Sunday 19 July 2015

ప్రభుత్వ వేతన కలం కార్మికులకు ఒక విజ్ఞప్తి

ప్రభుత్వ వేతన కలం కార్మికులకు ఒక  విజ్ఞప్తి
ఉషా యస్ డానీ

తాము గొప్పగా పాలిస్తున్నామని ప్రభుత్వాధినేతలు అనుకుంటే సరిపోదు. ప్రభుత్వం గొప్పగా పనిచేస్తున్నదని ప్రజలు కూడా అనుకోవాలి. అలా అనుకోకపోతే ఆ తరువాతి ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. అంచేత తాము చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రభుత్వాలు ఒక ప్రత్యేక మంత్రివర్గ  విభాగాన్నే ఏర్పాటు చేసుకుంటాయి. దీన్నే సమాచార, పౌరసంబంధాల శాఖ అంటారు.

ప్రభుత్వ ప్రచారంకన్నా ప్రభుత్వాధినేత  ప్రచారం మరీ ముఖ్యం కనుక ముఖ్యమంత్రి పేషీలోనూ, క్యాంపు కార్యాలయంలోనూ, సచివాలయంలోనూ ఇంకో పీఆర్వో వ్యవస్థ వుంటుంది. ఇందులోనూ కనిపించే పీఆర్వోలు కనిపించని పిఆర్వోలు వుంటారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పత్రిక నిర్వహణ పేరుతో మరో పిఆర్వో వ్యవస్థ వుంటుంది. ఇటీవల వెబ్ సైట్ పేరుతో ఒకటి, సోషల్ మీడియాలో ప్రచారం పేరుతో ఇంకొకటి కొత్త పీఆర్వో వ్యవస్థలు వచ్చాయి. ఇవికాక, ముఖ్యమంత్రికి కీలక ప్రసంగాలు రాసిపెట్టడానికీ, అడపాదడపా పత్రికల్లో ముఖ్యమంత్రి పేరునో, కీలక నేతల పేరునో ఎడిట్ పేజీ వ్యాసాలు రాయడానికీ ఘోస్టు రచయితల వ్యవస్థ కూడా వుంటుంది.

ప్రభుత్వం కాంగ్రెస్ ది అయినా, తెలుగుదేశానిది అయినా, ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి వున్నా, నారా చంద్రబాబు నాయుడు వున్నా ఈ ఏర్పాట్లన్నీ తప్పవు. సాలీన వీటి నిర్వహణ వ్యయం వందల కోట్ల రుపాయల్లోనే వుంటుంది. ప్రకటనల ఖర్చుల్ని కూడా కలుపుకుంటే అది వేల కోట్ల రుపాయల్లోనే వుంటుంది.  చంద్రబాబుకు ప్రచార యావ కొంచెం ఎక్కువ గనుక. వారి బడ్జెట్ మరింత ఎక్కువగానూ వుంటుంది.

ఇవిగాక, అధికారపార్టీలకు సహకారాన్నందించే రెండు మూడు ప్రధాన పత్రికలు, రెండు మూడు ప్రధాన న్యూస్ ఛానళ్ళు ఎలాగూ వుంటాయి. ఆ మీడియా సంస్థలకు ఎలాంటి ప్రయోజనాలు ఏ రూపంలో ఒనగూడుతాయి అన్నది ఆసక్తికర అంశం. ఈ వరస ఇంతటితో ఆగదు. ప్రభుత్వం నుండి లబ్ది పొందిన కార్పొరేట్ సంస్థలు సహితం తమ  కృతజ్ఞత ప్రకటించుకోవడానికి   సందర్భానుసారం మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తుంటాయి. వీటికోసం కూడా పాత్రికేయుల కరసేవ  అవసరం అవుతుంది.  

చంద్రబాబు ఈసారి అధికారాన్ని చేపట్టిన తరువాత కొత్తగా మీడియా సలహామండలి వ్యవస్థను నెలకొల్పారు. సమాచారశాఖా మంత్రితో సమానంగా కేబినేట్ హోదా ఇచ్చి మీడియా సలహాదారునిగా పరకాల ప్రభాకర్ ను నియమించారు. వారికి సహకరించడానికి ఓ డజను మంది సమాచార అధికార్లను (Communication Officers)  నియమించారు. వీళ్లందరి జీతభత్యాలు, ఇతర సదుపాయాల గురించి సీనియర్ జర్నలిస్టు నందిరాజు రాధాకృష్ణ అప్పట్లో ఒక పోస్టు పెట్టారు.

మా నరసాపురం మేధావి మాత్రమేకాక, మేమిద్దరం కొంతకాలం ఏన్టీవీలో కలిసి పనిచేసిన అనుబంధం కూడా వుంది కనుక పరకాల ప్రభాకర్ నియామకాన్ని హర్షించినవాళ్ళలో నేనూ ఒకడ్ని. అలాగే కొందరు జర్నలిస్టు మిత్రులకు కష్టకాలంలో పునరావాస సౌలభ్యం దొరికినందుకూ నేను ఆనందించాను.

పైన చెప్పినదంతా ప్రభుత్వ వ్యవస్థ. ఇదిగాక, మీడియాలో టిడిపీ ప్రచారాన్ని సాగించడానికి అభిష్ఠ నాయకత్వాన  నారా లోకేష్ ఇంకో పిఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పుడు టిడిపివర్గాలు వెబ్ సైట్ టీం అంటున్నారు. దీని సభ్యులు దేశవిదేశాల్లోనూ వున్నారట.  ఈ విభాగం కోసం కూడా భారీగానే ఖర్చుపెడుతున్నారు.

పైన చెప్పిన పాత, కొత్త వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్లందరూ పెయిడ్ సర్వెంట్స్.  వేతన కలంకార్మికులు. వీళ్ళందరికీ ఒకటే వృత్తిధర్మం; చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ భూలోక స్వర్గంగా వుందనీ, రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో రోజూ పండుగలు జరుపుకుంటున్నారని తమకు వీలైనన్ని పధ్ధతుల్లో, వీలైనన్ని మీడియాల్లో ప్రచారం చేయడం. అందుకువాళ్లను నిందించడంలేదు. రేపు కాలం కలిసిరాక నాకూ అక్కడ కొలువు కుదిరితే నేనూ ఆ పనే చేయాల్సి వుంటుంది.  ఆ మేరకు వాళ్ళ మీద నాకు సానుభూతి మాత్రమే వుంది.

చంద్రబాబు ప్రభుత్వానిది స్వభావసిధ్ధాంగానే కార్పొరేట్ విజన్. అంచేత, కార్పొరేట్ ప్రయోజనాలని ప్రజల ప్రయోజనంగా ప్రచారం చేయడం ఈ వేతన కలం కార్మికుల కర్తవ్యం.   విధినిర్వహణలో ఈ కలం కార్మికులు విఫలమయ్యారో, చంద్రబాబు పాలన వీళ్ళు ముసుగు వేయలేనంత అధ్వాహ్నంగావుందోగానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం నిరసన రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రజల్లో నిరసన పెరుగుతోందని తెలిసినప్పుడు ప్రభుత్వాధినేతలు ముందుగా విమర్శించేది పీఆర్వో వ్యవస్థనే. అలాంటి నిస్పృహ ఇప్పుడు మన వేతన కలం కార్మికుల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నది. వాళ్ళు మేధోసంచయనాన్నీ(Intellectual articulation) మానేసి తిట్ల భాష, సారాకొట్టు భాషా వాడుతున్నారు. నిస్పృహలో వున్న వాళ్లకు సభ్యభాష రాదు.

ప్రజల పక్షాన నిలబడకపోవడమే పాత్రికేయులు చేసే మొదటితప్పు. తప్పుచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడాలనుకోవడం అంతకన్నా పెద్దతప్పు. ప్రజల పక్షాన మాట్లాడే పాత్రికేయుల్ని విమర్శించడం అంతకన్నా మరీ పెద్దతప్పు. ప్రభుత్వ తప్పిదాలని ఎత్తిచూపుతున్న పాత్రికేయుల్ని  తిట్టడం, వాళ్ల మీద నిందలేయడం దిగజారుడుతనం. ఇంతగా దిగజారవద్దని ప్రభుత్వ కొలువు చేస్తున్న పాత్రికేయ మిత్రుల్ని కోరుతున్నాను.  మేధోసంచయనాన్నీ ఏ స్థాయిలో కొనసాగించినా అందులో పాల్గొనడానికి మేము సిధ్ధమని ప్రకటిస్తున్నాను.

ముగింపులో ఒకమాట చెప్పాలి. పైన రాసిందంతా మేము సంస్కారంగా వుండాలనుకున్నప్పుడు వాడే భాష మాత్రమే!  మా మాస్ భాష వేరేగా వుంది. మాది నరసాపురం. మాకు ఎవరిమీదనయినా మరీ ఎక్కువ ప్రేమ వచ్చినపుడు “అమ్మ లం...” “అమ్మ లం...కొడక అంటాం. అలాంటిది మాకు కోపం వచ్చినపుడు ఏ పదాలు, ఏభాష మాట్లాడతామో విజ్ఞులు ఊహించుకోవచ్చు. మమ్మల్ని మా మాస్ భాష గుర్తుచేయవద్దు!
END

19 July 2015

No comments:

Post a Comment