Saturday 1 July 2017

GARAGAPARU - Accused not listed in the charge sheet

చార్జీషీటుకు ఎక్కని నిందితులు

-        డానీ

               ఊరి పెద్దలు ముగ్గుర్ని అరెస్టు చేయగానే గరగపర్రు గెలిచింది అని సంతృప్తి చెందడం సరికాదు. సమస్య అంతకన్నా పెద్దది; జటిలమైనది. 
               ఏ గ్రామంలో ఏ సామాజికవర్గం ప్రాబల్యం వుందో తెలుసుకోవడానికి విగ్రహాలు కూడా ఒక కొలమానం. గరగపర్రులో దేవుళ్ళ విగ్రహాలు మూడున్నాయి. విగ్రహం సైజు ఎంత భారీగావుంటే అక్కడ కొత్తధనిక (నియో రిచ్) వర్గం అంతగా పెరింగిందని అర్ధం. ఉర్లో  మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలున్నాయి. బహుశ ఈ రెండింటినీ అన్నింటికన్నా ముందుగా కట్టించి వుంటారు. వాళ్ళిద్దరికీ విగ్రహాలు కట్టించే సాంప్రదాయం ఇటీవల బాగా తగ్గిపోయింది. గుర్రం మీదున్న సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వుందిగాబట్టి ఆ పరిసరాల్లో సాగునీటి వసతి పుష్కలంగా వుందని చెప్పవచ్చు. గోదావరి మండలం దక్షణ ప్రాంతం వాళ్ళకు  కాటన్ నీటి దేవుడు. ఆ ఊరి వెలమలు తమ ప్రతినిధిగా తాండ్ర పాపారాయుడు విగ్రహం పెట్టుకున్నారు. చెరోపక్క రెండు పులుల్ని పెట్టుకుని గంభీరంగా నిలబడిన అల్లూరి సీతారామ రాజు విగ్రహం కూడా వుంది.  వాళ్ళు మన్యం ఆదివాసుల విప్లవవీరుని విగ్రహం పెట్టుకున్నారు అనుకుంటే పొరపాటే. గ్రామాన్ని ఏలుతున్న రాజూ సామాజికబ్వర్గం తమ ప్రతీకగా శ్రీరామరాజు విగ్రహాన్ని అక్కడ పెట్టారు.
               ఊరి మధ్యలో మంచినీటి చెరువుగట్టున ఈ విగ్రహాల పక్కన అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాలని గ్రామ దళితులు అనుకున్నప్పుడే వివాదం మొదలయింది.  పెత్తందారీకులాల ఇళ్ళకు దూరంగా మాలపేటల్ని వుంచినట్టు, పెత్తందారీకులాల ప్రతినిధుల విగ్రహాలకు దూరంగా అంబేడ్కర్ విగ్రహాన్ని వుంచాలనేది గ్రామ పెద్దల అభిప్రాయం. గ్రామంలో ఎక్కడా అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టడానికే వీల్లేదనేవారూ వాళ్ళలో  వున్నారు. అంబేడ్కర్  విగ్రహాన్ని ప్రతిష్టించడానికి  పంచాయితీ తీర్మానం లేదనే సాంకేతిక కారణాన్ని కూడా వాళ్ళు చూపారు. అంబేడ్కర్ విగ్రహం చేతిలో పట్టుకున్నది కుడా భారత రాజ్యాంగమే.  తను రాసిన రాజ్యాంగానికి పుట్టిన పంచాయితీ సర్పంచ్ ఆ రాజ్యాంగంతోనే తన విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డుకుంటుందని  అంబేడ్కర్ ఊహించి వుండడు!
               వివాదం పెరగడంతో, యిందుకూరి బలరామకృష్ణం రాజు, ముదునూరి రామరాజు (పొత్తూరి రాము), కొప్పుల శ్రీనివాస్‌ ల నాయకత్వంలో పంచాయితీ పెద్దలు గ్రామ దళితుల మీద సాంఘీక బహిష్కరణతోపాటూ ఆర్ధిక ఆంక్షలు కూడా విధించారు. దళితుల్ని ముట్టుకోవడం, మాట్లాడడం మొదలు, భూముల్ని కౌలుకు ఇవ్వడం, పనులకు పిలవడం, వాళ్ళ పిల్లలకు  చదువు చెప్పడం, వాళ్లకు వైద్యం చేయడం,  చివరకు వాళ్ల పశువుల్ని మేపుకోనివ్వడం వరకు అన్నింటి మీదా నిషేధాన్ని విధించారు. ఇటీవల ఉత్సాహంగా హిందూత్వకు కరసేవకులుగా మారుతున్న హిందూ  నిమ్న కులాలవాళ్ళూ పెత్తందారీ కులాల పక్షం వహించారు.  
               చార్జిషీట్ లో మనకు కనిపిస్తున్న నిందితులు వీరే. కనిపించని నిందితుల జాబితా చాలా పెద్దదే వుంది.
రాజ్యాంగాన్ని అమలు చేయడానికి గ్రామ సర్పంచ్ కు స్థానిక ఇబ్బందులు వున్నాయి. సరే. నరసాపురం సబ్ కలెక్టర్, డీయస్పీ మొదలు జిల్లాకలెక్టర్, జిల్లా యస్పీలయినా రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూశారా? అంటే అదీలేదు. గ్రామాన్ని సందర్శించి ప్రశాంతతను కాపాడాలని దళితులకు హితవు చెప్పి వచ్చారు తప్ప సాంఘీక బహిష్కరణ విధించిన వారిపై కేసులు నమోదు చేయలేదు; కనీసం బహిష్కరణను ఎత్తివేయించలేదు. వీళ్లంతా నిందితులే. ఇంతటి దారుణాన్ని బయటికి పొక్కకుండా దాచిపెట్టిన ప్రభుత్వ ప్రాయోజిత ప్రధాన స్రవంతి మీడియా కూడా ప్రధాన నిందితురాలే. సోషల్ మీడియాయే లేకుంటే అసలు  ఈ దారుణం గురించి బయటి ప్రపంచానికి ఎప్పటికీ తెలిసేదే కాదు. మైదానంలోని గరగపర్రు దారుణాలే  బయటికి రాకపోతే ఏజెన్సీలోని  చాపరాయి  చావుల విషయం ఎలా వస్తుందీ?
          పెత్తందారీ కులాలవాళ్ళేకాదు గరగపర్రు దారుణంలో దళితుల పాత్ర కుడా వుంది. గ్రామ సర్పంచ్ఉన్నమట్ల ఎలిజబెత్‌, పాలకోడేరు మండల తహసీల్దార్జి. రత్నమణి, ఎస్సై వి. రాంబాబు ముగ్గురూ దళితులే. గ్రామ పెద్దలు అధికార పార్టికి చెందినవారైనపుడు, వాళ్లను ముట్టుకుంటే తాట తీస్తా అని అధికార పార్టి యంపీ, ఎమ్మెల్యే బెదిరిస్తున్నపుడు ఆ అధికారులు మాత్రం ఏం చేస్తారూ? వాళ్ళకు అధికారంలో కొలువు మాత్రమేవుందిగానీ అధిపత్యంవున్న కులం లేదు. వాళ్ళిప్పుడు బలిపశులుగామారి సస్పెండ్ అయ్యారు.
          ఉద్యమాల నుండి అధికారాన్ని చేపట్టిన వాళ్లకు వినికిడిశక్తి తగ్గుతుంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్కారెం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్చైర్మన్జూపూడి ప్రభాకర్లకు  గరగపర్రు ఆర్తనాదాలు వినిపించడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. అది కూడా వాళ్ళు స్వచ్చందంగా అక్కడికి వెళ్ళలేదు. ప్రధాన ప్రతిపక్షనేత గరగపర్రు బాధితుల్ని పరామర్శించే  తేదీని ప్రకటించాక, రాష్ట్ర సచివాయంలో కదలిక వచ్చింది.  ప్రభుత్వాధినేత సూచనల మేరకు తప్పదన్నట్టు వాళ్ళిద్దరూ గరగపర్రు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రితో పాటూ వీళ్లంతా గరగపర్రు కేసులో చార్జిషీటుకు ఎక్కని నిందితులే.
          గరగపర్రులో గమనించాల్సిన సామాజిక, రాజకీయార్ధిక అంశాలు చాలావున్నాయి. అభివృధ్ధికీ, పెరుగుదలకు మధ్య సాగే చెలగాటానికి గరగపర్రు గొప్ప ఉదాహరణ. సంపద పెరిగితే సామాజిక శాంతి పెరుగుతుందని చెప్పలేం. పెరుగుదల వికటిస్తే మాత్రం సామాజిక అశాంతి  రగులుకుంటుంది. అనుమానం వున్నవాళ్ళు గగపర్రును చూడవచ్చు.  గరగపర్రు ఊరు పేరు విననివాళ్ళు గూగుల్ మ్యాపులు తిరగేయ్యాల్సిన పని లేదు. పధ్నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం నడిపిన సత్యం రామలింగరాజు పుట్టిన ఊరది.  దాన్ని బట్టి ఆ ఊరి ఆర్ధికస్థాయిని ఊహించుకోవచ్చు. 
నీటిపారుదలా ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు నెలకొల్పితే దేశంలో అభివృధ్ధి జరిగి విద్యా వికాసం పెరిగి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తొలి ప్రధాని జహర్ లాల్ నెహ్రూ  భావించారు. సరళీకృత ఆర్ధిక విధానం ద్వార కార్పొరేట్లను ఉదారంగ ప్రోత్సహిస్తే వాళ్ళు పేదల వికాసానికి  సామాజిక బాధ్యతతో కృషిచేస్తారని పివీ నరసింగారావు ప్రచారం చేశారు. నరేంద్ర మోదీని దేశప్రధాని చేస్తే  జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి)  పెరుగుదల రేటు రెండంకెలు దాటుతుందని గత లోక్ సభ ఎన్నికల్లో కార్పొరేట్లు పెద్దగా ప్రచారం చేశాయి. దేశంలోనే అత్యధిక స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటును సాధిస్తున్న రాష్ట్రం తమదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెపుతోంది. పారిశ్రామికవేత్తలు తమకు అందే జీఎస్టీ లాభాలను ప్రజలకు అందజేయాలని రెండు రోజుల క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. గరగపర్రు దృశ్యం వీటన్నింటికీ విరుధ్ధంగా వుంది.
అభివృధ్ధి అశల్ని పెంచుతుంది. పెరుగుదల అత్యాశను రెచ్చగొడుతుంది. స్థితిమంతుల అత్యాశకు రాజకీయాధికారం కూడా తోడయితే అణగారినవర్గాల మీద అణిచివేత మరీ పెరిగిపోతుంది. కారంచేడు దురాగతం బకింగ్ హామ్ కెనాల్ ఒడ్డున,  చుండూరు హత్యలు  తుంగభద్రా  డ్రయిన్ పక్కన,  వేంపెంట దాడి కర్నూలు-కడప కెనాల్ దారిలో జరిగినట్టే, గరగపర్రు దారుణం ఎనమదుర్రు డ్రెయిన్ గట్టున  జరిగింది. గ్రామానికి, పడమర దిక్కు నుండి ఆకివీడు పండ కాలవ వెళుతుంది, తూర్పు దిక్కు నుండి ఎనమదుర్రు డ్రెయిన్ వెళుతుంది. గ్రామానికి  దక్షణ దిక్కులో గోస్తనీ నది, ఎర్ర్రకాలవవచ్చి ఎనమదుర్రు డ్రెయిన్ లో కలుస్తాయి. గ్రామం మధ్యలో రెండు చెరువులున్నాయి.  నేలను గోటితో గీకితే చాలు నీరు ఉబికివచ్చే గ్రామం.  నీటి వసతి పుష్కలంగా వుండడంతో వరిచేళ్ళు పులి రొయ్యల  చెరువులుగా మారి డాలర్ల వర్షం కురిపించాయి. అడ్దంగా వచ్చిన సంపాదన కుల అహంభావాన్నీ, రాజకీయ ప్రాబల్యాన్నీ పెంచుతుంది. అది అనేక దురాగతాలకు పుట్టినిల్లు అవుతుంది.
(రచయిత ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్)
30 జూన్ 2017

ప్రచురణ : సాక్షి ఎడిట్ పేజీ, 1 జులై 2017 (ఆంధ్రప్రదేశ్ ఎడిషన్) 

http://epaper.sakshi.com/1264989/Andhra-Pradesh/01-07-2017#page/6/2

No comments:

Post a Comment