Saturday 3 August 2013

Rayalandhra Reconstruction

రాయలాంధ్ర పునర్ నిర్మాణమే ఎజెండా
 ఏ.యం. ఖాన్ యజ్దాని (డానీ)

       ప్రభుత్వాలు తీసుకునే ప్రతీ నిర్ణయం, మినహాయింపులేకుండా,  కొందరు లబ్దిదారుల్ని, కొందరు బాధితుల్ని సృష్టిస్తుంది. 1956 నాటి హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణను పునరుధ్ధరించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం సహజంగానే తెలంగాణ ప్రాంతంలో ఉత్సాహాన్నీ, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో నిరుత్సాహాన్నీ రేపింది. యూపియే పక్షాల ప్రస్తుత నిర్ణయానికి లబ్దిదారు తెలంగాణ కనుక ఆ ప్రాంతంలోని పార్టీలన్నీ ఆ ఘనత తమదంటే తమదని చెప్పుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. "నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని తెలిసే, కాంగ్రెస్  హడావిడిగా తెలంగాణ ప్రకటించేసింది" అని బీజేపి కిషన్ రెడ్డి అప్పుడే అనేశారు కూడా. మరోవైపు, రాష్ట్రాన్ని విభజించిన ’పాపం’ తమదికాదంటే తమదికాదని ఆంధ్రా ప్రాంతంలోని పార్టీలన్నీ భుజాలు తడుముకుంటున్నాయి. 

       ప్రస్తుత అలలో, తెలంగాణ నినాదానికి రాజకీయ ప్రయోజనం వుందని గుర్తించిన తొలిపార్టి బీజేపి. 1998 లోక్ సభ మధ్యంతర ఎన్నికలకు ముందు ఆ పార్టి "ఒక ఓటు రెండు రాష్ట్రాలు" అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. తీరాంధ్ర ప్రాంతంలోని కాకినాడలో జరిగిన రాష్ట్ర ప్లీనరీలో బీజేపి ఈ నిర్ణయం తీసుకోవడం ఇంకో విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపికి రాష్టంలో నాలుగు లొక్ సభ స్థానాలు దక్కాయి. ఆ తర్వాత మూడేళ్లకు, కే. చంద్రశేఖరరావు తెలుగుదేశం నుండి బయటికి వచ్చి, తెలంగాణ రాష్ట్రసమితి పెట్టారు. పేరును బట్టే, టీఆర్ ఎస్ ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.

       1994, 1999 ఎన్నికల్లో, వరుసగా రెండుసార్లు, పరాజయాన్ని చవిచూసి, నిస్పృహకు గురైన రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ నినాదాన్ని అందుకుని బతికి బట్టకట్టాలనుకుంది. జి. చిన్నా రెడ్డి నాయకత్వాన తెలంగాణ శాసనసభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది. కాంగ్రెస్ లో ఈ ఆలోచన యంయస్ కు వచ్చిందా? డీయస్ కు వచ్చిందా? లేక షబ్బీర్ అలీకి వచ్చిందా? అన్నది అంత ముఖ్యం కాదు. ఈ బృందం అప్పటి సిఎల్పీ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆశిస్సులతోనే, ఆ  సోనియా గాంధీ దగ్గరకి వెళ్ళిందనేది అంతకన్నా ముఖ్యమైన అంశం. ఫలితంగా, రాష్ట్ర కాంగ్రెస్ లో తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటి అనే ప్రత్యేక విభాగం కూడా ఏర్పడింది. వైయస్ కరడుకట్టిన సమైక్యవాది అనే మాట వాస్తవంకాదు. ఆయనది అవకాశవాదం. స్వంత బలం వుందని భావించినపుడు ఒకవిధంగానూ, లేదని భావించినపుడు వేరే విధంగానూ ఆయన తెలంగాణ విషయంలో ప్రవర్తించేవారు.

       ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచితీరాలనే లక్ష్యంతోనే, వైయస్ 2004 ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్ తో  పొత్తుపెట్టుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయశాతంకన్నా టీఆర్ ఎస్ విజయశాతం తక్కువగా వుండడంతో వైయస్ ఖంగు తిన్నారు. టిఆర్ ఎస్ తో పొత్తు లేకున్నా ఎన్నికల్లో గెలవవచ్చు అనే ధీమా వచ్చాకే, ఆయన క్రమంగా కేసిఆర్ కు దూరంగా జరిగారు. వైయస్ వారసునిగా రంగ ప్రవేశం చేసిన జగన్ కూడా తెలంగాణ విషయంలో ఊగిసలాట ధోరణినే అనుసరించారు. ఆ పార్టీలో, నిన్నటి దాక ’నెంబర్ టూ’ గా కొనసాగిన కొండ సురేఖ పుట్టు తెలంగాణవాది. ఆమె కోసం జగన్ వర్గం పెట్టు తెలంగాణవాదులుగా మారిన సందర్భాలున్నాయి. సిపిఐ నారాయణ తెలంగాణకు కట్టుబడి వుండగా, చిరంజీవి ప్రజారాజ్యం కూడా  అటూ ఇటూ ఊగిసలాడింది. ఒక్క సిపియం మాత్రమే రాష్ట్ర విభజనకు దూరంగా వున్నట్టు సంకేతాలు పంపేది. అయితే, ఆ పార్టీ కూడా 2004, 2009 ఎన్నికల్లో టీఆర్ ఎస్ వున్న కూటమిలోనే కలిసే నడిచింది.

       మొదట్లో, సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన చంద్రబాబు 2004 ఎన్నికల్లో  అధికారాన్ని ఘోరంగా కోల్పోయారు. దానితో ఆయన 2009 ఎన్నికల్లో దారి మార్చి, గులాబీ కండువా మెడలో వేసుకుని రెండు రాష్ట్రాల నినాదం చేశారు. వైయస్ కు జరిగిన అనుభవమే చంద్రబాబుకూ జరిగింది. ఆ ఎన్నికల్లోనూ టిడిపి విజయశాతంకన్నా, టిఆర్ ఎస్ విజయశాతం తక్కువ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  టిడీపికి ఒక్క సీటు మాత్రమేరాగా టిఆర్ ఎస్ కు అసలు బోణీ కూడా కాలేదు. ఆ ఎన్నికల గణాంకాల్ని గమనిస్తే, టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోకుండా వుంటే, టిడిపియే అధికారంలోనికి వచ్చి వుండేదని తేలిగ్గానే అర్ధం అవుతుంది. మరోవైపు, కేసిఆర్ కూడా స్వంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు గురయ్యారు.

       వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తరువాత, రోశయ్య హయాంలో కెసిఆర్ చేపట్టిన నిరశన దీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. అది అప్పుడప్పుడు బలంగానూ, అప్పుడప్పుడు బలహీనంగాను కనిపించినా తన లక్ష్యం దిశగా సాగి గమ్యానికి చేరుకుంది. అందుకు దాన్ని అభినందించాలి. తెలంగాణ ఉద్యమంతో పోలిస్తే, సీమాంధ్రులు సాగించిన సమైక్యవాద ఉద్యమం నిర్మాణం, విస్తృతి, ఉధృతి పరంగానూ బలహీనమైనది. ప్రజలు తమ హక్కుల కోసం తాము ఉద్యమించకుండా ఒకరిద్దరు రాజకీయ నాయకుల్ని నమ్ముకుని నడిస్తే ఫలితాలు ఎలా వుంటాయో సీమాంధ్ర అనుభవం చాటిచెప్పింది.

       రాష్టంలోని రాజకీయ పార్టీలన్నీ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దఫదపాలుగా పచ్చజెండా ఊపాయన్నది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి, యూపియే సమన్వయ కమిటీ, కూడా పచ్చజెండా ఊపడంతో, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక చిక్కుముడి విడిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లాంఛనమే!

       గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం మానేసింది. ప్రజా సంక్షేమం కాలగర్భంలో కలిసిపోయింది.  ఇకనైనా పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిద్దాం. ఇప్పుడైనా అన్ని ప్రాంతాల్లోని వాస్తవ సమస్యలపై స్థానిక ప్రజలు దృష్టి పెట్టాల్సిన సందర్భం వచ్చింది.  

        హైదరాబాద్ మహనగరంతోవున్న ప్రగాఢ అనుబంధం కారణంగా దాన్ని వదులుకోవడం సీమాంధ్ర ప్రజలకు మనస్తాపంగానే వుంటుంది. దీన్నొక అనివార్య పరిణామంగానే స్వీకరించాలి. సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసింది అరవైయేళ్ళుగా వాళ్లకు నాయకత్వం వహిస్తున్నవాళ్ళే అని గుర్తించాలి. రాష్ట్ర అభివృధ్ధిని మొత్తంగా హైదరాబాద్ లో కేంద్రీకరించడం తీవ్ర చారిత్రక తప్పిదం. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని గమనించకపోవడం నాయకత్వ లోపం. దీనికి ఒకర్నో ఇద్దర్నో నిందించడం సరికాదు.  అన్ని పార్టీలలోని అందరూ దీనికి బాధ్యులే.

       సీమాంధ్రలో కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలనేది ఇప్పుడు కొత్త చిక్కుముడి. రవాణా సౌకర్యం, నీళ్ల వసతి ప్రాతిపదికగా, కొత్త రాజధానికి స్థల ఎంపిక జరగాలి. ఇది అంత సులువైన వ్యవహారంకాదు. కేంద్రీకృత అభివృధ్ధి ఎప్పటికైనా ప్రమాదకరమని ఇప్పుడైనా గుర్తించాలి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా వుంచాలనే కాంగ్రెస్ సూచన సీమాంధ్రలో కొందరికి కొంత మానసిక ఆనందాన్నివ్వొచ్చుగానీ, అదేమీ మహత్తరమైనదేమీకాదు. కొత్త రాజధాని నిర్మాణాన్ని పదేళ్ళు వాయిదా వేయడంతప్ప దానివల్ల ఒనగూడేదేమీ వుండదు. కొత్త రాజధాని నిర్మాణానికి  ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలో ముందు దాన్ని రూపొందించుకోవాలి. దాన్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టుకుని పనులు ప్రారంభించడంపై సీమాంధ్ర ప్రాంత ప్రజలు దృష్టిపెట్టాలి. 

       తెలంగాణేతర ఆంధ్రప్రదేశ్ ఇక ముందు కూడా అదే పేరుతో కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. ఈ విషయం మీద కూడా సీమాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి. సీమాంధ్రలో రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలున్నాయి. వాళ్ల మధ్య భవిష్యత్తులో తగువు రాకుండా, రెండు ప్రాంతాలకూ ప్రాతినిధ్యం వహించేలా, కొత్త రాష్ట్రం పేరుండాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ప్రస్తుత ఆందోళనకు ఒకానొక కారణం అని మరిచిపోకూడదు. ’రాయలాంద్రా’ అనే పేరు బాగుంటుందేమో చర్చించాలి.

       సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీ తమ చెప్పుచేతల్లో వున్నట్లు వాళ్ళు ఇంతకాలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. వాళ్లకు టెన్ జన్ పథ్ లో వీసమెత్తు  విలువ కూడా లేదని యావత్ దేశం టెలివిజన్ ల సాక్షిగా చూసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి చేసిన తీర్మానం నచ్చకపోతే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే ఆ పార్టికి రాజీనామాలు ఇచ్చిరావాలి.  మరీ ప్రగల్భాలు పలికినవాళ్ళు రాజకీయాల నుండే తప్పుకోవాలి. అంతేగానీ, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించండి అని పిలుపు ఇవ్వడం దేనికీ? ప్రజలు మరీ అంత పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు?  అసెంబ్లీలో చేసే తీర్మానం ఒక లాంఛనమేతప్పా, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చదని వీళ్లకు తెలీదా?

       పాత తప్పులు మళ్ళీ చేయరాదు. శాస్త్రీయ పధ్ధతుల్లో, సీమాంధ్ర పునర్ నిర్మాణం జరగాలి. అదే అందరికీ తక్షణ ఎజెండా కావాలి. 
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
31 July 2013


ప్రచురణ : సూర్య దినపత్రిక ,  1 ఆగస్టు 2013

No comments:

Post a Comment