Saturday 2 November 2013

సమ్మిళిత విధానాలే శరణ్యం

సమ్మిళిత  విధానాలే శరణ్యం
ఏ. యం. ఖాన్‌ యజ్దానీ (డానీ)

        మనుషులు తమ చరిత్రను తామే నిర్మించుకుంటారు అన్నాడు కార్ల్‌ మార్క్స్‌. అంత వరకు  చాలామందికి  దాదాపు ఏకాభిప్రాయమే వుంటుంది.  అయితే దీనికి చాలా షరతులున్నాయి.  మనుషులు తమకు ఎలా తోస్తే అలా,   ఎప్పుడు అనుకుంటే అప్పుడు తమ చరిత్రను నిర్మించుకోలేరు.  గత సంఘర్షణల ఫలితంగా తమకు అందివచ్చిన చారిత్రక సందర్భం, చైతన్యాల పరిమితుల్లోనే మనుషులు తమ చరిత్రను తాము నిర్మించుకుంటారు. గతించినతరాల సాంప్రదాయాలు వర్తమానతరాల ఆలోచనల్లోచేరి, వాళ్లను నడిపిస్తుంటాయి.

        ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పుడు మనుషులు ప్రాంతాలవారీగా  రెండు రకాలుగా చరిత్రతో  వ్యవహరించే పనిలో వున్నారు. తెలంగాణ ప్రాంతంలో పునర్‌ నిర్మాణపు ఆలోచనలు సాగుతుండగా, రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలో యధాస్థితిని కాపాడేందుకు అక్కడి పాలకవర్గాలు దింపుడుకళ్ళెం ఆశతో చివరి ప్రయత్నాలు ముమ్మరంగా  చేస్తున్నాయి.

        ప్రజల కోరికలు బలంగా ముందుకు వస్తున్నపుడు పాలకవర్గాల కోరికల్ని అంచనా వేయడం కష్టం. అవి తమ కోరికల్ని కొన్నాళ్ళు దాచుకుంటాయి. లేదా ప్రజల కోరికల పేరుతో తమ ప్రయోజనలను సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం  ప్రజలు అందమైన కలలుకనే సందర్భం. ఇటీవల జరిగిన మంజీర రచయితల సంఘం 27వ వార్షికోత్సవాలు దానికి అద్దంపట్టాయి. హైదరాబాద్‌ అందరిదీ; దానిపై పరిపానాధికారం తెలంగాణవాళ్లది అనే అభిప్రాయం ఆ వేడుకల్లో బలంగా ముందుకువచ్చింది.

        హైదరాబాద్‌ ఆర్ధిక,  సాంస్కృతిక, జీవన శైలిపై విప్లవకవి వరవరరావు కొన్ని అందమైన కలల్ని ముందుంచారు. కొన్ని ఆలోచించదగ్గ సందేహాలు లేవదీశారు.   దోపిడిదారుడు ఆంధ్రావాడైనా, తెలంగాణావాడైనా హైదరాబాద్‌  నుండి పోవాల్సిందే. శ్రమించి చెమట చిందించేవారు ఎవరైనా, ఎక్కడివారైనా హైదరాబాద్‌ వారిదే అని వారొక ప్రకటన చేశారు.  హైదరాబాద్‌ ఫుట్‌ పాత్‌ లపై నడిచే, ఇరానీ కేఫ్‌ లలో చాయ్‌ తాగే పరిస్థితి వస్తుందా? కనీసం అప్పటి విలువలు, సంస్కారం, ప్రేమ వంటివైనా హైదరాబాద్‌ తెహజీబ్‌ లో తేగలమా? అని ఒక అందమైన కలని ముందుంచారు. అంతేకాదు, తెలంగాణ ఎజెండాలో ముస్లింలు, లౌకికవాదం వున్నాయా? తెలంగాణవాదం ముసుగులో హిందూయిజాన్ని నెత్తికెత్తుకున్నామా? అంటూ సాంస్కృతికంగా ప్రాణప్రదమైనా ఒక అంశాన్ని వారు చర్చకు పెట్టారు.

        విజయోత్సవాల్లో మేధోచర్చలకు తావువుండదు కనుక, వరవరరావు లేవనెత్తిన ప్రశ్నలకు మంజీర రచయితల సంఘం వార్షికోత్సవాల్లో ఎవ్వరూ స్పందించివుండరు. కానీ, సమాధానపరచకుండా చల్లారే ప్రశ్నలు కావవి. ముస్లింలు మాత్రమేకాదు, తెలంగాణలోని  ఆర్ధిక, సాంస్కృతిక బలహీనవర్గాలన్నీ సమీప భవిష్యత్తులోనే ఇలాంటి ప్రశ్నల పరంపర సంధించినా ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. ప్రజలు నిర్మించిన దేవాలయాల్లో దెయ్యాలు కాపురంపెట్టడం చరిత్రలో కొత్తేమీకాదు! 

        తెలంగాణకు  పూర్తిగా భిన్నమైన సన్నివేశాన్ని రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతాల్లో చూస్తున్నాం. అక్కడి ప్రజాప్రతినిధులు అగ్నిపర్వతం మీద మూతపెట్టి బొంగురు గొంతులతో ఇప్పటికీ సమైక్యరాగం ఆలపిస్తున్నారు. తమ కోరికల్ని చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఎంతోకొంత అవకాశమైనా దొరికింది. రాయలసీమ- తీరాంధ్ర ప్రజలకు అలాంటి అవకాశం ఇప్పటికీ దక్కడంలేదు. తమ కోరికలే ప్రజల కోరికలుగా అక్కడి ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే విభజించారు. కనీసం హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతగానైనా (యూటీ) చేయండి అనేది ఇప్పుడు వాళ్ల చివరి కోరిక. రాష్ట్ర విభజనను సమర్ధిస్తున్న బీజేపీ సీమాంధ్ర నేతలు కూడా ఇప్పుడు యూటీ పల్లవి అందుకున్నారు. హైదరాబాద్‌ ను యూటీ చేస్తే  రాయలసీమ- తీరాంధ్ర సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో వాళ్లు వివరిస్తే బాగుండేది.

        ప్రభుత్వానికి కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఒక వరంగా మారింది. పైలీన్‌ తుపానును అడ్డుకోలేకన్న  విభజన తుపానును షక్కరంగా అడ్డుకునేదానికివుంది అని ముఖ్యమంత్రి ఉత్తేజకర హామీలు ఇస్తున్నారు. నిజానికి తుపాను, భారీవర్షాలు, వరదల్ని అడ్డుకోవడం ముఖ్యమంత్రులవల్ల అయ్యే పనికాదు. అడ్డుకోలేదేమని వాళ్లను ఎవరూ అడగరు కూడా. కానీ, తుపాను, భారీవర్షాలు, వరదల బాధితులకు తక్షణ సహాయం, సంపూర్ణ పునరావాసం కల్పించడం మాత్రం కఛ్ఛితంగా ప్రభుత్వ కర్తవ్యం. చెయ్యాల్సిన పనుల్ని చేయలేని ప్రభుత్వాధినేతలు. తాము చేయలేని పనుల్ని చేస్తామనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలీ?

        సంఘీభావ సిధ్ధాంతవేత్త ఎమిలీ దుర్కేమ్‌  నాలుగురకాల ఆత్మహత్యల్ని నిర్వచించాడు. పరుల మేలు కోసం చనిపోవడాన్ని ఆయన ఆల్ట్రూయిస్టిక్‌ సుసైడ్‌ అన్నాడు. వైయస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం మొదలై, ఇప్పటికీ మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ధోరణిగా కొనసాగుతున్న ఆత్మాహుతులు ఈ కోవలోకే వస్తాయి. కాంగ్రెస్‌ అధిష్టానం  ఇప్పుడు ఐదో రకం ఆత్మహత్యని  కనిపెట్టింది. అదే, తన మేలు కోసం తానే ఆత్మహత్య చేసుకోవడం!.

        ఎన్టీ రామారావు జానపద సినిమా భువనసుందరికథ లోనూ, ఆ మధ్య వచ్చిన హాలివుడ్‌ సినిమా ద సిక్‌స్త్‌ డే లోనూ, ఒక వ్యక్తి చనిపోయాక అతని  ఆత్మ మరొకరి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలాంటి జానపద పరకాయప్రవేశ విద్యని కాంగ్రెస్‌ ఇప్పుడు రాజకీయాల్లో ప్రదర్శిస్తున్నదట. దీని ప్రకారం,  రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న సమైక్యాంధ్ర మంటల్లో కాంగ్రెస్‌ దూకేస్తుందట. ఆ తరువాత ఆ పార్టీ ఆత్మ  జగన్‌ పార్టీలో ప్రవేశిస్తుందట. ఇలాంటి వాదనల్ని ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు  ముందుగా ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు  కాంగ్రెస్‌ కే చెందిన జేసీ దివాకర రెడ్డి, లగడపాటి రాజగోపాల్  వంటివాళ్ళు కూడా ఈ పరకాయ ప్రవేశ విద్యని బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివన్నీ మాయలూ, మంత్రాలూ, క్షుద్రవిద్యలుగా చాలా మందికి కనిపించవచ్చు. వర్తమాన రాజకీయాలు క్షుద్ర విద్యలకన్నా ఏం తక్కువా?  అయితే, క్షుద్రవిద్యల్ని ప్రదర్శించేవాళ్లని అరెస్టుచేసి శిక్షించడానికి మనకు కొన్ని ప్రత్యేక చట్టాలున్నాయి. ఆ చట్టాలని మన ప్రజాప్రతినిధుల మీద ప్రయోగించవచ్చేమో ఆలోచించాలి.

        తెలంగాణలో కాంగ్రెస్‌ సానుకూల ఓట్లు తెరాసకూ, సీమాంధ్రలో కాంగ్రెస్‌ ప్రతికూల ఓట్లు వైసీపీకీ పడేలా ప్రణాళిక రచించి, రెండు ప్రాంతాల్లోనూ టీడిపిని  బరి నుండి తప్పించడానికి కాంగ్రెస్‌ కుట్ర చేసిందని చంద్రబాబు పదేపదే  ఒక చిత్రమైన వాదన చేస్తున్నారు. ఈ వాదన వినడానికి విచిత్రంగా వున్నప్పటికీ,  ఈ సిధ్ధాంతాన్ని నమ్మేవాళ్ళ సంఖ్య గణనీయంగానే వుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా రావల్సిన సందేహం ఏమంటే, కాంగ్రెస్‌ ఆశిస్తునట్టు ఓట్లు వేసే స్థితిలో అసలు జనం వున్నారా? అని.

        కాంగ్రెస్‌ చేసిన విభజన నిర్ణయంతో అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటున్న మరో ముఖ్యనేత సియం కిరణ్‌ కుమార్‌ రెడ్డి. నిరంతరం  సోనియా గాంధి జపం చేసే కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ మధ్య ఇందిరా గాంధి పేరు ఎక్కువగా తలుస్తున్నారు.  ఇది రాష్ట్ర కాంగ్రెస్‌ లో చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలకు తొలి సంకేతమని కొందరు  అప్పుడే రాజకీయ జోస్యాలు చెపుతున్నారు.

        మరోవైపు, ఢిల్లీలో రాహుల్‌ గాంధీకి  సన్నిహితులుగా వుంటున్నవారి నుండి ఇక్కడికి వస్తున్న వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్ని ప్రజలు ఏవగించుకుంటున్నారని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారట. పార్టీని పూర్తిగా ప్రక్షాళనం చేసి, మొత్తం కొత్త సభ్యులతో 2014 ఎన్నికల బరిలో దిగాలని ఆయన ఆలోచిస్తున్నారనేది ఇక్కడికి అందుతున్న సంకేతాల సారం. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో  కొత్తవాళ్లతో ప్రయోగం చేసిన కాంగ్రెస్‌ గొప్ప విజయాన్ని సాధించింది. కొత్త అభ్యర్ధే గొప్ప అభ్యర్ధి అని అప్పట్లో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీ అనేవారని అంటారు. రాహుల్‌ గాంధి ఇప్పుడు తన బాబాయి బాటలో నడిచే ప్రయత్నాల్లో వున్నారని అంటున్నారు. పాత ఫార్మూలాకు తోడు, తనదైన శైలిలో సామాజికన్యాయాన్ని కూడా జోడించాలని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారట. 

        మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు  రాజకీయ జీవితం 1978 అసెంబ్లీ ఎన్నికలతోనే ఆరంభమైంది. యస్సీ సామాజికవర్గానికి చెందిన కోనేరు ఆ ఎన్నికల్లో కంకిపాడు జనరల్‌  నియోజకవర్గం నుండి విజయం సాధించి అందరినీ అశ్చర్యంలో పడేశారు. అలాంటి సామాజికన్యాయ ప్రయోగాలు చేయాలని రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఉవ్విళ్ళూరుతున్నారట. సామాజికన్యాయం, ఉద్దీపన పథకాల రూపకల్పనలో అపార అనుభవంవున్న సీనియర్‌ అధికారి కే రాజు ఈ కసరత్తులో రాహుల్‌ గాంధీకి సహకరిస్తున్నారని సమాచారం.

        భారతదేశమంతటా రాజకీయ కార్యకలాపాలు దాదాపు మూసపోసినట్టు ఒకేలా వుంటాయి.  ప్రతిజిల్లాలోనూ రెండు కులాలు, లేదా ఒకే కులంలోని రెండువర్గాల చుట్టూ  స్థానిక రాజకీయాలు తిరుగుతుంటాయి. తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమలు దీనికి మినహాయింపు ఏమీకాదు. అనంతపురంలాంటి జిల్లాల్లో రెడ్డి, కమ్మ సామాజికవర్గాల మధ్య రాజకీయం నలుగుతూ వుంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య రాజకీయం తిరుగుతూవుంటుంది.  ఉత్తరాంధ్ర వంటి చోట్ల వెనుకబడిన సామాజికవర్గాలు  కూడా రంగంలో వుంటాయిగానీ, అక్కడ కూడా ఘర్షణ రెండు సామాజికవర్గాలకే పరిమితమై కొనసాగుతూ వుంటుంది. 

        నువ్వా? నేనా? అని మొదలయ్యే  ఈ పోటీ రెండో దశలో, వుంటే నువ్వుండు. లేకపోతే నేనుంటాగా సర్దుకుంటుంది. ఈ క్రమానికి పరాకాష్ట అయిన  మూడవ దశలో ఈ అవగాహన  అధికారంలో వున్నప్పుడు నువ్వు సుష్టుగా తినేయి. నేను మౌనంగా వుంటా. నేను అధికారంలో వున్నప్పుడు నేనూ సుష్టుగా తినేస్తా. నువ్వు మౌనంగా వుండు అనుకుంటూ సాగుతుంది.

        రెండు సామాజికవర్గాలు, లేదా రెండు వర్గాలు, లేదా రెండు పార్టీల మధ్య ఇలాంటి అధికార పంపిణీ అవగాహనలవల్ల మిగిలిన సామాజికవర్గాలన్నీ రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని కోల్పోయి కేవలం ప్రేక్షక పాత్ర వహించాల్సి వుంటుంది. విభిన్న సామాజికవర్గాల్లో ఇలాంటి నిర్వేదం ప్రబలడం ప్రమాదకరం. ఎందుకంటే పరిమిత పంపిణీ విధానం ప్రభావం రాజకీయాల మీదనేగాక, ఆ ప్రాంతపు చైతన్యం, అభివృధ్ధి, ఉత్పత్తి రంగాల మీద కూడా పడుతుంది. అంటే, ఆ ప్రాంతపు చైతన్యం, అభివృధ్ధి, ఉత్పత్తి  రంగాలు కుంటుపడతాయి. విభిన్న సామాజికవర్గాల్లో ఇలాంటి నిర్వేదాన్ని పొగొట్టి, అందర్నీ క్రియాశీలంగా మార్చడానికి సమ్మిళిత విధానాలని అనుసరించాల్సి వుంటుంది.

        సమ్మిళిత విధానమంటే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సమస్తరంగాలను శాశిస్తున్న ప్రాబల్య సామాజికవర్గాలు ఇక పక్కకు తప్పుకోవాలని ఏమీకాదు. ఇక ముందు కూడా వాళ్ళే నాయకత్వం వహించవచ్చు. అయితే, ఒకటే తేడా. ఇప్పటి వరకు   స్వీయసామాజికవర్గాల  అభివృధ్ధి కోసం మాత్రమే ఉపయోగించిన  వాళ్ల అనుభవం, నైపుణ్యాలని ఇక ముందు ఇతర సామాజికవర్గాల అభివృధ్ధి కోసం కూడా  ఉపయోగించాల్సి వుంటుంది.        దానికి వాళ్ళు సిధ్ధమా? అన్నది ఇప్పుడు  ప్రధాన ప్రశ్న.  ఒకవేళ వాళ్ళు సిధ్ధం కాకున్నా పెద్దతేడా ఏమీరాదు. అప్పుడు సమ్మిళిత పాత్రను సాంస్కృతిక, ఆర్ధిక  బలహీనవర్గాలే నిర్వహిస్తాయి. అంటే, యస్సీ, యస్టీ, బీసీ, మత మైనారిటీ వర్గాలే నాయకత్వాన్ని చేపడతాయి.

        ఇప్పటి వరకు రాజకీయ నాయకత్వం వహించిన ప్రాబల్య సామాజికవర్గాల ముందు ఇక ముందు రెండే మార్గాలున్నాయి. సమ్మిళిత విధానాన్ని పాటించడం. లేదా  రాజకీయ నాయకత్వం నుండి తప్పుకోవడం.

(రచయిత ఆంధ్రా  జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336
హైదరాబాద్‌
31 అక్టోబరు 2013

ప్రచురణ : సూర్య దిన పత్రిక
2 నవంబరు 2013


No comments:

Post a Comment