Sunday 7 January 2018

‘మణి’ మరో ‘సత్యంబాబు’!

Igniting Communal Riots

సత్యం దాగదు


‘మణి’ మరో ‘సత్యంబాబు’!

అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)
        ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నగరం లాలాచెరువులోని నూరాని మసీదు మౌజన్ (పూజారికి సహాయకులు) షేక్ ఫారూఖ్ డిసెంబరు 29 తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. మసీదులో నిద్రపోతున్న మౌజన్ ని గుర్తు తెలియని దుండగులు కొందరు మేకులు గుచ్చిన లావుపాటి కర్రతో తలమీద కొట్టి  అతి క్రూరంగా చంపేశారు. వాళ్ళు అంతటితో ఆగలేదు; మసీదులో వున్న పవిత్ర ఖురాన్ ప్రతుల్ని తగలబెట్టారు; నమాజ్ చేసే కార్పెట్ల మీద మలమూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయారు. ఇది నలుగురైదుగురు సభ్యులుగల ఒక ముఠా చేసిన పని అని పరిశోధన మొదటి దశలోనే పోలీసులు  ప్రకటించారు. 
        ఆ మరునాడు డిసెంబరు 30 తెల్లవారు జామున తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్లాపూర్ పట్టణ జామియా మసీదులో గుర్తు తెలియని దుండగులు పవిత్ర ఖురాన్ ప్రతుల్ని తగలబెట్టి పారిపోయారు.  
        ఒక్క రోజు వ్యవధిలో రెండు రాష్ట్రాల్లో ఒకే విధంగా జరిగిన  ఈ రెండు సంఘటనల మధ్య సంబంధంలేదనుకోవడం అమాయకత్వం అవుతుంది. ఈ రెండు సంఘటనల్లో మరో పోలిక కూడా వుంది. ‘’ఉద్రేక స్వభావులు’’ ‘’మత విషయాల్లో రెచ్చిపోతారు” అనే నిందలున్న ముస్లిం సమాజం అటు రాజమండ్రిలోనూ, ఇటు మల్లాపూర్ లోనూ గొప్ప సంయమనాన్ని పాటించింది. రాజమండ్రిలోనేగాక, కాకినాడ, భీమవరం, గుంటూరు తదితర పట్టణాల్లో ముస్లింలు శాంతియాత్రలు జరిపారు. ఇది ఆ సమాజంలో  పెరుగుతున్న కొత్త చైతన్యానికి ప్రతీక కావచ్చు.
        సంఘటన వార్త బయటికి  తెలిసిన కొన్ని నిముషాల్లోనే అన్ని పట్టణాల్లోని ముస్లిం ప్రముఖులకు సందేశాలు వచ్చాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఆవేశానికి లోనుకారాదనేది వాటి ఉపదేశం. ఆవేశానికి గురయితే మతకల్లోలాలు చెలరేగి నష్టపోయేది ముస్లిం సమాజమేననేది వాటి సారాంశం. శత్రువు కోరుకుంటున్నదాన్ని మనమే చేసిపెట్టడం అవివేకం అనేది వాటి పాఠం.  వీలయితే పరిసరాల్లోని హిందువుల ఇళ్ళకు వెళ్ళి పండ్లు, పూలు పంచి శాంతి సందేశాన్ని ప్రచారం చేయాలనేది వాటి మార్గనిర్దేశనం.
        ఖురాన్ ప్రతుల దహనానికి సూత్రధారులు గోగ్రవాదులని ఊహించడం కష్టం ఏమీకాదు. పాత్రధారుల్ని వెతికి పట్టుకోవడం ఒక్కటే పోలీసులు చెయ్యాల్సిన పని. "రాజమండ్రి ఒక్కటేకాదు కోస్తాంధ్రా ప్రాంతంలోనే మత సామరస్యం ఎక్కువ. ఈ ప్రాంతంలో దర్గాల దగ్గర ముస్లింలు హిందువులు సమానంగా కనపడతారు. ఇక్కడ మతకల్లోలాలను  రెచ్చగొట్టి  రాజకీయ లబ్దిపొందాలనివాళ్ళు’ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదృష్టావశాత్తు గొడవలు జరగలేదుఅని నిట్టూర్చారు ఈ కేసును పరిశోధిస్తున్న వున్నతాధికారి ఒకరు.  అయితే తన పేరు, పదవి వివరాలను బయట పెట్టొద్దని వారు ఒక షరతు పెట్టారు. సంఘటన జరిగిన తరువాత కూడా వీధి గుండా వెళ్ళే హిందువుల్లో కొందరు మసీదుకు దండం పెట్టుకుని వెళుతున్నారని ఆ అధికారి గుర్తు చేశారు.  వారు చెప్పింది నిజమే. హిందూ పండుగల్లో ముస్లింలు, ముస్లింల పండుగల్లో హిందువులు భాగం పంచుకునే సాంప్రదాయం గోదావరి మండలంలో వుంది. వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి సందర్భంగా తొమ్మిది రోజులు జరిపే ఉత్సవాల్లో ఒకరోజు కార్యక్రమాలకు ముస్లిం వ్యాపారులు దాతలుగా వుండేవారు. రామాలయంలో నిర్వహించే భోగం మేళాన్ని ముస్లిం మహిళలు చూడ్డానికి వీలుగా ఓ రెండు మూడు గంటలు  పర్దాలు కట్టి ప్రదర్శించే సాంప్రదాయం కూడా అర్ధ శతాబ్దం క్రితం కొన్ని పట్టణల్లో వుండేది. ఈప్రాంతపు అనేక దర్గాలకు హిందువులు ధర్మకర్తలుగా వున్నారు.
        ఖురాన్ ప్రతుల్ని తగలబెట్టడం అనేది తీరాంధ్రలోనేకాదు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి సంఘటన. దీని పరిణామాలు మతకల్లోలానికి  దారితీస్తాయని ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోనికి దిగారు. మత ఉద్రిక్తల్ని నివారించడానికి రెండు కథనాలను ప్రచారంలో పెట్టారు. మసీదు స్థలం వివాదాల్లో వుందనీ, ఆ తగవుల్లో భాగంగా మౌజన్ ను హత్య చేసివుంటారనేది మొదటి కథనం.  మౌజన్ స్వరాష్ట్డం బీహార్ గనుక అక్కడి ముఠా తగవుల్లో భాగంగా అతని హత్య జరిగి వుంటుందనేది రెండో కథనం.
        ప్రభుత్వం కష్టపడి ప్రచారంలో పెట్టిన ఈ రెండు కథనాలు తప్పు అని  తేల్చడానికి పెద్ద నేరపరిశోధన అవసరంలేదు. మసీదు స్థలం వివాదంలో వుంటే దుండగులు ముతవల్లి(ధర్మకర్త) మీద దాడి చేస్తారుగానీ మసీదులో ఓ చిన్న జీతగాన్ని ఎందుకు హత్య చేస్తారూ? ఒక వేళ అదే నిజమని భావిస్తే పోలీసులు ఆ కక్షిదారుల్ని వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదు? అనే ప్రశ్న ఎదురవుతుంది. ఒకవేళ బీహార్ ముఠా తగవులే కారణం అనుకుంటే వెంటనే  ఆ దిశగా పరిశోధన ఎందుకు ఆరంభించలేదనే  ప్రశ్న ఎదురవుతుంది.
        ఇప్పుడు పోలీసులు మూడో కథనాన్ని ముందుకు తీసుకు వచ్చారు. రాజమండ్రి మౌజన్ ను హత్యచేసింది  అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు మణి అనేది దీని సారాంశం. రాజమండ్రి వచ్చిన మణి  దొంగతనం కోసం దుడ్డుకర్రతో మసీదులోనికి ప్రవేశించాడనేది పోలీసుల కథనం. సామాన్యులు నమ్మేయవచ్చుగానీ మసీదులతో పరిచయం వున్నవాళ్ళెవరూ  ఇలాంటి కథల్ని నమ్మరు. ఒంటి మీద వీసమెత్తు బంగారంవున్నా మసీదుల్లోనికి ప్రవేశం నిషేధం అని అందరికీ తెలుసు. అలాంటిది మసీదులో బంగారం, నగదు వుంటాయని ఒక కరడుగట్టిన సీనియర్ నేరస్థుడు ఎలా అనుకుంటాడూ? ఏ మసీదులో అయినా విలువైన సామానులు ఏముంటాయీ? వంటి ప్రశ్నలకు సమంజసమైన సమాధానం లేదు. ఈ సంఘటనలో  హంతకుడి లక్ష్యం ధనం కాదని హత్యా స్థలాన్ని చూసిన వారెవరికయినా సులువుగానే తెలుస్తోంది. ఖురాన్ ను తగలబెట్టి మసీదును మలమూత్రాలతో అపవిత్రం చేయడానికే హంతకులు అక్కడికి వచ్చారు. అలాంటి పనుల్ని సాధారణ దొంగలు చేయరు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మతకల్లోలాలను సృష్టించడమే దుండగుల లక్ష్యం.
        పోలీసులకు క్షుణ్ణంగా తెలిసినా బయటికి చెప్పలేని నాలుగో కథనం మరొకటుంది. ఈ కథనానికి పునాది 2011లో వుంది.  యన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా ఆ ఏడాది మే 28న తెలుగుదేశం మహానాడులో  చంద్రబాబు ప్రసంగిస్తూ తనంతట తానుగా ఆత్మప్రక్షాళన చేసుకున్నారు.  గతంలో, బీజేపి నాయకత్వంలోని ఎన్డీఏలో తమ పార్టి చేరడం చారిత్రక తప్పిదమనీ, దానివల్ల ముస్లిం సమాజం టిడీపికి దూరం అయిపోయిందని ఆవేదన చెందారు. ముస్లిం సమాజానికి స్వఛ్ఛందంగా క్షమాపణలు చెప్పారు. మతతత్వ శక్తులతో ఇంకెన్నడూ చేతులు కలపనని ఒట్టు వేశారు.
        2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోది గెలుపు గుర్రంగా కనిపించడంతో ముస్లిం సమాజానికి ఇచ్చిన ఒట్టును తీసి గట్టు మీద పెట్టి బీజేపికి మిత్రపక్షంగా మారిపోయారు చంద్రబాబు. నరేంద్ర మోదీతో హానీ మూన్ గడిపితే రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు  భారీగా వస్తాయని అశించారు. మూడున్నరేళ్ళ లొంగుబాటు పర్వంలో నిధులూ రాలేదు, ప్రాజెక్టులూ రాలేదని అర్ధం అయింది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు విషయంలో  కేంద్రం ఇచ్చిన షాక్ కు టిడిపి నెత్తికి బొప్పికట్టింది. ఈలోగా గుజరాత్ ఎన్నికల్లో బీజేపి ఓడిపోబోతున్నదని చంద్రబాబుకు సంకేతాలందాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి ఇదే అదను అనుకున్నారు. బీజేపి మీద యుధ్ధానికి పచ్చజెండా కూడా ఊపేశారు. ఈ నేపథ్యంలోనే ఎలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ “టిడిపి ఐస్ అయితే బీజేపీ పుల్ల" అంటూ చెలరేగిపోయారు. "పుల్ల లేకపోతే ఐస్ లేదంటూ" బిజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా యుధ్ధానికి సై అన్నారు.
      అయితే, గుజరాత్ లో బీజేపి గట్టెక్కడంతో టిడిపి రెండడుగులు వెనక్కి తగ్గింది.  టిడిపి ఇక ఎంతమాత్రం నమ్మదగ్గ మిత్రుపక్షం కాదని బీజేపీ కూడా తెలిసిపోయింది. 2019 ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగక తప్పదని దానికి అర్ధం అయింది. ఎన్నికల్లో తీవ్ర సవాలును ఎదుర్కోవాల్సి వస్తే బీజేపి మతతత్త్వాన్నీ,  ఉన్మాదభరితమైన జాతీయవాదాన్నీ ఆశ్రయిస్తుందని గుజరాత్ఎన్నికలు తాజాగా స్పష్టం చేశాయి. కమలనాధులకు తెలిసిన పోల్ మేనేజ్ మెంట్ ఒకటే మతచిచ్చు పెట్టి హిందూత్వ భావాలని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును  పదిలం చేసుకోవడం. ఆ నేపథ్యంలోనే రాజమండ్రిలో ఖురాన్ దహనం, మసీదును అపవిత్రం చేయడం జరిగిపోయాయి. 
         రాష్ట్ర ప్రజలు 2007 నాటి ఆయేషా మీరా కేసును ఇంకా మరచిపోలేదు. ఆ కేసులో ప్రభుత్వ పెద్దల పరువును కాపాడడానికి పోలీసులు ఎన్ని కుట్రలు చేశారో ప్రజలకు తెలుసు. వాళ్ళు కుట్రపూరిత పధ్ధతుల్లో నిందితునిగా చిత్రించిన  సత్యంబాబుని గత ఏడాది హైకోర్టు నిర్దోషిగా పేర్కొని విడుదల చేయడమూ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ పోలీసులే గుంతకల్లుకు చెందిన మణిని మరో ‘సత్యంబాబు’ని చేసే పనిలో పడ్డారు. అబధ్ధం ఎక్కువ కాలం చెలామణి కాదు; సత్యం దాగదు.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ అధ్యక్షుడు)
సెల్ నెం. 9010757776
హైదరాబాద్
2 జనవరి 2018
ప్రచురణ : మన తెలంగాణ 6 janavari 2018

http://epaper.manatelangana.news/1495175/Mana-Telangana-Daily/07-01-2018#page/4/2

ప్రచురణ : ప్రజాశక్తి ఎడిట్ పేజీ  19 Janavari 2018 
http://www.prajasakti.com/Article/Prajagalam/2001870

No comments:

Post a Comment