Monday 14 July 2014

Solidarity to SKU Baba



అస్తిత్వవాదంలో అస్థిత్వవాదం.
(స్కైబాబాకు సంఘీభావం)

స్కైబాబా ఉద్యోగానికి రాజీనామా చేశాడని రాత్రి తెలిసింది. రచయితగా, పాత్రికేయునిగా  మరీ ముఖ్యంగా ఉద్యమకారునిగా  షేక్ యూసుఫ్ బాబా సున్నిత మనస్కుడు. అతనంటే నాకు యిష్టమైన కారణాల్లో అదే కీలకమైనది. సున్నిత మనస్కులు కొలువులు చేయలేరు. వర్తమాన పాత్రికేయ కొలువు అసలు చేయలేరు. తమకంటూ ఒక ప్రాపంచిక దృక్పధం వున్నవాళ్లకు  ఆ కొలువు మరీ నరకంగా వుంటుంది. 

ఒక విధంగా మా యిద్దరిదీ లవ్ అండ్ హేట్ అనుబంధం.  మేమిద్దరం  ప్రగాఢంగా అభిమానించుకున్న సందర్భాలూ వున్నాయి. భీకరంగా ఘర్షించుకున్న సందర్భాలున్నాయి. స్కై మీద నా అసంతృప్తి చిన్నది. అభిమానం చాలా పెద్దది. బహుశ అతనూ నా విషయంలో అలాగే ఆలోచిస్తాడు అనుకుంటాను. 

అనేకానేక వృత్తుల్లో పాత్రికేయ వృత్తి ఒకటి. అనేకానేక వ్యాపారాల్లో మీడియా వ్యాపారం ఒకటి. వర్తమాన కాలంలో పాత్రికేయ వృత్తికిగానీ, మీడియా వ్యాపారానికిగానీ ప్రత్యేకమైన గౌరవం వుందనో, వుంటుందనో  అనుకోవాల్సిన పనిలేదు. "గతంలో ప్రజల భక్తి గౌరవాలకు పాత్రమైన వృత్తులన్నింటినీ బూర్జువావర్గం నీచ స్థాయికి తీసుకువచ్చేసింది. వైద్యులను, న్యాయవాదులను, కవులను, శాస్త్రవేత్తలను అది తన కింద కూలీకి పనిచేసే నౌకర్లుగా మార్చివేసింది" అని కార్ల్ మార్క్స్ శతాబ్దంన్నర క్రితమే అన్నాడు. ఈ ముక్కను కూడా ఆయన ఏదో ఒక మూల అనకుండా ఏకంగా కమ్యూనిస్టు పార్టి ప్రణాళిక తొలి అధ్యాయంలోనే అన్నాడు. మార్క్స్ కాలం నాటి బూర్జువావర్గంకన్నా క్రూరమైనది, నీచమైనది కార్పొరేట్ రంగం. అంచేత వర్తమాన  మీడియా రంగంలో పనిచేసే వాళ్ళని సాంప్రదాయ అర్ధంలో గౌరవనీయుమైన పాత్రకేయులు అనలేం. వాళ్ళు మీడియా సంస్థల నౌకర్లు మాత్రమే. స్వఛ్ఛంద (ఫ్రీలాన్సింగ్)  పాత్రికేయులు మాత్రమే దీనికి మినహాయింపు కావచ్చు.   

ప్రతి వ్యక్తికీ తనదంటూ ఒక ప్రాపంచిక దృక్పధం వుంటుంది. దాన్నే అతను అన్నిచోట్లా ఆచరిస్తాడు. వీలు కుదిరినప్పుడు వృత్తినీ దానికి వాడుకుంటాడు. ఆ పని పోలీసుగానూ చేయవచ్చు, పాత్రికేయునిగానూ చేయవచ్చు. ఈ విషయంలో తెలంగాణ పాత్రికేయులు చాలా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు. దాని అర్ధం రాయలసీమ - తీరాంధ్ర పాత్రికేయులు తమ సామాజిక కర్తవ్యాన్ని అసలు నిర్వర్తించడంలేదనికాదు. సీమాంధ్రలో అది వ్యక్తుల స్థాయిలో వుంటే, తెలంగాణలో సంస్థాగత స్థాయిలో కొనసాగుతోంది. 

అన్నిరంగాలలోనూ సాగుతున్నట్టే మీడియాలోనూ నౌకరీకరణ అనేది సామాజిక సమీకరణల పునాది మీద అనేక దశల్లో అనేక విధాలుగా సాగుతోంది. రాజకీయం, కులం, వర్గం, గ్రూపు, బంధుత్వం, ప్రాంతం తదితర పక్షపాతాలు దేనికీ మీడియా అతీతం కాదు. ఇప్పుడు మీడియాలో మతం దశ కూడా మొదలయింది. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే స్కైబాబా వంటివాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. ప్రపంచంలోవున్న జబ్బులన్నీ ముందు మీడియాను సోకుతున్నాయి. తెలుగు మీడియాను కాపాడాలంటే చాలా చాలా వ్యాక్సీన్లు కావాలి.

తెలంగాణలోనూ స్కైబాబాది ప్రత్యేకమైన సమస్య. తెలంగాణలో ఇతరులకు  తెలంగాణ రాష్ట్రం సాకరమైతే లక్ష్యం నెరవేరినట్టే. సైబాబాకు ముస్లిం సమాజపు భద్రత, సంక్షేమం కూడా కావాలి. అతనిది అస్తిత్వవాదంలో అస్థిత్వవాదం. సరిగ్గా అక్కడే అతన్ని ఒంటరివాడ్ని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.  ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్లకు తూట్లు పోడవాలంటే ముందు ముస్లిం ఆలోచనాపరుల్ని రంగం నుండి తప్పించాలిగా!  ఇలాంటి ప్రమాదం ఒకటి రాబోతున్నదని స్కైబాబాను మరీ ముందుగా  హెచ్చరించి  భంగపడ్డవాళ్ళలో నేనూ ఒకడ్ని.

చరిత్ర పునరావృతమవుతోందేతప్ప ఇదేమీ కొత్తదికాదు. అలనాటి తెలంగాణ సాయుధపోరాటంలో తొలి అమరుడు బందగీ. చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఇద్దరూ ముస్లింలే. నిజాం సంస్థానంపై  పోలీస్ యాక్షన్  కు తక్షణ ప్రేరణ  షోయబుల్లా ఖాన్ దారుణ హత్య. ఆ సంఘటన తరువాతే  సర్దార్ పటేల్  నిజాంపై సైనిక చర్యకు నెహ్రును ఒప్పించగలిగాడు. పోలీస్ యాక్షన్ ఫలితాలేమిటీ? బందగీ, షోయబుల్లా ఖాన్ సామాజికవర్గానికి చెందినవాళ్ళు  వేలాదికాదు లక్షలాది మంది  హతమైపోయారు. నిజాం సర్ఫేఖాస్ ఆస్తులు మొదలుకుని  వక్ఫ్ భూములు, ముస్లింల వ్యక్తిగత సంపద వరకు అంతా పరాధీనమైపోయింది. చివరకు వాళ్ళు తమ భాషనూ, సంస్కృతినీ కోల్పోవాల్సి వచ్చింది. చరిత్ర అనుభవాల్ని  తిరగేసి చూస్తే  ముస్లింల సంపద కోసమే నిజాం సంస్థానంపై సైనికచర్య, ఇండియన్ యూనియన్ లో విలీనం, ఆంధ్రా ప్రాంతంతో కలపడం వగయిరాలు జరిగాయని అనుకోవడం అసమంజసం ఏమీకాదు.  

వర్తమాన తెలంగాణ ఉద్యమ భౌధ్ధిక విభాగపు నిర్ణేతలుగా వున్నవాళ్ళలో అత్యధికులు కమ్యూనిస్టులు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి వాళ్ళిప్పుడు తొలి మజిలీ చేరుకున్నారు. వాళ్ల మలి మజిలి సామాజిక తెలంగాణ కావాలి. అలా జరక్కపోతే, ఉద్యమంలోని ఉపస్రవంతులు చాలా క్రూరంగా అణగారిపోతాయి. 

తెలంగాణాలో సంఘ్ పరివార్ శక్తులు నేరుగా అధికారంలో లేకపోవచ్చు. కానీ, ఆ శక్తులే  నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని చేపట్టాయి. మోదీ అంటే రెండు పార్శ్వాలు. ఇందులో చాలామందికి నచ్చుతున్నట్టు కనిపిస్తున్నది కార్పొరేట్ రంగ అభివృధ్ధి. చాలామంది తెలియనట్టు నటిస్తున్నది హిందూమతతత్వం. కార్పొరేట్ రంగ అభివృధ్ధి అన్న భూతం ఇప్పుటికే అన్ని పార్టీలనీ ఆవహించేసింది.   దానికి బీజేపి, టిడిపి, వైయస్సార్ సిపి,  టిఆర్ ఎస్ అనే తేడాలు ఏమీలేవు. ఆ మేరకు వాళ్ళలో ఇప్పుటికే సగమో, పావో మోడి అంశ వుంది. వాళ్ళను మిగిలిన సగం ఆవహించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఈ పరిణామాల బాధితుల్లో అనేకానేక సామాజికవర్గాలు వుంటాయి. వాటిల్లో అత్యధిక అణిచివేతకు గురయ్యేవాళ్ళు ముస్లిం, క్రైస్తవ సామాజికవర్గాలు. వాళ్ళు ముందు కొలువులు కోల్పోతారు. ఆ తరువాత కుటుంబాలను కోల్పోతారు. ఎందుకంటే, కొలువులేనివాడు నిరాస్తిపరుడు అయిపోతాడు. నిరాస్తిపరుడికి బంధుమిత్రులే కాదు పెళ్ళాం పిల్లలు కూడా దూరం అయిపోతారు.

కొందరు ప్రఖ్యాతులకే తప్ప మిగిలినవాళ్లకు స్వతంత్ర (ఫ్రీలాన్సింగ్) పాత్రికేయ వృత్తి ఆర్ధికంగా సాగుబాటు అయ్యేదికాదు.  తెలుగు మీడియాలో అయితే పరిస్థితి మరీ దయనీయంగా వుంది. ఒకటి, రెండు సంస్థలు తప్ప ఎడిట్ పేజీ వ్యాసాలకు కూడా ఎవరూ డబ్బులు ఇవ్వడంలేదు. కాలమ్స్ రాస్తే కొంత సొమ్ము ఇస్తున్నారుగానీ అది సాదరు ఖర్చులకు సరిపోతుంది. డాక్యుమెంటరీలు తీయడం అనేది ఖర్చు ఖాతాయేతప్ప ఆదాయ వనరుకాదు. వెబ్ సైటుగానీ, పుస్తకాల ప్రచురణ సంస్థగానీ పెట్టుబడీతో కూడిన వ్యవహారాలు. పైగా వాటి ఫలాలు అందుకోవడానికి స్థిరంగా కొంతకాలం వేచివుండాలి. . 

రానున్న సంక్షోభానికి స్కైబాబా ఉదంతం తొలి సంకేతం మాత్రమే. ఆయన మీద  ఫలానా మీడియా సంస్థకు వ్యతిరేకి అనిమాత్రమేగాక సామాన్యప్రజలకు, తెలంగాణకు సహితం వ్యతిరేకి అనే ముద్ర వేసి నైతిక సంక్షోభంలో పడేసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అయితే, స్కైబాబాకు నైతిక మద్దతు ఇచ్చేవాళ్ళు  పెద్ద సంఖ్యలో వున్నారు. అదే ఆయనకు అత్మస్థైర్యాన్నివ్వాలి.  

- డానీ
హైదరాబాద్
13 జులై 2014

4 comments:

  1. How could be the Hyderabad state ruled by Nizam can be termed as Muslim property?
    The Hyderabad state is rule by Nizam a Muslim with majority population being non Muslims and was under indirect control of Imperial British who term themselves as Democratic.
    So by terming the Hyderabad state annexed by India as Muslim property, can we agree tht the presidencies under British in India before independence as property of British? or another princely state Jammu & Kashmir, which is ruled by Hindu with non Hindu majority population as a property of Hindus? or other princely states as the property of the religion of the ruler who ruled them till independence for India?

    ReplyDelete
  2. Ananda Murthy Motamarri garu!

    You have shot an intriguing question “How could be the Hyderabad state ruled by Nizam can be termed as Muslim property?”

    But I have nowhere termed Nizam state as a whole is the property of Muslims. I have mentioned specifically only three categories of properties namely 1. Surf – e – Khaas 2. Wakf and 3. Individuals.

    The is no second thought over the alienation of properties of categories 2nd and 3rd. Lanco Hills is one of the glaring example.

    The point in question is Surf – e – Khaas. It is only a small piece of whole Nizam state, about one tenth of total area, which has been kept by Nizam as his personal property which has been alienated in various phases after the Police Action, Annexation by Indian Union and merger with Andhra region.

    ReplyDelete
  3. "గతంలో ప్రజల భక్తి గౌరవాలకు పాత్రమైన వృత్తులన్నింటినీ బూర్జువావర్గం నీచ స్థాయికి తీసుకువచ్చేసింది. వైద్యులను, న్యాయవాదులను, కవులను, శాస్త్రవేత్తలను అది తన కింద కూలీకి పనిచేసే నౌకర్లుగా మార్చివేసింది" అని కార్ల్ మార్క్స్ శతాబ్దంన్నర క్రితమే అన్నాడు....." Also., "వాళ్ల మలి మజిలి సామాజిక తెలంగాణ కావాలి. అలా జరక్కపోతే, ఉద్యమంలోని ఉపస్రవంతులు చాలా క్రూరంగా అణగారిపోతాయి. " "రానున్న సంక్షోభానికి స్కైబాబా ఉదంతం తొలి సంకేతం మాత్రమే." Superb Danny Sir.,

    ReplyDelete