Sunday 20 July 2014

ఒక్క రోజు కూడా రాయడం మానను.


Danny  Notes
20  July 2014

ఒక్క రోజు కూడా రాయడం మానను.

వృత్తి రీత్యా నేను పాత్రికేయుడ్ని. వృత్తిలో భాగంగా వారానికి ఆరు రోజులు ఒక్క నాగా కూడా లేకుండా  ప్రతి రోజూ వెయ్యి పదాలు (ఆరు వేల క్యారెక్టర్లు) రాస్తాను. దీనికి నాకు పదానికి దాదాపు రెండు రూపాయల చొప్పున వేతనం/కూలి వస్తుంది. అయితే, వృత్తిలో భాగంగా రాసిన రచనల గురించి, వృత్తిపరమైన వేదికల మీద తప్ప ఇతర వేదికల మీద ఎన్నడూ మాట్లాడను. “వృత్తి పరంగా రాసిన రచనల్లో సంస్థాగత ధర్మం ఎక్కువ; వ్యక్తిగత దృక్పథం తక్కువ.” అని కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించాను. నా వృత్తి రచనలకు కొన్ని ఘనమైన సంస్థలు ప్రకటించిన అవార్డుల్ని సహితం నేను వెళ్ళి అందుకోలేదు. వేదికల మీద దండలు వేయించుకోవడం, శాలువలు కప్పుకోవడం నాకు కొంచెం బిడియంగా వుంటుంది.

వృత్తిలో భాగంగా రాసే రచనలు నాలోని రచయిత - సమాజ కార్యకర్తకు చాలా వరకు సంతృప్తినివ్వవు. ఆ లోటును పూరించడానికి నేను ప్రతిరోజూ నా అభిరుచి మేరకు  రెండు గంటలు పుస్తకాలు చదవడానికి, డాక్యుమెంటరిలు / సినిమాలు చూడడానికి, సమాజ-సాహిత్య ఉపన్యాసాలు వినడానికి, వివిధ ఆందోళనకారుల్ని కలవడానికి, విభిన్న ఆలోచనాపరులతో సంభాషించడానికి వెచ్చిస్తాను. ఇంకో రెండు గంటలు రాయడానికో, ఉపన్యసించడానికో వెచ్చిస్తాను. వృత్తియేతర రచనల్నీ విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్ళడానికి అనేక వేదికల్ని వాడుకుంటాను. వాటిల్లో ఫేస్ బుక్ ఒకటి.

అభిరుచికి వృత్తితో ఘర్షణ వస్తే ఏం చేయాలి? అన్నది నాలాంటి రచయితలకు, సమాజ కార్యకర్తలకు తరచుగా ఎదురయ్యే సందేహం. అలాంటి సందర్భం వచినప్పుడెల్లా నేను ఉద్యోగాన్ని మానివేస్తూ వచ్చాను. అలా నాకు చెల్లింది.  అలాంటి సందర్భాల్లో కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా నాకు నైతిక మద్దతు ఇచ్చే మహత్తర సమూహం ఒకటి అన్ని సందర్భాల్లోనూ నాకు వరంగా వుండింది.

ఈ వివరణ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సివచ్చిందనేది ఒక ప్రశ్న. నా రచనల గురించి నా యాజమాన్యాన్ని వేడుకునే అమాయకులు కూడా ఇప్పుడు ఫేస్ బుక్కులో వచ్చారు. వీరికి నేను  ఘాటుగానూ సమాధానం ఇవ్వొచ్చు గానీ వద్దనుకున్నాను. చాలా మందికి తెలియని విషయం ఏమంటే జర్నలిజం నా చివరి వృత్తి. సైకిల్ మెకానిజం మొదలుకుని, ఆయిల్ ట్యాంకర్ల ఫ్యాబ్రికేషన్ వరకు, కుట్టు పని నుండి యంత్రపరికరాలు తయారు చేయడం వరకు, తత్వశాస్త్రం పాఠాలు చెప్పడం దగ్గర నుండి సెఫాలజీ వరకు  నేను చేయని వృత్తిలేదు. ఒకటి రెండు సందర్భాల్లోతప్ప నేను చేసిన పాత్రికేయ ఉద్యోగాలన్నీ ఇంట్లోవున్నవాడ్ని పిలిచి ఇచ్చినవే. కుదిరినన్నాళ్ళు పాత్రికేయ ఉద్యోగం చేస్తా. లేకపోతే మావాళ్ళ కులవృత్తులు చాలా వున్నాయి.  కానీ, నా అభిరుచి మేరకు రాయడం మాత్రం ఒక్క రోజు కూడా మానను. ఇది నా వాగ్దానం!

No comments:

Post a Comment