Tuesday 14 May 2019

ప్రచారంవల్ల ఎవరూ గొప్ప కవులుకారు!


Mere propaganda will never produce a great poet.
ప్రచారంవల్ల ఎవరూ గొప్ప కవులుకారు!
ఉషా యస్ డానీ
కులవర్గ సమాజంలో చారిత్రక దశల్లో అయినా అందరికీ ప్రాతినిధ్యం వహించే కవులు వుండరు. అందరూ మెచ్చుకునే ఆలోచనాపరులు కూడ వుండరు. ఎవరి కవులు వారికి, ఎవరి ఆలోచనాపరులు వారికి వుంటారు. రాష్ట్రంలోని ప్రతి సామాజికవర్గానికీ సాహిత్యంలో ప్రాతినిధ్యం వహించిన కవులు అనే అర్ధంలో గురజాడ, శ్రీశ్రీ,లను మహాకవులు అనడం ఒక అతివ్యాప్తి దోషం. వాళ్ళను ప్రముఖ తెలుగు కవులు అని గౌరవించుకుంటే సరిపోతుంది. 
గురజాడ కార్మికుల గురించి రాయలేదు. విజయనగం సంస్థానంలో లక్ష్మీపురం వద్ద చెరకు ఫ్యాక్టరీ వచ్చినప్పటికీ కార్మికుల్ని గుర్తించలేదు. ఆయన మన్యంలో పుట్టి పెరిగాడు. 1879లోనే మన్యం పితూరి మొదలయ్యింది. మద్రాసు నుండి బ్రిటీష్ అశ్వికదళం, హైదబాద్ నుండి నిజాం సైన్యం వచ్చి పితూరిని అణుచివేసింది. తిరుగుబాటుదార్లను అండమాన్ జైలుకు పంపించారు. ఇంత జరిగినా కన్యాశుల్కం నాటకంలో ఆదివాసుల ప్రస్తావన చేయలేదు. సామాజికంగా పరిమితులున్నప్పటికీ తెలుగు భాషకు కన్యాశుల్కం గొప్ప మేలు చేసింది. సాంఘీక అనాచారాల్ని సాహిత్యం పట్టించుకోవాలనే ఒక సాంప్రదాయాన్ని ముందుకు తెచ్చింది.  తెలుగు భాషకు ఒక సౌలభ్యాన్నీ, వేగాన్నీ అందించింది.
సాహిత్యంలో గురజాడను అధిగమించి శ్రీశ్రీ కార్మికుల గురించి రాశాడు. 1940-1960 మధ్య కాలంలో శ్రామికవర్గానికి గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చాడు. 1970 దశకంలో కమ్యూనిస్టు విప్లవకారులకు సాహిత్య బాసటగా నిలిచాడు. వాళ్ల పౌరహక్కుల కోసం పోరాడాడు. అయితే శ్రామికుల పరిథికి  మించి ఆయన రాయలేదు. అలాగే, కొన్ని సమూహాల మీద శ్రీశ్రీకి తేలికభావం కూడా వుండేది. “కసాయి ప్లస్ సాయిబు ఈజీక్వల్ టు కసాయిబువంటి పిచ్చి పద ప్రయోగాలని కూడ ఆయన చేసివున్నాడు.
1970 తరువాత తెలుగు కవిత్వంలో శివసాగర్ శకం మొదలైంది. . “నర్రెంగ సెట్టుకింద నరుడో భాస్కరుడా!” పాటతో శ్రీశ్రీని శివసాగర్ రీప్లేస్ చేశాడు. విషయం శ్రీశ్రీకి కూడా తెలుసు. తెలుసుగాబట్టే విరసం ఆవిర్భావ సభల్లోనర్రెంగ సెటుకింద నరుడో భాస్కరుడ!” పాటని నెత్తిన పెట్టుకుని అనేకసార్లు పాడాడు. శ్రీశ్రీ చనిపోయే వరకు పుష్కర కాలానికి పైగా వాళ్ళిద్దరు ఒకే సంస్థలో కొనసాగారు. 1983లో శ్రీశ్రీ చనిపోయినపుడు నల్గొండలోని ఒక రహాస్య డెన్ లో జరిగిన సంస్మరణ సభలో శివసాగర్ తన ముందుతరం కవి మీద అభిమానంతో 8 గంటలు విరామం లేకుండా  గొప్ప భావోద్వేగంతో ప్రసంగించాడు. టెక్ జాగ్రత్తలవల్ల కుదరలేదుగానీ సభ బహిరంగంగా జరిగుంటే అదొక గిన్నీస్ రికార్డు నివాళిగా నమోదై వుండేదే!
కారంచేడు ఉద్యమం తరువాత, తెలుగునాట దళితవాదం బలపడుతున్న దశలోనూ 1988లో శివసాగర్శ్రీశ్రీనే కవిత రాశాడు. “కాలానికి ఒక కవి కావాలి / ఒక కవిత కావాలి/ అందుకనే/ కాలం కడుపుతో వుండి శ్రీశ్రీని కన్నది /  …… “శ్రీశ్రీ చనిపోయాడని అనకండి! / ఒక మహాకవి అమరత్వం అతనిది/ అని రాసేడు. లెనిన్ చనిపోయినపుడు 1924లో రష్యన్ కవి  యమకోవిస్కీ రాసిన కవితా పంక్తుల్ని (అప్పుడు కాలం కడుపుతో వుంది / కార్ల్ మార్క్స్ ను కనింది)  తలపిస్తాయి కవితలో శివసాగర్ భావోద్వేగాలు.
గురజాడకు తాను సాహిత్య వారసుడినని శ్రీశ్రీ యే చెప్పుకున్నాడు. తొలిదశలో శ్రీశ్రీ మీద విశ్వనాధ, దేవులపల్లిల ప్రభావం కూడా వుంది.  శ్రీశ్రీ నిర్మించిన సాహిత్య వేదిక మీద ఇంకో మెట్టు పైకెక్కి శివసాగర్ విప్లవ భావకవిత్వాన్ని సృష్టించాడు. గురజాడపుత్తడిబొమ్మ పూర్ణమ్మశివసాగర్చెల్లి చెంద్రమ్మకు లీడ్ గా పనికి వచ్చిందంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు.   గురజాడ నుండేకాదు ఆత్రేయ వంటి సినీ కవుల నుండి కూడా శివసాగర్ లీడ్ తీసుకున్న సందర్భాలున్నాయి. ఒక తరం నుండి మరోతరం ప్రేరణ పొందడం చాలా సహజం. ఇదొక సాహిత్య వంశావళి క్రమం. 
ఎంతటి ఆలోచనాపరులైన సర్వజ్ఞులు కారుకనుక వాళ్లకు తెలియని విషయాలు కూడా అనేకం వుంటాయి. తెలిసిన విషయాల మీద మాత్రమే వాళ్లు రాయగలరుగానీ తెలియని విషయాల మీద రాయలేరు. తెలిసిన విషయాల్లోనూ వాళ్లకు ఆసక్తి వున్న విషయాల మీద రాస్తారు. మిగిలిన వాటిని వదిలేస్తారు.
రచయితలకు తెలియని అంశాలు, తెలిసి విస్మరించిన అంశాలు,  వివక్ష చూపిన అంశాలు తక్షణం  కాకపోయినా తరువాతి కాలంలో అయినా చర్చకు వస్తాయి.  తెలియని అంశాలను, విస్మరించిన అంశాలను తరువాతి తరాలు గుర్తుచేస్తాయి. వివక్ష చూపిన అంశాలను వివక్షితులు విమర్శించి తీరుతారు.  అది ఒక అవసరమైన సామాజిక విమర్శ కూడ.  సాహిత్యవిమర్శ ప్రాధమికంగా రచయితలు రాసిన దానినే తీసుకుంటుంది. మేరకు వాళ్లను గౌరవిస్తుంది.  రచయితల్ని సాహిత్య విలువల పరంగా ఏమేరకు అభిమానించాలీ, సామాజిక దృక్పథాల పరంగా ఏమేరకు విమర్శించాలీ, వ్యక్తిగత చేష్టల మూలంగా ఏమేరకు తిరస్కరించాలీ అనేవి భావితరాల అవసరాలు దృక్పథాలు విచక్షణల మీద  నిర్ణయం అవుతుంది.
తమ స్వీయ సామాజికవర్గాల వర్తమాన అవసరాలు, అభిలాషలకు భిన్నమైన రచనలు చేసిన వారినందరినీ అసలు రచయితలుగానే  గుర్తించబోము అనే సమూహం సమాజపు ప్రతి దశలోనూ వుంటుంది. అలాంటివాళ్ల అభిలాషల్ని నెరవేర్చాలంటే ప్లేటో, అరిస్టాటిల్ దగ్గర నుండి ఇవ్వాల్టీ వరకు మొత్తం రచయితల్నీ, మొత్తం సాహిత్యాన్నే నిషేధించాల్సి వుంటుంది. ఇలాంటి అతివాదపు పనులు సాంస్కృతిక విప్లవం సందర్భంగా చైనాలో అనేకం జరిగాయి. రాచరిక, ఫ్యూడల్, పెట్టుబడిదారీ దశల్లో రాసిన పుస్తకాలన్నింటినీవిషపూరిత కలుపు మొక్కలుఅంటూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం నిషేధించింది. షేక్స్ పియర్ రచనలతోపాటూ  అతని సమకాలీనుడైన చైనా రచయిత తాంగ్ గ్జియాంజు రచనలు కూడా నిషేధిత జాబితాలో వున్నాయి. తరువాత చైనా సాహిత్యం డోల్ల బోయిందని పదేళ్లకుగానీ అర్ధం కాలేదు. అప్పుడు లెంపలేసుకుని నిషేధాన్ని ఎత్తివేసి, మొత్తం పాత పుస్తకాలన్నింటినీ ఇంగ్లీషులో  అచ్చువేయడమేగాక, చైనా భాషలో అనువాదాలు చేసి  మరీ పంపిణీ చేశారు.
లెజండ్స్ వాళ్ల కాలానికి మాత్రమే అధిపతులు. తరువాతి కాలానికి వాళ్ళు లీడ్ ఇవ్వగలరు గానీ లీడ్ చేయలేరు. చారిత్రక, సామాజిక, వ్యక్తిగత పరిమితులు అందరి మీదా వుంటాయి.  పరిమితుల మధ్యనే కొందరు సమాజం మీద గొప్ప సానుకూల ప్రభావాలను వేస్తారు. వాళ్ళనే  తరువాతి తరాలు గుర్తు చేసుకుంటారు. గురజాడ, శ్రీశ్రీ, శివసాగర్ తదితరులు కోవలోనికి వస్తారు.
మనది కుల వ్యవస్థ.  ప్రతి కులం తన వాళ్ళను గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ముస్లింలు, క్రైస్తవులు భిన్న మతస్తులుగా పైకి కనిపిస్తున్నప్పటికీ భారత కులమానం ప్రకారం వాళ్ళూ కొన్ని కులాలే.  అయితే, కేవలం ప్రచారంవల్ల ఎవరూ గొప్ప కవులు కారు. గొప్ప కవులకు ప్రచారం కూడ లభిస్తే వాళ్ళ రచనలు ఎక్కువ మందికి చేరే అవకాశాలుంటాయి. అదొక సౌకర్యం మాత్రమే. శ్రీశ్రీ, గురజాడ బ్రాహ్మణులు కనుక సామాజిక వర్గం  విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళిద్దర్ని మహాకవుల్ని చేసుకున్నదని కొందరి ఆరోపణ. బ్రాహ్మణుల్లో కూడా పరస్పరం బొత్తిగా పడని రెండు శాఖలున్నాయి.  మరోవైపు, బ్రాహ్మణ, కమ్మ సామాజికవర్గాల మధ్య కొంతకాలం సాంస్కృతిక యుధ్ధమే నడిచింది. రాజకీయ రంగంలో దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే, సామాజిక చరిత్రలో ఒక విచిత్రంగా కమ్మ సామాజికవర్గం తమ కులానికి చెందిన  కవిరాజు  త్రిపురనేని రామస్వామి చౌదరిని సహితం పక్కన పెట్టి శ్రీశ్రీతో పాటూ  గురజాడ, వేమనను కూడ  భుజాన వేసుకుంది. క్రమం కమ్యూనిస్టు పార్టిల వేదికల మీద చాలా వేగంగా సాగింది. 1950-60లలో బుర్రకథ నాజర్ ను, 1970 తరువాతి కాలంలో శివసాగర్, గద్దర్, కలేకూరి ప్రసాద్ తదితరుల్ని ప్రోత్సహించింది కూడా కమ్యూనిస్టు వేదికలే. కనీసం వాళ్ళ రాజకీయ, సామాజిక జీవితాల్లోని మొదటి అర్థభాగం వరకు అయినా ఇది వాస్తవం.
ఈరోజు అంబేడ్కరిస్టు శిబిరంలోనూ, ముస్లింవాద శిబిరాల్లోనూ ముఖ్య ఆలోచనాపరులుగా వున్నవారు పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు వర్గపోరాటాల్లో శిక్షణ పొందినవారే.  1985 చివర్లో ఓసారి మాటల సందర్భంగా కొండపల్లి సీతారామయ్య “పీపుల్స్ వార్ పార్టి మాల గద్దర్ ను ప్రజాగాయకుడిని చేసింది; ముస్లిం డానీ చేత తత్వశాస్త్ర పాఠాలు చెప్పిస్తోంది. ఇది మన సోషల్ కాంట్రిబ్యూషన్ కాదా?” అన్నార్ట. ఆ సందర్భంలోనే ఆయన  అల్లం రాజయ్య, బియస్ రాములు పేర్లను కుడా ప్రస్తావించారట.
ఇప్పుడు శిసాగర్ ను విప్లవకవి అంటే దళితులకు నచ్చడంలేదు. పోనీ  ఆయన్ని దళిత కవి అందామన్నా మరికొందరు అభ్యంతరం పెడుతున్నారు. అభ్యంతరాలు రెండు రకాలు. ఆయన్ను దళిత కవి స్థాయికి కుదించుతారా? అనేది ఒక అభ్యంతరం. “మాదిగల కోసం కవిత్వం రాయని మాల కవిని దళిత కవి స్థాయికి పెంచుతారా”? అనేది ఇంకో అభ్యంతరం. అనుమానం వున్నవాళ్ళు కృపాకర్ పొనుగోటిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
          సాహిత్య పరిణామ క్రమంలో భాగంగా రేపు ఒక మాదిగ మహాకవి కూడా అవిర్భవిస్తాడు. అప్పుడు అంతే సహజంగారెల్లి’ ‘మెహతర్వంటి సామాజిక వర్గాలు అతన్నిమాదిగ అగ్రకుల కవిఅని విమర్శించడమేగాక పుస్తకాలను నిషేధించాలని కోరుతుంది!. ఇదొక అంతులేని కథగా కొనసాగుతుంది.  
ఇప్పుడు రూపంలో కవుల మీద, వారి రచనల మీద చర్చలుగా కనిపిస్తున్నదంతా సారాంశంలో సమాజ విమర్శే.  కులవర్గ సమాజంలో కుల దోపిడిని అంతం చేయడానికి  మనకు కొన్ని సిధ్ధాంతాలు అందుబాటులోవున్నాయి. వర్గదోపిడిని అంతం చేయడానికి కూడా మరికొన్ని సిధ్ధాంతాలు అందుబాటులోవున్నాయి. విషాదం ఏమంటే కులదోపిడి సిధ్ధాంతాన్ని నమ్మేవాళ్ళు వర్గదోపిడి సిధ్ధాంతాన్ని ఒప్పుకోవడంలేదు. మరోవైపు,   వర్గదోపిడి సిధ్ధాంతాన్ని నమ్మేవాళ్ళు కులదోపిడి సిధ్ధాంతాన్ని ఒప్పుకోవడంలేదు. ఇద్దరూ ప్రత్యర్ధి శిబిరాలుగా మారి చెరో వైపు నుండి ఒకే తప్పును చేస్తున్నారు. రెండు శిబిరాలు తమ తప్పుల్ని సరిదిద్దుకొనంత వరకు సమాజంలో కులవర్గ దోపిడి సజావుగా కొనసాగుతూ వుంటుంది. కులవర్గ సమాజాన్ని మార్చాలని ఆశించేవాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏమంటే, రెండు శిబిరాల మధ్య వైషమ్యాన్ని తగ్గించి సామరస్యాన్ని పెంచే ప్రతిపాదనల్ని ముందుకు తేవాలి, ఇది ఒక చారిత్రక అవసరం.
మొబైల్ : 9010757776
రచన : హైదరాబాద్, 6 మే 2019
ప్రచురణ : 13 మే 2019, వివిధ పేజీ, ఆంధ్రజ్యోతి దినపత్రిక,

 

No comments:

Post a Comment