Saturday 6 July 2013

Danny Notes June 2013

డానీ నోట్స్ – జూన్ 2013

Kedarnath Floods - 5
Kedarnath Floods – 5


Danny Notes
1 June 2013

అల్లూరి మీద నవలకు కృతి భర్తలు లేరా?

నరసాపురంలో పాత విద్యా సంస్థలు రెండే. ఒకటి, టేలర్ హై స్కూలు, ఇంకోటి మిషన్ హై స్కూలు. ఈ రెండు విద్యాసంస్థలకు ఒక గౌరవనీయమైన చరిత్రవుంది.  టేలర్ హై స్కూలులో అల్లూరి శ్రీరామరాజు చదివారు. మిషన్ హై స్కూలులో చిలకమర్తి లక్షీనరసింహం పంతులుగారు చదివారు. అదృష్టావశాత్తు  నేను ఈ రెండు విద్యాసంస్థల్లోనూ చదివాను.

ఇటీవల ఒక విషయం తెలిసి చాలా బాధ అనిపించింది. విప్లవవీరుడు అల్లూరి శ్రీరామరాజు మీద ఇప్పటి వరకు తెలుగులో నవల లేదట! ఇంతకన్నా విషాదం ఏమైనా వుంటుందా?

అల్లూరి అభిమానులైన స్థితిమంతులు ఎవరైనా ప్రాజెక్టును స్పాన్సర్ చేసినా ఒక్క ఏడాదిలో ఒక మంచి నవల వస్తుంది. అల్లూరి మీద నవలకు కృతి భర్తలు లేరా?

Danny Notes
6 June 2013

ఉద్యమ విలాపం
తమవర్గం ప్రయోజనాలకు వ్యతిరేకంగా దిగజారిన పాలకులు మనకు ఎక్కడా కనిపించరు. తమను నమ్ముకున్నవారి ప్రయోజనాలను అమ్ముకున్న ఉద్యమకారులు మనకు తరచూ కనిపిస్తుంటారు. 

Danny Notes
8 June 2013

రచయితగా, వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన కథ ’క్షిపణి’ (1988).
నా ఫేస్ బుక్ స్నేహితుల కోసం రేపు రేపు పోస్ట్ చేస్తాను.
Danny Notes
9 June 2013

బతకడానికి గొప్ప ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడుందో నాకు తెలీదు. చనిపోవడానికి గొప్ప ప్రదేశం ఎక్కడుందో మాత్రం నాకు తెలుసు. అది మావూరి వశిష్టా గోదావరే!!




Danny Notes
20 June 2013

ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజంలో పెత్తందారీ, దళిత కులాల మధ్య అంతరం కనిపిస్తుంది. ఇది క్రైస్తవ మతాచారం మాత్రం కాదు; క్రైస్తవ సమాజంలో కొనసాగుతున్న హిందూ ఆచారం. క్రైస్తవ దేశాలు, జాతులు హోరాహోరీగా తలపడిన సందర్భాలున్నాయి. రెండవ ప్రపంచ యుధ్ధమే దానికి పెద్ద ఉదాహరణ. కానీ, అవి ధార్మిక యుధ్ధాలుకావు; లౌకిక యుధ్ధాలు.

వృత్తి వేరు, కులం వేరు, వృత్తి తాత్కాలికమైనది. కులం శాశ్వితమైనది. అన్ని మతాల్లోనూ వృత్తులు వుంటాయి. కులం హిందూ మతంలోనే వుంటుంది. హిందూ మతం నిజానికి మతం కాదు స్థిరపడిన కులవ్యవస్థ.

Danny Notes
10 June 2013

కటార కథ
29 నవంబరు 2010  రాత్రి నేను చాలా అలజడితో గడిపాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ఆ రోజు ఒక మలుపు. ఆ కల్లోలం నుండి బయటపడడానికి రాత్రంతా ’కటార’ కథ రాసి తెల్లారాక ఒక నిట్టూర్పు విడిచి పడుకున్నాను.  ఆ కథను ప్రచురించడానికి ప్రధాన స్రవంతి పత్రికలేవీ సిధ్ధపడలేదు. నా కథలో కొందరికి కొందరు రాజకీయ, వాణిజ్య ప్రముఖులు కనిపించారట. తలో సాకు చెప్పి తప్పుకున్నాయి. నేను ఆ కథ రాసిందే, రాజకీయాలు, వ్యాణిజ్య సంస్థలు కలగలిసిపోవడం (క్రోనీ కేపిటలిజం) పై. చివరకు విజయవాడ నుండి వచ్చే ’ఢీ’ అనే ఓ చిన్న వారపత్రిక, సంపాదక మిత్రుడు బాల కోటేశ్వరరావు దాన్ని ప్రచురించాడు. ఆ తరువాత కొన్ని వెబ్ సైట్లు దాన్ని ప్రచురించాయి. కానీ, ఎక్కువమందికి ఆ కథను చేర్చలేకపోయాననే అసంతృప్తి ఇప్పటికీ వుంది.

వీలైతే, వచ్చేవారం, ’కటార’ కథను ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కోసం పోస్ట్ చేస్తాను.


క్షిపణి కథ - రాజీవ్ గాంధీ
విజయబాబుగారూ! ’క్షిపణి’ కథను నేను 1988లో రాశాను. అప్పుడు కేంద్రంలో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పాలన సాగుతోంది. కథలో నేను చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. ఏడాది తరువాత, 1989 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 1991 లో రాజీవ్ గాంధి హత్యానంతరం గానీ, కాంగ్రెస్ కోలుకోలేక పోయింది; అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఏర్పడ్డది కూడా మైనారిటి ప్రభుత్వమే!

 Danny Notes
10 June 2013

అతివాదం తన తప్పిదాలకే బలైపోతుంది!

భారత రాజకీయాల్లో లాల్ కిషన్ అద్వానీజీ, తానే అదుపుచేయలేని, నరేంద్ర మోడీ అనే, ఒక భూతాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ భూతం ఏకంగా అద్వానీనే మింగేసింది. అతివాదం తన తప్పిదాలకే బలైపోతుంది!  

Danny Notes
11 June 2013

నా రచనలపై ప్రచురణ హక్కులు ఉచితం

నా రచనల మీద పాఠకుల ఆసక్తి పెరగడం ఆనందంగావుంది. కొందరు ప్రచురణ అనుమతి కోసం నన్ను సంప్రదిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం బహిరంగంగా చెప్పాల్సివుంది. నా వాణిజ్యేతర రచనలన్నీ ప్రచురణకు ఉచితం. వాటిని ఎవరైనా ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. సంపూర్ణంగా వాడినా, భాగాలుగా వాడినా  ఎలాంటి గౌరవ వేతనం చెల్లించాల్సిన పనిలేదు; వాడిన ప్రతిసారీ నా పేరు మాత్రం  ప్రస్తావించితీరాలి. ప్రచురణకు ముందు ఒక సమాచారం, ప్రచురణ తరువాత ఒక కాపీ పంపితేచాలు.

నా రచనల్ని పుస్తకాలుగా ప్రచురించుకునే హక్కు మాత్రం నాకే వుంటుంది.

నా రచనలు అన్నింటినీ యూనీకోడ్ ఫార్మాట్ లో నా బ్లాగ్ లో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. వాటిలో వున్నమేరకు ఇప్పుడు వాడుకోవచ్చు.

నా బ్లాగ్ :


Danny Notes
12 June 2013

తెలంగాణ భావజాలం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రస్తుత దశకు ఒక ప్రత్యేకత వుంది. చరిత్రపట్ల పాలకుల దృక్పధాన్ని ప్రజలూ, ప్రజల దృక్పథాన్ని పాలకులూ మాట్లాడుతున్నారు. ఇలాంటి భావజాలంలో ఒక ప్రమాదం నిబిడీకృతంగా వుంటుంది. ఉద్యమంలో పోరాట స్వభావం అంతరించి మంతనాల (లాబీయింగ్) స్వభావం పెరుగుతుంది.

వేర్పాటు ఉద్యమాల్లో, ప్రజల మధ్య ఐక్యత, పాలకుల మధ్య ఘర్షణ వుండాలి. తప్పుడు భావజాలాల ఫలితంగా ప్రజల మధ్య ఘర్షణ, పాలకుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. ఇలాంటి పరిణామాలు పాలకులకు అనుకూలం. ప్రజలకు ప్రమాదకరం.

ఏ ఉద్యమంలో అయినా ప్రజలే పాల్గొంటారు; అవి ప్రజా ఉద్యమాలు కావచ్చు, ప్రతీఘాత ఉద్యమాలు కావచ్చు. ఉద్యమాల్లో చూడాల్సింది  ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా నాయకత్వం  ఉద్యమాన్ని నడుపుతున్నదా? లేకపోతే, పాలకవర్గ లక్ష్యాల సాధన కోసం ప్రజల్ని వాడుకుంటున్నదా? అనేది మాత్రమే! ప్రజలు విస్తృతంగా పాల్గొంటున్నారా? లేదా? అనేది ద్వితీయం. ప్రజలు విస్తృతంగా పాల్గొంటే ఉద్యమాలు విజయవంత మవుతాయి లేకపోతే విఫలం అవుతాయి.

తెలంగాణ జేయేసి తలపెట్టిన ’చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అప్రజాస్వామిక చర్య. ఏ అంశం మీదనైనా నిరసన తెలిపే హక్కు ప్రజలకుంది.

Danny Notes
13 June 2013

చలో అసెంబ్లీ

’చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడంవల్ల ప్రభుత్వానికి కలిగే మేలుకన్నా, అనుమతి ఇవ్వకపోవడంవల్ల కలిగే నష్టమే ఎక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణతో తల గొక్కుంటున్నది.   


Danny Notes
15 June 2013
 ప్రాక్ పశ్చిమ సంస్కృతులు

ప్రపంచం ఇప్పుడు భౌగోళికంగా మాత్రమే  పూర్వార్ధ, పశ్చిమార్ధ గోళాలుగా వుంది. సాంస్కృతికంగా దేశసరిహద్దులు ఎన్నడో అంతరించిపొయాయి. ఇప్పుడు భారతదేశంలోనూ పశ్చిమ సంస్కృతి వచ్చేసింది. అమెరికాలోనూ తూర్పు సంస్కృతి కొనసాగుతోంది,

Danny Notes
18 June 2013

        ప్రతి మనిషికీ జీవితంలో ఒక శోభాయమాన కాలం వుంటుంది. దాన్ని నేను విజయవాడలో ఆస్వాదించాను. నేను పుట్టింది గోదావరి నది ఒడ్డున నరసాపురంలో అయితే, ఉద్యమ జన్మనెత్తింది మాత్రం కృష్ణానది ఒడ్డున విజయవాడలోనే.  1970 ల నాటి విజయవాడ సంస్కృతిని నమోదు చేయాలని నాకన్నా పెద్దలు. పిన్నలు కూడా చాలాసార్లు నన్ను అడిగారు. ఇప్పటికీ అడుగుతూనే వున్నారు. అలాంటి సందర్భం 2011  జులైలో ఒకసారి వచ్చింది.

      శ్రీశ్రీ విశ్వేశ్వరరావు షష్తిపూర్తి ప్రత్యేక సంచిక్కి సంకలనకర్తగావున్న కవి- మిత్రుడు  ఖాదర్ మొహీయుద్దీన్ ఒకరోజు  నాకు ఫోన్ చేసి, ఒక వ్యాసం కావాలన్నాడు. అందులో, విశ్వేశ్వరరావు మీద నా అభిప్రాయాలతోపాటూ  ఆనాటి విజయవాడ జీవితాన్ని కూడా పరిచయం చేస్తే బాగుంటుందని ఒక సూచన కూడా చేశాడు.

        సువనీర్ అంటే అర్ధం జ్ఞాపకాలే. విజయవాడ జ్ఞాపకాలంటే అది ఓ ఏడెనిమిది పేజీలతో ఆగేపనా? విశ్వేశ్వరరావు షష్తిపూర్తి జరిగిన రెండు రోజుల్లోనే ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ చనిపోయారు. అప్పుడు తెచ్చిన జ్ఞాపకాల సంచిక్కి కూడా ఖాదర్, విశ్వేశ్వరరావులే సంకలన కర్తలు. అలా ఇంకో వ్యాసం రాయాల్సి వచ్చింది.’ఇష్టమైన పుస్తకం విజయవాడ - ఇష్టమైన అధ్యాయం విశ్వేశ్వరరావు’. డెభ్భయ్యేళ్ల పసిపిల్లాడు’  కథనాలు రాసి, పంపిన తరువాత కూడా విజయవాడ జ్ఞాపకాలు నన్ను వదల్లేదు. విశ్వేశ్వరరావు, మో లతో నేరుగా సంబంధం లేని కొన్ని భాగాలు నా దగ్గర మిగిలిపోయాయి. అవే ’చారు మజుందార్ రోడ్డు’ ’ కళాక్షేత్రానికి టీ బడ్డికొట్టువాడి పేరు" వగయిరాలూను.

        చారిత్రక సంఘటనల్ని రాయడానికి రచయితకు ఒక లక్ష్యం వుంటుంది. ఆ లక్ష్యాన్ని బట్టి రచన ప్రక్రియ ఎంపిక వుంటుంది. మేధోమధనానికి వ్యాస ప్రక్రియ  అనువుగావుంటుంది. భావోద్వేగాల్ని, మరీ ముఖ్యంగా ఉత్తేజాన్ని,  సమర్ధంగా పంపిణీ చేయడానికి నెరేటివ్ హిస్టరి ప్రక్రియ బాగుంటుంది. దేని ప్రయోజనం దానికివున్నట్టే, దేని లోపాలు దానికి వుంటాయి.

Danny Notes
18 June 2013

జీయస్ (సిరీస్) రాజుగారికి నివాళి

        నేను విలేఖరిగా వున్నంత కాలం కాంగ్రెస్ విభాగాన్నే చూడడంవల్ల ఆ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు వుండేవి. కాంగ్రెస్ లో, జీయస్ రాజు, కాట్రగడ్డ రాజగోపాల రావు వంటి వృధ్ధులు నాతో చాలా చనువుగా పాత విషయాలు నెమరు వెసుకుంటూ వుండేవాళ్ళు.

        ఒక రోజు రాజుగారు సబర్మతీ ఆశ్రమంలో తన అనుభవాలు చెప్పడం మొదలెట్టారు. అప్పటి కాంగ్రెస్ నాయకులకు మహా అయితే ఇందిరా గాంధి తెలుసు. వారు మరీ, నెహ్రూ, గాంధీజీలను ప్రస్తావిస్తుంటే,  "రాజుగారూ! మీ వయస్సు ఎంత?" అని అడిగాను. అప్పటికి వారు డెభ్భయ్యవ పడిలో వుంటారు.

        "మీకు నా క్రనోలాజికల్ ఏజ్ కావాలా? బయోలాజికల్ ఏజ్ కావాలా? అని అడిగారు రాజుగారు.  వారు ఏం అన్నారో నాకు అర్ధం కాలేదు. అజ్ఞానాన్ని దాచుకోవడం కన్నా దాన్నుండి బయటపడడమే మంచిదనే వుద్దేశ్యంతో, నేను "మీరు చెప్పింది నాకు అర్ధం అయినట్టూ కానట్టూ వుంది. మీరే కాస్త జ్ఞానబోధ చేసేయ్యరాదూ?" అన్నాను.

        రాజుగారు అమెరికాలో యంయస్ చేశారు. "Chronological age is simply my age in Calendar years. Biological age is my age at a cellular level"  అన్నారు. మళ్ళీ వారే కొనసాగిస్తూ, "క్యాలెండర్ వయస్సు నేను చెప్పకుండానే మీకు తెలిసిపోతుంది. బయోలాజికల్ వయస్సు నేనే చెప్పాలి" అన్నారు.

"ఇప్పుడు మీ బయోలాజికల్ వయస్సు ఎంత రాజుగారూ?" అని అడిగాను.
"నలభై" అన్నారువారు చలాకీగా, చిలిపిగా ఓ నవ్వు నవ్వుతూ.

Danny Notes
18 June 2013 - 3

సిరీస్ (జీయస్) రాజు

        జీయస్ రాజుగారిలో గుర్తించుకోవాల్సిన అంశం వారి ఆతిథ్య సంస్కృతి. ఆంధ్రజ్యోతి దినపత్రిక  ప్రారంభ దశలో వారు కీలక బాధ్యతలు నిర్వహించారు. అయినా ఆ దర్పాన్ని మా బోటి ఉద్యొగుల ముందు ఎప్పుడూ ప్రదర్శించేవారుకాదు. సిరీస్ కంపెనీ కార్యకలాపాల్ని పత్రికలకు వివరించే  సందర్భాల్లోనేకాక, రాజకీయ పరిణామాల్ని చర్చించడం కోసం కూడా అప్పుడప్పుడు నన్ను ఇంటికి పిలిచేవారు. ఆ పిలుపులో ఒక సాంప్రదాయం వుండేది. ముందు ఆఫీసు కార్యదర్శి ఫోన్ చేసి, రాజుగారు మాట్లాడతారనేవారు. రాజుగారు ఫోన్ అందుకును "తీరిక చేసుకుని రేపు ఉదయం మా యింటికి రాగలరా? మాట్లాడుకుందాం" అనేవారు. మనం "సరే’ అన్న క్షణం నుండి రాజుగారి మర్యాదలు మొదలైపొయేవి. వాళ్ల "ఆఫీసునుండి పర్సనల్ సెక్రటరీ ఫోన్ చేసి "రేపు ఉదయం మీరు వస్తారని రాజుగారు చెప్పారు. ఉదయం మీకోసం ఎదురు చూస్తారు" అనేది. ఆ మరునాడు కళ్ళుతెరిచే సమయానికి ఇంటి ముందు ఒక చవర్లే కారు నిలబడి వుండేది. ప్రహరిగోడ, తలుపులు కూడా లేని మా ఇంటి ముందు చవర్లే కారు సర్రియలిస్టు కవితాలా వుండెది.

        బృందావనం కాలనీలో, రాజుగారి ఇంటికి చేరే సమయానికి, గేటు దగ్గర వారి వ్యాపార భాగస్వామి షాగారు ఎదురు చూస్తుండేవారు. డైనింగ్ టేబుల్ దగ్గర విధినిర్వహణలో వున్నట్టు రాజుగారు ఎదురుచూస్తుండేవారు. ఈ మర్యాదంతా నా కోసమేనా? లేక నన్ను చూసి వారేమయినా పొరబడుతున్నారా? అనే అనుమానం వచ్చి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఎవరితో అయినా సరే చిన్న పనిపడినా, వాళ్ళు ఇంటి నుండి బయలుదేరినది మొదలు, తిరిగి ఇంటికి చేరే వరకు వాళ్లను అతిధిగా చూసుకోవడం రాజుగారి అలవాటు.

        డైనింగ్ టేబుల్ మీద ఎన్నిరకాల అల్పాహారాలు వుండేవో చెప్పడంకన్నా ఏవి లేవో చెప్పడం సులభంగా వుండేది ఆ జాబిత.  "అతిథుల్ని భోజనం పెట్టి చంపేస్తారు!" అని, గోదావరిజిల్లాల ధనిక కుటుంబాల గురించి ఒక సామెత వుంది. రాజుగారిది ఆ సాంప్రదాయమే! 

Danny Notes
18 July 2013

హిందూమతం -ఇతర మతాలు

        భారత ఉపఖండంలో హిందూమతం అతిపురాతన మతమనీ, ఇతర మతాలు ఆ తరువాతే ఇక్కడ పుట్టాయి, లేదా ఇక్కడికి వచ్చాయి, అనే వాదనతో నాకు స్థూలంగా ఏకాభిప్రాయం వుంది. దీని అర్ధం ఏమిటీ? హిందూమతంలోని అంతర్గత అణిచివేతని భరించలేక, అణగారిన వర్గాలు ఇతరమతాల్లోకి వెళ్ళడమో, లేక, తామే ఒక కొత్త మతాల్ని సృష్టించుకోవడమో చేశాయనేకదా!. అంటే, సాంప్రదాయిక హిందూమతంకన్నా, ఆ తరువాత పుట్టిన లేదా, వచ్చిన మతాలు, సంపూర్ణంగా కాకపోయినా, సాపేక్షకంగా అయినా  ఉదారమైనవనేకదా!

        ఇతర మతాల నుండి హిందూ మతాన్ని స్వీకరించిన వాళ్ళు దాదాపు వుండరనే చెప్పాలి. కానీ, హిందూ మతాన్ని వదిలి ఇతర మతాల్ని స్వీకరించినవాళ్ల సంఖ్య  వేలు, లక్షలుకాదు కోట్లలో వుంటుంది. ఇలా మత వలసలు ఒకవైపుకే ఎందుకు వుండేవి అనేది  ఆలోచించాల్సిన విషయం.

        హిందూ అణగారినవర్గాలు ఇతర మతాల్లోకి వలసలు పోవడం ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టివుండవచ్చు. దానికి కారణం అణగారినవర్గాలకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణ కల్పించడమేతప్పా, హిందూ మతంలో కొత్తగా మానవీయ మార్పులు వచ్చాయనికాదు,  హైందవ పెత్తందారీ కులాలు దళిత బహుజనులపై దాడులుచేయడం ఇప్పటికీ ఆగలేదు. 

Naresh Nandam!

Danny Notes
18 JUne 2013
నరేష్ నందం :  డానీ గారూ! , నేరుగా మీరు కలిసినప్పుడు అడిగే అవకాశం ఉన్నా, మరికొందరు మిత్రుల బదులు కూడా ఈ ప్రశ్న:
మీరు ‘ఉషా ఎస్ డానీ’ ఎలా అయ్యారు?

ఉషా యస్ డానీ

నాకు సంబంధించి ఇది చాలా వ్యక్తిగత  భావోద్వేగాలతో కూడిన వ్యవహారం. ఒకటీ రెండు వాక్యాల్లో చెప్పగల విషయం కాదు. అలాగని, మీలాంటివాళ్ళు అడిగాక తప్పించుకునే అంశమూకాదు. చొప్పరపు ఉష రాణి నాకు అత్యంత ఆత్మీయ స్నేహితురాలు. మా అనుబంధాన్ని చెప్పడానికి ఈ మాటలు చాలా చిన్నవి. ఒక నాటకీయ సందర్భంలో, మేమిద్దరం అధికారికంగా పెళ్ళి కూడా చేసుకున్నాం. కాపురానికి రావడానికి ముందే ఆమె చనిపోయింది. నా కన్నా ముందే ఆమె రాడికల్. ఆ విషయం ఆమె చనిపోయాకే నాకు తెలిసింది. ఆమె మీద అభిమానంతోనే నేను రాడికల్ గా మారాను. వృత్తి ధర్మంగా, వాణిజ్య పరంగా, పొట్టకూటి కోసం రాసే రచనల్ని వదిలేస్తే, నేను నా ఆసక్తి కొద్దీ సమాజ శ్రేయస్సు కోరి రాసే రచనల్ని ఉషా యస్ డానీ పేరుతోనే రాయాలనుకుంటాను. నా పూర్తి  పేరులో ఐదు పదాలున్నా యజ్దానీ మాత్రమే నా స్వంత పేరు. మిగిలిన నాలుగు పదాలు మా వంశం పేర్లు, మా తాతల పేర్లు.  మా ఇద్దరి పేర్లు కలిపి  రాయడం నాకు చాలా సంతృప్తి నిస్తుంది. అయితే దానికి కొన్ని అభ్యంతరాలున్నాయి. అయితే, అవి నా భార్య యేలూరి అజిత నుండి కాదు. అస్తిత్వవాద ఉద్యమాల నుండి. మన్నించండి. ఇంతకు మించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను.


Danny Notes
19 June 2013

ఏ ఉద్యమంలో అయినా అన్ని విధాలా భ్రష్టుపట్టిన పాలక వర్గం వుంటుంది. దానిమీద తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటుదార్లలో కుడి, ఎడమ, మధ్య వర్గాలుంటాయి. సాధారణంగా మధ్యవర్గాల చేతికి అధికారం వస్తుంది. ఆ తరువాత, మధ్యవర్గం, కుడివర్గంతో చేతులుకలిపి, ఎడమవర్గాన్ని క్రూరాతి క్రూరంగా అణిచివేస్తుంది.

తెలంగాణలో, నిజాం హయాంలో చనిపోయినవాళ్లకన్నా, పోలీస్ యాక్షన్ తరువాత జే‌ఎన్‌చౌధురి పాలనలో చనిపోయినవాళ్ళు ఎన్నో రెట్లు ఎక్కువ.

ఆంధ్రాప్రాంతంలోనూ అదే జరిగింది.  ఉదారవాదులు, భూస్వామ్యవర్గాలతో కలిసి. కమ్యూనిస్టుల్ని పట్టించారు. లేదా కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు.  లేదా, కమ్యునిస్టుల్ని కాంగ్రేసుగా  మార్చేశారు.

ఉద్యమాల్లో అసలు వర్గాలే వుండవని నమ్మే అమాయకులూ కొందరుంటారు. వాళ్ల విషయంలో మనం చేయగలిగింది ఏమీలేదు.


Danny Notes
19 June 2013

మనిషి, వ్యక్తి, సృజనాత్మక సాహిత్యం

సమాజంలో ఎప్పుడూ మనిషికీ వ్యక్తికీ ఒక ఘర్షణ వుంటుంది. మొత్తం పాలకవర్గాలు, ఇల్లు, బడి స్థాయి నుండి ప్రపంచ బ్యాంకు వరకు, నిరంతరం మనిషిని వ్యక్తిగా మార్చేస్తూ వుంటాయి. సృజనాత్మక సాహిత్యం వ్యక్తికి మనిషిని గుర్తు చేస్తూవుంటుంది.

Danny Notes
19 June 2013

మతాల సామాజిక దృక్పధాలు

        విభిన్న మతాల సామాజిక దృక్పధాలని తులనాత్మక పరిశీలన చేయాలంటే రెండు అంశాలని పరిగణణలోనికి తీసుకోవాలి. వీటిల్లో, మొదటిది ఆయా మతాలు ప్రకటించుకున్న పామాణిక గ్రంధాలు. రెండోది, చరిత్ర క్రమంలో ఆయా మత సామాజికవర్గాల ఆచరణలో వస్తున్న మార్పులు. ఈ రెండింటిలో మొదటిదానికన్నా రెండోదే కీలకం.

        హిందూ సామాజికవర్గం ఆచరణను పరిశీలించడానికి మనం గతంలోకి పెద్దగా ప్రయాణం చేయాల్సిన పనిలేదు. వర్తమానంలోనే అడుగడుగునా దానికి కొకోల్లలుగా ఉదాహరణలు కనిపిస్తాయి.

        "ఆంధ్రులంతా ఒక్కటే ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్రం. ఆంధ్రుల్ని సమైక్యంగా వుంచడానికి ప్రాణల్నైనా ఇస్తాం" అంటూ సమైక్యవాదులు గొంతు చించుకుంటున్న సమయంలోనే, గత ఏడాది జూన్ రెండవవారంలో, శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, లక్ష్మింపేటలో దళితుల మీద అతి క్రూరంగా దాడి జరిగింది. మరోవైపు,"తెలంగాణలో, కులాలులేవు, మతాలులేవు, వర్గాలులేవు, అందరిదీ ఒకే స్వప్నం, ఒకే స్వర్గం" అంటూ, పండితులు, పామరులు కూడా ఒకే రాగాలాపన చేస్తున్న సమయంలోనే, రాజధాని నగరానికి కూతవేటు దూరంలోవున్న, కీసర మండలం, రాంపల్లి దాయర గ్రామంలోని దళిత కాలనీపై పెత్తందారీ కులసామాజికవర్గానికి చెందినవారు దాడులు జరిపారు.

        రాంపల్లి దాయరలో దళితులపై దాడులు జరిపినవారు సీమాంధ్రులూ కారు. లక్ష్మింపేట దళితులపై దాడిచేసినవారు తెలంగాణవారూ కాదు. బలహీనవర్గాలపై పెత్తందారీ కులాలు సాగిస్తున్న అణిచివేతని ప్రాంతీయవాదాలు సహితం అడ్డుకోలేకపోయాయని చెప్పడానికి లక్ష్మింపేట, రాంపల్లి దాయర సంఘటనలు సజీవ ఉదాహరణలు. కులప్రసక్తి  వచ్చిందంటేనే అది హిందూ మతసామాజికవర్గమని ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. రెండు ప్రాంతాల్లోనూ,  ప్రాంతీయవాదం బలమైన అస్థిత్వంగా ముందుకు వచ్చిన సమయంలోనూ,  కుల అస్థిత్వం తన పని తాను చేసుకుని పోతోంది.


Danny Notes
19 June 2013

మతాల సామాజిక దృక్పధాలు

        ఇస్లాం కు మతగ్రంధం ఖురాన్. దానికి అనుబంధమైనది ప్రవక్త ముహమ్మద్ (స) జీవితాచరణ. దాన్నే హదీస్ అంటారు. హిందూ మతానికి వేదాలు. భగవద్గీత ప్రమాణిక గ్రంధాలైతే, రామయణ, భారతాలతోపాటూ మనుస్మృతికి కూడా మతగ్రంధాల స్థాయి వుంది.

        ఒకేమతానికి చెందిన భిన్న సమాజికవర్గాల మధ్య ఘర్షణలు జరగడం కొత్తేమీ కాదు. వాటికి రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక తదితర ’లౌకిక’ కారణాలు అనేకం వుండవచ్చు. ముస్లిం సమాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు  ఇరాన్ -ఇరాక్ యుధ్ధం ఒక ఉదాహరణ. పాకిస్తాన్ తో ఘర్షణపడి, యుధ్ధంచేసి ప్రత్యేక దేశంగా ఏర్పడింది బంగ్లాదేశ్.

        ఒకేమతానికి చెందిన భిన్న సమాజికవర్గాల విషయంలో ఇతర మతాలకూ, హిందూమతానికీ మధ్య రెండు కీలకమైన తేడాలున్నాయి. ఇతర మత సామాజికవర్గాల్లో ఈ విభజన సమమట్టంగా  (Horizontal  Stratification)  వుంటుంది. హిందూ మత సామాజికవర్గాల్లో ఈ విభజన నిలువు పొరలుగా  (Vertical Stratification)  వుంటుంది. సామాజిక అంతస్తుల దొంతరల్లో పైమెట్ల మీద వున్నవాళ్ళు, తమకన్నా కింది మెట్ల మీద వున్నవారిని సాంస్కృతికంగా తక్కువగా చూడడానికీ, వాళ్ల చేత శ్రమ చేయించుకోవడానీకీ, వాళ్లను అణిచివేయడానికీ సాంప్రదాయక హిందూసమాజంలో ధార్మిక సమర్ధన వుంది. ఇలాంటి ధార్మిక సమర్ధన ఇతర మతాల్లో కనిపించదు. ఈ అంశమే, భారత ఉపఖండంలో అనేక కొత్తమతాల అవిర్భావానికీ, మతాంతీకరణకీ దారితీశాయి.

        భారత రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ అతి పురాతన పార్టీ. ’గ్రాండ్ ఓల్డ్ పార్టి’లకు ఒక సావకాశం వుంటుంది. తమనుతాము వేరే పార్టీ వాళ్ళుగా  ప్రకటించుకున్నవాళ్ళుతప్ప దేశంలో మిగిలినవాళ్లందరూ తమపార్టీవాళ్ళే అనుకునే చెసులుబాటు ఆ పార్టీకి వుంటుంది. హిందూ నాయకులు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. దేశంలో "మిగిలినవాళ్లందరూ’ హిందువులే అంటుంటారు. అంటే, భారతీయులు మతపరంగా  రెండు రకాలు; హిందువులు, మాజీ హిందువులు. ఇది పసలేని వాదన అని నిరూపించడానికి ఎవరూ పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. బలహీనవర్గాలపై పెత్తందారీకులాలు ప్రతినిత్యం సాగించే దాడులే ఈ వాదనని ఖండిస్తూ వుంటాయి.


Danny Notes
19 June 2013


"అంరత్గత అణిచివేత" నింద నుండి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు కొందరు కృషిచేస్తున్నారు. మనుస్మృతి, భారతం, భగవద్గీత,  రామాయణం, వేదాలకన్నా ముందే భారత ఉపఖండంలో సనాతన ధర్మం అనేది ఒకటి వుండేదనీ, అదే వాస్తమైన హిందూ ధర్మం అనేది వీరు ముందుకు తెస్తున్నవాదం. ఈ రకం వాదనల్లో బలంకన్నా బలహీనతే ఎక్కువగా వుంది. వేదకాలం నుండి ఇప్పటి వరకు, బలహీనవర్గాలపై కులం, మతం పేరున సాగిన, సాగుతున్న అణిచివేత సామాజిక మహా తప్పిదమని వీరు గుర్తిస్తున్నట్టున్నారు. ఈ మహాతప్పిదాన్ని పైనుండయినా, కింది నుండయినా ఎలా సరిదిద్దుతారారనేది మన ముందున్న ప్రశ్న.


Danny Notes
20 June 2013

        ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజంలో పెత్తందారీ, దళిత కులాల మధ్య అంతరం కనిపిస్తుంది. ఇది క్రైస్తవ మతాచారం మాత్రం కాదు; క్రైస్తవ సమాజంలో కొనసాగుతున్న హిందూ ఆచారం. క్రైస్తవ దేశాలు, జాతులు హోరాహోరీగా తలపడిన సందర్భాలున్నాయి. రెండవ ప్రపంచ యుధ్ధమే దానికి పెద్ద ఉదాహరణ. కానీ, అవి ధార్మిక యుధ్ధాలుకావు; లౌకిక యుధ్ధాలు.

        వృత్తి వేరు, కులం వేరు, వృత్తి తాత్కాలికమైనది. కులం శాశ్వితమైనది. అన్ని మతాల్లోనూ వృత్తులు వుంటాయి. కులం హిందూ మతంలోనే వుంటుంది. హిందూ మతం నిజానికి మతం కాదు స్థిరపడిన కులవ్యవస్థ.    


Danny Notes
20 June 2013

ఆలూరి భుజంగరావుగారికి జోహార్లు

        ప్రముఖ రచయిత, సుప్రసిధ్ధ అనువాదకుడు ఆలూరి భుజంగ రావుగారు చనిపోయారని ఇప్పుడే ఫోన్ వచ్చింది.

        విప్లవ రచయితల సంఘం కృష్ణా, వుభయ గోదావరి జిల్లాల యూనిట్ ఒక వెలుగు వెలిగిన కాలంలో భుజంగారావుగారు అందులో సీనియర్ సభ్యులు. మరో ప్రముఖ రచయిత శారద గారికి భుజంగరావుగారు ఆత్మీయ మిత్రులు.

        అత్యంత నిరాడంబరులైన భుజంగరావుగారి రచనలు కూడా అత్యంత నిరాడంబరంగా వుంటాయి. రాహుల్ సాంస్కృత్యాయన్ రచనల్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత వారికి దక్కుతుంది.

        భుజంగరావుగారు కొత్త తరాలతో కూడా ఆత్మీయంగా వుండేవారు. అప్పట్లో, విరసం యూనిట్ బాధ్యునిగా వున్న నేను నిరంతరం సమయాభావంతో సతమతమయ్యే వాడిని. కొన్ని సందర్భాల్లో, వారి రచనల రాతప్రతుల్ని పరిశీలించడానికి, తగినంత సమయాన్ని కేటాయించ లేకపోయేవాడ్ని. ఆ మేరకు వారికి నా మీద కొంచెం కినుక వుండేది. దాన్ని వారు తన ఆట్మకథలోనూ రాసుకున్నారని విన్నాను.  నేను నిస్సహాయుడ్ని. దానికి క్షంతవ్యుడ్ని!

        భుజంగరావుగారికి విప్లవ జోహార్లు!   

Danny Notes
June 21, 2013  
మనుషులు ప్రకృతితో మాట్లాడడం  జానపద సాహిత్యంలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరైనా, చెట్లు, జంతువులు, రాళ్ళు, యంత్రాలతో మాట్లాడుతుంటే వాళ్ళను మన వైద్యనిపుణులు మానసికరోగులు అంటారు. మాట్లాడడానికి సాటి మనిషి దొరకనపుడు మనుషులు నిజంగానే యంత్రాలతో ముచ్చటించుకుంటారు. అది యంత్రయుగపు విషాదం మాత్రమే కాదు; కొందరికి అనివార్యమైన నిట్టూర్పు కూడా!

Danny Notes
22 June 2013

Dear Face Book Friends!

నా వాల్ లో ఫ్రెండ్స్ సంఖ్య మూడు వేలకు చేరుకుంది, నా బ్లాగ్ పేజ్ వ్యూస్ కూడా మూడువేలకు చేరుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలని మీ దృష్టికి తీసుకు రావలసిన అవసరం వుంది.
మనం ఏదో ఒక కార్యక్రమం అనుకుని ఫ్రెండ్స్ అయిన వాళ్లంకాము. కానీ, నాకు ఒక కార్యక్రమంవుంది.  Sociology, Philosophy, Politics, History, Literature, Culture, Weaker Sections Fraternity and not the least Food &  Health
 ఇవీ నాకు ఆసక్తివున్న అంశాలు. వీటి మీద వ్యాసాలు రాయడానికి తయారుచేసుకునే నోట్స్ ను నేను ఫేస్ బుక్ లో పెడుతుంటాను. నా నోట్స్ మీద మిత్రులు చేసే కామెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. నా నోట్స్ మీద వచ్చే ప్రతికూల  కామెంట్స్ ను మరింత శ్రధ్ధగా చదువుతాను. నేను రాసే వ్యాసాలు మరింత సమగ్రంగా వుండడానికి ఇవి దోహద పడతాయి.  

Danny Notes
22 June 2013

ఉత్తరాఖండ్ బాధితులు

ఉత్తరాఖండ్ వార్తలు వింటుంటే, చూస్తుంటే, ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కడుపు తరుక్కుపోతోంది.  గుండెను ఎవరో పిండుతున్నట్టుగా వుంది ఇది ప్రకృతి వైపరీత్యమో, మానవ తప్పిదమో ఇప్పటికి తేలీదుగానీ, వేలాది యాత్రికులు, స్థానికులు చనిపోయారు. జాతీయ విపత్తు అంటే ఇంతకన్నా ఇంకొకటి వుంటుందా? బాధితుల్ని ఆదుకోవడానికి మనం చేయగలిగిన సహాయం  చేద్దాం. రేపటిలోగా ఆహారం అందక పోతే మరికొన్ని వేల మంది చనిపొతారట! చాలా బాధగా వుంది. వాళ్లను బతికించడానికి మనం ఏమీ చేయలేమా?

        ఏ మతాన్ని విశ్వసించేవారైనా భక్తులు సున్నిత మనస్కులు, అమాయకులు, తమ కష్టాల నుండి దేవుడు గట్టేక్కిస్తాడని నమ్మేవాళ్ళు.  

Danny Notes
22 June 2013  

తమ్ముడూ కమలాపతి రావు!
అష్టదరిద్రాల గురించి నీ వ్యాఖ్యానాలు బాధ్యతతో చేసినవికావు. కేవలం అపహాస్యం దృష్టితో రాశావు. ప్రతిదాన్నీ ఖండించడానికి ఇది సమయంకాదు. కానీ, ఒక్కదాన్నయినా నీ దృష్టికి తీసుకు రావడం నా బాధ్యత. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకుల్లో అత్యధికులు క్రెడిట్ కార్డుల మూలంగా అప్పులపాలైపోయినవాళ్ళే! అసలు క్రెడిట్ కార్డుల పుట్టుకే ప్రపంచాన్ని అప్పుల బోనులోనికి లాక్కొనిరావడం. 

Danny Notes
23 June 2013

ఇది ప్రభుత్వం జరిపిన మారణకాండ.

        ప్రభుత్వాని తిరస్కరించేవాళ్ళను అరాచకకులు అంటారు. ప్రజలమీద బాధ్యతలేని ప్రభుత్వాల్ని ఏమనాలి?.

        ఎండాకాలం నదులు ఎండిపోతాయి, వర్షాకాలం వదరలొస్తాయి అని అందరికీ తెలుసు. వరదలొచ్చినపుడు నీళ్ళు దాచిపెట్టి, ఎండాకాలం  నీళ్ళు అందిచే వ్యవస్థను నిర్వహించడానికే ప్రజలకు ప్రభుత్వం కావాలి.  ప్రభుత్వం ఆ పని చేయకపోతే, ఆ ప్రభుత్వం ప్రజలకు మాత్రం  దేనికీ?

        ఉత్తరాఖండ్ లో, గంగా, యమున ఎగువ పరివాహక ప్రాంతాల్లో, గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు పడ్డాయి. అంతటి వర్షాలు కురిసినపుడు మూడునాలుగు రోజుల్లో ఏమవుతుందో అందరికీ తెలుసు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అవేమీ పట్టలేదు. ఫలితంగా వేలాది మంది చనిపోయారు. ఇది ప్రభుత్వం జరిపిన మారణకాండ.

        మూడువారాల క్రితం గోదావరి నదిలో చుక్కనీరు లేదు, నైరుతీ రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేక నదీపరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి, నదికి వరద వచ్చింది. గోదావరి డెల్టా కాలువలకు వదిలింది నాలుగు వేల క్యుసెక్కుల చొప్పున. సముద్రానికి వదిలింది నాలుగు లక్షల క్యుసెక్కుల చొప్పున. వారం రోజులు "శిశువుకు దక్కని తల్లి స్థన్యంలా ప్రవహించింది" గోదావరి. వారంలోగా మళ్ళీ గోదావరిలో నీటికి కటకట. ఈ మాత్రం దానికి ప్రభుత్వం దేనికీ?

        ప్రజలు ఎవరికివాళ్ళు చేసుకోలేని సమిష్టి పనుల్ని చేసిపెట్టడానికే ఏ వ్యవస్థకయినా ఒక పాలనా యంత్రాంగాం కావాలీ. ఆ పని చేయనపుడు ప్రభుత్వాలు దేనికీ?  ఎన్నికలు దేనికీ? పార్లమెంటరీ వ్యవస్థ దేనికీ?

Danny Notes
23 June 2013

నాగళ్ల పండగ

ఈ రోజు పౌర్ణమి.  వర్షాకాలం మొదలయ్యాక తొలిపౌర్ణమి. వ్యవసాయ కార్మికులకు నూతన సంవత్సరం. వర్షాలు భారీగా కురవాలనీ, పంటలు పుష్టిగా పండాలనీ, పండించినవాళ్ల కష్టానికి మంచి ప్రతిఫలం రావాలని కోరుకుందాం.


Danny Notes
23 June 2013

ప్రజాస్వామ్యానికి కాలం చెల్లిందా?

శాసనసభ జరగదు. జరపాలని పాలకవర్గం అనుకోదు. జరగనిద్దామని ప్రతిపక్షాలు అనుకోవు. రాష్ట్ర బడ్జెట్ మూజువాణీ ఓటుతో మమా అనిపించారు.

        వ్యవసాయ సంవత్సరం మొదలయ్యింది రైతులకు కావల్సిన విత్తనాలు వుండవు, ఎరువుల సరఫర వుండదు. నీళ్ళు సరేసరి దైవాధీనం. స్కూళ్ళు తెరిచారు. పాఠ్యపుస్తకాలు వుండవు.

        ఇంతకీ, మనం ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? స్కాములు నడపడంతప్పా?

        స్కాములకు పార్టీలు వుండవు. స్కాములు నడపని పార్టీలు వుండవు. ప్రజాస్వామ్యానికి కాలం చెల్లిందనడానికి ఇంతకన్నా రుజువులు కావాలా? 

Danny Notes
23 June 2013

ఎన్నికల బహిష్కరణ సరిపోదు

        నేను, నా భార్య ఎప్పుడూ ఎన్నికల్లో ఓటు వేయలేదు. కనీసం ఓటర్ల జాబితాలో పేరు కూడా నమోదు చేసుకోలేదు. పార్లమెంటరీ వ్యవస్థ మీద నాకు ఇసుమంతైనా నమ్మకం లేదు. ఇలాంటి అభిప్రాయం మాలాంటి కొందరికే వుందేమో అనుకునేవాడిని. ఏకంగా ప్రధానీ, కేంద్ర మంత్రులకు కూడా ఇదే అభిప్రాయం వుందని తెలిసి ఆశ్చర్యపోయా! 

        "మీ ప్రభుత్వంలో స్కాములు ఎందుకు జరిగాయి?" అని ప్రధానిని అడిగితే "సంకీర్ణ ప్రభుత్వాల్లో అధినేతలకు కొన్ని అంతర్గత బాధ్యతలు  (Obligations)   వుంటాయి" అన్నారు మన ప్రధాని; అక్కడికి సంకీర్ణ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసి ప్రజలు తప్పుచేసినట్టు. గతంలో ఎన్డీయే హయాంలో బీజేపి నేతలు కూడా ఈ మాటే అనేవారు.

        సంకీర్ణ ప్రభుత్వాల్ని ప్రజలు ఏర్పాటు చేయరు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన రాజకీయ పార్టీలే సంకీర్ణ ప్రభుత్వాలుగా ఏర్పడతాయి.

        చమురు కంపెనీల వత్తిళ్ళకు లోబడే క్రూడాయిల్ ను దిగుఇమతి చేసుకోవాల్సి వస్తున్నదని పెటోలియశాఖా మంత్రి వీరప్ప మొయిలీ అంటున్నారు. తననే కాకుండా తనకన్నా ముందు పనిచేసిన పెట్రోలియం మంత్రులపై కూడా చమురు కంపెనీలు వత్తిడి తేచ్చేవని ఆయన అంటున్నారు.

Danny Notes
23 June 2013

కాంగ్రెస్- బీజేపిల జంటపాపం

        ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక గడిచిన పదమూడు సంవత్సరాల్లో, కాంగ్రెస్, బీజేపి చెరో ఆరున్నరేళ్ళు ఆ రాష్ట్రాన్ని పాలించాయి. అభివృధ్ధ్ది పేరిట ఆ రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి రెండు పార్టీలూ సమాన  దోషులే.

        ఉత్తరాఖండ్ లో పధ్నాలుగు నదీలోయలున్నాయి. వీటిల్లో ఏకంగా రెండు వందలకుపైగా విద్యుత్తు, మైనింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో వున్నాయి.  గంగానది ఉపనదులైన అలకనంద, మందాకిని నదులపై డెభ్భయికి పైగా జల విద్యుత్కేంద్రాలు నిర్మించతలపెట్టారు. ఇందులో, నది ప్రవాహ మార్గాన్ని దారిమళ్ళించే ప్రాజెక్టులు, సొరంగాలు తవ్వి కొండల్ని దాటించే ప్రాజెక్టులు ఉన్నాయి.   దీన్ని బట్టి ఉత్తరాఖండ్ లోయల్లో, కొండల్లో ఎంతటి విధ్వంసం జరుగుతోందో సులభంగా ఊహించవచ్చు.

        మొన్నటి వరద వుధృతికి కేదారనాధుడి ఆలయం ఒక్కటి తప్ప ఆ ఆలయ ప్రాంగణం, పరిసరాలు మొత్తం నాశనం అయిపోయాయి. వరదకు జగద్గురు ఆదిశంకరాచార్యుని సమాధి కొట్టుకుపోయింది అలకానంద హైడల్ పవర్ కంపెనీ లిమిటెడ్ అయితే, నిర్మాణపు పనుల్లో మరీ బరితెగించింది. ఇది జీవీకే హైడల్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ. ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఏకంగా ఉత్తరాఖండ్ క్షేత్రపాలకురాలుగా భావించే, ధారీదేవీ ఆలయంలో మూలవిరాట్టునే తవ్వి తరలించేసింది. గత ఏడాది అస్సీ గంగా హైడల్ ప్రాజెక్టు ఉత్తర కాశీలో ఉత్పాతాన్ని సృష్టించింది.

        హైదరాబాద్ చార్మీనార్ పక్కన అంతగా ప్రాధాన్యంలేని ఒక చిన్న గుడి విషయంలో భుమ్యాకాశాల్ని ఏకం చేసేసిన సంఘ్ పరివారం, కేదారనాద్, ధారీదేవీ వంటి సుప్రసిధ్ధ ఆలయల విషయంలో ఎందుకు మౌనంగా వుందనేది ఎవరికైనా రావల్సిన సందేహమే! దానికి  మనకు ఒకటే కారణం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ లో జల విద్యుత్కేంద్రాల్ని నిర్మిస్తున్న వందలాది  ప్రైవేటు నిర్మాణసంస్థల్లో ఒక్కటీ ముస్లింలది కాదు!. కాంట్రాక్టర్లు, భక్తులు ఒకే మతస్తులు!

        సంఘ్ పరివారానికి భక్తి తక్కువ రాజకీయ ఆసక్తి ఎక్కువ అనడానికి ఇది ఒక ఉదాహరణ.

        విచిత్రం ఏమంటే, జూన్ మొదటి వారంలో, కేదార్ వ్యాలిని సందర్శించిన పూరి పీఠాధిపతి స్వామీ నిశ్చలానంద సరస్వతి, గంగానది అంతరించిపొతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగానది విషాదానికి కాంగ్రెస్, బీజేపీల్ని సంయుక్త బాధ్యులుగా స్వామీజీ పేర్కొన్నారు.

Danny Notes
24 June 2013

మతం అనేది ప్రకృతి మీద మనుషుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మతతత్వం అనేది, స్వమత పెట్టుబడిదారులకు లాభాల్నీ అర్జించిపెడుతూ, పరమత పోటీదారులపై అణిచివేతనీ పురికొల్పే సాధనం. మొదటిది ఆధ్యాత్మికం, రెండోది ఆర్ధికం. ఒకటి వ్యక్తిగతం; మరొకటి రాజకీయం. మతం అలౌకికం; మతతత్వం లౌకికం.


Danny Notes
24 June 2013

నాకు దేవుని మీద విశ్వాసం వుంది. ఇతర దేవుళ్లని నమ్మే ఇతర మతస్తుల మీద గౌరవమూ వుంది. కానీ, ఏ మతసామాజికవర్గంలో అయినా మతతత్త్వాన్ని నేను అంగీకరించలేను; వాళ్ళు ముస్లిములయినా, హిందువులయినా.

Danny Notes
25 June 2013
అజూబకు జన్మదిన శుభాకాంక్షలు

ఈరోజు అజూబ (బాలగోపాల్, వసంతల కొడుకు) పుట్టినరోజు. పాత మిత్రులతో ఒక సాయంకాలం గడపడానికి ఒక అవకాశం. నగరజీవితంలో నలుగురు ఆత్మీయులు కలవడానికి కూడా ఒక సందర్భం కావాలి. ఆత్మీయులు ఏడాదికి రెండుసార్లు, ఒకటి ఇంగ్లీషు క్యాలండరు ప్రకారం, ఇంకొకటి తెలుగు క్యాలెండరు ప్రకారం, పుట్టిన రోజు జరుపుకుంటే ఎంత బాగుంటుందీ!!

అజూబా! జన్మదిన శుభాకాంక్షలు!

Danny Notes
26 June 2013

’మెగా’ ఆఫర్

ఉత్తరఖండ్ ఘరవాల్ ప్రాంతంలో జలవిద్యుత్కేంద్రాలకు భారీ గిరాకి వుందట. మెగావాట్టు వ్యవస్థాపక స్తోమతగల ప్రాజెక్టుకు లైసెన్సు ఇవ్వడానికి కోటి రూపాయలు తీసుకుంటారట అక్కడి ప్రభుత్వ పెద్దలు. ఘరవాల్ ప్రాంతంలో గడిచిన పదేళ్ల కాలంలో  నాలుగువేల  మెగావాట్ల స్థోమత గల ప్రాజెక్టులు నెలకొన్నాయి. అంటే, నాలుగు వేల కోట్ల రూపాయల "క్విడ్ ప్రోకో" చేతులు మారిందని అర్ధం.

Danny Notes
27 June 2013

పరిచయ వాక్యాలకేతప్ప, పరిశోధన వ్యాసాలకు ప్రధాన స్రవంతి వార్తా పత్రికల్లో అవకాశాలు తక్కువ. వార్తాపత్రికల సాహిత్య పేజీల్లో, స్థలాభావం ఒక ఇబ్బంది అయితే, పత్రికల పాలసీ, పేజీ ఇన్ చార్జీల ఇష్టాయిష్ఠాలు అన్నీ కలిసి లోతైన సాహిత్య విమర్శకు స్థానం లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో సారంగ ఇ-మ్యాగజైన్ ఒక ఉపశమనాన్ని ఇస్తోంది.  సారంగ నిర్వాహకులకు ధన్యవాదాలు.


 Danny Notes
27 June 2013

వట్టికోట ఆళ్వారు స్వామి : తెలంగాణాలో భిన్న అస్థిత్వాలు

వట్టికోట ఆళ్వారు స్వామి ’జైలు కథలు’ సంపుటంపై, సారంగలో, సంగిశెట్టి శ్రీనివాస్ సామాజిక విశ్లేషణ వ్యాసాన్ని ఇప్పుడే చదివా. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ దొరలకు నాయకత్వాన్ని అప్పచెప్పడానికి ఉవ్విళ్ళూరుతున్నవాళ్ళు, దొరల గత కాలపు దౌర్జన్యాలన్నింటినీ ’తేరగా దొరికిన’ నిజాం నవాబు మీద గెంటేసి చేతులు దులుపుకుంటున్నారు. వట్టికోట ఆళ్వారుస్వామి అన్ని విధాలా ’ప్రజలమనిషి’. నిజాం సంస్థానంలో ఎన్నిరకాల అస్థిత్వాలు  పనిచేశాయో చాలా విపులంగా సాహిత్యంలో నమోదు చేశారు. వారి కథల్లో, దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, అధికారులు, ఇతర దోపిడీదారుల ఆగడాల గురించి వున్నంతగా, ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్న నిజాం నిరంకుశత్వం గురించి వుండదు. నిజానికి, నిజాం గురించి రెండు మంచి మాటలే వుంటాయి; అతను ఉరికి వ్యతిరేకి వంటి సందర్భాల్లో.

        పోరాటంలో అనేక అస్థిత్వాలు పనిచేసినప్పటికీ ఫలితాలు మాత్రం, రాజకీయంగా  కాంగ్రెస్ ముసుగులోవున్న ఆర్యసమాజ్ కు దక్కింది; ఆర్ధికంగా దొరలు, పటేళ్ళ ఆధిపత్యం మునపటికన్నా బలపడింది. ఈ గుణపాఠాన్ని వర్తమాన తెలంగాణ ఆందోళనకారులు ఏ మేరకు నేర్చుకుంటే అంత మెరుగైన ఫలితాలుంటాయి. లేకుంటే, చరిత్ర పునరావృతమౌతుంది; మరింత విషాదంగా.

        వర్తమాన తెలంగాణ ఉద్యమంలో ముస్లింల అస్థిత్వం గురించి ఆందోళన పడుతూ నేను ఇటీవల అనేక వ్యాసాలు రాశాను. అవన్నీ, చారిత్రక పత్రాలు, రాజకీయార్ధిక అంశాల మీద ఆధారపడి రాసినవి మాత్రమే.  అయితే,  కథల సంపుటి నుండి నాటి తెలంగాణ సమాజాన్ని ఆవిష్కరించడానికి  సంగిశెట్టి శ్రీనివాస్ చేసిన ప్రయత్నం చాలా ప్రతిభావంతంగావుంది. వారికి అభినందనలు.

No comments:

Post a Comment