Monday 14 June 2021

Jilukara Srinivas SENDRAYYA stories & Self-respect

 జిలుకర శ్రీనివాస్ సెంద్రయ్య కథల సారాంశం ‘ఆత్మగౌరవం’

 

కవి-పండితుడు అనే విభజన ఒకటి సాహిత్య రంగంలో వుంది. కవులు హృదయంతోనూ, పండితులు మెదడుతోనూ రాస్తారనేది ఈ వర్గీకరణకు అర్ధం. అంతమాత్రాన కవులకు మెదడు వుండదనీ, పండితులకు హృదయం వుండదనీ కాదు. వాళ్ళ  రచనా వ్యాసాంగంలో ఏది ప్రధానం అనేదే లెఖ్ఖ.

 

జిలుకర శ్రీనివాస్ అనగానే ఒక మంచి వ్యాసకర్త గుర్తుకు వస్తాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబేడ్కరిజాన్ని పదిలంగా కాపాడుతున్న ఓ నలుగురిలో శ్రీనివాస్ ఒకడు. మిగిలిన ముగ్గురూ ఎవరనే ఆసక్తి ఎవరికైనా కలగడం సహజం. నా దృష్టిలో వున్నది; దుర్గం సుబ్బారావు, గుంటూరు లక్ష్మీ నరసయ్య, పసునూరి రవీందర్.

 

 లక్ష్మీనరసయ్య కవితలు కూడ రాస్తాడనీ,  పసునూరి రవీందర్ కథలు కూడ రాస్తాడు అని తెలుసు. గానీ, జిలుకర శ్రీనివాస్, దుర్గం సుబ్బారావు అచ్చంగా ‘వ్యాసులు’ అనే అభిప్రాయంతో ఇన్నాళ్ళూ వున్నాను. జిలుకర శ్రీనివాస్ రాసిన నాలుగు కథల్ని ఈరోజు చదివాను.

 

బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ (సారంగ : 1 నవంబర్ 2020),  బైండ్లోళ్ళ కంచె (సారంగ : 1డిసెంబర్ 2020), నర్సయ్య ధ్యానం  (సారంగ 1జనవరి 2021), బొడ్రాయి సారంగ (సంచిక: 1 మే 2021).

 

ఇది బైండ్ల సెంద్రయ్య నాలుగు కథల సీరిస్ (quadrilogy). అయితే ఇది పది కథల సీరీస్ అట (decology). అంటే ఇంకో ఆరు కథలు రానున్నాయి. ఇప్పటి ఈ నాలుగు కథల్లో ఆత్మ ఒక్కటే; ‘ఆత్మగౌరవం’. ఒకే వస్తువుతో, ఒకే ప్రధాన పాత్రతో నాలుగు కథలు రాయడం ఒక నవల రాసేంత పెద్ద టాస్క్.

 

ప్రతి కథలోనూ అనేక పాత్రలు వుంటాయి. కల్ట్ పాత్రలు వేరు. వాటిని సృష్టించడానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం. ఈ సీరీస్ లో సెంద్రయ్య వంటి ఒక కల్ట్ కేరక్టర్ ను సృష్టించాడు జిలుకర శ్రీనివాస్.

 

తెలంగాణ గ్రామాల్లోని మనుషులనేకాక ప్రకృతిని సహితం గమనించడంలో శ్రీనివాస్ కు ఒక ప్రత్యేక కన్ను వున్నదనిపిస్తోంది. “గడి ముందున్న యాప సెట్టు అమీను క్రూరత్వాన్ని చూసి వూగిపోతంది. ఆకులు రాలి నేల మీద పడుతున్నయి” వంటి  మెటాఫర్లు అనేకం ఈకథల్లో కనిపిస్తాయి. ఇది ఒకవిధంగా మేజికల్ రియలిజం కూడ.

 

జిలుకర శ్రీనివాస్ కథల్లో ఇంకో ప్రత్యేకత వుంది. ఇలియాడ్, ఓడిస్సీ వంటి గ్రీకు పురాణాలు రాసిన హోమర్ పుట్టుగుడ్డివాడు. హెలెన్ ఆఫ్ ట్రాయ్ వంటి పౌరాణిక శౌందర్యరాశి అందాలను హోమర్ ఏ కంటితో చూసి వర్ణించాడు అనే అనుమానం చాలామందికి కలుగుతుంటుంది.   శ్రీనివాస్ కు కూడ అలాంటి ప్రత్యేక దృష్టి వుంది. పిటపిటలాడే వయసులోవున్న  స్త్రీ పాత్రల్ని ప్రత్యేక శ్రధ్ధతో చిత్రిస్తాడు. ‘బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ’ కథలో దామోదర్ రెడ్డి భార్యను, ‘బైండ్లోళ్ళ కంచె’లో  ఆరోళ్ల శారదను అలాంటి ప్రత్యేక కన్నుతో వర్ణిస్తాడు.

 

నాలుగు కథల్లోనూ సెంద్రయ్య ప్రధాన పాత్ర అయినప్పటికీ, ప్రతి కథలోనూ ఇంకో కీలక పాత్ర వుంటుంది. ‘బి’ స్టోరీస్  అన్నమాట. ‘నర్సయ్య ధ్యానం’ కథలో తండ్రి నర్సయ్య ‘బి’ స్టోరీ అదిరిపోతుంది. బాల్యంలో తనను ఆదరించిన కుటుంబానికి కష్టం వస్తే తన కొడుకుని జైలుకు పంపడానికి కూడ సిధ్ధపడే పాత్ర అది.   గొప్ప హృదయమున్న కథ ఇది.

 

ఆసక్తిగలవాళ్ళు ఈనాలుగు కథల్ని కింది లింకుల ద్వార  సారంగలో చదవవచ్చు.

No comments:

Post a Comment