Wednesday 23 October 2019

Anil మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి


మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి

          మా అమ్మానాన్నలు భిన్న పార్శ్వాలు. మా నాన్న emotional; మా అమ్మ organizer. ఆ రెండు లక్షణాలు రెండు పార్శ్వాలుగా నాలో వున్నాయంటారు సన్నిహితులు.  నాలోని emotional పార్శ్వానికి వారసుడు మా పెద్దాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి. వాడు artist and technician.  నాలోని organizer పార్శ్వానికి వారసుడు మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి. వాడు గొప్ప crisis manager.   సన్నిహితుల్లో ఎవరికి ఎంతపెద్ద సమస్య వచ్చి పడినా చిటికెల్లో పరిష్కారం చూపించే స్తోమత అనిల్ ది.

          కులనిర్మూలన ఒక ఆదర్శంగా వున్నప్పుడు పిల్ల పేర్ల చివర్ల కులాలను ఎందుకు పెట్టారు అని మమ్మల్ని కొందరు అడుగుతుంటారు. మావి భిన్నమతాలు కులాల కలయిక అని చాటి చెప్పడానికే ఆపని చేశాము. అదో ఆదర్శం.

          నేను వేసుకోవాల్సిన డ్రెస్సు, షూస్,  పెట్టుకోవాల్సిన కళ్ళజోడు, వాచీలు చివరకు తాగాల్సిన మద్యం బ్రాండ్లు కూడ మా అనిలే నిర్ణయిస్తుంటాడు. “Poor man’s luxuries drink Mansion House and rich man’s impoverish drink Johnny Walker Red label. And you are still dwelling between them” అంటాడు. కుటుంబ వ్యవహారాల్లో నాకో సలహాదారుడు అవసరమైనపుడు అనిల్ నే సంప్రదిస్తాను.  నాకు సలహా ఇవ్వగల సమర్ధుడు వాడు.

           ఈ మధ్య వాడొక మాట అన్నాడు. “నాన్నా! మమ్మల్ని పెంచడానికీ, చదివించడానికీ, జీవితంలో స్థిరపడేలా చేయడానికీ నువ్వు అనేక త్యాగాలు చేసివుంటావు. ఏదైనా టూరిస్ట్ స్పాట్‍ కు వెళ్ళాలనుకుని వెళ్ళివుండవు. ఏదైనా పెద్ద బ్రాండు మందు తాగాలనుకుని తాగివుండవు. ఎవరైన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగుకు వెళ్ళాలనుకుని వెళ్ళి వుండవు. ఇప్పుడు మనకు వెసులుబాటు వుంది. వాటినన్నింటినీ నెరవేర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అన్నాడు. వాడు నాకు నచ్చాడు.

          పెద్దయ్యాక ఇన్ని పెద్ద మాటలు చెపుతాడని వాడు పుట్టినపుడు తెలీదు. ఇప్పుడు ఇన్ని పెద్ద మాటలు చెపుతుంటే వాడు పుట్టినందుకు ఆనందంగా వుంది.

Happy Birthday Anil !.

\\



అనిల్ నా నమ్మకం!
పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమగా పెంచడం, తల్లిదండ్రుల్ని పిల్లలు గొప్పగా చూసుకోవడం కొత్త విషయం ఏమీకాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నంత తధ్ధర్మ క్రియ. కానీ, ఇప్పటి లోకం అలా లేదు. పిల్లల్ని ప్రేమగా పెంచని తల్లిదండ్రులూ, తల్లిదండ్రుల్నిపట్టించుకోని పిల్లలూ కొందరు వుంటున్న కాలం కనుక ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సివస్తున్నది.
ఏప్రిల్ 25న విజయవాడలో అజితకు కోవిడ్ లక్షణాలు కనిపించాయి. మందులు మొదలెట్టాము. మొదటిసారి టెస్టులో నెగటివ్ రావడంతో సంధిగ్ధంలో పడ్డాము. ఏప్రిల్ 27న రెండో టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఆరోజు పరిస్థితి సీరియస్ గా మారింది. మా రెండో అబ్బాయి అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి ఫొన్ చేశాడు. వాడికి విజయవాడ వైద్యం మీద నమ్మకం లేదు. అమ్మను తక్షణం హైదరాబాద్ కు షిప్ట్ చేయమన్నాడు.
హైదరాబాద్ కార్పోరేట్ హాస్పిటల్స్ లో మహామహులకే బెడ్లు దొరకడంలేదు. హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడలో అంబులెన్సులు దొరకడంలేదు. అన్నీ వాడే చూసుకున్నాడు. రూపాయి పెట్టాల్సిన చోట మూడు రూపాయలు ఖర్చు పెట్టాడు. అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ హాస్పిటల్ కు చేరాము. అప్పటికే వాడు హాస్పిటల్ లో స్పెషల్ రూం బుక్ చేసి వుంచాడు. నాకు పార్క్ హోటల్ లో వారం రోజులు రూమ్ బుక్ చేశాడు. నీకు అసలే సివోపిడి నీకు వచ్చిందంటే అమ్మకన్నా డేంజరు అవుతుంది అని హెచ్చరించాడు. కోవిడ్ రిస్క్ వున్నాసరే తను అజితకు అటెండెంట్ గా వున్నాడు.
అజిత డిస్ చార్జి అయ్యే నాటికి నాకు పాజిటివ్ అని తేలింది. ఇంకో మూడు రోజుల తరువాత నాకు మరీ సీరియస్ అయ్యింది. పట్టుబట్టి మళ్ళీ స్పెషల్ రూమ్ సాధించాడు. అప్పటి పరిస్థితిలో అది సాధారణ విషయం ఏమీ కాదు.
నేను ఒక మెడికల్ మెరాకిల్ గా కోవిడ్ నుండి బయట పడి ఏప్రిల్ 15న డిస్చార్జీ అయ్యాను. మా ఇద్దరికీ హాస్పిటల్ బిల్లే 9 లక్షల వరకు అయ్యింది. అంబులెన్స్ , హొటలు, హాస్టలు, ఇతరాలు ఇంకో రెండు వరకు అయ్యాయి. పోస్ట్ కోవిడ్ మందులు మరో లక్షకన్నా పైమాటే. “ఒక్క పైసా కూడా నీ అకౌంట్ నుండి ఖర్చుపెట్టకు. ఈ డ్యూటీ నాది” అని వాడు ముందే చెప్పాడు.
అజిత కుగ్రామం నుండి వచ్చింది. నేను పట్టణం నుండి వచ్చాను. మా ఇద్దరికీ భావోద్వేగాలు ఎక్కువే. మా పిల్లలు విజయవాడలో పుట్టారు. హైదరాబాద్ లో వెస్ట్రన్ లైఫ్ స్టైల్ పూర్తిగా అలవరచుకున్నారు. యూరోప్ అమెరికాల్లో ఒక కాలు, ఇండియాలో ఇంకో కాలు పెట్టి బతుకుతుంటారు. వెస్ట్రన్ వాళ్ళకు భావోద్వేగాలు తక్కువగా వుంటాయనే అభిప్రాయం చాలా మందికి వుంటుంది. పైగా కరోనా కాలంలో మనుషుల్ని చూసి మనుషులు భయపడుతున్న సన్నివేశాల గురించి చాలా కథలు విన్నాము. నా అభిప్రాయం తప్పని వాడు నిరూపించాడు. డబ్బు పరంగానే కాక ఆరోగ్యపరంగానూ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. థ్యాంక్స్ చెప్పబోతే వారించాడు. పిల్లలకు తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్పరు అన్నాడు.
చాలా చిత్రమైన మనస్తత్వం వాడిది. అలెన్ సోలీ డ్రెస్సులు, నైకీ షూల స్థాయి నుండి ఇంకా ఎదుగు. మార్ఫియస్ అనేది కామన్ మ్యాన్స్ లగ్జోరియస్ డ్రింక్, రెడ్ లేబుల్ అనేది రిచ్ మెన్స్ ఎకానమీ డ్రింక్. నువ్వు ఆ లెవల్స్ దాటు. మా కోసం అప్పట్లో చాలా త్యాగాలు చేసుంటావు. ఇప్పుడు వాటినన్నింటినీ తీర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తా. ఇటీజ్ మై ప్లజర్ అంటాడు.
రాత్రి సరిగ్గా 12 గంటలకు ఫోన్ చేశాడు. “మై మదర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ (Strength) అండ్ మై ఫాదర్ ఈజ్ మై డిజైర్” అన్నాడు. అది వాడి బర్త్ డే మెసేజ్. సంతోషం వేసింది. వాడు నా నమ్మకం. ఆ విషయాన్ని వాడు ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు. కుటుంబంలో నేను నిలబడి చెయ్యాల్సిన అనేక పనుల్ని తనే చేసేసాడు.
అనిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

No comments:

Post a Comment