Tuesday 18 March 2014

కులాల కూర్పు మారాలి

Social Adjustment in Political Structure
కులాల కూర్పు మారాలి
డానీ

భవన్ పాతబిల్డింగును తెలంగాణ పిసిసి కార్యాలయంగా మార్చారు. నిన్ననే ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త బిల్డింగ్ ను సీమాంధ్ర పిసిసికి ఇచ్చారు. విచిత్రం ఏమంటే పాతబిల్డింగు కళకళలాడుతూ వైష్ణవాలయంలావుంది. కొత్తబిల్డింగులో బుడ్డిదీపం వెలిగించేవారు కూడా లేక   శివాలయంలా వుంది. ఏఐసిసిలో రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్  నగరంలోనే వున్నారు. అయినా, కొత్త బిల్డింగులో మనిషన్నవాడు కనిపించలేదు. ఎన్నికల ముంగిట సీమాంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఒక్కరూ లేకపోవడం ఆశ్చర్యం! సీమాంధ్రలో కాంగ్రెస్ దయనీయస్థితికి ఇది అద్దం పడుతోంది. పైగా, కొత్త బిల్డింగ్ పేరు ఇందిరా భవన్!

కొత్తతరం రాజకీయ నాయకులకు నిరంతరం పచ్చటి పచ్చిక బయళ్ళుకావాలి.  వాళ్ళెప్పుడూ అలాంటి పచ్చికబయళ్ల వేటలో వుంటారు. ఒకచోట గ్రాసం నిండుకుందని తెలియాగానే కంచె దూకేస్తారు. దీనికి రాజకీయ సిధ్ధాంతాలు ఒక సాకు మాత్రమే!  అట్ట చింపేస్తే, ఏ ఎన్నికల ప్రణాళిక ఏ పార్టీదో చెప్పడం కష్టం అయ్యే రోజులివి. ఇప్పుడు కాంగ్రెస్ అతిరధులంతా గాంధీభవన్ ను వదిలి అయితే ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటున్నారు; కాకుంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ భవనానికి చేరుకుంటున్నారు.

        ప్రతి పార్టీకీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్థితితప్పదు. పాతికేళ్లక్రితం కూడా కాంగ్రెస్ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది.  అత్యయిక పరిస్థితి తరువాత జరిగిన 1977 లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. సాక్షాత్తు ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ కూడా ఓడిపోయారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రం జరిగింది. రాష్ట్రంలోని 42 లోక్ సభాస్థానాల్లో ఒక్క నంద్యాల సీటుతప్ప మిగిలిన 41 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాలలో జనతా టిక్కెట్టుపై నీలం సంజీవరెడ్డి గెలిచారు. వారు రాష్ట్రపతి కావడంతో నంద్యాల స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నూటికి నూరు శాతం సీట్లను గెలుచుకుంది. ఇది అప్పటికీ ఇప్పటికీ రికార్డు.

ఆ తరువాత ఇందిరా గాంధీ మీద వెంగళరావు తిరుగుబాటు చేశారు.  బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో రెడ్డి కాంగ్రెస్ పెట్టారు. ఆనాటి కాంగ్రెస్ అతిరథ మహారథులంతా రెడ్డి కాంగ్రెస్ కు మారిపోయారు. ఇందిరా కాంగ్రెస్ కార్యాలయాల్లో లైటు వెలిగించేవారు కూడా లేకుండాపోయారు. శనివారం దిగ్విజయ్ సింగ్ ముందు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్నట్టు అప్పుడూ ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్టు తీసుకునేవారే  కరువయ్యారు. మాజీ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఇందిరాగాంధీకి విజయవాడలో గెస్ట్ హౌస్ కూడా దొరకలేదు. అలాంటి కష్టకాలంలో, ఇందిరా కాంగ్రెస్ లో మిగిలిన మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహారావు, నాదెండ్ల భాస్కరరావు, పరకాల శేషావతారం తదితరులు ఒక కొత్త వ్యూహంతో పార్టీకి జీవం పోశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజలకు ఎంతో కొంత వ్యతిరేకత వుంటుందిగనుక కొత్తవారికి, కొత్త సామాజికవర్గాలకి  అవకాశంఇచ్చి ఒక ప్రయోగం చేశారు.  ఆ ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ కు 175 సీట్లు రాగా, రెడ్డి కాంగ్రెస్ కు కేవలం 30 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

1978 ఎన్నికలని కొందరు రెడ్డికాంగ్రెస్ పై ఇందిరాకాంగ్రెస్ సాధించిన విజయంగా భావించవచ్చు. వాస్తవానికి అది రాజకీయాల్లో పాత పెత్తందారీవర్గాలపై కొత్తశక్తుల విజయం. ఆ ఎన్నికల్లో కొత్త సామాజికవర్గాలు సాధించిన విజయానికి కంకిపాడు ఒక గొప్ప ఉదాహరణ. ఓటర్ల సంఖ్యరీత్యా కంకిపాడు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నియోజకవర్గం. ఓటర్లలో కమ్మసామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగిన    కోనేరు రంగారావుది మాదిగ సామాజికవర్గం. అప్పటికి వారు రాజకీయాల్లో అనామకులనే చెప్పవచ్చు. అయినా రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ వారు ఆ ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు.

భారత పార్లమెంటరీ రాజకీయాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మనకు ఒక ఆసక్తికర సామాజిక నియమం కనిపిస్తూ వుంటుంది. ప్రతి రెండు దశాబ్దాలకో, మూడు దశాబ్దాలకో ఒకసారి రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటుంటాయి. పాతశక్తుల పక్కన దిగువ నుండి కొత్త శక్తులు వచ్చి చేరుతుంటాయి. కొత్తవాటికి స్థానం ఇవ్వాల్సి వుంటుంది.  రాజకీయ నిర్మాణంలో సామాజిక సర్దుబాటు తప్పనిసరవుతుంది. అలాంటి సర్దుబాటును నిరాకరిస్తే మొత్తం రాజకీయ వ్యవస్తే కూలిపోతుంది. అలాంటి చారిత్రక సంధి సమయాల్లో  రాజకీయ నిర్మాణంలో సామాజిక సర్దుబాటును ప్రోత్సహించిన రాజకీయపార్టి విజయాన్ని సాధిస్తుంది. 1978లో ఇందిరా కాంగ్రెస్ విజయాన్నీ,  1983లో యన్టీ రామారావు విజయాన్నీ, 1989లో తిరిగి కాంగ్రెస్  సాధించిన విజయాన్నీ, 1994లో తిరిగి టిడిపి అధికారంలోనికి రావడాన్నీ అచ్చంగా రాజకీయ అర్ధంలోకాక ఇలాగే రాజకీయార్ధిక, సామాజిక కోణంలో అర్ధం చేసుకోవాల్సి వుంటుంది.

పైకి రాజకీయ పార్టీల మధ్య పోటీగా కనిపిస్తున్నవన్నీ, సారాంశంలో కుల మత వర్గ సంఘర్షణలే.  ప్రతి రాజకీయ పార్టీ కులాలు, మతాలు, వర్గాల రూపంలో తనదైన ఒక సామాజిక పునాదిని ఏర్పాటు చేసుకుంటుంది. అదే ఓటు బ్యాంకు. కొన్ని సందర్భాల్లో ఇది తలకిందులుగానూ జరగవచ్చు. కొన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిసి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోనూవచ్చు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కొందరు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పరిణామంగా మాత్రమే భావిస్తారుగానీ రాజకీయ నిర్మాణంలో వచ్చిన సామాజిక సర్దుబాటుగా  గుర్తించరు. మనరాష్ట్రంలో పార్లమెంటరీ రాజకీయాల మీద మొదట బ్రాహ్మణ సామాజికవర్గాల ప్రాబల్యం కొనసాగింది. క్రమంగా ఆ స్థానాన్ని రెడ్డి  సామాజికవర్గం ఆక్రమించింది. రాజకీయ ఆధిపత్యంలో కమ్మ సామాజికవర్గానికి సముచిత స్థానం కల్పించడానికి యన్టీ రామారావు రూపంలో భారీ ప్రయత్నం జరిగింది.  వెనుకబడిన కులాలు, షెడ్యూలు కులాలు, ముస్లిం సామాజికవర్గాల మద్దతుతో వారు తమ లక్ష్యాన్ని సాధించారు. ఆ తరువాత రాజకీయాల్లో రెడ్డి-కమ్మ కాంబినేషన్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో  రెడ్డి సామాజికవర్గం కొనసాగితే అది తెలుగుదేశం రాజకీయాలుగానూ, రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో కమ్మ సామాజికవర్గం  కొనసాగితే అది కాంగ్రెస్  రాజకీయాలుగానూ గత మూడున్నర దశాబ్దాలుగా సాగుతోంది. అధికారంలోనికి టిడిపి వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా? వైయస్సార్  కాంగ్రెస్ వస్తుందా? అని జరిగే చర్చ అంతా సారాంశంలో కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో  రెడ్డి సామాజికవర్గం అధికారాన్ని పంచుకోవాలా? లేక రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో కమ్మ సామాజికవర్గం అధికారాన్ని పంచుకోవాలా? అనేదే! ఇప్పుడు ఆ అధ్యాయం కూడా ముగింపుకు చేరుకుంటున్నది.  దళిత బహుజనులు, మతమైనారిటీలు తదితర కొత్త శక్తులు రాజకీయాధికారంలో సముచిత వాటాను కోరుతున్నాయి. దిగువశ్రేణుల్లో రగులుతున్న సామాజిక కల్లోలాన్ని మరుగుపరచడానికి దాదాపు అన్ని పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది నిప్పును గడ్డితో కప్పడం వంటి ప్రయత్నం మాత్రమే!


కాపుసామాజికవర్గం ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాధిపత్యంలో చిన్నతరహా భాగస్వామిగా వుంటున్నదేతప్ప నేరుగా నాయకత్వం వహించిన సందర్భంలేదు. రాజకీయాధిపత్యంలో కాపుసామాజికవర్గాన్ని నాయకత్వ స్థానంలో నిలపడానికి అప్పట్లో, వంగవీటి మోహనరంగా రూపంలో, ఇటీవల  చిరంజీవి రూపంలో కొన్ని ప్రయత్నాలు  జరిగాయి. ఆ ప్రయత్నాలు విఫలం కావడానికి చాలామంది కాపు సామాజికవర్గ నాయకుల వ్యక్తిగత పరిమితుల్ని ప్రస్తావిస్తుంటారు. అది ఒక పార్శ్వం మాత్రమే. నిజానికి సామాజికవర్గాల నిచ్చెనలో కాపు సామాజికవర్గం స్థానాన్ని నిర్ధారించడంలోనే ఒక దందరగోళం వుంది. కాపు సామాజికవర్గం ఆధిపత్య కులాల్లో వెనుకబడినతరగతిగానూ, వెనుకబడినతరగతుల్లో ఆధిపత్య కులంగానూ కొనసాగుతోంది.  కాపు సామాజికవర్గం ఇలాంటి ద్వంద్వసభత్వం నుండి బయటపడితే రాష్ట్ర రాజకీయ సామాజిక సమీకరణల్లో  మరింత స్పష్టత వస్తుంది.
          ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టి పడుతున్న కష్టాలన్నీ 1990వ దశకంలో తెలుగుదేశం పార్టికి వచ్చాయి. 1991 లోక్ సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. ఎన్టీఆర్ ప్రతిపక్షనేతగా వున్నారు. కష్టకాలంలో వచ్చిన ఆ ఎన్నికల్లో   ఎన్టీఆర్ ఒక అద్భుత సామాజిక ప్రయోగం చేశారు. కొత్త రఘురామయ్య ఐదుసార్లు, ఆచార్య యన్జీ రంగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ప్రతిష్ఠాత్మక గుంటూరు నియోజకవర్గాన్ని ముస్లిం అభ్యర్ధికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆచార్య యన్జీ రంగాపై  తెలుగు దేశం అభ్యర్ధి  ఎస్ యం లాల్ జాన్ బాషా విజయం సాధించి పార్లమెంటరీ రాజకీయాల పరిభాషలో జెయింట్ కిల్లర్అయ్యారు. ఆ ఎన్నికల్లోనే మచిలీపట్నం నియోజకవర్గంలోనూ ఎన్టీఆర్ మరో ప్రయోగం చేశారు. మాగంటి అంకినీడు, కావూరు సాంబశివరావు నాలుగు విడుతలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం స్థానాన్ని వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన కేపి రెడ్డయ్యకు కేటాయించి విజయం సాధించారు. కమ్మసామాజికవర్గం తమ ప్రధాన రాజకీయ కార్యక్షేత్రంగా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యన్టీఆర్ ఈ ప్రయోగాన్ని చేయడం విశేషం. దీని ఫలితాలు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించాయి. ఆ ఎన్నికల్లో హిందూ వెనుకబడిన సామాజికవర్గాలు, ముస్లిం సామాజికవర్గాలు టిడిపికి భారీ విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించాయి. అలా యన్టీఆర్ మళ్ళీ అధికారంలోనికి వచ్చారు.

ఈ గుణపాఠాలన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం నేర్చుకోవాల్సివుంది. అంటే, రాజకీయాల్లో సామాజికవర్గాల కూర్పు మారాల్సిన సమయం వచ్చిందని గమనించాలి. పాత కూర్పు మీద నిరసన వ్యక్తం అవుతున్నప్పుడు దాన్ని తొలగించి కొత్త కూర్పును ఏర్పాటుచేసే చర్యల్ని తక్షణం చేపట్టాలని గుర్తించాలి. అలాంటి కొత్త ప్రయోగాలకు ఇది సరైన సమయం

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
16 మార్చి 2014
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, ఎడిట్ పేజీ, 19  మార్చి 2014

No comments:

Post a Comment