*సతీష్ చందర్ మన కాలపు మంచి వ్యంగ్య రచయిత*
AM Khan Yazdani (Danny)
ఇటీవల సమాజ విశ్లేషణలో పడి సాహిత్యకారుడ్ననే స్పృహను కూడ కోల్పోయాను. చాలా రోజుల తరువాత నిన్న ఒక సాహిత్య సభలో సాహిత్యకారునిగా ప్రసంగించాను.
సతీష్ చందర్ కొత్త పుస్తకం 'మూడు ముడులు 33' పరిచయ సభ నిన్న విజయవాడలో జరిగింది. నేను అందులో గౌరవ అతిథిగా పాల్గొన్నాను.
సతీష్ చందర్ మన కాలపు మంచి వ్యంగ్య రచయిత.
తెలుగు, ఇంగ్లీషు పదాలతో ఆయన ఆడుకునే తీరు చాలా ముచ్చటగా వుంటుంది.
సాహిత్య ప్రక్రియల్లో హాస్యం రాయడం క్లిష్టమైనది అంటారు. హాస్యం కన్నా వ్యంగ్యం ఇంకా క్లిష్టమైన ప్రక్రియ.
హాస్య రచనల్లో నవ్విస్తే సరిపోతుంది. వ్యంగ్యం అలాకాదు; నవ్విస్తూ విమర్శించాలి. ఇది చాలా క్లిష్టమైన విన్యాసం. దానికో ప్రగాఢమైన ప్రాపంచిక దృక్పథం కావాలి. అది సతీష్ చందర్ కు పుష్కలంగా వుంది. తెలుగులో ఆయన తొలి దళిత కవి కదా!
జీవిత కాలంలో ఏదో ఒక దశలో మంచి రచయితగానో, కవిగానో కొనసాగినవారు చాలామంది వుంటారు. ఓ ముఫ్ఫయి నలభై యేళ్ళు అదే ధోరణిని అదే స్థానంలో కొనసాగించడం సామాన్య విషయం కాదు. ఆ ఫీట్ ను సతీష్ చందర్ సాధించారు. కొనసాగిస్తున్నారు.
కుల వివక్ష సమాజంలో రాజకీయ రిజేర్వేషన్ల వల్ల ఎస్సీలలో చెంచాగాళ్లు పుట్టుకొచ్చారని కాన్షీరామ్ ఒక గ్రంధాన్నే రాశారు. పురుషాధిక్య సమాజంలో మహిళలకు చట్ట సభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఇస్తే రాబోయే కాలంలో ఆ అవకాశాల్ని పురుషులు ఎలా తన్నుకుపోతారో ఈ 33 కథలు చెపుతాయి.
తొలి వాక్యంలో ఒక గాలం వేయడం సతీష్ చందర్ శైలి. అది మన మెదడుని పట్టేసుకుని కథ చివరి వరకు లాక్కొని వెళిపోతుంది.
వీటిల్లో నాకు మరీమరీ నచ్చిన కథ 'సన్ ఆఫ్ సెవెంటీ'. కొన్నాళ్ళుగా నేను 'ఒన్ ఆఫ్ సెవెంటీ' మీద పనిచేస్తున్నాను. ఈ నెల 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఆదివాసుల జాతీయ సదస్సులోనూ ఈ అంశం మీద చాలా చర్చ జరిగింది.
ఈ చట్టంతో నాకు ఒక వ్యక్తిగత అనుబంధం వుంది.
నాకు COPD వుంది. అదోరకం వుబ్బసం. హైదరాబాద్ లో కాలుష్యం ఎక్కువ కనుక నెలకోసారి గట్టిగానే ఇబ్బంది పెట్టేది. అలా COPD తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాలంలో ఒక డాక్యుమెంటరి నిర్మాణం కోసం లంబసింగి వెళ్ళాల్సి వచ్చింది. అత్యంత చలి ప్రదేశాన్ని తట్టుకోగలనా? అని భయం వేసింది. కానీ అలా జరగలేదు. పైగా, చాలా రిలీఫ్ వచ్చింది. నాతో ప్రయాణిస్తున్న ఓ డాక్టరును "హౌ?" అని అడిగాను. "ఇక్కడ పొల్యూషన్ లేదుకదా?" అని సమాధానం ఇచ్చాడు.
"అయితే, ఇక్కడ రోడ్డు పక్క వంద గజాల స్థలం ఇప్పించండి. చిన్న కుటీరం వేసుకుని వుండిపోతాను" అన్నాను.
"కుదరదు. ఇక్కడ ఒన్ ఆఫ్ సెవంటీ వుంది. ఆదివాసులు తప్ప ఇతరులు ఇక్కడ స్థలాలను కొనకూడదు" అన్నాడు.
తెగ నిరుత్సాహం కమ్ముకుంది.
"అయితే దానికో పరిష్కారం వుంది" అన్నాడు డాక్టరు.
" ఇక్కడి ఆదివాసీ అమ్మాయిని మీరు పెళ్ళి చేసుకుంటే, మీకు స్థలం వస్తుంది. రేపు మీకు ఆమెతో పిల్లలు పుడితే, వాళ్ళు ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేయవచ్చు" అన్నాడు.
"అయిడియా బాగుంది గానీ, కొంచెం లేటయింది" అన్నాను.
ఈ మైదాన తెలివితేటల మీద రూపొందిందే సన్నాఫ్ సెవెంటీ. కథను భలే ఎంజావ్ చేశా.
"ఖద్దరు నేసే వాడిని నేతన్న అంటారు; ఖద్దరు తొడిగేవాళ్లను నేత అంటారు" వంటి చమక్కులు ప్రతిపేజీలో ప్రతి పేరాలోనూ వున్నాయి.
వర్తమాన సమాజ పోకడల మీద ఆసక్తివున్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం.
22 నవంబరు 2025
No comments:
Post a Comment