Friday 25 October 2013

సీమాంధ్ర ప్యాకేజీకి వేళాయెరా!

సీమాంధ్ర  ప్యాకేజీకి వేళాయెరా!

ఏ. యం ఖాన్ యజ్దానీ (డానీ)

కలుసున్నవి విడిపోతాయి. విడిపోయినవి కలుస్తాయి. ఎలాగూ విడిపోతాయి కనుక కలవడం అనవసరం అనుకోవడమూ కుదరదు. ఎలాగూ కలిసిపోతాయి కనుక విడిపోవడం అనవసరం అనుకోవడమూ కుదరదు. దేని చారిత్రక సందర్భం దానికి వుంటుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇది విభజన సందర్భం.

  విడిపోవడం అనేది ఒక ప్రజాస్వామిక హక్కు. విడిపోయే హక్కు మనుషులకేకాదు ప్రాంతాలకూ వర్తిస్తుంది. ఒక వ్యక్తి మరోవ్యక్తి నుండి, ఒక ప్రజాసమూహం మరో ప్రజా సమూహం నుండి ఎందుకు  విడిపోవాలనుకుంటున్నది? అనేది ప్రాణప్రదమైన అంశం.

దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలకు పరిమాణంకన్నా గుణం గొప్పది. ఏ రంగంలో అయినా సరే బిగ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది సామ్రాజ్యవాదుల నినాదం. అప్పట్లో బ్రిటీష్ వలస వాదులు ఈ నినాదాన్ని బలంగా ప్రచారంచేసి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించారు. కానీ, ఆ సామ్రాజ్యంలోని దేశాలూ, ఆ దేశాల్లోని జాతులు, ఆ జాతుల్లోని ప్రజలు బ్రిటీష్ నినాదంతో ఏకీభవించలేదు. దేశాలు స్వాతంత్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని, మనుషులు స్వేఛ్ఛనూ కోరుకుంటారు.  

ఒక రాష్ట్రం ఇంకోరాష్టాన్ని, ఒక భాష ఇంకోభాషని, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని, ఒక జాతి ఇంకోజాతిని, ఒక తెగ ఇంకో తెగని, ఒక మతం ఇంకో మతాన్ని అణిచివేస్తూవుంటే ఏ ప్రాంత సమగ్రత అయినాసంక్షోభంలో పడిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఆవేదన చెందాల్సింది దేశమో, రాష్ట్రమో ముక్కలైపోతున్నదనికాదు; అణిచివేతను ఎలా అంతం చేయాలని. స్వేఛ్ఛ, సమగ్రాభివృధ్ధి లేనప్పుడు  సమగ్రతా వుండదు.

మనుషులకు పుట్టుక పెరుగుదల చావు  వున్నట్టే,  ప్రతి ప్రాంతానికీ, జాతికీ, సామాజికవర్గానికి కూడా సాంస్కృతికంగా పుట్టుక వైభవం పతనం మూడూ వుంటాయి. పారిశ్రామిక విప్లవం ఆరంభం నుండి రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసే వరకు మొత్తం ప్రపంచానికి ఇంగ్లండ్ హ్యాపెనింగ్ ప్లేస్.  ఆ కాలంలో హాలివుడ్‌తోసహా సమస్త రంగాల్ని బ్రిటీష్‌వాళ్ళే ఏలారు. ఆ తరువాత ఇంగ్లండ్‌ది గత చరిత్రే! గత వైభవం అనేమాటను ప్రాంతాలు, దేశాలు, కట్టడాల గురించి చెప్పినంత సులువుగా మానవ సమూహాల గురించి చెప్పడం సాధ్యంకాదు. మానవ మొఖమాటం అడ్డువస్తుంది. అయితే మనుషుల మొఖమాటాలతో సమాజ సూత్రాలకు పనిలేదు. అవి తమ నిర్దేశిత మార్గంలో ముందుకు సాగుతూనేవుంటాయి.

అంధ్రప్రదేశ్‌లో విభజన, సమైక్య ఉద్యమాలు సమాజశాస్త్రాలకు పెద్ద సవాలు విసిరాయి. ఇరుప్రాంతాల పాలకవర్గాలు భావోద్వేగాల్ని  రెచ్చగొట్టడంలో సఫలం కావడంతో సమాజ చలన సూత్రాలే ఇప్పుడు ఎవరికీ గుర్తుకు రావడంలేదు. ఇరుప్రాంతాల ప్రజలు ఇప్పుడు పాలకవర్గాలు అనే పదాన్ని ఉఛ్ఛరించడానికే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఈ రెండు ఉద్యమాల్లో పాలకవర్గాలు సాధించిన సాంస్కృతిక విజయం అనవచ్చు! 1940-50 ల నాటి తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం విషయాలేలావున్నా, తొమ్మిదేళ్ల క్రితం  పీపుల్స్ వార్,  జనశక్తి నక్సలైట్లను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకూ తెలంగాణలో అనేక స్థాయిల్లో అనేక ఉద్యమాలు, పొరాటాలు జరిగాయి. అవన్నీ స్థానిక పాలకవర్గాలపై సాగినవే. ఆ చారిత్రక వాస్తవాలని తెలంగాణలో దాదాపు అందరూ మరిచిపోయారు. ఇప్పటికీ కొంచెం భిన్నంగా యస్సీ, యస్టీ, మత అల్పసంఖ్యాకవర్గాలు, కార్మిక, కర్షక కోణంలో  ఆలోచించే సమూహాలు తెలంగాణలో వున్నప్పటికీ ఉద్యమంలో వాళ్లది ఉపస్రవంతేగానీ, ప్రధాన స్రవంతికాదు.

రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో అయితే ఈ అంశం మరీ ఘోరం. తెలంగాణలో ఉద్యమాన్ని అధికారవర్గాల్లో అసమ్మతివర్గం  మొదలెట్టగా, రాయలసీమ, తీరాంధ్రల్లో ఏకంగా అధికారపక్షపు ప్రజాప్రతినిధులే నేరుగా ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టారు.   1960-70 ల నాటి శ్రీకాకుళ పోరాట ప్రభావాన్ని పక్కన వుంచినా, సమీపగతంలో జరిగిన దళిత ఉద్యమాల ప్రభావం కూడా ఇప్పుడు అక్కడ కనిపించడంలేదు. ఇతర దృక్పధాలకు సహితం స్థానం కల్పించడంలో రాయలసీమ, తీరాంధ్ర ఉద్యమంకన్నా తెలంగాణ ఉద్యమం చాలా మెరుగు అనే చెప్పాలి. అక్కడ దళిత, బహుజన, శ్రామిక వాదాలకు కనీసం ఉపస్రవంతి స్థానం అయినా ఇచ్చారు. సీమాంధ్ర పాలకవర్గాలు కనీస స్థాయిలో కూడా ఉపస్రంతిని ఎదగనివ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, గత అర్ధ శతాబ్దం కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధించిన సామాజిక చైతన్యాన్ని ఈ రెండు ఉద్యమాలూ చెరో పధ్ధతిలో మింగేశాయి.

ఇప్పటి తెలంగాణ ఉద్యమ సిధ్ధాంతకర్త ఆచార్య జయశంకర్ బహుజనులు కావడాన వారి ప్రభావం దాని మీద బలంగా పనిచేసింది. సీమాంధ్ర ఉద్యమంలో ఇలాంటి సామాజిక కోణం పూర్తిగా లోపించింది. పైగా అక్కడ విషాదకరంగా అనేక తిరోగామి అలోచనల్ని పునరుధ్ధరించారు. అది సహజంగానే ఉద్యమం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

పంతొమ్మిదో శతాబ్దపు మధ్యలో, కాలవ వ్యవసాయం ప్రవేశంతో మొదలైన  వుభయ గోదావరి, వుభయ కృష్ణా జిల్లాల వైభవం, స్వాతంత్రోద్యమం వుధృతంగా సాగిన కాలంలో ప్రస్పుటంగా వెలుగులోనికి వచ్చింది. అల్లూరి శ్రీరామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యలతో మొదలైన ఈ క్రమం అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగింది. సాంస్కృతికంగా బ్రాహ్మణ వ్యతిరేకత, రాజకీయంగా కాంగ్రెస్ వ్యతిరేకత, తాత్వికంగా సామ్యవాద సానుకూలత, సాంకేతికంగా ప్రయోగ సన్నధ్ధత, వాణిజ్యపరంగా  విపత్తుల్ని తట్టుకునే స్తోమత అన్నీ కలిసి, ఆ ప్రాంతపు  బలమైన సామాజికవర్గాల్ని పురోగామి సమూహంగా మార్చింది. ఈ క్రమానికి నాయకత్వం వహించిన  కమ్మ సామాజికవర్గానికి సహజంగానే ఇందులో సింహవాటా దక్కింది.

బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంతో మొదలైన పురోగతి ఐతరేయ బ్రాహ్మణాన్ని వుటంకించే దశకు చేరడం పతనమో, పురోగమనమో తేల్చడం పెద్దకష్టం ఏమీకాదు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా వున్న రాజకీయపార్టి, కొత్తరాష్ట్రానికి  దళితుడ్ని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినట్టు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు ’పోటీకోసం అయినా’ అంధ్రప్రదేశ్ కు దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించలేకపోయారు. దళిత, బహుజన శక్తులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గోనకపోవడానికి ఇది ప్రధాన కారణం.

సమైక్య ఆంధ్రజాతివాదులు ఐతరేయ బ్రాహ్మణం దగ్గరే ఎందుకు ఆగాలి? అనే ఒక్క ప్రశ్న చాలు ఈ వాదన బూటకాన్ని బద్దలుగొట్టడానికీ? అంతకన్నా వెనక్కు, దానికన్నా వెనక్కు వెళితే, ప్రపంచ జనాభా అంతా ఒకే ఒక నరమానవుని సంతతి అని తేలుతుందికదా? మనం దానికి సిధ్ధంగా వున్నామా? వాస్తవం ఏమంటే, పాలకవర్గాలు తమ ఆస్తుల పరిరక్షణకు మానవ  ముసుగు కప్పుతాయి. ప్రజలు ఎన్నడూ ఆ వలలో పడిపోరాదు. రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతపు పాలకవర్గాలు హైదరాబాద్ పరిసరాల్లో సాగించిన విధ్వంసకర ఆర్ధిక విధానాల ఫలితంగానే ప్రస్తుత విభజన ఉద్యమం మొదలై, ఈ స్థాయికి వచ్చిందని గుర్తించలేనివాళ్ళు రెండు రకాలు. వాళ్ళు బొత్తిగా అమాయకులైనా అయ్యుండాలి. లేదా పూర్తిగా  మూర్ఖులైనా అయ్యుండాలి.

జాతికి, రాజ్యానికీ వున్న సంబంధం సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా వుండదు. ఆ సంబంధాన్ని చారిత్రక దశ నిర్ణయిస్తుంది. తగినంతగా అభివృధ్ధిచెందిన జాతులు జాతి రాజ్యాలుగా ఏర్పడడానికి ఆసక్తి చూపుతాయి. స్వతంత్రంగా మనలేని స్థితిలోవున్న జాతులు సమాఖ్యగా ఏర్పడతాయి. సమాఖ్యలోని జాతులు తగినంతగా అభివృధ్ధి చెందినపుడు విడిపోవడానికే ఆసక్తి చూపుతాయి. ఇది ఆయా జాతులకు ప్రాధమిక హక్కుకూడా. నిజానికి ఈ హక్కును గుర్తించిన తరువాతే సమాఖ్య ఏర్పడుతుంది. నిజానికి జాతి అనే భావనే పెట్టుబడీదారీ ఆలోచన. రాజరిక, భూస్వామ్య వ్యవస్థల్లో జాతి వుండదు.  కేవలం వంశాలుంటాయి.

మనం ఇక్కడ సమైక్య, విభజనవాదాల్లో తలమునకలైవుంటే, కేంద్ర ప్రభుత్వం  తనపని తావు చేసుకు పోతోంది. ఏన్జీవో సంఘాలు ఉద్యమానికి విరామాన్ని ప్రకటించి పక్కకు తప్పుకున్న తరువాత కేంద్ర మంత్రులు ఒకరొకరుగా రంగప్రవేశం చేసి, స్థానిక ప్రజల సమ్మతితోనో అసమ్మతితోనో విభజన విధివిధానాలను రూపొందిస్తున్నారు.  

అమాయకులు ఎప్పుడూ వుంటారు. విభజన తీర్మానంపై కేంద్రం శాసనభ అభిప్రాయాన్ని కోరుతుందనీ, ఆ అంశం శాసనసభకు తప్పక వస్తుందనీ, అలా వచ్చినపుడు దాన్ని అడ్డుకుంటామనీ,  శాసనసభ మెజారిటీ అభిప్రాయాన్ని కేంద్రం పాటించక తప్పదనీ, అలా పాటించకపోతే సమాఖ్య సాంప్రదాయానికి అర్ధమేలేదని  సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కొందరు  ఇప్పటికీ ప్రజాస్వామ్య ఆదర్శాలను తెగ వల్లిస్తున్నారు. కొందరైతే 371- డీ అధీకరణం సమైక్య రాష్టానికి సహజ కవచకుండలాలని చెప్పుకుని మరీ మురిసిపోతున్నారు.  చట్టానికి సంబంధించిన ఇలాంటి ఆదర్శాలని  ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలుగా వల్లిస్తే బాగుంటుంది. వాస్తవంలో చట్టం  అంత ఆదర్శవంతంగా ఎన్నడూ పనిచేయదు. పాలకులకు చట్టంలోని రహదారులకన్నా, దొడ్డిదారులంటేనే చాలా ఇష్టం.

చట్టంలోని రహదారులు అందరికీ అందుబాటులోవుంటాయి; కనీసం వున్నట్టు కనిపిస్తాయి. చట్టంలోని దొడ్డిదారులు మాత్రం పాలకవర్గాలకు మాత్రమే అందుబాటులో వుంటాయి. ఈ మాత్రం జ్ఞానబోధకు బోధివృక్షం కింద తప్పస్సు చేయాల్సిన పనిలేదు. ఏ చిన్న కేసులో అయినా సరే నిందితుడిగానేకాదు పిర్యాదిదారుడిగానైనాసరే ఒకసారి కోర్టు గుమ్మం ఎక్కితే చాలు చట్టం ముందు పాలకవర్గాలు మరింత సమానులని మొదటి మెట్టు దగ్గరే అర్ధం అవుతుంది.

హైదరాబాద్ విమానం ఎక్కకుండా, హాస్పిటల్ బెడ్డు ఎక్కడంతో ఆంటోనీ కమిటి కథ ఎలా ముగిసిందో చూసినవాళ్లకు రేపు కేంద్ర ప్రభుత్వానికి మంత్రుల బృందం సూచనలు ఎలా వుంటాయో, వాటిని ఎలా ఆమోదించి, ఎలా అమలు చేస్తారో ఊహించడం పెద్ద కష్టం  ఏమీకాదు. ఇప్పుడున్న సమాచారం మేరకు, విభజన విధివిధానాలు సూచించడానికి సీమాంధ్రులు తటపటాయిస్తుండగా, తెలంగాణులు చాలా ఉత్సాహంహా ఈ-మెయిళ్ళు పంపిస్తున్నారట! దీనివల్ల విభజన విధివిధానాలు కూడా తెలంగాణకే అనుకూలంగా ఉండే ప్రమాదంవుంది.

నదీజలాల సమస్యలు తలెత్తుతాయని ఆందోళనపడడమేతప్పా, దానికి విరుగుడు ఏమిటో కనిపెట్టాలనే కనీసపు ఆలోచన కూడా సీమాంధ్ర నేతలు ఇప్పటికీ చేస్తున్నట్టులేదు. మంత్రుల బృందం సూచనలు అందుకునే గడువు నవంబరు 5 న ముగుస్తుందని తెలిసినా, పార్లమెంటు శీతాకాలపు సమావేశాలకు ముందే మంత్రుల బృందం నివేదికను సమర్పిస్తానని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించినా,   సీమాంధ్ర నేతలు సమైక్యవాదం నినాదంతోనే కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు. విచిత్రం ఏమంటే,  రాజకీయాల్లో హత్యకు ఒకసారే అవకాశం వుంటుంది. ఆత్మహత్యలు చేసుకునేవాళ్లకు ఆ అవకాశం చాలాసార్లు వుంటుంది.

 ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం (ఏజేఎఫ్) సీమాంధ్ర ప్యాకేజీ విషయంలో ఈవారమే ఒక కసరత్తు మొదలెట్టింది. సీమాంధ్రలోని ప్రజలకు  హైదరాబాద్ స్థాయి జీవనశైలి. తెలంగాణలోని సీమాంధ్రులకు సీమాంధ్రస్థాయి ప్రశాంతత అనేది దీని లక్ష్యం. కేంద్ర మంత్రుల బృందానికి అందజేయనున్న ఈ సూచనల పట్టికలో ముఖ్యమైన అంశాలేమంటే:

  రేపటి తెలంగాణ రాష్ట్రానికి దిగువన కృష్ణా గోదావరి నదులపై ప్రస్తుతం నిర్మాణంలోవున్న, ప్రతిపాదనలోవున్న ప్రాజెక్టుల ముంపుప్రాంతాన్ని పూర్తిగా రాయలసీమ, తీరాంధ్రలో కలపాలి. ఆ విధంగా రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో ఎర్పడే జలవివాదాల్ని చాలా వరకు నివారించవచ్చు. కేవలం రాయలసీమకు సాగునీరు అందించడానికి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రజలు, వారి ప్రతినిధులు సహకరించాలి.

దశాబ్దంన్నర క్రితం వరకు విజయవాడ విద్యాలవాడగా వుండేది. ఇప్పుడు ఆ ఘనత హైదరాబాద్ కు దక్కడమేకాదూ, ఆ రంగంలో హైదరాబాద్ జాతీయ ప్రమాణాలు అందుకుంది. ఇలాంటి ప్రమాణాలు రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లోనూ సాధించడానికి అవసరమైన ప్యాకేజీని ప్రకటించాలి. వైద్య ఆరోగ్య సేవల్లోనే కాదు, వైద్య విద్యలో, ముఖ్యంగా, సూపర్ స్పెషాలీటీస్‌లో రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలు హైదరాబాద్ కన్నా రెండు దశాబ్డాలు వెనకబడి వున్నాయంటే అతిశయోక్తికాదు. నిమ్స్ స్థాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్థలేగాక, ఏయిమ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల శాఖలు కూడా రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో నెలకోల్పాలి. ఐఐటి, ఐఐయంల కొత్త శాఖలు ఏర్పాటు చేయాలి.

రవాణారంగంలో విమానయానం తెలంగాణలో అంతర్జాతీయస్థాయికి చేరుకోగా, రైలుమార్గాలు రాయలసీమ, తీరాంధ్రాల్లో మెరుగ్గానే వున్నాయి. రాయలసీమ, తీరాంధ్రాల్లో రైల్వేజోన్ ను ఏర్పాటుచేయడమేకాక, రేపు ఏర్పడే సీమాంధ్ర రాజధాని నగరంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలి. నాకాశ్రయాల్లో తీరాంధ్రప్రాతం ప్రకృతి సిధ్ధంగానే ముందుంది. తీరాంధ్రలో నౌకాశ్రయాలు లేని ప్రతి జిల్లాలోనూ కొత్త నౌకాశ్రయాలు నిర్మించాలి.

రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతంలోని ఆదివాసులకు వారు కోరుకునే విధంగా వాళ్ల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.

కేంద్రీకృత అభివృధ్ధిని నిరోధించడానికి వీలుగా చట్టసభలు, సాధరణ పరిపాలన, శాంతిభద్రతలు, న్యాయవ్యవస్థలతోసహా అన్ని రంగాల్లోనూ వీల్లున్నంతమేర వికేంద్రీకరణ విధానాన్ని పాటించాలి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)

హైదరాబాద్
25 అక్టోబరు  2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
27 అక్టోబరు  2013 

No comments:

Post a Comment