Tuesday 12 November 2013

సంక్షోభంలో సమైక్య ఉద్యమం

సంక్షోభంలో సమైక్య ఉద్యమం 
ఏ.యం. ఖాన్‌ యజ్దాని (డానీ) 

నిజాం సంస్థానానికి మళ్ళీ ఏదో మహర్దశ పట్టినట్టుంది. భారత రాజకీయాలన్నీ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అలనాటి నిజాం సంస్థానం చుట్టే తిరుగుతున్నాయి. బీజేపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ముందుకు తెచ్చిన నెహ్రు-పటేల్ వివాదం కూడా నిజాం సంస్థానం నేపథ్యంలోనే సాగుతోంది.   అంధ్రప్రదేశ్‌ లోని నిజాం సంస్థానం (తెలంగాణ)ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపియే సమన్వయ కమిటీ, కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. కర్ణాటకలోని నిజాం సంస్థానం (కన్నడ - హైదరాబాద్‌) కు  ప్రత్యేక హోదా కల్పించే నాలుగు నోటిఫికేషన్లపై ఆ రాష్ట్ర గవర్నర్‌ హెచ్‌ ఆర్‌ భరద్వాజ ఈవారంలోనే సంతకాలు చేశారు. రేపు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రలోని  నిజాం సంస్థానానికి  ప్రత్యేక హోదా కల్పించినా ఆశ్చర్య పడాల్సిందేమీలేదు. చరిత్ర గతం వర్తమానాల మధ్య దోబూచులాడుతూ సాగుతోంది.

కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియను వేగంగా పూర్తిచేసే  అతృతలోవుంది. విభజనకు సంబంధించిన పదకొండు అంశాలపై కేంద్ర మంత్రుల బృందానికి రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు  సూచనలు ఇవ్వాల్సిన గడువూ ముగిసింది. ఇక అఖిలపక్ష సమావేశమే తరువాయి. దానికీ ముహూర్తం దగ్గర పడింది.

విభజనకు సంబంధించిన ప్రతి రౌండులోను, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న కేసి‌ఆర్‌, కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించిన సూచనల్లోనూ తన తెలివిని  ప్రదర్శించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ విభజనకాదనీ, 1956 నాటి తెలంగాణను పునరుధ్ధరించడం మాత్రమే అని ఇంతకాలం కేసి‌ఆర్‌ వాదిస్తూ వచ్చారు.  కానీ, కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించిన సూచనల్లో కాలప్రాతిపదికని వారు యాభై యేళ్ళు ముందుకు జరిపారు. 2007లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ నిర్ణయించిన 10 జిల్లాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్ని  సరిహద్దులుగా  నిర్ణయిస్తూ కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేసి‌ఆర్‌ ప్రతిపాదించారు.

తన వాదనని సమర్ధించుకోవడానికి కేసి‌ఆర్‌ శాసనమండలి ఏర్పాటు అంశాన్ని ముందుకు తెచ్చారు. 119 మంది ఎన్నికైన శాసన సభ్యులతోపాటూ, ఒక నామినేటెడ్‌  ఆంగ్లో ఇండియన్‌ ను కలుపుకుంటే శాసన మండలి ఏర్పాటుకు కావల్సిన కనీసపు 120  అసెంబ్లీ సీట్లు తెలంగాణకు వుంటాయనేది వారి వాదన. పైకి సమంజసంగా కనిపిస్తున్న ఈ వాదన వెనుక ఒక వివాదం వుంది. 1956 తరువాత తెలంగాణలో కలిపిన భద్రాచలం డివిజన్‌ తదితర ప్రాంతాల్ని  తెలంగాణలోనే వుంచాలని కేసి‌ఆర్‌ పరోక్షంగా ప్రతిపాదించారు.

కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 120 శాసన సభ్యులు వుండాలి అనేదే కేసిఆర్ కోరిక అయితే దాన్ని అనేక విధాలుగా పరిష్కరించవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ద్వార దాన్ని సాధించుకోవచ్చు. దానికోసం భద్రాచలం డివిజన్‌ తదితర ప్రాంతాల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపివుంచాల్సిన పనిలేదు.

వనరుల పంపకాల అంశంలో కేసి‌ఆర్‌ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణం, వన్యప్రాణులు, పునరావాసం, పునర్నిర్మాణం, గిరిజనుల సమస్యలన్నింటినీ పరిష్కరించిన తరువాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని వారు సూచించారు. తెలంగాణ జేయేసి ఛైర్మన్‌ యం. కోదండరామ్‌ కూడా భద్రాచలంపై లొల్లి  మొదలెట్టారు. ”రాముడ్ని ఆంధ్రాలో కలుపుడంటే గోదాట్లో ముంచుడే” అంటున్నారాయన.  2009 ఎన్నికల ముందు వరకు వున్న భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని రద్దు చేసి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటుచేసిన మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో కలిపినందున భద్రాద్రి రాముడు తెలంగాణవాడే అని తేలిందని అంటున్నారాయన.

పోలవరం ప్రాజెక్టును అర్ధం చేసుకున్నవాళ్ళకన్నా అపార్ధం చేసుకున్నవాళ్ళే ఎక్కువ. తీరాంధ్ర భూభాగంలో నిర్మిస్తున్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పోలవరం. దీని నిర్మాణం సజావుగా సాగడానికి భద్రాచలం డివిజన్‌ ను తెలంగాణ పంచాయితీ నుండి విడిగా వుంచడం అవసరం. పోలవరం ముంపు ప్రాంతంలో కొంతభాగం పాత తెలంగాణ మండలాల్లోవున్నా దాన్ని వదులుకోవడానికి కూడా తెలంగాణ పెద్దలు ఉదారంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే అది కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రపు అంతర్గత వ్యవహారంగా వుంటుంది. దాని డిజైను, ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ అప్పుడు ఆ రాష్ట్ర వ్యవహారంగా మారుతుంది.

పదేళ్ల  ఉమ్మడి రాజధానికి మొదట్లో అంగీకారం తెలిపిన కేసి‌ఆర్‌ జీవోయంకు సమర్పించిన నివేదికలో బాహాటంగా దాన్ని వ్యతిరేకించనప్పటికీ, కాల పరిమితిని రెండేళ్లకు కుదించాలనే సూచనని పరోక్షంగా చేశారు. కొత్త రాజధాని నిర్మాణానికి రెండేళ్లకన్నా ఎక్కువ వ్యవధి పట్టదనీ, శాసనసభతోసహా సచివాలయంలోని కీలక శాఖల్ని  సీమాంధ్రులు తమ రాష్ట్రానికి తక్షణమే తరలించుకోవచ్చని సలహాలాంటి హెచ్చరిక ఒకటి చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని ఇప్పటి వరకు గట్టిగా చెపుతూ వచ్చిన యంఐయం కూడా క్రమంగా విభజనని సమర్ధించక తప్పని పరిస్థితిలో పడిపోయినట్టు కనిపిస్తోంది.  విభజన అనివార్యమైతే, కర్నూలు, అనంతపురం, తెలంగాణ జిల్లాలతో కూడిన రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రుల బృందాన్ని అసదుద్దీన్‌ ఓవైసీ  కోరడం కొత్త పరిణామం. హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగానూ, కేంద్రపాలిత ప్రాంతంగానూ చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పడం కొత్త మలుపు. అన్నింటినీ మించి ఉమ్మడి రాజధాని అంటే ఖైరతాబాద్‌ మండలం మాత్రమే అని యంఐయం చెప్పడం కొత్త వివాదానికి తెర తీసినట్టే!

జీయంవోకు సూచనలు ఇవ్వడం అంటేనే విభజనకు అంగీకరించినట్టు అవుతుందని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు దానికి దూరంగా వుండిపోయారు.  జేడీ శీలం, చిరంజీవి చెపుతున్న మాటల్నిబట్టి  సీమాంధ్రకు చెందిన  కేంద్ర మంత్రులు ”అందరికీ న్యాయం చేయాలి”అని జీయంవోను కోరినట్టు అర్ధం అవుతోంది. అయితే, లోపల వాళ్ళేం చెప్పారో బయట చెప్పడానికి ఎవరూ సిధ్ధంగా లేరు.

సమైక్యవాదం అంటేనే తెలియని సీమాంధ్రకు దాన్ని అలవాటు చేసి, ఇన్నాళ్ళు బండి నడిపిన  విజయవాడ యంపి లడగపాటి రాజగోపాల్‌ చివరి అంకంలో దాదాపు ఒంటరిగా మిగిలారు. జీయంవోకు వ్యక్తిగత స్థాయిలో సమర్పించిన నివేదికలో ”విభజన తరువాత కుర్చీని అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌ ని కొల్లగొట్టాలని కేసి‌ఆర్‌ చూస్తున్నారు” అని  ఆయన ఆరోపించారు. నిజానికి ప్రభుత్వంలో కుర్చీని అడ్డుపెట్టుకుని  దండుకునే సాంప్రదాయం మొదలై చాలా కాలమే అయింది. దీన్నే ప్రాయోజిత పెట్టుబడీదారీ విధానం అంటున్నాం. ఆ అవకాశం అందరికీ కల్పించాలన్నదే  ప్రస్తుత రాజకీయ వివాదానికి ప్రధాన కారణం.

సీమాంధ్ర సమైక్య బరిలో అందరూ వూహించినట్టుగానే ఇద్దరు మిగిలారు. జగన్‌, చంద్రబాబు.  వీరిద్దరిలో ఎవరు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని చేపడతారు అనే అంశంపై ఊహాగానాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇద్దరికీ తమవైన బలాలున్నాయి. బలహీనతలూ వున్నాయి. చంద్రబాబు మళ్ళీ అధికారాన్ని  చేపట్టాలనీ, జగన్‌ ఈ రాష్ట్రాన్ని ఏలాలనీ బలంగా కోరుకునేవాళ్ళు పెద్ద సంఖ్యలోనే వున్నారు. అయితే, ’హైటెక్కు’ పాలనని సామాన్య ప్రజలు ఇంకా మరిచిపోకపోవడం చంద్రబాబుకు ఇబ్బందికాగా, అధికారానికి రాకముందే అవినీతి కేసులు వుండడం జగన్‌ కు ఇబ్బంది. దొరికిన ప్రతి అవకాశాన్నీ ప్రత్యర్ధిని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. విచిత్రం
ఏమంటే రాజకీయంగా హోరాహోరీ పోరుసలుపుతున్న వీళ్ళిద్దరూ ఎత్తుగడల్లో మాత్రం ఒకరినొకరు అనుకరిస్తున్నారు. ఇద్దరూ దీక్షలు చేశారు. ఇద్దరూ జీవోయంకు నివేదికలు పంపలేదు. ఇద్దరూ అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం లేదు.

సీమాంధ్రలో ఇప్పుడు  కొత్తగా వినిపిస్తున్న మూడో పేరు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిది. మూడేళ్ల పాలనలో ప్రజలు ప్రత్యేకంగా గుర్తించుకోదగ్గ మేళ్ళు ఏమీ లేనప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగావుంచడానికి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సహితం ఎదిరించి నిలబడుతున్నారనే ప్రచారం కిరణ్‌ కుమార్‌ కు సానుకూలంగా మారే అవకాశముంది. అయితే ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ లోనే కొనసాగుతారా? లేకపోతే కొత్తపార్టి పెడతారా? అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వారు ఈమధ్య సోనియా గాంధి దండకం మానేసి, ఇందిరాగాంధి శతకం ఎక్కువగా చదువుతూ వుండడంవల్ల, వారి కొత్త పార్టి పేరు ఇందిరమ్మ రాజ్యం కావచ్చనే ప్రచారం బలంగానే సాగుతోంది.

సమైక్యవాద ఉద్యమం హోరులో వినిపించకుండాపోయిన సీమాంధ్ర అంతర్గత లుకలుకలు ఇప్పుడు ఒకటొకటిగా వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటి రోజుల నుండే వీలున్నప్పుడెల్లా  రాయల - తెలంగాణవాదాన్ని నెమ్మదిగా  పినిపిస్తూ వస్తున్న జేసి దివారకర రెడ్ది  ఇప్పుడు స్వరాన్ని పెంచుతున్నారు.  రాయల - తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వని ప్రజాప్రతినిధుల్ని ఆయన సీమ ద్రోహులు అనడం పరిస్థితి తీవ్రతను చెపుతోంది. జేసి వాదనను మంత్రి సీ రామచంద్రయ్య ఖండిస్తున్నప్పటికీ, రాయలసీమ వాదాన్ని మరో కోణంలో  ఆయన ముందుకు తెస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడం అనివార్యమైతే, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారు జీయంవోను కోరారు.  కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల కన్వీనర్‌ సాకే శైలజానాథ్‌ కూడా రాయల తెలంగాణ అనేది పాత డిమాండే అనడంతో ఈ వాదన క్రమంగా బలపడుతున్నదని అర్ధం అవుతోంది.

ఎన్జీవోలు సమ్మె చేస్తున్నపుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నదనిపించిందిగానీ, రెండు నెలల తరువాత అది నిజంకాదని తేలిపోయింది.   కొంతకాలం ఉద్యమానికి బలంగా కనిపించిన ఎన్జీవోలు  వాస్తవానికి దాని బలహీనతగా మారారు. అలసట తీర్చుకోవడానికి చిన్న విరామం అంటూ  పక్కకు తప్పుకున్న ఎన్జీవో నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్‌ వెనక్కు తగ్గినా విభజన ఆగకపోవచ్చనే నిరాశలో కనిపిస్తున్నారు.

సరైన వ్యూహమూ, ఎత్తుగడలు, నాయకుల మీద విశ్వసనీయత  లోపించడంవల్ల  సమైక్యాంధ్ర ఉద్యమం ఇంటా బయట కూడా అనేక అపజయాలను చవిచూసింది. దానికి నాయకత్వం వహించినవాళ్ళు స్థానికంగా ప్రజల్నీ ఉత్తేజ పరచలేకపోయారు.  జాతీయంగా కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రభావితం చేయలేకపోయారు. లక్ష్యం పరిమితమైనప్పుడు అంతకు మించిన ఫలితాలని  ఆశించడమూతప్పే!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మొబైల్‌ ః 90102 34336

హైదరాబాద్‌
8 నవంబరు 2013
ప్రచురణ : సూర్య దినపత్రిక
10 నవంబరు 2013

No comments:

Post a Comment