Wednesday 23 October 2019

One step backward for a great victory


One step backward for a great victory
గొప్ప విజయం కోసం ఒక అడుగు వెనక్కి
22 అక్టోబరు 2019

            బాబ్రీ మసీదు స్థలాన్ని ముస్లిం సమాజం సుప్రీం కోర్టు సమక్షంలో కొన్ని షరతులతో  హిందూ సమాజానికి అధికారికంగా ఇచ్చివేయాలనే నా సూచన మిత్రులు చాలామందికి నచ్చలేదు.  వాళ్ళు నా సూచనలోని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని వీక్షించకుండ తాత్కాలిక నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు. 

            బాబ్రీ మసీదు సమస్య మొదట్లో ఒక గల్లీ వ్యవహారం. ఇప్పుడది దేశ సాంస్కృతిక వ్యవహారం. సంఘీయులు ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన తమ లక్ష్యమని 1989లోనే ప్రకటించారు. వాటిల్లో మొదటిది నెరవేర్చుకున్నారు. రెండోది నెరవేర్చుకోవడం దాదాపుగా ఖాయం అయిపోయింది. మూడోదాన్ని  నెరవేర్చుకోవడానికి రంగం సిధ్ధం అయింది. రక్షణాత్మక స్థితిలో వున్న ముస్లిం సమాజం చేయగల గొప్ప పనేమిటీ అనేది ఇప్పుడు ప్రాణప్రద అంశం. 

            లాహోర్ లోని షహీద్ గంజ్  గురుద్వారను శిక్కులకు  అప్పగించడమేగాక ఆ కట్టడంలోని మసీదు చిహ్నాలను తొలగించడానికి కూడ పాకిస్తాన్ లో మెజార్టీగా వున్న ముస్లిం సమాజం ఉదారంగా వ్యహరించింది. ముహమ్మద్ ఆలీ జిన్నా సహితం ఈ ప్రతిపాదనకు అంగీకారాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి పరిస్థితి వర్తమాన భారత సమాజంలో లేదు.

            రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ,  హిందూత్వ శక్తులకు గుణపాఠం నేర్పాలనీ చాలా మంది జెనరిక్ మాటాలు మాట్లాడుతున్నారు. కొందరయితే ఉద్యమాలు, విప్లవాలు అంటున్నారు. దానికి తగ్గ వాతావరణం లేకపోవడమేకాదు; ఈ సలహాలు ఇచ్చేవారు సహితం తాము చెప్పే సూచనల్ని పాటించడానికి సిధ్ధంగానూ లేరు. ప్రస్తుతం అసలు ఎవరి దగ్గరా కార్యక్రమం లేదు.

            దేశంలో వాతావరణం ఎలా వుందంటే మతం వేరు మతతత్వం వేరు అనే అవగాహన చాలా మందికి లేదు. హిందూత్వవాదుల్ని విమర్శిస్తుంటే సాధారణ హిందువులు సహితం నొచ్చుకుంటున్నారు. సాధారణ హిందువుల్ని నొప్పించి ముస్లింలు సాధించగలిగేదీ ఏమీవుండదు. వినాశనాన్ని కోరి తెచ్చుకోవడంతప్ప.

            ముస్లిం సమాజం ఆవేశంతో రగిలిపోయే  సందర్భంకాదు ఇది. దౌత్య నీతిని ప్రదర్శించాల్సిన సమయం ఇది. నిజానికి ఆవేశంతో రగిలిపోయేవారు ఫేస్ బుక్ ను వదిలి బయటికి రావడంలేదు. తాను సన్నధ్ధంకాకుండా ప్రగల్భాలతో ప్రత్యర్ధిని రెచ్చగొట్టేవారు మూర్ఖులు. అలాంటి ప్రమాదం కూడ ఒకటి భారత ముస్లిం సమాజానికి లోపలి నుండి పొంచి వుంది.

శాంతి ఒప్పందమే ఒక మహత్తర విజయం

బాబ్రీ మసీదు వివాదం సమసిపోయినంత మాత్రాన భారత ముస్లింల సమస్యలు పరిష్కారం అయిపోవు. పరిష్కారం కావల్సిన సమస్యలు అనేకం వున్నాయి. భవిష్యత్తులో అనేక కొత్త సమస్యలు సహితం పుట్టుకు వస్తాయి. ముస్లింలకు ఇప్పుడు కావలసింది ఒక నైతిక విజయం. అన్ని విధాలా దుష్ప్రచారానికి గురయిన ముస్లిం సమాజం ఎక్కడో ఒకచోట టర్న్ ఎరౌండ్ అవ్వాలి. దక్షణాయనం ముగిసి ఉత్తరాయనం మొదలు కావాలి. చరిత్ర సవాలు విసిరినపుడు ముస్లింలు గొప్ప ఉదారంగా వ్యవహరిస్తారనే గట్టి సంకేతం బయటికి వెళ్ళాలి.

            బాబ్రీ మసీదు మొత్తం రెండున్నర ఎకరాల స్థలాన్ని హిందూ సమాజానికే ఇచ్చేయాలనే ప్రతిపాదన కొత్తదేమీకాదు. ప్రవక్త ముహమ్మద్ (PBUH) గారి ఆచరణ నుండే ఈ ఆలోచన వచ్చింది. చారిత్రక హుదైబియా శాంతి ఒప్పందంలోని అన్ని అంశాలూ మక్కా ఖురైషీలకు అనుకూలంగా వుండినాయి. ఇస్లాం ఉద్యమకారులకు సానుకూలంగా వున్న అంశాలు దాదాపు శూన్యం. చివరకు ముహమ్మద్ (PBUH) గారిని ఆ ఒప్పందంలో ఏమని సంభోదించాలి అన్న విషయంలోనూ పేచీలొచ్చాయి. వారిని ప్రవక్త అని పిలవడానికి మక్కా ఖురైషీలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆ ఒప్పందాన్ని సంతోషంగా అంగీకరించి ఎంతో ముందు చూపును ప్రదర్శించారు ప్రవక్త ముహమ్మద్.  

            ఆ చారిత్రక సందర్భంలో ముస్లిం సమూహాన్ని మక్కా ఖురైషీలు గుర్తించి వారితో ఒక ఒప్పందాన్ని చేసుకోవడమే ఒక విజయం. హిందూ ముస్లీం సమాజాలమధ్య ఒక ఒప్పందం జరగడమే ఇప్పుడు ఒక మహత్తర అంశం. ఎన్నింటిని వదులుకున్నా శాంతి ఒప్పందమే ఒక విజయం.  ఇప్పుడు ముస్లిం సమాజానికి కావలసింది అలాంటి దృక్పథం.

            హిందూ సమాజం శ్రీరాముని పేరిట కట్టుకునే కొత్త మందిరానికి పక్కలోనో, దగ్గరలోనో బాబ్రీ మసీదు నిర్మించాలనే ప్రతిపాదన కూడ సరైనది కాదు.  అయోధ్య  పట్టణంలోనే హిందూ సమాజం సహకారంతోనే మరో మసీదు నిర్మించుకోవచ్చు.

ఇప్పటి సామాజిక వాతావరణం చాలా విషాదకరంగా వుంది. పౌర ఉద్యమాలు, న్యాయపోరాటాల పాత నిర్వచనాలు మారిపోయాయి. వాటి మీద ప్రజల స్పందనల తీరూ మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ అత్యాచారాల్ని ఎవరయినా ఖండిస్తుంటే సాధారణ హిందూ సమాజానికి కోపం వస్తోంది. ముస్లింలు రాజకీయ యుధ్ధం చేయడానికి ముందు సాధారణ హిందూ సమాజపు సానుకూలతను పొందాల్సిన అవసరం ఒకటుంది.

No comments:

Post a Comment