Saturday, 22 November 2025

Zohran Mamdani is a Unique Species

 Zohran Mamdani is a Unique Species

*జొహ్రాన్ మందానీప్రత్యేక జాతి జీవి*

 

ఈరోజు (23-11-2025) సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.

పత్రిక యాజమాన్యం, సంపాదకులు, ఎడిట్ పేజీ ఇన్ చార్జీలకు ధన్యవాదాలు.

ప్రచురణకర్తలు శీర్షికను మార్చారు.

వ్యాసాన్ని చదివి మీ కామెంట్స్పెట్టండి. నా ఆలోచనల్ని అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి.  

 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*



 

            ప్రతీ చర్యకు కూడ తత్సమానమైన, తద్వెతిరేకమయిన ప్రతిచర్య వుంటుందనేది భౌతిక శాస్త్రంలో న్యూటన్ కనుగొన్న చలన సూత్రం. అలాంటి ప్రతీ వ్యతిరేక చర్యకు కూడ తత్సమానమైన, తద్వెతిరేకమయిన ప్రతిచర్యలు వుంటాయన్నది సమాజ శాస్త్ర చలన సూత్రం.

 

            భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పెట్టుబడీదారీ వ్యవస్థ వచ్చినట్టే, ఆ పెట్టుబడీదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిస్టు వ్యవస్థ కూడ వస్తుందనీ అది ఆ తరువాత కమ్యూనిస్టు సమాజంగా మారుతుందని కార్ల్ మార్క్స్ ఓ సామాజిక చలన సూత్రాన్ని ఆవిష్కరించాడు. కుల వివక్ష సమాజానికి వ్యతిరేకంగా  కుల సమానత్వ సమాజం ఒకటి ఏర్పడుతుందని అంబేడ్కర్ ఊహాగానం చేసింది కూడ ఈ  సమాజ చలన సూత్రాన్ని అనుసరించే.

 

            2015 నాటి సంగతి.  ఆ ఏడాది అక్టోబరు 13 రాత్రి లండన్ సిటీ బస్సులో ఒక దారుణ సంఘటన జరిగింది. బస్సులో ఇద్దరు ముస్లిం మహిళలు హిజాబ్ తో ప్రయాణిస్తున్నారు. వారిలో హనానే యాకూబీ అనే ఆమె నిండు గర్భిణి. లండన్ బస్సులో ముస్లిం మహిళల్ని చూసి సిమోనే జోసెఫ్ అనే ఓ తెల్ల మహిళకు ఇస్లామో ఫోబియా ఆవహించింది.  పూనకంతో ఊగిపోతూ “ఇక్కడెందుకున్నావూ?  నీ దేశం పోయి బాంబులు చేసుకుంటూ బతుకు” అని తిడుతూ గర్భిణి కడుపు మీద తన్నింది. ఇస్లామో ఫోబియా ఆవహించిన వాళ్ళను కొన్ని దేశాల్లో పూల మాలలతో సత్కరించి ఊరేగిస్తున్నారు. అది లండన్ గాబట్టి అక్కడి కోర్టు సిమొనేకు కఠిన కారాగార శిక్ష విధించింది.

 

            ఈ సంఘటన జరిగిన ఐదారు నెలలకు లండన్ లో మేయర్ ఎన్నికలు జరిగాయి. తరువాతి కాలంలో బ్రిటన్ ప్రధానిగా  పనిచేసిన బోరిస్ జాన్సన్ అప్పటికి రెండుసార్లు గెలిచి లండన్ మేయర్ గా కొనసాగుతున్నాడు. కన్జర్వేటివ్ పార్టి దిగ్గజ నాయకునిగా కొనసాగుతున్న బోరిస్ జాన్సన్ ను, 2016 మే ఆరంభంలో, లేబర్ పార్టీకి చెందిన ఓ సామాన్యుడైన సాదిక్ ఖాన్ ఓడించి గ్రేటర్ లండన్ ఎగ్జిక్యూటివ్ మేయర్ గా ఎన్నికయ్యాడు. విచిత్రం ఏమంటే మేయర్ పదవి ప్రమాణ స్వీకారానికి అతను హిజబ్ వేసుకున్న మహిళలతో వేదిక మీదికి వచ్చాడు. 2020, 2024 ఎన్నికల్లో కూడా లండన్ ప్రజలు అతన్నే గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ప్రస్తుతం అతనే గ్రేటర్ లండన్ ఎగ్జిక్యూటివ్ మేయర్ గా కొనసాగుతున్నాడు.  సౌత్ లండన్ లో పుట్టిన  సాదిక్ ఖాన్  తల్లిదండ్రులు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ముస్లీంలు.  ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో సాదిక్ ఖాన్ కు సర్ బిరుదు ప్రదానం చేశారు.

 

            ఇస్లామో ఫొబియాతో రగిలిపోయే ఫ్రాన్స్ లో కూడ ఇలాంటి విచిత్రాలు కొన్ని జరిగాయి; జరుగుతున్నాయి. మొరాకో నుండి వలస వచ్చిన ముస్లిం కుటుంబంలో పుట్టిన కరీం బౌమరానే ప్రస్తుతం ప్యారీస్ నగర మేయర్. ఫ్రాన్స్ ప్రస్తుత సాంస్కృతిక శాఖ మంత్రి రషీదా దాటి కూడ ముస్లిమే. ప్రస్తుతం ఫ్రాన్స్ నగరాలు మరి కొన్నింటిలో కూడ ముస్లింలు మేయర్లుగా వున్నారు.

 

            న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్ గా ఎన్నికయిన జొహ్రాన్ మందానీ కథ కూడ దాదాపు ఇలాంటిదే. నగరంలో ముస్లిం జనాభా అంతగా లేదు.  అదొక మత అల్పసంఖాక సమూహం. ఇస్లామో ఫోబియాను చాలా విస్తృతంగా ప్రచారం చేసిన ప్రపంచ పెట్టుబడీదారుల రాజధాని నగరమైన  న్యూయార్కులో ఒక ముస్లిం మేయర్ గా ఎన్నికయ్యాడు!. ఇదొక రాజకీయ విచిత్రం. ఒక అద్భుతం కూడ. ప్రతీ వ్యతిరేక చర్యకు కూడ తత్సమానమైన, తద్వెతిరేకమయిన ప్రతిచర్య వుంటుందనే సమాజ చలన సూత్రం ఇక్కడ మరొక్కసారి పనిచేసింది. సమాజ మార్పు కోరేవారికి ఇది నిజంగానే ఉత్తేజాన్ని ఇచ్చే సంఘటన. అమెరికా సమాజంలో అది గుణాత్మక మార్పు ఏమీ కాదుగానీ, అదొక పరిమాణాత్మక మార్పు.

 

            జొహ్రాన్ మందానీ మావోయిస్టు, నక్సలైటు, కమ్యూనిస్టు, సోషలిస్టు ఏమీ కాడు. అది అందరికీ తెలుసు. అతను అమెరిక డెమోక్రాట్ పార్టిలో వామపక్షం. అది అతని పరిధి, పరిమితి. అయితే, అమెరికా గడ్డ మీద కమ్యూనిస్టులు, సోషలిస్టులకు కాలుమోపేందుకు చోటు లేదు అని సాక్షాత్తు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రాంప్ రంకెలేసిన చోట “అవును. నేను సోషలిస్టుని. అంతేకాదు; నేను ముస్లింని” అని బాహాటంగా ప్రకటించి గెలిచిన వాడిని అభినందించడం సంస్కారమా? కాదా?

 

            ఇస్లామో ఫోబియా ప్రబలిన దేశాల్లో ముస్లిమేతర ప్రజలు దాన్ని తిప్పికొడుతుంటే అది నిస్సందేహంగా భారత ముస్లింలకు ఒక ఓదార్పును ఇస్తుంది. ఇందులో తప్పుపట్టడానికి ఏముందీ?

 

            తాముతప్ప ఈ భూమ్మీద కమ్యూనిస్టులు ఎవరూ వుండరు;  వుండడానికి వీల్లేదు అనుకునే మహానగర మావోయిస్టు వీర అభిమానులు మనకు కొందరున్నారు. ఒక వైపు, వాళ్ళూ విమర్శించి, మరో వైపు పెట్టిబడీదారీవర్గమూ విమర్శిస్తున్నదంటే జొహ్రాన్ మందానీ నిజంగానే ఇప్పుడు చర్చనీయాంశం. ప్లటిపస్ (Platypus), ఆక్సోలొట్ల్ (Axolotl), కకాపొ (Kakapo)ల్లాగ అతనొక ప్రత్యేక జాతి జీవి (Unique Species). అలాంటి జీవుల్ని అధ్యయనం చేయడం ఇప్పుడు సమాజశాస్త్రంలో చాలా అవసరం.

 

రచన: 20 నవంబరు 2025

ప్రచురణ : సాక్షి దినపత్రిక, 23 నవంబరు 2025

అదొక రాజకీయ అద్భుతం

 

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=23/11/2025&pgid=748624&device=desktop&view=3

No comments:

Post a Comment