Wednesday 7 December 2016

People are the real writers of History

ప్రజల అభిష్టమే చరిత్ర
వ్యక్తుల రాగద్వేషాలు చరిత్రకాదు

-        డానీ
People are the real writers of History

History Made Easy
చరిత్రను మనం కీలక వ్యక్తుల చర్యల ద్వారా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది కొంచెం సులభంగానూ, వినోదంగానూ వుంటుంది. సినిమా కథలకూ బాగుంటుంది.  అగ్నిదేవుని అజీర్తిని పోగొట్టడానికి  ఖాండవ దహనం చేయమంటాడు  శ్రీకృష్ణుడు. నాగరీకులు వచ్చి ఆదివాసుల సంహారం సాగించారని మనకు ఎప్పటికి అర్ధం కావాలీ?

వీధుల్లో కులపోరాటాలు జరగలేదు
విజయవాడ అల్లర్లలో కమ్మ-కాపు సామాజికవర్గాలు రోడ్ల మీదకు వచ్చి కలబడలేదు. అల్లర్ల సందర్భంగా ఒకే ఒక హత్య జరిగింది. దానికి కూడా కులం కారణం కాదు. స్థానిక తగవులు కారణం. రంగా అనుచరులు కొన్ని వాణిజ్యసంస్థల మీద కులం దృష్టితో దాడులు జరిపారుగానీ మొత్తం దాడుల్లో వాటి సంఖ్య చాలాచాలా తక్కువ.

పేద ప్రజల అసహనం ఆక్రోసంగా మారింది
మొత్తం అల్లర్లని మురికిపేటల జనం ఎలాంటి ముందస్తు  ప్రణాళికలేకుండా, ఒక నాయకుడు లేకుండా, ప్రాప్తకాలజ్ఞతతో జరిపేశారు. తమ ఇళ్ళస్థలాలని క్రమబద్దీకరించే ప్రక్రియను నగరంలోని ధనవంతులు అడ్డుపడుతున్నారనీ, తమ ఇళ్ళ పట్టాల కోసం పోరాడుతున్నందుకే రంగాను చంపేశారనే సంకేతం మురికివాడల్లోనికి బలంగా వెళ్ళింది. వాళ్లలోని  అసహనం ఆక్రోసంగా మారింది. 

హత్యా స్థలం నిర్మానుష్యంగా వుంది
కులమే ప్రధాన కారణం అయితే రంగా చివరి నిరాహార దీక్ష శిబిరం మరోలా వుండేది. బహుశ కాపు జనసముద్రంలో మునిగిపోయి వుండేదేమో. కానీ, అలా జరగలేదు. రంగా హత్య జరిగే సమయంలో శిబిరం దాదాపు నిర్మానుష్యంగా వుంది. శిబిరం దగ్గర రోజూ పెద్ద సంఖ్యలో వుండే  దళితులు, క్రైస్తవులు ఆ రాత్రి క్రిస్మస్ ప్రార్ధనల్లో వున్నారు. హత్య కు ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా తక్కువ మంది వున్నారు. వాళ్ళు కూడా మీడియా ముందు, న్యాయస్థానాల్లో తలో కథనాలు చెప్పారు.


రాజకీయ కోణం అదో భ్రమ

ఇక రాజకీయం అంటారా? రంగాకు తెలుగుదేశంలోనేకాదు కాంగ్రెస్ లోనూ గట్టి ప్రత్యర్ధులు  వుండేవారు. విజయవాడలో జీయస్ రాజు, హైదరాబాద్ లో జలగం వెంగళరావు కూడా ఆయన ప్రత్యర్ధులు. అప్పటి  హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారం కొందరు పోలీసు అధికారుల ద్వార తన భర్తను హత్య చేయించారనేది రంగా భార్య రత్నకుమారి చేసిన ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి యన్టీ రామారావును ప్రధాన నిందితునిగా పేర్కొనాలని కూడా వారు కోరారు.   రంగా హత్య జరిగిన ఏడేళ్ళ తరువాత వారే స్వయంగా కాంగ్రెస్ ను వదిలి చంద్రబాబు నాయకత్వంలోని  తెలుగుదేశంలో చేరారు. దానికి ప్రతిచర్యగా అన్నట్టు దేవినేని నెహ్రు టిడిపిని వదిలి కాంగ్రెస్‍ లో చేరారు. అంచేత అది రాజకీయ కక్షలు అనడానికి కూడా లేదు.  

హత్యకు పెట్టిన ముహూరర్తమే సాక్ష్యం!

రంగా హత్య క్రిస్మస్ మరునాడు డిసెంబరు 26 తెల్లవారు జామున జరిగింది. హంతకులు ఇలాంటి ముహూర్తాన్ని ఎంచుకోవడానికి ఒక తర్కం కూడా వుంది. అర్ధరాత్రి వరకు  చర్చీల్లో ప్రతేక  ప్రార్ధనలు  జరుపుకున్న జనం  తెల్లవారు ఝామున గాఢ నిద్రలో వుంటారు కనుక హత్యకు పెద్దగా ఆటంకం వుండదనేది ఇందులోవున్న తర్కం. అంతవరకూ బాగానేవుందిగానీ క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ప్రార్ధనలు జరిపి తెల్లవారుజామున  గాఢనిద్రలోనికి జారుకునే జనం ఎవరూ? వాళ్ళు క్రైస్తవులు, దళితులు అయ్యుంటారుగానీ కాపు సామాజికవర్గం కాదుకదా?. ఈ దాడికి ముహూర్తం పెట్టినవాళ్ళు  చాలా తెలివిగా మురికివాడల ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పథక రచన చేశారు. వాళ్ళ లక్ష్యం రంగాయేగానీ కాపులు కాదు. ఈ సూక్ష్మాన్ని  మేధావులకన్నా మురికివాడల ప్రజలే బాగా అర్ధం చేసుకున్నారు. 

8-12-2016


No comments:

Post a Comment