Wednesday 7 December 2016

Objective Conditions, Subjective Concerns & The Descriptive Account Of History

Objective Conditions, Subjective Concerns & The Descriptive Account Of History
-     డానీ
Danny
6 Dec 2016

ప్రతి చారిత్రక సందర్భంలోనూ అనివార్యంగా రెండు అంశాలుంటాయి. మొదటిది, అప్పటి వస్తుగత సామాజిక పరిస్థితి (Objective Conditions). రెండోది; కీలక వ్యక్తుల వ్యక్తిగత అభిష్టాలు  (Subjective Efforts). మార్క్సిస్టులు అప్పటి సామాజిక వస్తుగత పరిస్థితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తుల అభిష్టాలకు  తక్కువ ప్రాధాన్యతనిస్తారు. “అప్పుడు కాలం కడుపుతో వుంది కార్ల్ మార్క్స్ ను కనింది” అన్నాడు మయకోవిస్కీ. అంతేగానీ కార్ల్ మార్క్స్ కాలాన్ని కన్నాడు అనలేదు.

ఆర్ధికరంగం ద్వార, అందులోనూ ఉత్పత్తి విధానాల ద్వార, పనిముట్ల ద్వార మరీ ముఖ్యంగా ఉత్పత్తి సంబంధాల ద్వార చారిత్రక దశను వివరించడం మార్క్సిస్టులు అవలంభించే పధ్ధతి. అలాకాకుండా కొందరు వ్యక్తులే చరిత్రను నడిపినట్లు రాయడం మరో పధ్ధతి. వ్యక్తులు, వాళ్ళ కార్యాచరణను వర్ణిస్తే చదవడానికి చాలా బాగుంటుంది. సాధారణ చరిత్రకారులు, రచయితలు, పాత్రికేయులు ఈ విధానాన్నే అనుసరిస్తుంటారు. కానీ, ఇందులో శాస్త్రీయ దృష్టి లోపిస్తుంటుంది. వస్తుగత సమాజం, బాహ్యాత్మక పరిస్థితుల వివరణ శాస్త్రీయమైనదేగానీ దానికి పెద్దగా పఠనాసక్తి వుండదు. ఈ రెండు విధానాల మేలు కలయికగా Descriptive account of history అంటూ ఓ మిశ్రమ మార్గముంది. పఠనాసక్తిని కలిగించడానికి కీలక సంఘటనల్ని వివరంగా వర్ణించాలి. శాస్త్రీయ కోణం తప్పిపోకుండా  ఆ వివరాలూ ఇస్తూ వుండాలి.  నేను అలాంటి శైలిని ఇష్టపడతాను. ఇందులో వున్న సౌలభ్యం ఏమంటే పఠనాసక్తీ వుంటుంది; శాస్త్రీయ కోణమూ తప్పిపోదు.

చరిత్ర అంటే గతానికి సంబంధించిన వ్యవహారం అని ఎవరయినా అనుకుంటూవుంటే వాళ్ళకు ఆ రంగానికి సంబంధించి ఓనమాలు కూడా తెలియవని అర్ధం. సమస్య ఎక్కడ వస్తుందంటే చరిత్ర అనేది ఎన్నడూ గతం కాదు.  నిజానికి చరిత్ర వర్తమానం కూడా కాదు. చరిత్ర రచన అనేది మానవ సమూహాలకు భవిష్యత్తు ప్రణాళిక. అంచేత తమ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చరిత్రను  తిరగరాయాలని సమాజంలోని మానవసమూహాలన్నీ తపిస్తుంటాయి. చాలా మందికి గతంలో ఏం జరిగిందన్నది ఎంత మాత్రం ముఖ్యంకాదు; ఏం జరిగిందని చెప్పుకుంటే భవిష్యత్తులో తమకు ప్రయోజనకరంగా  వుంటుందన్నది ముఖ్యం.

ద్రావిడులు భారత ఉపఖండపు ఆదివాసులు అనడం ఒకరకం రాజకీయం. ఆర్యులు బయటి నుండి వచ్చినవారు అనడం ఇంకోరకం రాజకీయం. ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే   బయటి నుండి వచ్చారనడం మరో రకం రాజకీయం.  ద్రావిడులకన్నా ముందే ఇక్కడ ఆదివాసులు వున్నారనడం కూడా మరో రకం రాజకీయం.

చరిత్ర రచన అనేది ఒక విధంగా  న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పండం లాంటిది.  ఏ సాక్షీ కూడా న్యాయమూర్తి ముందు తనకు తెలిసింది తెలిసినట్టు చెప్పడు. న్యాయమూర్తి నుండి తాను ఆశించే తీర్పుకు అనుగుణమైన వ్యాఖ్యానాలతో మాత్రమే సాక్ష్యం చెపుతాడు. వాది పక్షాన సాక్షిగ వస్తే నేరతీవ్రతను పెంచి సాక్ష్యం చెపుతాడు. ప్రతివాది పక్షాన సాక్షిగ వస్తే నేరతీవ్రతను తగ్గించి సాక్ష్యం చెపుతాడు.

అతిగా ప్రచారం అయినట్టు విజయవాడ అల్లర్లు అనేవి కమ్మ-కాపు వైరమూ కాదు;  వంగవీటి- దేవినేని కుటుంబాల రాజకీయ శతృత్వమూకాదు. ఇవన్నీ బయటికి కనిపిస్తున్న కొన్ని అంశాలు మాత్రమే. పది లక్షల జనాభాగల అప్పటి  విజయవాడలో దేవినేని నెహ్రు, వంగవీటి రంగా అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు మాత్రమే. వాళ్ళిద్దరి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, వాళ్ళకు బయట, వాళ్ళకన్నా  ప్రభావశీలంగా చరిత్రగతిని తిప్పగలవాళ్ళు  9,99,998 మంది విజయవాడలో వున్నారని గుర్తించడం ముఖ్యం.

రంగాహత్య తరువాత చెలరేగిన అల్లర్ల హోరు ఢిల్లీ వరకేకాదు లండన్ వరకూ వినిపించింది. అక్కడి ఆర్ధిక విశేషకులు ఇక్కడి కుల తగవుల్నీ, రాజకీయ కక్షల్నీ అసలు పట్టించుకోనేలేదు. విజయవాడలొని 130 మురికివాడల్లో నివశిస్తున్న దాదాపు ఐదు  లక్షలమంది  జనమే దీనికి కారణమని వాళ్ళు భావించారు. కొత్త ధనికవర్గపు సంపద ప్రదర్శన మీద పేదవర్గాలు చేసిన దాడి అంటూ తేల్చాయి.  


వెంటనే Overseas Development Authority  అనే బ్రిటీష్  సేవాసంస్థ విజయవాడకు వచ్చి మురికివాడల్ని అభివృధ్ధిచేసే పని మొదలెట్టింది. ముందు చూపుతో విశాఖపట్నం తదితర నగరాల్లోని మురికివాడల్లోనూ ఈ  ప్రాజెక్టును చేపట్టారు. మురికివాడల ప్రజల్లో మధ్యతరగతి ఆశలు రేపి వాళ్ళను శాంతింపజేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అప్పటి ఓడియే ప్రాజెక్టు కమీషనర్ ఆదిత్యనాధ్ దాస్ తరచుగా విజయవాడ మొగల్రాజపురం సున్నపుభట్టీల సెంటరులోని దాసరి రమణ నగర్ కు వచ్చి పనుల్ని పరిశీలించేవారు. విజయవాడ మొత్తంలో క్రమబధ్ధంగా నిర్మించిన మురికివాడ అదొక్కటే. పైన్నుండి వచ్చే అధికారుల్ని, పరిశీలకుల్ని ఆదిత్యనాధ్ దాస్ ముందుగా ఆ పేటకే  తీసుకువచ్చేవారు.  ఈ క్రమంతో నాకున్న ప్రధాన అనుబంధం ఏమంటే దాసరి రమణనగర్ మురికివాడకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడ్ని.



అప్పట్లో విజయవాడలో విజృంభించిన కొత్త ధనికవర్గాన్నీ (neo rich), అది ముందుకు తీసుకువచ్చిన ధనప్రదర్శన సంస్కృతినీ అర్ధం చేసుకోకుండా వాటికి అనివార్యమైన పరిణామంగా సంభవించిన విజయవాడ అల్లర్లనూ ఎప్పటికీ అర్ధం చేసుకోలేం. అప్పట్లో రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించేది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణ నేపథ్యంలో ఇప్పుడు అక్కడి రియల్ ఎస్టేట్ అరవై పువ్వులు ఆరువేల కాయలుగా  వికసిస్తోంది. వీధికో నాలుగు ఆడీ, బెంజి, బియండబ్ల్యూ కార్లు కనిపిస్తున్నాయి. మరోవైపు స్వంతఇళ్ళు లేని జీవులు అద్దెలు కట్టుకోలేక అప్పుల పాలవుతున్నారు. విజయవాడలో మరోమారు అల్లర్లు జరిగే ప్రమాదాన్ని గుర్తించి వాటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం వివేకవంతుల కర్తవ్యం. 

No comments:

Post a Comment