Friday 31 May 2019

Amaravathi and Polavaram alone are not development


Amaravathi and Polavaram alone are not development

అభివృధ్ధి అర్ధాలు వేరు బాబూ!

డానీ

సాంప్రదాయ ఎన్నికల్లో  పార్టీలు సిధ్ధాంతాల ఆధారంగానూ అభ్యర్ధులు వ్యక్తిత్వాల ఆధారంగానూ పోటీ పడేవారు. సమాచార విప్లవ కాలంలో పార్టీల సిధ్ధాంతాలు, అభ్యర్ధుల వ్యక్తిత్వాలు అంత ముఖ్యంకాదు. తమ గురించి ప్రపంచం ఏమని అనుకోవాలని పార్టీలు భావిస్తున్నాయనేది ముఖ్యం. దాన్ని సాధించడానికి అభ్యర్థులు ప్రచారాన్ని ఎంత సమర్ధంగా సాగించగలరు?  ఎంత ధనాన్ని ఫణంగా పెట్టగలరు? అనేవి చాలా ముఖ్యం. అయితే, పార్టి ఆధారిత పార్లమెంటరి ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియే అస్తవ్యస్తంగా మారిన తరుణంలోనూ కొన్ని ఫలితాలు  ఎలక్టోరల్ జస్టిఫికేషన్ అనిపిస్తాయి.

కొందరికి కొన్ని విశేషణాలను మీడియావాళ్ళు తమ అవసరంగానో అనవసరంగానో కట్టబెడుతుంటారు. అలా నరేంద్ర మోదీ, చంద్రబాబులను అభివృధ్దికి ప్రతీకగా మీడియా తరచూ పేర్కొంటూ వుంటుంది. నిజానికి వారు కొందరి పెరుగుదలకు మాత్రమే  ప్రతీకలు. చంద్రబాబు మార్కుపెరుగుదలఆర్థిక విధానాలను ప్రజలు ప్రతిసారీ తిప్పికొడుతూనే వున్నారు. ప్రజలెప్పుడూ సమాన ఆర్ధికాభివృధ్ధిని కోరుకుంటారు.

సిబిఐ మాజీ డైరెక్టర్ కే విజయరామా రావు 1999 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికై చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన పట్టణాభివృధ్ధి శాఖను చేపట్టారు. ఆయన కాలంలోనే హైదరాబాద్ లో హైటెక్ సిటి నిర్మాణం పేరిట చంద్రబాబు మార్కుసంపద పెరుగుదలపథకం పెద్ద ఎత్తున సాగింది. ఇది ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. 2004 ఎన్నికల్లో విజయరామారావును ఇంటికి పంపించడమే గాక, గ్రేటర్ హైదరాబాద్ లోని 16 నియోజకవర్గాల్లో 13 చోట్ల టిడిపిని చిత్తుగా ఓడించారు. మళ్ళీ 2016 జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ఆధునిక హైదరాబాద్ ను నిర్మించింది తానే అని చంద్రబాబు చెప్పుకుంటే 150 డివిజన్లలో ఒకే ఒక్క చోట టిడిపి గట్టెక్కింది. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లోనూ చంద్రబాబు మళ్ళీ అభివృధ్ధి మంత్రం పఠిస్తే 119 నియోజకవర్గాల్లో టిడిపికి రెండు స్థానాలే దక్కాయి. వారు ’నిర్మించిన హైదరాబాద్ లో వారికి ఒక్క స్థానమూ దక్కలేదు.

తాను అభివృధ్ధి ప్రవక్త అని గొప్పలు చెప్పుకున్నప్పుడెల్లా ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠమే నేర్పుతూ వచ్చారు. అయినా వారు తన విధానాలను మార్చుకోలేదు.

అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల్ని చూపి సంపద పెంచినట్టు భారీ ప్రచారం చేసుకుంటే  సులువుగా గెలవవచ్చని వారు ఆశ పడ్డారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరి సంపద పెరిగింది? అని అభద్రలోకం తప్పకుండా అడుగుతుంది. అమరావతి, పోలవరంల వల్ల రాష్ట్రంలో ప్రాబల్యంగల రెండు మూడు సామాజికవర్గాల సంపద మాత్రమే పెరుగుతుందని తెలియనంత అమాయకులు కాదు ప్రజలు. సామాన్యుల సంపద ఎక్కడ పెరిగింది? అని వాళ్ళు తప్పనిసరిగా అడుగుతారు. అమరావతి మంత్రి నారాయణనే కాక నెల్లూరు జిల్లాలో టిడిపి అభ్యర్ధులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కర్నీ ప్రజలు ఓడించారు. దీనినే ఎలక్టోరల్ జస్టిఫికేషన్ అంటారు.

అమరావతి, పోలవరం (పట్టిసీమ) వల్ల భారీగా సంపద పెరిగిన ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన కొన్ని గ్రామాల్లో అధికార పార్టీకి కొన్ని ఓట్లు పడివుండవచ్చుగానీ  రెండు జిల్లాల్లో కూడా అధికార పార్టి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపికి దక్కింది నాలుగే స్థానాలు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను తన ఘనతగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. కానీ, ప్రజలు పోలవరం మంత్రి దేవినేని ఉమాను మైలవరంలో మట్టి కరిపించారు. ఇది మరో మరో ఎలక్టోరల్ జస్టిఫికేషన్.

తాను సమాచార విప్లవ సారధినని చంద్రబాబు చాలాసార్లు చెప్పుకునేవారు. అయితే, హైదరాబాద్ లో వారి ప్రచారానికి అప్పట్లో కాలం కలిసివచ్చినట్టు విజయవాడలో కలిసిరాలేదు. చేనేత కేంద్రమయిన మంగళగిరిని ఆంధ్రప్రదేశ్ సిలికాన్ వ్యాలీగా మార్చినట్టు టిడిపి గొప్పగా ప్రచారం చేసుకుంది. నమ్మకంతోనే ముఖ్యమంత్రి తనయుడు, ఐటి మంత్రి అయిన నారా లోకేష్ ను అట్టహాసంగా మంగళగిరి బరిలో దించారు.  ప్రజలు లోకేష్ నూ ఓడించి  మరో ఎలక్టోరల్ జస్టిఫికేషన్ సాగించారు. జగన్ కు వాళ్ళ నాన్న పెద్ద ప్లస్ పాయింట్ అయితే, చంద్రబాబుకు వాళ్ళబ్బాయి పెద్ద మైనస్ పాయింట్.

దీని అర్ధం ఏమంటే, రాష్ట్రాభివృధ్ధి అంటే  పోలవరం, అమరావతి, ఐటీ ప్రాజెక్టులే కాదని ప్రజలు గట్టిగా చెప్పారు. సామాన్యుల సంపదను కూడ పెంచడానికి అదే స్థాయిలో కొన్ని ప్రత్యేక పథకాలను చేపట్టని ప్రభుత్వాలను ప్రజలు మూటకట్టి చెత్త కుండీలో పడేస్తారు.

దెందులూరులో చింతమనేని ప్రభాకర్, విజయవాడ సెంట్రల్ లో  బోండా ఉమామహేశ్వరరావు సాగించిన అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. రాష్ట్రమంతటా గనుల మాఫియా, ఇసక మాఫియా చెలరేగిపోయింది. ఇందులో మహిళల వస్త్రాపహరణాలు, అత్యాచారాలు, హత్యాచారాలు అన్నీ వున్నాయి. టిడిపి అధినేత  వాళ్ళను అదుపు చేయకపోగా ప్రతిసారీ అడ్డంగా వెనకేసుకుని వచ్చారు. అరకు లోయలో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మైనింగ్ కార్పొరేట్లకు బ్రోకర్ అవతారం ఎత్తి ఆదివాసుల పాలిటరాక్షసుడుగా మారాడు. అతని ఆగడాలను భరించలేక  గత ఏడాది ఆదివాసులే అతన్ని అంతం చేశారు. ఆయన కొడుకు కిడారి శ్రావణ్కుమార్ను రాష్ట్ర మంత్రిని చేయడంతో ఆదివాసులు రగిలిపోయారు. సమయం వచ్చినపుడు శ్రావణ్కుమార్ను ఓడించడమే కాదు డిపాజిట్టు కూడా దక్కకుండా చేశారు.

వంగవీటి రంగా హత్య జరిగినపుడు కోడెల శివప్రసాద్ హోం మంత్రిగా వున్నారు. కొత్త రాష్ట్ర శాసన సభకు తొలి స్పీకర్ గా ఎన్నికయినప్పటికీ వారు 1988ల నాటి హోంమంత్రిగానే వ్యవహరించారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను సంతలో గొడ్లలా అధికారపార్టి కొనేసినా వారు కళ్ళు మూసుకున్నారు. ప్రతిపక్షం సభకు రాలేని పరిస్థితిని కల్పించారు. సభా గౌరవాన్ని పాతాళానికి తొక్కేశారు. సత్తెనపల్లి ప్రజలు వారికి రాజకీయాల నుండి అవమానకరపు వీడ్కోలు పలికారు. విచిత్రం ఏమంటే, 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను సంతలో గొడ్లలా రేటుకట్టి కొన్న టిడిపికి మే 23 నాటి  ఎన్నికల ఫలితాల్లో దక్కింది 23 ఎమ్మెల్యేలే! దీన్ని ఒక మేజికల్ జస్టిఫికేషన్ అనుకోవచ్చు!.  

          సాధారణంగా  శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాలు, లోక్ సభ ఎన్నికల్లో జాతీయ అంశాలు ప్రధాన ఎజెండాగా వుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో జమిలి ఎన్నికలు జరగడంతో రెండు ప్రభావాలనూ గమనించాలి. దేశమంతటా ప్రభంజనాన్ని సృష్టించిన బిజేపికిగానీ, జాతీయంగా రెండవ అతిపెద్ద పార్టీగా వుంటున్న కాంగ్రెస్ కు గానీ ఏపీలో అటు లోక్ సభలోనూ, ఇటు అసెంబ్లీలోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు.
 
కార్పొరేట్లకు ప్రభుత్వాధినేతలు మొఖమాటంతో కొన్ని పనులు చేసిపెట్టాల్సి వుంటుందనేది నిజమేగానీ, నిత్యం కార్పొరేట్ల సేవలోనే తరించే ప్రభుత్వాధినేతల్ని ప్రజలు గట్టిగానే బుధ్ధి చెపుతారన్నది కూడ అంతకన్నా నిజం. తమ రాజకీయ ఆబ్లిగేషన్లను పాటిస్తూనే ప్రజల కోసం తపన పడే ప్రభుత్వాధినేతలు సహితం కొందరు వున్నారు. యన్ టి రామారావు, వైయస్ రాజశేఖరరెడ్డి  కోవలోనికి వస్తారు. ప్రజలు కూడా వాళ్ళనే తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. అసలు విషయం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి చంద్రబాబును ఎన్టీఆర్ కు రాజకీయ వారసునిగా చూడడానికి ఇష్టపడలేదు. మరోవైపు, జగన్ ను వైయస్సార్ కు రాజకీయ వారసునిగా గుర్తించి పట్టంకట్టారు. ఇది అసలైన ఎలక్టోరల్ జస్టిఫికేషన్!

చంద్రబాబు ప్రతి అంశం మీదా మాట మార్చి విశ్వసనీయతను కోల్పోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. జగన్ ఒకే విధానానికి కట్టుబడి, నిరంతరం జనంలో వుండి వాళ్ళ ఆదరణను పొందారు.

కొత్తతరం, కొత్త చూపు, కొత్త ఆశలు, కొత్త సాకారం !

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

మొబైల్ : 9010757776

రచన : హైదరాబాద్, 26 మే 2019
ప్రచురణ: సాక్షి దినపత్రిక, 1 జూన్ 2019

No comments:

Post a Comment