Monday 1 October 2018

Government Sponsored Language Development


Government Sponsored Language Development  
ప్రభుత్వ ప్రాయోజిత తెలుగు భాషా వికాసం

-        డానీ




రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు తరువాత తెలంగాణలోని  సాంస్కృతిక కళాకారుల్లో ఎక్కువ మందికి ప్రభుత్వ కొలువులో కొంచెం వసతి దొరికింది. అలాంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే మొదలయింది. అమరావతిలో ప్రభుత్వం నిర్మిస్తున్న “సాంస్కృతిక కేంద్రం’లో వసతి అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ప్రముఖులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వామపక్ష ప్రముఖులు సహితం ఈ వరుసలో వున్నారు. ఈ వ్యవహారం ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి’ (Andhra Pradesh Creativity and Culture Commission కు ఇది తెలుగు అనువాదం)  ప్రాయోజిత  కార్యక్రమంగా సాగుతోంది.

సాంస్కృతికరంగం అంటే మార్క్సిస్టులకు పునాది-ఉపరితలం పరస్పర ప్రభావాలు అనే ఒక విస్తృత అర్ధం వుంది. మరోవైపు సాంస్కృతిక రంగం అంటే నాట్యం, నాటకం, సాహిత్యం, సినిమాలు, టీవీలు, మాతృభాష ప్రచారం  వగయిరాలు అనే సంకుచిత అర్ధమూ ఉంది.

సాంస్కృతికరంగ అభివృధ్ధి అంటే నాట్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలకు వీలుగా ప్రభుత్వం కళాక్షేత్రాలు నిర్మించడం. సినిమా- టీవి కళాకారులకు నంది అవార్డులు, కవులు కళాకారులకు ఉగాది పురస్కారాలు ఇవ్వడం, తెలుగు స్కూళ్ళు, గ్రంధాలయాలకు ఎక్కువ నిధులు కేటాయించడం. కొందరు ప్రముఖ సాహిత్య, కళాకారుల్ని సాహిత్య, సాంస్కృతిక అకాడమీల అధ్యక్షులుగా నియమించి మంత్రులతో సమానంగా కేబినెట్ హోదా కల్పించడం అనేది ఇప్పటికి వున్న అర్ధం. ఇవన్నీ ప్రభుత్వం చేస్తే పాలక సాంస్కృతిక రంగం అభివృధ్ధి చెందుతుందిగానీ ప్రజా  సాంస్కృతిక రంగం ఎలా అభివృధ్ధి చెందుతుందీ? అనేది చాలా ఇబ్బందికర ప్రశ్న.

ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అయినపుడు అది ఎలాంటి నాటకాలనీ, పుస్తకాలనీ ఆమోదిస్తుందో ఊహించడం ఎవరికీ పెద్ద కష్టంకాదు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాధారం అనీ, ప్రత్యేక హోదా సంజీవనీ వంటిదనీ, చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి బాటలో పరుగులు తీస్తున్నదని చెప్పే నాటకాలు, పుస్తకాలను మాత్రమే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందుకు భిన్నంగా వుండే కళాసాహిత్య కృషిని నిరుత్సాహపరుస్తుంది. నిరుత్సాహపరచడం అనేది చిన్నమాట; వీలుంటే నిషేధిస్తుంది. మనకు సుంకరవారి ‘మాభూమి’ నాటక నిషేధ అనుభవం ఎలాగూ వుంది. వారే రాసిన గెరిల్లా నాటకాన్ని ఏం చేసేవారోగానీ, విజయవాడలో తొలి ప్రదర్శన ఇచ్చిన మరునాడే దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీని భారత కమ్యూనిస్టు పార్టి గట్టిగా సమర్ధించింది. ఇప్పుడు చరిత్ర పునరావృతమౌతోంది.    

బతకలేక బడిపంతులు అనే రోజులు మనకు తెలుసు.  ఆ రోజుల్లో జీతాలు తక్కువ అయినా విద్యా ప్రమాణాలు ఎక్కువ అని ఇప్పటికీ చాలా మంది గొప్పగా చెపుతుంటారు. ఇది బతక నేర్చిన బడిపంతుళ్ళ కాలం. వీళ్ళకు జీతాలు ఎక్కువ బోధనా నైపుణ్యం తక్కువ. జీతాలకు విద్యా ప్రమాణాలకు మధ్య విలోమానుపాత సంబంధం వుంటుందని ఈ అనుభవం నిరూపిస్తున్నది. విద్యను ఉచితంగా  చెపుతామన్నా విద్యార్ధులు  ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోడానికి ముందుకు రావడం లేదు. హాస్టలు సౌకర్యం, మధ్యాహ్న భోజన పథకం వంటివి తీసేస్తే ఇప్పుడున్న విద్యార్ధుల్లో సగం మంది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మిగలరు అన్నది అందరికీ తెలిసిన సత్యం.

విద్యార్ధులు లేకపోవడంతో దొరికిన తీరికను సద్వినియోగం  చేసుకుంటున్న ప్రభుత్వ టీచర్లు ఎల్ఐసీ ఏజెంట్లుగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా, వడ్డీ వ్యాపారులుగా, మీడియా స్ట్రింగర్లుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు. గతంలో అంకితభావం లేని టీచర్లు చాలా అరుదుగా కనిపించేవారు. ఇప్పుడు అంకితభావంగల టీచర్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. టీచర్లు, ప్రొఫెసర్లు అనేకాదు; ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యోగవర్గం మొత్తం అలానేవుంది. కార్యనిర్వాహక వ్యవస్థలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యా, కేఎల్ రావు, అలీ నవాజ్ జంగ్ బహద్దూర్ లను పోలిన వాళ్ళను ఇప్పుడు చూడాలనుకోవడం అత్యాశే అవుతుంది.  చివరకు న్యాయ వ్యవస్థలోనూ విలువలు వేగంగా పడిపోతున్నాయి. న్యాయమూర్తులు పక్కా రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారు.

“గతంలో ప్రజల భక్తి గౌరవాలను అందుకున్న వృత్తులు అన్నింటినీ పెట్టుబడిదారివర్గం నీచస్థాయికి తీసుకుని వచ్చింది. వైద్యులు, న్యాయమూర్తులు, కవులు, కళాకారులు,  శాస్త్రవేత్తల్ని అది తన కాలి కింద కూలీకి పనిచేసే నౌకర్లుగా మార్చివేసింది” అని కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్  అన్నారు. ఇప్పుడు కాలం అంతకన్నా ముందుకు సాగింది.  స్వఛ్ఛందంగా ప్రభుత్వ సేవ చేసి తరించడానికి  వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు బారులు తీరి నిలబడుతున్నారు. ప్రజాసేవా రంగంలో  కొత్తగా ప్రవేశించిన సినిమా స్టార్  పవన్ కళ్యాణే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని వామపక్ష పార్టీల అగ్రనేతలు రెండు రోజులకు ఒకసారి విధ్డేయతను ప్రకటిస్తున్న రోజులివి. పవన్ కళ్యాణ్ నిన్నటి దాక  టిడిపి, బీజేపిలతో కలిసి అధికార కూటమిలో వున్నారన్న వాస్తవాన్ని కూడా ఈ నాయకులు  మరచిపోతున్నారు. ఇక వామపక్ష వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ఆ బాటలో నడవాలనుకోవడంలో ఆశ్చర్యకరమైనది ఏదీలేదు.
  
కవులు, కళాకారులు, సాహిత్యకారులు సాంస్కృతికరంగ అభివృధ్ధి పేరిట ప్రభువుల సేవలో తరించడం కొత్తేమీ కాదు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయం కొత్త ప్రవేశ ద్వారాన్ని కాకతీయ కళా తోరణంలా ఆకర్షణీయంగా ఆధునీకరించారు. తెలుగు ప్రముఖులకన్నా విదేశీ ప్రతినిధులతో మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడే చంద్రబాబు సచివాలయం గోడ మీద పెద్దపెద్ద అక్షరాలలో ఇంగ్లీషులో  ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అని రాయించారు. దానితో తెలుగు భాషాభిమానుల మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. ఇంగ్లీషు బోర్డు తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సినిమా దర్శకులు కెబిజి తిలక్, తెలుగు భాషా ప్రచారకులు సి. ధర్మారావు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రి వాళ్ళిద్దరితో శాంతి చర్చలు మొదలెట్టారు. చివరకు ఇరువర్గాలకు అంగీకార యోగ్యమైన ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. తెలుగు భాష మీద అభిమానాన్ని పెంచే ఒక పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రచురించి విస్తృతంగా పంపిణీ చేయాలనేది ఆ పరిష్కారం.

అప్పటికి ఓ అరవై యేళ్ళ క్రితం  కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ బాల్యంలో తనను ప్రభావితం చేసిన పద్యాలను ‘సాహిత్య సురభి’ పేరుతో ఒక సంకలనంగా ప్రచురించి వున్నారు. పాఠశాల విద్యార్ధుల్లో తెలుగు భాష మీద ఆసక్తిని కలిగించడానికి ఆ పుస్తకంలోని పద్యాలు గొప్పగా వుపయోగపడతాయని తెలుగు భాష ఉద్యమ నాయకులు భావించారు. విశ్వనాధవారి సంకలనంలోని కొన్ని పద్యాలను ఎంపిక చేసి ‘పిల్లలకు తెలుగు పద్యాలు’ శీర్షికతో కొత్త సంకలనం ఒకదాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. దాన్ని ఇరవై లక్షల కాపీలు ప్రింటు చేసి రాష్ట్రంలోని పాఠశాలలు అన్నింటికీ పంపిణీ చేసే బాధ్యతను ఉద్యమ నాయకులకే అప్పగించారు. దానికి అవసరమైన నిధుల్ని కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో అప్పటి తెలుగు భాషాభిమానుల మనోభావాలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాయి.   

కవిసామ్రాట్ ను ప్రభావితం చేసిన ఆ పద్యాలను బోధించడం అటుంచి వాటిని అర్ధం చేసుకోవడం కూడా అప్పటి ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు టీచర్లకు సాధ్యంకాలేదు. ఇక వాళ్ళు విద్యార్ధులకు ఏం బోధిస్తారూ?  కొన్నాళ్ళకు ఆ పుస్తకాలు పాఠశాలల స్టోరు రూముల నుండి తూకానికి పాతపుస్తకాలు కొనేవాళ్ళ దగ్గరకూ, అక్కడి నుండి తోపుడు బండ్లకూ, మళ్ళీ అక్కడ నుండి పునుగులు, పచ్చిమిరపకాయల బజ్జీలను మోసుకుంటూ  ఇళ్ళకూ చేరాయి. ప్రతి ఇంటికీ తెలుగు అనే కార్యక్రమం అలా ఘనంగా విజయవంతం అయింది.

తెలుగు భాషాభిమానం అంటే పద్యాలు, పౌరాణిక నాటకాలు అని వీరు ఎందుకు భావిస్తున్నారో అర్ధం కాదు. అంతరించిపోయిన ప్రక్రియల్ని వదిలి కొత్త ప్రక్రియల్ని ప్రాచూర్యంలోనికి తేవాలనే తలంపు వీరికి లేదు. గత అనుభవాలు నేర్పిన పాఠాలను పక్కనబెట్టి తెలుగు భాషా ప్రచారానికి ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమం రూపుదిద్దుకుంటున్నది. దీనికి భారీ నిధులు కేటాయించడానికి ప్రభుత్వం కూడా సిధ్ధంగా వుంది. ఈసారి విశ్వనాధ రచనలతోపాటూ శ్రీశ్రీ రచనల్ని కూడా కలిపి ప్రచురించవచ్చు. ప్రముఖ తెలుగు భాషాభిమానులు ఇప్పుడు శ్రీశ్రీ విశ్వనాధల మధ్య అబేధాన్ని పాటిస్తున్నారు. వర్గసంకరం నేటి న్యాయం.  

(రచయిత సీనియర్ జర్నలిస్టు,  సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

రచన : 1 అక్టోబరు 2018
ప్రచురణ : ప్రజాపాలన, 2 అక్టోబరు 2018 

No comments:

Post a Comment