Monday 25 May 2015

అస్తిత్వవాద కథంటే?

Identity Writings And The Rule Of Confrontation
అస్తిత్వవాద కథంటే?

ఇది అస్థిత్వవాద యుగంఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, మత అల్పసంఖ్యాకవర్గాలు, స్త్రీలు, కార్మికులు మాత్రమేగాక, భాషా, ప్రాంత, వర్ణ తదితర కారణాలవల్ల అణిచివేతకు గురవుతున్న అసంఖ్యాకశ్రేణులు తమ విముక్తికోసం ఆరాటపడుతున్నాయి. తమతమ స్థాయిల్లో తమదైన శైలుల్లో పోరాడుతున్నాయి. సాహిత్యం చాలా పనులు చేస్తుందిగానీ, వాటన్నింటిలో మహత్తరమైనది అది అణగారిన  శ్రేణులకు అండగ నిలబడమే

కష్టాల్లోవున్నవాళ్ల పక్షాన నిలబడాలనుకునే కవులు, రచయితలకు తెలుగునాట కొదవలేదు. తెలుగు సాహిత్యానికి ఇది చాలా గొప్ప పార్శ్వం. అయితే, ఆశయం వేరు. గమనం వేరు. గమ్యం వేరుచాలా మంది రచయితలకు  అస్థిత్వ శ్రేణుల మీద అపార అభిమానమున్నా వాళ్ల కథలు చాలా సందర్భాల్లో ప్రకటిత లక్ష్యాలను సాధించడంలేదుదానికి కారణం ఏమంటే చాలామంది రచయితలు రచన నిర్మితిని అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు.

రచనకు మౌలికంగా   సందర్భం - సంఘర్షణ - పరిష్కారం  (Setup, the Confrontation and the Resolution) అనే మూడు అంకాల నిర్మితి (three-act structure) వుంటుందనేది అందరికి తెలిసిన అంశమే. అస్థిత్వవాద  రచయితలు   సంఘర్షణ అంకాన్ని మరింత లోతుగా అభ్యాసం చేయాల్సిన అవసరం వుంది.

ఒక అమ్మాయికి కష్టం వస్తే అది ఒక అమ్మాయి కథ అవుతుందిగానీ స్త్రీవాదకథో, పురుషాధిక్య కథో  అవ్వదు. ఘర్షణ చట్రంలో  అమ్మయితో పాటూ ప్రత్యక్షంగానో, పరోక్షంగా ఒక పురుషుడు వుండాలి. ఆమె మీద పురుషాధిక్య అణిచివేత కొనసాగిందని నిరూపణ అయినపుడే అది స్త్రీవాద కథ అవుతుంది. ఆమె సాగించే పోరాటం విస్తృతమయితే మొత్తం స్త్రీజాతి విముక్తి చెందుతుందనే నమ్మకాన్ని  పాఠకులకు కలిగిస్తే కథకు  సార్వజనీనత కూడా సమకూరుతుంది. ఇదే సూత్రం ముస్లింవాద, దళితవాద, తెలంగాణవాద తదితర రచయితలకూ  వర్తిస్తుంది.

కథలో పాత్రలన్నీ దళితులయినంత మాత్రానా అది దళితవాద కథ కానట్టే, కథలో పాత్రలన్నీ ముస్లింలు అయినంత మాత్రాన కథ ముస్లింవాద కథ కాదుఛార్లెస్ డికెన్స్ రచనల్లోనీ పాత్రలన్నీ దాదాపుగా క్రైస్తవులే. అంత మాత్రాన వాటిని క్రైస్తవవాద రచనలు అనలేం.

సిరిసిల్లలో ఒక సాలె అతను పేదరికంతో చనిపోతే అది తెలంగాణ కథో, సాలెవాళ్ల కథో అవుతుందిగానీ తెలంగాణవాద  కథకాదు. ఎందుకంటే సిరిసిల్లలో సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతున్నట్టే, ఆంధ్రాలో భట్టిప్రోలు, జాండ్రపేటల్లోనూ సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతుంటారుసిరిసిల్ల కథను తెలంగాణవాద కథగా మార్చాలంటే సాలెవాని చావుకు  ఆంధ్రా ప్రాంతీయుల పాలన నేరుగా కారణమనే ఉపపత్తిని  నిరూపించాల్సి వుంటుంది. ఇలా నిరూపించని రచనలు కూడా ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నప్పుడు ఉద్యమ సాహిత్యంగా చెలామణి అయిపోతుంటాయి. వీటిల్లో తప్పును ఎత్తి చూపడానికి కూడా అప్పట్లో సాహిత్య విమర్శకులు సాహసించరు.

ఘర్షణ చట్రంలోనికి  పరస్పర విరుధ్ధ శక్తుల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రవేశపెట్టినపుడే అది అస్థిత్వవాద రచన అవుతుంది. జ్ఞానం అనేది  ఆధిపత్యకులాల  స్వంత ఆస్తి  కాదని చెప్పడానికి  'జాగీరు' కథలో  పసునూరి  రవీందర్  దళిత యువకుడ్ని ఏకంగా  ఆధిపత్యకులస్తుడి ఇంట్లో ప్రవేశపెడతాడు. . వేం. రమేష్ కథ పాంచలమ్మ పాటలో  సునందత్త పాత్ర  తన మొగుడు చీట్ల పేకాటలో తనను ఫణంగా పెట్టి ఓడిపోయాడనీవాడికి మొగుడుతనం పోయిందనీ, తను ముండమోసిందని తనే  ఊర్లో డప్పుకొట్టి మరీ చాటి చెపుతుంది ఇలాంటి ముఖాముఖి ఘర్షణ అస్థిత్వవాద రచనలకు వన్నె తెస్తుందిపీవీ సునీల్ కుమార్ కథ థూవేంపల్లె షరీఫ్ తలుగు కథల్లో మనం ఇలాంటి ప్రత్యక్ష ఘర్షణను చూస్తాం

ఘర్షణ చట్రంలోనికి  పరస్పర విరుధ్ధ శక్తుల్ని ప్రవేశపెట్టాలనే సూత్రం తెలిసిన రచయితలు సమర్ధమైన అస్థివాద  రచనలు చేయగలుగుతారు. సూత్రం తెలియనివాళ్ళు గాల్లో కలాలను ఝళిపిస్తారు. అంతే తేడారచయితలకు లక్ష్యం వుంటే సరిపోదు లక్ష్యాన్ని సాధించే మెళుకువలూ తెలియాలి.

అస్తిత్వవాద రచయితలు ఉద్యమ నాయకుల్లా ఆలోచించాలి; ఉద్యమ అనుచరుల్లాకాదు.


- ఉషా ఎస్ డానీ
రచయిత, విమర్శకుడు
(‘ప్రాతినిధ్య కథ-2014’ ఆవిష్కరణ ప్రసంగంలో ఒక భాగం)

హైదరాబాద్, 24 మే 2015

ప్రచురణ :  సాక్షి దినపత్రిక, సాహిత్య పేజీ, 24 మే 2015

http://www.sakshi.com/news/opinion/writer-critic-danys-opinion-on-stories-242381

No comments:

Post a Comment