Wednesday 3 July 2013

Faiz Ahmad Faiz and Noor Jehan

పాటకాదు ఉద్యమం

Faiz Ahmad Faiz - 3
Faiz Ahmad Faiz – 3
“ముఝ్ సే పహిలీసి ముహబ్బత్””
పాటకాదు ఉద్యమం
ఏ.యం. ఖాన్ యజ్దాని (డానీ)
         ఉర్దూ, పారశీ సాంప్రదాయ భావకవిత్వంలో  సౌందర్యం, శృంగారాలకు పెద్ద పీట వేసేవారు. కవిత్వంలో పాత సాంప్రదాయాల్ని కొనసాగిస్తూనే, మానవత్వం, న్యాయం అనే మరో రెండు అంశాల్ని బలంగా చేర్చి, విప్లవ భావుకతకు పునాదులు వేసిన వాళ్లలో ఫైజ్ అహ్మద్ ఫైజ్  మొదటి తరంవాడు.
1930లలో ఆరంభమైన అంజుమన్ తరఖ్ఖీ పసంద్ ముస్సనఫీన్ – ఏ-హింద్ (అఖిల భారత అభ్యుదయ రచయితల ఉద్యమం) ప్రముఖుల్లో ఒకడైన ఫైజ్, దేశవిబజన తరువాత పాకిస్తాన్ వామపక్ష ఉద్యమంలో కీలకంగా మారాడు. నాటి ప్రముఖ దినపత్రిక పాకిస్తాన్ టైమ్స్ కు సంపాదకుడిగావుంటూ కమ్యూనిస్టులకు గట్టి నైతిక మద్దతు ఇచ్చాడు. తాము కలలుగన్న స్వాతంత్రం  ఇది కాదని బాహాటంగానే కవితలు రాసి ప్రచురించేవాడు. ”ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ మెరే మెహబూబ్ నా మాంగ్” శీర్షికతో రాసిన గజల్ ఈ కాలంలో వచ్చిందే. ” ప్రియతమా! అలనాటి ప్రేమను ఇప్పుడు నా నుండి ఆశించకు. ఈ ప్రపంచంలో ప్రేమకన్నా విషాదమే వేగంగా విస్తరిస్తోంది. వీధుల్లో, విపణుల్లో, అన్నిచోట్లా మానవశరీరాల అమ్మకం సాగుతోంది. ఎక్కడ చూసినా మట్టికొట్టుకుపోయిన దేహాలు.  రక్తం ఓడుతున్న మనుషులు. ” అంటూ  సాగుతుంది ఆ కవిత.
వలస పాలన నుండి స్వాతంత్రం రాగానే, ఇటు భారతదేశంలో జరిగినట్టే, అటు పాకిస్తాన్ లోనూ  కమ్యూనిస్టులపై తీవ్రనిర్బంధం సాగింది. సయ్యద్ సజ్జాద్ జహీర్ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ పాకిస్తాన్  కార్యకర్తల్ని, అభిమానుల్ని నాటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది.
Faiz Ahmad Faiz -1
Faiz Ahmad Faiz -1
మరోవైపు, సైనిక కుట్రతో లియాఖత్ అలీ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అప్పటి  పాకిస్తాన్ మేజర్ జనరల్ ముహమ్మద్ అక్బర్ ఖాన్ ఒక పథకాన్ని రచించాడు. అతని భార్య నసీమ్ సాహిత్యాభిమాని. నాటి ఉర్దూ, పంజాబీ, సింధీ కవులు, కళాకారులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు వుండేవి. సైనిక కుట్రకు సహకరించాలని ఆమె సజ్జాద్ జహీర్, ఫైజ్ లను కోరింది.
తాను అధికారాన్ని చేపడితే, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని నిలిపివేస్తాననీ, వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని, పార్లమెంటులో ప్రవేశించే అవకాశం కల్పిస్తానని అక్బర్ ఖాన్ వాగ్దానం చేశాడు. 1951 ఫిబ్రవరి 23న జరిగిన ఓ రహాస్య సమావేశంలో అక్బర్ ఖాన్ ప్రతిపాదనని కమ్యూనిస్టు అగ్రనేతలు  అంగీకరించారు. ప్రధాని రావల్పిండి పర్యటన సందర్భంగా ప్రభుత్వాన్ని కూల్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే, ఈ రహాస్యం ముందుగానే  బయటికి పోక్కిపోయింది. ’రావల్పిండి కుట్ర కేసు’ గా ప్రసిధ్ధి చెందిన ఈ సంఘటనలో ఫైజ్ తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం మోపి ప్రత్యేక జైళ్లలో బంధించారు.
Noor Jehan -2
Noor Jehan -2
ఈ సమయంలో, ప్రఖ్యాత గాయని, సంగీత విద్వాంసురాలు  నూర్జహాన్ ”ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ మెరే మెహబూబ్ నా మాంగ్” కవితకు, స్వరం కూర్చి పాటగా మార్చారు. ఇలా ఒక కవితకు స్వరాన్ని కూర్చి పాటగా పాడడాన్ని తర్రన్నుమ్ అంటారు.  అప్పట్లో, పాకిస్తాన్ లో ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించేది.
నిజానికి నూర్జహాన్, ఫైజ్ ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందినవాళ్ళు. నూర్జహాన్ స్వంతూరు కసూర్ అయితే, ఫైజ్ ది సియాల్ కోట్. ఇద్దరూ పశ్చిమ పంజాబ్ లోని తూర్పు ప్రాంతంలో పుట్టారు. అయినా, వాళ్ల మధ్య అప్పటికి ప్రత్యక్ష పరిచయం లేదు. నూర్జహాన్ సాహిత్యాభిమాని.  అందులో ఫైజ్ కవితలంటే ఆమెకు మహాఇష్టం. గాత్ర కచేరీల్ని ఆమె ”ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ ..” పాటతోనే ఆరంభించేది; శ్రోతల కోరికమేరకు ఆ పాటతోనే ముగించేది.
1955 మార్చి నెలలో పాక్  ప్రభుత్వం ముహమ్మద్ అలీ జిన్నా సంక్షేమ నిధి కోసం  ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో,  నూర్జహాన్ గాత్ర సంగీతం ప్రధాన అకర్షణ. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు, కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి,  ఆమె పాడబోయే పాటల జాబిత   ఇవ్వాలని అడిగారు. ఆమె వెంటనే ఓ పది పాటల జబితా రాసి ఇచ్చింది. వాటిల్లో మొదటి పాటే,  ”ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ ..”! అది చూసి అధికారులు హతాశులయ్యారు.  ”దేశద్రోహ నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి రాసిన పాటల్ని బహిరంగంగా పాడడమే నేరం.  అందులోనూ కేంద్ర ప్రభుత్వ వేదిక మీద  పాడడం మరీ నేరం!. 
Noor Jehan - 3
Noor Jehan – 3
పాకిస్తాన్ వ్యవస్థాపకుడికి నివాళులు అర్పించే సమయంలో, దేశం అధ్వాహ్నంగా ఏడుస్తోంది అంటూ పాడితే, పర్యావసానాలు తీవ్రంగా వుంటా”యని ప్రధానమంత్రి దూతలు ఆమెను గట్టిగానే హెచ్చరించారు.  అయినా,  నూర్జహాన్ వాళ్ల హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు. ”ఫైజ్ పాట పాడవద్దంటే నేను ఈరోజు ఏ పాటా పాడను.  మీ దగ్గర డబ్బుల కోసం  నేను పాడడంలేదు. నా పాటల్లో  జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు. జాతిపితకు నివాళులు అర్పించే కార్యక్రమంలో స్వచ్చందంగా పాడడానికి వచ్చాను. వద్దంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను” అని కరాఖండిగా చెప్పింది.
ఆనాడు ఇండియా, పాకిస్తాన్ లలోనేకాక,  ప్రపంచవ్యాప్తంగా ఫైజ్ , నూర్జహాన్ లకు అభిమానులున్నారు. వివాదాన్ని అంతకన్నా సాగదీస్తే  ప్రపంచ వేదికల మీద అప్రతిష్ట వస్తుందని ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  ఆ సాయంత్రం నూర్జహాన్  ”ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ ..” పాట అందుకోగానే మైదానంలోవున్న వేలాది (బహుశ లక్షలాది) మంది  ప్రేక్షకులు గౌరవ సూచకంగా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కరతాళధ్వనులతో ఫైజ్ మీద అభిమానాన్నీ, నూర్జహాన్ ధైర్య సాహసాల మీద ప్రశంసల్ని కురిపించారు.
Faiz Ahmad Faiz - 2
Faiz Ahmad Faiz – 2
ప్రజల్లో ఫైజ్ మీదున్న అభిమానాన్ని చూసి ప్రభుత్వం భయపడిందో ఏమోగానీ, వారం రోజులు తిరక్కుండానే ఆయన్ని  విడుదల చేసింది.  రైలు దిగి, తిన్నగా నూర్జహాన్ ఇంటికి వెళ్ళి, తలుపు తట్టాడు ఫైజ్.  అప్పుడు సమయం తెల్లవారుజామున రెండు గంటలు. ఎవరో ఫైజ్ వచ్చారని పనిమనిషి వెళ్ళి నూర్జహాన్ ను నిద్రలేపింది. వచ్చిన వ్యక్తి  ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని తెలిసి నూర్జహాన్ వున్నఫళంగా పరుగున వెళ్ళి ఆలింగనం చేసుకుంది. ఇంట్లోకి రమ్మన్నా ఫైజ్ రాలేదు. ”నిన్ను అభినందించడానికి వచ్చాను. నన్నూ, నా పాటను ప్రజల్లో సజీవంగా వుంచావు. దానికోసం, ప్రభుత్వంతో పోరుకు సహితం తలపడ్డ నీ ధైర్యసాహసాలను ఎంత మెచ్చుకున్నా తక్కువే” అని  చెప్పి గుమ్మంలో నుండే వెళ్ళిపోయాడు.
విశేషం ఏమంటే, అంతటి సుప్రసిధ్ధ గజల్ ను ఫైజ్ ఆ తరువాత ఎప్పుడూ, ఎక్కడా పాడలేదు. ముషాయిరాల్లో అభిమానులు వత్తిడి తెచ్చినా సుతారంగా నిరాకరించేవాడు. ”ఆ గజల్ మీద సర్వహక్కుల్ని నూర్జహాన్ పోరాడి సాధించుకుంది. అది ఇప్పుడు నాదికాదు.  నూర్జహాన్ ది” అనేవాడు.
1961లో వచ్చిన మీర్జా గాలిబ్ సినిమా తరువాత నూర్జహాన్ నటించడం మానేసి, గాత్ర సంగీతానికే అంకితమైపోయింది.  నూర్జహాన్ పాడిన ”ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ ..” పాట 1962లో వచ్చిన ’ఖైదీ’ సినిమాలో వెండితెరకెక్కింది.
Noor Jehan - 2
Noor Jehan – 2
జుల్ఫికర్ అలీ భుట్టో కాలంలో ఫైజ్ కొన్నాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి  సాంస్కృతిక సలహాదారుగా వున్నాడు. అయితే, 1978లో మేజర్ జనరల్ జియా ఉల్ హక్ సైనిక తిరుగుబాటుతో రాజ్యాధికారాన్ని చేపట్టి, మాజీ ప్రధాని భుట్టోను ఉరి తీయడంతో, ఫైజ్ కవిత్వం, నూర్జహాన్ సంగీతం మళ్ళీ నిర్బంధానికి గురయ్యాయి.  ఫైజ్ లెబనాన్ రాజధాని బీరుట్  లో అజ్ఞాతవాసం గడిపాడు. మూడేళ్ల తరువాత స్వదేశానికి  తిరిగివచ్చిన ఫైజ్, మరో రెండేళ్లలోనే కన్నుమూశాడు. ఆ తరువాత కూడా నూర్జహాన్ సంగీత ప్రపంచంలో తన సహజ సిధ్ధమైన మొండితనాన్ని కొనసాగించింది. నూర్జహాన్ సంగీత ప్రభంజనానికి భయపడి, దేశంలో ఏకంగా సంగీత కచేరీలనే నిషేధించే వరకు పోయాడు జియా.
కాలం ఒక చిత్రమైన న్యాయమూర్తి. జియా ఉల్ హక్ విధించిన నిర్బంధకాలంలో  ఫైజ్ చనిపోయాడు!. నియంత జియా అర్దంతరపు చావును నూర్జహాన్ చూసింది!! చివరి వరకు సంగీత సామ్రాజ్యాన్ని యేలిన  ఆ ప్రజాగాయని 2000లో సగర్వంగా   చనిపోయింది.
404, స్కిల్ ప్రెసిడెన్సీ
హైదరాబాద్
27 మార్చి 2011

(ఆదివారం ఆధ్రజ్యోతి మార్చి- 27, 2011 సంచికలో పాశం యాదగిరి వ్యాసం ’ఫైర్ అహ్మద్ ఫైర్’ చదివినప్పుడు గుర్తుకొచ్చిన కొన్ని వివరాలను పంచుకోవాలనిపించింది.)

ప్రచురణ : ఆదివారం ఆధ్రజ్యోతి,  ఏప్రిల్, 2011

No comments:

Post a Comment