Wednesday 2 July 2014

Pinning Hopes On God of Rain

వరుణుడే దిక్కు!!!
డానీ

కారణాలు ఏమైనాగానీ వ్యవసాయంతో చంద్రబాబుకు జత కుదరడంలేదు. వ్యవసాయం దండగ అని అప్పట్లో వారు నోరారా అన్నా, అనకపోయినా వారి తొలి విడత పాలన మలి సంవత్సరాల్లో రాష్ట్రంలోని  రైతులంతా వ్యవసాయం దండగ అనే భావించేవారు. కొందరు గుదిబండ అనుకునేవారు. బతకడమే కష్టం అనుకున్న రైతులూ వున్నారు.  రైతు నాయకునిగా పేరున్న వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆ కాలంలో వ్యవసాయ శాఖా మంత్రిగా వున్నారు. వారు  తరచుగా పంటలకు శెలవులు ప్రకటిస్తూ వుండేవారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ విఛ్ఛిన్నం అయిన దశ అది. కాలువ వ్యసాయానికి పుట్టినిల్లు అయిన కృష్ణా-గోదావరి మండలంలోని  సంగం మండలాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించిన రోజులవి. రైతుల ఆత్మహత్యలు ఒక పరంపరగా సాగినకాలం అది.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయిక రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాలీన రెండు కోట్ల టన్నులకు పైగా ఆహారోత్పత్తి జరిగేది. ఇప్పుడు విడిపోయినా రెండు రాష్ట్రాలు సంయుక్తంగా పాత లక్ష్యాల్ని అధిగమిస్తాయనే ఆశిద్దాం. అన్నపూర్ణ, దక్షణాది ధాన్యాగారం, రైస్ బౌల్ వంటి బిరుదుల్ని సంతరించుకున్న రాష్ట్రంలో   ప్రజలందరి జీవితాలు సహజంగానే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంతో ముడిపడి వుంటాయి. అంచేత, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాజీవితాల్లోనుంచి, రాజకీయాల్లోంచీ  వ్యవసాయ రంగాన్ని విడదీయడం సాధ్యంకాదు.

కొత్త శతాబ్దంలో రాష్ట్ర రాజకీయాలని శాసించిన, శాసిస్తున్న వైయస్ రాజశేఖర రెడ్డి,  కే. చంద్రశేఖర రావు, చంద్రబాబునాయుడు, ముగ్గురికీ వ్యవసాయంతో ప్రత్యేక అనుబంధం కూడా వుంది. వైయస్ కు ఇడుపులపాయ ఎస్టేట్ తోనూ, కేసిఆర్ కు పామ్ హౌస్ తోనూ వున్న అనుబంధం గురించి తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. అయితే చంద్రబాబుకు కుప్పం ప్రాజెక్టుతో వున్న అనుబంధమే ఇప్పుడు అంతగా చర్చల్లో లేదు. 

ఆహారోత్పత్తి పరిమాణంలో కొన్ని గొప్పలున్నప్పటికీ దిగుబడి ప్రమాణాల్లో మన వ్యవసాయం గొప్పదేమీకాదు. ధాన్యం దిగుబడి ప్రపంచ సగటు హెక్టారుకు 4, 112 కేజీలు వుంటే, మన దేశంలో అది 3, 124 కేజీలు మాత్రమే వుంది. ఈజిప్టు వంటి కొన్ని దేశాల్లో ధాన్యం దిగుబడి 10  వేల కేజీలకు పైనే వుంది.  మన దేశంలో దిగుబడి తక్కువగా వుండడానికి ఆర్ధిక, సాంకేతిక కారణాలతోపాటూ కులం, మతం వంటి సాంఘీక కారణాలు కూడా అనేకం వున్నాయి.

దిగుబడి తక్కువగా వున్నప్పుడు రైతుకు వ్యవసాయం లాభసాటిగా వుండదు. లాభసాటిగా లేనప్పుడు వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోతుంది. అలా ఆసక్తి తగ్గిపోతే దిగుబడి మరింతగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని అధిగ మించడానికి ఒక సమగ్ర విధానం వుండాలి. ప్రభుత్వాలకు అంత ఓపిక వుండదు; ఎన్నికల సమయంలో కొన్ని రాయితీలు ప్రకటించడంతప్పా. ఆ రాయితీలు కూడా వ్యవసాయరంగాన్ని ఉధ్ధరించడానికికాదు; గ్రామీణ ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రమే! రాజకీయ ప్రయోజనమే ప్రధానం అయిపోయినపుడు సమస్య నిరంతరం కొనసాగుతూనే వుంటుంది.


1999 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకున్నాక చంద్రబాబు రాజకీయాల్లో అప్రతిహతంగా కనిపించారు. ముఖ్యమంత్రిగా ఆయన జ్యోతిబసు రికార్డును బద్దలు గొడతారని తెలుగు తమ్ముళ్ళేకాదూ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు, అతిరథమహారథులైన కాంగ్రెస్  నాయకులు కూడా భావించేవారు. అప్పట్లో చంద్రబాబు విజన్ కూడా 2020 కు తగ్గేదికాదు.

అంతకు ముందు ఎన్నికల్లో భంగపాటుకు గురైన వైయస్ దాదాపు నాలుగేళ్ళు చంద్రబాబు బలహీనఅంశాన్ని కనిపెట్టడానికి తీవ్ర అన్వేషణ సాగించారు.  వ్యవసాయం చంద్రబాబు బలహీన అంశం అనే విషయం 2003 నాటి పాదయాత్రలో వైయస్  కు అర్ధం అయింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అనే మరఫిరంగులతో ఆయన 2004లో అబేధ్యమైన చంద్రబాబు కోటను కూలగొట్టారు. అధికారానికి రాగానే ఎన్నికల వాగ్దానం ప్రకారం వ్యవసాయానికి  ఉచిత విద్యుత్తు ఫైలుపై వైయస్ తొలి సంతకం పెట్టారు. అదనంగా అప్పటికున్న విద్యుత్ బకాయిల్ని కూడా రద్దు చేశారు.

చంద్రబాబు సంక్షేమ పథకాలకు వ్యతిరేకి అనే అభిప్రాయాన్ని వైయస్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు.  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల మనసుల్ని దోచుకున్నారు. జలయజ్ఞం, ప్రత్యేక ఆర్ధికమండళ్ళు తదితర వ్యవహారాల్లో వైయస్ ప్రభుత్వం ఎదుర్కొన్నన్ని  ఆరోపణల్ని మరెవరూ ఎదుర్కొని వుండరు.  అయినప్పటికీ, దిగువశ్రేణుల్లో వైయస్ మీద అభిమానమే  వుండేది. వైయస్ ను చూసి సంక్షేమ పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల చివరి ఘట్టంలో రుణ మాఫీని ప్రకటించి తనకు చాలా కాలంగా దూరంగా వుంటున్న రైతుల ఓట్లను కూడా కొల్లగొట్టగలిగారు.

ఎన్నికల్లో రైతుల ప్రాధాన్యతను వైయస్ నుండి చంద్రబాబు నేర్చుకున్నట్టు ఆయన కుమారుడు జగన్ నేర్చుకోలేదు. పైగా, చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానన్నప్పుడు జగన్ ఎద్దేవ చేశారు. వ్యవసాయ ప్రధానమైన కృష్ణా- గోదావరి జిల్లాల్లో జగన్ కు ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. తన తండ్రి గెలిచిన చోట జగన్ ఓడిపోయారు.  

అయితే, రైతుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు తొలి సంతకంతో రైతుల రుణాల్ని మాఫీ చేయలేదు. రుణమాఫీ ఎలా చేయాలో చెప్పడానికి కోటయ్య కమిటీ వేశారు. మూడు వారాల తరువాత కూడా ఆ కోటయ్య కమిటీ నివేదిక బయటికి రాలేదు. ఇలా తొలి సంతకం దగ్గరే చంద్రబాబు నిరాశ కలిగించారు.

ఎందువల్లనోగానీ, చంద్రబాబుకూ వర్షానికి కూడా సఖ్యత లేనట్టుగా వుంది. గడువు దాటుతున్నా నైరుతిరుతుపవనాలు వస్తున్న జాడ కనిపించడంలేదు. ఖరీఫ్ (సార్వ) నారుమళ్ళు జూన్ మొదటి వారంలోనే పడాలి. నాట్లు జులై మొదటివారంలో మొదలవ్వాలి. ఈలోపులో రైతుల చేతుల్లో బ్యాంకులు పంటరుణాలు ఇవ్వాలి. కొత్త రుణాల సంగతెలావున్నా పాతరుణాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని రైతులకు  బ్యాంకులు తాఖీదులు పంపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సరావుపేట శాఖలో మొదలయిన ఈ వేలం వ్యవహారం చాలా వేగంగా రాష్ట్రమంతటా పాకదన్న హామీ ఏమీలేదు.  

 పై రాష్ట్రాలతో దౌత్య సంబంధాలు నెరపి సాగునీరు సాధించాల్సిన చంద్రబాబు మంత్రివర్గం మరీ పైకి చూస్తోంది! ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవడం కోసం ప్రధాన శివాలయాల్లో వరుణజపం, విరాట్‌పర్వ పారాయణం, సహస్ర ఘటాభిషేకం పూజలను నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు.  ఈ మాట ముందే తెలిస్తే వీళ్ళు దేనికీ?; ఆ వరుణుడ్నే ఎన్నుకునే పని!

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
27 జూన్  2014
http://www.andhraprabha.com/columns/a-column-by-danny/19226.html


No comments:

Post a Comment