Sunday, 23 November 2025

 *సతీష్ చందర్ మన కాలపు మంచి వ్యంగ్య రచయిత* 


AM Khan Yazdani (Danny)


ఇటీవల సమాజ విశ్లేషణలో పడి  సాహిత్యకారుడ్ననే స్పృహను కూడ కోల్పోయాను. చాలా రోజుల తరువాత నిన్న ఒక సాహిత్య సభలో సాహిత్యకారునిగా ప్రసంగించాను. 


సతీష్ చందర్ కొత్త పుస్తకం 'మూడు ముడులు 33' పరిచయ సభ నిన్న విజయవాడలో జరిగింది. నేను అందులో గౌరవ అతిథిగా పాల్గొన్నాను. 


సతీష్ చందర్ మన కాలపు మంచి వ్యంగ్య రచయిత. 

 తెలుగు, ఇంగ్లీషు పదాలతో ఆయన ఆడుకునే తీరు చాలా ముచ్చటగా వుంటుంది. 


సాహిత్య ప్రక్రియల్లో హాస్యం రాయడం క్లిష్టమైనది అంటారు. హాస్యం కన్నా వ్యంగ్యం ఇంకా క్లిష్టమైన ప్రక్రియ. 


హాస్య రచనల్లో నవ్విస్తే సరిపోతుంది. వ్యంగ్యం అలాకాదు; నవ్విస్తూ విమర్శించాలి. ఇది చాలా క్లిష్టమైన విన్యాసం. దానికో ప్రగాఢమైన ప్రాపంచిక దృక్పథం కావాలి. అది సతీష్ చందర్ కు పుష్కలంగా వుంది. తెలుగులో ఆయన తొలి దళిత కవి కదా! 


జీవిత కాలంలో ఏదో ఒక దశలో మంచి రచయితగానో, కవిగానో కొనసాగినవారు  చాలామంది వుంటారు. ఓ ముఫ్ఫయి నలభై యేళ్ళు అదే ధోరణిని అదే స్థానంలో కొనసాగించడం సామాన్య విషయం కాదు. ఆ ఫీట్ ను సతీష్ చందర్ సాధించారు. కొనసాగిస్తున్నారు. 


కుల వివక్ష సమాజంలో రాజకీయ రిజేర్వేషన్ల వల్ల ఎస్సీలలో చెంచాగాళ్లు పుట్టుకొచ్చారని కాన్షీరామ్ ఒక గ్రంధాన్నే రాశారు. పురుషాధిక్య సమాజంలో  మహిళలకు చట్ట సభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఇస్తే రాబోయే కాలంలో   ఆ అవకాశాల్ని పురుషులు ఎలా తన్నుకుపోతారో ఈ 33 కథలు చెపుతాయి. 


తొలి వాక్యంలో ఒక గాలం వేయడం సతీష్ చందర్ శైలి. అది మన మెదడుని పట్టేసుకుని కథ చివరి వరకు లాక్కొని వెళిపోతుంది. 


వీటిల్లో నాకు మరీమరీ నచ్చిన కథ 'సన్ ఆఫ్ సెవెంటీ'. కొన్నాళ్ళుగా నేను 'ఒన్ ఆఫ్ సెవెంటీ' మీద పనిచేస్తున్నాను. ఈ నెల 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఆదివాసుల జాతీయ సదస్సులోనూ ఈ అంశం మీద చాలా చర్చ జరిగింది. 


ఈ చట్టంతో నాకు ఒక వ్యక్తిగత అనుబంధం వుంది. 


నాకు COPD వుంది. అదోరకం వుబ్బసం. హైదరాబాద్ లో కాలుష్యం ఎక్కువ కనుక నెలకోసారి గట్టిగానే  ఇబ్బంది పెట్టేది. అలా COPD తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాలంలో ఒక డాక్యుమెంటరి నిర్మాణం కోసం లంబసింగి వెళ్ళాల్సి వచ్చింది. అత్యంత చలి ప్రదేశాన్ని తట్టుకోగలనా? అని  భయం వేసింది. కానీ అలా జరగలేదు. పైగా, చాలా రిలీఫ్ వచ్చింది.  నాతో ప్రయాణిస్తున్న ఓ డాక్టరును "హౌ?" అని అడిగాను. "ఇక్కడ పొల్యూషన్ లేదుకదా?" అని సమాధానం ఇచ్చాడు.


"అయితే, ఇక్కడ రోడ్డు పక్క వంద గజాల స్థలం ఇప్పించండి. చిన్న కుటీరం వేసుకుని వుండిపోతాను" అన్నాను.  


"కుదరదు. ఇక్కడ ఒన్ ఆఫ్ సెవంటీ వుంది. ఆదివాసులు తప్ప ఇతరులు ఇక్కడ స్థలాలను కొనకూడదు" అన్నాడు.

తెగ నిరుత్సాహం కమ్ముకుంది. 

"అయితే దానికో పరిష్కారం వుంది" అన్నాడు డాక్టరు.

" ఇక్కడి ఆదివాసీ అమ్మాయిని మీరు పెళ్ళి చేసుకుంటే, మీకు స్థలం వస్తుంది. రేపు మీకు ఆమెతో పిల్లలు పుడితే, వాళ్ళు  ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేయవచ్చు" అన్నాడు. 


"అయిడియా బాగుంది గానీ, కొంచెం లేటయింది" అన్నాను. 


ఈ మైదాన తెలివితేటల  మీద రూపొందిందే సన్నాఫ్ సెవెంటీ. కథను భలే ఎంజావ్ చేశా. 


"ఖద్దరు నేసే వాడిని నేతన్న అంటారు; ఖద్దరు తొడిగేవాళ్లను నేత అంటారు"  వంటి చమక్కులు ప్రతిపేజీలో ప్రతి పేరాలోనూ వున్నాయి. 


వర్తమాన సమాజ పోకడల మీద ఆసక్తివున్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. 


22 నవంబరు 2025

Where to Burry me?

 *నేను చనిపోతే ఎక్కడ ఖననం చేయాలీ?* 





ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళాను. ఓ ముస్లిం మిత్రుడు మాట్లాడుతూ "ఒక వయసు వచ్చాక మనం చావు గురించి కూడ ఆలోచించాలి" అన్నాడు. "పైగా మీది మతాంతర వివాహం" అని గుర్తు చేశాడు. 


"నేను ఈ వ్యవహారాన్ని ఎప్పుడో ఫిక్స్ చేసేశాను" అన్నాను. నా భార్య హిందువుగానే వుంటున్నది. హిందూ ఆచార వ్యవహారాలనే ఆచరిస్తున్నది. ఆమె చనిపోతే వాళ్ల గ్రామం శివాపురంలోనే దహనం చేస్తారు. అది స్పష్టం" అన్నాను.


"మరి మీరూ?" అనడిగాడు. 


"నాకు మా నాన్నగారి తండ్రి  వైపు నుండి నరసాపురం పెద్ద మసీదులో  దాయరా వుంది. (దాయరా అంటే ఖననం చేసేందుకు అనుమతి). అలాగే, మానాన్నగారి తల్లి వైపు నుండి నరసాపురం టేలరుపేట మసీదులో దాయరా వుంది.  అలాగే హైదరాబాద్ మెహదీపట్నంలో కూడ మాకు దాయరా వుంది.  మా అమ్మానాన్నను విజయవాడ గవర్నర్ పేట ఖబరస్తాన్ లో ఖననం చేశారు." అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాను. 


"మీ ఛాయిస్?" అని మళ్ళీ అడిగాడు. 


"నాలుగు చోట్లలో ఎక్కడయినా ఫరవాలేదు.  అయితే, విజయవాడ గవర్నర్ పేట ఖబరస్తాన్ బెటర్ ప్లేస్.  అమ్మానాన్న పక్కన పడుకోవడం బాగుంటుందిగా "  అన్నాను.


ఎందుకో ఇలా ఈరోజు చావు గురించి చర్చ వచ్చింది. నాకు ఊహ వచ్చినప్పుడు నేను అనుకున్న దానికన్నా మెరుగైన జీవితాన్ని గడిపాను. Fiscal capital పెద్దగా లేకున్నా social capital బాగానే వుంది. అది చాలా సంతృప్తినిస్తోంది.  


కొన్నిసార్లు ప్రాణహానీ ముప్పులు వచ్చాయి.  తప్పిపోయాయి. అంచేత చావు గురించి కొత్తగా భయపడాల్సింది ఏమీలేదు. నా శరీరం చాలా ఆరోగ్యవంతమైంది. దేన్నయినా తట్టుకునే ఫిట్ నెస్ దానికుంది. డెభ్భయి ఐదేళ్ల  వయస్సులోనూ  అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. కళ్ళు, కీళ్ళు కొంచెం సమస్యగా మారుతున్నాయి. డయాబెటీస్‍ వుందిగానీ అది అదుపులో వుంది. ఇటీవలే కొంచెం అలసట కనిపిస్తోంది. శరీరం అలసిపోక ముందే  చనిపోవడం మేలని అనుకుంటాను. 


చిన్నప్పుడు భయం వేస్తే మా అమ్మను గట్టిగా అతుక్కుని పడుకునేవాడిని. చావు నన్ను భయపెడతదని  అనుకోను. మంచిదో చెడ్డదోగానీ ఎక్కడో నాకు పఠాన్ ని అనే చిన్న ఫీలుంగు వుంది.  పైగా మేము సాంప్రదాయ పఠాన్లమంట. పఠాన్లు భయపడకూడదు అని మా అమ్మ చాలా గట్టిగా మైండుకు ఎక్కించింది. గవర్నర్ పేట ఖబరస్తాన్ సమాధిలో చీకటిగా వుంటే మా అమ్మను అతుక్కుని పడుకుంటే ధైర్యంగా వుంటుందని భరోసా.  


23 నవంబరు 2025

Saturday, 22 November 2025

Zohran Mamdani is a Unique Species

 Zohran Mamdani is a Unique Species

*జొహ్రాన్ మందానీప్రత్యేక జాతి జీవి*

 

ఈరోజు (23-11-2025) సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.

పత్రిక యాజమాన్యం, సంపాదకులు, ఎడిట్ పేజీ ఇన్ చార్జీలకు ధన్యవాదాలు.

ప్రచురణకర్తలు శీర్షికను మార్చారు.

వ్యాసాన్ని చదివి మీ కామెంట్స్పెట్టండి. నా ఆలోచనల్ని అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి.  

 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*



 

            ప్రతీ చర్యకు కూడ తత్సమానమైన, తద్వెతిరేకమయిన ప్రతిచర్య వుంటుందనేది భౌతిక శాస్త్రంలో న్యూటన్ కనుగొన్న చలన సూత్రం. అలాంటి ప్రతీ వ్యతిరేక చర్యకు కూడ తత్సమానమైన, తద్వెతిరేకమయిన ప్రతిచర్యలు వుంటాయన్నది సమాజ శాస్త్ర చలన సూత్రం.

 

            భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పెట్టుబడీదారీ వ్యవస్థ వచ్చినట్టే, ఆ పెట్టుబడీదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిస్టు వ్యవస్థ కూడ వస్తుందనీ అది ఆ తరువాత కమ్యూనిస్టు సమాజంగా మారుతుందని కార్ల్ మార్క్స్ ఓ సామాజిక చలన సూత్రాన్ని ఆవిష్కరించాడు. కుల వివక్ష సమాజానికి వ్యతిరేకంగా  కుల సమానత్వ సమాజం ఒకటి ఏర్పడుతుందని అంబేడ్కర్ ఊహాగానం చేసింది కూడ ఈ  సమాజ చలన సూత్రాన్ని అనుసరించే.

 

            2015 నాటి సంగతి.  ఆ ఏడాది అక్టోబరు 13 రాత్రి లండన్ సిటీ బస్సులో ఒక దారుణ సంఘటన జరిగింది. బస్సులో ఇద్దరు ముస్లిం మహిళలు హిజాబ్ తో ప్రయాణిస్తున్నారు. వారిలో హనానే యాకూబీ అనే ఆమె నిండు గర్భిణి. లండన్ బస్సులో ముస్లిం మహిళల్ని చూసి సిమోనే జోసెఫ్ అనే ఓ తెల్ల మహిళకు ఇస్లామో ఫోబియా ఆవహించింది.  పూనకంతో ఊగిపోతూ “ఇక్కడెందుకున్నావూ?  నీ దేశం పోయి బాంబులు చేసుకుంటూ బతుకు” అని తిడుతూ గర్భిణి కడుపు మీద తన్నింది. ఇస్లామో ఫోబియా ఆవహించిన వాళ్ళను కొన్ని దేశాల్లో పూల మాలలతో సత్కరించి ఊరేగిస్తున్నారు. అది లండన్ గాబట్టి అక్కడి కోర్టు సిమొనేకు కఠిన కారాగార శిక్ష విధించింది.

 

            ఈ సంఘటన జరిగిన ఐదారు నెలలకు లండన్ లో మేయర్ ఎన్నికలు జరిగాయి. తరువాతి కాలంలో బ్రిటన్ ప్రధానిగా  పనిచేసిన బోరిస్ జాన్సన్ అప్పటికి రెండుసార్లు గెలిచి లండన్ మేయర్ గా కొనసాగుతున్నాడు. కన్జర్వేటివ్ పార్టి దిగ్గజ నాయకునిగా కొనసాగుతున్న బోరిస్ జాన్సన్ ను, 2016 మే ఆరంభంలో, లేబర్ పార్టీకి చెందిన ఓ సామాన్యుడైన సాదిక్ ఖాన్ ఓడించి గ్రేటర్ లండన్ ఎగ్జిక్యూటివ్ మేయర్ గా ఎన్నికయ్యాడు. విచిత్రం ఏమంటే మేయర్ పదవి ప్రమాణ స్వీకారానికి అతను హిజబ్ వేసుకున్న మహిళలతో వేదిక మీదికి వచ్చాడు. 2020, 2024 ఎన్నికల్లో కూడా లండన్ ప్రజలు అతన్నే గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ప్రస్తుతం అతనే గ్రేటర్ లండన్ ఎగ్జిక్యూటివ్ మేయర్ గా కొనసాగుతున్నాడు.  సౌత్ లండన్ లో పుట్టిన  సాదిక్ ఖాన్  తల్లిదండ్రులు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ముస్లీంలు.  ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో సాదిక్ ఖాన్ కు సర్ బిరుదు ప్రదానం చేశారు.

 

            ఇస్లామో ఫొబియాతో రగిలిపోయే ఫ్రాన్స్ లో కూడ ఇలాంటి విచిత్రాలు కొన్ని జరిగాయి; జరుగుతున్నాయి. మొరాకో నుండి వలస వచ్చిన ముస్లిం కుటుంబంలో పుట్టిన కరీం బౌమరానే ప్రస్తుతం ప్యారీస్ నగర మేయర్. ఫ్రాన్స్ ప్రస్తుత సాంస్కృతిక శాఖ మంత్రి రషీదా దాటి కూడ ముస్లిమే. ప్రస్తుతం ఫ్రాన్స్ నగరాలు మరి కొన్నింటిలో కూడ ముస్లింలు మేయర్లుగా వున్నారు.

 

            న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్ గా ఎన్నికయిన జొహ్రాన్ మందానీ కథ కూడ దాదాపు ఇలాంటిదే. నగరంలో ముస్లిం జనాభా అంతగా లేదు.  అదొక మత అల్పసంఖాక సమూహం. ఇస్లామో ఫోబియాను చాలా విస్తృతంగా ప్రచారం చేసిన ప్రపంచ పెట్టుబడీదారుల రాజధాని నగరమైన  న్యూయార్కులో ఒక ముస్లిం మేయర్ గా ఎన్నికయ్యాడు!. ఇదొక రాజకీయ విచిత్రం. ఒక అద్భుతం కూడ. ప్రతీ వ్యతిరేక చర్యకు కూడ తత్సమానమైన, తద్వెతిరేకమయిన ప్రతిచర్య వుంటుందనే సమాజ చలన సూత్రం ఇక్కడ మరొక్కసారి పనిచేసింది. సమాజ మార్పు కోరేవారికి ఇది నిజంగానే ఉత్తేజాన్ని ఇచ్చే సంఘటన. అమెరికా సమాజంలో అది గుణాత్మక మార్పు ఏమీ కాదుగానీ, అదొక పరిమాణాత్మక మార్పు.

 

            జొహ్రాన్ మందానీ మావోయిస్టు, నక్సలైటు, కమ్యూనిస్టు, సోషలిస్టు ఏమీ కాడు. అది అందరికీ తెలుసు. అతను అమెరిక డెమోక్రాట్ పార్టిలో వామపక్షం. అది అతని పరిధి, పరిమితి. అయితే, అమెరికా గడ్డ మీద కమ్యూనిస్టులు, సోషలిస్టులకు కాలుమోపేందుకు చోటు లేదు అని సాక్షాత్తు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రాంప్ రంకెలేసిన చోట “అవును. నేను సోషలిస్టుని. అంతేకాదు; నేను ముస్లింని” అని బాహాటంగా ప్రకటించి గెలిచిన వాడిని అభినందించడం సంస్కారమా? కాదా?

 

            ఇస్లామో ఫోబియా ప్రబలిన దేశాల్లో ముస్లిమేతర ప్రజలు దాన్ని తిప్పికొడుతుంటే అది నిస్సందేహంగా భారత ముస్లింలకు ఒక ఓదార్పును ఇస్తుంది. ఇందులో తప్పుపట్టడానికి ఏముందీ?

 

            తాముతప్ప ఈ భూమ్మీద కమ్యూనిస్టులు ఎవరూ వుండరు;  వుండడానికి వీల్లేదు అనుకునే మహానగర మావోయిస్టు వీర అభిమానులు మనకు కొందరున్నారు. ఒక వైపు, వాళ్ళూ విమర్శించి, మరో వైపు పెట్టిబడీదారీవర్గమూ విమర్శిస్తున్నదంటే జొహ్రాన్ మందానీ నిజంగానే ఇప్పుడు చర్చనీయాంశం. ప్లటిపస్ (Platypus), ఆక్సోలొట్ల్ (Axolotl), కకాపొ (Kakapo)ల్లాగ అతనొక ప్రత్యేక జాతి జీవి (Unique Species). అలాంటి జీవుల్ని అధ్యయనం చేయడం ఇప్పుడు సమాజశాస్త్రంలో చాలా అవసరం.

 

రచన: 20 నవంబరు 2025

ప్రచురణ : సాక్షి దినపత్రిక, 23 నవంబరు 2025

అదొక రాజకీయ అద్భుతం

 

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=23/11/2025&pgid=748624&device=desktop&view=3

Friday, 14 November 2025

The umpire is more important than the players!

 *The umpire is more important than the players!*

*ఆటగాళ్ళకన్నా, అంపైర్ ముఖ్యం!*

ఈరోజు (18-11-2025) ఆంధ్రజ్యోతి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.
పత్రిక యాజమాన్యం, సంపాదకులు, ఎడిట్ పేజీ ఇన్ –చార్జీలకు ధన్యవాదాలు.
వ్యాసాన్ని చదివి మీ కామెంట్స్ పెట్టండి. నా ఆలోచనల్ని అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
*డానీ*

*సమాజ విశ్లేషకులు* 




బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ఎన్నికల వ్యూరచన సామర్ధ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. నితీష్ కుమార్ రేపు 20న రికార్డుస్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈ ఎన్నికలు ఇండియా బ్లాక్ / మహా ఘట్ బంధన్ బలహీనతల్ని, తేజస్వీయాదవ్ అతిఉత్సాహాన్నీ, రాహుల్ గాంధి మంద్రస్థాయి ప్రతిస్పందననీ మరోసారి చాటి చెప్పాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఉద్యమాన్ని సాగించినంత వుధృతంగా బీహార్ ఓటర్లను ఆకట్టుకునే పని చేయలేకపోయారు. 

సంఘపరివారంలో వందకు పైగా సంఘాలున్నాయి. విహెచ్పి, భజరంగ్ దళ్, ఆయోధ్య రామాలయ నిర్మాణ కమిటి వంటి ధార్మిక  సంఘాలేగాక పసిపిల్లల నుండి అంధుల వరకు అనేక రకాల సంఘాలు ఇందులో వుంటాయి. ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టి సమూహాల్లో పని  చేయడానికి కూడ  వేరువేరు సంఘాలున్నాయి. వీటన్నింటి రాజకీయ వేదిక బిజెపి. ఇవన్నీ ఏకశిలాసదృశ్యంగా మనసా వాచా కర్మణ ఒకే ఆలోచన ఒకే లక్ష్యంతో తమతమ రంగాల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేస్తుంటాయి. దేశంలోని మెగా కార్పొరేట్లు అవసరానికి మించిన నిధుల్ని వాటికి సరఫరా చేస్తుంటాయి. దేశంలో అత్యంత ధనిక పార్టి బిజెపి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పార్టీ నడిపే సోషల్ మీడియాలు, వారి అభిమానులైన ‘అన్ – సోషల్’ మీడియా హౌస్ లు సహజంగానే విపక్షాలను అప్రతిష్టపాలు చేయడం కోసం, బిజెపిని గెలిపించడం కోసం 24/ 366 రోజులు పనిచేస్తుంటాయి. ఇది సంఘపరివారం విజయ రహాస్యం. అదొక ఉమ్మడి కుటుంబం.         

మరోవైపు, బిజెపి ప్రత్యర్ధులకు సిధ్ధాంతపరంగా ఏక సమైక్యతా సూత్రం ఏమీలేదు. వాళ్ళకు ఒక బైండింగ్ వైర్ లేదు. ఒక పదం కోసం, ఒక్కోసారి ఒక్క అక్షరం కోసం, ఒక్క సీటు కోసం అవి హోరాహోరీగా కొట్లాడుకుని వీధులకు ఎక్కుతుంటాయి. పైగా నాలుగున్నరేళ్ళు పూర్తి విశ్రాంతి తీసుకుని ఎన్నికలకు ఆరు నెలలు ముందు మాత్రమే  మేలుకుంటాయి.   వీటికి కూడ కొన్ని ప్రజాసంఘాలుంటాయి. వాటిల్లో ఎక్కువ భాగం లెటర్ హెడ్ సంస్థలు. నేల మీద నిలబడి ప్రజల్లో పనిచేసేవి చాలా తక్కువ. బిజెపి-ఎన్డిఏలను వ్యతిరేకించేవారు సహితం ఇండియా బ్లాక్ / మహాఘట్ బంధన్ అంతఃకలహాలను చూసి అసహ్యించుకుంటారు. 

తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ మీద సహజంగానే ఎంతో కొంత అసంతృప్తి కూడ వుంటుంది.  ఈసారి మహిళా ఓటర్లు గుర్రుగా వున్నారనే మాట బీహార్లో  వినిపించింది. అంతే, ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ కింద అక్టోబరు 6 నుండి  ఒక్కో మహిళ అకౌంట్లో పది వేల రూపాయల చొప్పున వేసేశారు నితీష్. ఈ పథకం కింద డిబిటి పధ్ధతిలో ఒక కోటి 40 లక్షల మహిళల ఖాతాల్లోనికి 14 వేల కోట్ల రూపాయలు జమ చేశారని అంచనా.  నిజానికి, బిహార్లో అక్టోబరు 6 నుండే ఎన్నికల కోడ్ అమల్లోనికి వచ్చింది. ఇది ఒక విధంగా ‘ఓటుకు నగదు’ పథకం. ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎన్నికల కమీషన్ అడ్డుకోవాలి. అలా జరగలేదు. 

స్వేఛ్చ, సమానత్వం, సోదభావాలను ప్రధాన ఆదర్శాలుగా ప్రకటించిన భారత రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీజీ నెత్తి మీద పెట్టుకుంటారు. వీలున్నప్పుడెల్లా “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” తమ విధానం అంటుంటారు. కానీ, వారి పార్టి మాత్రం దేశం మొత్తం మీద ఒక్క సీటు కూడ ముస్లింలకు కేటాయించదు. ముస్లింలను అణిచివేస్తున్నామనే సంకేతాలు ఇస్తే హిందూ సమాజంలోని ఛాందస సమూహం తమకు ఓటేస్తుందనేది ఆ పార్టి ఎత్తుగడ. ఇది ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టికి సానుకూల ఫలితాలను ఇస్తోంది.    

మరోవైపు, ముస్లింలకు ప్రానిథ్యం వహిస్తున్న ఎంఐఎంను తమలో చేర్చుకోవడానికి బిజెపి వ్యతిరేక మహాఘట్ బంధన్ (ఇండియా బ్లాక్) కూడ భయపడింది. ఎంఐఎంతో జతకడితే సంఘపరివారం తమను మొత్తంగా ‘గడ్డాలు టోపీల కూటమి’ అంటుందని వాటికి భయం. మరోవైపు, బిజెపి సోషల్ మీడియా ఆ పార్టిని ‘బిజెపి బి-టీమ్’గా ముద్రవేసి ప్రచారం చేసింది. 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నియోజకవర్గంలో బిజెపితో అంత హోరాహోరీగా పోరాడిన పార్టీని మీడియా సహితం బిజెపి-బిటీమ్ అంటుండడం విచిత్రం. 

2020 బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం 20 చోట్ల పోటీచేసి 5 స్థానాలు గెలుచుకుంది. 243 సీట్లున్న రాష్ట్రంలో 20 చోట్ల మాత్రమే పోటీ చేసిన పార్టీని బి-టీమ్ అనడం  అంత సమంజసంగా అనిపించదు. అయితే, ఈసారి ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే సీమాంచల్ నుండి ఎన్నికయిన ఎంఐఎం అభ్యర్ధి  బిహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన సంకేతాలను ఎన్డీఏ కూటమి తనకు అనుకూలంగా మార్చుకుంది.  ఎన్డీఏ కు అనుకూలంగానే అసద్ అలాంటి సంకేతాలిచ్చారనే విమర్శలూ వున్నాయి.    

బిజెపి-బీ-టీమ్  నింద నుండి బయటపడడానికి ఈసారి ఎంఐఎం బీహార్ లో మహాఘట్ బంధన్ లో చేరడానికి చాలా ప్రయత్నించింది. తమకు 6 సీట్లు ఇచ్చినా సర్దుకుంటామని అభ్యర్ధించింది. ఈ ప్రతిపాదనను ఆర్జెడి తేజస్వీ యాదవ్ గట్టిగా తిరస్క్రించారు. ఫలితంగా ఎంఐఎం గ్రాండ్ డెమోక్రాటిక్ అలయన్స్  (జిడిఎ)ను ఏర్పాటు చేసింది.   

బిజెపితో వైరాన్ని కొనసాగించి మరిన్ని ఇబ్బందుల్ని కొనితెచ్చుకోవడంకన్నా దానికి అణిగిమణిగి వుండడమే మేలనే ధోరణి కూడ ఈసారి బీహార్ ముస్లిం సామాజికవర్గంలో కనిపించింది.   ఇదొక కొత్త ధోరణి. 

*ఓట్లు తక్కువ; సీట్లు ఎక్కువ!!!* 

పార్లమెంటరీ ప్రాజాస్వామ్యంలో ఇప్పుడున్న పధ్ధతిలో ఎన్ని సీట్లు గెలుచుకున్నారన్నదే ప్రామాణికంగానీ, ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు మద్దతు పలికారన్నది కొలమానం కాదు. ఆర్జెడికి ఒక కోటి 80 లక్షల ఓట్లు (23 శాతం) వచ్చాయి గానీ సీట్లు 25 మాత్రమే వచ్చాయి. బిజెపికి    96 లక్షల ఓట్లు, అంటే ఆర్జెడికన్నా రెండున్నర శాతం తక్కువ ఓట్లు వచ్చినా 91 సీట్లు వచ్చాయి. జెడియుకు 90 లక్షల ఓట్లు వచ్చాయి (19 శాతం) 84 సీట్లు వచ్చాయి. 9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ కు 5 సీట్లు వస్తే, 5 శాతం ఓట్లు మాత్రమే వచ్చిన ఎల్ జేపికి 20 సీట్లు దక్కాయి. ఇక్కడ ఓట్లకూ సీట్లకూ పొంతనలేదు. ఎన్డీఏ పక్షాలకు తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావడం, మహాఘట్ బంధన్ పక్షాలకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చినా తక్కువ శాతం సీట్లు రావడం ఆశ్చర్యం మాత్రమేకాదు కొత్త అనుమానాలకూ ఆస్కారం ఇచ్చింది. . 

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవో చాలామందికి గుర్తుండవు. సిబిఐ, ఇడి, ఐటి, ఎన్ ఐఏలు, ఎన్నికల కమీషన్ లను మాత్రమేగాక అవసరం అయితే సుప్రీంకోర్టును సహితం బిజెపి తన భాగస్వామ్య పక్షాలుగా మార్చుకోగలదు.  దాని సామర్ధ్యం అపారమైనది. 

భారత ఎన్నికల కమీషన్ (ఇసిఐ) బీహార్ ఎన్నికల  ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించింది. సరిగ్గా ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరిట అది లక్షల మందిని ఓటర్ల జాబితానుండి తీసేసింది. మరికొన్ని లక్షల మందిని కొత్తగా చేర్చింది. ఎన్డీ కూటమికి వ్యతిరేకంగా ఓట్లేస్తారనే సమూహాలను జాబితానుండి తొలగించారనీ, ఎన్డీ కూటమికి అనుకూలురైన వారిని కొత్తగా చేర్చారని ఆరోపణలున్నాయి. భారత ఎన్నికల ప్రధాన అధికారీ గ్యానేష్ కుమార్ ఈ వ్యూహాన్ని  రచించి అమలు చేశారని రాహుల్ గాంధీ గణాంకాలతో సహా చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని తేలిగ్గా కొట్టివేయలేం. 

1980-90ల నాటి మాట. స్వదేశీ పిచ్ ల మీద ఇండియాకన్నా పాకిస్తాన్ మెరుగైన ఫలితాలను సాధిస్తున్న  కాలంలో ఒక స్పోర్ట్స్ ప్రతినిధి 'లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్ ను ఒక చిత్రమైన ప్రశ్నవేశాడు. ఇండియా టీమ్ లోనికి పాకిస్తాన్ టీమ్ నుండి ఒక ప్లేయర్ ను తీసుకోవాల్సి వస్తే తన  ప్రాధాన్యత ఎవరూ? అని అడిగాడు. దానికి గవాస్కర్ అంతకన్నా చిత్రమైన సమాధానం చెప్పాడు. "నేను ఏ పాకిస్తానీ ఆటగాడిని ఎంచుకోను. నిజానికి, నేను భారత జట్టులోకి పాకిస్తానీ అంపైర్‌ను తీసుకుంటాను!" అనే అర్ధం వచ్చేలా సమాధానం చెప్పాడు. ఆటగాళ్లకన్నా అంపైర్ల తప్పుడు నిర్ణయాలవల్ల పాకిస్తాన్ గెలుస్తున్నది అని చెప్పడం గవాస్కర్ ఉద్దేశ్యం. బిహార్ ఎన్నికల ఫలితాలను చూసేక గవాస్కర్ మాటలు  గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నికల ప్రధానాధికారులు వుంటే చాలు మోదీజీ-అమిత్ షాజీల జోడి ఎన్ని విజయాలనైనా సాధించగలదు.   

రచన : 17-11-2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 18-11-2025

https://www.andhrajyothy.com/2025/editorial/bihar-elections-why-the-umpire-matters-more-than-the-players-1467168.html

https://epaper.andhrajyothy.com/article/Hyderabad_Main_II?OrgId=1811ba5c9fb9&eid=224&imageview=1&device=desktop

Monday, 10 November 2025

We know the enemy but not the Friends

*శత్రువు తెలుసు; మిత్రులెవరో తెలీదు!!*

 

నిన్న (16-11-2025) సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.

పత్రిక యాజమాన్యం,  సంపాదకులు, ఎడిట్ పేజీ ఇన్ –చార్జీలకు ధన్యవాదాలు

-         డానీ

సమాజ విశ్లేషకులు

 


వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణిస్తున్నారు. ఇది కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal Dictatorship-CCD) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఏ).

 

ఈ వ్యవస్థ మారాలని  అత్యధికులు  ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి.  మొదటిది; కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వ రాజ్యాన్ని కూల్చి, ఎన్డీయేను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరిష్కారం. అయితే,  ఆచరణ అంత సులువుకాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్ధాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా   అన్వయించుకోవచ్చు.  

 

లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌరసమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌరసమాజాన్ని కూడ ఇప్పుడు సిసిడి కలుషితం చేసేసింది. సమానత్వ,  సహోదర, సామ్యవాద భావాల నుండి సమాజాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుధ్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.

 

బహుళ పార్టీల పార్లమెంటరి ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం వుంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లో మనకు  నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడ కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు వుంటారు. వాళ్ళలో ఓ 70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసే బృహత్తర పథకాన్ని రచించి కఛ్ఛితంగా ఫలితాలను సాధించే కార్యాచరణ ఒకటి వుండాలి.

 

అయితే, ప్రజాస్వామ్యం పేదదికాదు; పేదోళ్ళది అంతకన్నా కాదు.  రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజాస్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పారడాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి! (Manufacturing Consent) అన్నమాట. ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.

 

అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సిసిడి ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమనుతాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు.  2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్ డి కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే. అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు  ఎన్ డి కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్ధం ఏమిటీ? ఎన్ డి కూటమి తన స్వంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యతవల్ల మాత్రమే గెలుస్తున్నది.

 

ఈ గణాంకాలను చూసినపుడు ఎవరికైనా వచ్చే ఆలోచన ఏమంటే విపక్షాలు ఏకం అయితే ఎన్డీ కూటమిని ఓడించడం సులువు అని. గణితశాస్త్రం ప్రకారం ఇది వాస్తవం. గానీ, విపక్షాలను ఏకం చేయడం రాజకీయంగా అంతసులువు కాదు. ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుంటాయి. మరోవైపు, ఎన్డీ కూటమి ఎకశిలా సదృశ్యంగా సమైక్యంగా వుంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీష్ కుమార్ వంటి సోషలిస్టులు కూడ వుంటారు. అయినా, ఒక్కటై వుంటారు. అది వాళ్ళ విజయరహాస్యం.

 

విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఎద్దేలు కర్ణాటక (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసమాజం ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుంబిగించింది. ఎన్నికలకు సంబంధించిన సూక్ష్మ అంశాలను కూడ వదలకుండ గొప్ప వ్యూహరచన చేసింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నాలజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో వున్న బిజెపి ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగావున్నాసరే ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రతిపక్షంగావున్న కాంగ్రెస్ కు ఓట్లు స్వల్పంగానే (4-5 శాతం) పెరిగినాగానీ సీట్లు భారీగా పెరిగాయి.  అధికారాన్ని చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగావున్నచోటనే ఎద్దేలు కర్ణాటక ప్రత్యేక దృష్టిపెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బిజెపి తన ఆధిక్యాన్ని చాటుకుంది. కాంగ్రెస్ కు 9 స్థానాలు దక్కితే బిజెపి 19 స్థానాలు కైవశం చేసుకుంది.

 

ఎద్దేలు కర్ణాటక ఉత్తేజంతో 2023 తెలంగాణ ఎన్నికల్లో, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ మేలుకో తెలంగాణ, మేలుకో ఆంధ్రప్రదేశ్, ‘భారత్ బచావో’ పేర్లతో  కొందరు కొంత కృషి చేశారు. తెలంగాణలో బిఆర్ ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అయితే, అందులో ఈ పౌరసంస్థల  ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ సంస్థలు చురుగ్గా పనిచేసిన హైదరాబాద్ నగరంలో అధికార బిఆర్ ఎస్ బలం ఏమాత్రం తగ్గకపోగా పెరిగింది. అంటే నెగటివ్ ఎఫెక్ట్ వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ లో కూడ మేలుకో ఆంధ్రప్రదేశ్, భారత్ బచావో ప్రభావం అస్సలు లేదు. పైగా, ప్రతిపక్షంగావున్న ఎన్డీ కూటమి అధికారాన్ని చేపట్టింది.  అంతేగాక ఏపి, తెలంగాణల్లో ఎన్డీ కూటమి లోక్ సభ స్థానాలు  పెరిగాయి. ఇదంతా నెగటివ్ ఎఫెక్ట్. 

 

ఇందులో  రెండు అంశాల్ని గమనించవచ్చు. మొదటిది; ఈ ఎన్నికలు అన్నింట్లో ప్రజలు రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టిల బలాన్ని తగ్గించారు. రెండోది; కీలకమైన లోక్ సభ ఎన్నికల్ని పౌర సంఘాలు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.

 

రాబోయే 2029 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి.  ఇదొక సానుకూల సంకేతం. అయితే, జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకత వుంది. ఎన్డీ కూటమికి ప్రతిపక్షం లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంచేత అధికార కూటమికి వ్యతిరేకంగా, ప్రతిపక్షాలతో ఐక్య కార్యాచరణ  కమిటీలను ఏర్పరచడానికి ఇక్కడి నేల అనువుగాలేదు. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా వుంటున్న ఇండియా కూటమి కాలుమోపడానికి ఇక్కడ చోటు కనిపించడం లేదు. అంచేత ఇక్కడ జీరో నుండి మొదలెట్టాలి.

 

తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజికన్యాయ (అంబేడ్కర్)  ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సిసిడి, ఎన్డీ కూటమికి బాధిత సమూహాలు అనేకం వున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం వుంటుంది. ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మతసామరస్యం ప్రధాన ఆదర్శం. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహాలన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి.

 

ఇంతటి బాహుబలి ప్రాజెక్టును ఒక్కసారిగా చేపట్టలేనప్పుడు దాన్ని క్యాప్సూల్స్ గా మార్చి వంతులవారీగా పూర్తిచేయడం ఒక ఆచరణ సాధ్యమైన మార్గం. అలా, మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ లోని వామపక్షాలన్నింటినీ ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది ఇప్పుడు ముందుకు వచ్చిన ఒక ప్రతిపాదన. ఆ వెంటనే సామాజికన్యాయ పార్టీలను కలపాలనేది లక్ష్యం.   నిజానికి ఇదేమీ కొత్తది కాదు. ఇలాంటి వేదికలు ఇప్పటికే వున్నాయి. వాటికి ఒక విచిత్ర లక్షణం వుంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత అవి కలిసి వుంటాయి. ఎన్నికల సమయంలో ఎవరి ఎత్తుగడలు వారివి; ఎవరి పొత్తులు వారివి. అంచేత, ఇప్పటి జేఏసిలు ఎన్నికలకు పనికిరావు. పైగా, లోక్ సభ వ్యూహాల్ని పార్టీల కేంద్ర కమిటీలు రచిస్తాయి, రాష్ట్ర కమిటీలు వాటిని ఆచరిస్తాయి. అందుచేత, ఈ విషయాల్లో రాష్ట్ర కమిటీలు చేయగలిగింది కూడ ఏమీవుండదు. లోక్ సభ ఎన్నికల మీద గురిపెట్టి  రాష్ట్ర కమిటీలతో మాట్లాడడంలో ప్రయోజనం వుండదు.

 

ఎవర్ని, ఎందుకు ఓడించాలనుకుంటున్నామూ? ఎవర్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నామూ? అనే రెండు అంశాలను స్పష్టంగా ప్రజల ముందు పెట్టాలి. దానికి అనుగుణంగా కలిసి వచ్చే శక్తుల్ని పార్టిల్ని అక్కున చేర్చుకోవాలి. కలిసిరాని శక్తుల్ని పార్టిల్ని నిర్మొహమాటంగా విమర్శించాలి. 

 

లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యన్ని సాధించగలమనే దాని మీదనే మేధోమధనం సాగాలి. 

 

రచన : 9 నవంబరు 2025

ప్రచురణ : 16 నవంబరు 2025

సాక్షి దినపత్రిక

 

https://www.sakshi.com/telugu-news/guest-columns/bjp-led-national-democratic-alliance-has-secured-parliamentary-supremacy



Friday, 7 November 2025

Jawahar Lal Nehru in America - అమెరికాలో జవహర్ లాల్ !

 *అమెరికాలో జవహర్ లాల్!*

 

డానీ

సమాజ విశ్లేషకులు




 

* అమెరికాలో జవహర్ లాల్!*

 

డానీ

సమాజ విశ్లేషకులు

 



జొహ్రాన్ మందానీ అనే ఒక ముస్లిం అడ్వకేట్  గేమ్ చేంజర్ గా మారి న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యాడు. ఆయన గెలుపుకు అనేక ప్రత్యేకతలున్నాయి.

 

జోహ్రాన్ భారత సంతతికి చెందినవాడు. తల్లి మీరా నాయర్ హిందువు, సినిమారంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దర్శక నిర్మాత. తండ్రి మహమూద్ మందాని కూడ భారతీయ ముస్లిం. కొలంబియా  విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్. బహుగ్రంధాల ప్రసిధ్ధ రచయిత. ఇదే న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటరుకు చెందిన రెండు టవర్లను 2001 సెప్టెంబరు 11న (9/11) అల్ ఖైదా ఉగ్రవాదులు కూల్చివేయడం మనందరికీ తెలుసు. ఆ తరువాత అమెరిక, ఇస్లాం సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఉగ్రవాదం వుందంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలెట్టింది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నాము. ఈ ప్రచారంలోని బూటకాన్ని బయటపెడుతూ మహమూద్ మందాని ‘మంచి ముస్లిం, చెడ్డ ముస్లిం’ అనే గ్రంధాన్ని రాసి ప్రచురించాడు. 1979లో సోవియట్ రష్యా అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినపుడు అక్కడి ముస్లింలు తిరగబడ్డారు. రష్యాతో అంతర్జాతీయ వైరంవున్న అమెరికా దీనిని గొప్ప అవకాశంగా భావించింది. ఆఫ్ఘన్ గెరిల్లాలకు అమెరిక ఆయుధాలు, డబ్బు రెండూ సరఫరాచేసి, పాకిస్తాన్ సహకారంతో  ఉగ్రవాద శిక్షణ యిచ్చిందని  మందాని తగిన ఆధారాలతో తన పుస్తకంలో వివరించాడు. రోనాల్డ్ రీగన్ అధ్యక్షునిగా వుండగా ఆఫ్ఘన్ గెరిల్లాలను వైట్ హౌస్ కు ఆహ్వానించి వాళ్ళను స్వాతంత్ర్య సమరయోధులుగా పొగిడిన అంశాన్నీ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

 

మహమూద్ మందానీ, మీరా నాయర్ ఉగాండాలో పనిచేస్తున్న కాలంలో వాళ్లకు జొహ్రాన్ మందానీ జన్మించాడు. జొహ్రాన్ ఏడేళ్ల వయస్సులో వున్నప్పుడు మందానీ కుటుంబం అమెరికాకు మారింది. జొహ్రాన్ ఈ ఏడాదే డిజిటల్ క్రియేటర్ జోహ్రాన్ రమా దువాజీని దుబాయ్ లో నిఖా చేసుకున్నాడు. అలా వారిది ఒక రకంగా వసుధైక కుటుంబం.

 

న్యూయార్క్ లో జొహ్రాన్ అడ్వకేట్ గా  స్థిరపడి మానవహక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అమెరిక ఎన్నికలు జొహ్రాన్ కు కొత్తకాదు. న్యూయార్క్ శాసనసభకు అస్టోరియ (క్వీన్స్) నియోజకవర్గం నుండి  2020లో పోటీ చేసి ఐదు వరుస విజయాలున్న ఘనాపాటిని ఓడించాడు. 2022, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం అతను శాసన సభ్యుడు.

 

ప్రపంచ రాజధానిగా భావించే న్యూయార్క్ నగరాన్ని సహజంగానే ప్రపంచ ధనవంతులు ఏలుతుంటారు. వాళ్లలో అత్యధికులు యూదులు. వాళ్ళే రాజకీయ రంగాన్నీ శాసిస్తుంటారు. మీడియా కూడ వాళ్ల చెప్పుచేతల్లోనే వుంటుంది.  వీళ్లను అలిగార్కీ అంటారు. అలిగార్కీ అండదండలు లేకుండా ఎవరూ అక్కడ ఏ రంగంలోనూ నిలదొక్కుకోలేదు.

 

మేయర్ బరిలో దిగినప్పుడు జొహ్రాన్ ను ఎవరూ పట్టించుకోలేదు.  ఒక చేత్తో ప్లకార్డ్, మరో చేతిలో మైక్ పట్టుకుని ప్రసంగిస్తూ వీధుల్లో నడుస్తుంటే ఒక్కరూ తలతిప్పి చూసేవారు కాదు. పోటీలో పది మంది వుంటే మీడియా అతనికి పదో ర్యాంకు ఇచ్చింది. ఒక శాతం ఓట్లు రావడం కూడ కష్టమని చెప్పింది.

 

ఇటీవలి కాలంలో నెపాల్ లో యువతరం సాగించిన అకస్మిక నిరసనల తరువాత  జెన్-జి పేరు వెలుగులోనికి వచ్చింది.  వీటిని అరబ్ స్ప్రింగ్ తరహా నిరసనలు (Arab Spring-style protests) అంటారు.  టునీషియా, ఈజిప్టు, లిబియా తదితర అరబ్ దేశాల్లోని ముస్లిం యువకులు దీనిని మొదలెట్టారు.

జొహ్రాన్ వయస్సు ఇప్పుడు 34 సంవత్సరాలు. జీ జెనరేషన్  సాప్రదాయం తెలిసినవాడు. న్యూయార్క్ లో ధనవంతుల్ని అతను అస్సలు పట్టించుకోలేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదల్ని లక్ష్యంగా పెట్టుకుని తనప్రచారాన్ని సాగించాడు. “గోదాంలో పెట్టెలు మోసి నీలి మచ్చలుపడ్డ వేళ్లు, డెలివరీ సైకిల్ హ్యాండిల్స్ వల్ల గట్టిగా మారిన అరచేతులు, కిచెన్‌లో కాలిన గాయాలు ఉన్న ముడివేళ్లు. ఇలాంటి చేతులకు అధికారాన్ని పట్టుకునే అవకాశం ఎవరూ ఇక్కడ ఇవ్వరు”. ప్రతి అడ్డంకినీ దాటి ఒక మహా రాజకీయ వంశాన్ని కూల్చివేసి మన భవిష్యత్తుని మన చేతులతో పట్టుకుందాం వంటి మాటలు అణగారిన సమూహాలకు గొప్ప ఉత్తేజాన్నిచ్చాయి.  

 

ఎదురీదడం జొహ్రాన్ నైజం. అతను ముస్లిం అని గుర్తుచేసి, అవకాశం ఇస్తే 9/11 టెర్రరిస్టు సంఘటనలు పునరావృతం అవుతాయని  ప్రచారం మొదలెట్టారు అతని ప్రత్యర్ధులు. అతన్ని శరణార్ధి, చొరబాటుదారుడు అన్నవాళ్ళూ వున్నారు. దానికి అతను భుజాలు తడుముకోలేదు. “అవును నేను ముస్లింను. ముస్లిం ఆచార వ్యవహారాలను  పాటిస్తాను” అంటూ తాను ఇష్టంగా బిర్యాని తింటున్న విడియోను సోషల్ మీడియాలో పెట్టిన గడుసరి అతను.

 

టేల్ అవీవ్ తరువాత ప్రపంచంలో యూదులు అత్యధికంగా నివశిస్తున్న నగరం న్యూయార్క్. అలాంటి నగరంలో ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా ముందు యూదు పెద్దల ఇంటికి వెళ్ళి ఆశ్వీరాదం తీసుకోవడం సాంప్రదాయం. తాము గెలిస్తే ముందు ఇజ్రాయిల్ వెళతామని ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు వాగ్దానం చేస్తుంటారు. జొహ్రాన్ మహామొండి. తాను మేయర్ గా గెలిస్తే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహును న్యూయార్క్ లో కాలుపెట్టనీయనని ప్రకటించాడు. ఒకవేళ అతను వస్తే,  అరెస్టు చేస్తాను అని కరాకండీగా అన్నాడు. యుధ్ధనేరాలకు పాల్పడినందుకు నెతన్యాహు మీద ఏడాది క్రితం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసిసి) ఒక అరెస్టు వారెంటు జారీచేసిన విషయం తెలిసిందే. . 

 

న్యూయార్క్ మహానగరంలో జొహ్రాన్ ఒక సామాజికార్ధిక సరిహద్దు గీత గీశాడు. వున్నోళ్ళు తన ప్రత్యర్ధులు, లేనోళ్ళే తన  మద్దతుదారులు. పేదల ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. వాటి పరిష్కారాల కోసం పథకాలు ప్రకటించాడు. హెల్త్ కేర్, ఇంటి రెంటు, స్వంత ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాల మీద జొహ్రాన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు జనాకర్షణగా మారాయి. ఒక అడ్వకేట్ గా మానవ హక్కుల పరిరక్షణ కోసం అతను చేస్తున్న కృషికి కూడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో అతని భార్య సాగించిన ప్రచారం కూడ బాగా పనిచేసింది. క్రమంగా అతని మద్దతుదారులు పెరిగారు.

 

మమ్దానీ రేసులో దూసుకుని వెళుతున్నాడనే సంకేతాలు రాగానే ఒలిగార్కి తన దగ్గరున్న పావులన్నీ కదిపింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మమ్దానీనీ బహిరంగంగా హేళన చేశాడు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అతన్ని మేయర్ గా ఎన్నుకుంటే న్యూయార్క్ నగరానికి ఫెడరల్ నిధుల్లో కోత విధిస్తానన్నాడు. డెమొక్రాట్స్ పార్టీకే చెందిన అమెరిక మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా సహితం మందానీ కోసం ప్రచారం చేయడానికి నిరాకరించాడు.

 

సాహిత్యంతో పరిచయం వున్నవాళ్ళకు మమ్దానీ ఉపన్యాస శైలి  జాక్ లండన్ నవల ఉక్కుపాదం (ఐరన్ హీల్) లోని కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవ్వర్ హార్డ్ ను గుర్తుకు తెచ్చింది.  సామాజిక ఉద్యమాలతో పరిచయం వున్నవాళ్ళకు ముస్లిం మస్జీద్ (Muslim Mosque)  వ్యవస్థాపకుడు, ఆఫ్రో అమెరికన్ ఉద్యకారుడు మాల్కమ్-ఎక్స్ ను గుర్తుకు తెచ్చింది.

ప్రత్యర్ధులు అతన్ని కమ్యూనిస్టు, మార్క్సిస్టు, రాడికల్ అన్నారు. అలా అన్నా  న్యూయార్కీయులు భయపడతారని అనుకున్నారు. కానీ అందుకు విరుధ్ధంగా జరిగింది. ఇస్లామోఫోబియా రాజ్యం చేస్తున్న చోట ఒక ముస్లింను న్యూయార్కీయులు ఎన్నుకున్నారు. వసలదారుల భరతం పడతానంటూ దేశాధ్యక్షుడు రంకెలు వేస్తున్న చోట ఒక వలసదారుడిని గెలిపించారు.  ఇదేమీ విప్లవంకాదు; అక్కడేమీ సోషలిస్టు రాజ్యం ఏర్పడడంలేదు. కాకపోతే జొహ్రాన్ గెలుపుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రధానంగా ఇది అమెరికాలో అణగారిన సమూహాలకు ఆత్మగౌరవ విజయం!!!

 

ఆర్ధిక విధానాల్లో రిపబ్లికన్స్, డెమొక్రాట్స్ మధ్య పెద్ద తేడా ఏమీలేదు. డెమోక్రాట్స్ లో జొహ్రాన్  నిస్సందేహంగా వామపక్షం.  మనకు కూడ కాంగ్రెస్ లో ఒకప్పుడు కుడిపక్షం వామపక్షంవుండేది. గోపాలకృష్ణ గోఖలే, సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌ కుడిపక్షం; జహవర్ లాల్ నెహ్రు,  సుభాష్ చంద్రబోస్ వామపక్షంగా వుండేవాడు. జోహ్రాన్ మందానీ కమ్యూనిస్టుకాడు; నక్సలైటూ కాడు. కేవలం సోషల్  డెమోక్రాట్. అతనిప్పుడు అమెరికాలో జవహర్ లాల్ నెహ్రూ! గెలిచినప్పుడు కూడ అతను నెహ్రూని తలుచుకోవడం యాధృఛ్ఛికం కాదు.

 

“న్యూయార్క్ వలసదారుల నగరం. ఇది వలసదారులు నిర్మించిన నగరం. వలసదారులు శక్తివంతంగా మార్చిన నగరం. ఇది వలసదారుల నగరంగా కొనసాగుతుంది.  అంతేకాదు; ఈ రాత్రి నుండి అయితే ఇది వలసదారులు నడుపుతున్న నగరం. అయ్యా డొనాల్డ్ ట్రంపుగారు! నా మాటలు గట్టిగా ఆలకించండి. ఇక్కడ మీరు ఎవరిని తాకాలన్నా మిమ్మల్ని అందరినీ దాటుకుని వెళ్ళాలి” అంటూ జోహ్రాన్ తన విజయోత్సవ సభలో అన్న మాటలు అమెరిక రాజకీయాల్లో రాబోయే మార్పులకు సంకేతం కావచ్చు.

 

మనదేశంలోనూ జొహ్రాన్ ఎన్నిక మీద చర్చ జరుగుతోంది.  అతను బాహాటంగానే గుజరాత్ అల్లర్లను విమర్శించాడు కనుక బిజేపి –ఎన్డీయే పక్షాలు అసహనంగానే వుంటాయి. ఇక కమ్యూనిస్టు పార్టీల్లో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. నేపాల్ లో యువతరం తిరగబడి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేశాక, బస్తర్ అడవుల్లో మావోయిస్టుల లొంగుబాటు జాతరను చూసేక కమ్యూనిస్టు అభిమానుల్ని కుంగుబాటు గట్టిగా ఆవహించింది. వాళ్ళలో ఒక భాగానికి సోషలిస్టు ముద్రవున్న జొహ్రాన్ గెలుపు ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. జొహ్రాన్ ను సొషల్ డెమోక్రాట్ అనడానికి కూడ ఇష్టపడని తీవ్రవాదులు సహితం భారత కమ్యూనిస్టు శిబిరంలో వున్నారు. వాళ్ళు సహజంగానే అతని గెలుపును తగ్గించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్ళను ట్రంపు ఆవహిస్తే, జొహ్రాన్ ను శరణార్ధి, చొరబాటుదారుడు అన్నా ఆశ్చర్యం ఏమీలేదు.

 

రచన : 7 నవంబరు 2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి 9 నవంబరు 2025

https://www.andhrajyothy.com/2025/editorial/zohan-mamdani-the-jawaharlal-of-america-1464345.html

https://epaper.andhrajyothy.com/NTR_VIJAYAWADA_MAIN?eid=182&edate=09/11/2025&pgid=1226166&device=desktop&view=3