Wednesday 28 April 2021

కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది

 కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది 

రైతుల ఆందోళన  సందర్భంగా ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడ కరోనా వుధృతంగా వుంది; వెళ్ళాల్సిందేనా? తప్పదా?  అని అజిత అడిగింది. వెళితే నేను ఓ రెండు వారాల తరువాత చనిపోవచ్చు; వెళ్ళకపొతే రేపే ఇంటి వెనక చనిపోతాను అన్నాను.  చావు మీద నా అవగాహన అది.

 

“మనుషులు తాము బతకాలనుకున్న విధంగా ఎలాగూ బతకలేరు; కనీసం చావాలనుకున్న చోటైనా చనిపోయే అవకాశం వుండాలికదా!” అనే అర్థం వచ్చేలా వైల్డ్ గ్రాస్ సీరీస్ లో  లూసన్ అన్నాడు. అది నాకు బాగా నచ్చేసి   రెండు కథల్లో  రెండు భిన్నన కోణాల్లో వాడాను.  చావుకు నేను కోరుకునే స్పాట్ గురించి కూడ ఒక సందర్భంలో రాశాను. ఆ క్రమంలోనే ఈ రోజు పోస్టు పెట్టాను.  ఫ్రెడెరిక్ ఏంగిల్స్ కూడ death wish గురించి మాట్లాడి వున్నాడు. మన మార్కిస్టు పెద్దలు అన్నీ చదువుతారు గానీ మార్క్స్, ఏంగిల్స్ ను మాత్రం చదవరు. మనుషుల భావ సంచయనంలో Reification అనేది ఒకటుంటుందని కూడ వీళ్ళకు తెలీదు.  సమయం సందర్భంలేక హేతువాదం  మాట్లాడుతారు. నేను హేతువాదినని ఎన్నడు చెప్పుకోలేదు. పైగా సందర్భ శుధ్ధిలేని హేతువాదుల్ని అసహ్యించుకుంటాను.

 

ఉద్యమ కాలంలో కొందరు సన్నిహితులతో  కొన్ని సందర్భాలలో మృత్యుముఖంలో వున్నాను. వాళ్ళకేకాదు నాకూ చావంటే భయమేకానీ   అనివార్యం అయినపుడు దాన్ని హుందాగా స్వీకరించాలి అనేది నా అవగాహన. వాళ్ళను ఓదార్చేవాడిని. మాభూమి సినిమాలో  “కళ్ళుతెరిచే చనిపోయాడా?” అని తన కొడుకు గురించి ఒక మహిళా గెరిల్లా అడుగుతుంది.  That should be the spirit.

 

సోషల్ మీడియాలో  కొందరు ఒక తప్పుడు సంస్కృతిని ప్రమోట్ చేస్తుంటారు.  వాళ్ళు మనకుగానీ సమాజానికిగానీ చేయగలిగింది ఏమీ వుండదు. ఆ శక్తి సామర్థ్యాలూ  వాళ్ళకు వుండవు. కానీ, ప్రతి పోస్టులో ఒక నైతిక తప్పును వెతికే ప్రయత్నం చేస్తుంటారు.  నా మీద, అజిత మీద అభిమానంతో కష్ట కాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచినవారున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఇలాంటి పిల్ల చేష్టలు ఎన్నడూ చేయరు. నేను వాళ్ళను ప్రేమిస్తాను. మనం కొందరిని ప్రేమించాము అంటే కొందరిని ద్వేషిస్తున్నాము అనేకదా అర్థం.

 

            కరోనా వైద్యం గురించి వైద్యరంగానికి చెందినవారూ, చెందనివారూ అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళందరూ చివర్లో ఒక మాట అంటున్నారు; “50-50 ఛాన్సెస్ వుంటాయి” అట. కరోనా వైద్యం ఒక బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది. To be or not to be. అలా జరగవచ్చు జరగకపోనూ వచ్చు అట. దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదూ?

 

దేశంలోనికి కరోనా వచ్చాక నేను అనేక వూర్లు తిరిగాను. అనేక ప్రయాణాలు చేశాను. అజిత ఇంట్లోనే వుంది. నేనే బలవంతంగా వ్యాక్సిన్ కు  తీసుకుని వెళ్ళాను, RT-PCR టెస్టుకూ నేనే తీసుకుని వెళ్ళాను. చాలా పెద్ద రద్దీ. తోసుకుని వెళ్ళాల్సి వచ్చింది. తనకు అక్కడే సోకి వుంటుంది.

 

నేను 1951లో పుట్టాను. అప్పుడు ఇండియాలో life expectancy 40 యేళ్ళ కన్నా తక్కువ. అంటే నేను  life expectancy కన్నా 80 శాతం ఎక్కువగా  బతికేశాను.  ఇంతటి వయసులో ఒక్కరోజు కూడ హాస్పిటల్ లో ఇన్ పేషంట్ గా లేను. నేను ఆరోగ్యానికి అంతటి ప్రాధాన్యం ఇస్తాను. కరోనా నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది బ్రీథింగ్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు. నేను రోజూ సూర్యోదయానికి ముందు 45 నిమిషాలు బ్రీథింగ్ ఎక్సర్ సైజులు చేస్తాను.  బ్రీథింగ్ ఎక్సర్ సైజు చేసిన తరువాత ఒక సెల్ఫీ తీసుకోవడం ఒక అలవాటు. చెస్ట్ మజిల్స్  ఫార్మేషన్ లో లోపాలు తెలుస్తాయి.  మజిల్స్  ఫార్మేషన్ బాగుంటే కాన్ఫిడెన్స్ లెవల్స్ కొంచెం పెరుగుతాయి. (ఇక్కడ పెట్టిన ఫొటో ఏప్రిల్ 25న తీసింది)

 

మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే  బ్రీథింగ్ ఎక్సర్ సైజులు ఆక్సిజన్ పుష్కలంగా స్వీకరించడానికి పనికి వస్తాయి. వైరస్ ను మందులతోనే ఎదుర్కోవాలి. ఏ మందుతో అన్నదీ ఇంకో బ్రహ్మపదార్ధం. ఒకరోజు Remdesivir  దివ్యౌషధం అంటున్నారు.  నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి Remdesivir  వాడావంటే నేరుగా  వెంటి లేటర్ కు పోవడమే అని హెచ్చరించాడు. అది ఆయన అనుభవం. RT-PCR టెస్టు రిపోర్టుల్లో 50 శాతం తప్పుల తడక అట.  దేన్ని నమ్మాలీ?

 

ఎదైనా అనివార్యం అయినపుడు ఏం చేయాలీ? అనే విషయంలో మనిషికి ఒక విధానం వుండాలి. ఆ కోణం లోనే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. నేను బై  ఛాన్స్ పఠాన్ గా వుట్టాను. బై ఛాయిస్ పఠాన్ గా చనిపోతాను. ఈ మాట కూడ ఇవ్వాళ కొత్తగా అనలేదు. గతంలోనూ ఒకటిరెండుసార్లు అన్నాను. ఫేస్ బుక్ చిల్లర మిత్రులకు ఒక మనవి ఈ పఠాన్ కామెంట్ ను ఇంకో నైతిక చర్చగా మార్చవద్దు.

 

రచన  : 29 ఏప్రిల్  2021


Monday 26 April 2021

AM Khan Yazdani Workout 25 April 2021

 

AM Khan Yazdani

Workout 25 April 2021

AM Khan Yazdani (Danny) and Eluri Agitha



 AM Khan Yazdani (Danny) and Eluri Agitha



తను నన్ను ఇప్పటికీ సూపర్ స్టార్ అనుకుంటుంది!  


  AM Khan Yazdani (Danny) and Eluri Agitha



తను నన్ను ఇప్పటికీ సూపర్ స్టార్ అనుకుంటుంది!   

 

 

అజిత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జగమొండి. Tough. బస్సు సౌకర్యం కూడ లేని ఓ కుగ్రామంలోని పొలాల దగ్గర నుండి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డూప్లెక్స్ వరకు, ఓ ప్రముఖ టీవీ ఛానల్లో అడ్మిన్ వరకు అన్ని స్థాయిల్లోనూ వ్యవహారాల్ని చక్కదిద్దగల నిర్వహణ సామర్థ్యం తనది. తను అనుకున్నది ఏదైనాసరే దాన్ని ప్రేమతోనో కసితోనో సాధించేవరకు నిద్రపోదు. ఫొటో షాప్ ను ముందు తను నేర్చుకుని మా పెద్దాడికి నేర్పింది.  

 

అమ్మాయిని పార్టీలో ఇద్దామనుకుంటున్నాను ఓ మంచి కుర్రాడ్ని చూడండి అని మా మావగారు ఏలూరి భీమయ్య ఓసారి కొండపల్లి సీతారామయ్యను కోరారట. మీ జిల్లాలో డానీ వున్నాడుగా అని కేఎస్‍ అన్నారట. పశ్చిమ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో ఓ అరుగురు అమ్మాయిలు పార్టీ పెళ్ళికి సిధ్ధంగా వున్నారు అని ఓసారి నిమలూరి భాస్కరరావు చెప్పారు. భార్యకు భర్త టాలెంటును అర్థం చేసుకోగలిగినంత జ్ఞానమూ, లోకంలో తన మొగుడే సూపర్ స్టార్ అనుకునేంత అజ్ఞానమూ వుండాలి అని మా గురువుగారు ఎంజీ రామారావుగారు అనేవారు. అలాంటి  జ్ఞానం అజ్ఞానం తూకంలో నాకు అజిత నచ్చింది. పార్టి పెద్దల అభిప్రాయం నా ఎంపిక రెండూ ఒకటే కావడంతో 1983 ఏప్రిల్ 27న మా పెళ్ళి జరిగింది.

 

భార్యాభర్తలు ఒకరుగా కనిపించే రెండు వ్యక్తిత్వాలు. వాళ్ళ మధ్య ప్రేమ వున్నట్టే ఘర్షణ కూడ వుంటుంది. అజితది ప్రధానంగా పల్లెటూరి మనస్తత్వం. నాది మొదటి నుండి పట్టణ దృక్పథం. అంచేత మా మధ్య ఆమేరకు నిరంతరం ఒక ఘర్షణ కూడ కొనసాగింది. ప్రేమించుకుంటూ కొట్లాడుకుంటూ జీవితాన్ని నిర్మించుకుంటూ 38 సంవత్సరాలు పూర్తి చేసేశాం.

 

మార్క్సిస్టు భాషలో చెప్పాలంటే మా అనుబంధంలో పరిమాణాత్మక మార్పు ఒక గుణాత్మక మార్పుకు దారితీసింది.  మా కుటుంబంలో విప్లవానికి ముందు నన్ను నేను జ్ఞానిగా భావించుకోవడమే కాకుండ తనను అజ్ఞానిగానూ భావించడం మూలంగా తనకు నేను పాఠాలు చెప్పేవాడిని. విప్లవం విజయవంతం అయ్యాక తనను తాను జ్ఞానిగా భావించుకోవడమే కాకుండ నన్ను అజ్ఞానిగానూ భావించడం మూలంగా ఇప్పుడు తను నాకు పాఠాలు చెపుతోంది.

 

తను నెలకు ఒకసారయినా విడిపోవాలని గట్టిగా అనుకుంటూ వుంటుంది. నాకు తన మీద చాలా కోపం వచ్చిన సందర్భాలున్నాయిగానీ విడిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కారంచేడు తదితర ఉద్యమాల కోసం నేను ఇల్లు వదిలి వెళ్ళినపుడూ, పనిచేసే పత్రికలు మూతబడినపుడు, నా కష్టకాలాల్లో తను చాలా దృఢంగా నిలబడింది. ఓసారి ఓ టీవీ ఆఫీసులో వాతావరణం నచ్చక తనకు ఫోన్ చేశాను. “నువ్వు తలవంచి ఒకచోట పనిచేయాల్సిన అవసరం లేదు. తక్షణం రిజైన్ చేసి ఇంటికి వచ్చేయి. చూసుకుందాం” అంది. తను అలా సపోర్ట్ చేయకపోతే మీడియాలో నా ‘పొగరు’ కొనసాగేది కాదేమో!

 

నా కాస్ట్యూమ్ డిజైనర్ తనే. షర్ట్స్, ట్రౌజర్స్ దగ్గర నుండి బూట్లు, వాచీలు, కాస్మెటిక్స్, గాడ్జెట్స్ వరకు అన్నీ తనే సెలెక్ట్ చేస్తుంది. అయితే, అజితతో నాకు కొన్ని ఇబ్బందులూ వున్నాయి.  తను ఇప్పటికీ నన్ను ఓ సూపర్ స్టార్ అనుకుంటోంది. అంత వరకే అయితే నాకూ ఆనందమే. కానీ,  ఎవరయినా నన్ను ఎత్తుకుపోతారని ఈ వయసులోనూ  అనుమానిస్తూ వుంటుంది.

 

సమీప భవిష్యత్తులో వివాహ వ్యవస్థ అంతరించిపోతుందని నా అంచనా. కొత్త తరంలో పెళ్ళి మీద ఆసక్తి తగ్గిపోతోంది. సుదీర్ఘ కాలం ఒక అనుబంధంలో కొనసాగడం అనేది ఒక రకం నిర్బంధంగా భావిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వుంది. మా పెళ్ళికి పురోహితునిగావున్న చలసాని ప్రసాద్ వంద పెళ్ళిళ్ళు చేశాడు. వాటిల్లో 99 ఫెయిల్. మేము మాత్రమే ఇంకా కలిసున్నాం. బహుశ మమ్మల్ని ఐదు  అంశాలు కట్టిపడేశాయి అనుకుంటాను. మొదటిది; కుటుంబానికి తన కాంట్రిబ్యూషన్ ను నేను గౌరవిస్తాను, నా కాంట్రిబ్యూషన్ ను తను  గౌరవిస్తుంది. రెండోది; పిల్లలకు  పేరెంట్స్ సౌకర్యాలు కల్పించాలిగానీ సమస్యలు సృష్టించకూడదని ఇద్దరం గట్టిగా అనుకుంటాం. మూడోది; కామన్ ఫ్రెండ్స్. నాలుగోది; కమ్యూనిస్టు అభిమానం. చివరిదయినా ముఖ్యమయినది తనంటే నాకు చాలా ఇష్టం.

 

27 ఏప్రిల్ 2021 

Thursday 1 April 2021

Happy Birthday Arun!

 అరుణ్ ! హ్యాపీ బర్త్ డే!

 

నేను తండ్రి కాబోతున్నానని తెలిసినపుడే పుట్టబోయే బిడ్డకు పేరు కూడ నిర్ణయించుకున్నాను. ఆడపిల్ల పుడితే ఉష, అబ్బాయి పుడితే అరుణ్.   అరుణ్ అంటే మా అమ్మకు సంతృప్తి కలగలేదు. ఇక్బాల్ ఖాన్ అనిపిలిచేది. ఖాన్ ఎప్పుడైతే వచ్చిందో అజితవాళ్ళు చౌదరి తగిలించారు. వెరసి వాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్  చౌదరి అయ్యాడు.

 

కనీస భద్రతను ఏర్పాటు చేయకుండ పిల్లల్ని కనడం తప్పని నేను భావిస్తాను. విజయవాడలో ఒక ఇల్లు, ఒంగోలు దగ్గర కొంత పొలం కూడబెట్టాను. అయితే, అరుణ్  మూడు నెలల వయసులో వుండగా కారంచేడు ఉద్యమంలో పాల్గొనడానికి చీరాల వెళ్ళిపోయాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒంగోలు పొలాన్ని వదులుకున్నాను.

 

తనను మూడేళ్ళ వయసులో వదిలి వెళ్ళిపోయానన్నమాట సహజంగానే వాడికి నచ్చివుండదు. ఉద్యమాల్లో పాల్గొనేవారి కుటుంబాల్లో ఇలాంటి భావోద్వేగ సమస్యలుంటాయి. తరువాతి కాలంలో ఆ లోటును తీర్చడానికి చాలా ప్రయత్నించానుగానీ పిల్లలిద్దరూ ‘అమ్మకొడుకులు’గా వుండిపోయారు. తమను గట్టెక్కించడంలో అమ్మ పాత్ర ముఖ్యమని వాళ్ళు భావిస్తుంటారు.

 

తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఆస్తి వచ్చినట్టు అలవాట్లూ వస్తాయి. అలవాట్లు అంటే అనారోగ్యాలు కూడ. మానాన్నది ధృఢమైన కార్మికుని శరీరం. అది నాకు వచ్చింది. ఆయనకు సినిమాలు, నాటకాలు, పాటలు అంటే చాలా ఇష్టం. బొమ్మలు కూడ గీసేవారట. అవన్నీ నాకూ వచ్చాయి. ఆయనకు ఉబ్బసం వుండేది. అది కూడ నాకు వచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో మానాన్న చాలా అమాయకుడు. అన్నార్తులకు అన్నం పెట్టాలంటే ఆయనకు ఎంత ఆనందమో చెప్పలేము. ఇంట్లో వుందా లేదా అని కూడ చూడకుండ ఎవరెవర్నో ఇంటికి తీసుకుని వచ్చి ఆకలితో వున్నాడంట భోజనం వడ్డించు  అనేవారు. మా అమ్మ తెలివైంది గాబట్టి ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెట్టి మమ్మల్ని గట్టెక్కించింది.

 

మానాన్న చాలా గొప్ప టెక్నీషియన్. మొదటితరం యంత్రపరికరాలు వేటిని చూసినా (విశ్వామిత్రుడిలా) ‘ప్రతిసృష్టి’ చేసే నైపుణ్యం ఆయనకు వుండేది. కొంతకాలం నేను ఆయన వెంట మెకానిక్ బాటలో నడిచానుగానీ మా అమ్మ తప్పించేసింది. నాకు మా పెద్దాడిలో మా నాన్న కనిపిస్తారు; రెండోవాడిలో మా అమ్మ కనిపిస్తుంది. ఒకడిది భావోద్వేగం, ఇంకొకడిది నిర్వహణ సామర్థ్యం. పెద్దాడ్ని చూస్తే ప్రేమ కలుగుతుంది; చిన్నాడ్ని చూస్తే ధైర్యం కలుగుతుంది.

 

మార్కులు ర్యాంకుల కోసం పిల్లల్ని నేను ఎప్పుడూ వత్తిడి చేయలేదు. అప్పట్లో మా తాహతుకు మించిన పని అయినా సరే ఆడుకుంటూ చదువుకోమని స్పోర్ట్స్ స్కూల్ లో చేర్పించాము.  అలాగని అస్సలు పట్టించుకోకుండ వుండలేదు.

 

  మూడవతరం యంత్రపరికరాల్ని అంటే ఎలక్ట్రానిక్ పరికరాల్ని ప్రతిసృష్టించే  నైపుణ్యం మా పెద్దాడిది.  వాడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్. డెల్, సత్యం సంస్థల్లో పనిచేశాడు. హఠాత్తుగా ఒకరోజు  ఉద్యోగం మానేస్తాను అన్నాడు. నా  జీవితంలో వున్న రొమాంటిసిజం వాడి సాప్ట్ వేర్ వుద్యోగంలో లేదట. ఇది తనకు విసుగ్గా వుందట.  సినిమాల్లో టెక్నీషియన్ గా పనిచేస్తాను అన్నాడు.  “మనసుని లగ్నం చేసి కృషిచేస్తే ఏ రంగంలో అయినా సరే విజయం వస్తుంది” అని మానాన్న అనేవారు. నేను నాటకాలు రాస్తున్నా  ఆడుతున్నా మా నాన్న అభ్యంతరం పెట్టేవారుకాదు. ఎక్కడయినా సరే చిత్తశుధ్ధి వుండాలనేవారు.  నేనూ మా వాడిని కాదనలేదు. సినిమారంగంలో  సక్సెస్ రేటు చాలా తక్కువ అని మాత్రం గుర్తు చేశాను. గతంలో నా గురువులు నాకు చెప్పిన మాటే తనకు చెప్పాను. “వంట చేయడం దగ్గర నుండి రాకెట్ సైన్స్ వరకు అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో బేసిక్స్ కొన్ని వుంటాయి. వాటిని ముందు అధ్యయనం చేయాలి. బేసిక్స్ తెలీనివాడు జీవితకాలం గొడ్డు చాకిరీ చేస్తాడేతప్ప ఏ రంగంలోనూ రాణించలేడు. దిసీజ్ థంబ్ రూల్” అన్నాను. సినిమా అనేది విజువల్ ఆర్ట్. లెన్స్ లు, లైటింగ్ ఫిజిక్స్ కు సంబంధించినవి. ఫ్రేమ్ సెట్ చేయడం జామెట్రికి సంబంధించినది.

 

మొదట్లో, సి వనజతో కలిసి కొన్ని డాక్యుమెంటరీలు తీశాడు. ఆ తరువాత శ్రీప్రకాష్ తో కలిసి పనిచేశాడు. యూరేనియం బాధితుల మీద డాక్యుమెంటరీలు తీయడంలో శ్రీప్రకాష్ అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.  2009లో కమల్ హాసన్  మోహన్ లాల్, వెంకటేష్ లతో తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించిన ‘ఉన్నాయ్ పోల్ ఒరువన్’ (తెలుగులో ‘ఈనాడు’) సినిమాకు కెమెరా, ఎడిటింగ్ విభాగాల్లో సహాయకుడిగా పనిచేశాడు. ఇందులో, రెండు ప్రత్యేకతలున్నాయి. కమల్ హాసన్ సినిమాలో పనిచేయడం అనేది సినీ టెక్నీషియన్లకు ఒక కల వంటిది. అది అరుణ్ కు మొదటి సినిమాలోనే నెరవేరింది. ‘ఉన్నాయ్ పోల్ ఒరువన్’ భారతదేశంలో తీసిన మొదటి డిజిటల్  సినిమా. రెడ్ కెమేరాను ఆపరేట్ చేయడానికి లండన్ నుండి టెక్నీషియన్లు వచ్చారు. అలా దేశంలో తొలి డిజిటల్  టెక్నీషియన్ గా వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కూడ అరుణ్ కు దక్కింది. తరువాత తను ‘రెడ్’ అరుణ్ అయిపోయాడు.  ఆ తరువాత 2011లో వచ్చిన ‘గగనం’ సినిమాకు ‘డిజిటల్ టెక్నాలజీ కన్సల్టెంట్’ గా పనిచేశాడు. 

 

మన దేశంలోనికి డిజైనర్ డ్రోన్ లు రావడానికి ముందే స్వయంగా ‘డ్రోన్’ ను రూపొందించి మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో వాడాడు. అలాగే త్రీ - యాక్సిస్ గింబల్ ను తయారు చేసి రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాలో ‘ఫ్లో క్యామ్’   షాట్లు రూపొందించాడు. ఇప్పటికీ కొందరు ‘ఫ్లో క్యామ్’   షాట్లను ‘అరుణ్ షాట్’ అంటుంటారు. అలా తను స్పెషలిస్ట్ కెమేరామేన్ గా స్థిరపడ్డాడు. ‘ఫిదా’, ‘నిశ్శబ్దం’ తదితర సినిమాల్లో అమెరికాలో తీసిన స్పెషల్ సన్నివేశాలు అరుణ్ కు మంచి పేరును తెచ్చాయి. ఇవన్నీ నాకు పుత్రోత్సాహాన్ని కలిగించిన సంఘటనలు. కరోనా కాలంలో ఔడ్ డోర్ షూటింగులు తగ్గిపోవడంతో  ఇప్పుడు తను వాస్తవ ఔడ్ డోర్ సీన్లను స్టూడియోలో డిజిటల్ గా ‘ప్రతిసృష్టి’ చేసే ప్రయోగాలు చేస్తున్నాడు. సినిమా షూటింగు కోసం ఇటలీలో రెండు వారాలుండి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు.   

 

నాకు వున్నట్టే వాడి డ్రాబ్యాక్స్ వాడికున్నాయి. ప్రయోగాల్లో  నిమగ్నమయిపోయాడంటే తిండి నిద్ర ఆరోగ్యం డబ్బును కూడ పట్టించుకోడు. ఎకనామిక్స్ లో బాగా పూర్. మానాన్నకు మా అమ్మ, నాకు అజిత దొరికినట్టు వాడికి ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దే జీవిత భాగస్వామి అయినా దొరకాలి. లేదా వాడే ఎకనామిక్స్ లో బేసిక్స్ అయినా నేర్చుకోవాలి.

 

అరుణ్ ! హ్యాపీ బర్త్ డే!