*నేను చనిపోతే ఎక్కడ ఖననం చేయాలీ?*
ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళాను. ఓ ముస్లిం మిత్రుడు మాట్లాడుతూ "ఒక వయసు వచ్చాక మనం చావు గురించి కూడ ఆలోచించాలి" అన్నాడు. "పైగా మీది మతాంతర వివాహం" అని గుర్తు చేశాడు.
"నేను ఈ వ్యవహారాన్ని ఎప్పుడో ఫిక్స్ చేసేశాను" అన్నాను. నా భార్య హిందువుగానే వుంటున్నది. హిందూ ఆచార వ్యవహారాలనే ఆచరిస్తున్నది. ఆమె చనిపోతే వాళ్ల గ్రామం శివాపురంలోనే దహనం చేస్తారు. అది స్పష్టం" అన్నాను.
"మరి మీరూ?" అనడిగాడు.
"నాకు మా నాన్నగారి తండ్రి వైపు నుండి నరసాపురం పెద్ద మసీదులో దాయరా వుంది. (దాయరా అంటే ఖననం చేసేందుకు అనుమతి). అలాగే, మానాన్నగారి తల్లి వైపు నుండి నరసాపురం టేలరుపేట మసీదులో దాయరా వుంది. అలాగే హైదరాబాద్ మెహదీపట్నంలో కూడ మాకు దాయరా వుంది. మా అమ్మానాన్నను విజయవాడ గవర్నర్ పేట ఖబరస్తాన్ లో ఖననం చేశారు." అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాను.
"మీ ఛాయిస్?" అని మళ్ళీ అడిగాడు.
"నాలుగు చోట్లలో ఎక్కడయినా ఫరవాలేదు. అయితే, విజయవాడ గవర్నర్ పేట ఖబరస్తాన్ బెటర్ ప్లేస్. అమ్మానాన్న పక్కన పడుకోవడం బాగుంటుందిగా " అన్నాను.
ఎందుకో ఇలా ఈరోజు చావు గురించి చర్చ వచ్చింది. నాకు ఊహ వచ్చినప్పుడు నేను అనుకున్న దానికన్నా మెరుగైన జీవితాన్ని గడిపాను. Fiscal capital పెద్దగా లేకున్నా social capital బాగానే వుంది. అది చాలా సంతృప్తినిస్తోంది.
కొన్నిసార్లు ప్రాణహానీ ముప్పులు వచ్చాయి. తప్పిపోయాయి. అంచేత చావు గురించి కొత్తగా భయపడాల్సింది ఏమీలేదు. నా శరీరం చాలా ఆరోగ్యవంతమైంది. దేన్నయినా తట్టుకునే ఫిట్ నెస్ దానికుంది. డెభ్భయి ఐదేళ్ల వయస్సులోనూ అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. కళ్ళు, కీళ్ళు కొంచెం సమస్యగా మారుతున్నాయి. డయాబెటీస్ వుందిగానీ అది అదుపులో వుంది. ఇటీవలే కొంచెం అలసట కనిపిస్తోంది. శరీరం అలసిపోక ముందే చనిపోవడం మేలని అనుకుంటాను.
చిన్నప్పుడు భయం వేస్తే మా అమ్మను గట్టిగా అతుక్కుని పడుకునేవాడిని. చావు నన్ను భయపెడతదని అనుకోను. మంచిదో చెడ్డదోగానీ ఎక్కడో నాకు పఠాన్ ని అనే చిన్న ఫీలుంగు వుంది. పైగా మేము సాంప్రదాయ పఠాన్లమంట. పఠాన్లు భయపడకూడదు అని మా అమ్మ చాలా గట్టిగా మైండుకు ఎక్కించింది. గవర్నర్ పేట ఖబరస్తాన్ సమాధిలో చీకటిగా వుంటే మా అమ్మను అతుక్కుని పడుకుంటే ధైర్యంగా వుంటుందని భరోసా.
23 నవంబరు 2025

No comments:
Post a Comment