Saturday 27 July 2013

హైదరాబాద్‌ రాష్ట్ర విభజన, విలీనం, బూర్గుల

వర్తమానంలో గతం
హైదరాబాద్‌ రాష్ట్ర  విభజన, విలీనం, బూర్గుల
ఏ.యం. ఖాన్‌  యజ్దానీ ( డానీ)



భాషా, సంస్కృతులు, భావోద్వేగాల అధారంగా తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలు విలీనం అయ్యుంటే, అంధ్రప్రదేశ్‌ చరిత్ర మరోలా వుండేది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల్ని అప్పుడు విలీనం చేసిందీ, ఇప్పుడు విడగొట్టాలనుకుంటున్నదీ ఎన్నికల రాజకీయాలే అనంటే అతిశయోక్తికాదు. నిజాం మరాఠ్వాడ ప్రాంతానికి మహారాష్ట్రలో ఇబ్బందిలేదు. నిజాం కన్నడ ప్రాంతానికి కర్ణాటకలో ఇబ్బందిలేదు. కానీ, నిజాం తెలంగాణా ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ లో విలీనమైన క్షణం నుండీ వివాదం కొనసాగుతూనేవుంది. దానికి తప్పు పట్టాల్సింది ప్రజల్నికాదు; భావోద్వేగాల అంశాల్ని రాజకీయం చేస్తున్న నాయకులను.

అసలు విలీనమే, పైన్నుండి జరిగిన కృతక రాజకీయ చర్యగా భావించాలి. విలీనం ప్రభావం ఎన్నడూ దిగువకు  దిగలేదనడంకన్నా, ఇరుప్రాంతాల రాజకీయ నాయకులు అలాంటి అవకాశం ఇవ్వలేదనడమే వాస్తవం. భాషాప్రయుక్త సువిశాల తెలుగు రాష్ట్రంలోదిగువన, ఇరు ప్రాంతాల ప్రజలు సమైక్యతా రాగాన్ని ఆలపించిన సందర్భాలు, గడిచిన యాభై రెండేళ్లలోబహుఅరుదుగా మాత్రమే కనిపిస్తాయి. హైదరాబాద్‌ నగరం ఒక్కటే దీనికి మినహాయింపుకావచ్చు.  నాలుగు వందల యేళ్లకుపైగా హైదరాబాద్‌ నగరం నిజంగానే, బహుభాషలకు, బహు సంస్కృతులకు, బహు మతాలకు నిలయం. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలు విలీనం కాకపోయినా హైదరాబాద్‌ నగరం బహుశ ఇప్పటిలాగే వుండేది.

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అధికారులను వ్యతిరేకించే సాంప్రదాయం నిజాంసంస్థానంలో 1937 నుండే వుంది. అప్పట్లో, ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చిన ఉద్యోగులకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన సాగించారు. హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడి, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ,  1952 సెప్టెంబరులో మళ్ళీ ముల్కీ ఉద్యమం ఉధృతంగా మారింది. 1948 నాటి పోలీసు చర్య తరువాత,  ఇతర ప్రాంతాల నుండి తీసుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ కూడా మద్దతివ్వడంతో ఉద్యమం ఉధృతంగా మారింది. పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోయారు. కేంద్రం నుండి జవహర్‌ లాల్‌ నెహ్రు, మౌలానా అజాద్‌ కూడా స్వయంగా వచ్చి పరిస్థితిని సవిూక్షించి వెళ్ళారు. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన అధికారుల్ని వెనక్కు పంపించేశారు. వారిలో, ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు కూడా వున్నారు.

భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజనకు నియమించిన జస్టిస్‌ సయ్యద్‌  ఫజల్‌ అలీ  కవిూషన్‌ (ఫస్ట్‌ ఎస్సార్సీ) 16 జిల్లాల హైదరాబాద్‌ రాష్ట్రాన్ని  భాషా ప్రాతిపదికపై మూడు ముక్కలు చేసింది. మరాఠ్వాడ ప్రాంతానికి చెందిన 5 జిల్లాల నాయకులు కొత్తగా ఏర్పడే మహారాష్ట్రలో చేరిపోవడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన 3 జిల్లాల నాయకులు కూడా కొత్తగా ఏర్పడే మైసూరు రాష్ట్రంలో చేరిపోవడానికి సంతోషంగా ముందుకొచ్చారు. ఇక మిగిలింది తెలంగాణా ప్రాంతంలోని 8 జిల్లాలు. (ఖమ్మం జిల్లా అప్పటికి ఏర్పడలేదు. ప్రస్తుత రంగారెడ్డిజిల్లాను అప్పట్లో అతరాఫ్‌ బల్దియా అనేవారు).

తెలంగాణా ప్రాంతాన్ని అంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని ఫజల్‌ అలీ  కవిూషన్‌ ఎక్కడా సూచించలేదు. రెండు ప్రాంతాల ప్రజల చరిత్ర, ఆర్థికజీవనం భిన్నమైనవిగనుక వాటిని రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా కొనసాగనివ్వాలని భావించింది. నిజానికి, రాజకీయ వారసత్వం, సంస్కృతుల విషయంలోనూ రెండు ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. ఒకవేళ  విలీనం చేయదలిస్తే, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో రెండుసార్లు శాసనసభ ఎన్నికలు జరిగే వరకు ఆగాలనీ సూచించింది. ఆ తరువాత ఏర్పడే శాసనసభ, మూడింట రెండువంతుల మెజార్టీతో తీర్మానం చేయగలిగితేనేవిలీనం చేయవచ్చని షరతు పెట్టింది.  అంటే, కనీసం 1961 వరకు తెలంగాణాను  ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలనేదే ఫజల్‌ అలీ  కవిూషన్‌ అభిప్రాయం.


ప్రధాని నెహ్రుకు కుడా విలీనంపట్ల ఆసక్తిలేదు. బహు భాషలు, బహు సంస్కృతుల నిలయంగా హైదరాబాద్‌ స్టేట్‌ కొనసాగాలని ఆయన ఆశించారు. నాటి కేంద్ర ప్రభుత్వంలో నెంబర్‌ టూగా భావించే మౌలానా ఆజాద్‌ అయితే, విలీనానికి బధ్ధవ్యతిరేకి. అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌ పిసిసి అధ్యక్షులు కొండా వెంకట రంగా రెడ్డి, కాంగ్రెస్‌ ప్రముఖులు జే. వి. నరసింగరావు తదితరులూ విలీనానికి తీవ్రవ్యతిరేకులే. అటు, అంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగావున్న బెజవాడ గోపాలరెడ్డికి సహితం విలీనంపట్ల పెద్దగా ఆసక్తిలేదు.

అధికార కాంగ్రెస్‌ శిబిరంలో ఇంతమంది హేమాహేవిూలు వ్యతిరేకించినప్పటికీ హైదరాబాద్‌ స్టేట్‌ లోని తెలంగాణా ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో విలీనమైపోవడం విచిత్రమే. ఈ అసాధ్యాన్ని సాధించిన ఏకైక నాయకుడు బూర్గుల రామకృష్ణారావు. తెలుగువారికి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడడానికి, ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ స్టేట్‌ ముఖ్యమంత్రి పదవిని సహితం ఆయన  వదులుకున్నారుపొట్టి శ్రీరాములు త్యాగంవల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే, బూర్గుల రామకృష్ణారావు ఔదార్యంవల్ల అంధ్రప్రదేశ్‌ ఏర్పడిందంటే అతిశయోక్తికాదు.

ఆధునిక తెలంగాణా నిర్మాతలు ఆరుగురు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్ల రెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్‌ ''కమ్యూనిస్టు త్రిమూర్తులు'' అయితేరామానంద తీర్థ, గోవిందరావు నన్నల్‌, బూర్గుల రామకృష్ణా రావు ''కాంగ్రెస్‌ త్రిమూర్తులు''. 1920లో ఆంధ్ర జనసంఘం ఆవిర్భావం మొదలుకుని 1967లో తుది శ్వాసవిడిచేవరకూ దాదాపు అర్థశతాబ్దంపాటు, తెలంగాణాలో జరిగిన ప్రతి రాజకీయ సంఘటనలోనూ రామకృష్ణా రావు కీలక పాత్రనిర్వహించారు.  వారి కార్యక్షేత్రం  రాజకీయరంగానికే పరిమితమైనదికాదు. ఆంధ్రభాషా వికాసోద్యమం, గ్రంధాలయోద్యమంఆంధ్రోద్యమం, స్త్రీ విద్య, అస్పృశ్యతా నివారణ, భూసంస్కరణలు, సాహిత్యం, సంస్కృతి తదితర అన్ని రంగాలలోనూ ఆయన విశేషప్రతిభాశాలి.

1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో, హైదరాబాద్‌ స్టేట్‌ లోని అతి పెద్ద ప్రాంతమైన తెలంగాణాలో కమ్యూనిస్టులకు అధిక్యత లభించింది. చిన్న ప్రాంతాలైన మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కు ఆధిక్యత లభించింది. మొత్తవ్మిూద 175 మంది సభ్యులున్న శాసనసభలో 7 గురు సభ్యుల స్వల్ప మెజారిటీతో బూర్గుల తొలి ముఖ్యమంత్రి అయ్యారు. స్వతహాగా ఉదారవాది కావడాన, బలమైన ప్రతిపక్షం వున్నప్పటికీ, ఆయన పదవీ కాలం సజావుగానే సాగిపోయింది. అయితే, కాంగ్రెస్‌  ప్రాబల్యంవున్న మరఠ్వాడా, కర్ణాటక ప్రాంతాలను ఫస్ట్‌ ఎస్సార్సీ ఇతర రాష్ట్రాలతో కలిపి వేయడంతో హైదరాబాద్‌ స్టేట్‌ లో కాంగ్రెస్‌ బలహీనపడిపోయింది. శాసనసభకు ఎన్నికలు జరిగితే, కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అంతకు ముందు, 1949 నవంబరులో, ఏం.కే. వెల్లోడీ నాయకత్వాన ఏర్పడిన తొలి పౌరప్రభుత్వంలో బూర్గుల రెవెన్యూవిద్యాశాఖల్ని నిర్వహించారు. అప్పట్లోనే విప్లవాత్మక జాగీర్దారీ నిర్మూలన చట్టం వచ్చింది. అయన ముఖ్యమంత్రి అయిన తరువాత  హైదరాబాద్‌ కౌలుదారీ చట్టాన్ని  తేవడమేగాక, 1953లో భూ కవిూషన్‌ ను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూపరిమితి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసే ప్రయత్నాలూ ఆరంభించారు. భూసంస్కరణలకు   ప్రతిపక్ష పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ మద్దతిచ్చినప్పటికీ కాంగ్రెస్‌ లోని భూస్వామ్యవర్గాలు బూర్గులపట్ల గుర్రుగావున్నాయి. తన తర్వాత తెలంగాణాలో  దేశ్‌ ముఖ్‌, జాగీర్దార్ల వ్యవస్థ మళ్ళీ వేళ్ళూనుకుంటుందని బూర్గుల భయపడ్డారు.

బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి శిబిరంలా రాడికలూకాదు; కొండా వెంకట రంగా రెడ్డి శిబిరంలా ఫ్యూడలూకాదు. రాజకీయంగా ఈ రెండు శిబిరాలను అదుపులో వుంచాలంటే తెలంగాణాను అంధ్ర రాష్ట్రంలో విలీనం చెయ్యడమే పరిష్కారం అని బూర్గుల భావించారు. 1955 ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటూ చేస్తారనుకున్న కమ్యూనిస్టుల్ని, ఆంధ్రా కాంగ్రెస్‌ నాయకులు 15 సీట్లకు పరిమితం చేయడం కూడా బూర్గులకు తక్షణ ఉత్తేజాన్ని ఇచ్చిఉండొచ్చు. మరఠ్వాడా మహారాష్ట్రలోనూ, కర్ణాటక మైసూరులోనూ కలిపోయినంత సహజంగా, అవసరంగా తెలంగాణా ఆంధ్రాలో కలిసిపోతుందని ఆయన భావించారు. 

తెలంగాణా నేతల్లో సమైక్యత గురించి మాట్లాడిన తొలి ప్రముఖుల్లో వి.బీ. రాజు, కే. అచ్యుతా రెడ్డి, కాళోజీ నారాయణ రావు తదితరులున్నారని ఆంటారు. మొదట్లో మౌనంగా, తటస్థంగావున్న బూర్గుల, చివరి ఘట్టంలో మాత్రమే  విలీనాన్ని గట్టిగా సమర్థించారు.

అయితే, తెలంగాణా, ఆంధ్రా విలీనానికి కీలక సూత్రధారి గోబింద వల్లభ్‌ పంత్‌. ఆయన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వుండగా ఒక వివాదాస్పద నిర్ణయం చట్టం తెచ్చారు. మహాత్మా గాంధీజీ, మొదటి నుండీ, హిందూస్తానీని అధికార భాషచేయాలనీ, దానిని దేవనాగరీలోగానీ, ఉర్దూలోగానీ రాసుకునే అవకాశం కల్పించాలనీ అనేవారు. అందుకు భిన్నంగాదేవనాగరి లిపిలోని హిందీని అధికారభాషగా చేస్తూ, పంత్‌, చట్టం చేశారు.

ఫజల్‌ అలీ కమిషన్‌ తన నివేదికను సమర్పించేనాటికి గోబింద వల్లభ్‌ పంత్‌ కేంద్ర హోంమంత్రిగా  వున్నారు. నిబంధనల ప్రకారం ఆయనే ఆ నివేదికను అందుకున్నారు.  కమిషన్‌ సభ్యుడైన కే.ఎం. ఫణిక్కర్‌ ఉత్తరప్రదేశ్‌ కు సంబంధించి  కీలకమైన ప్రతిపాదన ఒకటి చేశారు. అతివిస్తారంగామారి, నిర్వహణ సాధ్యం కాకుండావున్న ఉత్తరప్రదేశ్‌ ను రెండుగా వీడగొట్టి, ఆగ్రా రాజధానిగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ను ఏర్పరచాలనీ, దానికి దేవనాగరీ, ఉర్దూ లిపుల్లో రాసుకునే వీలున్న హిందూస్తానీని అధికార భాషగా చేయాలనేది దాని సారాంశం.

ఫణిక్కర్‌ ప్రతిపాదన సహజంగానే గోబింద వల్లభ్‌ పంత్‌ ను కంగారు పెట్టింది. ఒకే భాషమాట్లాడే ప్రాంతాన్ని విభజించడం, భాషాప్రయుక్త రాష్ట్రాల సిధ్ధాంతానికే వ్యతిరేకం అంటూ ఆయన విరుచుకుపడ్డారు. తన వాదనకు బలాన్ని ఇవ్వడం కోసంతెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలను ఏకం చేయడానికి ఆయన రంగంలో దిగారు. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రే వత్తాసు పలకడంతో, మిగిలిన నాయకులు దాదాపు మౌనంగా వుండిపోయారు.  నాటి జాతీయ కాంగ్రెస్‌ లో గోబింద వల్లభ్‌ పంత్‌ ను ఎదుర్కోవడమూ అంత సులభంకాదు. మొదట్లో, బూర్గులను నచ్చచెప్పడానికి ప్రయత్నించిన  నెహ్రు సహితం చివరకు సరేనన్నారు.

అటు, అంతవరకూ మద్రాసులో వుండివచ్చిన ఆంధ్రా నాయకుల కళ్ళకు కొత్తరాజధాని కర్నూలు బొత్తిగా ఆనలేదు. సమైక్యతా ప్రతిపాదన ముందుకు రాగానే మరో అలోచనే లేకుండా  వాళ్ళు సరేనన్నారు. మద్రాసుకు పోటీగా హైదరాబాద్‌ నిలుస్తుందనుకున్నారు.  

కొత్తగా ఏర్పడే, రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావే ముఖ్యమంత్రిగా వుండాలని ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డీ, పిసిసి అధ్యక్షుడునీలం సంజీవ రెడ్డీ  ప్రతిపాదించారు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తనకూ అంగీకారమేనని బూర్గులా అన్నారు. విశాలాంధ్ర ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపై మోసిన కమ్యూనిస్టులు సహితం బూర్గుల అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఎలా చూసినా ఆ సమయంలో సమైక్య అంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి పదవికి ఆయనే సరైన అభ్యర్థి. అయితే, చివరి ఘట్టంలో,  కే.వీ. రంగారెడ్డి  ముఖ్యమంత్రి పదవికి బరిలో దిగారు. ముఖ్యమంత్రి ఎన్నిక   ఏకగ్రీవం కాదని తేలడంతో, బూర్గుల పోటీ నుండి తప్పుకున్నారు. బూర్గుల రంగంలో లేకపోవడంతో, బలమైన అభ్యర్థిగా ముందుకు వచ్చిన నీలం సంజీవ రెడ్డి ప్రతిష్టాత్మక అంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, బూర్గుల ఆశయం పరోక్షంగా నెరవేరిందనే చెప్పాలి. తెలంగాణా కాంగ్రెస్‌ లోని అయన ప్రత్యర్థులు అధికారాన్ని  చేపట్టలేకపోయారు. 1957లో తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు, ఆంధ్రా తరహాలోనే  ఘోరంగా దెబ్బతిన్నారు. అయితే, జీవితకాలం భూస్వామ్యానికి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన బూర్గులకు వారసునిగాఫ్యూడల్‌  అహంభావాన్ని గట్టిగా వంటపట్టించుకున్న నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కావడమే పొలిటికల్‌ పారడాక్సీ!
 (బూర్గుల నరసింగారావు సౌజన్యంతో)

11 మార్చి  2008
(13 మార్చి  బూర్గుల రామకృష్ణారావు జయంతి)

ప్రచురణ : వార్త దిన పత్రిక 

No comments:

Post a Comment