Monday 13 April 2015

From 2000 To 2007 (YSR)

Slug : FIRING

కొంచెంతీపి కొంచెంచేదు

2000 నుండి 2007 వరకు

. యం. ఖాన్ యజ్దాని (డానీ)


పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో; అంతర్గతంగానే; ఒక విషాదం వుంటుంది. ప్రజలు ప్రభుత్వాధినేతను ఎన్నుకుంటే, ప్రభుత్వాధినేతలు పోలీసుల్ని నమ్ముకుంటారు. ఫలితంగా; ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు మారుతారేగానీ, పోలీసులు స్థిరంగా వుంటారు.

ఇంగ్లీషులో; కాన్ స్టాంట్, స్టేబుల్ అనే రెండు ధాతువుల సంకరంగా కాన్ స్టేబులరీ అనే పదం పుట్టిందని ఎన్నడో ఒక కవి అనంగా విన్నట్టు గుర్తు. సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఆర్పీ సింగ్ ఒక సందర్భంలో పోలీసింగ్  అంటే యధాస్థితిని కాపాడడం అని ప్రవచించారు. విచిత్రం ఏమంటే; ప్రజలు మార్పుని కోరుకుంటారు. వాళ్ళు యధాస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంచేత; ప్రకృతిసిధ్ధంగా పాముకూ కప్పకూ, గ్రద్దకు పిచ్చుక్కి పడనట్టు, సామాజికంగా పోలీసులకూ ప్రజలకూ పడదంటే పడదు.

జనం మార్పుని కోరుకోవడంవల్లే; వలసపాలనకు వ్యతిరేకంగా సాగిన  జాతీయోద్యమాన్ని విజయవంతంచేశారనీ,   కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని గద్దె ఎక్కించారనీ,   నారా చంద్రబాబునాయుడి హైటెక్కు పోకడల్ని  వ్యతిరేకించి వై.యస్. రాజశేఖర రెడ్డికి  అధికారాన్ని కట్టబెట్టారనీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినపనిలేదు.

ప్రజలు మార్పును కోరుకున్నప్పుడెల్లా పోలీసులు అధికారపక్షాన్నే నిలిచారు; ప్రజల్ని పిట్టల్లా కాల్చిచంపారు. చరిత్ర గమనానికి ఇదొక పార్శ్వం మాత్రమే!. రెండో పార్శ్వం అంతకన్నా ముఖ్యమైనది. అదేమంటే; ప్రజలపై ఉక్కుపాదాన్నిమోపిన ప్రభుత్వాలన్ని అనతికాలంలోనే పతనమైపోయాయి.

ప్రజాందోళనల్ని అందరూ అన్ని సమయాల్లో ఒక్కలాగే చూడరు. ప్రతిపక్షంలో వున్నపుడు, రాజకీయనేతలకు, ప్రజాందోళనలు, అధికార పీఠానికి  చేరవేసే నిచ్చెనలుగా కనిపిస్తాయి. అధికారంలో వున్నప్పుడు, ప్రజాందోళనలే కాళ్ల కింది భూమిని లాగేస్తున్నట్టు కనిపిస్తాయి.

విద్యుత్ టారిఫ్ కు వ్యతిరేకంగా, 2000లో సాగిన ఆందోళనపై, పోలీసులు తుపాకులు పేల్చినపుడు; తాను  అధికారాన్ని కోల్పోతున్నట్టు చంద్రబాబు గ్రహించారో లేదో తెలీదుగానీ; వై.యస్. త్వరలోనే అధికారాన్ని చేపట్టబోతున్నట్టు ఆనాడే తేలిపోయింది. ఇప్పుడూ అంతే! ముదిగొండ కాల్పులతో తెలుగు దేశం శిబిరంలో మళ్ళీ అధికారాన్ని చేపడతామనే ఆశలు చిగురించాయి. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇంత ఉత్సాహంగా ఎన్నడూలేదు. ముదిగొండ కాల్పులు; ఒకవైపు; వామపక్షాల మధ్య ఐక్యతను పెంచగా, మరోవైపు వాళ్లను టీడీపీకి మరింత దగ్గర చేసింది. అమేరకు; రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు రూపుదిద్దుకుంటున్నట్టు అప్పుడే తొలి సూచనలు వెలువడ్డాయి.

పోలీసుల్ని నమ్మని ప్రభుత్వాధినేతలు కూడా కొందరు వుండొచ్చు. అలాంటి నేతల మనసు దోచుకోవడం పోలీసులకు  తుపాకులతో పెట్టిన విద్య. "మీ ప్రాణలు విలువైనవి" అని  ఎవరైనా చెపితే మురిసిపోని మనిషి ఉండడు.  "విలువైన ప్రాణం" మంత్రానికి రాష్ట్రాధినేతలైతే మరీ పరశించిపోతారు. మంత్రంతో ఎంతటి ప్రజానాయకులనయినాసరే పోలీసులు ప్రజాకంటకులుగా మార్చేయగలరు.

ముఖ్యమంత్రి మెప్పు పొందాలనిపించినప్పుడెల్లా గుజరాత్ పోలీసులు ఒక ఎన్ కౌంటర్ చేసేస్తుంటారు. సదరు మృతుడు; నరేంద్రమోడీని హత్యచేయడానికి కుట్రపన్నాడని ఒక కధనాన్ని ప్రచారంలో పెడతారు. దానితో; పోలీసుల అధికారాలూ పెరుగుతాయి; పోలీసుశాఖకు  తనిఖీలులేని నిధుల కేటాయింపులూ పెరుగుతాయి. గుజరాత్ పోలీసులతో ఆంధప్రదేశ్ పోలీసులకు రక్తసంబంధాలున్నాయని సొహరాబుద్దీన్, అతని భార్య ఎన్ కౌంటర్ సంఘటనలు నిరూపించాయి.

ప్రభుత్వాధినేత ప్రజల మనిషిగా ఎక్కువకాలం వుండడం పోలీసులకు ఇష్టంగా వుండదు. ప్రజల మనిషిని పోలీసుల మనిషిగా మార్చడంలో వాళ్ళు బహునేర్పరులు. నిజానికి చంద్రబాబుకు ప్రజల మనిషిగా ఎన్నడూ పెద్ద పేరులేదు; వై.యస్. ఇమేజ్ అందుకు భిన్నమైనదివర్తమాన రాజకీయాల్లో దాదాపు యన్టీ రామారావు అంతటి జనాకర్షణవున్న నాయకుడు వై.యస్సే. ఆయన  అధికారాన్ని చేపట్టడానికి ముందు దాదాపు రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కాలంలో వై.యస్. రాజకీయ ప్రత్యర్థులే అధికారంలో వున్నారు. అయినా, ఆయన నడక, పడక కూడా జనం మధ్యే వుండేది. పాదయాత్ర అనుభవంవల్లనో ఏమోగానీ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొత్తలో, వై.యస్., బంజారాహిల్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సెక్రటేరియట్ల మధ్య పెద్ద హడావిడీ లేకుండానే  రాకపోకల్ని సాగించేవారు. ముఖ్యమంత్రి కాన్వాయి వెళ్ళే సమయంలో ట్రాఫిక్ ను ఆపవద్దని  ఆయన అధికార్లను అదేశించిన సందర్భాలూ ఉన్నాయి.

నక్సల్స్ తో చర్చలనాడే వై.యస్.పై పోలీసుల ప్రభావం పనిచేయడం ఆరంభించిందిచర్చలకు నాయకత్వం వహించిన కోనేరు రంగారావు అభిప్రాయంలోనైతే; శాంతిచర్చలకు వై.యస్. సుముఖంగావున్నా, పోలీసు ఉన్నతాధికారులే పడనివ్వలేదట. పోలీసుల ప్రయత్నాలు ఫలించి,  "విలువైన ప్రాణం" మంత్రం వై.యస్.పై క్రమంగా పనిచేయడం ఆరంభించిందిరాష్ట్రంలో; ఒక్కొక్క ఎన్ కౌంటరుకూ, ముఖ్యమంత్రి సెక్యూరిటి ఒక్కొక్కమెట్టు పెరిగింది. ఇల్లైనా, ఆఫీసైనా, మీటింగైనా, ప్రయాణమైనా పోలీసులు తొలుత ముఖ్యమంత్రికి నీడలా మారారు; పిదప ముఖ్యమంత్రే పోలీసుల నీడన చేరిపోయారు. ఇప్పుడు; ఇళ్ళకు, కార్లకేకాక, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ జామర్లు వస్తున్నాయి. సచివాలయానికీ, క్యాంపు కార్యాలయానికీ కరెంటు ఫెన్సింగు వచ్చింది. రాష్ట్ర రాజధానితో మొదలైన ముఖ్యమంత్రి రక్షణ ఏర్పాట్లు, ఆయన పర్యటనలకూ వ్యాపించింది. ఆయన తరచుగా సందర్శించే కడపజిల్లాలో ప్రత్యేక సెక్యూరిటీ ఎర్పాట్ల కోసంపోలీసులు మధ్య కోట్ల రూపాయల వ్యయంతో ఒక వినూత్న పథకాన్నీ రూపొందించారు. వెరసి ముఖ్యమంత్రి సెక్యూరిటీ బడ్జెట్టూ భారీగా పెరుగుతోంది

ముదిగొండ నేపథ్యంలో; నిన్నరాత్రి చినగంజాం ఫైరింగ్ ఫైలును తిరగేశానుఆధునిక ఉప్పు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా అప్పట్లో ఆంధప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య పెద్ద ఎత్తున ఆందోళన సాగించింది. అందోళనకారులపై 2000 ఫిబ్రవరి 11 రాత్రి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. కాల్పులు జరిగిన రాత్రేఆందోళనకారుల డిమాండ్లను, బలహీనవర్గాల సమాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకూ, హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూ   ఫ్యాక్స్ ద్వార పంపించింది. ప్రభుత్వం నుండి ప్రతికూల స్పందన వచ్చింది. రాత్రి అప్పటి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ పోలీసు భాషనే మాట్లాడారు.

అప్పట్లో పీసిసి అధ్యక్షునిగావున్న వై.యస్. మరునాడు ఉదయానికల్లా ఇంటర్ సీటీ ఎక్స్ ప్రెస్ లో గుంటూరువచ్చిఅక్కడ నుండి శవాల్ని చూడడానికి చీరాల చేరుకున్నారు. ప్రొటోకాల్స్ ను పట్టించుకోకుండా ఎంతో చొరవతో ముందుకువచ్చిన వై.యస్.; చీరాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో; సమాఖ్య ఏర్పాటుచేసిన వేదిక నుండే  ప్రసంగించారు. వేదిక ఎక్కుతూ, సమాఖ్య అధ్యక్షుని వద్ద డిమాండ్ల కాపీని అడిగి మరీ తీసుకున్నారు. "(ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం పేరిట) తెలుగుదేశం పార్టీకీ, పేదలకూ మధ్యన జరుగుతున్న ధర్మపోరాటంలో పేదలకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ ముందుండి పోరాడుతుంది" అన్నారు. "ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదుచేసి, జైలు శిక్ష విధించాల"ని డిమాండుచేశారు.

చినగంజాం కాల్పుల వ్యవహారం శాసనసభలో చర్చకు వచ్చినపుడూ వై.యస్. ఎంతో ఉద్వేగంతో వ్యవహరించారు. గాదె వెంకట రెడ్డితోపాటూ; బలహీనవర్గాల సమాఖ్య ప్రతినిధులు; వై.యస్.ను బంజారాహిల్స్ లోని  శ్రీభాగ్  భవనంలో  రెండుసార్లు కలుసుకున్నారు. సభలో ప్రసంగించడానికి ఆయన రెండు రోజులపాటు నోట్సు తయారుచేసుకున్నారు. పోలీసు కాల్పుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బాలగోపాల్ దగ్గర వున్నాయంటే, వాటి కోసం, ఒకదశలో, ఆయనింటికి వెళ్ళడానికి కూడా వై.యస్. సిధ్ధపడ్డారు.

చివరకు; చినగంజాం మృతులకు న్యాయాన్నికోరుతూ; ఉద్వేగంతో చలించిపోతూ, అవేశంతో ఉగిపోతూ, శాసనసభలో   ఆయన ప్రసంగించిన తీరును చూసిన వాళ్ళకు దృశ్యం  చాలాకాలం వెంటాడింది. చంద్రబాబు వ్యవహారశైలికి భిన్నంగా, సరైన ప్రత్యామ్నాయంగా, అప్పటి నుండే వై.యస్. ఒక కొత్త ఇమేజ్ ను సంతరించుకున్నారంటే  అతిశయోక్తికాదు!

2000 నాటి వై.యస్. ఆర్తి, చొరవ, ప్రజాపక్షపాతం గుర్తున్నవాళ్ళు; ముదిగొండ కాల్పుల వార్త వినగానే ఆయన బాధితుల్ని పరామర్శించడానికి హుటాహుటీన వెళ్ళిపోయి వుంటారని సహజంగానే భావిస్తారు. చీరాలలో చనిపోయింది ఇద్దరే; ముదిగొండలో చనిపోయింది ఆరుగురు. పైగా, ఇప్పుడు వై.యస్. కార్లలోనూ, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లలోనూ కష్టించి  ప్రయాణం చేయాల్సినపనిలేదు. క్షణాన కావాలనుకుంటే క్షణాన, ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి, చిటికెల్లో ఆకాశమార్గాన వెళ్లిరాగల అత్యాధునిక హెలీకాప్టర్ సౌకర్యాలు సహితం ఆయనకున్నాయి. కానీ ఆయన వెళ్ళలేదు. వెళ్లలేదు అనడంకన్నా  వెళ్లలేకపోయారు అనడం సబబుగా వుంటుందేమో!. దానికి కారణం అందరూ ఊహించగలిగిందే; సెక్యూరిటీ సమస్య

వై.యస్. అప్పట్లో చినగంజాంలో తానే డిమాండు చేసినట్టు ఇప్పుడు ముదిగొండ కాల్పులకు బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయలేరు!. వాళ్లకు జైలు శిక్షలు విధించలేరు!. సరిగ్గా; చంద్రబాబు చేసినట్టే కొందరు పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేసి, మరి కొందర్ని బదిలీ చేస్తారుజరిగిన సంఘటనని అందరూ మరిచిపోయిన తరువాత; పోలీసు అధికారుల సర్వీసులన్నీ ఎలాగూ క్రమబధ్ధమైపోతాయి! చినగంజాంలో పోలీసు అధికారి పృధ్వీనారాయణ విషయంలో  జరిగిందే రేపు ముదిగొండ 'డయ్యర్ల'కూ  జరుగుతుంది. నాలుగేళ్లయ్యక, ఖమ్మం ఏసీపీ రమేష్ బాబును హీరోచేస్తూ రెండు సినీమాలు వచ్చినారావచ్చు! పృధ్వీనారాయణ అనే టైటిల్ తో ఒక సినీమా తీసిన ఘనత మన టాలీవుడ్ కు ఎలాగూవుంది!

పాదయాత్ర నాటి ఫొటో ఆల్బంను పరిశీలిస్తేచాలు; ముఖ్యమంత్రి క్రమంగా పోలీసులపై ఎంతగా ఆధారపడిపోతున్నారో తెలుస్తుంది. మూడేళ్లలో ప్రభుత్వాధినేత వ్యవహార శైలిలో  ఎంత తేడా వచ్చేసిందో అర్థం అవుతుంది.

రాజకీయ సంఘటనలు పునరావృతం కావడం కొత్తేమీకాదు. కానీ, ప్రజా రాజ్యశేఖరుడనిపించుకున్న వై.యస్.ను సహితం పోలీసులు వశీకరణ చేసుకోవడం కొంచెం విచిత్రంగానూ, కొంచెం విషాదంగానూ వుంటుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు)
khanyazdani@rvrmail.com

హైదరాబాద్

29-7-2007

No comments:

Post a Comment