Friday 12 January 2024

Historiography - Three Duties

 IFTU ప్రసాద్ గారికి, 

రోజు మీరు రాసిన  ,43 ఏళ్ల తర్వాత అఫ్సర్ తో అపూర్వ కలయిక!, చాలా బాగుంది. 

చరిత్రకారుడు అన్నవాడు మూడు పనులు చేయాలి. మొదటిది; గతాన్ని గుర్తు చేయాలి. రెండోది; వర్తమానంలో దాని ప్రాసంగికతను చెప్పాలి. మూడోది; దీనికి కొనసాగింపుగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాల్ని వివరించాలి; అది ఊహాగానం అయినా సరే. వెరసి, చరిత్ర రచన అంటే భవిష్యత్తు దర్శనం.  

చాలా మంది మొదటి పని చేసి ఊరుకుంటారు. నా దృష్టిలో వాళ్ళేమీ ఆలోచనాపరులుకాదు. రికార్డిస్టులు. 

మీ రైటప్ లో మూడు అంశాలూ గొప్పగా అమిరాయి. 

తెగ నచ్చింది. 

మీమీద ప్రేమ కలిగింది. 

డానీ 



43 ఏళ్ల తర్వాత అఫ్సర్ తో అపూర్వ కలయిక!


ఖమ్మంలో 1981 లో విడివడి విజయవాడలో అపూర్వ కలయిక ద్వారా పొందిన మధురానుభూతి తో  ప్రతిస్పందన యిది.


  ఆధునిక ప్రపంచ మార్కెట్ వ్యవస్థకు భూగర్భ చమురు చిక్కటి సరుకుగా మారాక,  భూమి మీది మానవ రక్తం పలచటి వస్తువై, చౌక సరుకై,  కాల్వలుగా ప్రవహిస్తోంది. తద్వారా ఆధునిక కుహనా నాగరిక క్రూసేడ్ కి పునాది పడింది. ఇది CLASH OF CIVILISATIONS రూపంలో  బహిరంగ ప్రచారంగా కూడా మారడం తెల్సిందే. 


 'చమురు చిక్కన-నెత్తురు పలచన' అనే అమానుష, అనాగరిక దుష్ట ప్రక్రియకు భూగోళంలో ప్రధానమైన రక్తక్షేత్రంగా వెస్ట్ ఆసియా @ మధ్యప్రాచ్యం పేరొందింది.  106 ఏళ్ల క్రితం 2-11-1917 వ తేదీన దానికి బీజం పడినా, పునాది మాత్రం  15-5-1948 న పడింది. అదే జియోనిస్ట్ ఇజ్రాయెల్ రాజ్య స్థాపన! 


  చమురు నిల్వల ప్రాంతాలు ముస్లిం దేశాలు కావడంతో అక్కడ మానవ నరమేధం మొదలై నేటికీ సాగుతోంది.  ఆధునిక ప్రపంచంలో అదో  విషాధ రక్తసిక్త చరిత్ర! నాటి నక్బా నుండి నేటి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా గుండా గాజా వరకూ కొనసాగుతోన్న రక్తసిక్త చరిత్రే! కానీ చమురు నిల్వలు లేని మరో ప్రాంతంలో కూడా అదే కాలంలో ముస్లిం మతస్తుల పై ఘోర నరమేధం సాగింది. అదెక్కడో కాదు.  మతప్రసక్తి లేని "లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర" రాజ్య వ్యవస్థ ఏర్పడి, దానికోసం ఓ లిఖిత రాజ్యాంగ పత్రాన్ని రూపొందించే వేళ ఇక్కడే కావడం గమనార్హం! అదే హైదరాబాద్ సంస్థానం మీద పటేల్ నేతృత్వంలో సాగిన  సైనిక చర్య! 


   ఇజ్రాయెల్ స్థాపన జరిగిన రోజు 15-5-1948. 


హైద్రాబాద్  సంస్థానం మీద సైనిక చర్య పూర్తయిన రోజు 17-9-1948. 


పై రెండింటి మధ్య తేడా నాలుగు నెలలే! 'చరిత్ర క్యాలెండర్' లో ఇది సముద్రంలో కాకి రెట్ట!


 చరిత్రలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవి చరిత్రను ముందుకు నడిపించడం కోసం మాత్రమే కాదు, దానిని వెనక్కి నడిపించడానికి కూడా! 


   నక్బాగా పేరొందిన ఆనాటి పాలస్తీనా నరమేధానికి డేవిడ్ బెన్ గురియన్ నాయకుడు. నాటి మరట్వాడా ముస్లింల నరమేధానికి సర్దార్ పటేల్ నాయకుడు. అక్కడ బెన్ గురియన్ వారసత్వం నాటి నుండి నేటివరకి నిరంతరంగా కొనసాగుతోంది. తద్భినంగా ఇక్కడ పటేల్ వారసత్వం నాడు తెర మరుగై తిరిగి నేడు పునరావిష్కరణ జరిగింది. బెన్ గురియన్, పటేల్ మధ్య నాటి ఫాసిస్టు రాజకీయ బంధం... నేతన్యాహు, మోడీ మధ్య నేటి ఫాసిస్టు రాజకీయ బంధం..  ఓ జంట ద్వయం. విధ్వంసకర చరిత్ర గమనంలో సైతం ఈ పునరావిష్కరణలు జరుగుతాయేమో!


  కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ పోరాటం జరిగిన వీర తెలంగాణాలో ముస్లిం నరమేధం జరగలేదు. పైగా స్థూలంగా మత సామరస్యం వర్ధిల్లింది. కానీ హైద్రాబాద్ సంస్థానంలో భాగమైన మరట్వాడా ప్రాంత ముస్లిం ప్రజలపై ఆధునిక కుహనా నాగరిక ప్రజాతంత్ర, లౌకిక, గణతంత్ర రాజ్య సైనిక వ్యవస్థ అమానుష ఊచకోతను సాగించింది. తెలంగాణాలో కమ్యూనిస్టుల ఊచకోత, మరట్వాడాలో ముస్లిం మైనారిటీ ప్రజల ఊచకోత ఏకకాలంలో సమాంతరంగా సాగాయి. అవి ఆధునిక లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యాంగ రచనా కాలంలో సాగడం గమనార్హం! 


 సర్దార్ పటేల్ నేతృత్వంలో సృష్టించిన నాటి మరట్వాడా రక్తక్షేత్ర చరిత్ర తెర మరుగున పడింది. ఆ చీకటి చరిత్రను ఓ 'ఖమ్మం కుర్రవాడు' ఒకటిన్నర దశాబ్దం పరిశోధించి గ్రంథస్థం చేశాడు. అదే ఇటీవల విడుదలైన REMAKING HISTORY అనే ఆంగ్ల గ్రంధం. అది నేడు ప్రపంచ వ్యాప్తంగా సంచలన గ్రంధంగా పేరొంది  ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ఖమ్మం కుర్రవాడే ప్రముఖ కవి, రచయిత మిత్రుడు అఫ్సర్!


  46 ఏళ్ల క్రితం అఫ్సర్ తో ఏర్పడ్డ మిత్రబంధాన్ని గుర్తు చేసుకోవడానికి  సముచిత సందర్భమిది.  


  దాశరథి సోదరుల వంటి ప్రఖ్యాత కవులతో వర్ధిల్లిన ఖమ్మం నేల నిజాం పాలన తర్వాత  కూడా తన సాహిత్య వారసత్వ చరిత్రను అలాగే కొనసాగించింది. పుల్లాభట్ల వెంకటేశ్వర్లు, కొలిపాక మధుసూదన్, దిలావర్ మహమ్మద్, చావా శివకోటి, సర్వదేవభట్ల కవిరాజ మూర్తి, రావెళ్ల వెంకట్రామారావు తదితర ఉద్దండ పిండాల వంటి కవులతో విలసిల్లిన  చరిత్ర వారసత్వం ఖమ్మంలో కొనసాగింది. ఆ కవిలోకంలో  కౌముది ఒకరు. కవులకు కవులే పుట్టాలనే నియమం లేదు. కానీ కవే పుట్టాడు. ఆ కౌముది గారి కొడుకే అఫ్సర్!


 కౌముది గారు ఒకవైపు పాత్రికేయునిగా, మరోవైపు కవిగా ఖమ్మంలో ప్రసిద్ధులు. 1970 దశాబ్దం మధ్య నుండి మేము PDSU విద్యార్థి సంఘంలో పని చేశాము. 1977 లో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత వెల్లువెత్తిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ  ఉద్యమ వెల్లువ కాలంలో కౌముది గారి కలం పదునెక్కి మాకు సన్నిహితం చేసింది. ఖమ్మం పాత బస్ స్టాండ్ సమీపంలో కాంగ్రెస్ ఆఫీసు వెనక ఇల్లు వారి నివాసం. ప్రెస్ నోట్స్, ప్రత్యేక రైటప్స్ కోసం నాతో సహ PDSU బృందం  ఇంటికి వెళ్లి కౌముది గారిని తరచుగా కలుస్తుండేది.  కౌముది గారు సౌమ్యులు, స్నేహశీలి, ముఖ్యంగా విశాల హృదయులు. అలా ఇంటికి వెళ్తోన్న సమయంలో మాకు ఓ పిల్లవాడు కనిపించే వాడు. ఆ కుర్రాడే ఈనాటి కవి, సుప్రసిద్ధ పరిశోధనాత్మక సంచలన గ్రంథ రచయిత అఫ్సర్!


 1977 నుండి 80 వరకూ ఖమ్మంలో జరిగే వీలున్న కవి సమ్మేళనాలకు హాజరయ్యే వాడిని. పైన పేర్కొన్న కవి పుంగవులతో పరిచయం ఉంది. జీవన్ గారి ద్వారా ఖమ్మంలో విరసం సభ్యత్వం పొందిన వారిలో నేనొకణ్ణి. సాహితీ రంగం నుండి నేను రాజకీయ రంగం వైపు దారి మళ్లడంతో కౌముది గారి నుండి అఫ్సర్ కి నా సజీవ బంధం కూడా బదిలీ ఐనది. 


 అఫ్సర్ సామాజిక జీవితం మొదట ఉద్యమకారునిగా ప్రారంభమైనది. అదో కధ!


  అది 1978. జ్యోతి బాల మందిర్ స్కూల్ లో అఫ్సర్ బహుశా 9వ తరగతి విద్యార్థి. అది ఖమ్మం ZP ఆఫీసు వెనక జమ్మిబండ రోడ్ లో ఉంది. ఆ స్కూల్ యాజమాన్యం  నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితుల్లో అఫ్సర్ ఆందోళనా కారునిగా మారాడు. స్కూల్ బృంద ఆందోళనా సారధుల్లో అఫ్సర్ ముఖ్యుడు. నేడు  హైద్రాబాద్ భరత్ విద్యా సంస్థల అధిపతి వేణు గోపాల్ రెడ్డి కూడా ఒకరు. 


   ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ SR & BGNR లో 1977 సెప్టెంబర్ లో విద్యార్థి సంఘం ఎన్నికలలో 16 స్థానాలకు  8 స్థానాలు PDSU అభ్యర్థులు గెలిచారు. అందులో కాలేజీ ప్రధాన కార్యదర్శిగా నేనొకణ్ణి. దాంతో PDSU ఉద్యమ ప్రభావం హైస్కూళ్ల విద్యార్థి లోకంపై విశేషంగా పడింది. ఆ నేపథ్యంలో ప్రభావితమైన పాఠశాలలలో జ్యోతి బాల మందిర్ ఒకటి. ఐనా నిరంకుశ యాజమాన్యం ఆ స్కూల్ విద్యార్థుల్ని మాతో కనెక్ట్ కాకుండా నియంత్రిస్తూ వచ్చింది. అలల్ని ఆపడం, ఢంకాను జోకొట్టడం ఎవరికి సాధ్యం? పైగా ప్రజాస్వామిక పాత్రికేయులు కౌముది గారి కొడుకును నియంత్రించడం ఎలా సాధ్యం? 


   SR & BGNR కళాశాలలో ఆ మరుసటి ఏడాది విద్యార్థి సంఘం ఎన్నికలు 1978 ఆగస్టులో జరిగాయి. నేను డిగ్రీ ఫైనల్ లో వున్నా. ఈసారి ఎన్నికల్లో 16 స్థానాల్లో PDSU 11 గెలుచుకుంది. వారిలో కాలేజీ ప్రెసిడెంట్ గా నేనొకణ్ణి. తర్వాత వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమ ప్రభంజనం ధాటికి జ్యోతి బాల మందిర్ స్కూల్ యాజమాన్య నిరంకుశ ఉక్కు తెర బద్దలైనది. అది అఫ్సర్ ని కనెక్ట్ చేసుకుంది. అంతవరకూ కౌముది గారి ఇంట్లో చూసే ఓ చిన్న పిల్లాడు ఆరోజు నుండి ఆందోళనా కారునిగా మాకు సన్నిహితమయ్యాడు. అది నాకు గుర్తున్నంత వరకు బహుశా 1978 సెప్టెంబర్ లేదా అక్టోబర్ కావచ్చు. ఆ స్కూల్ సమస్య పరిష్కారానికి జరిగిన పోరాటంలో అఫ్సర్ పాత్ర క్రియాశీలమైనది. నాకు గుర్తున్న మేరకు నాతో పాటు IV రమణారావు, జనార్దన్ రాజు, శ్రీహరి, పురుషోత్తం, శంకర్, గిరి వంటి PDSU నాయకులు అఫ్సర్ తో నాడు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. 


  ఆనాటికి మేమే ఉడుకు నెత్తుటితో దూకుడుతనం గల యువకులం. మా కంటే దుడుకు స్వభావం గల దూకుడు పిల్లాడు అఫ్సర్! నిజానికి నాడు ఆ బృందాన్ని నియంత్రించడం మాకు చాలా కష్టంగా ఉండేది. సరదాగా మేం  జ్యోతి బాల మందిర్ కి చెందిన బాల నక్సలైట్లు అని జోక్ వేస్తుండే వాళ్ళం. అది నాటి అఫ్సర్ నేపథ్యం!


 నా కళాశాల చదువు 1979 వేసవిలో పూర్తయినది. ఆ తర్వాత కూడా మరో రెండేళ్లు ఖమ్మం కేంద్రంగా PDSU రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు నిర్వహించా. ఆ కాలంలో కూడా అఫ్సర్ తో ఉద్యమ బంధం కొనసాగింది. 1981 మే నెలలో నేను సంస్థాగత  బాధ్యతల్లో భాగంగా ఏలూరు కేంద్రంగా కార్మికరంగంలో పని చేయడానికి ఖమ్మం వదిలేశా. నా గుర్తున్న మేరకు నాటి నుండి మామధ్య భౌతిక కలయిక లేదనే చెప్పాలి. 


 తొలుత ఆందోళనా కారునిగా ప్రారంభమై, ఖమ్మం కేంద్రంగా రక్తస్పర్శ కవిత్రయంతో ఎదిగి,  పాత్రికేయునిగా మరియు కవిగా ఏకకాలంలో ద్వంద్వ పాత్రధారునిగా బెజవాడలో సుదీర్ఘకాలం సాగి, క్రమంగా క్లాసికల్ సాహిత్య వేత్తగా,  రచయితగా రూపొంది, కొత్తగా చరిత్ర పరిశోధకునిగా కూడా నేడు ఆవిష్కతుడైన అఫ్సర్ ని నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకుంటే పొందే మానసిక అనుభూతి ఎలా ఉంటుందో కదా! గతరాత్రి విజయవాడలో అదే అనుభూతిని పొందాను. 


 గత రాత్రి మీట్ లో అఫ్సర్ మాట్లాడుతూ బెజవాడ సాహిత్య బంధాన్ని నెమరు వేసుకొని, ఓ ఐదు నిమిషాలు విహంగ వీక్షణమూ చేశాడు. పాలస్తీనియన్ కళ్ళద్దాలు కూడా ధరించి నేటి నరమేధం ఆవిష్కరించే ప్రయత్నం సైతం చేశాడు. ఆయన అక్కడితో ఆగకుండా పెట్టుబడిదారీ వ్యవస్థపై చూపు సారించారు. నేడు కవులకు వర్గదృష్టి, వర్గ చూపు, వర్గ చైతన్యం ఉండాల్సిన కర్తవ్యం గూర్చి సందేశాన్ని ఇచ్చాడు. వర్గ పోరాటాల ధాటి ఎక్కువై ఆత్మరక్షణలో పడే పరిస్థితుల్లో 'పెట్టుబడి' అస్తిత్వ ప్రవాహాల్ని  పుట్టించడం  లేదా వాటిని ప్రోత్సహించడం చేస్తుంది. అవి బలహీనపడి, తక్షణ ప్రమాదం లేదనుకునే కొత్త భౌతిక పరిస్థితులు ఏర్పడితే అస్తిత్వ ప్రవాహల్ని కూడా పెట్టుబడి ధ్వంసిస్తుంది. ఈ పెట్టుబడి వ్యూహాన్ని నిశిత దృష్టితో  గ్రహించి సాహితీ లోకానికి అఫ్సర్ దిశానిర్దేశం చేయడం అభినందనీయం. 


అమెరికా పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న అఫ్సర్ పర్యటనకు వచ్చి  రెండు తెలుగు రాష్ట్రాలలో మిత్రులను కలుసుకోవడం, REMAKING HISTORY ని స్పర్శించడం ఓ అపురూప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 


 బండ్ల మాధవరావు గారి సౌజన్యం, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర్రావు గారి ప్రోత్సాహం,   డానీ ద్వయం, ఇంకా బెజవాడ కవులు, పాత్రికేయలోకపు అండదండలతో నిన్న రాత్రి  'MEET THE POET AFSAR' జరిగింది. ముందే ఖరారైన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని హాజరయ్యా. ఆ కలయిక మధురానుభూతిని మిగిలించింది. 


  బెజవాడ కవుల మధ్య గత రాత్రి 'మీట్' లో అఫ్సర్ నన్ను పుల్లన్నగానే సంబోధించడం 1978 కి తీసుకెళ్లింది. ఔను, నా అసలు పేరు పుల్లయ్య.  1981 లో కార్మికరంగంలోకి వస్తూనే ప్రసాద్ గా పేరు మార్చుకున్నా. నన్ను నాటి విద్యార్థిలోకం పుల్లన్నగా ప్రేమతో పిలుచుకునే వారు. ఆ పేరు తెలియని బెజవాడలో  కూడా అదే పేరుతో రాత్రి అఫ్సర్ సంబోధించాడు. అది 1978కి తీసుకెళ్లే జ్ఞాపకమది.  


   కవిత్రయంలో ప్రసేన్ నిన్న రాకపోయినా సీతారాంతో అఫ్సర్ రావడం కూడా ఒక అనుభూతికి కారణమైనది. 



  ఈరోజు 12-1-2024వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మం హార్వెస్ట్ స్కూల్ లో అఫ్సర్ తో చాయ్ పె చర్చ పేరిట ఇలాంటి భేటీ ఉంది.  ఖమ్మంలో అఫ్సర్ తో నేటి బేఠీ కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. ఈ కలయిక గూర్చి సమాచారం తెలియని గతకాలపు ఖమ్మం మిత్రులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. 


   పాలస్తీనా నరమేధం ఆనాటి నక్బా నుండి నేటి వరకూ కొనసాగుతోంది. మరట్వాడా నరమేధం అలా కాదు. గాంధీని హత్య చేసిన గాడ్సే వారసత్వం తెరమరుగైనది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన సాగింది. నేడు మోడీ మెదడులో నటి సర్దార్ పటేల్  పునరావిష్కరణ జరిగింది. తిరిగి ఇక్కడ మరట్వాడా వంటి అమానుష నరమేధాల పునరావిష్కరణ ప్రక్రియకి పునాది వేస్తోంది. ఫాసిజం బుసలు కొడుతోన్న సంక్లిష్ట కాలమిది. చరిత్ర పై, చరిత్ర పరిశోధనల పై, ముఖ్యంగా చరిత్రకార్ల పై విద్వేషపూరిత దాడి జరిగే కీలక దశ యిది. ఈ చారిత్రిక దశలో అఫ్సర్ వంటి చరిత్రకారుల ఆవశ్యకత చాలా ఉంది. మనం అఫ్సర్ కి బాసటగా నిలుద్దాం. 


 ఇట్లు,


నాటి PDSU పుల్లయ్య,

నేటి ఇఫ్టూ ప్రసాద్,

నాడు, నేడు, రేపు పిపి. 

12-1-2024








No comments:

Post a Comment