Monday 30 September 2013

రాయలాంధ్రకు నాయకులు కావలెను!!

రాయలాంధ్రకు నాయకులు కావలెను!! 
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

                                    ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదనేవాళ్ళు ఇంకా ఏవరైనా వుంటే వాళ్ళు బొత్తిగా అమాయకులైనా అయివుండాలి, పచ్చి అబధ్ధాలకోరులు అయినా అయివుండాలి.

        ఇటు తెలంగాణలో అయినా, అటూ రాయలాంధ్రలో అయినా ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడేవాళ్ళే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాస్తవ పరిస్థితుల్ని సరిగ్గా అర్ధంచేసుకుని, తమను నమ్ముకున్న ప్రజలు ఆశించే ఫలితాల దిశగా శ్రేణుల్ని నడపగల నాయకులు కనిపించడంలేదు. నాయకులుకానినాయకులు ఆడుతున్న కౄరపరిహాసంలో రాయలాంధ్ర ప్రజలు మరింతగా మోసపోతున్నారు.

        నాయకుడులేక భావోద్వేగాలు మాత్రమే చెలరేగిపొతే ఉద్యమాలు దారితప్పుతాయి. దాన్నే ఇప్పుడు రాయలాంధ్రలో చూస్తున్నాం. తల్లికి అన్నంపెట్టనివాడు కూడా రోడ్డెక్కి తెలుగుతల్లికి గర్భశోకం రానివ్వం అని శపథాలు చేయడం చూడ్డానికి బాగానేవుంటుంది. అవతలివాళ్ళు మా తెలంగాణతల్లి మాకుంది, మేము తెలుగు తల్లికే పుట్టలేదు మొర్రో అంటుంటే వంశవృక్షం పట్టుకుని తిరగడం ఏం వివేకం! అతిశయోక్తిగా వుండవచ్చుగానీ, "రాయలాంధ్ర వుద్యమానికి నాయకులు కావలెను" అనే ప్రకటన ఇవ్వాల్సిన దుస్థితి నిజంగానే దాపురించింది!

        1972  నాటి జై‌ఆంధ్రా ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటే, సమైక్యాంధ్ర ఉద్యమంలో నాయకత్వలోపం ప్రస్పుటంగా కనిపిస్తోంది. గౌతు లచ్చన్న, కాకాని వెంకట రత్నం, తెన్నేటి విశ్వనాధం, బీవి సుబ్బారెడ్డి  వంటి సీనియర్లు నాటి ఉద్యమాన్ని ముందుండి నడిపించగా, వెంకయ్య నాయుడు, వసంత నాగేశ్వరరావు వంటి రెండవతరం నాయకులు దానికి జవసత్వాల నిచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లా గలగల పారే సుంకర సత్యనారాయణ ఉపన్యాసాలు వినడానికి జనం తెగ ఆసక్తి కనపరిచేవారు. సుంకర ఉపన్యాసానికి కొనసాగింపే వెంకయ్యనాయుడు ఉపన్యాస శైలి.

        అప్పట్లో ఈ వ్యాసకర్త ఆంధ్రా నిరుద్యోగుల సంఘానికి కార్యదర్శి. దానికి అధ్యక్షుడు అమ్మనమంచి కృష్ణశాస్త్రి. "చారిత్రక సంధి సమయంలో ఆంధ్రజాతిని మేల్కొలిపి, కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన అశేష ప్రజానీకానికి వందనాలు" అని మొదలెట్టే గౌతు లచ్చన్న ఉపన్యాసాల్నీ ఆతరం ఇప్పటికీ మరిచిపోదు. భావోద్వేగాలను పట్టుకోవడంలో లచ్చనగారిది ప్రత్యేక శైలి. నాయకుడు, ఉపన్యాసకుడు ఏకమైపోయిన అదుదైన సందర్భం అది. అలా, భావోద్వేగాలను పట్టుకుని రాజకీయం నడిపే సామర్ధ్యం ఈతరం నాయకుల్లో కేసిఆర్ దగ్గర  కనిపిస్తుంది. 

        జైఆంధ్ర ఉద్యమానికి అసలు సిసలు సూత్రధారి  కాకాని వెంకటరత్నం. ఉద్యమం వుధృతంగా సాగుతున్నప్పుడు, పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. ఆ వార్త విన్న  కాకాని గుండె‌ఆగి చనిపోయారు. అప్పటికి ఆయన వ్యవసాయ, ఆరోగ్య శాఖల మంత్రి. కాకాని అంత్యక్రియలకు వెళ్లడానికి అప్పటి ముఖ్యమంత్రి పివీ నరసింహారావు సాహసించలేకపోయారు. ఒక మంత్రి అంత్యక్రియలకు కూడా ముఖ్యమంత్రి వెళ్లలేని పరిస్థితి వుందంటే ప్రభుత్వాన్ని రద్దు చేయక తప్పదని అప్పటి రాష్ట్రపతి వివి గిరి భావించారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో రాష్ట్రపతి పాలన సాగిన ఏకైక సందర్భం అది.

        వర్తమానానికివస్తే, తెలంగాణలో కేసి‌ఆర్ లా రాయలాంధ్ర ఉద్యమానికి కేంద్ర బిందువైన నాయకుడులేడు. ఇప్పుడు నాయకులుగా కనిపిస్తున్న వాళ్లందరిదీ గెస్ట్ అప్పీరియన్సు మాత్రమే! వేదిక ఎక్కి, హార్డ్ హిట్టర్లు వస్తున్నారు, బ్రహ్మాస్త్రం తెస్తున్నారు, పక్క రాష్ట్రాల ఉద్దండుల్ని మాట్లాడివుంచాం అని చెప్పేవాళ్ళేతప్ప, ఉద్యమానికి మేమే నాయకత్వం వహిస్తాం అనే గుండె ధైర్యంగలవాళ్ళు ఒక్కరూ కనిపించడంలేదు.


        నాటి తరం నేతల్ని నేటితరంలోనూ చూడాలనుకోవడం  అత్యాశే కావచ్చు.  కాకాని వెంకటరత్నం వంటి గట్టి నాయకుడు లేకపోయినా తప్పుకాదుగానీ, కేతిగాళ్ళు మీడియాలో ఫోకస్ కావడం ప్రమాదకరం! నాయకులు లేకపొతే పోయారు. ఉత్తేజ పరిచే ఉపన్యాసకులైనా వున్నారా? అంటే అదీ లేదు. వున్నవాళ్లలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కరే గుడ్డిలో మెల్ల. భూమన కరుణకర రెడ్డి వంటివాళ్ళు మాట్లాడగలరుగానీ వాళ్ళు ఆయా పార్టీల్లో ప్రధాన నాయకులుకాదు.

        ఇక పరుచూరి అశోక్ బాబు ఒక్కరే బండి లాగిస్తున్నారు. అయితే, ఆయన ప్రపంచం ఎన్జీవోల వరకే పరిమితం. భారత ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని సంకుచిత అర్ధంలో సిపాయిల తిరుగుబాటు అంటారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన-సమైక్య ఉద్యమాలని పరిమిత అర్ధంలో ఎన్జీవోల ఉద్యమం అనవచ్చు. ఎన్జీవోలకు నాయకులు వుంటారుగానీ, ఎన్జీవోలు సమాజానికి నాయకత్వం వహించలేరు! సమాజ ప్రయోజనాలు ఎన్జీవోలకన్నా చాలా విస్తృతమైనవి! దానికోసం రాజకీయ ఉద్యమం జరగాలి! తెలంగాణలో విభజన ఉద్యమం ఎన్జీవోల దశనుదాటి, రాజకీయ ఉద్యమంగామారి చాలాకాలమైంది. ఆలోటు రాయలాంధ్రలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడేది రైతులు. అయినా, ప్రస్తుత  రాయలాంధ్ర ఉద్యమం మీద రైతులు పెద్దగా ఆసక్తి కనపర్చడంలేదు. ఎన్జీవోల ఉద్యమం రైతాంగ ఉద్యమంగా మారాలంటే రాయలాంధ్రలో రాజకీయ ప్రక్రియ వేగవంతం కావాలి!

        సీమాంధ్రలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకీ ఆమోదాంశంలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలకే కాదు, కొత్తగా పుట్టి ఇంకా అధికారాన్ని ఆస్వాదించని జగన్ పార్టికి కూడా ఆమోదాంశం లేకపోవడం విచిత్రం.  

        ప్రస్తుత దశ తెలంగాణ ఉద్యమానికి తొలిగంట కొట్టింది బీజేపి. "ఒక ఓటు, రెండు రాష్ట్రాలు" దాని నినాదం. ఇప్పుడు ఆ పార్టీకి సీమాంధ్రలో ఒక్క శాసనసభ్యుడు కూడా లేడుగాబట్టి ఇప్పటికిప్పుడు ఆ పార్టికి ఇబ్బంది లేక పోవచ్చుగానీ, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై గంపెడు ఆశలు పెట్టుకున్న బీజేపికి సీమాంధ్రలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపితోపాటూ సిపి‌ఐది కూడా అధికారికంగా విభజన బాటే. ఆ పార్టి విశాలాంధ్ర నినాదాన్ని ఎప్పుడో వదులుకుంది. దానికిప్పుడు రాయలాంధ్రలో శాసనసభ్యులూ లేరు.

        రాష్ట్రంలో, సిపియం, యంఐయం రెండు మాత్రమే అధికారికంగా సమైక్యవాద పార్టీలు. కానీ, ఆ రెండు పార్టీలకు సీమాంధ్రలో ఒక్క శాసనసభ్యుడు కూడాలేడు. ఇదో వైచిత్రి! 

        రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారంలోవున్నది కాంగ్రెస్సే కనుక, ప్రస్తుతం ఆ పార్టీయే రాయలాంధ్రులకు తార్కికంగా ప్రధాన శత్రువు. ఎన్నికల పొత్తుపెట్టుకొని అందరికన్నా ముందు విభజనవాదుల్ని ప్రోత్సహించిన చరిత్ర కూడా కాంగ్రెస్ కు వుంది. ఆ పార్టి  ప్రజాప్రతినిధులు ఢిల్లీలో విభజనకూ,  నియోజకవర్గాల్లో సమైక్యతకూ మద్దతిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు!  వాళ్లలో కొందరు నేడోరేపో  యం.పీ. పదవులకు రాజీనామాలు చేయవచ్చుగానీ, ఇప్పటికే సమయం మించిపోయింది. రాయలాంధ్రలో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ తన పునాదిని తానే కూల్చుకుందని ఆ పార్టి పెద్దలే బహిరంగంగా చెపుతున్నారు!

        అధికార పార్టి మీద ప్రజల్లో కలిగే ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి భావిస్తోందిగానీ, కేసి‌ఆర్ తో కలిసి రాజకీయ కాపురం చేసిన చరిత్ర చంద్రబాబుకూ వుంది కనుక జనం ఆ పార్టీనీ నమ్మడం లేదు.

        రాయలాంధ్రలో ఆర్భాటంగా చేపట్టిన  ఆత్మగౌరవయాత్రను మధ్యలో ఆపి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసొచ్చారు చంద్రబాబు. వారు చేసిన హడావిడిని చూస్తే,  ఆంధ్రప్రదేశ్ ను విభజించమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి గతంలో  రాసిచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటారేమో అనిపించింది. చంద్రబాబు పాత లేఖను తీసుకోకపోగా "ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్  ఇస్తుంది. లేకపోతే రేపు నేను ప్రధానమంత్రికాగానే తెలంగాణ ఇస్తా"నన్న నరేంద్ర మోదీకి  "ఐ లవ్ యూ" అంటూ ఇంకో లేఖను ఇచ్చివచ్చారట! ఏనుక్కి కనిపించే దంతాలువేరు, నమిలే దంతాలువేరు. చంద్రబాబు ఢిల్లీ యాత్రకు కనిపించే కారణాలువేరు. కనిపించని కారణాలు వేరు.

        తెలంగాణాపై కాంగ్రెస్ ప్రకటన వస్తుందని పసిగట్టగానే, రాయలాంధ్రలో సమన్యాయం నినాదంతో అందరికన్నా ముందుగా రోడ్డెక్కిన పార్టి వైయస్సార్ కాంగ్రెస్. కానీ, చంద్రబాబును ఓడించడానికి తెలంగాణ అంశాన్ని వెలుగులోనికి తెచ్చిందే వైయస్ రాజశేఖర రెడ్డి అనే వాస్తవం ఆ పార్టికి శాపంగా వెంటాడుతూనేవుంది. రాజకీయాల్లో సన్ స్ట్రోకులేకాదు ఫాదర్ స్ట్రోకులూ వుంటాయి!

        రాయలాంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుది ఒక విషాదం అయితే జగన్ ది ఇంకో విషాదం. జగన్ ను ధర్మ విజేతగా ప్రచారం చేసుకోవాలని ఆయన పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. కాంగ్రెస్ పెద్దలేమో జగన్ ను విజితగా భావిస్తున్నారు. విజిత అంటే పందెపు సొత్తు. జగన్ ధర్మ విజితనా? అధర్మ విజితనా? అనేది అనవసర ధార్మికచర్చ.  

        "కాంగ్రెస్ కక్షగట్టి జగన్ ను జైల్లో పెట్టింది" అని వైయస్సార్ పార్టీ ప్రచార సారధులు ఇప్పటి వరకూ చెప్పిన మాటలు బెడిసి కొట్టాయి. ఇప్పుడూ కాంగ్రెస్సే అధికారంలో వుంది కనుక తార్కికంగా ఆ పార్టీయే జగన్ కు బెయిల్ ఇప్పించిందని నమ్మేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. నారుపోసినవాళ్ళే నీరుపోసినట్టు జెయిల్లో పెట్టినవాళ్ళే బెయిల్ ఇప్పిస్తారు అనేది వాళ్ళ నమ్మకం!

        వర్తమాన రాజకీయ భ్రష్టత్వానికి పరాకాష్ట ఏమంటే, విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలన్ని భావిస్తున్నట్టు తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. సమైక్యవాద నినాదం చేస్తున్న జగన్ రాష్ట్రం విడిపోతేనే తనకు మేలని భావిస్తున్నట్టు రాయలాంధ్రులు అనుమానిస్తున్నారు.

        సమైక్యంతప్ప మరేదైనా అంగీకారమే అని తెలంగాణవాళ్ళూ, సమైక్యంతప్ప మరేదీ కుదరదు అని సీమాంధ్రవాళ్ళూ తలపడుతున్నప్పుడు సమస్యను పరిష్కరించాల్సినవాళ్ళు ప్రత్యామ్నాయాలని అన్వేషీంచాలేతప్ప, సవాళ్లను విసరకూడదు. "ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అప్రకటిత అంతర్యుద్ధ పూర్వరంగ వాతావరణం ఏర్పడింది. అంచుకు చేరింది గానీ అదృష్ట వశాత్తు అదుపులోనే ఉంది. జాగ్రత్త పడకపోతే అదుపు తప్పదన్న పూచీ లేదు." అని సీనియర్ పాత్రికేయులు పొట్లూరి వెంకటేశ్వరరావు నెల క్రితమే  హెచ్చరించిఉన్నారు. ప్రజల్లో ఆమోదాంశంలేని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేసే బాధ్యతారాహిత్యపు ప్రకటనలతో వాతావరణం అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదు.

"కలిసుందాం రా!" వంటి కాలం చెల్లిన నినాదాల్ని పక్కనపెట్టి, వాస్తవ సమస్యలకు వాస్తవ పరిష్కారాల్ని సూచించి, వాటిని సాధించడానికి ఉత్తేజాన్నిచ్చే కొత్త నినాదాలతో కొత్త రాజకీయ పార్టి ఒకటి ఇప్పటికిప్పుడు రాయలాంధ్రలో ఆవిర్భవించాలి. ఇది చారిత్రిక అవసరం!
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
 28 సెప్టెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
29 సెప్టెంబరు 2013

 



No comments:

Post a Comment