Wednesday 9 October 2013

మరో యన్టీఆర్ కావాలి!

"కేంద్రం ఒక మిధ్య" అనలిగిన  ధీశాలి 
మరో యన్టీఆర్ కావాలి! 

        సీమాంధ్రులపైన కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న అహంభావ ధోరణి హద్దులు మీరుతోంది. సీమాంధ్రుల మీద కాంగ్రెస్ అధిష్టానం కక్ష కట్టిందనే సందేహం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్ధించేవాళ్ళు కూడా సమర్ధించలేనంత నిరంకుశంగా వుంది యూపియే సర్కారు వైఖరి.

        ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రెండు నెలలుగా  రాయలసీమ, కోస్తా ప్రాంత ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్టీ విభేదాలు, వర్గవైషమ్యాలు ఎన్ని వున్నప్పటికీ మినహాయింపులేకుండా ఆ ప్రాంతపు ప్రజా ప్రతినిధులందరూ ఉద్యమాన్ని సమర్ధిస్తున్నారు. అరడజను మంది కేంద్ర మంత్రులు, పాతిక మంది యంపీలు, నూట డెభ్భయి ఐదు మంది ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని నిరాకరించే వ్యవస్థని పార్లమెంటరీ  ప్రజాస్వామ్యం అనడం కష్టం.

 తెలంగాణ అంశం 2004 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పరిశీలనాంశాల్లో చేరింది. మరో ఎస్సార్సీ ద్వార తెలంగాణ సమస్యను పరిష్కారిస్తానని ఆ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ తరువాత ఈ అంశం మీద రెండుప్రాంతాల్లోనూ అనేక దశల్లో అనేక రకాలుగా దాగుడు మూతలు ఆడింది ఆ పార్టి. 2009 చివర్లో కేసిఆర్ నిరశన దీక్ష సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి ప్రకటించడం ఈ క్రమంలో పెద్ద మలుపు. దానికి ప్రతిస్పందనగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రెండు వారాల్లోనే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్ర ప్రభుత్వ వెనుకడుగు సమైక్యవాదులకు ఓదార్పుగానూ, విభజనవాదులకు నిట్టుర్పుగానూ మారింది. దానితో కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు అంగీకరిస్తుందని తెలంగాణవాదులూ ఆశించలేదు. సీమాంధ్రులూ నమ్మలేదు. అయితే, ఆ తరువాత  తెలంగాణలో అనేక దశలో, అనేక రూపాల్లో ఉద్యమాలు కొనసాగగా, సీమాంధ్రలో మాత్రం  అక్కడి యంపీల హామీల మేరకు  అక్కడి ప్రజలు నిశ్చింతగా వుండిపోయారు.

        రాష్ట్ర విభజన, కొత్తరాష్ట్ర ఏర్పాటు అనేది కనీసం ఎనిమిది నెలల ప్రక్రియ. రానున్న ఎన్నికల ప్రక్రియ గడువుతో కలపుకుంటే మొత్తం  ఏడాది వ్యవధి కావాలి.  నిర్ణిత గడువు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో లోక్‌ సభ / ఏపి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వున్నాయి. మే నెల వరకు కేంద్ర ప్రభుత్వంలో అలికిడి లేకపోవడంతో, ఇక యూపియే హయాంలో రాష్ట్ర విభజన జరగదని ఇటు తెలంగాణులు, అటు సీమాంధ్రులు కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఉరుముల్లేకుండా వర్షం కురిసినట్టు జులై నెలాఖర్లో హఠాత్తుగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది యూపియే ప్రభుత్వం. ఈ హఠాత్‌  పరిణామానికి తక్షణ ప్రేరణ ఏమిటో ఇదమిత్తంగా బయటి ప్రపంచానికి తెలియక పోయినా, తెలంగాణవాళ్లకు ఇది అనుకోని వరంగానూ, సీమాంధ్రులకు శాపంగానూ మారింది.

        ఎన్డీయే హయాంలో, ఒక్క లాఠీ కూడా వాడకుండా  మూడు రాష్ట్రాల్ని విభజించామని బీజేపి తరచూ గొప్పగా చెప్పుకుంటున్నదిగానీ, విభజనోద్యమాల్లో ఝార్ఖండ్‌, ఛత్తీస్‌ గడ్‌, ఉత్తరాఖండ్‌ లతో పొలిస్తే తెలంగాణ ఉద్యమం  మౌలికంగా భిన్నమైనది. సాధారణంగా, రాజధాని నగరానికి దూరంగావున్న ప్రాంతాలే కొత్త రాష్ట్రం  కావాలని అడుగుతాయి. అక్కడ రాష్ట్ర విభజనకు రాజధాని నగరాలకు కుడా పెద్దగా అభ్యంతరం వుండదు. అందుకే ఆ మూడు రాష్ట్రాల శాసనసభలు సులభంగా విభజన తీర్మానాలు చేశాయి.

        రాజధాని నగరమున్న ప్రాంతమే, విడిపోతానని అడుగుతుండంవల్ల ఆంధ్రప్రదేశ్‌ విభజన  అనేది భిన్నమైన ప్రక్రియ మాత్రమేగాక, సంక్లిష్టమైన సమస్య. రాజధాని నగరాలైన లక్నో, పాట్నా, భోపాల్‌  అభివృధ్ధిలో ఏ విధంగానూ  హైదరాబాద్‌ మహానగర దరిదాపుల్లోకి రాగల  ఆర్ధికశక్తులుకావు.  అంచేత,  ఏపి విభజనకు సాధారణ గడువుకన్నా మరింత ఎక్కువ కాలం ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరంవుంది.  ఈ ప్రత్యేకతను యూపీయే ప్రభుత్వంగానీ, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ గానీ పరిగణనలోనికి తీసుకోకపోవడంవల్ల  తెలుగు సమాజంలో కల్లోలం చెలరేగింది.

        దిగువన వుండే ప్రజల నుండి వచ్చే అభిప్రాయాల్ని ఎగువన నిర్ణయంగా మార్చి అమలు చేయడమే ప్రజాస్వామ్యం. దానికి విరుధ్ధంగా, ఎగువనవుండే ప్రభుత్వాలు ముందే నిర్ణయాలను చేసి దిగువన వున్నవారిపై రుద్దడం మొదలెడితే  ప్రజలకు పార్లమెంటరీ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అదే జరిగితే, ఇప్పుడు రాజకీయ పార్టీలు పొందుతున్న తక్షణ, తాత్కాలిక ప్రయోజనాలకు కొన్ని వందల రెట్లు నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది.

        ప్రస్తుత దశలో, తెలంగాణ ఉద్యమం పదేళ్లకుపైగా కొనసాగడంవల్ల, రాష్ట్ర విభజన అంశం మీద భిన్నాభిప్రాయాల్ని తొలిగించుకుని దాదాపు ఏకాభిప్రాయానికి రావడానికి అక్కడి రాజకీయపార్టీలకు సమయం దొరికింది. సీమాంధ్రలో రాజకీయ పార్టీల మధ్య, పార్టీలలోని నాయకుల మధ్య పోటీ వుండాల్సిన దానికన్నా ఎక్కువయిపోయి, ఉద్యమానికి సారధ్యం వహించాల్సిన రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పడడం కూడా దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఫలితంగా, జానపద కథలో చెప్పినట్టు, తాబేలులా కనిపించిన తెలంగాణ లక్ష్యానికి చేరుకుంది. కుందేలులా కనిపించిన సీమాంధ్ర కుదేలు అయిపోయింది.

        రాష్ట్ర విభజన సందర్భంగా  సీమాంధ్ర ప్రయోజనాలని కాపాడడానికీ,  జరగబోయే నష్టాలని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి నడుం బిగించాల్సిన చారిత్రక సంధి సమయంలో అక్కడి ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. మరోవైపు, హైదరాబాద్‌ ను కార్యక్షేత్రంగా మార్చుకున్న సీమాంధ్రప్రాంతపు ప్రాయోజిత పెట్టుబడిదారులు క్రియాశీలంగామారారు.  అందివచ్చిన అవకాశాన్ని తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం వాడుకున్నారు. సమైక్యవాదం అనే ఆలోచన కూడా లేని సీమాంధ్రుల్లో, కుత్రిమ నిరాహార దీక్షల ద్వార  సమైక్యాంధ్ర అనే నినాదాన్ని నెమ్మదిగా ఎక్కించి, దాన్ని ఉన్మాదంగా మార్చి, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి, తమ నేలతల్లికే  తీరని అపచారం చేశారు.

        రాష్ట్ర విభజన ప్రకటన చేశాక, సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలను, సూచనలను తెలుసుకోవడానికీ, వాటికి పరిష్కారమార్గాలను, ప్రత్యామ్నాయాలనూ సూచించడానికీ  యూపియే సమన్వయ సంఘం ఏకే ఆంథోని కమిటీని వేసింది. ఇది రాజకీయ కమిటీ కనుక ఈ కమిటీని కాంగ్రెస్‌ వర్గాలుతప్ప ఇతర పార్టీలు, సంస్థలు కలిసి తమ గోడు చెప్పుకునే అవకాశం లేదు. సీమాంధ్రలో ప్రస్తుత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎన్జీవోల సంఘం నాయకులు ఈ కారణంగానే ఆంథోని కమిటీని కలవడానికి నిరాకరించారు. చివరకు, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల మనోభావలనైనా వినడానికి ఆ కమిటీ శ్రధ్ధ చూపినట్టు కనిపించలేదు.

        అప్పట్లో, డజనున్నర ఎమ్మెల్యేలు కూడాలేని చిరంజీవి పార్టిని కాంగ్రెస్‌ లో విలీనంచేసే ప్యాకేజీ మాట్లాడడానికి ఇదే ఆంటోని స్వయంగా హైదరాబాద్‌ వచ్చారు.  ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ప్రాతిథ్యం వహిస్తున్న సీమాంధ్ర ప్రాంత మనోభావాలను పరికించడానికి ఒక్కసారి కూడా రాకపోవడాన్ని నిర్లక్ష్యం, అహంభావం అనే పదాలు సరిపోవు.

        యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి తెలంగాణపై తీర్మానం చేసినప్పటి నుండి కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదముద్ర వేసేంత వరకు వున్న  రెండు నెలల విలువైన కాలాన్ని  కాంగ్రెస్‌ అధిష్టానం దారుణంగా వృధాచేసింది.  ప్రతి పనికీ యూజ్‌, ఓవర్‌ యూజ్‌, మిస్‌ యూజ్‌, అబ్యూజ్‌ అనే నాలుగు దశలు వుంటాయంటారు. కాంగ్రెస్‌ అధిష్టానం తన అధికారాల వినియొగంలో నాలుగు దశల్నీ దాటిపోయింది.

        రాష్ట్ర విభజన ప్రక్రియ కోసం, ఇప్పుడు హోం మంత్రి  షిండే అధ్యక్షతన  ప్రధాని ప్రకటించిన మంత్రుల బృందం (జీవోయం) నియామకం తీరు కూడా  ప్రహసనంగా మారింది. మంత్రుల బృందంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందినవాళ్లకు స్థానం కల్పించకపోవడం ఒక విశేషమైతే, ఇటీవల ఆసుపత్రి నుండి విడుదలై, ఇంకా పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకోని ఆంటోనీకి కూడా స్థానం కల్పించడం మరో విశేషం. యూపీయే సమన్వయ సంఘం ప్రతినిధిగా ఆంటోని కమిటి ప్రదర్శించిన అలసత్వాన్ని చూసినవాళ్లకు, ఇప్పుడు యూపియే మంత్రుల బృందం నిర్వహించబోయే నిర్వాకాన్ని ఊహించడం పెద్ద కష్టం ఏమీకాదు.

        తెలంగాణరాష్ట్రం సరిహద్దుల నిర్ధారణ, ఉమ్మడి రాజధాని స్వరూప స్వభావాలు మొదలు, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్తపేరు, రాజధాని నగరం ఎంపిక, దాని నిర్మాణం, నిధుల సేకరణ, సాగునీటి పంపకాలు-నియంత్రణ, వ్యవసాయానికి పరిరక్షణ, విద్య,  వైద్య, ఉపాధి రంగాల్లో సీమాంధ్రులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రెవెన్యూ, శాంతిభద్రతలు వరకు అనేకానేక అంశాల్ని మంత్రుల బృందం పరిశీలించాల్సి వుంటుంది. ఇంతటి కీలకమైన అంశాలపై నివేదిక ఇచ్చేందుకు మంత్రుల బృందానికి కేవలం ఆరు వారాల గడువు మాత్రమే ఇవ్వడాన్నిబట్టే, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత మొక్కుబడిగా మార్చబోతున్నదో అర్ధం అవుతుంది.

        చేసిన సమస్త ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, ఇక అంతిమంగా శాసనసభలో తమ సంఖ్యా బలంతో రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు. కానీ, అదీ అత్యాశ మాత్రమే! ఎందుకంటే, రాష్ట్ర విభజన ప్రక్రియలో శాసనసభ పాత్ర మీద భారత రాజ్యాంగంలో స్పష్టమైన వివరణలేదు. దానివల్ల, సంబంధిత అధీకరణల్ని ఎవరికివారు తమకు అనుకూలంగా అన్వయించుకునే వీలుంది.

        భారత రాజ్యాంగానికి యూనిటరి రిపబ్లిక్‌ స్వభావం ఎక్కువ. ఫెడరల్‌ రిపబ్లిక్‌ స్వభావం తక్కువ. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అధీకరణం 3 లో ఇది మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది. రాష్ట్రాల విభజన,  పునర్విభజనల బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, రాష్ట్రపతి , సంబంధిత రాష్ట్ర శాసనసభ  అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అందులోవుంది. అంతేతప్ప, శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి  పాటించాలనే నియమం ఏమీలేదు. అసలు, శాసనసభను సంప్రదించకుండానే రాష్ట్ర విభజన చేసేయడానికి రాజ్యాంగంలో అవకాశం వుందనేవారూ వున్నారు.

        చట్టంలో ప్రతి పనికీ షార్ట్‌ కట్లు, తత్కాల్‌ లు వుండవచ్చుగానీ, ఐదు కోట్ల మంది సువిశాల ప్రజానీకానికి జీవన్మరణ సమస్యలాంటి రాష్ట్ర విభజన అంశం మీద దొడ్డిదారులు, అడ్డదారులు తొక్కడం తీవ్రనిర్లక్ష్యం మాత్రమేకాదు. ఫక్తు నిరంకుశత్వం.

        సీమాంధ్రకు ఇప్పుడు ప్రధాన శాపం ఏమంటే ఇఛ్ఛాపురం నుండి తడ వరకు, చిత్తురు నుండి కర్నూలు వరకు దుర్భిణీ వేసి వెతికినా నాయక లక్షణాలు కలవారు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడంలేదు. జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోయినాసరే కనీసం ఒక జిల్లాకైనా నాయకత్వం వహించగల సమర్ధులు సహితం లేరు. రోడ్ల మీద తిరగడానికి కూడా ప్రజాప్రతినిధులకు ధైర్యం సరిపోవడంలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. యన్టీ రామారావు, వైయస్‌ రాజశేఖర రెడ్డిల దరిదాపుల్లోకి చేరగల నాయకులు కనుచూపుమేరలో కనిపించడంలేదు. బహుశ, వాళ్లను మనం సీమాంధ్రకు చివరి నాయకులు అనుకోవాలేమో!

        రాజకీయ నాయకత్వలేమివల్ల సీమాంధ్ర ఉద్యమం ఎన్జీవోల ఉద్యమంగా కుచించుకుపోయింది. గుడ్డిలో మెల్లగా ఎన్జీవోలయినా పోరాటం చేస్తున్నారని కొందరు సంతృప్తి పడవచ్చుగానీ, అంధుల పోరాటానికి మెల్లకళ్లవాళ్ళు నాయకత్వం వహించడం శ్రేయస్కరంకాదు. ఉద్యోగులు భద్రతగలిగిన వర్గం. తమకు రావల్సిన  రాయితీలు దక్కగానే భద్రతగలిగినవర్గం కాడి పడేస్తుంది. ఎన్నడైనా  అట్టడుగు బాధితులు నాయకత్వం వహించినపుడే ఉద్యమాలు లక్ష్యాలను సాధించగలుగుతాయి.

        ఇక నుంచి రాజకీయ పార్టిలు పోరాటం చేస్తాయి అని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంటే, ఉద్యమం లోనికి రాజకీయ పార్టిలు చొరబడుతున్నాయి అని ఏన్జీవోల నాయకులు పరుచూరి అశోక్‌ బాబు అభ్యంతరం చెప్పారు. రెండు రోజులు గడవక ముందే ఆ ఏన్జీవోల నాయకులే తమను ఢిల్లీ తీసుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్దిని కోరారు.  తాను ముఖ్యమంత్రిగా వున్నంత కాలం రాష్ట్ర విభజన జరగదు అని ముఖ్యమంత్రి వాళ్లకు గట్టి హామీఇచ్చారు. మరోవైపు హైదరాబాద్‌ లో జరిపిన ఎన్జీవోల సభకు సూత్రధారి  ముఖ్యమంత్రే అని తాజా మాజీ డీజీపి  దినేష్‌ రెడ్డి అరోపిస్తున్నారు. ఇంకోవైపు నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి ప్లగ్గు పీకేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసి‌ఆర్‌ బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ నాలుగు  సంఘటనలు చాలు సీమాంధ్ర రాజకీయ పరిస్థితి ఎంత దయనీయంగావుందో అర్ధం చేసుకోవడానికి.

        రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని బలంగా ధిక్కరించిన నాయకుడు యన్టీ రామారావు. ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన సుదీర్ఘపోరాటం
చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాన్నిచ్చే  రాజ్యాంగ అధీకరణ 356 మీద భీకర తిరుగుబాటు చేశారు. కేంద్రం ఒక మిధ్య అనలిగిన ధీశాలి అప్పటికీ ఇప్పటికీ బహుశ ఆయనొక్కడే!   ఇప్పుడు సీమాంధ్రులకు కేంద్రం ఒక మిధ్య అనగలిగిన  మరో యన్టీ‌ఆర్‌ కావాలి!

. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ :  90102 34336
హైదరాబాద్
9  అక్టోబరు  2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, 13  అక్టోబరు  2013

No comments:

Post a Comment