Saturday 30 April 2022

May Day - Hopes! Aspirations !

 మే డే ఎన్నీ ఆశలు ! ఏన్ని ఆశయాలు!

 

ఇప్పుడు రంజాన్ నెల గాబట్టి  ఉదయం నాలుగు గంటలకు ముందే లేస్తున్నాను. ఆ రోజుల్లో కూడ మేడే రోజు మేమంతా నాలుగు గంటలకు ముందే లేచేవాళ్ళం. 

మేడే శ్రామికుల దీక్షా దినం. విజయవాడ నగరంలో కనీసం పది సెంటర్లలో ఎర్రజెండ ఎగరేసి దీక్షబూనేవాళ్ళం. రిక్షాపుల్లర్లు, ఆటోడ్రైవర్లు, మెకానిక్కులు, రైల్వే వర్కర్లు,  హాకర్లు, కాలేజి విద్యార్ధులు ఒక్కో సెంటర్లో ఒక్కో సమూహం. అందరూ సమసమాజాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయడం గొప్ప భావోద్వేగ సమయం. 

విజయవాడ నగరంలో కమ్యూనిస్టు కాదంటే అప్పట్లో  చాలా నామోషిగా వుండేది. ఇప్పుడు కమ్యూనిస్టు అంటే అంతకన్నా నామోషీగా వుంటున్నది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట పంథాను వదిలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను ఎంచుకున్నాక కమ్యూనిస్టు అభిమానులు అనేక  వ్యాపారాల్లోనికి విస్తరించారు. మదరాసు వెళ్ళిన వాళ్లు సినిమాల్లోని వివిధ విభాగాల్లో చేరారు. కథ శ్రామికులది అయినా కాకపోయినా వీరికున్న పాత వాసనల కారణంగా ఆ సినిమాలో ఓ శ్రామిక పాటైనా వుండేది. అప్పుడది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్మూలాగా వుండేది.  నక్సలైట్ల ఉద్యమం బలంగా వున్న రోజుల్లోనూ అనేక సినిమాల్లో  ఆ ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపించేది. ఇప్పుడు ఉగ్ర జాతీయవాదం రాజకీయాలను ఏలుతున్నట్టు సినిమాల్లోనూ బాక్సాఫీసు సక్సెస్ ఫార్మూలాగా మారింది. ఎర్రజెండాను  కిందికి దించి కాషాయ జెండాను ఎగురేస్తూ పాన్ ఇండియా సినిమా కథలు అల్లుతున్నారు.     

అణగారిన సమూహాలకు ఎవరి సమస్యలు వారికి వుంటాయి. ప్రతి సమస్యా ప్రత్యేకమైనదే. సమసమాజం ఏర్పడితే అందరి సమస్యలు సమసిపోతాయనేది అందరి నమ్మకం. కొందరు ఆర్ధిక పీడన పోతుందనికునేవారు. కొందరు సాంస్కృతిక పీడన పోతుందనుకునేవారు. కొందరు కుల పీడన పోతుందనుకునేవారు. మరికొందరు మతపీడన పోతుందనుకునేవారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పీడన పోతుందని తమకుతామే అనుకునేవారు. ఇంతటి సమగ్ర దృష్టి ఆనాటి కమ్యూనిస్టు నాయకత్వానికి వుండిందనుకోవడమూ కష్టమే. 

నేను మత పీడితుడ్ని.  మత పీడన సమసిపోతుందనే ఆశతోనే నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. అందరి పీడనల్ని అంతం చేసేది కమ్యూనిస్టు పార్టీలే అని చాలా గట్టిగా నమ్మిన రోజులవి. అప్పుడది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటి (సివోసి). ఆ తరువాత సివోసి రద్దు అయ్యి మరికొన్ని గ్రూపులతో కలిసి  ‘పీపుల్స్ వార్’ ఆవిర్భవించింది. కొండపల్లి సీతారామయ్య అధినేత. కేజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావులు మా అగ్ర నేతలు. 

ఈ భూమి మీద కోట్ల మంది శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటే మేము కొన్ని వేల మందిమి చనిపోక తప్పదని బలంగా నమ్ముతున్న కాలం అది. మరీ నెలరోజుల్లోనో, ఏడాది లోపో సమసమాజం వచ్చేస్తుందనే అతిశయం లేకపోయినా ఓ నాలుగైదు ఏళ్ళకయినా సమసమాజాన్ని సాధిస్తామనే నమ్మకం చాలా బలంగా వుండేది. సమసమాజంలో విహరిస్తున్నట్టు, ఎర్రకోట  బురుజు మీద ఎర్ర జెండా ఎగురుతున్నట్లు కలలు కూడ వచ్చేవి.  సుఖించే కోట్ల మందిలో వుంటారా? ప్రాణ త్యాగాలుచేసే  వేల మందిలో వుంటారా? అని అడిగితే అందరూ రెండో జాబితాలోనే స్థానం కల్పించండి అనేవారు. బలిదానాల జాబితాలో చోటు కోసం కామ్రేడ్స్  తహతహలాడేవారు. ప్రాణత్యాగానికి పోటీలు పడే మనుషులు ఈ నేల మీద సంచరించిన రోజులవి. 

సమసమాజం ఎలా వస్తుందంటే ఒక్కో కమ్యూనిస్టు పార్టి ఒక్కో సమాధానం చెప్పేది. సిపిఐ ది ఒకమార్గం; సిపియం ది ఇంకో మార్గం; నక్సలైట్లలో ఒక్కో గ్రూపుది ఒక్కో మార్గం. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఓ అరడజను గ్రూపులుండేవి. కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి గ్రూపులు ముఖ్యమైనవి. లిన్ పియావో, వినోద్ మిశ్రా తదితర గ్రూపులు కూడ వుండేవి.   

‘దున్నేవాళ్ళకే భూమి నినాదంతో సాగే వ్యవసాయ విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక విప్లవం’ విజయవంతం కావాలని నినదించేవాళ్ళం.  అప్పట్లో ఇంతటి క్లిష్టమైన కార్యక్రమం కూడ అందరికీ అర్ధం అయ్యేట్టుగానే వుండేది. నినాదం ఇచ్చేవాళ్ళు, గొంతు కలిపేవారు ఇద్దరూ ఒకే భావోద్వేగంలో వుండేవారు. 

“పల్లెపట్టు పైరగాలి పట్టణాలను చుట్టును; భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టును” అంటూ శివసాగర్ ఈ నినాదాన్ని కవిత్వీకరించారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీల మీద అచంచల విశ్వాసం వుంటున్న కారణంగా ఈ నినాదాలు అర్ధం అయ్యేవి. ఇప్పుడు అలాంటి నమ్మకం లేనికారణంగా ఈ నినాదం అర్ధం కావడం లేదు. ఈరోజు ఈ నినాదం వినే వాళ్ళకే కాదు ఇచ్చే వాళ్ళకు కూడ అర్ధం కావడం లేదు. 

మత పీడన అప్పటికన్నా పెరిగింది. కుల పీడన పెరిగింది. తెగ పీడన పెరిగింది. ఆర్ధిక పీడన పెరిగింది. అనేక కొత్త పీడనలూ వెలుగులోనికి వస్తున్నాయి. సమసమాజ స్థాపన అవసరమూ పెరిగింది. కానీ, దానిని సాకారం చేసే పార్టి, గ్రూపు, సంస్థ ఏదీ కనుచూపుమేరలో కనిపించడంలేదు.

 

అణగారిన సమూహాలకు సామ్యవాదం మీద నమ్మకం పోవడమే ఈ దుస్థితికి కారణమని కొందరు ఆరోపించడాన్ని చూస్తున్నాము. అణగారిన సమూహాలకు సామ్యవాదం ఒక చారిత్రక అవసరం.  దాని మీద నమ్మకం పోవడం అనే ప్రశ్నే తలెత్తదు.  ఈ దుస్థితికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టిల నాయకత్వం. 

దురదృష్టావశాత్తు మన దేశ కమ్యూనిస్టు నాయకులు ఎవ్వరూ రష్యా, చైనా, వియత్నాం దేశాల కమ్యూనిస్టు నాయకులంతటి మేధావులు, ఆలోచనాపరులు, ప్రభావశీలురు కాదు. రష్యానో, చైనానో అనుకరించినవాళ్ళు మాత్రమే. ఈ నకలుకొట్టే అంతర్గత బలహీనత కారణంగా మనదేశంలో ప్రజల వైవిధ్య పూరిత వాస్తవ సమస్యల్ని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. 

సుందరయ్యగారి తెలంగాణ రైతాంగపోరాటం - గుణపాఠాలు, తరిమిల నాగిరెడ్డిగారి తాకట్టులో భారత దేశం, కొండపల్లి సీతారామయ్య గారి నూతన ప్రజాస్వామిక విప్లవం, వ్యవసాయిక విప్లవం అప్పట్లో కొందర్ని ఉత్తేజ పరచి వుండొచ్చుగానీ, ఈ తరానికి అవన్నీ అమెచ్యూర్ రచనలుగా కనిపిస్తాయి. కార్ల్ మార్క్స్, లెనిన్ రచనల వంటి సర్వకాలీనత, ప్రాసంగికత వాటికి లేదు. సుందరయ్య గారు ఆ పుస్తకాన్ని 1950 తరువాత రాశారు. అందులో పోలిస్ యాక్షన్ గా పిలువబడే సైనిక చర్య గురించి ఎందుకు రాయలేదో ఇప్పటికీ మాలాంటి వాళ్ళకు పెద్ద పజిల్. 1940ల నాటి తెలంగాణ పోరాటంగానీ. 1970ల నాటి ‘జగిత్యాల జైత్రయాత్ర’తో సహా ఉత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు గానీ నికరంగా సాధించిందేమీటీ? ఆ ఉద్యమాలు సమాజంలో ఎలాంటి మార్పులు తెచ్చాయని ఎప్పుడయినా  ఎవరయినా బెరీజు వేసుకున్నారా? కమ్యూనిస్టు పార్టిలు మహత్తరంగా చెప్పుకునే అనేక ఉద్యమాలు, పోరాటాలు అంతిమంగా పెట్టుబడీదారీ వ్యవస్థనేకాక కుల వ్యవస్థను సహితం  బలపరిచాయి అనే అభిప్రాయం మాలాంటి వాళ్ళలో తరచూ కలుగుతోంది. 

చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్య, చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి తరానికే అన్వయ సృజనాత్మకత తక్కువ అనుకుంటుంటే ఆ తరువాత ఆయా పార్టీలకు నాయకత్వం వహించినవారు మరీ నాసిరకం. ఈ కమ్యూనిస్టు నాయకుల నోటెంట 21వ శతాబ్దంలో ఒక్క ఉత్తేజకర వాక్యమైనా విన్నామా? 

మొక్కై వంగనిది మానై వంగునా అని ఒక సామెత. చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్యలకే టాటా, బిర్లాలను ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. ఇప్పటి నాసిరకం కమ్యూనిస్టు నాయకులు ఆదానీ, అంబానీలను ఎదుర్కోగలరని ఎవరయినా నమ్ముతారా? 

కొందరు రష్యాను భూలోక స్వర్గంగా ప్రచారం చేస్తే మరి కొందరు  చైనాను కమ్యూనిస్టు విప్లవ కేంద్రంగా చేస్తూ కాలం గడిపేశారు. చైనా మరో అమెరికాలా తయారైంది గాబట్టి గట్టెక్కిందిగానీ, నూరేళ్ళు సోషలిస్టు సమాజంలో గడిపిన రష్యా మహిళలు పేదరికం కారణంగా ఇతర దేశాలకు వలస వెళ్ళి పడుపు వృత్తి చేసుకుని బతుకుతున్నారు. వాస్తవాలు ఇంత కఠినంగా వుంటే సోషలిజానికి ఆమోదాంశం వుంటుందా? 

కమ్యూనిస్టు అభిమానుల్ని ‘బూర్జువా’ పార్టీల అభిమానులుగా మార్చింది కమ్యూనిస్టు పార్టిలు. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ను బలపరచడం మొదలు, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకోని పార్టి ఏదైనా వుందా? “ఉప్పరోడి వీపు నాకడంకన్నా, అత్తర్ సాయిబు చంక నాకడం మేలు” అని ఒక మొరటు సామెత వుండేది. ఉప్పరోళ్ళ వీపు ఉప్పగా వుంటుందనీ, అత్తరు సాయిబు చంకలో అత్తరు వాసన వుంటుందని దీని అర్ధం. ప్రజలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. “మా కూటమి అధికారంలోనికి వస్తే పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి" అని కమ్యూనిస్టులు ప్రకటిస్తే జనం  కమ్యూనిస్టులకన్నా వాళ్ళే బెటర్ అనుకుంటారు.  అనుకుంటున్నారు. 

కమ్యూనిస్టులు 1970లలో కాంగ్రెస్ ను సమర్ధించడం తప్పయితే 2008లో యూపిఏ నుండి బయటకు రావడమూ అంతకన్నా పెద్ద  తప్పు. సరిగ్గా ఆ గ్యాప్ లో సంఘపరివారం ప్రవేశించి బలపడింది. ఒకప్పుడు హేతువాదం, ఆధునికత వగయిరా ఆదర్శాలతో మార్కెట్ ను విస్తరించుకున్న పెట్టుబడీదారీ వర్గం ఇప్పుడు మతాన్ని వాడుకొని తన సంపదను, ఆధిపత్యాన్నీ పెంచుకుంటున్నది. 

భారత సమాజం పెట్టుబడీదారులకూ, కార్పొరేట్లకు, వాళ్ళ అంతర్జాతీయ కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అర్ధం అయినంతగా ఏ దశలోనూ కమ్యూనిస్టు నాయకులకు అర్ధం కాలేదు. ఆధునిక పెట్టుబడీదారీ వ్యవస్థకు విరుగుడును కనిపెట్టడంలో ఈతరం కమ్యూనిస్టు నాయకులు విఫలమయ్యారు. మరోవైపు, కమ్యూనిస్టు పోరాటాలు, ఉద్యమాల నుండి గుణపాఠాలు నేర్చుకుని పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత బలపడింది. 

ఇటీవల కేరళలో జరిగిన సిపిఎం జాతీయ మహాసభల్లో ఒక ఎస్సీ కామ్రేడ్ కు పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారట. ఇప్పుడది ఒక పెద్దవార్త.  ఒక అణగారిన కులానికి ఒక శతాబ్ద కాలం స్థానం కల్పించని కమ్యూనిస్టు పార్టి ఇప్పుడు సమసమాజాన్ని సాధిస్తుందని మెదడు వున్నవాడు ఎవడయినా ఆశించగలడా?   

భారత ప్రజల్లో ఏఏ సమూహాలు ఏఏ సమస్యల్ని ఎదుర్కొంటూన్నారు? వాళ్ళు  ఎలాంటి పరిష్కారాల్ని కోరుకుంటూన్నారని భారత కమ్యూనిస్టు నాయకులు ఈ నూరేళ్ళలో ఏ దశలోనూ నిజాయితీగా ఒక సర్వే జరిపిన సందర్భం లేదు. సమాజం అర్ధం కానివాళ్ళను సమాజం నమ్మదు. ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను నమ్మడం మానేశారు. 

అయితే, సమసమాజాన్ని సాధించాల్సిన అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలను వెతుకుతారు. వెతుకుతున్నారు. ఇప్పటి తెట్టును గట్టుకు గెంటేసే కొత్త నీరు వస్తుంది. సమానత్వం అనేది ఒక పార్టి కార్యక్రమం కాదు; అది సమాజ నిరంతర అవసరం.

 

మేడే వర్ధిల్లాలి.

 

మే డే 2022

Wednesday 20 April 2022

Social Capital

 సాంఘీక పెట్టుబడి Social Capital 

సమాజంలో మనుషులందరూ సమానులు కాదని మనందరికీ తెలుసు. ఈ అసమానత్వానికి కారణం ఏమిటీ అనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణ ఇస్తుంటారు. సామాజిక దొంతరలు (Social Stratification) ఎలా ఏర్పడుతుందనేది ఇప్పటికీ ఒక ఆసక్తికర ప్రశ్నే. 

 

విషయంలో మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు పరస్పర విరుధ్ధ వాదనలు చేస్తుంటారు. ఆస్తిని బట్టే వర్గ విభజన జరుగుతుందనేది మార్క్సిస్టుల స్థూల అభిప్రాయం ఇది ఆర్ధిక నిర్ణాయక వాదం. నిజానికి ఆర్ధిక నిర్ణాయక వాదం తప్పు అని స్వయంగా కార్ల్ కూడ చెప్పివున్నాడు. అలాగే, కులం కారణంగానే సమాజంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏర్పడిందని అంబేడ్కరిస్టులుంటుంటారు. నిజానికి అంబేడ్కర్ సమాజ విశ్లేషణ కులానికి మాత్రమే పరిమితమైనదికాదు.

 

పెళ్ళి సంబంధాల సమయంలో మనకు తరచూ ఆస్తి-అంతస్తు అనే మాటలు వినిపిస్తుంటాయి. ఆస్తికన్నా అంతస్తు ముఖ్యం అని కొందరు గట్టిగా వాదిస్తుంటారు. ఇందులో ఆస్తి అనెది అందరికీ అర్ధమైన పదమే. కానీ, అంతస్తు అనేది కొంచెం సంక్లిష్టమైన పదం.

 

డబ్బున్నవాళ్లను సమాజం గౌరవించడాన్ని మనం నిత్యం చూస్తుంటాము. డబ్బు లేకపోయినా కొందర్ని సమాజం గౌరవిస్తుంటుంది. ఆసలు డబ్బు, చదువు రెండూ లేకపోయినా కొందరు సమాజంలో గొప్ప గౌరవాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇదొక విషేషం.

 

“Social stratification is the horizontal division of the society with regards to property, power and prestige” అన్నాడు రేమాండ్‍ ముర్రే. ఆస్తి, అధికారం, అంతస్తులు సమాజ దొంతరల్ని నిర్ణయిస్తాయని అర్ధం. ఆస్తి, అధికారం అర్ధం అవుతుందిగానీ మళ్ళీ ఈ అంతస్తు అనేమాట అంత సులువుగా మింగుడు పడదు.

 

పెద్ద చదువులు చదివినా, పెద్ద ఉద్యోగాలు సంపాదించినా, బోలేడు ఆస్తిని కూడబెట్టినా సమాజంలో తమ సాంఘీక హోదా పెరగలేదని శ్రామిక కులాల వాళ్ళు వాపోతుండడాన్ని మనం తరచూ చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో social capital సాంఘీక పెట్టుబడి అనే పదం చర్చల్లోనికి వచ్చింది.

 

ఆర్ధిక పెట్టుబడి economica capital గురించి దాదాపు అందరికీ తెలిసినప్పటికీ ఈ సాంఘీక పెట్టుబడి గురించి ఇంకా చాలా మందికి తెలీదు. మార్కెట్ కు, సంపదను ఇతోధికంగా పోగుచేసుకోవడానికీ సాంఘీక పెట్టుబడి అవసరమని ఇటీవలి పరిశోధనలు తేల్చడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

 

ఈరోజు సోషల్ కేపిటల్ మీద మాట్లాడడానికి సామాజిక కార్యకర్త భార్గవ గడియారం లైవ్ లో వున్నారు.  సోషల్ కేపిటల్ మీద విస్తృత పరిశోధనలు చేసిన పెర్రి బౌర్దియు (Pierre Bourdieu) సిధ్ధాంతాన్నీ దానికి భారత దేశ అన్వయాన్నీ కూడా భార్గవ వివరిస్తారు.

 

ఈ వీడియో నాలుగు భాగాల్లో వుంది. అన్ని భాగాలను చూస్తే  కేపిటల్ మీద ఒక అవగాహన వస్తుంది.

 

-         డానీ

Monday 11 April 2022

AP Cabinet Re-Organization

 AP Cabinet Re-Organization

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం :

ఈ సామాజిక న్యాయానికి ఉన్న అధికారం ఎంత?  

 

అభిప్రాయం

ఉషా ఎస్. డానీ

బీబీసీ కోసం

11 ఏప్రిల్ 2022

 

https://www.bbc.com/telugu/india-61065073?fbclid=IwAR3UEmN1D2HpaUdGDxxAdIuzv6ZTLmK7qaOYy3GZG1waBQep7fdvSuAwSFs

 

చిన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ కూర్పు అంత ఈజీకాదు

చిన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ కూర్పు అంత సులభమైన వ్యవహారం కాదు. కుల సమీకరణలు బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కేబినెట్ కూర్పు మరీ కష్టం.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైంది. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడం, చేయకపోవడం రెండూ ఇబ్బందికరంగానే మారాయి.

 

ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు చెప్పిన ప్రకారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇప్పటికే ఆరు నెలలు ఆలస్యమైంది.

 

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా ఇంక సాగదీతకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మొత్తానికి ఆ లాంఛనాన్ని సీఎం పూర్తి చేసేశారు. ఇది ఎన్నికల కేబినెట్ కనుక పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు కూడా ఇందులో భాగం.

 

జగన్ తన పాత కేబినేట్‌లోని 11 మందిని కొనసాగిస్తూ, 14 మందిని బయటికి పంపించేశారు. ఆ 14 స్థానాల్ని కొత్తవారితో నింపారు.

 

పాత కేబినెట్ నుండి కొత్త కేబినెట్ లోనికి కొనసాగిన ప్రముఖుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంజాద్ బాషా ఉన్నారు. కొత్తగా కేబినెట్‌లోనికి వచ్చిన వారిలో ధర్మాన ప్రసాదరావు వంటి అనుభవజ్ఞులతోపాటు అంబటి రాంబాబు, రోజా, విడదల రజిని వంటి తొలిసారి మంత్రి పదవిని చేపడుతున్నవారూ వున్నారు.

 

వైసీపీలో కాంగ్రెస్ సంస్కృతి

ప్రాంతీయ పార్టీయే అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో యూనిట్లు ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీని ఇటీవల జాతీయ పార్టీ అంటున్నారు. చంద్రబాబు టీడీపీకి సాంకేతికంగా జాతీయ అధ్యక్షులు.

 

జగన్ వ్యవహారం అలా కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌‌కు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీ.

 

ప్రాంతీయ పార్టీల్లో సాధారణంగా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ పాలనో, కొండొకచో దంపతుల పాలనో కొనసాగుతుంటుంది.

 

ఎన్టీఆర్ హయాంలో వారి సతీమణి లక్ష్మీపార్వతి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని అప్పట్లో అనుకునేవారు. చంద్రబాబు హయాంలోనూ ఆయన కొడుకు లోకేష్ సూపర్ కేబినెట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి.

 

ప్రాంతీయ పార్టీల్లో అధినేత అభిప్రాయాలనే విధిగా ఆమోదించాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాల మీద అసంతృప్తి ఉన్నా దాన్ని చాటుగా దిగమింగాల్సి ఉంటుందే కానీ జాతీయ పార్టీల్లోలా అసమ్మతివర్గం రోడ్డుకు ఎక్కే అవకాశాలు ఉండవు.

 

అధినేత నిర్ణయాన్ని బహిరంగంగా ధిక్కరించడం దాదాపు అసాధ్యం. నిన్నటి వరకు అలా అసాధ్యం అనుకున్నవి ఈ రోజు సాధ్యంగా మారిపోతున్నాయి.

 

ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలనాటి కాంగ్రెస్ సంస్కృతి పూర్తి స్థాయిలో కనిపిస్తోంది.

 

నిన్నటి వరకు హోం మంత్రిగా పనిచేసిన సుచరిత ఏకంగా శాసన సభ్యత్వానికే రాజీనామాను ప్రకటించారు.

 

వైయస్ విజయమ్మగారికి అత్యంత సన్నిహితులుగా భావించే ప్రకాశం జిల్లా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడం రాజకీయ పరిశీలకులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే పరిణామం. మంత్రి పదవుల్ని కోల్పోయినవారి అనుచరులు, మంత్రి పదవిని ఆశించి భంగపడినవారి అభిమానులు కొన్ని చోట్ల భోరున ఏడుస్తున్నారు, కొన్ని చోట్ల రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు.

 

కొన్ని చోట్ల బాహాటంగా పార్టీ పెద్దల్ని తిట్టిపోస్తున్నారు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను అనుచరులు ఆత్మాహుతికి కూడ సిధ్ధమయ్యారు.

 

 

రోడ్డెక్కిన అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ కేవలం 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఒక చిన్న రాష్ట్రం. కేబినేట్‌లో ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.

 

మంత్రివర్గాన్ని కూర్చడానికి 2019లోనే జగన్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, రోజా వంటి అనుభవజ్ఞులకు వారికి అప్పట్లో కేబినెట్లో స్థానం దక్కలేదు. సుపరిచితులు కాని సుచరిత వంటి శాసనసభ్యులకు స్థానం కల్పించారు.

 

మొదటి కేబినెట్ లాంఛనమనీ, రెండోది ఎన్నికల కేబినెట్ కనుక అది కీలకమని అన్నారు. ఎన్నికల కేబినెట్‌లో ముఖ్యులకు స్థానం కల్పిస్తారని అప్పట్లో ఒక హామీ కూడా ఇచ్చారు.

 

కొత్త ప్రభుత్వం కనుక అప్పట్లో అసంతృప్తి రోడ్లకెక్కలేదు. ఇది ఈ టెర్మ్‌కు చివరి కేబినెట్ కనుక మరో ఛాన్స్ వస్తుందనే ఆశ లేదు కనుక అసంతృప్తి భగ్గుమని రోడ్డెక్కింది.

 

ఇందులో ముఖ్యమంత్రి చేసిన వ్యూహాత్మక తప్పిదాలూ ఉన్నాయి. మొత్తం 25 మందినీ తప్పించి మొత్తం కొత్త వారితో రెండో కేబినెట్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రే చెప్పారు. పాత మంత్రులందరూ ఇంటి ముఖం పట్టడానికి మానసికంగా సిద్ధమయ్యారు కూడా. అయితే, సగం మందిని మాత్రమే తీసి సగం మందిని కొనసాగించడంతో అసంతృప్తి రాజుకుంది.

 

సామాజిక న్యాయం అంకెల్లోనేనా?

కొత్త కేబినేట్‌లో బలహీనవర్గాలకు పెద్ద పీట వేయడం చెప్పుకోదగ్గ విషయం. మొత్తం 25 స్థానాల్లో 17 స్థానాల్ని అంటే 70 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. దీనిని వారు 'సామాజిక మహా విప్లవం'గా పేర్కొని కొనియాడారు.

 

అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు సంఖ్యాపరంగా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ విధాన నిర్ణయాలు తీసుకునే చోట వారి ప్రభావం ఎంత? ప్రాధాన్యం ఎంత అనేదే అసలైన ప్రశ్న.

 

వైసీపీ వ్యూహకర్తలు చెబుతున్నట్టు కొత్త కేబినెట్ కూర్పులో సామాజిక న్యాయం కనిపిస్తున్నా భౌగోళిక సమతూకం మాత్రం సాధించలేకపోయారు.

 

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సరిగ్గా వారం రోజులు ముందు జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు పెంచింది,  

 

26 జిల్లాల నుంచి 25 మంది మంత్రులు అంటే సింపుల్ మేథమేటిక్స్ ప్రకారం చూసినా ఒక జిల్లాకు ప్రాతినిధ్యం దక్కదు. ఆపైన, కొన్ని జిల్లాల్లో ఒకరికన్నా ఎక్కువ మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.

 

అంటే, కొత్త జిల్లాలలో కొన్నిటికి ప్రాతినిథ్యం దక్కలేదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్రంగా భావించే విజయవాడ ఇప్పుడు కొత్త ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. కానీ, ఈ కొత్త జిల్లాకు కొత్త కేబినెట్లో స్థానం దక్కలేదు.

 

అల్లూరి, విశాఖ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, శ్రీబాలాజి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఏకంగా ఎనిమిది జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యంలేకపోవడం రేపు వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టొచ్చు.

 

కొడాలి, పేర్ని నానిల 'పోర్ట్‌ఫోలియో'లు ఎవరికంటే

ప్రతి రాజకీయా పార్టీలోనూ అన్ని కులాలు, అన్ని మతాలకు చెందినవారుంటారు. ప్రతి పార్టీనీ ఏదో ఒక సామాజికవర్గం నాయకత్వం వహిస్తూ ఉంటుంది.

 

తెలుగు దేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం నాయకత్వం వహిస్తుంటే, వైసీపీకి రెడ్డి సామాజికవర్గం నాయకత్వం వహిస్తోంది.

 

టీడీపీలో రెడ్డి ఎమ్మెల్యాలు వున్నట్టే, వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్త కేబినెట్‌లో 4 స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి, మరో 4 స్థానాలను కాపు సామాజికవర్గానికి కేటాయించారు. ఇతర ఓసీలయిన కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. ఈ స్థాయి నిరాకరణ గతంలో ఎన్నడూ లేదు.

 

కమ్మ సామాజికవర్గానికి చెందిన గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని గత కేబినెట్లో నిత్యం వార్తల్లో ఉండేవారు.

 

పౌర సరఫరాలు వారి శాఖ అయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని తిట్టడమే వారి 'పోర్టుఫోలియో'గా ఉండేది.

 

అలాగే, పేర్ని నానిని తప్పించడం కూడ చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా పుంజుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను నిరంతరం ఎదుర్కొన్నది పేర్ని నానీనే. కొత్త మంత్రివర్గంలో కొడాలి నాని 'పోర్ట్‌ఫోలియో'ను రోజాకు, పేర్ని నాని 'పోర్ట్‌ఫోలియో'ను అంబటి రాంబాబుకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తిట్టడమే వారి పని.

 

కమ్మ ఓటు తనకు రాదని జగన్ ఫిక్సయిపోయినట్లేనా?

కమ్మ సామాజికవర్గంలో ఎక్కువ భాగం గత ఎన్నికల్లో టిడిపికి ఓటేసినా,  వారిలో కొంత భాగం వైసిపికి కూడ ఓటేసినట్టు కొన్ని సంకేతాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం తనకు ఓటు వేయదని ఇప్పుడు జగన్ ఫిక్స్ అయిపోయినట్టున్నారు.

 

రేపు జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరినా వైసీపీకి ఇబ్బంది కలగరాదనే వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు అయిన కాపుల్ని గట్టిగా అక్కున చేర్చుకున్నారు.

 

2024 ఎన్నికల్లో చంద్రబాబు కన్నా పవన్ కల్యాణ్ నుంచి తనకు గట్టి పోటీ ఉంటుందని జగన్ వ్యూహకర్తలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు, కొత్త కేబినెట్ కూర్పువల్ల కమ్మ సామాజికవర్గం టీడీపీకి అనుకూలంగా మరింత పోలరైజ్ కావచ్చు.

 

కొత్త కేబినెట్‌ను ప్రకటించిన వెంటనే రెడ్డి, కాపు యేతర సామాజికవర్గాలను బుజ్జగించడానికి కొన్ని ఫీలర్లను ప్రభుత్వ పెద్దలు బయటికి పంపించారు.

 

వీటి ప్రకారం, ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి కేబినేట్ హోదా కలిగిన చైర్మన్‌గా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నానిని నియమిస్తారు.

 

 

బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణును స్టేట్ ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌గా నియమిస్తారు.

 

వైశ్య సామాజికవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామిని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ గా నియమిస్తారు.

 

క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజును శాసనసభ చీఫ్ విప్‌గా నియమిస్తారు.

 

అయితే, ఈ కొత్త పదవులు ఆయా సామాజికవర్గాల్ని ఏ మేరకు బుజ్జగిస్తాయన్నది ఒక సందేహం.

 

కేబినెట్‌ ‘లో’ ఉండడం వేరు, కేబినెట్ హోదా ’తో’ ఉండడం వేరు అని అప్పుడే కొడాలి నాని అసంతృప్తి గళం విప్పారు.

 

'లో' నుండి వెలుపలికి వచ్చినవారు 'తో' తో సంతృప్తి చెందక త్వరలో కొంచెం గొంతు పెంచే అవకాశాలున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కులప్రాతిపదికగా జరిగింది కనుక అది రాష్ట్రంలో కుల వ్యవస్థీకరణకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.

 

రానున్న పరిణామాలు జగన్‌కు అనుకూలంగా మారుతాయా? లేక వ్యతిరేకంగా మారుతాయా? అన్నది వేచిచూడాల్సిన అంశం.

 

(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు, అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం)

 

10 ఏప్రిల్ 2022