Monday, 10 November 2025

We know the enemy but not the Friends

సర్,

ఈ వ్యాసాన్ని ‘సాక్షి’లో ప్రచురణకు పరిశీలించండి.

మీకు కుదరని పక్షంలో ఆ విషయాన్ని నాకు సాధ్యమయినంత త్వరగా తెలియపరచండి.

మరో పబ్లిషర్ ను సంప్రదిస్తాను.

-        డానీ

 

We know the enemy but not the Friends

*శత్రువు తెలుసు; మిత్రులెవరో తెలీదు!!*

డానీ

సమాజ విశ్లేషకులు

 

వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణిస్తున్నారు. ఇది కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal Dictatorship-CCD) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఏ).

 

ఈ వ్యవస్థ మారాలని  అత్యధికులు  ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి.  మొదటిది; కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వ రాజ్యాన్ని కూల్చి, ఎన్డీయేను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరిష్కారం. అయితే,  ఆచరణ అంత సులువుకాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్ధాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా   అన్వయించుకోవచ్చు.  

 

లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌరసమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌరసమాజాన్ని కూడ ఇప్పుడు సిసిడి కలుషితం చేసేసింది. సమానత్వ,  సహోదర, సామ్యవాద భావాల నుండి సమాజాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుధ్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.

 

బహుళ పార్టీల పార్లమెంటరి ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం వుంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు  నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడ కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు వుంటారు. వాళ్ళలో ఓ 70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసే బృహత్తర పథకాన్ని రచించి కఛ్ఛితంగా ఫలితాలను సాధించే కార్యాచరణ ఒకటి వుండాలి.

 

అయితే, ప్రజాస్వామ్యం పేదదికాదు; పేదోళ్ళది అంతకన్నా కాదు.  రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజాస్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పారడాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి! (Manufacturing Consent) అన్నమాట. ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.

 

అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సిసిడి ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమనుతాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు.  2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్ డి కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే. అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు  ఎన్ డి కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్ధం ఏమిటీ? ఎన్ డి కూటమి తన స్వంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యతవల్ల మాత్రమే గెలుస్తున్నది.

 

ఈ గణాంకాలను చూసినపుడు ఎవరికైనా వచ్చే ఆలోచన ఏమంటే విపక్షాలు ఏకం అయితే ఎన్డీ కూటమిని ఓడించడం సులువు అని. గణితశాస్త్రం ప్రకారం ఇది వాస్తవం. గానీ, విపక్షాలను ఏకం చేయడం రాజకీయంగా అంతసులువు కాదు. ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి. మరోవైపు, ఎన్డీ కూటమి ఎకశిలా సదృశ్యంగా సమైక్యంగా వుంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీష్ కుమార్ వంటి సోషలిస్టులు కూడ వుంటారు. అయినా, అందరూ ఒక్కటై వుంటారు. అది వాళ్ళ విజయరహాస్యం.

 

విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఎద్దేలు కర్ణాటక (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుంబిగించింది. ఎన్నికలకు సంబంధించిన సూక్ష్మ అంశాలను కూడ వదలకుండ గొప్ప వ్యూహరచన చేసింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నాలజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో వున్న బిజెపి ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగావున్నాసరే ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రతిపక్షంగావున్న కాంగ్రెస్ కు ఓట్లు స్వల్పంగా  (4-5 శాతం) పెరిగినాసరే, సీట్లు భారీగా పెరిగి, అధికారాన్ని చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగావున్నచోటనే ఎద్దేలు కర్ణాటక ప్రత్యేక దృష్టిపెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బిజెపి తన ఆధిక్యాన్ని చాటుకుంది. కాంగ్రెస్ కు 9 స్థానాలు దక్కితే బిజెపి 19 స్థానాలు కైవశం చేసుకుంది.

 

ఎద్దేలు కర్ణాటక ఉత్తేజంతో 2023 తెలంగాణ ఎన్నికల్లో, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ మేలుకో తెలంగాణ, మేలుకో ఆంధ్రప్రదేశ్, భారత్ బచావో పేర్లతో  కొందరు కొంత కృషి చేశారు. తెలంగాణలో బిఆర్ ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అయితే, అందులో ఈ పౌరసంస్థల  ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ సంస్థలు చురుగ్గా పనిచేసిన హైదరాబాద్ నగరంలో అధికార బిఆర్ ఎస్ బలం తగ్గకపోగా పెరిగింది. అంటే నెగటివ్ ఎఫెక్ట్ వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ లో కూడ మేలుకో ఆంధ్రప్రదేశ్, భారత్ బచావో ప్రభావం అస్సలు లేదు. పైగా, ప్రతిపక్షంగావున్న ఎన్డీ కూటమి అధికారాన్ని చేపట్టింది.  అంతేగాక ఏపి, తెలంగాణల్లో ఎన్డీ కూటమి లోక్ సభ స్థానాలు  పెరిగాయి. ఇదంతా నెగటివ్ ఎఫెక్ట్. 

 

ఇందులో  రెండు అంశాల్ని గమనించవచ్చు. మొదటిది; ఈ ఎన్నికలు అన్నింట్లోనూ ప్రజలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టిల బలాన్ని తగ్గించారు. రెండోది; కీలకమైన లోక్ సభ ఎన్నికల్ని పౌర సంఘాలు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.

 

రాబోయే 2029 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి.  ఇదొక సానుకూల సంకేతం. అయితే, జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకత వుంది. ఎన్డీ కూటమికి ప్రతిపక్షం లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంచేత అధికార కూటమికి వ్యతిరేకంగా, ప్రతిపక్షాలతో ఐక్య కార్యాచరణ  కమిటీలను ఏర్పరచడానికి ఇక్కడి నేల అనువుగాలేదు. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా వుంటున్న ఇండియా కూటమి కాలుమోపడానికి ఇక్కడ చోటు కనిపించడం లేదు. అంచేత ఇక్కడ జీరో నుండి మొదలెట్టాలి.

 

తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజికన్యాయ (అంబేడ్కర్)  ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సిసిడి, ఎన్డీ కూటమికి బాధిత సమూహాలు అనేకం వున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం వుంటుంది. ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మతసామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బిసిలు,  ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు ఆధిపత్యకులాల్లోని పేదలు, ఉదారవాదులకూ వారివైన ప్రత్యేక లక్ష్యాలు వుంటాయి. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహాలన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి.

 

ఇంతటి బాహుబలి ప్రాజెక్టును ఒక్కసారిగా చేపట్టలేనప్పుడు దాన్ని క్యాప్సూల్స్ గా మార్చి వంతులవారీగా పూర్తిచేయడం ఒక ఆచరణ సాధ్యమైన మార్గం. అలా, మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ లోని వామపక్షాలన్నింటినీ ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది ఇప్పుడు ముందుకు వచ్చిన ఒక ప్రతిపాదన. ఆ వెంటనే సామాజికన్యాయ పార్టీలను కలపాలనేది లక్ష్యం.   నిజానికి ఇదేమీ కొత్తది కాదు. ఇలాంటి వేదికలు ఇప్పటికే వున్నాయి. వాటికి ఒక విచిత్ర లక్షణం వుంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత అవి కలిసి వుంటాయి. ఎన్నికల సమయంలో ఎవరి ఎత్తుగడలు వారివి; ఎవరి పొత్తులు వారివి. అంచేత, ఇప్పటి జేఏసిలు ఏవీ ఎన్నికలకు పనికిరావు. పైగా, లోక్ సభ వ్యూహాల్ని పార్టీల కేంద్ర కమిటీలు రచిస్తాయి, రాష్ట్ర కమిటీలు వాటిని ఆచరిస్తాయి. అందుచేత, ఈ విషయాల్లో రాష్ట్ర కమిటీలు చేయగలిగింది కూడ ఏమీ వుండదు. లోక్ సభ ఎన్నికల మీద గురిపెట్టి  రాష్ట్ర కమిటీలతో మాట్లాడి ఊరుకుంటే పెద్ద ప్రయోజనమూ వుండదు.

 

ఎవర్ని, ఎందుకు ఓడించాలనుకుంటున్నామో ప్రకటిస్తే సరిపోదు. ఎవర్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నామో స్పష్టంగా ప్రజల ముందు పెట్టాలి. దానికి అనుగుణంగా కలిసి వచ్చే శక్తుల్ని పార్టిల్ని అక్కున చేర్చుకోవాలి. కలిసిరాని శక్తుల్ని పార్టిల్ని నిర్మొహమాటంగా విమర్శించాలి. 

 

లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధోమధనం సాగాలి. 

 

9 నవంబరు 2025

(వామపక్ష సామాజిక ప్రజాస్వామ్య లౌకిక శక్తుల కూటమి కోసం

9 నవంబరు 2025 రాత్రి నిర్వహించిన జూమ్ మీటింగులో చేసిన ప్రసంగానికి పూర్తిపాఠం)


*గ్రూపు రోడ్ మ్యాప్* 


1. కార్పొరేట్‍ మతతత్త్వ నియంతృత్వం (CCD), బిజెపి, ఎన్డీ కూటమిని అంత గట్టిగా కలిపి వుంచుతున్న అంశాలేమీటీ? 


2. రాజకీయ రంగంలో ఎన్డీ కూటమి యేతర రాజకీయ పార్టీలు ఐక్యం కావడానికి అడ్దంకిగావున్న అంశాలేమీటీ? 


ముందు ఈ రెండు అంశాలను తేల్చుకోవాలని K Veeraiah చేసిన సూచనను మన  గ్రూపు ముందుగా  పాటించాలి.  అది ముందస్తు షరతు. 


అప్పుడు  2029 లోక్ సభ ఎన్నికల్లో 

1. మనం ఏ కూటమిని ఎందుకు వ్యతిరేకించాలీ? (మన శత్రువులు ఎవరూ?)

2. మనం ఏ కూటమిని ఎందుకు సమర్ధించాలీ?  (మన మిత్రులు ఎవరూ?)

అనే అశాంల మీద ఒక స్పష్టత వస్తుంది. 

3. అలాంటి స్పష్టతను సాధించకుండా గ్రూపుకు సంపూర్ణ ప్రాతినిధ్య  పేరును కూడ నిర్ణయించలేం. 

4. ఈలోపు గాలిలో వందపేర్లను పరిశీలించినా ప్రయోజనం లేదు. 

5. గ్రూపుకు ప్రాతినిధ్య పేరు నిర్ణయించకుండా  విధానపత్రం రూపొందదు. 

6. విధానపత్రమే లేకుండా కార్యాచరణకు రోడ్ మ్యాప్ ను గీయలేము.

7. రోడ్ మ్యాప్ లేకుండా ఎవ్వరినీ ప్రభావితం చేయలేము. 

8. మన గ్రూపు 2029 లోక్ సభ ఎన్నికల్లో  ప్రభావాన్ని వేయాలంటే ఈ విధివిధానాలను పాటించక తప్పదు. 


- డానీ 

సమాజ విశ్లేషకులు 

 కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)* 

11-11-2025



*పౌరసంఘమా? రాజకీయ పార్టీనా?* 


CBR గారూ! 

రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు - వామపక్ష (మార్క్సిస్టు),  సామాజిక న్యాయ  (అంబేడ్కరిస్టు), ప్రజాస్వామ్య (కాంగ్రెస్ వగైరా) రాజకీయ   పార్టీలు -   రాజ్యాంగ పీఠిక, ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ఆదర్శాలతో - ఒక  కామన్ మినిమం ప్రోగ్రాంను రూపొందించుకుని దాని ప్రాతిపదికన ఒక జాతీయ కూటమిగా  ఏర్పడాలి. 


మీరు ఈరోజు పెట్టిన పోస్టింగునుబట్టి ఇది ఈ గ్రూపు తక్షణ లక్ష్యం అని అర్ధమైంది. బహుశ అవగాహన పత్రంలో కూడ యాక్షన్ పార్ట్ ఇదే అయ్యుంటుంది. 


ఈ లక్ష్యం చాలా ఆదర్శంగా వుంది. ఆదర్శవాదంగానూ వుంది. 


నిజానికి ఇది పైన పేర్కొన్న వివిధ రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి చేయాల్సిన పని. చొరవ చేసి ఈ పార్టీలను జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పడేలా చేసే  వారెవారూ? 


ఇది ప్రజాసంఘాల పరిధిలోని అంశం అని అనిపించడంలేదు. ప్రజాసంఘాలు ఇన్ ఫ్లూయన్సర్లుగా, ప్రెసర్ గ్రూపుగా పనిచేయగలవేగానీ రాజకీయ పార్టిలు చేయాల్సిన నిర్ణయాలు, పనులు చేయలేవు. 


పైగా, ఒక వాట్సప్ గ్రూపు ఈ పని చేయగలుగుతుందని ఆశించలేము.  నేను నా స్థాయిలో మూడు వాట్సప్ గ్రూపులు, ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను.  త్వరలో Forum for Better India అనే ఇంకో గ్రూపును ఆరంభిస్తున్నాను. అవేమీ భారీ లక్ష్యాలను సాధిస్తాయని నేను అనుకోను. పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేస్తే చాలనుకుంటాను. 


అంతేకాక,  ఈ గ్రూపులో సీరియస్ సభ్యులు డజనుకు మించిలేరు. ఇందులో నాన్ సీరియస్ మెటీరియల్ చాలా ఎక్కువగా వుంది. సభ్యుల పోస్టింగులు చూస్తుంటే ఇతర వాట్సప్ గ్రూపులకన్నా ఇదేమీ భిన్నంగాలేదు. ప్రతిరోజూ మీరు రెండు డజన్ల పోస్టింగులు డిలీట్ చేస్తుండడమే దీనికి నిదర్శనం.


మరో విషయం ఏమంటే సిసిడి, బిజెపి, ఎన్డి కూటమిని ఓడించాలనే లక్ష్యం మనకు అనేక వాట్సప్ గ్రూపుల్లోనూ కనిపిస్తుంది. ప్రాధమిక దశలో ఆ గ్రూపులన్నీంటినీ ఒకే గొడుకు కిందికి తేగలమా? ఆలోచించాలి. 


నవంబరు 9 నాటి జూమ్ మీటింగు తరువాత, కే వీరయ్య రెండు ప్రశ్నలు వేశారు. నేను ఇంకో రెండు ప్రశ్నలు వేశాను. ఆ నాలుగు ప్రశ్నలూ నిర్దిష్టమైనవి. నిర్దిష్ట ప్రశ్నలకు నిర్ధిష్ట సమాధానాలు రావాలి.  

అవగాహన పత్రాన్ని రూపొందించినవారు దానికి సమాధానం చెప్పాలిగా? 

ఆ పని ఎందుకు చేయడంలేదూ? 


- డానీ 

సమాజ విశ్లేషకులు 

 కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*



Friday, 7 November 2025

Jawahar Lal Nehru in America - అమెరికాలో జవహర్ లాల్ !

 *అమెరికాలో జవహర్ లాల్!*

 

డానీ

సమాజ విశ్లేషకులు




 

* అమెరికాలో జవహర్ లాల్!*

 

డానీ

సమాజ విశ్లేషకులు

 



జొహ్రాన్ మందానీ అనే ఒక ముస్లిం అడ్వకేట్  గేమ్ చేంజర్ గా మారి న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యాడు. ఆయన గెలుపుకు అనేక ప్రత్యేకతలున్నాయి.

 

జోహ్రాన్ భారత సంతతికి చెందినవాడు. తల్లి మీరా నాయర్ హిందువు, సినిమారంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దర్శక నిర్మాత. తండ్రి మహమూద్ మందాని కూడ భారతీయ ముస్లిం. కొలంబియా  విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్. బహుగ్రంధాల ప్రసిధ్ధ రచయిత. ఇదే న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటరుకు చెందిన రెండు టవర్లను 2001 సెప్టెంబరు 11న (9/11) అల్ ఖైదా ఉగ్రవాదులు కూల్చివేయడం మనందరికీ తెలుసు. ఆ తరువాత అమెరిక, ఇస్లాం సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఉగ్రవాదం వుందంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలెట్టింది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నాము. ఈ ప్రచారంలోని బూటకాన్ని బయటపెడుతూ మహమూద్ మందాని ‘మంచి ముస్లిం, చెడ్డ ముస్లిం’ అనే గ్రంధాన్ని రాసి ప్రచురించాడు. 1979లో సోవియట్ రష్యా అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినపుడు అక్కడి ముస్లింలు తిరగబడ్డారు. రష్యాతో అంతర్జాతీయ వైరంవున్న అమెరికా దీనిని గొప్ప అవకాశంగా భావించింది. ఆఫ్ఘన్ గెరిల్లాలకు అమెరిక ఆయుధాలు, డబ్బు రెండూ సరఫరాచేసి, పాకిస్తాన్ సహకారంతో  ఉగ్రవాద శిక్షణ యిచ్చిందని  మందాని తగిన ఆధారాలతో తన పుస్తకంలో వివరించాడు. రోనాల్డ్ రీగన్ అధ్యక్షునిగా వుండగా ఆఫ్ఘన్ గెరిల్లాలను వైట్ హౌస్ కు ఆహ్వానించి వాళ్ళను స్వాతంత్ర్య సమరయోధులుగా పొగిడిన అంశాన్నీ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

 

మహమూద్ మందానీ, మీరా నాయర్ ఉగాండాలో పనిచేస్తున్న కాలంలో వాళ్లకు జొహ్రాన్ మందానీ జన్మించాడు. జొహ్రాన్ ఏడేళ్ల వయస్సులో వున్నప్పుడు మందానీ కుటుంబం అమెరికాకు మారింది. జొహ్రాన్ ఈ ఏడాదే డిజిటల్ క్రియేటర్ జోహ్రాన్ రమా దువాజీని దుబాయ్ లో నిఖా చేసుకున్నాడు. అలా వారిది ఒక రకంగా వసుధైక కుటుంబం.

 

న్యూయార్క్ లో జొహ్రాన్ అడ్వకేట్ గా  స్థిరపడి మానవహక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అమెరిక ఎన్నికలు జొహ్రాన్ కు కొత్తకాదు. న్యూయార్క్ శాసనసభకు అస్టోరియ (క్వీన్స్) నియోజకవర్గం నుండి  2020లో పోటీ చేసి ఐదు వరుస విజయాలున్న ఘనాపాటిని ఓడించాడు. 2022, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం అతను శాసన సభ్యుడు.

 

ప్రపంచ రాజధానిగా భావించే న్యూయార్క్ నగరాన్ని సహజంగానే ప్రపంచ ధనవంతులు ఏలుతుంటారు. వాళ్లలో అత్యధికులు యూదులు. వాళ్ళే రాజకీయ రంగాన్నీ శాసిస్తుంటారు. మీడియా కూడ వాళ్ల చెప్పుచేతల్లోనే వుంటుంది.  వీళ్లను అలిగార్కీ అంటారు. అలిగార్కీ అండదండలు లేకుండా ఎవరూ అక్కడ ఏ రంగంలోనూ నిలదొక్కుకోలేదు.

 

మేయర్ బరిలో దిగినప్పుడు జొహ్రాన్ ను ఎవరూ పట్టించుకోలేదు.  ఒక చేత్తో ప్లకార్డ్, మరో చేతిలో మైక్ పట్టుకుని ప్రసంగిస్తూ వీధుల్లో నడుస్తుంటే ఒక్కరూ తలతిప్పి చూసేవారు కాదు. పోటీలో పది మంది వుంటే మీడియా అతనికి పదో ర్యాంకు ఇచ్చింది. ఒక శాతం ఓట్లు రావడం కూడ కష్టమని చెప్పింది.

 

ఇటీవలి కాలంలో నెపాల్ లో యువతరం సాగించిన అకస్మిక నిరసనల తరువాత  జెన్-జి పేరు వెలుగులోనికి వచ్చింది.  వీటిని అరబ్ స్ప్రింగ్ తరహా నిరసనలు (Arab Spring-style protests) అంటారు.  టునీషియా, ఈజిప్టు, లిబియా తదితర అరబ్ దేశాల్లోని ముస్లిం యువకులు దీనిని మొదలెట్టారు.

జొహ్రాన్ వయస్సు ఇప్పుడు 34 సంవత్సరాలు. జీ జెనరేషన్  సాప్రదాయం తెలిసినవాడు. న్యూయార్క్ లో ధనవంతుల్ని అతను అస్సలు పట్టించుకోలేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదల్ని లక్ష్యంగా పెట్టుకుని తనప్రచారాన్ని సాగించాడు. “గోదాంలో పెట్టెలు మోసి నీలి మచ్చలుపడ్డ వేళ్లు, డెలివరీ సైకిల్ హ్యాండిల్స్ వల్ల గట్టిగా మారిన అరచేతులు, కిచెన్‌లో కాలిన గాయాలు ఉన్న ముడివేళ్లు. ఇలాంటి చేతులకు అధికారాన్ని పట్టుకునే అవకాశం ఎవరూ ఇక్కడ ఇవ్వరు”. ప్రతి అడ్డంకినీ దాటి ఒక మహా రాజకీయ వంశాన్ని కూల్చివేసి మన భవిష్యత్తుని మన చేతులతో పట్టుకుందాం వంటి మాటలు అణగారిన సమూహాలకు గొప్ప ఉత్తేజాన్నిచ్చాయి.  

 

ఎదురీదడం జొహ్రాన్ నైజం. అతను ముస్లిం అని గుర్తుచేసి, అవకాశం ఇస్తే 9/11 టెర్రరిస్టు సంఘటనలు పునరావృతం అవుతాయని  ప్రచారం మొదలెట్టారు అతని ప్రత్యర్ధులు. అతన్ని శరణార్ధి, చొరబాటుదారుడు అన్నవాళ్ళూ వున్నారు. దానికి అతను భుజాలు తడుముకోలేదు. “అవును నేను ముస్లింను. ముస్లిం ఆచార వ్యవహారాలను  పాటిస్తాను” అంటూ తాను ఇష్టంగా బిర్యాని తింటున్న విడియోను సోషల్ మీడియాలో పెట్టిన గడుసరి అతను.

 

టేల్ అవీవ్ తరువాత ప్రపంచంలో యూదులు అత్యధికంగా నివశిస్తున్న నగరం న్యూయార్క్. అలాంటి నగరంలో ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా ముందు యూదు పెద్దల ఇంటికి వెళ్ళి ఆశ్వీరాదం తీసుకోవడం సాంప్రదాయం. తాము గెలిస్తే ముందు ఇజ్రాయిల్ వెళతామని ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు వాగ్దానం చేస్తుంటారు. జొహ్రాన్ మహామొండి. తాను మేయర్ గా గెలిస్తే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహును న్యూయార్క్ లో కాలుపెట్టనీయనని ప్రకటించాడు. ఒకవేళ అతను వస్తే,  అరెస్టు చేస్తాను అని కరాకండీగా అన్నాడు. యుధ్ధనేరాలకు పాల్పడినందుకు నెతన్యాహు మీద ఏడాది క్రితం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసిసి) ఒక అరెస్టు వారెంటు జారీచేసిన విషయం తెలిసిందే. . 

 

న్యూయార్క్ మహానగరంలో జొహ్రాన్ ఒక సామాజికార్ధిక సరిహద్దు గీత గీశాడు. వున్నోళ్ళు తన ప్రత్యర్ధులు, లేనోళ్ళే తన  మద్దతుదారులు. పేదల ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. వాటి పరిష్కారాల కోసం పథకాలు ప్రకటించాడు. హెల్త్ కేర్, ఇంటి రెంటు, స్వంత ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాల మీద జొహ్రాన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు జనాకర్షణగా మారాయి. ఒక అడ్వకేట్ గా మానవ హక్కుల పరిరక్షణ కోసం అతను చేస్తున్న కృషికి కూడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో అతని భార్య సాగించిన ప్రచారం కూడ బాగా పనిచేసింది. క్రమంగా అతని మద్దతుదారులు పెరిగారు.

 

మమ్దానీ రేసులో దూసుకుని వెళుతున్నాడనే సంకేతాలు రాగానే ఒలిగార్కి తన దగ్గరున్న పావులన్నీ కదిపింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మమ్దానీనీ బహిరంగంగా హేళన చేశాడు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అతన్ని మేయర్ గా ఎన్నుకుంటే న్యూయార్క్ నగరానికి ఫెడరల్ నిధుల్లో కోత విధిస్తానన్నాడు. డెమొక్రాట్స్ పార్టీకే చెందిన అమెరిక మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా సహితం మందానీ కోసం ప్రచారం చేయడానికి నిరాకరించాడు.

 

సాహిత్యంతో పరిచయం వున్నవాళ్ళకు మమ్దానీ ఉపన్యాస శైలి  జాక్ లండన్ నవల ఉక్కుపాదం (ఐరన్ హీల్) లోని కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవ్వర్ హార్డ్ ను గుర్తుకు తెచ్చింది.  సామాజిక ఉద్యమాలతో పరిచయం వున్నవాళ్ళకు ముస్లిం మస్జీద్ (Muslim Mosque)  వ్యవస్థాపకుడు, ఆఫ్రో అమెరికన్ ఉద్యకారుడు మాల్కమ్-ఎక్స్ ను గుర్తుకు తెచ్చింది.

ప్రత్యర్ధులు అతన్ని కమ్యూనిస్టు, మార్క్సిస్టు, రాడికల్ అన్నారు. అలా అన్నా  న్యూయార్కీయులు భయపడతారని అనుకున్నారు. కానీ అందుకు విరుధ్ధంగా జరిగింది. ఇస్లామోఫోబియా రాజ్యం చేస్తున్న చోట ఒక ముస్లింను న్యూయార్కీయులు ఎన్నుకున్నారు. వసలదారుల భరతం పడతానంటూ దేశాధ్యక్షుడు రంకెలు వేస్తున్న చోట ఒక వలసదారుడిని గెలిపించారు.  ఇదేమీ విప్లవంకాదు; అక్కడేమీ సోషలిస్టు రాజ్యం ఏర్పడడంలేదు. కాకపోతే జొహ్రాన్ గెలుపుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రధానంగా ఇది అమెరికాలో అణగారిన సమూహాలకు ఆత్మగౌరవ విజయం!!!

 

ఆర్ధిక విధానాల్లో రిపబ్లికన్స్, డెమొక్రాట్స్ మధ్య పెద్ద తేడా ఏమీలేదు. డెమోక్రాట్స్ లో జొహ్రాన్  నిస్సందేహంగా వామపక్షం.  మనకు కూడ కాంగ్రెస్ లో ఒకప్పుడు కుడిపక్షం వామపక్షంవుండేది. గోపాలకృష్ణ గోఖలే, సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌ కుడిపక్షం; జహవర్ లాల్ నెహ్రు,  సుభాష్ చంద్రబోస్ వామపక్షంగా వుండేవాడు. జోహ్రాన్ మందానీ కమ్యూనిస్టుకాడు; నక్సలైటూ కాడు. కేవలం సోషల్  డెమోక్రాట్. అతనిప్పుడు అమెరికాలో జవహర్ లాల్ నెహ్రూ! గెలిచినప్పుడు కూడ అతను నెహ్రూని తలుచుకోవడం యాధృఛ్ఛికం కాదు.

 

“న్యూయార్క్ వలసదారుల నగరం. ఇది వలసదారులు నిర్మించిన నగరం. వలసదారులు శక్తివంతంగా మార్చిన నగరం. ఇది వలసదారుల నగరంగా కొనసాగుతుంది.  అంతేకాదు; ఈ రాత్రి నుండి అయితే ఇది వలసదారులు నడుపుతున్న నగరం. అయ్యా డొనాల్డ్ ట్రంపుగారు! నా మాటలు గట్టిగా ఆలకించండి. ఇక్కడ మీరు ఎవరిని తాకాలన్నా మిమ్మల్ని అందరినీ దాటుకుని వెళ్ళాలి” అంటూ జోహ్రాన్ తన విజయోత్సవ సభలో అన్న మాటలు అమెరిక రాజకీయాల్లో రాబోయే మార్పులకు సంకేతం కావచ్చు.

 

మనదేశంలోనూ జొహ్రాన్ ఎన్నిక మీద చర్చ జరుగుతోంది.  అతను బాహాటంగానే గుజరాత్ అల్లర్లను విమర్శించాడు కనుక బిజేపి –ఎన్డీయే పక్షాలు అసహనంగానే వుంటాయి. ఇక కమ్యూనిస్టు పార్టీల్లో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. నేపాల్ లో యువతరం తిరగబడి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేశాక, బస్తర్ అడవుల్లో మావోయిస్టుల లొంగుబాటు జాతరను చూసేక కమ్యూనిస్టు అభిమానుల్ని కుంగుబాటు గట్టిగా ఆవహించింది. వాళ్ళలో ఒక భాగానికి సోషలిస్టు ముద్రవున్న జొహ్రాన్ గెలుపు ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. జొహ్రాన్ ను సొషల్ డెమోక్రాట్ అనడానికి కూడ ఇష్టపడని తీవ్రవాదులు సహితం భారత కమ్యూనిస్టు శిబిరంలో వున్నారు. వాళ్ళు సహజంగానే అతని గెలుపును తగ్గించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్ళను ట్రంపు ఆవహిస్తే, జొహ్రాన్ ను శరణార్ధి, చొరబాటుదారుడు అన్నా ఆశ్చర్యం ఏమీలేదు.

 

రచన : 7 నవంబరు 2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి 9 నవంబరు 2025

https://www.andhrajyothy.com/2025/editorial/zohan-mamdani-the-jawaharlal-of-america-1464345.html

https://epaper.andhrajyothy.com/NTR_VIJAYAWADA_MAIN?eid=182&edate=09/11/2025&pgid=1226166&device=desktop&view=3

Saturday, 25 October 2025

It is impossible to change a society that is Unknown!

 It is impossible to change a society that is Unknown!

అర్ధంకాని సమాజాన్ని మార్చడం అసాధ్యం!




 


*అర్ధం కాని ఈ సమాజాన్ని ఎలా మారుస్తారూ?*

 

ఈరోజు (25-10-2025 శనివారం) ఆమ్ధ్రజ్యోతి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.

పత్రిక యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజీ బాధ్యులకు

ధన్యవాదాలు.

స్థలాభావంవల్ల కొంత భాగాన్ని వాళ్ళు కత్తిరిస్తారు. అలాగే శీర్షికను మార్చే హక్కు కూడ పత్రికల వారిదే. పత్రికల్లో ఇది సహజం.

 

పూర్తిపాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తిగలవారు చదివి కామెంట్ చేస్తే ఆనందిస్తాను.

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

 

డానీ

సమాజ విశ్లేషకులు 

 

          సమాజం నిరంతరం మారుతూ ఎప్పటికప్పుడు ఒక కొత్త దశలోనికి ప్రవేశిస్తుంటుంది. కొన్ని దశలు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట గతంలో  కొనసాగినట్టుగా అనిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో చరిత్ర పునరావృతం  అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ, చరిత్ర ఎన్నడూ పునరావృతం కాదు. కాకపొతే కొన్ని పోలికలు వుండొచ్చు. లేదా దశ స్థాయి  మారవచ్చు. ప్రతి దశనూ ప్రతి స్థాయినీ కొత్తగా నిర్వచించాల్సిందే. ఇది కాలపు ఆలోచనాపరుల బాధ్యత.

 

          రాజ్యాంగం ప్రకారం మనది  ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం’. ఒక ఆదర్శాన్ని ప్రకటించుకోవడం వేరు. ఆదర్శాన్ని ఆచరించడం వేరు. రాజ్యాంగాల్లో ప్రకటించుకున్నట్టుగా సమాజమూ వుండదు ప్రభుత్వమూ పనిచేయదు. రాజ్యాంగ పరిధిలోనే భారతదేశంహిందూ మతరాజ్యంగా మారిపోయిందని సుబ్రమణియన్ స్వామి వంటివాళ్ళు ఐదేళ్ళ క్రితమే ప్రకటించారు. ఒక ప్రజాస్వామిక  రాజ్యాంగం అమల్లో వుండగా దేశంలో మతరాజ్యం ఏర్పడడం రాజకీయ ధార్మిక రంగాల్లో  వైచిత్రి కావచ్చుగానీసామాజిక రంగంలో అది చాలా పెద్ద సంక్షోభాన్ని రేపుతుంది.

 

          భారత సమాజాన్ని అంచనా వేయడంలో కమ్యూనిస్టు పార్టీల్లో కూడ విపరీతమైన వైరుధ్యం కనిపిస్తుంది. సమాజాన్ని అర్ధం చేసుకున్న దాన్నిబట్టే ఆయా పార్టీల దీర్ఘకాలిక కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది.

 

          మనది అర్ధ భూస్వామ్య-అర్ధ వలస సమాజమని మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలన్నీ భావిస్తుంటాయి. ఇది 1935-40 మధ్య ప్రాంతంలో చైనా సమాజం గురించి  మావో చేసిన విశ్లేషణ. దాన్నుండి ఆయననూతన ప్రజాస్వామిక విప్లవంఅనే కార్యక్రమాన్ని రూపొందించాడు. చైనాలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ బూర్జువావర్గం కూడ కమ్యూనిస్టుల  విప్లవంతో కలిసి వచ్చింది. ఇండియాలో అలాంటి పరిస్థితి లేకపోయినా, స్థల కాలాలు మారిపోయినా మావోయిస్టులతోసహా మార్క్సిస్టులెనినిస్టు పార్టీలన్నీనూతన ప్రజాస్వామిక విప్లవంను పట్టుకుని వేలాడుతున్నాయిమనదేశ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయ ప్రధానంగా వున్నప్పుడు కార్యక్రమం సరైనదనే అభిప్రాయం కొనసాగింది. ప్రధాన స్రవంతి కమ్యూనిస్టు పార్టీలు  పెట్టుబడీదారీ వ్యవస్థ ప్రాధాన్యాన్ని గుర్తించి, జనతా ప్రజాస్వామిక విప్లవం, ప్రజా ప్రజాస్వామిక విప్లవం వంటి కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. నలభై యాభై యేళ్ళ కింద రూపొందించుకున్న కార్యక్రమాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.

 

          1990లలో మన దేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా   సామాజిక ఆర్ధిక వ్యవస్థల పునాది మారిపోయింది. తూర్పు యూరప్ లోని సోషలిస్టు ప్రభుత్వాలు  పతనం కావడమేగాక  సోషలిస్టు రష్యా సహితం విఛ్ఛిన్నం అయిపోయింది. కమ్యూనిజానికి ఆమోదాంశం ఇరుకున పడిపోయింది. మరోవైపు, గాట్ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడి సరళీకృత ఆర్ధిక విధానాలు వచ్చాయి. డిజిటల్ టెక్నాలజీతో సాంప్రదాయ ఉత్పత్తి విధానమే మారిపోయింది. వీటికితోడు మనదేశంలో మతతత్వ రాజకీయాలు విజృంభించాయి. కొత్త గణాంకాల ప్రకారం మనదేశ జిడిపిలో వ్యవసాయం, ఆక్వా, అటవీ సంపదల వాటా 16.3 శాతం. పారిశ్రామిక రంగం వాటా 29 శాతం. కొత్తగా ప్రవేశించిన సర్వీస్ సెక్టార్ వాటా 54.55 శాతం. అయినప్పటికీ ఎవరయినా ఇప్పటికీ వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం  అంటే మాత్రం వాళ్ళ మెదళ్ళను పురాతత్వశాలల్లో జాగ్రత్తగా భద్రపరచాల్సివుంటుంది

 

          సమాజంలో అయినా ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలతో కూడిన ఉత్పత్తి విధానం రాజకీయాలతో సహా ఇతర సామాజిక సాంస్కృతిక  రంగాలన్నింటినీ ప్రభావితం చేస్తుంటుంది. సూత్రాన్ని 21 శతాబ్దపు డిజిటల్ సమాజానికి అన్వయించే పని ఎవరూ చేయలేదు.

 

          ఆధిపత్య సమూహాల దగ్గర రాజకీయ అధికారంతోసహా  వనరులన్నీ సమృధ్ధిగా వుంటాయి. అంచేత వాళ్ళు కొత్త సమాజాన్ని విశ్లేషించుకున్నా, విశ్లేషించుకోకపోయినా వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమీలేదు. కానీ, వర్తమాన సమాజంవల్ల ఇబ్బందులు, వివక్ష, అణిచివేతలకు గురయ్యేవాళ్ళు దాన్ని మార్చాలనుకుంటే మాత్రం  కొత్త పరిణామాలను నిశితంగా విశ్లేషించుకోకతప్పదు.

 

          రోగ నిర్ధారణ సరిగ్గా జరగకుండా రోగాన్ని నయం చేయడం ఎంతటి వైద్యుడికైనా ఎన్నటికీ సాధ్యంకాదు. అలాగే, సమాజాన్ని వాస్తవికంగా అర్ధం చేసుకోకుండా దాన్ని మార్చే కార్యక్రమాన్ని ఎవ్వరూ రూపొందించలేరు. విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడమే సజావుగా సాగనప్పుడు దాన్ని విజయవంతం చేయడం అసాధ్యం అవుతుంది. ప్రస్తుతం బస్తర్ లో మావోయిస్టు పార్టి ఉనికి సంక్షోభంలో పడిపోవడం దీనికి సరికొత్త హెచ్చరిక

 

          మరోవైపు, దేశాన్ని ఫాసిజమో, నాజిజమో పాలిస్తున్నదనే అభిప్రాయాన్ని కొందరు తరచూ వ్యక్తం చేస్తున్నారు. పాలకుల్లో లక్షణాలు కనిపిస్తున్నమాట నిజమేగానీ వందేళ్ళ నాటి ఇటలీ, జర్మనీ రాజకీయ సామాజికార్ధిక పరిస్థితులు ఇప్పటి మన సామాజిక వాస్తవం ఒకటి కానేకాదు. ఇప్పుడు మనం చూస్తున్నది కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం. (Corporate Communal Dictatorship -CCD). కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందూత్వ ఆధిపత్యంరాజ్య అణచివేతల క్రూర సమ్మిశ్రిత వ్యవస్థ ఇది. ఆర్ధికరంగంలో సహజవనరులు, కుత్రిమ వనరులు, శాస్త్రవిజ్ఞానం మొత్తం క్రమంగా కార్పొరేట్ల ఆధీనంలోనికి వెళ్ళిపోతుంటాయిసాంస్కృతిక రంగంలో మెజారిటీ మతం ఇతర మతాలను క్రూరంగా అణిచివేస్తుంటుంది. సామాన్య ప్రజలు తిరగబడకుండా రాజ్యం అణిచివేస్తుంటుంది. మూడు రకాల అణిచివేతల బాధితులు ఏకం కావాలని కొందరు సమజసంగానే  అంటుంటారుగానీ అది అంత సులువుకాదు.

 

          సన్నివేశం చాలా సంక్లిష్టంగా తయారవుతుందిమెజారిటీ మతం ఇతర మతాల్లోనూ విభజన తీసుకుని వస్తుంది. తనకు అనువైన జైన, బౌధ్ధ మతాలను కలుపుకుంటుంది. కులాల కుమ్ములాటలో నిత్యం మునిగితేలే హిందూ సమూహాలను ఐక్యం చేయడానికి దానికున్న ఏకైక మార్గం   ఇస్లాం, క్రైస్తవ మతాలను దేశ భద్రతకు ముప్పుగా ప్రచారం చేస్తుండడం.

 

"హిందూ సమాజం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉనికిలో వుండదు. అది కేవలం కులాల సమాహారం. ప్రతి కులం తన ఉనికి గురించి తపనతో ఉంటుంది. దాని మనుగడే దాని ఉనికికి మూలం, అదే దాని ముగింపుకూ మూలం. కులాలు ఎన్నడూ ఒక సమాఖ్యగా కూడ ఏర్పడవు”.

 

కాబట్టి, హిందూ సమాజాన్ని కులాల సముదాయం అనడం కూడ సరికాదు. తమ కోసం, తమ స్వార్థపర లక్ష్యాల కోసం ఒకరితో మరొకరు పోరాడుకుంటుండే సమూహాలు అవి. హిందూ-ముస్లిం అల్లర్లు జరిగినప్పుడు మాత్రమే హిందూ కులాల మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అది కూడ తాత్కాలికం మాత్రమే. ఇతర సందర్భాల్లో ఒక కులం మరో కులంతో తనకో అనుబంధం ఉందని కనీసంగానయినా భావించదుఅని బిఆర్  అంబేడ్కర్ అన్న మాటలు ఇప్పటికీ వర్తిస్తాయి.

 

అంబేడ్కర్ మాటల్ని తిరగేసి చూస్తే, ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలంటే నిరంతరం ముస్లిం భూతాన్ని చూపుతుండాలి అనే అర్ధం వస్తుంది. దీనినే ఇస్లామో ఫోబియా అంటున్నారు. అలా చేస్తే, హిందూ సమాజం మొత్తం కాకున్నా వాళ్ళలో 36-38 శాతం ఓట్లు వేసినా అప్రతిహత శక్తి అని  చెప్పుకునే అవకాశం మన పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో వుంది.

 

          సమాజం నిలువు దొంతరలుగానేగాక, సమాంతరంగానూ సమూహాలు సమూహాలుగా విడిపోయి వుంటుంది. నిలువు దొంతరల్ని విశ్లేషించినంత సులువుకాదు సమాంతర సమూహాల మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించడం. నిలువు దొంతరలు కళ్ళకు కనిపిస్తుంటాయి. సమాంతర సమూహాలను విడగొట్టి చూడడం కష్టసాధ్యం

 

          సమాజం మారాలనో సమాజాన్ని మార్చాలనో చాలా మంది అంటుంటారు. అలాంటివాళ్ళు అన్నింటికన్నా ముందు సమాజ వాస్తవికతను గుర్తించాలి. దానికి  బాధితుల జాబితా సిధ్ధం చేయాలి. సాధారణ బాధితులు మొదలు ప్రధాన బాధితుల వరకు ఒక గ్రేడింగ్ ను కూర్చాలి. ఇప్పటి సమాజాన్ని ఎలాంటి సమాజంగా మార్చాలని ఆశిస్తున్నామో? ఎలాంటి సమాజాన్ని నిర్మించగలమో? నిర్ధారించుకోవాలి. అప్పుడు దిశగా ప్రయాణించడానికి ఒక రోడ్ మ్యాప్   ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇది అంత సులువయిన ప్రక్రియ కాదు. చాలా సంక్లిష్ట ప్రక్రియ. తరచూ మన గతమే మనల్ని కట్టి పడేస్తుంది.

 

          వర్తమాన భారత మేధోరంగాన్ని మూడు దృక్పథాలు నడుపుతున్నాయి. ఎంఎస్ గోల్వార్కర్, కార్ల్ మార్క్స్, బిఆర్  అంబేడ్కర్. గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా మార్క్స్, అంబేడ్కర్ ఆలోచనా స్రవంతుల్ని ఏకం చేయాలి అని చాలామంది అనవచ్చు. దీనినే లాల్ - నీల్ మైత్రి అంటున్నారు కొందరులోతుగా చీలిపోయిన సమాజంలో  ఇది అంత సులువైన వ్యవహారం కాదు.   ఇప్పటి ఇండియా కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి ప్రధాన బాధితులు ముస్లింలు, ఆదివాసులు. ఉద్యమంలోనూ, తరువాత మనం కోరుకుంటున్న సమాజంలోనూ రెండు సమూహాల స్థానాన్ని నిర్ణయించకపోతే బండి ఒక్క అడుగు కూడ ముందుకు నడవదు. ఆలస్యం జరిగేకొద్దీకార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందూత్వ ఆధిపత్యం, రాజ్య అణచివేత మూడూ మరింతగా పెరుగుతుంటాయి.

రచన : 03-10-2025

ప్రచురణ  : 25-12-2025, ఆంధ్రజ్యోతి దినపత్రిక

https://www.andhrajyothy.com/2025/editorial/how-can-we-change-this-misunderstood-society-1459551.html

 

https://epaper.andhrajyothy.com/article/Hyderabad_Main_II?OrgId=251027ef3019&eid=224&imageview=1&device=desktop