Sunday, 25 January 2015

తుళ్ళూరు : బూమ్ నుండి క్రాష్ దిశగా

తుళ్ళూరు : బూమ్ నుండి క్రాష్ దిశగా
డానీ

పాత దీపాలకు కొత్త దీపాలు ఇస్తానంటాడు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో  మాంత్రికుడు. దాదాపు అదే తరహాలో, పల్లెల్లోని పంటపొలాలకు రాజధాని నగరంలో ఇళ్లస్థలాలు, వాణిజ్యస్థలాలు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

రైతు రుణమాఫీ ప్రహసనాన్ని చూశాక వ్యవసాయదారుల్లో కొత్త ప్రభుత్వం మీద నమ్మకం సడలింది అంటే అతిశయోక్తికాదు. కాబోయే కోర్ రాజధాని తుళ్ళూరు రైతుల్లో నమ్మకాన్ని పెంచడానికి స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోనికి దిగారు. కొత్త రాజధాని ఎలా వుంటుందో వివరిస్తూ పది రకాల ఊహా చిత్రాలను ప్రజల ముందు ఆవిష్కరించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే కొత్త రాజధాని హైదరాబాద్ కన్నా ఘనంగా వుంటుంది. సింగపూర్, పుత్రజయల్ని తలదన్నేలా వుంటుంది. న్యూయార్కు మహానగరం కూడా అసూయ పడేలా వుంటుంది.

హైదరాబాద్ లో వాణిజ్యస్థలాలు, ఇళ్ళస్తలాలూ అంటే ఎవరైనా బంజారా హిల్స్, జూబిలీహిల్స్ ల లోని ప్రధాన రోడ్లనో, మాధాపూర్ లోని ఐటీ కంపెనీలనో ఊహించుకుంటారే తప్ప చింతల్ బస్తీ, సితాఫల్ మండీ, సఫిల్ గూడనో ఊహించుకోరుకదా? తుళ్ళూరులో భూములు కొన్నవాళ్ళు అక్కడ హైదరాబాద్ జూబిలీహిల్స్, బంజారాహిల్స్ లలోని ప్రధాన రోడ్లనే ఊహించుకున్నారు.

ఈ సందర్భంగా చాలామంది  మరచిపోతున్న చారిత్రక వాస్తవం ఏమంటే హైదరాబాద్ భూములకు బూమ్  2005 తరువాత వచ్చింది,  అప్పటికి హైదరాబాద్ వయస్సు నాలుగు వందల సంవత్సరాలు దాటింది.  ఇది వేగయుగం కనుక, అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్కు ప్రతినిధి గనుక హైదరాబాద్ అభివృధ్ధికి   నాలుగు వందల సంవత్సరాలు పడితే కోర్ కేపిటల్ తుళ్ళూరు అభివృధ్ధికి   అందులో  పదోవంతు  కూడా  పట్టదని ప్రభుత్వ ప్రచారకులు గట్టిగా వాదిస్తున్నారు.

నిర్మాణరంగంలో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్  సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఆ విభాగంలో  గ్లోబల్ మొనగాడుగావున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రమోటర్లు  చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే ప్రచారం కూడా వుంది.  ఎల్ అండ్ టి సంస్థ ఈ పాటికే ఎక్కడో ఒకచోట భావి కోర్ కేపిటల్ ను ఫ్యాబ్రికేషన్ చేసేసి రెడీగా వుంచేసిందనీ,  సింగపూర్ కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్, జురాంగ్, సుహాన సంస్థలు మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మరుక్షణం వాటిని తెచ్చి ‘రాత్రికిరాత్రే’ తుళ్ళూరులో అమర్చేస్తారని నమ్ముతున్నవాళ్ళూ లేకపోలేదు.   ఆ వెంటనే జపాన్ సంస్థలు   రంగప్రవేశం చేసి   రాజధాని ప్రాంతాన్ని(కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ) అభివృధ్ధి చేసేస్తారనీ  మరో ప్రచారం సాగుతోంది. నిజానికి ఇలాంటి అతిశయోక్తుల ప్రచారాలకు స్వయంగా ప్రభుత్వాధినేతే ఆస్కారాన్ని ఇస్తున్నారు. 

హైదరాబాద్ అభివృధ్ధి వేగవంతం కావడానికి తమ  పెట్టుబడే కారణమనే అభిప్రాయం ఆంధ్రా ప్రాంతంలోని ఒక వర్గంలో బలంగావుంది. కొత్త రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ లో వున్న ఆంధ్రా కంపెనీలన్నీ స్వంత రాష్ట్రానికి తరలిపోతాయని ‘సమైక్యాంధ్రా ఉద్యమ’ కాలంలో ఒక బెదిరింపు లాంటి ప్రచారం కొంత సాగింది.

హైదరాబాద్ పెట్టుబడులన్నీ తన వెంటే నడుస్తాయని నమ్మే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తాను మంగళగిరి నుండి పరిపాలన సాగిస్తాననీ, అవసరమైతే చెట్ల కిందే  కుర్చీలు బల్లలు వేసుకుని పనిచేస్తామని ప్రకటించారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత విజయవాడలో షెడ్లు వేసుకుని పనిచేస్తామని వారు మరో ప్రకటన చేశారు. అదీ అమలు కాలేదు. హైదరాబాద్ నివాసాన్ని వదలలేని చంద్రబాబు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు అతిథిగా కొనసాగుతున్నారు. దానితో ఆంధ్రా పెట్టుబడుల తిరుగు-వలస కూడా సంధిగ్ధంలో పడిపోయింది.  

లాభార్జనే పెట్టుబడికి ఏకైక లక్ష్యం. లాభాల కోసం అది ప్రపంచమంతా విస్తరిస్తుంది. నాదేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నాఊరు, నావాళ్ళు అనే ఆదర్శాలు పెట్టుబడికి నప్పవు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అలాంటి భావోద్వేగాలు కనిపించినా అది కేవలం దాని ఆమోదాంశాన్ని పెంచుకోవడానికి చేసింది మాత్రమే అని అర్ధం చేసుకోవాలి. అంతేకానీ, అదే దాని ప్రధాన కార్యాకలాపం కాదు. పెట్టుబడికీ భావోద్వేగాలకూ సూత్రప్రాయంగా పడదు.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తుంటే  మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆంధ్రా పెట్టుబడుల తిరుగు-వలసకు అడ్డుకట్టలేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ఎన్నికలకు ముందు, ఎన్నికయిన కొత్తలో ఆంధ్రుల మీద  కేసిఆర్  ప్రదర్శిస్తూ వచ్చిన కరకు వైఖరిలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి.

ఆంధ్రుల్ని ‘ఏరిపారేస్తాం’ అనే పరోక్ష సంకేతాలతో కేసిఆర్  అట్టహాసంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కాగితాల గుట్టల వైపు ఇప్పుడు కన్నెత్తి చూసేవాడులేడు. తెలంగాణలో ఆంధ్రుల ప్రతినిధిగా భావించే తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోనికి తీసుకోవడమేగాక మంత్రివర్గంలో సహితం స్థానం కల్పించారు. సాక్షాత్తు చంద్రబాబుకు రాజగురువుగా భావించే రామోజీరావును స్వయంగా వెళ్ళి కలిసి రామోజీ ఫిల్మ్ సిటీని పొగిడి వచ్చారు. అక్కడ గజం భూమి కూడా ఆక్రమణ జరగలేదని అధికార ప్రకటన చేశారు.  అక్కినేని నాగేశ్వరరావు వల్లనే చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చి నగరాభివృధ్ధికి దోహదం  చేసిందని ఇంకో సందర్భంలో ఇంకో కితాబునిచ్చారు. ఆంధ్రావారైనాసరే పెట్టుబడులతో వస్తే  ఎర్రతివాచీ పరచి స్వాగతం చెపుతామని ఇంకో చారిత్రాత్మక  ప్రకటన చేశారు.

 గత ఏడాది సంక్రాంతి పండుగ తరువాత ఆంధ్రా ప్రాంతం నుండి తిరిగి వస్తున్న బస్సులు, రైళ్ళు, కార్లను తెలంగాణ ఉద్యమకారులు  అడ్డుకున్నారు. అక్కడక్కడ రాళ్ళు రువ్విన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈసారి వాళ్లను పూలు పంచి స్వాగతం పలికినా  ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇవన్నీ ఆంధ్రా పెట్టుబడులు వెనక్కి మరలకుండా చూడ్డానికి కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని  భావించాలి. ప్రాంతీయాభిమానంకన్నా పెట్టుబడి సంచయనం శక్తివంతమైనది.

ఆంధ్రప్రదేశ్ కోర్ కేపిటల్ గా తుళ్ళూరును ఎంపిక చేసినట్టు మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి ప్రకటించగానే అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం కేవలం 10-15 లక్షల రూపాయలున్న భూముల ధరలు ఒక వారం రోజుల్లో పది రెట్లు పెరిగాయి. అయితే, ఈ బూమ్ తుళ్ళూరుకే పరిమితం. విజయవాడకు అతి సమీపంలోవున్న ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర పరిసర గ్రామాల్లో భూముల ధరలు ఏడాది క్రితమే రెండు కోట్ల రూపాయలు దాటాయి. అక్కడి రైతులు అంతకన్నా తక్కువ ధరకు భూములివ్వడానికి సిధ్ధంగా లేరు.

ఇప్పుడు తుళ్ళూరులో కూడా భూమి ధరలు రెక్కలు తెగి పతనదిశగా సాగుతున్నాయి. భూ లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. దీనికి రెండు కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కోర్ క్యాపిటల్ మీద  చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అతిశయోక్తులుగా కనిపిస్తూ వుండడం ఒక కారణంకాగా తమ మీద  కేసిఆర్ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తే తాము స్వరాష్ట్రానికి తరలి వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చని ఆంధ్రా ప్రమోటర్ల కార్పొరేట్ కంపెనీలు భావిస్తుండడం మరో కారణం. హైదరాబాద్ మీద చంద్రబాబుకే కాదు కార్పొరేట్ కంపెనీలకూ  ప్రేమే కదా!

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
సెల్ : 90107 57776
హైదరాబాద్‍
14 జనవరి 2015  

ప్రచురణ : సాక్షి దినపత్రిక , 26 జనవరి 2015