట వాస్తవం. నరేంద్రమోదీ హయాంలోనే కాక అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ గుజరాత్ లో జిడిపి పెరుగుదల రేటు ఎక్కువగానే వుంది. భారత దేశపు మెగా కార్పొరేట్ సంస్థల కేంద్ర కార్యాలయాలు గుజరాత్ లో వుండడంవల్ల ఇది సాధ్యం అయింది. అయితే, సమాజం ఆనందంగా వుందనడానికి జిడిపి పెరుగుదల రేటు ఎన్నడూ కొలమానం కాదు. సామాన్య ప్రజానీకం కటిక పేదరికంలో మగ్గిపోతున్నప్పటికీ కార్పొరేట్లకు భారీ లాభాలు వస్తుంటే జిడిపి పెరుగుదల రేటు మెరుగ్గా వుండే అవకాశం వుంది. దానికి గుజరాత్ గొప్ప ఉదాహరణ. మరోవైపు, గుజరాత్ ఆర్థిక వ్యవస్థ దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా పెద్దదేమీ కాదు. ఆర్థిక వ్యవస్థల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరువాత ఆరవ స్థానం గుజరాత్ ది.
సువిశాల ప్రజల ఆమోదాన్ని (పాపులర్ మ్యాండేట్) పొంది కొద్దిమందిగా వుండే పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను నేరవేర్చడమే  పెట్టుబడీదారీ రాజ్యం నిర్వర్తించే ప్రధాన కర్తవ్యం. కర్తవ్యాన్ని సాధ్యమైనంత వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వార  నెరవేర్చడానికే అది ప్రయత్నిస్తుంది. అయితే పెట్టుబడీదారుల సహజమైన అత్యాశవల్లనో, నిర్వహణ, యాజమాన్య లోపాలవల్లనో పార్లమెంటు తరచూ ప్రజల విశ్వసనీయతను కోల్పోతూ వుంటుంది. అలాంటి సందర్భాల్లో పెట్టుబడీదారీ రాజ్యం అడ్డడారుల్ని తొక్కైనాసరే పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను నేరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. పెట్టుబడీదారీ రాజ్యం ఆలా వెతుక్కునే అడ్డదారుల్లో మతవర్గతత్వం ముఖ్యమైనది.  అప్పుడది మతవర్గ నియంతృత్వంగా మారుతుంది.
పార్లమెంటరీప్రజాస్వామ్యం, మతవర్గనియంతృత్వం రెండూ పెట్టుబడీదారీ నియంతృత్వానికి రెండు పార్శ్వాలు మాత్రమే. పార్లమెంటరీప్రజాస్వామ్యం మతానికి ముసుగు కప్పి వుంచుతుంది. మతవర్గనియంతృత్వం మతతత్త్వం ముసుగును తొలగించడమేగాక దాన్ని  బోను నుండి బయటకు వదులుతుంది.
నియంతృత్వం అన్నింటికన్నా ముందుగా మనుషుల్నివాళ్ళుమనం అని విభజిస్తుంది. “వాళ్లను అంతం చేసి మనం పెరుగుదాం అనేది ప్రతి నియంతృత్వం ఇచ్చే తొలి నినాదం. ఆర్దిక సంక్షోభాల్లో కూరుకు పోయిన అసమసమాజాల్లో నినాదం అగ్నిలా వ్యాపిస్తుంది.
వర్గసమాజంలో ధనిక-పేద వర్గాల మధ్య అంతర్లీనంగా ఒక వైరం కొనసాగుతూ వుంటుంది. అక్కడ ప్రభుత్వమైనా  పాలకవర్గాలకు ఊడిగం చేయకతప్పదు.  కొన్ని ప్రభుత్వాలు దిష్టి తీయడానికి అన్నట్టు ప్రజలకు కొంత ముష్ఠి పడేస్తాయి. కొన్ని ప్రభుత్వాలు ముష్ఠి కూడా పడేయవు. తమకు ముష్ఠి కూడా పడేయని ప్రభుత్వాలను ప్రజలు ఎన్నికల సమయంలో మార్చేస్తుంటారు. ప్రజలు ఎలాగూ ఐదేళ్ళకోసారి ప్రభుత్వాల్ని మార్చేస్తున్నపుడు ఇక ముష్టి పడేయాల్సిన అవసరమే లేదని పాలకులు ఒక నిర్ణయానికివస్తారు. అలాంటి దశలో,  ప్రభుత్వాలను మార్చినా ప్రయోజనం లేదని గమనించిన ప్రజలు ఏకంగా వర్గసమాజాన్నే మార్చాల్సిన అవసరం వుందని గుర్తిస్తారు.  అలాంటి సంక్షోభ దశలో  వర్గసమాజాన్ని కాపాడడానికి పెట్టుబడీదారీ రాజ్యం నియంతృత్వ రూపాన్ని ధరిస్తుంది.
పాలకులకు, పాలితులకు మధ్య ఆర్ధిక వైరాన్ని నియంతృత్వం తోసిపుచ్చుతుంది. తొలి అడుగులోనే దేశప్రజల్లో ధనికులు, పేదలనే విభజనని నిరాకరిస్తుంది. దేశప్రజల్లో అధిక సంఖ్యాకులందరూ ఒక అఖండజాతి  అనే ఒక బూటకపు నినాదాన్ని హోరెత్తించి ఉన్మాదాన్ని సృష్టిస్తుంది. అఖండజాతి సభ్యులందరూ కుల, వర్గ సాంస్కృతిక విబేధాలను మరచిపోయి దేశాభివృధ్ధి కోసం  ఎలాంటి త్యాగాలకైనా, ఎంతటి సాహసాలకైనా సిధ్ధపడాలని పిలుపిస్తుంది. అంతటి త్యాగాలు చేసి అఖండజాతి సాధించిన ప్రగతిని దేశప్రజలందరికీ అది సమానంగా పంపిణీ చేస్తుందా? అనే ఒకే ఒక ప్రశ్న వేస్తే చాలు నియంతృత్వం రెచ్చగొట్టే జాతీయ ఉన్మాదం మొత్తం నీరుగారిపోతుంది.  పాలకులకు లబ్ది చేకూర్చడానికి వర్గసమాజపు రాజ్యం నిర్వర్తించే కర్తవ్యాలనే మతవర్గతత్త్వ రాజ్యం కూడా నిర్వర్తిస్తుంది. అయితే, పనిని లబ్దిదారులతో మాత్రమేకాక బాధితులతోనూ చేయిస్తుంది. అదే దాని ప్రత్యేకత!

నియంతృత్వం ఎప్పుడూ రెండు స్థాయిల్లో పనిచేస్తూవుంటుంది. మొదటిది, సాంస్కృతికస్థాయి. రెండోది అధికారస్థాయీ. సాంస్కృతికస్థాయిలో అది చాలా అకర్షణీయంగా వుంటుంది. మనుషులపై మాదకద్రవ్యాలకన్నా శక్తివంతంగా అది పనిచేస్తుంది. దాని అసలు రూపం అధికారాన్ని చేపట్టినపుడే బయట పడుతుంది. ఎందుకంటే అధికారంలో వున్నప్పుడు దాని సాంస్కృతిక ముసుగు చిరిగిపోతుంది.
దేశప్రజల్లో జాతియోన్మాదాన్ని రెచ్చగొట్టడం  మతవర్గతత్వానికి సాంస్కృతిక పార్శ్వం అయితే భారీపారిశ్రామిక సంస్థలకు భారీ లాభాల్ని అర్జించి పెట్టడం దీని రాజకీయార్ధిక పార్శ్వం. దేశభక్తి ముసుగులో అది సాధించే లక్ష్యం అదే! వాజ్ పాయి మంత్రివర్గంలో ఏకంగా డిస్ ఇన్వెస్ట్ మెంట్ శాఖనే ఏర్పాటు చేశారు. అరుణ్ శౌరీ దానికి మంత్రిగా వున్నారు.  దేశ జనాభాలో నాలుగోవంతు ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నా డజను జాతీయ కార్పొరేట్ సంస్థలు దేశవిదేశాల్లో సాధిస్తున్న విజయాలను చూసి ఆనందించమంటుంది మతవర్గతత్వం.
సాధారణ ప్రజల్లో కుత్రిమ ఉత్సాహాన్ని నింపడానికి దేశంలోని ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఒక కుత్రిమ శత్రువుగా చిత్రిస్తుంది మతవర్గ నియంతృత్వం. అలా సృష్టించిన కుత్రిమ శత్రువుకు వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాలన్నింటినీ కూడగడుతుంది. శత్రుసంహారం జరిగితే మిగిలిన సామాజికవర్గాలకు సర్వసౌభాగ్యాలు అందుబాటులోనికి వస్తాయనే బూటకపు ప్రచారాన్ని ఉధృతంగా చేపట్టి, భూలోకస్వర్గాన్ని నిర్మిస్తున్నట్టు ఒక కుత్రిమ ఉత్సాహాన్ని విశాల ప్రజానీకంలో నింపుతుంది. కుత్రిమ ఉత్సాహాన్ని కొనసాగించడానికి వీలుగా ఒక అల్లరి మూకను సృష్టించి రోడ్ల మీదకు వదులుతుంది.
ఎవరో ఒకర్ని శత్రువుగా చూపకుంటే మిగిలిన సామాజికవర్గాలు ఏకంకావనీ మతవర్గ నియంతృత్వానికి తెలుసు. అది సృష్టించే కుత్రిమ శత్రువు నిత్యం ఒకే సామాజికవర్గం అవ్వాల్సినపనిలేదు. ఒకసారి ముస్లింలు, ఇంకోసారి శిక్కులు, మరోసారి క్రైస్తవులు ఇలా సందర్భాన్నిబట్టి కుత్రిమ శత్రువును అది మారుస్తూ వుంటుంది. ఎప్పుడైనాసరే  ఒక సామాజికవర్గానికి వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాలన్నింటినీ  కూడగట్టడమే దాని లక్ష్యం.
నియంతృత్వం ఊరించే భూలోకస్వర్గ ప్రాప్తి పొందే ఉత్సాహంతో ప్రజలు ఉత్పత్తిలో చురుగ్గా పాల్గొంటారు. అలా దేశంలో అభివృధ్ధి సూచికలు చెప్పుకోదగ్గ పెరుగుదలను సాధిస్తాయి. ఇలాంటి సంకేతాలన్నీ తాము ఆశిస్తున్న స్వర్గం అతిదగ్గరలో వుందనే భ్రమను ప్రజల్లో పెంచుతాయి. వాళ్ల ఉత్సాహం పెరిగిన  ఫలితంగా ఉత్పత్తి మరింత పెరుగుతుంది. మళ్ళీ స్థూల జాతీయ ఉత్పత్తి సూచికలు పెరుగుతాయి.

          అయితే, పెరుగుదల అంతా నిలువు (Vertical) అభివృధ్ధి మాత్రమే అనీ, అది సమమట్టపు (Horizintal)  అభివృధ్ధిని సాధించడంలేదనీ, సాధించనూ లేదని ప్రజలకు తెలియడానికి కొంత కాలం పడుతుంది.   నియతృత్వాన్ని నమ్మి దాని వెంట పరుగులు పెట్టిన సమూహాలే దాని సామర్ధ్యాన్ని శంకించడం మొదలెడతాయి. నియంతృత్వాన్ని నమ్మిన సమూహాల్లో ఉత్సాహం నీరుగారిపోయే కొద్దీ ఉత్పత్తి తగ్గి, అభివృధ్ధి సూచికలు దిగువముఖం పడతాయి. ఫలితంగా దేశంలో నిలువు అభివృధ్ధి సహితం కుంటుపడిపోతుంది.
వర్తమాన రాజకీయాల్లో యూపియేవన్ కూ, యూపీయేటూకూ తేడా ఇదే. యూపియేవన్ నిలువు అభివృధ్ధిని సాధించిన ఫలితంగానే దానికి 2009 ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు లభించాయి. అది సమమట్టపు అభివృధ్ధి కాదని తెలిశాక ప్రజల్లో ఉత్పాదక ఆసక్తి తగ్గిపోయింది. అప్పుడు మొత్తం అభివృధ్ధే కుంటుపడిపోతుంది.  పరిణామాల్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.
అసమ అభివృధ్ధితో విసుగు చెందిన జనానికికష్టానికి తగిన ప్రతిఫలంశక్తిమేరకు శ్రమఅవసరం మేరకు ప్రతిఫలం వంటి సామ్యవాద ఆర్ధిక నీతులు ఉత్సాహాన్నివ్వవు. “శ్రమ పడకుండానే సౌఖ్యం వంటి మాటలు సహజంగానే కొన్నివర్గాల్లో ఆసక్తినీ, ఆశల్నీ పెంచుతాయి. పచ్చిగా చెప్పాలంటేదొంగసొత్తును పంచుకుందాం అనేమాట అల్లరి మూకల్లో ఉన్మాదాన్ని పెంచుతాయి.
అయితే ఇక్కడో చిక్కు ప్రశ్న ముందుకు వస్తుంది. ఎవరిసొత్తును ఎవరు పంచుకోవాలి? అనేదే ప్రశ్న. సమస్యను పరిష్కరించడానికి నియంతలు దేశీయ  సామాజికవర్గాల్ని సాంస్కృతిక పునాదిపై రెండు శతృశిబిరాలుగా చీలుస్తారు. ఒకవర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ల మీద వాళ్ల సంపద మీద హక్కును రెండో వర్గానికి కల్పిస్తామంటారు. ఇది సాంస్కృతిక జాతీయవాదపు ఆర్ధిక కోణం.
వాజ్ పాయ్ హయాంలో సంఘపరివారం కొంత కాలం దేశంలో క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని బలంగా సాగించింది. ఇప్పుడు ముస్లింల వంతు వచ్చినట్టుంది. ఆ విభాగంలో నరేంద్ర మోదీ అనుభవజ్ఞులు. నిన్న గుజరాత్ లో జరిగిందే రేపు దేశంలో జరగబోతోంది. కార్పొరేట్లు భారీ లాభాలు గడిస్తారు. ముస్లింలు  ధనమాన ప్రాణాల్ని కోల్పోతారు. ప్రజాస్వామిక శక్తులకు ఇది పెద్ద సవాలేగానీ ఇప్పుడు వాళ్ళకు నరేంద్ర మోదీని నిలవరించేంత శక్తి వుందా?

రచన : 17 మార్చి 2014

(18 మార్చి 2014 విరసం హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభ ప్రసంగ పాఠం

Thursday 8 August 2019

Only Kashmiri People Have to Decide the Future


Only Kashmiri People Have to Decide the Future
ఇక కథ నిర్ణయించేది కశ్మీరీలే…!   

డానీ


ఒప్పందాలు చేసుకున్నప్పుడు అందరూ పెద్దమనుషులేగానీ ఒప్పందాలను పాటించే సమయంలో అందరివీ చిన్న మనసులు. 1937లో రాయలసీమ ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని ఆంధ్రా పెద్దమనుషులు పాటించలేదు. 1956లో తెలంగాణ ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని సీమాంధ్ర పెద్దమనుషులు పక్కన పడేశారు. ఫలితంగా పెద్ద ఉద్యమం సాగి తెలంగాణ విడిపోయి మన కళ్ళ ముందే  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.  ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంలోని 370 అధీకరణం అనే ఇంకో ఒప్పందాన్ని  చెత్త బుట్టలో పడేశారు. అలాగే, కశ్మీర్ లో శాశ్విత నివాసుల్ని నిర్వచించే ఆర్టికల్ 35-ఏ ను కూడా రద్దు చేశారు.  ఆర్టికల్ 370, 35-ఏ ల కథ ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీజీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ప్రకటించారు. అయితే ఈ కథ నిజంగానే ముగిసిందో మరో కొత్త మలుపు తీసుకుంటుందో నిర్ణయించాల్సీంది  కాశ్మీరీ ప్రజలు.    

అయితే కశ్మీర్ వ్యాలీ ప్రతిస్పందనను తెలుసుకునే అవకాశం ప్రస్తుతం లేదు. జమ్మూ- కశ్మీర్ లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన వుంది. అక్కడ ఎన్నికయిన ప్రజాప్రభుత్వం లేదు. మాజీ ప్రజాప్రతినిధుల్ని గృహ నిర్బంధంలో వుంచారు. వాళ్ళను విలాసవంతమైన భవనాల్లో బంధించినట్టు కేంద్ర హోంమత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు. కశ్మీర్ లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్ నెట్, టెలీఫోన్,  టివి  తదితర ప్రసార మాధ్యమాలను రద్దు చేశారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్టూడెంట్ హాస్టళ్ళకు సెలవులు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల విద్యార్ధుల్ని స్వరాష్ట్రాలకు పంపించివేశారు. అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు. సున్నిత ప్రాంతాల్ని కేంద్ర భద్రతా  దళాలతో నింపేశారు. కశ్మీరీల గొంతు కాదుకదా నిట్టూర్పు కూడా బయటికి వినిపించకుండా సకల చర్యలు పటిష్టంగా తీసుకున్నారు. కశ్మీర్ నుండి చీమ కూడ బయటికి రాకుండా తీసుకుంటున్న చర్యల్ని బట్టి ఒకటి మాత్రం స్పష్టంగానే తెలుస్తోంది; కశ్మీరీలు ఆర్టికల్ 370, 35-ఏ రద్దును వ్యతిరేకిస్తున్నారని.

రాజ్యాంగంలో ఆర్టికల్ 370ను పొందుపరచినందుకు కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించినందుకు ఇప్పుడు బిజేపి శ్రేణులు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రును విమర్శిస్తున్నారుగానీ ఆనాడు అలాంటి ఒప్పందం అనివార్యం మాత్రమే కాకుండా మహత్తరమైనదని కూడ  మరచిపోవడం న్యాయంకాదు. నాటి ఉద్విగ్నభరిత సన్నివేశాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము.

రాజా గులాబ్ సింగ్, మహారాజ హరిసింగ్ ల పాలనలోని కశ్మీర్ సంస్థాన ప్రజల్లో  అత్యధికులు తెగపరంగా ఆదివాసులు, ఆర్ధికంగా నిరుపేదలు, మతపరంగా ముస్లింలు. 1932లో షేక్ అబ్దుల్లా, గులాం అబ్బాస్ ల నాయకత్వంలో ఏర్పడిన జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్  సంస్థానంలో వ్యవసాయ సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేసింది. తరువాతి కాలంలో షేక్ అబ్దుల్లా  తన పార్టి పేరును నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చగా, గులాం అబ్బాస్ ముస్లిం కాన్ఫరెన్స్  పేరుతోనే కొనసాగారు. సామ్యవాద భావాలున్న షేక్ అబ్దుల్లా  బ్రిటీష్ ఇండియాలో నెహ్రూతో  సన్నిహితంగా మెలగ్గా, ముస్లిం లీగ్ నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నాతో  గులాం అబ్బాస్ సన్నిహితంగా మెలిగేవారు.

1947 నాటి భారత స్వాతంత్ర్య చట్టం   దేశంలోవున్న దాదాపు 750 సంస్థానాధీశులకు  మూడు ఆప్షన్లు ఇచ్చింది. వాళ్ళు ఇండియన్ యూనియన్ లో చేరవచ్చు, పాకిస్తాన్ రిపబ్లిక్ లో చేరవచ్చు స్వతంత్ర దేశంగానూ వుండవచ్చు. దాదాపు అన్ని సంస్థానాలు ఇటు ఇండియాలోనో, అటు పాకిస్తాన్ లోనో చేరిపోయాయి. లేదా నయాన్నో భయాన్నో చేర్చుకున్నారు. అయితే, నిజాం, జునాగడ్, కశ్మీర్ సంస్థానాధీశులు మాత్రం స్వతంత్ర దేశాలుగా కొనసాగాలనుకున్నారు.  ఆ రోజుల్లో కశ్మీర్ కు అసలు ప్రాముఖ్యం లేదు. ఎక్కువ భాగం మంచుకొండలు, హిమనీనదాలు కావడం, మిగిలిన ప్రాంతంలోనూ సారవంతమైన భూములు లేకపోవడం, లోటు బడ్జెట్ సంస్థానం కావడంతో అటు పాకిస్తాన్ అధినేతలుగానీ, ఇటు భారత  అధినేతలుగానీ కశ్మీర్ ను అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళ దృష్టంతా సుసంపన్నమైన నిజాం, జునాగడ్ మీదనే వున్నాయి.

మహారాజ హరిసింగ్ ఇండియాలో చేరడంకన్నా తను పాకిస్తాన్ లో చేరడం మేలు అనుకున్నాడు. అలా అనుకోవడానికి  రెండు కారణాలున్నాయి. మొదటిది; ఆనాడు ఇప్పుడు వున్నంత మతతత్వం లేదు.  రెండోది; నెహ్రూ, అబ్దుల్లా సోషలిస్టు మిత్రులు కనుక రాచరిక వ్యవస్థకు చెందిన తనను వాళ్ళిద్దరు బతకనివ్వరని హరిసింగ్ భయపడ్డాడు.

1947 ఆగస్టు 14, 15 తేదీల్లో పాకిస్తాన్, ఇండియాల ఏర్పాటు శాంతియుతంగా జరిగినట్టు కనిపించినా పక్షం రోజుల తరువాత సన్నివేశం హింసాత్మకంగా మారిపోయింది. పాకిస్తాన్ వదిలి ఇండియాకు వస్తున్న హిందువులు, ఇండియా వదిలి పాకిస్తాన్ కు పోతున్న ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల్లో వేల మంది చనిపోయారు.
  
ఒకవైపు స్వతంత్రంగా వుండాలనుకుంటూనే మరోవైపు ముందు జాగ్రత్తగా పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‍ తో మంతనాలు సాగించాడు హరిసింగ్. నిజాం, జునాగడ్ తమకు దక్కడంలేదని తేలిపోయాక జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ నిస్పృహకు గురై కశ్మీర్ నైనా దక్కించుకోవాలని ఉబలాటపడ్డారు. పాక్ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని ఫక్తూన్ తెగలకు చెందిన ముస్లిం గిరిజనులు అక్టోబరు మూడవ వారంలో కశ్మీర్ భూభాగాల్లోనికి ప్రవేశించారు. తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని ‘ఆజాద్ కశ్మీర్’గా ప్రకటించుకున్నారు. ఆ పరిస్థితిలో నెహ్రూని సైనిక సహాయం అడగడానికి షేక్ అబ్దుల్లాను వెంటబెట్టుకుని ఢిల్లీకి పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు మహారాజ హరిసింగ్.

అప్పటికి భారత  గవర్నర్ జనరల్ గా కొనసాగుతున్న లార్డ్ మౌంట్ బాటెన్  రక్షణ విభాగానికి కూడ అధిపతిగా వున్నాడు. అటు పాకిస్తాన్ లోనూ, ఇటు ఇండియాలోనూ రక్షణశాఖల్లో డగ్లస్ గ్రేసీ, అచిన్ లెక్, మేజర్ విలియమ్ బ్రౌన్  వంటి బ్రిటీషర్లే  వున్నతాధికారులుగా వున్నారు.

కశ్మీర్ పాకిస్తాన్ వశం కాకుండా చూడాలని నెహ్రు చాలా ఆసక్తి చూపించారు. కశ్మీర్ మహరాజు తమ వద్దకు రావడమే గొప్ప వరం అని భారత్ భావించింది. భారత్ తో కలిసి కొనసాగాలన్న కశ్మీర్ కోరికను ఆనందంగా ఆమోదించి అక్టోబరు 26న ఒప్పందం (Instrument of Accession - IOA)  చేసుకుంది.  ఇది కలిసి కొనసాగాలన్న ఒప్పందమేగానీ విలీనం కాదు. కశ్మీర్ రక్షణ, సమాచార-ప్రసార, విదేశీ వ్యవహారాలు  భారత్ కు అప్పచెప్పారు. మిగిలిన అంశాల్లో కశ్మీర్ కు అప్పటి వరకువున్న స్వయంప్రతిపత్తి కొనసాగుతుంది. కశ్మీర్ స్వంత రాజ్యాంగం, స్వంత పతాకాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనేవి ఇందులో కీలకాంశాలు.  ఆ మరునాడు అంటే అక్టోబరు 27న హరిసింగ్ దాని మీద సంతకం చేశాడు. ఈ ఒప్పందమే మొదట్లో 306-ఏ గానూ చివరకు 370 గానూ భారత రాజ్యాంగంలో నమోదైంది.  ఆర్టికల్ 370కు అనుగుణంగా  కశ్మీర్ శాశ్విత నివాసుల్ని నిర్ధారిస్తూ, వాళ్ళ ఆస్తులకు వారసత్వ రక్షణ కల్పిస్తూ  1954 మే 14న  రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వార ఆర్టికల్ 35-ఏ వచ్చింది.

ఐవొఏను అటు కశ్మీర్ ఇటు భారత్ కూడా తాత్కాలిక ఒప్పందంగానే భావించాయి. పాకిస్తాన్ తన బలగాలను వెనక్కి తీసుకున్నాక, కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక, ప్రజాభిప్రాయ సేకరణ  సాగించి అంతిమ నిర్ణయం తీసుకోవాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఆ సందర్భంగా ప్లెబిసైట్ (plebiscite) అనే పదాన్ని లార్డ్ మౌంట్ బాటెన్  వాడాడు. మత ఘర్షణలు పెద్ద ఎత్తున సాగుతున్న కాలంలో, భావోద్రేకాలు తారా స్థాయికి చేరుకున్న రోజుల్లో, తమకు భౌగోళికంగానూ, మతపరంగానూ పాకిస్థాన్ అతి దగ్గరగా వున్నప్పటికీ కాశ్మీరీ ప్రజలు ఢిల్లీనే నమ్మడం, కీలకమైన రక్షణ విభాగాన్ని భారత్ కు అప్పచెప్పడం  చరిత్రలో ఒక మహత్తర విశేషం. అయితే ఇలాంటి మహత్తర సన్నివేశాలను ఆస్వాదించే స్థితిలో ఇప్పడు ఎవరూ లేరు.

ఇన్ స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్   అమల్లో రాగానే షేక్ అబ్దూల్లా ‘ప్రధానమంత్రి’గా, హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ ‘రాష్ట్రపతి’గా కశ్మీర్ లో  అత్యవసర ప్రభుత్వం ఏర్పడింది. షేక్ అబ్దుల్లా ప్రధానిగా పదవిని చేపట్టగానే పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి గడువు విధించి  గట్టి హెచ్చరిక చేయాలని  నెహ్రూను కోరాడు. గడువులోగా పాకిస్తాన్ కశ్మీర్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఆ దేశం మీద పూర్తి స్థాయి యుధ్ధం చేయాలని కూడా సూచించాడు. షేక్ అబ్దుల్లా సూచన నెహ్రూకు కూడా నచ్చింది. అయితే, మౌంట్ బాటెన్ వారించాడు. ఐక్య రాజ్య సమితిలో ఇండియా వాదన బలహీనపడిపోయే ప్రమాదం వుందన్నాడు మౌంట్ బాటెన్.

షేక్ అబ్దుల్లా ప్రధాన మంత్రిగా వున్నంత కాలం కశ్మీర్ లో ఉగ్రవాద జాడలు లేవు. పాకిస్తాన్ కూడా నియంత్రణ రేఖను దాటే సాహసం చేయలేదు. సంఘపరివారం అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామమందిరాన్ని నిర్మిస్తామని శపథం చేసినపుడు కూడ కశ్మీర్ లోయలో కదలిక రాలేదు. కామన్ సివిల్ కోడ్ ను రూపొందిస్తాము అన్నప్పుడూ కశ్మీరీల ఇస్లాం ధార్మిక అస్తిత్వం పెద్దగా స్పందించలేదు. బిజేపి 1980వ దశాబ్దపు చివర్లో రాజ్యాంగంలోని 370, 35-ఏ అధీకరణాలను రద్దుచేసి కశ్మీర్ ను ఇండియాలో సంపూర్ణంగా విలీనం చేస్తామని శపథం చేసిన తరువాతే కశ్మీర్ లోయ తీవ్రంగా స్పందించింది. అది ఉగ్రవాదం పుట్టుకకు, చొరబాటుదార్లకు అవకాశం కల్పించింది.

ఉగ్రవాదం పుట్టుకకు ఎన్నైనా కారణాలు వుండవచ్చుగానీ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలాంటి సమర్ధన వుండదు. వుండరాదు. ఉగ్రవాదం తరచూ తాను ప్రకటించుకున్న లక్ష్యాలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించి తనను తానే అంతం చేసుకుంటుంది.

కశ్మీర్ లోయలోని వారికి రెండు అస్తిత్వాలు ఒకే సందర్భంలో చురుగ్గా వుంటాయి. మొదటిది; కశ్మీరి జాతి అస్తిత్వం (కశ్మీరియత్).  రెండోది; ఆదివాసి / గిరిజన తెగ అస్తిత్వం. కశ్మీరిల  జాతి అస్తిత్వం  పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను స్వయంప్రతిపత్తినీ కోరుకుంటుంది. కశ్మీరీల గిరిజన అస్తిత్వం  ప్రధాన స్రవంతి నుండి పరిరక్షణ కోరుకుంటుంది.  కశ్మీరీల్లో అత్యధికులు ముస్లింలు కావడం ఒక ధార్మిక అస్తిత్వం.   ఈ  మూడవ అస్తిత్వం  స్వీయ సమాజపు సాంస్కృతిక పరిరక్షణని కోరుకుంటోంది.

బయటి శక్తులన్నీ కశ్మీరీల ఒక్కో అస్తిత్వంతో ఒక్కో విధంగా ఇంత కాలం చెలగాటమాడుతూ వచ్చాయి. కశ్మీర్ వల్ల ఇన్ని శక్తులకు ఇన్ని ప్రయోజనాలు వుండవచ్చుకానీ, నిరంతరం మండుతూ వుండడం కశ్మీరీలకు ఎంత కష్టం?

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
 మొబైల్  : 9010757776

రచన : ఆగస్టు 8, 2019
ప్రచురణ : ఆగస్టు 9, 2019, ఆంధ్రజ్యోతి దినపత్రిక