Tuesday 28 February 2023

God is my Judge

 “దేవుడే నా న్యాయమూర్తి”

God is my Judge

 

కాలేజీ రోజుల్లో నన్నెవరూ రాగింగ్ చేయలేదు. అప్పటికే నేను ఓ చిన్నసైజు స్ట్రీట్ ఫైటర్ ని అనిపించుకుంటున్నాను. ఆ తరువాతి రోజుల్లో ఓ రాత్రి ఓ ఫ్రెండ్స్ మీట్ లో ఒకడు తన ఎత్తును అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదో ఒక వంకతో నన్ను ఎగతాళి చేయడం మొదలెట్టాడు. నేను లేచి కూర్చున్న ఇనప కుర్చీని మడత పెట్టి శక్తికొద్దీ వాడి కాళ్ళ మీద కొట్టాను. అతను ముందు ఎముకల డాక్టరు దగ్గరకు వెళ్ళి పట్టు వేయించుకుని మరునాడు పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టాడు. నేను ఐదు అడుగుల మూడు అంగుళాలు. అతను ఆరు అడుగులు. ఒకడ్ని కొట్టడానికి ఎత్తుతో పనిలేదని అర్ధం అయ్యి చాలా ధైర్యం వచ్చేసింది. అప్పటి నుండి “Danny is not my name; it’s my attitude” అనడం మొదలెట్టాను. 

 

అన్నట్టు డానీ అనే పేరు క్రైస్తవ సమాజంలో తరచుగా వినపడుతుండడం వల్ల నన్ను తొలి పరిచయంలో చాలామంది క్రైస్తవుడ్ని అనుకోవడం సహజం. డేనియల్ అనే వారు క్రైస్తవులకు, ముస్లింలకు (دانيال) ఉమ్మడి ప్రవక్త. బహుశ యూదులకు కూడ వారు ప్రవక్తకావచ్చు. డేనియల్ ప్రవక్త సింహాలతో గుహలో వున్నారని  అంటారు.  “దేవుడే నా న్యాయమూర్తి” అనేది డేనియల్ ప్రవక్త ప్రవచనం.

 

నిజాం సంస్థానానికి చెందిన దక్కన్ చరిత్రకారుడు గులాం యజ్దానిగారి ప్రేరణతో నాకు యజ్దానీ అని పేరు పెట్టారు. యాజ్దాన్ మూలం పురాతన కుర్దుల్లో వుందంటారు. కుర్దూలు ఎవరూ? అంటే మళ్ళీ అదో కత.

లాల్ నీల్ హర్యాలి నేటి నినాదం కావాలి!

          లాల్ నీల్ హర్యాలి నేటి నినాదం కావాలి!

 

ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

          వైద్య ఆరోగ్యరంగంలో రోగ చికిత్సకు ఒక మూడు దశల  ప్రొసీజర్ వుంటుంది. మొదటి దశలో, వివిధ పరీక్షల ద్వార రోగాన్ని నిర్ధారిస్తారు. రెండవ దశలో, ఆ పరీక్షల నివేదికలనుబట్టి  రోగం నుండి రోగిని బయటపడేయడానికి మందులు సూచిస్తారు. మూడవ దశలో; నిర్ణిత సమయంలో ఆ మందుల్ని  వాడుతారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడ చేస్తారు. సమాజానికి సోకిన రోగాల్ని నయం చేయడానికి కూడ అలాంటి మూడు దశల ప్రొసీజర్ వుంటుంది. మొదటి దశలో,  వివిధ సర్వేల ద్వార సమాజ స్వభావాన్ని నిర్ధారించాలి. రెండవ దశలో, సర్వే నివేదికలను బట్టి సమాజన్ని  ఆరోగ్యంగా మార్చే విధానాలను సూచించాలి. మూడవ దశలో, ఒక నిర్ణిత కాలక్రమం ప్రకారం ఆ విధానాలను అమలు చేయాలి; అవసరం అయితే శస్త్ర చికిత్స కూడ చేయాలి.

 

          వైద్య ఆరోగ్య రంగానికీ, సమాజానికీ మధ్య ఒక కీలక తేడా వుంటుంది. వైద్యరంగంలో రోగి ఆరోగ్యాన్ని పునరుధ్ధరిస్తే సరిపోతుంది. సమాజంలో అలా కాదు; పాత సమీకరణల్ని మొత్తంగా అంతం చేసి మొత్తం కొత్త సమీకరణలతో ఒక కొత్త సమాజాన్ని ఏర్పారచాల్సివుంటుంది. అంచేత ఉద్యమకారులందరూ మూల సమాజంలోవున్న రుగ్మతల్ని చెప్పి వాటిని పరిష్కరిస్తామని చెప్పడమేగాక లక్ష్య సమాజంలో విభిన్న మానవ సమూహాల మధ్య సంబంధాలు ఎలావుంటాయో విధిగా వివరంగా చెప్పి తీరాలి.   తూర్పుయూరప్ పరిణామాలు, రష్యా విఛ్ఛిన్నం, చైనాలో మైనారిటీ సమూహాలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిసిన కాలంలో లక్ష్య సమాజం ఎలా వుండాలో వివరించాల్సిన అవసరం మరీ పెరిగింది.

 

          తెలుగువాళ్లకు కూడ ఇలాంటి అనుభవాలున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి చెప్పేటప్పుడు బందగీ, ఐలమ్మలు సాగించిన వీరోచిత పోరాటాల గురించి చాలా ఘనంగా చెపుతుంటారు. కమ్యూనిస్టుపార్టి సాయుధ పోరాటాన్ని విరమించిన తరువాత తెలంగాణ ప్రాంతంలో సంపద బందగీ, ఐలమ్మల సామాజికవర్గాలకు చేరిందా? లేక  నాటి  దేశ్ ముఖ్ ల సామాజికవర్గాలకే మళ్ళీ చేరిందా? అనేది మనల్ని వెంటాడుతున్న ప్రశ్నలు. పోరాటం అనంతరం కూడ  నాటి దేశ్ ముఖ్ ల సామాజికవర్గాల దగ్గరికే సంపద చేరుతుంటే అసలా పోరాటం దేనికీ? మనం ఇన్నాళ్ళు త్యాగాలను మాత్రమే కీర్తిస్తున్నాముగానీ; విజయాలను కీర్తించే అవకాశం మనకు రాలేదు.  

 

          పీపుల్స్ వార్ పార్టి ఘనంగా చెప్పుకునే ‘జగిత్యాల జైత్రయాత్ర’ విషయంలోనూ  ఇప్పుడు ఇలాంటి కథనాలే వినిపిస్తున్నాయి. మళ్ళీ ఆ ప్రాంత గ్రామాల్లో దొరల గడియలు కొత్త రంగులతో మెరిసిపోతున్నాయట. అంతేకాదు; కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో పేదలు ఆనాడు ఆక్రమించుకున్న భూములకు  పాత భూస్వాముల పేరిటే కేసిఆర్ కొత్త పట్టాలు జారిచేశారట. (ఈ సమాచారం తప్పయితే సరిదిద్దుకోగలను)

 

1948 ఫిబ్రవరి నెలలో సాయుధపోరాటం ఒక్కటే మార్గమని భారత కమ్యూనిస్టు పార్టి కేంద్ర కమిటి పిలుపిస్తే ఏడు నెలలు తిరగకుండానే ఆ ఏడాది సెప్టెంబరు మధ్యలో భారత కమ్యూనిస్టు పార్టి తెలంగాణ సమితి సాయుధపోరాట విరమణ ప్రకటన ఎందుకు చేసిందీ? ఇలాంటి ప్రకటన చేయడానికి కమ్యూనిస్టు పార్టి నాయకత్వపు వర్గ స్వభావం ఏ మేరకు ప్రభావితం చేసిందీ?  ఇవన్నీ ఎవరికయినా ఎప్పటికయినా రావలసిన సందేహాలే.  

 

          ఈ క్రమం మొత్తానికి భారత సమాజ స్వభావం ఏమిటనేది? మొదటి ప్రశ్న అయితే, దీన్ని మార్చి ఎలాంటి సమాజాన్ని నిర్మించదలిచాము అన్నది  రెండవ ప్రశ్న. ఆ సమాజాన్ని ఎలా నిర్మిస్తామూ? ఎవరెవరితో నిర్మిస్తామూ? ఎంత కాలంలో నిర్మిస్తామూ? అనేవి అన్నింటి కన్నా ముఖ్యమైన ప్రశ్నలు.

 

          భావి భారత సమాజం ఎలా వుండాలనే అంశం మీద జాతియోద్యమ కాలంలోనే  రెండు ధోరణులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా 1919-24 మధ్య కాలంలో ఒకవైపు ఖిలాఫత్ ఉద్యమం, మరోవైపు సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న  సమయంలో ఈ ధోరణులు మొలకెత్తాయి. వీటిల్లో; మొదటిది, భౌగోళిక జాతీయవాదం. బ్రిటీష్ వలస పాలన ఆరంభం అయ్యేనాటికి భారత ఉపఖండంలో నివశిస్తున్న వారందరూ భారతీయులు అనేది దీని నిర్వచనం. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు (భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం) నాటికే ఇలాంటి సమీకరణ ఒకటి స్థిరపడింది. బహుశ, సిపాయిల తిరుగుబాటు నాటి సామాజికవర్గాల సమీకరణ ఆధారంగానే మహాత్మా గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించాడు.  అయితే, ఖిలాఫత్ ఉద్యమంలో  ముందుకు వచ్చిన సీనియర్లు ఖిలాఫత్ ఉద్యమ  షౌకత్ అలీ, మౌలానా ముహమ్మద్ అలీ, హకీమ్ అజ్మల్ ఖాన్, అబ్దుల్ కలామ్ ఆజాద్ తదితరులు గాంధీజీ ప్రభావంతో  కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఆ ఉద్యమంలో వచ్చిన ముజాహిర్లలోని  యువతరం కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. వాళ్ళే రష్యా వెళ్ళి వచ్చి తాష్కెంట్ కోండల్లో 1920 అక్టోబరు 17న ముహమ్మద్ షఫీఖ్ కార్యదర్శిగా  భారతీయ కమ్యూనిస్టు పార్టిని నెలకొల్పారు.

 

రెండోది, సాంస్కృతిక జాతీయవాదం. భారత ఉపఖండంలో హిందూ  మతరాజ్యం ఏర్పడాలనేది దీని లక్ష్యం. అలా 1925 సెప్టెంబరు 27న ఆరెస్సెస్ ఆవిర్భవించింది. అంతకు ఓ ఏడాది ముందే 1924 జులై 20న  బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘బహిష్కృత హితకారిణీ సభ’ను నెలకొల్పాడు. హిందూ మత సమాజంలో వర్ణ-కుల అణిచివేతల నిర్మూలన జరగాలనేది దీని  లక్ష్యం.  

 

ఆరెస్సెస్ పుట్టిన మూడు నెలలకు 1925 డిసెంబరు 26న ఇండియన్ కమ్యూనిస్టు పార్టిని రద్దు చేసి భారత కమ్యూనిస్టు పార్టి ఆవిర్భవించింది. నిజానికి ఇండియన్ కమ్యూనిస్టు పార్టి అంటే ఒక స్వతంత్ర సంస్థ అని అర్ధం. కమ్యూనిస్ట్ పార్టి ఆఫ్ ఇండియా అంటే ఒక అంతర్జాతీయ సంస్థకు లోకల్ బ్రాంచ్ అనే అర్ధం వస్తుంది. పేరు పెట్టడంలోనే ఒక తప్పు జరిగింది. ఫలితంగా కొంతకాలం యూకేనో, మరి కొంత కాలం రష్యానో, ఇంకొంత కాలం చైనా మీదో ఆధారపడి బతకాల్సి వచ్చింది. స్టాలిన్ అయినా, మావో అయినా గొప్ప మార్క్సిస్టు సిధ్ధాంత వేత్తలు అనడంలో తప్పేమీలేదు. కానీ వాళ్ళు వేరే దేశాలకు అధినేతలు అనే ఎరుకను సహితం మన కమ్యూనిస్టు పార్టీలు మరిచిపోయాయి. ఇతర దేశాల అధినేతల్ని నమ్ముకుని సృజనాత్మకతను కోల్పోయాయి; స్వీయ సమాజం అర్ధం కాక వరుస పరాజయాలను మూటగట్టుకున్నాయి.

 

 

 

ఆరెస్సెస్ అభిప్రాయంలో భారత దేశం మతరాజ్యం. ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ మతరాజ్యం. ఆ విషయాన్ని వాళ్ళు ఎన్నడూ దాచుకోలేదు. ఆరెస్సెస్ ఆవిర్భవించిననప్పటి నుండి ఇప్పటి వరకు అరడజను సార్లు తన శత్రువులు ఎవరో బాహాటంగా ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఆరు జాబితాల్లోనూ ఒక సామాన్యాంశం వుంది. అన్నింటిలోనూ  వాళ్ళ తొలి శత్రువులు ముస్లింలు.

 

ఆరెస్సెస్ నో, బిజెపినో, కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్త్వాన్నో వ్యతిరేకించే శక్తులు, పార్టీలు, సంస్థలు, సంఘాలు, ఐక్య కార్యాచరణ కమిటీలు తమ తొలి మిత్రులుగా ఎవర్ని ప్రకటించాలీ? ఆసక్తికొద్ది అడగాలనిపించింది.  కొంచెం తర్కాన్ని, హేతువునూ ఉపయోగిస్తే ఎవరికైనా సమాధానం దొరుకుతుంది.

 

 

 

భారత దేశంలో ప్రతి రాజకీయ పార్టి ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత కాలం ఒక రాష్ట్రంలో అధికారంలో వున్నదే, లేదా అధికారపార్టికి మిత్రపక్షంగా వున్నదే. సరిగ్గా అలాగే మన దేశంలో ప్రతి సామాజిక సమూహం ఏదో ఒక యుగంలో, ఎంతోకొంత కాలం, ఏదో ఒక ప్రాంతాన్ని పాలించిందే.  అంచేత సామాజికవర్గాలన్నింటిలోనూ ఒక పాలకవర్గ స్వభావం, అణగారినవర్గ స్వభావం రెండూ వుంటాయి. శ్వాస నిశ్వాసల్లా, చీకటివెలుగుల్లా. మహిళలు సహితం దీనికి మినహాయింపుకాదు.

 

ఎవరయినా సామాజిక కార్యకర్తలు తారసపడినపుడు నేను వేసే ముఖ్యమయిన ప్రశ్న మన భారత సమాజ స్వభావం ఏమిటీ? అని. కొందరు వర్గ సమాజం అంటారు. కొందరు కుల సమాజం అంటారు. కొందరు కులవర్గ సమాజం అంటారు. ఈ అభిప్రాయాలు గలవారెవ్వరూ భారత  సమాజాన్ని మార్చలేరు. వర్తమాన భారత సమాజాన్ని మత సమాజం అని కూడ గుర్తించినవారు మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలరు.  ఇతరులు ఎన్ని విప్లవ సిధ్ధాంతాలు చెపుతున్నప్పటికీ యధాస్థితి వాదులుగా మిగిలిపోతారు.

 

సమాజ స్వభావం గురించి ఆరెస్సెస్ కు పుట్టుక నుండే ఒక స్పష్టత వుంది. దానితోపాటే పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టికి మొదటి నుండీ భారత సమాజ స్వభావం మీద తీవ్ర గందరగోళం వుంది. ఈ రెండు సంస్థలకు ఒక ఏడాది ముందే బాబా సాహెబ్ బిఆర్ అంబేడ్కర్ భారత సమాజాన్ని కులమతవర్గ సమాజంగా ప్రకటించాడు. చాలా మంది అంబేడ్కరిస్టులు ఆయన కుల-వర్ణ సమాజం అనిమాత్రమే అన్నట్టు ప్రచారం చేశారు. అంబేడ్కర్‍ ఆర్ధిక విధానాలను కూడ అర్ధం చేసుకున్న మరికొందరు ఆయన కుల-వర్గ సమాజం అన్నట్టు భావించారు. “నేను హిందువుగా పుట్టాను; కానీ హిందువుగా చనిపోను” అని అంబేడ్కర్ చేసిన ప్రతిజ్ఞలోగానీ, మనుస్మృతి మీద ఆయన  చేసిన నిష్కర్ష దాడిలో గానీ, చివరకు హిందూమతాన్ని త్యజించడం వల్లగానీ అంబేడ్కర్ దీన్ని హిందూ రాజ్యం అన్నట్టు చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు.

 

సమాజ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేయడానికీ వేయకపోవడానికీ ఫలితాల్లో చాలా తేడావుంటుంది. దాదాపు వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ తేడాలు మనకిప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.  భారత సమాజానికి వర్గ స్వభావాన్ని మాత్రమే గుర్తించిన భారత కమ్యూనిస్టు పార్టి వందేళ్ళలో  వంద ముక్కలయింది. భారత సమాజానికి మత స్వభావం వుందని గుర్తించిన ఆరెస్సెస్ వందేళ్ళలో  వంద సంస్థలుగా విస్తరించింది. అంబేడ్కర్ ను నమ్మిన వాళ్లలోనూ మనకు మూడు స్రవంతులు కనిపిస్తాయి. భారత సమాజానికి కుల స్వభావాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు ఒక తీరుగా వెళ్ళారు. కుల-వర్గాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు ఇంకో తీరుగా నడిచారు.  కులమత వర్గ స్వభావాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు విప్లవాత్మకంగా వున్నారు.

 

మొదటి రెండు రకాల అంబేడ్కరిస్టుల్ని తనలో ఇముడ్చుకునే ప్రయత్నం సంఘీయులు ఎన్నడో మొదలెట్టారు. బాబూ జగ్జీవన్ రామ్, రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ దాస్ అథవాలే తదితరుల్ని బిజెపి తెలివిగానే ఇముడ్చుకుంది.  కులమత వర్గ స్వభావాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టుల్ని బిజెపి ఇప్పటికీ తనకు ప్రమాదకారులుగానే చూస్తున్నది. ఈ సమూహాన్నే ఆరెస్సెస్  “అంబేడ్కరిస్టులయిన ఎస్సీలు” అంటున్నది. మిగిలివరు అంబేడ్కర్ ను చదవలేదనో, చదివినా వాటిని పక్కన పెట్టారనో ఆరెస్సెస్ వ్యూహకర్తలు నమ్ముతున్నారు.

 

భారత కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. జాతీయ ప్రజాస్వామిక ఉద్యమం సిపిఐ కార్యక్రమం, సిపియం మొదలు సమస్య ఎంఎల్, మావోయిస్టు పార్టీల కార్యక్రమం నూతన ప్రజాస్వామిక విప్లవం, కనతా ప్రజాస్వామిక విప్లవం. ఈ కార్యక్రమాల అర్ధం ఏమిటో? ఈ గడిచిన వందేళ్ళలో రచించిన వ్యూహాలు, వేసిన ఎత్తుగడలతో ఈ విప్లవాలని వాళ్ళు ఏ మేరకు పూర్తి చేశారో ఎవరయినా వివరిస్తే వినాలని కోరిక. అర్ధవలస-అర్ధ భూస్వామ్య వ్యవస్థ, నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం, దున్నేవానికే భూమి, వ్యవసాయిన విప్లవం, ఆ పైన నూతన ప్రజాస్వామిక విప్లవం. అంతిమంగా సోషలిస్టు విప్లవం.  ఇదే రొడ్డ కొట్టుడు.

 

          కమ్యూనిస్టు సిధ్ధాంతం గొప్పది. ప్రజల వీరోచిత పోరాటం గొప్పది; వాళ్ళ త్యాగాలు అంతకన్నా మహత్తరమైనవి. ఆ అణగారిన సామాజికవర్గాలకు వందేళ్ళ తరువాత కూడ న్యాయం జరగలేదంటే ఆ తప్పంతా ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారిది. ఉద్యమ నాయకుల తప్పిదాల కారణంగా  భారత పీడత ప్రజలు ఓడిపోతూవచ్చారు. ఉద్యమ నాయకులు చేతకాక ఓటమి పాలయ్యారా?  లేక అన్నీ తెలిసీ ద్రోహానికి తలపడ్డారా? అన్నది ఒక్కటే సందేహం.

 

          భారత విద్యా వువస్థను కమ్యూనిస్టు పార్టీలు ‘బానిస విద్యా విధానం’ అంటుంటాయి. మన నియత విద్య ఇక్కడ సరుకుల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడదనీ, ఇక్కడ విద్యావంతులైనవాళ్ళు  విదేశాలకు పోయి అక్కడ ఉత్పత్తి చేసి తీసుకునివచ్చి తిరిగి ఇక్కడి మార్కెట్లో అమ్మడానికి మాత్రమే మన విద్య పనికి వస్తుంది అనేది దీని అర్ధం. కొంచెం తరచి చూస్తే భారత కమ్యూనిస్టు పార్టిలు కూడ బానిస పార్టిలే అని సులువుగా బోధపడుతుంది. బ్రిటీష్ కమ్యూనిస్టు పార్టికి బ్రాంచ్ ఆఫీసుగా భారత కమ్యూనిస్టు పార్టి ఏర్పడింది. బ్రిటన్ లో  ప్రముఖ కమ్యూనిస్టు నాయకునిగా వెలిగిపోతున్న రజనీ ఫామె దత్ ఇక్కడి కమ్యూనిస్టు పార్టి నాయకులకు దారి చూపేవాడు. ఆ తరువాత రష్యా కమ్యూనిస్టు నాయకులు, రష్యా నుండి  ‘పంపబడిన’ కమ్యూనిస్టులు ఇక్కడ పెత్తనం చేయసాగారు. కొంతకాలం ఇంగ్లడ్ కు చెందిన హ్యారీ పొల్లిట్ గాలి వీచింది. రెండో ప్రపంచ యుధ్ధకాలంలో భారత కమ్యూనిస్టుల్ని క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా వుంచిన ఘనుడు అతనే.

 

కార్ల్ మార్క్స్  దృష్టిలో వర్గం అనేది కేవలం ఆర్ధిక ప్రత్యయంకాదు; అది సామాజిక, తాత్విక ప్రత్యయం. ఆర్ధిక నిర్ణాయక వాదాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. ఆర్ధిక నిర్ణాయక వాదమే మార్క్సిజం అయ్యేదయితే “దేవుడా! నన్ను (అలాంటి) మార్క్సిస్టుగా పుట్టించనందుకు ధన్యవాదాలు” అంటూ ఎద్దేవ చేశాడు.

 

ఉత్పత్తి సంబంధాల విషయంలోనూ మార్క్స్ అభిప్రాయాలు సామాజికమైనవి. ఆయన సామాజిక ఉత్పత్తి సంబంధాలు అన్నాడుగానీ శుష్కంగా ఉత్పత్తి సంబంధాలు అనలేదు. పైగా మార్క్స్ మాటలని చారిత్రక సందర్భంలో సాపేక్షకంగా అర్ధం చేసుకోవాలేగానీ వాటిని అంతిమ, పరిపూర్ణ (Absolute) నిర్ధారణలుగా భావించరాదు. సామాన్య శాస్త్రాలకూ, సమాజ శాస్త్రానికి ప్రధాన తేడా కూడ అదే. సామాన్య శాస్త్రాల్లో నియమాలు స్థిరంగా వుంటాయి. సమాజ శాస్త్రంలో సాపేక్షకంగా వుంటాయి. కోళ్ళ ఫారంలో కోళ్ళు పెరిగినట్టు మనుషులు పెరగరు. ప్రతి వ్యక్తి భిన్న వ్యక్తిత్వం కలిగివుంటాడు. మనుషులు వేరు వ్యక్తి వేరు.

 

భారత కమ్యూనిస్టు పార్టిలు మొదటి నుండీ భారతదేశాన్ని పరిపూర్ణ (Absolute) అర్ధంలో  వర్గ సమాజం అని ప్రచారం చేస్తున్నాయి. వర్గానికి పునాది ఆర్ధికం అనేది అవి తమకు అనుకూలంగా చేస్తున్న వాదన.  కనీసం అణిచివేతను ప్రాతిపదికగా తీసుకున్నా పరిస్థితి కొంచెమయినా భిన్నంగా వుండేది.

 

నిజానికి అంత దూరంగా వున్నా, సమాచారం పెద్దగా అందుబాటులో లేకున్నా భారత ఉపఖండంలో సమాజం విభిన్నంగా వుందని మార్క్స్ ఆ కాలంలోనే గమనించాడు. కుల సమస్య గురించి కూడ కొద్దిగానే అయినా పధ్ధతిగా రాశాడు. ఈ నిజాయితీ భారత కమ్యూనిస్టు పార్టిల నాయకత్వానికి లేదు. 1951 ఫిబ్రవరి రెండవ వారంలో సోవియట్ రష్యాలో స్టాలిన్ ను కలిసిన సిపిఐ బృందానికి ఆయన కూడ “మీ సమాజం రష్యాలాంటిది కాదు; తూర్పు యూరోప్ లాంటిది కాదు; చైనా లాంటిది కూడ కాదు. మీ సమాజ వాస్తవ స్వభావాన్నీ,  ప్రత్యేకతల్ని ముందు లోతుగా అధ్యయనం చేయండి. దాని ఆధారంగా  చేపట్టాల్సిన విప్లవ దశల్ని నిర్ణయించుకోండి. ఆ తరువాత  కార్యాచరణకు  దిగండి” అన్నాడు. రష్యా నుండి తిరిగి వచ్చిన వాళ్ళు సాయుధపోరాటానికి స్వస్తి పలికి పార్లమెంటరి పంధా చేపట్టారు. స్టాలిన్ సూచనలమేరకే పంధా మార్చినట్టు తప్పుడు సంకేతాలు ఇచ్చారు.

 

1980ల ఆరంభంలో పంజాబ్ లో మొదలయిన తిరుగుబాటు మెయిన్‍ ల్యాండ్ భారత సమాజంలో మతతత్త్వ  స్వభావం పెరుగుతోందని తొలి హెచ్చరిక చేసింది. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్, స్వర్ణదేవాలయం మీద దాడి, ఇందిరా గాంధి హత్యానంతరం ఢిల్లీ పరిసరప్రాంతాల్లో సాగిన శిక్కుల ఊచకోత భారత సమాజపు మెజారిటీ మతతత్త్వ స్వభావాన్ని నిర్ధారించాయి. దేశం హిందూమతరాజ్యం దిశగా నడుస్తున్నదని శిక్కులతోపాటూ మైనార్టీ సమూహాలయిన ముస్లింలు, క్రైస్తవులకు స్పష్టంగానే అర్ధం అయింది. శిక్కులు ముస్లింల మధ్య ధార్మిక వివాదాలున్నాయి. దేశవిభజన నాటి ఉద్రేకాలూ వున్నాయి. అప్పట్లో జరిగిన అల్లర్లలో పశ్చిమ పంజాబ్ లో శిక్కులు, తూర్పుపంజాబ్ లో ముస్లింలు ఎక్కువ మంది చనిపోయారు.  మతమైనారిటీలనే అస్తిత్వం శిక్కు ముస్లిం సమూహాలను ఢిల్లీలో ఐక్యం చేసింది. క్రైస్తవుల విషయమూ అంతే. క్రైస్తవులు ముస్లింల మధ్య కూడ ధార్మిక విబేధాలున్నాయి. కొన్నిదేశాల్లో మెజారిటీ మైనారిటీ వివాదాలున్నాయి. క్రైస్తవ, ముస్లిం సమూహాలు రెండూ మైనారిటీలుగా వున్న దేశం భారత దేశం. అలా ఒక ఐక్యత వాళ్ల మధ్య ఏర్పడింది.

 

టెక్నికల్ గా మైనార్టీలయిన జైనులు, పార్శీ జొరాస్ట్రీయన్లు, క్రమంగా హిందూ మతంలో భాగం అయిపోయారు. బుధ్ధుడ్ని హిందూమతం పదవ అవతారంగా మార్చుకుంది. 

 

. 1985లో కేవి రమణా రెడ్డి ‘మతవర్గతత్త్వం’, పుస్తకాన్ని రాస్తే, 1989లో కే బాలగోపాల్ ‘హిందూమత రాజ్యం’ పుస్తకాన్ని రాశాడు. అయితే భారత సమాజానికున్న మత వర్గ స్వభావాన్ని వంద కమ్యూనిస్టు పార్టిల్లో ఏ ఒక్కటీ గుర్తించలేదు.

 

1985లో జరిగిన కారంచేడు దురంతం కుల సమస్యను బలంగా ముందుకు తెచ్చింది. మనది కుల సమాజం అనడానికి కూడ కమ్యూనిస్టు పార్టీలన్నీ మూకుమ్మడిగా తిరస్కరించాయి.

 

యజమాని కులాల్లోని స్థితిమంతులు తమ ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అనేక రాజకీయా పార్టీలను వాడుకున్నాయి. ఆ క్రమంలో వాళ్ళ లోని కొన్ని  సమూహాలు కమ్యూనిస్టు పార్టిలను కూడ వాడుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన సామాజికవర్గాలే కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వం వహించిన ఉద్యమాల మూలంగా ఇతోధికంగా లబ్దిపొందడాన్ని మనం సులువుగానే చూడవచ్చు.  

 

తమ అస్తిత్వాన్నే గుర్తించని పార్టీలు తమ సమస్యల్ని పరిష్కరించలేవని అర్ధం అయ్యాక అణగారిన సమూహాలన్నీ కమ్యూనిస్టు పార్టీల్ని విడిచిపోయాయి. అణగారిన సమూహాల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీలను ఏ పేరుతో అయినా పిలవవచ్చుగానీ కమ్యూనిస్టు పార్టి అని మాత్రం పిలవకూడదు.

 

కమ్యూనిస్టు పార్టీల ద్వార తమ నూతన ఆర్ధిక ప్రయోజనాలు నెరవేరవని గమనించాక ‘వామపక్ష’ యజమాని కులాలు సహితం ఆ పార్టీలను దూరంగా పెట్టాయి. రోజురోజుకు తమ పని దిగదుడుపుగా మారిపోతున్నదని గమనించిన కమ్యూనిస్టు పార్టీలు కొంత పునరాలోచనలో పడ్డాయి. అయితే, కులం వరకు గుర్తిస్తాం కానీ మతాన్ని మాత్రం గుర్తించం అంటున్నాయి.

 

ఇది ప్రాయోజిత రాజకీయాల వ్యవస్థ. తమ పోషకులు యజమాని కులాలవాళ్ళే కనుక వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమంగా కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు భారత సమాజంలో కుల స్వభావాన్ని గుర్తించదలచలేదనే ఆరోపణలు బలంగానే  వున్నాయి. సరిగ్గా అలాంటి ఆరోపణలే ఆ పార్టీల మీద ఇప్పుడు మతం విషయంలోనూ వినిపిస్తున్నాయి.  కమ్యూనిస్టు పార్టీల క్రోనీ పాలిటిక్స్ !

 

భారత కమ్యూనిస్టు పార్టీల వల్ల అణగారిన సమూహాలకు మూడు  గొప్ప మేళ్ళు జరొగాయి. మొదటిది;   వాళ్ళకు సమాజాన్ని విశ్లేషించడం అర్ధం అయింది. రెండోది; ధైర్యంగా ప్రశ్నించడం ప్రకటించడం  అలవడింది. మూడోది; దేనినయినా పోరాడి సాధించుకోవాలని బోధపడింది.  అనంతర కాలంలో ఆరంభమయిన  ఎస్టి ఎస్సి బిసి మైనారిటీ సమూహాల సామాజిక ఉద్యమాలకు తొలి దశలో నాయకత్వం వహించినవారందరూ  కమ్యూనిస్టు శిబిరాల్లో శిక్షణ పొందినవారే కావడం యాధృఛ్ఛికం కాదు; అదొక చారిత్రక సహజ పరిణామం.

 

వర్తమాన భారత సమాజంలోని కుల మత తెగల్నేకాక సమస్త వివక్షల్ని, వాటి మహ్య సాగుతున్న వర్గ పోరాటాలను గుర్తించిందే నిజమయిన కమ్యూనిస్టు పార్టి అవుతుంది. దానికి లాల్ నీల్ హర్యాలి నినాదం కావాలి! మిగిలినదంతా ప్రాయోజిత రాజకీయాలే. క్రోనీ పాలిటిక్స్!

 

 

లాల్ నీల్ హర్యాలి నేటి నినాదం కావాలి! తరచుగా హర్యాలి మిస్ అవుతున్నది. ఇది పొరపాటా? ఉద్దేశ్య పూర్వకమా?  

Monday 27 February 2023

అమ్మా ప్రీతీ! క్షమించు!

 అమ్మా ప్రీతీ!  క్షమించు!

 

వరంగల్ కు చెందిన మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధిని ధరావతి ప్రీతి మరణం కలిచివేసింది. ఆమె ఆదివాసి సామాజికవర్గానికి చెందిన ఆమె అని తెలిసి మరీ బాధ కలిగింది. ఆ సామాజికవర్గాల్లో ఒక లక్షకో రెండు లక్షల మందికో ఒకరు ఆ స్థాయికి చేరుకుంటుంటారు. అలాంటివారు చనిపోవడం ఆ కుటుంబానికేకాదు; ఆ సామాజికవర్గానికి కూడ పూడ్చుకోలేని నష్టం.

 

భారత మతతత్త్వ కార్పొరేట్ నియంతృత్త్వానికి  ప్రధాన బాధితులు ముస్లింలు; ఆదివాసులు. ముస్లింల మీద జరుగుతున్న అణిచివేత బయటి ప్రపంచానికి ఎంతోకొంత కనిపిస్తున్నది. కానీ; ఆదివాసుల మీద జరుగుతున్న దమనకాండ అడవిదాటి బయటికి పొక్కడం లేదు. అది మరీ ఘోరం.

 

ప్రీతిని రాగింగ్ చేసి ఆమె ఆత్మహత్యకు దారితీసిన వారిలో సైఫ్ అనే  ఒక ముస్లిం మెడికో కూడ వున్నాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యాను. జూనియర్ల మీద రాగింగ్ చేయడం, ఆత్మహత్యకు పురికొల్పిడం తదితర నేరంలతోపాటు ఎస్టి ఎస్సీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడ అతని మీద కేసులు పెట్టారు.

 

సాధారణంగా ఇలాంటి కేసుల్లో భిన్నమైన వాదనలూ వుంటాయి. అదే మెడికల్ కాలేజికి చెందిన కొందరు జూనియర్ డాక్టర్లు సైఫ్ అరెస్టును వ్యతికిస్తూ ధర్నాలు చేశారని ఒక వార్త చదివాను. సైఫ్ నిర్దోషి అనేది వాళ్ల భావన. ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఇలాంటి సంఘటనల కోసం ఎదురుచూసే ఒక సమూహం ఎలాగూ సిధ్ధంగా వుంటుంది. ఆ సమూహం అప్పుడే దీన్ని ‘లవ్ జిహాద్’  అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టింది.  

 

నిందితుడు సైఫ్  ను వెంటనే అరెస్టు చేశారు కనుక అతను శిక్షించదగ్గ నేరం చేశాడా? లేదా? అతను చట్టబధ్ధ  దోషా? కాదా? అన్నది తేల్చేపని న్యాయస్థానాలు చూసుకుంటాయి.

 

ఈ సంఘటన కేవలం చట్టాలకు, కోర్టులకు సంబంధించిన వ్యవహారం కాదు. ర్యాగింగ్ సంస్కృతి  వ్యామోహంలో పడి సైఫ్ ఒక  సామాజిక తప్పిదం కూడ చేశాడు అనడానికి వేరే నిరూపణలు అక్కరలేదు. బాధితురాలు ఆదివాసి మాత్రమేకాదు; ఒక మహిళ కూడ.  ఆదివాసులు, ముస్లిం సామాజికవర్గాల మధ్య ఒక వివాదం రేగడానికి సైఫ్ కారణం అయ్యాడు. ఇప్పటి రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వాతావరణంలో ఇది చాలా పెద్ద చారిత్రక తప్పిదం. ఐక్యం కావలసిన సమూహాల మధ్య చిచ్చు రేగడం సమాజానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. అలాంటి నష్టనివారణ చర్యల్ని రెండు సామాజికవర్గాల పెద్దలు సంయమనంతో చేపట్టాలి. 

 

వున్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ముస్లిం విద్యార్ధులకు ఒక హెచ్చరిక; మీరు హిందూ సమాజంతో మిత్రధర్మాన్ని  పాటించండి.   ఎస్టి, ఎస్సి, బిసిలతో మీరూ సమానులనే భావంతో మెలగండి. క్యాంపస్ వ్యవహారాలన్నింటిలోనూ ఆ మూడు సామాజికవర్గాల పక్షం వహించండి. ఆ మూడు సామాజికవర్గాలను తక్కువగా చూడడం అంటే మీరు మీ స్వీయ సామాజికవర్గాన్ని వధ్యశిల మీదికి మరింత త్వరగా పంపిస్తున్నారనే స్పృహతో మెలగండి. ఏ దశలోనూ జెండర్ డిస్క్రిమినేషన్ ను పాటించకండి.  అణగారిన సమూహాలకు చెందిన  లేడీ స్టూడెంట్స్ తో మరీ జాగ్రత్తగా వ్యవహరించిండి. కోపంతోనేకాదు ప్రేమతో కూడ వాళ్ళ మీద జోకులు వేయకండి. తప్పు మీ నుండి జరిగినా వాళ్ళ నుండి జరిగినా దోషులు మీరే అవుతారని గుర్తు పెట్టుకోండి.

 

ఉన్నత విద్యాలయాల్లో సీనియర్లు ఎక్కువ, జూనియర్లు తక్కువ అనే జాడ్యం కొనసాగుతోంది. గత ఐదేళ్ళలో దేశంలో 125-150 మంది మెడికోలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఇప్పుడే ఒక సర్వే రిపోర్టులో చూశాను.  వాస్తవ  సంఖ్య ఇంకా ఎక్కువే వుండవచ్చు. అసలు మన సమాజంలోనే సాంస్కృతికంగా ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన వుంది. ఇది వర్గం, కులం, మతం, లింగం, భాషా, ప్రాంతం, వర్ణం అన్నింటిలోనూ వుంటున్నది. ఇప్పుడయినా మనం దీనిని ఆపాలి. సమస్తరంగాలలో ఆపాలి. మనమే ఆపాలి.  

 

 

అమ్మా ప్రీతీ!  క్షమించు!

 

ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

9010757776


Friday 24 February 2023

Muslim Ten Commandments

 

*Muslim Ten Commandments*

*ముస్లింల ముందు 10 కర్తవ్యాలు*

25 ఫిబ్రవరి  2023

 

 

1.      భారత ముస్లిం గుడ్ విల్ ను, ఆమోదాంశాన్ని పెంచడానికి కృషిచేయాలి.

 

2.      సమాజంలో ముస్లింల మీద కొనసాగుతున్న అసహన వాతావరణాన్ని తొలగించడానికి హిందూ-ముస్లిం సమాజాల మధ్య మత సామరస్యాన్ని పటిష్టం చేసేందుకు కృషిచేయాలి

 

3.      భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక మతసామరస్య ఆదర్శాలను పరిరక్షించుకోవడానికి నిరంతరం కృషిచేయాలి.

 

4.      సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ఫాతిమా షేక్ వంటి ముస్లిం జాతీయ నాయకుల ఆలోచనా విధానాలను ప్రచారం చేయాలి.

 

5.       ప్రధాన స్రవంతీ మీడియాతోపాటూ సోషల్ మీడియాల్లోనూ   నిరంతరం వుధృతంగా కొనసాగుతున్న ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ప్రత్యేకంగా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అన్ని భాషల్లో ముస్లింలకు స్వీయ మీడియా సంస్థలు కావాలి.

 

6.      ప్రస్తుతమున్న కార్పొరేట్ నిరంకుశత్వానికి మతతత్త్వ  లక్షణం కూడ వుండడంతో దీనికి ప్రధాన బాధితులు ముస్లింలే. అయినప్పటికీ   తరతమ స్థాయిలో దీని బాధిత సమూహాలు అనేకం వున్నాయి. ఈ సమూహాలన్నింటి మధ్య ఒక సామాజిక ఐక్యతను సాధించడానికి  ముస్లింలు అంకిత భావంతో పనిచేయాలి.

 

7.      కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ పాలనను పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామిక విధానంలో ఓడించడానికి విపక్షాలన్నింటి మధ్య రాజకీయ ఐక్యతను సాధించడానికి మనవంతు  కృషిచేయాలి. ప్రజాసంఘాలు, పౌరసమాజం పరిధుల్నిదాటి రాజకీయ జోక్యం చాలా అవసరం అని గుర్తించాలి.

 

8.      భారత ముస్లిం సమాజం పత్రికలు చదివేలా, టివీ -న్యూస్ ఛానళ్ళు చూసేలా ప్రోత్సహించాలి. ఆధునిక విద్య ఒక్కటే జీవన ప్రమాణాలను పెంచుతుందనే భావాన్ని ముస్లిం సమాజంలో పెంపొందించాలి.

 

9.      ప్రతి ముస్లిం ప్రాంతీయ భాషల్లో నైపుణ్యాన్ని సాధించేలా,  సామాజిక ఉద్యమాల్లో, సంఘ సేవల్లో చురుగ్గా పాల్గొనేలా అవగాహనను పెంచాలి.

 

10.   పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాల్లో వున్న ముస్లింలు సరసమైన ధరకు నాణ్యమైన సేవలు అందించేలా ప్రత్యేక శ్రధ్ధతీసుకోవాలి.  

 

 ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్,

*ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*

 

25 February 2023


Tuesday 21 February 2023

ఫాసిజం ప్రతిదేశంలో ఒకే విధంగా వుంటుందని నిర్వచించడం గతితార్కిక చారిత్రక భౌతికవాద మూల సూత్రాలకే విరుధ్ధం.

 


పెట్టుబడీదారులకు ఒకటే లక్ష్యం ప్రైవేటు ఆస్తిని పోగేసుకోవడం. ఈ పని సజావుగా సాగుతుంటే పెట్టుబడీదారులు మంచిగా కనపడుతుంటారు. సజావుగా సాగకపోతే క్రూరులుగాను బయటపడతారు.   పది శాతం లాభం కోసం ఉరికంభం ఎక్కడానికయినా పెట్టుబడీదారులు  సిధ్ధపడతారని కార్ల్ మార్క్స్ 170 ఏళ్ల క్రితమే అన్నాడు. 


పెట్టుబడీదారులు మంచిగా వున్నప్పుడు ప్రజాస్వామ్యం. అధికారాల వికేంద్రీకరణ, సుపరిపాలన వంటి ఆదర్శాలు మాట్లాడుతుంటారు. అప్పుడు అది ముసుగు కప్పిన నియంతృత్త్వం. మంచిగా లేనపుడు నేరుగా వాళ్ళే ప్రభుత్వం, పార్లమెంటు, పోలీసులు, చివరకు న్యాయస్థానాలుగా కూడ మారిపోతారు. అప్పుడు అదు ముసుగు తీసేసిన నియంతృత్త్వం. తేడా అదొక్కటే. రూపాలు మారడమే తప్ప సారం ఎప్పుడయినా ఒక్కటే. రూపాలు మారినప్పుడెల్లా దాని సారం మారినట్టు మనం తరచూ పొరబడుతుంటాము. 


పెట్టుబడీదారులు ధరించే రూపాల్లో ఫాసిజం ఒకటి. మతాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ సహకారంతో దేశసంపదను అవధుల్లేకుండా కొల్లగొడుతూ ప్రజల్ని ఇక్కట్ల పాలు చేయడమే  పెట్టుబడీదారీ మతతత్త్వ నియంతృత్త్వం.    దీనిని కొన్ని దేశాల్లో ఫాసిజం అన్నారు, మరికొన్ని దేశాల్లో నాజిజం అనేవారు, ఇంకొన్ని దేశాల్లో జుంటా అనేవారు. అంచేత ఫాసిజం ప్రతిదేశంలో ఒకే విధంగా వుంటుందని నిర్వచించడం గతితార్కిక చారిత్రక భౌతికవాద  మూల సూత్రాలకే విరుధ్ధం. 


ఇటలీలో ముస్సోలినీ జర్మనీలో హిట్లర్ ఎన్నికల ద్వారానే అధికారంలోనికి వచ్చారన్న వాస్తవాన్ని చాలామంది తరచూ మరచిపొతున్నారు. ఐదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న దేశాన్ని నియంతృత్త్వం అనవచ్చా అని చాలామందికి తరచూ ఒక అనుమానం వస్తుంటుంది. ఇలాంటి అనుమానాలు ఇతరులకు వస్తే అదో కత; కమ్యూనిస్టులకు కూడ వస్తేనే ఇబ్బంది. పెట్టుబడీదారీ వ్యవస్థ అంటేనే పెట్టుబడీదారుల నియంతృత్వం అని కదా ఆ ఉంగరాలు జుట్టు గడ్డపాయన చెప్పింది. అది మరచిపొవడం న్యాయం కాదు; చారిత్రక నేరం కూడ. 

Monday 13 February 2023

మిగిలిన 98 కమ్యూనిస్టు పార్టిలది ఒకటే మూస.

 మనదేశంలో ప్రతి కమ్యూనిస్టు పార్టి తనకన్నా ముందున్న కమ్యూనిస్టు పార్టిని 'కార్మిక విప్లవ ద్రోహి' అని విమర్శించింది. అలా అలా ఇప్పటికి వంద కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. ఇందులో రెండు మినహాయింపులున్నాయి.  మొదటిదయిన సిపిఐకు అలా తిట్టే అవకాశం దక్కలేదు; చివరిదయిన 100వ పార్టి ఇంకా అలా తిట్టించుకోలేదు. మిగిలిన 98 కమ్యూనిస్టు పార్టిలది ఒకటే మూస. 

Saturday 11 February 2023

*మత మైనారిటీల మనోభావాలను గౌరవిద్దాం*

 *మత మైనారిటీల మనోభావాలను గౌరవిద్దాం*

ఇప్పుడు మనం సంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం పాలనలో వున్నాం. దీనినే అందరూ సౌలభ్యం కోసం 'ఫాసిజం' అంటున్నారు. మారిన కాలంలో మారిన రూపంలో 'ఫాసిజం' అనడం 'అంత' సరైనది కాదు. నయా ఫాసిజం, రూపం మార్చుకున్న ఫాసిజం, భారత ఫాసిజం, నయా మనువాదం వగయిరా పేర్లు బాగుంటాయి. నిజానికి ఇది మనదేశ శ్రామిక ప్రజలపై కార్పొరేట్ పెట్టుబడి సాగిస్తున్న ఉగ్రవాదం.

సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం ఎన్నికల ద్వారానే.  ప్ర్జాస్వామిక రాజ్యాంగాల ద్వారానే అధికారంలోనికి వస్తుంది.

ఇద ఆరు  స్థాయిల్లో పనిచేస్తుంది.

1. సాంస్కృతిక రంగంలో మత మైనారిటీలను  అణిచివేస్తుంది.

2. ఆర్ధిక రంగంలో శ్రామికుల్ని, ఆదివాసుల్ని  అణిచివేస్తుంది.

3. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత మెజారిటీ శ్రామికుల ద్వార  కార్పొరేట్లకు సేవలు చేయిస్తుంది.

4. శ్రామికుల పక్షం వహించే రాజకీయ పక్షాలను అణిచివేస్తుంది.

5. తన వంతుగా దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుంది.

6. కార్పొరేట్లు బలపడుతుంటే దేశం బలపడినట్టు ప్రచారం చేస్తుంది.

ఫాసిజానికి తొలి బాధితులు మత మైనారిటీలు, ఫాసిస్టుల మీద పోరాటంలో ముందు వరుసలో నిలబడేదీ వాళ్ళే. యూరప్ లోనూ ఫాసిస్టు వ్యతిరేకపోరాటంలో యూదులే గట్టిగా నిలబడ్డారు. ఆ సమయంలో జర్మనీలో మనకు తెలిసిన కమ్యూనిస్టు నాయకుల్లో అత్యధికులు యూదులు. ఫాసిస్టు వ్యతిరేకపోరాటానికి అణుబాంబు చేసి ఇచ్చిన ఐన్ స్టీన్ యూదుడు. ఫాసిస్టుల్ని సాంస్కృతిక రంగంలో ఎదుర్కొన్న చార్లీ చాప్లిన్ ని కూడ యూదుడనే అంటారు.

ఈ వాస్తవాలను  *భారత్ బచావో* గ్రూపులో కొందరు గురించినట్టు లేరు. హేతువాదం, నాస్తికత్వం భాష మాట్లాడుతున్నారు. కొందరు బౌధ్ధాన్ని ఆదర్శంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి తిరిగి తిరిగి మత మైనారిటీల మనోభావాల్ని దెబ్బతీస్తాయి. ముస్లిం, క్రైస్తవ, శిక్కు  మతమైనారిటీలకు ఫాసిస్టులు, హేతువాదులు, నాస్తికులు, కమ్యూనిస్టులు  ఒకేలా కనిపించే ప్రమాదం వుంది. 

మనం ఫాసిస్టు వ్యతిరేక శక్తుల ఐక్యతను కోరుకుంటున్నాం కనుక ఈ జాగ్రత్తలు చాలా అవసరం.

*డానీ - ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*



Chandra Sskhara Rao garu!

"మత, జాతి సామాజిక సమూహాలను - సైద్దాంతిక శక్తులతో గందరగోళ పరచడం  సరి కాదు." 


- ఇవి మీ మాటలేనా? 


సామాజిక అస్తిత్వాలు వేరు, సామాజిక సిధ్ధాంతాలు వేరని మొదటిసారి ఒక భౌతికవాది నోట వింటున్నాను. 


సామాజిక అస్తిత్వాల నుండే  సామాజిక సిధ్ధాంతాలు పుడతాయనిదే ఆ మహానుభావువుడు కార్ల్‍ మార్క్స్ చెప్పిన వాక్యాల్లో మొదటిది. అదే గతితార్కిక చారిత్రక భౌతిక వాదానికి పునాది సూత్రం. 


తెలిసీ తెలియని మాటల్ని అసందర్భంగా ఉటంకిస్తే సైధ్ధాంతిక చర్చేకాదు చారిత్రక చర్చ కూడ  తప్పక మొదలవుతుంది. దాన్ని స్వాగతించాలి. కాకుంటే వివాదం అవుతుంది. 


చర్చలు, వివాదాలూ వద్దనుకుంటే ఇలాంటి తెలిసీ తెలియని పసిపిల్లల మాటలు వల్లించకూడదు. 


సామాజిక అస్తిత్వాలు లేనిదే సామాజిక సిధ్ధాంతాలు వుండవవీ, పుట్టవవీ  గుర్తించండి. సామాజిక అస్తిత్వాల్ని గుర్తించము అన్నవారిని చరిత్ర ఎక్కడ వుంచాలో అక్కడే వుంచింది. 


ఫాసిజం అంటున్నామంటేనే అది సాంస్కృతిక ఆధిపత్యం అని అర్ధం.  సులువుగా చెప్పాలంటే మతరాజ్యం అని అర్ధం. హిందూమత రాజ్యం వారి స్పష్టమైన లక్ష్యం. 


మీరు మతాన్ని గుర్తించం అంటే ఈ యుధ్ధం నుండి మీరు తప్పుకుంటున్నారని అర్ధం. 


వర్తమాన భారత ఫాసిజానికి ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసులు,   అత్యంత పీడిత సమూహాలని మీరు ఇంకా గుర్తించినట్టు లేదు. ఆ తరువాత అంబేడ్కరిస్టులు అయిన ఎస్సీలు, *మార్క్సిస్టులు* అయిన కమ్యూనిస్టులు  వస్తారు. 


మన దేశంలో ఫాసిజం పెరగడానికి మీరు చెప్పే సైద్దాంతిక శక్తులు ఎలా దోహదం చేశారో  చెప్పాల్సిన పరిస్థితిని తేవద్దు.  ఈ చర్చను కొనసాగించాలనుకుంటే ముందు *పుచ్చలపల్లి సుందరయ్యగారి రాజీనామా* డాక్యుమెంటును చదవండి. ఆ తరువాత మాట్లాడుకుందాము. 


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*




ఏం మాటలివీ భాస్కరరావుగారూ!


"ఈ పరిస్థితులను సరిదిద్దే అవకాశం ముస్లిం సంస్థల కన్నా సెక్యులర్ శక్తులగు మార్క్స్ వాదులు, ఫులే- అంబేద్కర్ వాదులకే ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం" 


"ఏ దేశంలో నైనా జాతి, భాష, మత మైనారిటీ ల ను మరియు మెజారిటీ మత శ్రామిక ప్రజల ను ఐక్యం చేయగల potentiality మార్క్సిజం కి, ఇండియా లో మార్క్స్- అంబేద్కర్ వాదులకు మాత్రమే ఉంది"


భారత్ బచావో గ్రూపులో కన్వీనరే స్వయంగా ఒక వివాదాన్ని రేపారు. 


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*




భాస్కరరావు గారూ!, 


గ్రూపు  కన్వీనరై వుండి మీరే ఒక  వివాదాన్ని రేపారు అని గుర్తు చేయడమే నా ఉద్దేశ్యం. 


గతంలోనూ ఒక అడ్మిన్ స్థాయిలోవున్న వ్యక్తి అకారణంగా ముస్లిం సమాజం మీద కొన్ని అనుచిత వాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. 


ఇక సైధ్ధాంతిక అంశాల మీద కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు చేసే ఓపిక సమయం నాకు లేదు. భారత కమ్యూనిస్టు పార్టీల్లో ఏ ఒక్కటి కూడ తమ ప్రకటిత కార్యక్రమాల్ని ఇంతవరకు కనీసం ఆరంభించలేదని నా అవగాహన.  అవన్నీ వందేళ్ళుగా సైధ్ధాంతిక చర్చలు చేసుకుంటూ వంద పార్టీలుగా చీలిపోయి దేశ జనాభాల్లో రెండు  శాతం ప్రజానీకాన్ని కూడ ప్రభావితం చేసే స్థితిలో లేవు. 


దేశంలో ఫాసిజం లేదనీ, రాదనీ గట్టిగా వాదించిన కమ్యూనిస్టు పార్టీల నాయకుల వీడియో టేపులు నా దగ్గరున్నాయి. వీరిలో వామపక్షాల నుండి  మావోయిస్టు పార్టీల ప్రతినిధుల వరకు వున్నారు. 


(లింకులు కావాలంటే మీకు పంపిస్తాను)


భారత కమ్యూనిస్టు పార్టీల ప్రత్యక్ష పరోక్ష సహకారాలతో  బిజెపి ఎలా ఎలా పెరుగుతూ వచ్చిందో చెప్పే పత్రాలు ఇప్పుడు అనేకం అందుబాటులో వున్నాయి. 


రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో జర్మనీలో నాజిజాన్ని అంతం చేయడంలో ఆనాడు సోవియట్ రష్యా ఒక కీలక పాత్ర నిర్వహించింది. స్టాలిన్ లాంటి ధృఢమయిన నాయకుడున్నాడు. అప్పుడది బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాల స్థాయి దేశం కనుక భారీ ఎర్రసైన్యం వుంది.  అంత మాత్రాన మొత్తం క్రెడిట్ రష్యాకే ఇవ్వడం కూడ కుదరదు. 


ఎర్ర సైన్యం  ప్రవేశానికి రెండేళ్ళ ముందే ఇటలీలో ముస్సోలినీని దించేశారు. ఫాసిజానికి తొలి ఓటమి  ఆఫ్రికా ఖండం ఉత్తర దేశాల్లో ఎదురైంది. లిబియాలోనూ ఫాసిజాన్ని ఎదుర్కొన్నది ముస్లిం సంస్థలే. 'ఓమర్ ముఖ్తార్' సినిమా  అయినా మీరు చూసి వుంటారుగా. 


ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముస్లింలను మినహాయించి మిగిలిన సిధ్ధాంతాలు గొప్పవని చెప్పడానికి మీరు ప్రయత్నించారు. 


అప్పుడు జర్మనీలో యూదుల్ని మినహాయించి ఇతరుల్ని దగ్గరకు లాక్కొనేవాడు హిట్లర్. ఇప్పుడు మనదేశంలో ముస్లింలను మినహాయించి  ఇతరుల్ని దగ్గరకు లాక్కోనే ప్రయత్నం సంఘపరివారం గట్టిగానే చేస్తున్నది. మీ వాక్యాల్లో ఆ ప్రభావం వుంది. 


ఇదే మనలోని ఫాసిజం. మన అంతరంగంలోనూ మన శతృవు వుంటాడు. చెక్ చేసుకుంటుండాలి.


పైగా ఇంకో ఫాసిస్టు వ్యతిరేక వాట్స్ అప్ గ్రూపులో చర్చిద్దాం అంటున్నారు. ముస్లింలను మినహాయించే స్వభావం వున్న మేధావులతో చర్చలేంటీ?  


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*




చంద్రశేఖర రావు గారూ! 


మీరు చర్చను దారి మళ్ళిస్తున్నారు. 


భారత ఫాసిజానికి తొలి బాధితులు, అత్యంత పీడితులు ముస్లింలు. భారత ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ముందు పీఠిన నిలబడేదీ సహజంగానే ముస్లింలు. 


అయితే,  ఫాసిజానికి ముస్లింలు మాత్రమే  బాధితులుకాదు; ఈ వరసలో అనేక సామాజిక  శ్రేణులున్నాయి; మార్క్సిజం, అంబేడ్కరిజం తదితర అనేక సామాజిక సిధ్ధాంతాలున్నాయి. 


*ఈ శ్రేణులు సిధ్ధాంతాలు కలిసి ఐక్యంగా పోరాడితేనే  భారత ఫాసిజాన్ని ఎదుర్కోగలం; భారత సమాజన్ని  కాపాడుకోగలం*. ఈ అవగాహనతోనే నేను 1984 నుండి (ఆశ్చర్యపోవద్దు) పనిచేస్తున్నాను.  


"ఈ పరిస్థితులను సరిదిద్దే అవకాశం ముస్లిం సంస్థల *కన్నా* సెక్యులర్ శక్తులగు మార్క్స్ వాదులు, ఫులే- అంబేద్కర్ వాదులకే ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం" 


"ఏ దేశంలో నైనా జాతి, భాష, మత మైనారిటీ ల ను మరియు మెజారిటీ మత శ్రామిక ప్రజల ను ఐక్యం చేయగల potentiality మార్క్సిజం కి,  *మాత్రమే ఉంది*" (అలా జరిగిన ఒక్కటంటే ఒక్క  దేశం పేరు వారు చెపుతారా?). ఇండియా లో మార్క్స్- అంబేద్కర్ వాదులకు *మాత్రమే ఉంది*"


*కన్నా, మాత్రమే* అని భారత్ బచావో ఏపి గ్రూపు కన్వీనర్  భాస్కరరావుగారు  రిడక్షనిస్టు పోస్టు పెట్టడం చాలా అభ్యంతరకరం. ఆయనే గ్రూపులో ఐక్యతకు చిచ్చు పెట్టారు. 


 ఈ గ్రూపులో వున్న మరెవ్వరికన్నా ముందు నుండి మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు, ఆదివాసులతో కలిసి పనిచేస్తున్నముస్లింని నేను. *లాల్, నీల్, హర్యాలీ నా నినాదం*. హర్యాలీ అంటే ఆకుపచ్చ. అది ముస్లింలు, ఆదివాసులకు ప్రతీక. 


ఇప్పుడు "ముస్లిం మైనారిటీలకు కమ్యూనిష్టులు , అంబేద్కరిస్టులు మితృలు అని మీరు భావిస్తున్నారా!" అని మీరు గడుసుగా అడుగుతున్నారు. ఇది పధ్ధతి కాదు. 


చిచ్చు పెట్టిన సభ్యులే తమ వాదాన్ని సమర్ధించుకోవాలీ; లేదా ఉపసంహరించుకోవాలి. 


చిచ్చు పెట్టిందే గ్రూపు కన్వీనర్ అయితే? ఏం చేయాలీ? 


న్యాయమూర్తి స్థానంలో వుండాల్సినవాళ్ళు, కక్షిదారుగా మారితే వివాదమే చెలరేగుతుంది. 


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*