Monday 7 October 2019

Fascism in rural areas


Fascism in rural areas
గ్రామీణ ప్రాంతాల్లో ఫాసిజం

          వ్యవసాయిక ఉత్పత్తికీ పారిశ్రామిక ఉత్పత్తికీ ఒక ప్రధాన తేడా వుంది. సాలీన 40 వేల టన్నుల వ్యవస్థాపక ఉత్పత్తి స్తోమత కలిగిన సిమెంటు ఫ్యాక్టరీ ప్రతిరోజూ 100 – 110 టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసి మార్కెట్లో విడుదల చేసేస్తూ వుంటుంది. అందువల్ల దాని గిరాకి దాదాపు నిలకడగా వుంటుంది. వ్యవసాయం అలాకాదు. మొత్తం ఏడాది పంట ఒక వారం పదిహేను రోజుల తేడాలో మార్కెట్ కు వచ్చేస్తుంది. దానితో, సరఫరా ఎక్కువయిపోయి గిరాకీ తగ్గిపోతుంది. మరోవైపు, వ్యాపారులు కుమ్మక్కయి ధరల్ని మరింతగా పడగొట్టేస్తారు. ధర తక్కువగా వున్నప్పుడు గిడ్డంగుల్లో నిల్వ చేసి, ధర పెరిగిన తరువాత అమ్ముకునే సౌకర్యం ఒకటి వుంటుందిగానీ దానిని పెద్ద భూస్వాములుతప్ప సామాన్య రైతులు వినియోగించుకోలేరు. దానికి మూడు కారణాలు; తగినన్ని గిడ్దంగులు లేకపోవడం, వున్న గిడ్దంగుల మీద వ్యాపారులకే ఆధిపత్యం వుండడం, పంటను వెంటనే అమ్మి తీర్చాల్సిన అప్పుల వత్తిడిలో రైతు వుండడం.

          తనను మిల్లర్లు వ్యాపారులు కుమ్మక్కయి మోసం చేస్తున్నారని తెలిసినా రైతు వాళ్ళ ను ఏమీ చేయలేడు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సాగునీరు సకాలంలో అందించని ప్రభుత్వాన్నీ అతను ఏమీ అనలేడు. రాష్ట్రంలో ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేయాలో ముందుగా ఒక ప్రణాళిక రచించి ప్రకటించని ప్రభుత్వ యంత్రాంగాన్నీ అతను ఎదుర్కోలేడు. అలాంటి నిస్సహాయ స్థితిలో అతని కోపమంతా వ్యవసాయ కూలీల మీదికి పోతుంది. వాళ్ళ మూలంగానే తనకు ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతున్నదని భావిస్తాడు.  ఆ కోపం అక్కడితో ఆగదు. వ్యవసాయ కూలీల కుల మతాల మీదికి పోతుంది. వ్యవసాయదారులు సాధారణంగా పైవర్ణాలు, వ్యవసాయ కులాలకు చెందినవారై వుంటారు. వ్యవసాయ కూలీలు సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు చెందినవాళ్లయి వుంటారు.  వ్యవసాయ కూలీల్ని  కట్టు బానిసలుగా మార్చేస్తేగానీ వ్యవసాయమూ, గ్రామాలు పూర్వ వైభవాన్ని పొందలేవని వ్యవసాయదారుడు భావిస్తాడు. ఎస్టీ ఎస్సీ అట్రాసిటీస్ కేసుల సంఖ్య పెరుగుతూవుండడం వాళ్ళకు గాయం మీద కారం చల్లినట్టు వుంటుంది. స్వేఛ్ఛా సమానత్వం సోదరత్వం వంటి భావాలు దేశాన్ని పాడు చేసేశాయని రైతులు అనుకుంటారు. రాజ్యాంగం మీద, పార్లమెంటరీ వ్యవస్థ మీద, బలహీనవర్గాల రక్షణ చట్టాల మీద  వాళ్ళకు చాలా కోపం వస్తుంది. 

సరిగ్గా ఇలాంటి వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో కులమతవర్గ నియంతృత్వం జీవం పోసుకుంటుంది.


No comments:

Post a Comment