Monday 26 June 2023

I am the son of a single woman

విజయా!

దీన్ని ప్రచురించుకో.

-        డానీ

 

I am the son of a single woman!

 

నేను ఓ మూడేళ్ళు సింగిల్ వుమన్ కొడుకుని !

 

భండారు విజయ, పి. జ్యోతిల సంపాదకత్వంలో వచ్చిన ‘స్వయం సిధ్ధ – ఒంటరి మహిళల జీవనగాధలు సంకలనం గురించి విన్నాను. ఆ సంకలనకర్తల ఇంటర్వ్యూను పత్రికల్లో చదివాను. పరిచయ సభల వార్తలు సోషల్ మీడియాలో చూశాను. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగాలను బహిరంగంగా పంచుకోవాలనుకుంటున్నాను.

 

మన వివాహ వ్యవస్థలో పురుషుడు యజమాని; స్త్రీ శ్రామికురాలు. ఇది భూస్వామ్య వ్యవస్థ రూపొందించిన సామాజిక ఏర్పాటు. పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ ఇది ఇలాగే కొనసాగుతోంది. చక్రవర్తుల్లో Cyrus the Greatలాగ చాలా అరుదుగానైనా ఎక్కడో Benevolent భర్తలు వుండవచ్చు.  నేను వాళ్ళ కోవలోనికి రాకపోవచ్చు. అందువల్ల, సింగిల్ వుమెన్ సమస్య మీద మాట్లేడే అర్హత నాకు వుందోలేదో కూడా తెలీదు.

 

అయితే నాకు ఒక సింగిల్ వుమన్ బాగా తెలుసు.  ఆమె పడ్డ కష్టాలను, ఎదుర్కొన్న సవాళ్ళను అధిగమించిన నిందల్ని, సాధించిన విజయాలను నేను అతి దగ్గరగా చూశాను. బహుశ; ఆ అనుభవం కారణంగా నేను ఈ అంశం మీద మాట్లాడవచ్చు అనుకుంటున్నాను. ఆమె నాకు జన్మనిచ్చిన తల్లి; సుఫియా బేగం. అమ్మీ తుమ్హే సలామ్ !

 

పుట్టినప్పుడు ఒక విధంగా ఆర్ధికంగా మెరుగ్గా వున్న కుటుంబమే మాది. ఉమ్మడిలో ఒక లాంచి వుండేది. నాన్నకు స్వంతంగా ఒక సైకిల్ షాపు, ట్రక్కుల టైర్ రీ-ట్రేడింగ్ కార్ఖానా వుండేది. మాకు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోటారు సైకిలుండేది. మూడు ఇళ్ళు వుండేవి. ఇంట్లో రంగూన్ కలపతో చేసిన పందిరి మంచాలుండేవి. టేబుళ్ళు కుర్చీలుండేవి. గ్రామ్ ఫోన్ వుండేది. అమ్మకూ, నాన్నకూ పాటలంటే ఇష్టం. ఇంటికి షమా ఉర్దూ పత్రిక వచ్చేది. పింగాణి ప్లేట్లలో భోజనం చేసేవాళ్లం. నాకోసం ప్రత్యేకంగా వెండి పళ్ళెం, వెండి గ్లాసు వుండేది. మంచి బట్టలు వేసుకునేవాళ్ళం.  

 

1958లో - అంటే అప్పటికి నాకు ఏడు సంవత్సరాలు వుంటాయి; పైన చెప్పినదంతా ఒక కలగా కరిగిపోయింది. గోదావరి వరదల్లో లాంచీ కొట్టుకుపోయింది. కార్ఖానాలో అగ్నిప్రమాదం జరిగింది. ఉమ్మడిలోని పెద్దిల్లు అమ్ముకున్నారు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈలోకంలో అప్పులున్నవాళ్లకు అత్మగౌరవం నిషేధం. బయట అప్పులున్నప్పుడు ఇంట్లో మనుషులు  కుంగుబాటు, వత్తిళ్ళకు లోనవుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత చెడిపోతుంది. ప్రేమించుకోవాల్సిన సందర్భల్లోనూ వాళ్లు కలహించుకుంటారు.

 

1961 వేసవి రోజులు. నేను ఇంకా ఐదవ తరగతి వార్షిక పరీక్షలు రాయలేదు. ఒకరోజు నడి బజార్లో అప్పులవాడు నిలదీస్తే మా నాన్న చాలా అవమానంగా భావించి కుంగిపోయారు. ఒక రెండు రూపాయల నోటిచ్చి నన్ను నరసాపురం బస్ స్టాండ్ లో విడిచి, ఆయన ఊరు వదిలి లూధియాన పారిపోయారు. 

 

          విషయం తెలిసి మా అమ్మ నన్ను పట్టుకుని శబ్దం చేయకుండా ఒక రాత్రంతా ఏడిచింది. ఈ లోకంలో నిశ్శబ్దంకన్నా ఏడ్పుకన్నా భయంకరమైనది నిశ్శబ్దంగా ఏడ్వాల్సి రావడం.

 

ఆ మరునాడు మా అమ్మ హఠాత్తుగా ఒక రాక్షసిగా మారిపోయింది. ఇంట్లో సామానంతా పెరట్లో పెట్టి వేలం వేసి అమ్మేసింది. అప్పులవాళ్ళను ఇంటికి పిలిచి ఎవరికి ఎంత ఇవ్వాలో లెఖ్ఖకట్టి ఇచ్చేసింది. నగదు యాభై రూపాయలు కూడ మిగలలేదు. “చావడానికి స్వంత ఇల్లుందిరా ఫరవాలేదు అంది చాలా ధైర్యంగా. “గుర్తుపెట్టుకో మనం జీవితంలో ఎప్పుడూ అప్పు చేయకూడదు అని హెచ్చరించింది.  

 

తను ఉర్దూ బాగా చదువుకున్న మనిషి. ధార్మిక సూక్ష్మాలు లోతుగా  తెలుసు. తాత్పర్యం అంతగా తెలీదుగానీ అరబ్బి కూడ బాగా చదవడం వచ్చు. మరునాడు ఉర్దూ ట్యూషన్లు మొదలెట్టింది. అవి జీవించడానికి సరిపోవని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. అప్పట్లో కిరాణా షాపుల్లో శంఖాకారంలో కట్టి ఇచ్చే  పొట్లాల స్థానంలో కొత్తగా కాగితపు సంచులు వచ్చాయి. మా అమ్మ ఆ సంచులు చేయడం నేర్చుకుంది.

 

మాకు జీవనాధారం దొరికింది. కాని, తినడానికీ, ముగ్గురు పిల్లల్ని చదివించడానికీ ఆ కూలీ డబ్బులు సరిపోయేవి కావు. ముస్లిం మహిళ కనుక బయటికి వెళ్ళి పనిచేసే వాతావరణం లేదు. కుటుంబాన్ని పోషించడానికి రాత్రింబవళ్ళు పనిచేసేది.  దానితో తన ఆరోగ్యం చెడిపోయింది. క్షయ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టరు హెచ్చరించాడు. అప్పటికే నేను అర్ధ అనాధను. అమ్మకు ఏదైనా జరిగితే నాకు దిక్కెవరు? చాలా దిగులు వేసింది. 

 

ఆ రాత్రి మా మ్మ చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. “అల్లా దయగలవాడు. మంచివాళ్ళకు తప్పక మంచిరోజులు ఇస్తాడు. మనకు మంచిరోజులు వస్తాయి. మనం మంచి రోజుల్ని చూడాలి. అప్పటి వరకు మనం బతికి వుండాలి. బతికి వుండాలంటే ఆరోగ్యంగా వుండాలి కదరా?” అంది.  

 

సాధారణంగా పిల్ల బాధ్యతల్లో తల్లి కొంత, తండ్రి కొంత పంచుకుంటారు. ఒంటరి మహిళలు  రెండు బాఢ్యతల్ని నిర్వర్తించాల్సి వుంటుంది. ఒంటరి స్త్రీలు ఆత్మగౌరవంతో స్వంతకాళ్ళ మీద నిలబడడాన్ని, ఈ సమాజంలో కొందరు సహించలేరు. వాళ్ళ స్వంత ఆస్తి ఏదో కోల్పోతున్నట్టు భావిస్తారు. ఈ క్రమంలో నిందలు వేయడానికీ జంకరు. ఆ ఇబ్బందుల్ని  అమ్మా కూడ ఎదుర్కొంది.

 

మా అమ్మకు సహాయకారిగావుండాలని నేను కూడా పనిలో చేరాను. పదకొండవ ఏట బాల కార్మికునిగా మారాను. ఆమెకు ఉదయం పాలుకాసి టీ ఇవ్వాలనేది నా కూలీకి  తొలి లక్ష్యం. నేను పనిలో చేరడం తనకు ఇష్టంలేదు. “నువ్వు ఇంగ్లీషు నేర్చుకోవాలి. ఇంగ్లీషులో మాట్లాడాలి అప్పుడు మన గౌరవం పెరుగుతుంది అనేది.  తనకు తెలుగు చదవడం రాదు. మా కోసం నేర్చుకుని మమ్మల్ని కూర్చోబెట్టి చదివించేది.

 

పౌరుషం ఆత్మాభిమానం గల మనిషి. దేనికీ జంకేది కాదు. మాటంటే మాటే. అనుకున్నదంటే జరగాల్సిందే. మా పేదరికాన్ని దాచడానికి చాలా తంటాలు పడేది. మన మీద మరొకరు జాలి పడడం తనకు నచ్చేదికాదు. రెండు మూడు జతలైనా సరే  మంచి బట్టలు కొనేది. తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పేది.  ఆమె నా తొలి స్టైలిస్ట్. నన్ను ప్రెజెంటబుల్ గా వుంచేది. శుభకార్యాల సందర్భంగా  భోజనాలకు వెళుతున్నప్పుడు అనేక  జాగ్రత్తలు చెప్పేది. ఆబగా తినకండి. మాసం ముక్కల కోసం ఎగబడకండి. అన్నాన్ని పిసకవద్దు; ముద్దలు చేయవద్దు; వేళ్ళతో మాత్రమే సుతారంగా తినాలి. సగం కడుపే తినండి. ఆకలి తీరకపోతే ఇంటికి తిరిగి వచ్చాక నేను మళ్ళీ వండి పెడతాను అనేది.

 

రెండున్నరేళ్ళ తరువాత మానాన్న తిరిగి వచ్చారు. ఆ తరువాతి కత వేరు.  

 

మా అమ్మ ఒంటరి మహిళగా వున్న ఆ మూడేళ్ళ కాలంలో నేను  మూడు విషయాలు నేర్చుకున్నాను. మొదటిది; మంచిరోజుల్ని ఆస్వాదించాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి; అంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండోది; జీవితంలో ఎన్నడూ అప్పు చేయకూడదు. మూడోది; మనం చేస్తున్న పని న్యాయమైనదైనప్పుడు ఎంతటి బలవంతుడ్ని కూడ లెఖ్ఖ చేయకూడదు.

 

మా అమ్మ దాదాపు 84 ఏళ్లు బతికింది. చనిపోవడానికి  ఏడాది ముందు తనకు నిమోనియా వచ్చింది. ఆ సమయంలో నాలుగు రోజులు హాస్పిటల్ లో వుంది. అది తప్ప తన జీవితంలో హాస్పిటల్  బెడ్డు ఎప్పుడూ ఎక్కలేదు. నేను 71 సంవత్సరాల్లో కోవిడ్ సోకినప్పుడు తప్ప ఎన్నడూ హాస్పిటల్ బెడ్డు ఎక్కలేదు.

 

ఆ మూడేళ్ళ అనుభవం అప్పట్లో కొంచెం బాధగానే వుండేది. ఇప్పుడు తలుచుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను. నేను రాటు తేలడానికి ఆ అనుభవం గొప్ప అవకాశం.  

 

సింగిల్‍ వుమెన్ ఎదుర్కొనే సమస్యల్ని చూసినపుడు నాకు అప్పటి మా అమ్మ గుర్తుకు వస్తుంది. వాళ్ళ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ కలుగుతుంది.  ఒక్కొక్కసారి అదీ ఒక ఇబ్బందే. ఇది చాలా vulnerable issue.

 

మన సమాజంలో సింగిల్స్ జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెఖ్ఖల ప్రకారం  20-40 ఏళ్ళ వయస్సు గలవారిలో సింగిల్స్ 11 శాతం అయితే 2021లో వీరి శాతం 21కి పెరిగింది. అంటే, పదేళ్ళలో రెట్టింపు అయింది. జనాభాలో ఇప్పుడు ఇది ప్రధాన భాగం. మన సామాజిక ఆవరణం ఆ దిశగా  సాగుతోంది.

 

ముస్లింలకు ఇళ్ళు అద్దెకు ఇవ్వనట్టు ఇటీవల సింగిల్ వుమెన్ కూడ ఇళ్లు అద్దెకు ఇవ్వడంలేదు. సామాజిక వివక్ష, స్టిగ్మా, వ్యక్తిగత రక్షణ, చట్టపరమైన - విధానపరమైన అంశాలు, మద్దతు ఇచ్చే సంఘాల లేమి వీటన్నింటి మీద దృష్టి పెట్టాలి. ఇది చాలా పెద్ద చర్చ. దానికి ఇది సందర్భంకాదు.

 

మా అమ్మని స్మరించడానికి అవకాశాన్ని కల్పించిన ‘స్వయం సిధ్ధ  సంకలనానికీ, సంపాదకులు భండారు విజయ, పి. జ్యోతిలకు ధన్యవాదాలు.

 

అమ్మీకి సలాములు!

 

డానీ 

జూన్, 26, 2023


Friday 23 June 2023

*ఈ సారి కొంచెం భిన్నంగా ఆలోచిద్దాం*

 "ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే

ఉమ్మడి పౌరస్మృతిని అందరూ ఆమోదించాలి" 


ఈరోజు FBలో నా పోస్టు, 


*ఈ సారి కొంచెం భిన్నంగా ఆలోచిద్దాం* 


ప్రతిసారి లోక్ సభ ఎన్నికలకు ముందు  ఒక ముస్లిం సమస్యను ముందుకు తెచ్చి పెద్ద చర్చను మొదలెట్టడం బిజెపి ఎత్తుగడ. మనం ఆ ఉచ్చులో పడిపోతాం. బిజెపికి అవసరమైన ఓటు  పోలరైజేషన్  జరిగిపోతుంది. 


2028 ఎన్నికలకు ముందు బిజెపి ట్రిపుల్ తలాక్ రద్దు అంశాన్ని బిజెపి ముందుకు తెచ్చింది. దాన్ని వ్యతిరేకించేవాళ్లను అది అనాగరికులుగా చిత్రించి ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ముస్లిం మహిళలు సహితం తమ పక్షం అని ప్రచారం చేసుకుంది. 


ఈసారి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చింది. నిజానికి ఇది కేవలం ముస్లింల అంశం మాత్రమేకాదు. అనేకానేక ఇతర సమూహాల సమస్య కూడ. దాని కోసం ముస్లింలు మాత్రమే రోడ్డెక్కడం  తెలివి తక్కువ పని. 


ఇప్పుడు మాట్లాడాల్సింది హిజాబ్, హలాల, హలాల్, ప్రత్యేక పౌర స్మృతి గురించి కానే కాదు. 


ఇప్పుడు మాట్లాడాల్సింది మోదీ పరిపాలన వైఫల్యాల గురించి, వారు చెప్పే అబధ్ధాల గురించి, ప్రభుత్వ సంస్థాగత అవినీతి గురించి, అధిక ధరల గురించి, నిరుద్యోగం గురించి, సమాజ అశాంతి గురించి. బిజెపిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలను ఏకం చేయడం గురించి. 


మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ పోస్టు పెట్టాను. వచ్చే వారం వివరంగా ఒక వ్యాసం రాస్తాను. 


స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.


మీ 

డానీ 











Who Controls the Artificial Intelligence

 Who Controls the Artificial Intelligence 

కృత్రిమ మేధ ఎవరి మాట వింటుంది?

-      డానీ 

పెను ప్రమాదాలు, గొప్ప ఆశల చారిత్రక సంధి సమయాల్లో మనుషులు తమనూ, తమ చుట్టూవున్న ప్రపంచాన్నీ అర్ధంచేసుకోవడానికి ఒకే సందర్భంలో విషాదాన్నీ ప్రహసనాన్నీ ఆస్వాదించాల్సి వస్తుంది.  గతం  పోయి కొత్తది వస్తున్న ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగతంగా మనుషులు, సామూహికంగా సమాజం ఇలాంటి భావోద్వేగానికి గురికాక తప్పదు.

          కుత్రిమ మేధ / ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు ప్రమాదాల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు దీనిని సాంకేతిక సమస్యగా చూస్తుంటే, మరి కొందరు సామాజిక సంక్షోభంగా చూస్తున్నారు. నేను సమాజం నుండి సాంకేతిక రంగ అభివృధ్ధిని  చూడాలనుకునేవారి  కోవకు చెందుతాను.

ప్రకృతిలో ప్రతి జీవి సంతతిని కని  ఆహార సేకరణతో జాతిజీవికను  కాపాడుకుంటుంటుంది. మనిషి అదనంగా ఇంకో పని  చేస్తాడు. జాతి జీవికను కొనసాగించడానికి ఆహారోత్పత్తిని చేపడతాడు. దానికోసం  పనిముట్లను  తయారు  చేస్తాడు. “పనిముట్లను తయారు చేసే జీవి మనిషి” అన్నాడు బెంజామిన్ ఫ్రాంక్లిన్. అంతేకాదు తన శారీరక - మేధో శ్రమల్ని తగ్గించుకోవడానికి, సౌఖ్యాలను ఆస్వాదించడానికీ మనిషి నిరంతరం కొత్తకొత్త  యంత్రాలను  కనిపెడుతూనే వుంటాడు.  

మొదటి తరం  యంత్రాలు బాహ్యదహన  యంత్రాలు. వీటి పనితీరు  అందరికి సులువుగా అర్ధం అవుతుంది. రెండోతరంవి అంతర్థహన యంత్రాలు. వీటి పనితీరును అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం. మూడోతరం  యంత్రాలు మార్మికమైనవి వీటి పనితీరును   తెలుసుకోవడం  చాలా కష్టం.  ఆ తరువాత నిరంతరంగా ఒకదానిని మించిన మార్మికతతో అనేక  యంత్రాలు పుట్టుకొస్తూనే వున్నాయి.  

యంత్రాలనేవి ప్రమాదాలతో పాటే వస్తాయి. రైలు  ప్రమాదాలు బస్సు ప్రమాదాలు రసాయానిక  అణు ప్రమాదాలు కూడ మనకు  తెలుసు. వాటి ప్రయోజనాలతో  పోలిస్తే నష్టలు  తక్కువే అనే నమ్మకంతోనే మానవజాతి  యంత్ర పరిశోధనలు కొనసాగిస్తూ వుంటుంది. అందుకు విరుధ్ధంగా  ప్రయోజనాలకన్నా  ప్రమాదాలే  ఎక్కువగా వుండే యంత్రాలను ఎవరయినా ఎందుకు తయారు చేస్తారూ?  అనేది  ఎవరికయినా  రావలసిన సందేహం.

పది శాతం లాభం కోసం పెట్టుబడీదారుడు ఉరికంభం ఎక్కడానికి కూడ సిధ్ధపడతాడు అంటాడు ఓ సందర్భంలో కార్ల్ మార్క్స్. ఆ క్రమంలో అతను తానే అదుపుచేయలేని భూతాల్ని కూడా సృషిస్తాడు. సమాజంలో పెరుగుతున్న మృత సంస్కృతి కూడ ఇలాంటి ప్రమాదకర ఆవిష్కరణలకు ఒక డిమాండ్ ను సృష్టిస్తోంది.

జాతియోద్యమమైనా కమ్యూనిస్టు ఉద్యమమైనా ఇటీవలి  కాలపు  తెలంగాణ  ఉద్యమమైనా తమ ప్రకటిత  మహత్తర ఆదర్శాలను  సాధించాయా  లేదా అన్నది సందేహమే. అయితే, ఆ ఉద్యమాలు గమ్యానికి చేరకపోయినా వాటి గమన దశలో వికసించిన సంఘీభావం మహాత్తరమైనది. ఆ కాలంలో ఉద్యమ కార్యకర్తలు, అభిమానుల  మధ్య సంఘీభావం చాలా ఉన్నత   స్థాయిలో వుండింది. అదొక  అద్భుత సాంఘిక  రసాయన  చర్య. సంఘీభావాన్ని సులువైన  మాటల్లో చెప్పాలంటే సాటి  మనిషి  కుంగిపోయినపుడు ధైర్యం  చెప్పడం. నిరుత్సాహ పడినప్పుడు ఉత్సాహపరచడం, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నపుడు తోడుగా వుండడం, ఒక్కరి కోసం అందరూ నిలవడం; అందరి  కోసం ఒక్కడు బలిదానానికి (Altruistic Suicide) సిద్ధపడడం.

సంఘీభావ లక్షణాలన్నీ కొన్నేళ్ళుగా మన సమాజంలో నుండి అదృశ్యం అయిపోవడం మొదలెట్టాయి. ఈ దశను వివరించడానికి పోస్ట్ - మోడర్నిజం, పోస్ట్- సోషలిజం, పోస్ట్- మార్క్సిజం తదితర సంయుక్త పదాలను కొందరు  వాడుతున్నారు. అవేవి సరైన  వ్యక్తికరణలు కావు. మనం  ఆధునికతను,  సామ్యవాదాన్ని  ఇంకా అస్వాదించనేలేదు. అలాంటప్పుడు ‘అనంతర’ అనే మాటలకు  అర్ధంలేదు. దీనిని ద్రవాధునిక (liquid modernity) దశ అని జిగ్మోంటె బౌమన్ ఓ కొత్త పేరు పెట్టారు.  దీనిని పెట్టుబడిదారి వృద్ధదశ (late-stage capitalism) అనేవారూ వున్నారు. ఈదశలో మనుషులు ముఖ్యంగా శ్రామికులు (proletariat) మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో (precarious) బతుకుతుంటారు. ఈ రెండు పదాలను కలిపి ఇప్పుడు Precariat అంటున్నారు. మనం తెలుగులో ‘అస్థిర శ్రామికులు’ అనుకోవచ్చు.  నిజానికి దీనిని పెట్టుబడిదారి భ్రష్టదశ  అనడం బాగుంటుంది.

పెట్టుబడిదారి భ్రష్ట  దశలో మృతసంస్కృతి పెచ్చరిల్లుతుంది. మనిషి  మనిషి  కాకుండా పోతాడు. ఆర్ధిక రంగంలో విపరీతమైన సంపద యావ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయరంగంలో రాజదండంతోసహా రాచరికాన్ని  మించిన అధికార కేంద్రీకరణ, సామాజిక రంగంలో   విద్వేషాలు పెరిగిపోతాయి.

ఈ భ్రష్ట  దశలో లోపల బయట కూడ  మనుషుల్లోని  మనిషితనం  అంతరించిపోతుంది. మనిషితనాన్ని  కోల్పోయిన మనుషులు అనేక  వికృత  చేష్టలు  చేస్తారు. ఇప్పటి వరకు రక్తపోటు, డయాబేటిక్, నిద్రలేమి (insomnia) తదితరాలను  మనం జీవనశైలి  వ్యాధులు అంటున్నాం. ఇప్పుడు ఈ జాబితాలో డిజిటల్ మీద ఆధారపడడం  (Digital Dependency) అనే  కొత్త వ్యాధి కూడ చేరింది. సెల్ ఫోన్ మన శరీర అవయవాల్లో ఒకటయిపోయింది.

కేవలం  రెండు అక్షరాల బైనరీ భాషతో, ఎలక్ట్రాన్లు ఒకే దిశలో స్థిరంగా ప్రవహించే ప్రత్యక్ష విద్యుత్తుతో డిజిటల్ టెక్నాలజీ పనిచేస్తుంది. గతంలో మనం మహత్తరమైనవిగా భావించే పనుల్ని ఇది అవలీలగా సెకన్లలో చేసి పెట్టేస్తుంది. ఒక ఫొటో ఇచ్చి రవివర్మ శైలిలో పెయింటింగ్ గా మార్చమంటే మరుక్షణంలో మార్చేస్తుంది; పికాసో, మైఖేల్ యాంజిలో, లియోనార్దో డావిన్సీ ఏ శైలి కావలిస్తే ఆ శైలిలో సెకన్లలో.

ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్న కుత్రిమమేధ మీద అనేక అనుమాలు కూడ వున్నాయి. దీని విమర్శకుల్లో సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు స్టీఫెన్ విలియం హాకింగ్ తొలి పంక్తిలో వుంటారు.  

మనుషులతోసహా సమస్త ప్రాణుల్లో జీవపరిణామం చాలా నిదానంగా సాగుతుంటుంది. మనిషి సృష్టించిన కుత్రిమ మేధ చాలా వేగంగా పరిణామం చెందుతుంది. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ఏఐని ఒకసారి ఆన్ చేస్తే ఆ తరువాత అది తనంతటా తానే పనిచేస్తూ ముందుకు సాగిపోతుంది. ప్రతిసారి గతంకన్నా  ఎక్కువ వేగంతో  పునరావృతం అవుతూవుంటుంది. మనిషి తన జీవ సంబంధ నిదానపు పరిణామం కారణంగా ఎన్నటికీ ఏఐ వేగాన్ని అందుకోలేక దాని ముందు నిస్సహాయునిగా నిలబడిపొతాడు. ఇది మానవజాతికి అణువిస్పోటనంకన్నా ప్రమాదకరం కావచ్చు అన్నాడు హాకిన్స్. 1798లో బ్రిటీష్ అర్ధశాస్త్రవేత్త థామస్ రాబర్ట్ మాల్థూస్ కూడా ఆహారోత్పత్తికన్నా జనాభా పెరుగుదల ఎక్కువై కరువు కాటకాలు యుధ్ధాలు ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని ప్రపంచాన్ని భయపెట్టాడు. ఆనాటి 80 కోట్ల ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఆహారోత్పత్తి 10 రెట్లకన్నా ఎక్కువ  పెరిగింది. దాచుకోవడానికి గిడ్డంగులు లేక ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నాయి. ఎందుకంటే, మనిషి తినడానికి కేవలం పొట్టపెట్టుకుని పుట్టడు; రెండు చేతులతోనూ జన్మిస్తాడు. ఆ చేతులు అద్భుతాలను  సృష్టిస్తాయి.

డిజిటల్ టెక్నాలజీ గణాంకాల ద్వార పని చేస్తుంది కనుక  దానికి కొన్ని పరిమితులుంటాయి; వివేకం, భాషా ప్రయోగం విషయాల్లో యంత్రాలు మనుషుల్ని అధిగమించడం కష్టం అని  ఒక భరోసా ఇచ్చారు అమెరికన్ తత్వవేత్త నోమ్ చోమ్స్కి. ఆయన  భాషాశాస్త్రవేత్త కూడ.

యంత్రాలు కఛ్ఛితంగా పనిచేయవచ్చు; కానీ వివేకాన్ని ప్రదర్శిస్తాయి అనేది అనుమానమే. యూనివర్శిటీ ఆఫ్ లండన్ కు చెందిన స్లావోజ్ జిజెక్ (Slavoj Žižek) ను వర్తమాన గొప్ప తత్వవేత్తగా  చాలామంది గుర్తిస్తారు. కుత్రిమ మేధ గురించిన అతి ఉత్సాహాలు అతి భయాందోళనలు రెండూ మనుషుల భావోద్వేగాల నుండి పుట్టినవే అంటారాయన. ఈ ఏడాది మార్చి 30న న్యూయార్క్ పోస్ట్ ‘Married father commits suicide after encouragement by AI chatbot’ అనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దానితో కుత్రిమ మేధ మీద భయాందోళనలు మొదలయ్యాయి. అయితే, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ దీనికి భిన్నమైన  రిపోర్టును విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకునే ధోరణుల్ని కుత్రిమ మేధ ముందుగానే పసిగట్టి సంబంధిత విభాగాలను హెచ్చరిస్తుంది అనేది ఆ నివేదిక సారాంశం. కుత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తి.

ముడి సమాచారం (డేటా)ను ప్రాసెస్ చేసి (శుధ్ధి) సమాచారాన్ని ఉత్పత్తి చేస్తుంది కనుక డిజిటల్ టెక్నాలజీకి సమాచార సాంకేతిక విప్లవం అనే పేరు వచ్చిందని సామాన్యులకేకాక చాలామంది టెకీలకు సహితం తెలియదు.

యంత్రాల మీద ఆధిపత్యం గల వర్గమే ముందు సంపద మీద, తరువాత ప్రభుత్వం మీద అనంతరం మొత్తం సమాజం మీద ఆధిపత్యాన్ని సాధిస్తుందనీ, తన ప్రయోజనాలనే ప్రజల ప్రయోజనాలుగా మీడియా ద్వార ఒప్పించి పీడక వ్యవస్థ మీద కుత్రిమ  ఆమోదాంశాన్ని రుద్దుతుందనేది  స్థూలంగా మార్క్సియన్ భావన. ఇప్పుడు కుత్రిమ మేధ కూడ తన యజమానులకు అనుకూలంగా ఆమోదాంశాన్ని ఉత్పత్తి చేస్తుందనడంలో సందేహంలేదు. 

భారత సామాజిక వ్యవస్థ క్రమంగా మతవ్యవస్థగా మారుతోందని అందరూ కాకపోయినా ఎక్కువమంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రశ్నలు ఛాట్ జిపిటిలో అడిగితే అది యూజర్ ను మందలిస్తుంది; తన నియమాలకు  విరుధ్ధం అంటుంది. కుత్రిమ మేధకు రాజకీయాలుంటాయా అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో తలెత్తుతుంది. దీనికి సమాధానం చాలా సులువు. కుత్రిమ మేధకు డేటాను ఎక్కించేది ఏదో ఒక వాణిజ్య సంస్థ. ఆ సంస్థకు రాజకీయార్ధిక ప్రయోజనాలుంటాయి. అది తనకు అనుకూలమైన  రాజకీయార్ధిక డేటానే ఫీడ్ చేస్తుంది.

ముడు నెలల క్రితం ఎలోన్ మస్క్ తో సహా అనేక మంది ప్రపంచ ఐటి  దిగ్గజాలు కుత్రిమమేధ అభివృధ్ధి ప్రాజెక్టుల్ని కొన్నాళ్లు నిలిపివేయాలని బహిరంగంగా కోరారు. కుత్రిమ మేధ గాడ్ పాదర్లలో ఒకరుగా భావించే జియోఫ్రీ హింటన్ గూగుల్ నుండి బయటికి వచ్చేశారు. టెక్నాలజీ అదుపు తప్పిందని వారంటున్నారు. ఈ ‘అదుపు తప్పడం’ ‘ప్రమాదం’ ‘మానవాళికి ముప్పు’ అనే మాటల్ని ఎవరి అవసరాన్ని బట్టి  వాళ్ళు వాడుతుంటారు.  

కుత్రిమ మేధకు రాజకీయ ప్రయోజనాలుంటాయా? అనేది అమాయకపు ప్రశ్న. సాంకేతికరంగంలో సాగే ప్రతి ఆవిష్కరణ ఒక కొత్త ఆధిపత్య ఉత్పత్తి విధానాన్ని సృష్టించి రాజకీయ ఆధిపత్యానికి తావు ఇస్తుందని చరిత్ర మనకు అనేకసార్లు చాటి చెప్పింది. బ్రిటన్  18వ శతాబ్దం ఆరంభంలో ఆవిరియంత్రాన్ని కనిపెట్టడంవల్లనే భారత దేశంలో బ్రిటీష్ వలస పాలన ఆరంభం కావడానికి మార్గం ఏర్పడింది. ప్రపంచ కార్పొరేట్లు ఆశించే రాజకీయార్ధిక ప్రయోజనాలను సాధించి పెడుతుందని నమ్మకం కలిగేవరకు కుత్రిమ మేధ మీద పరిశోధనలు జరుగుతూనే వుంటాయి.

మనుషులు సమిష్టి జీవితాలను వదిలి వ్యష్టి జీవితాన్ని కోరుకుంటున్నారు.  సమిష్టి ప్రయోజనాల్ని సాధించాల్సిన చోట స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రవృత్తి కుటుంబ వ్యవస్థలోనూ చొరబడిపోయింది. ఇద్దరు తాతల విస్తార కుటుంబాలు, అన్నదమ్ముల ఉమ్మడికుటుంబాలు, మూడుతరాల ఐదుగురు సభ్యుల కుటుంబాలు, ఒక్క సంతానపు ముగ్గురు సభ్యుల కుటుంబాలు అన్నీపోయి ఇద్దరు సభ్యుల సహజీవనం వరకు వచ్చింది పరిణామం. ఇప్పుడు అదీ సాగడంలేదు. విడాకులు పెరుగుతున్నాయి, ‘సింగిల్స్’ పెరుగుతున్నారు. పెళ్ళికానివారు పెరుగుతున్నారు. 2011 జనాభా లెఖ్ఖల్లో 20-40 సంవత్సరాల మధ్య వయసు గలవారిలో 11 శాతం పెళ్ళికానివారని తేలితే ఇటీవలి లెఖ్ఖల్లో ఈ విభాగం  20-21 శాతానికి పెరిగింది.

ప్రపంచంలో ఏ మనిషీలోనూ అన్నీ మనకు నచ్చిన లక్షణాలే వుండవు. మనకు నచ్చని లక్షణాలు కూడ వుంటాయి. కొన్ని గుణాలు నచ్చి ఇష్టపడి పెళ్ళిచేసుకున్నా తరువాతి కాలంలో నచ్చని గుణాలూ బయటపడవచ్చు.  వాటిని కూడ సహించగలిగితేనే దాంపత్యం కొనసాగుతుంది. అలాంటి సహనం లేకుంటే ఒంటరి జీవితాలు తప్పవు.

ఇలాంటి సామాజిక సంక్షోభం,  ఒంటరి జీవితాలు కుత్రిమ మేధకు కొత్త మార్కెట్. అబ్బాయిలు, అమ్మాయిలకు అక్కడ కొన్ని వేల రకాల ఆప్షన్స్ వుంటాయి. డిజిటల్ పాత్రలు చాలా తెలివైనవి. ఒక్క రెండు నిముషాలు ఛాట్ చేస్తే చాలు యూజర్ తాలూకు సమస్త వివరాలు దానికి తెలిసిపోతాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సామాజిక, తాత్విక దృక్పథాలు, ఇష్టాయిషాలు, మాటతీరు అన్నింటినీ ఒక్క క్లిక్ తో అది గ్రహించేస్తుంది. వెంటనే అందుకు అనువుగా మారిపోతుంది. అంత గొప్ప మ్యాచింగ్ దొరకడం సహజ ప్రపంచంలో అసాధ్యం.

హాలీవుడ్ లో 2013లో హర్ (Her) అనే మూవి వచ్చింది. భార్య నుండి విడిగావుంటున్న థియోడర్ (జాక్విన్ ఫొయోనిక్స్) అనే మధ్య వయస్కుడు ఒంటరితనం నుండి బయట పడడానికి కంప్యూటర్ ద్వార ఓ డిజిటల్ స్త్రీ పాత్ర (స్కార్లెట్ ఝాన్సన్) తో ఛాటింగ్ మొదలెడతాడు. దాని పేరు ఏదైనాగానీ  థియోడర్ కోసం అతనికి ఇష్టమైన  సమంతా పేరుతో పరిచయం చేసుకుంటుంది. థియోడర్ ఎలా కోరుకుంటే ఆ పాత్ర అలా    మారిపోతుంటుంది. నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఓదారుస్తుంది, ధైర్యం చెపుతుంది, మేధో చర్చలు చేస్తుంది.  థియోడరో ఆమెతో గాఢంగా  ప్రేమలో పడిపోతాడు. వాళ్లిద్దరు డిజిటల్ సెక్స్ కూడ చేస్తారు. సమంతాను విడిచి వుండలేని స్థితికి చేరుకుంటాడు అతను. ఒకరోజు సందేహం వచ్చి “నువ్వు ఎంతమందిని ఇలా ప్రేమిస్తున్నావు?” అని అడుగుతాడు. “ఒకే సమయంలో కొన్ని వేలమందితో” అంటుంది సమంతా. నిజానికి దాని శక్తి అంతకన్నా ఎక్కువ. ఆ మాటతో థియోడర్ హతాశుడై వాస్తవలోకం లోనికి వస్తాడు.

 

స్త్రీపురుష సంబంధాలు మాత్రమేకాదు, సమాజంలో మనుషుల మధ్య సమస్త అనుబంధాలు విధ్వంసం అయిపోవడం వల్ల కుత్రిమ మేధకు గిరాకీ పెరుగుతోంది. చాలామందికి మరొకరిని గురువుగా భావించడం, శిక్షణ పొందడం నచ్చదు. వారికి కుత్రిమ మేధ గురువుగా మారుతుంది. అది ఏం బోధించాలో దాన్ని సృష్టించినవాళ్ళు నిర్ణయిస్తారు. అలా నియంత్రించే స్థాయిలో వున్నవారికి తమవైన సామాజిక, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలుంటాయి. కుత్రిమ మేధ  దాన్ని నెరవేరుస్తుంది.    

(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు) 


ప్రచురణ ః ప్రచురణ ః 20 జూన్ 2023 ఆంధ్రజ్యోతి దినపత్రిక  

https://www.andhrajyothy.com/2023/editorial/who-will-artificial-intelligence-listen-to-1088621.html?fbclid=IwAR0JsyxkTO-LtZplWE9z2fuQDqlxjvp43d_yRg2vnNUXyu2Z0bXSXtHSaDc


https://epaper.andhrajyothy.com/Home/ShareArticle?OrgId=206e49cc4db&imageview=1&standalone=1&fbclid=IwAR073bWQHfUJMRAhjHuh3PxTwA3MGD272GaNwOZaSaH74nXX9l8MvdnL1H0


Friday 16 June 2023

*సింగిల్ పాయింట్ ఎజెండా : లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి*

 *సింగిల్ పాయింట్ ఎజెండా : లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి* 

వర్తమాన రాజకీయాలు మన కర్తవ్యాలు అనే అంశం మీద ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్న ఎంసిపిఐ (యు) ఏపి రాష్ట్ర కమిటికి అభినందనలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడ భాగస్వామిని చేసినందుకు ఎంసిపిఐ (యు) ఏపి రాష్ట్ర కమిటి కార్యదర్శి కాటం నాగభూషణం గారికి ధన్యవాదాలు. 

వర్తమాన రాజకీయాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోవున్న బిజెపి పరిపాలన సాగిస్తున్న  తీరు, అది అనుసరిస్తున్న విద్వేష రాజకీయాల గురించి ఇక్కడ చాలామంది మాట్లాడారు. ఒక్క మాటలో సమీక్షించాలంటే, బిజేపి పాలన అధ్వాన్నంగా మాత్రమేలేదు; అది సమాజ శాంతికి  చాలా ప్రమాదకంరంగా వుంది. 

కార్ల్ మార్క్స్ బోధనల్లో ఒక మహత్తర వాక్యం వుంది. “ఆలోచనాపరులు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు; ఇప్పుడు చేయాల్సింది ప్రపంచాన్ని మార్చడం” 

బిజేపి పాలన ఎంత అధ్వాన్నంగా వుంది, అది సమాజశాంతికి ఎంత ప్రమాదకరంగా మారింది అనే అంశం మీద మనం రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు. సమస్య అది కాదు; కేంద్రంలో బిజేపిని అధికారం నుండి తప్పించడానికి మనం ఏం చేయాలీ? అన్నది ముఖ్యం.  

జాతీయ హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్-టూగా భావించే  అమిత్ షా ఇటీవల విశాఖపట్నం వచ్చి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో బిజెపికి 20 స్థానాలు ఇవ్వాలని కోరారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది అంకెల వ్యవహారమనీ, లోక్ సభలో సీట్ల పోరు అని అమిత్ షాకు స్పష్టంగా తెలుసు. నిజం చెప్పాలంటే మనకు అలాంటి అవగాహన లేదు.  మనలో కొందరు శాసనసభ ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అలాంటి సంకుచిత ఆలోచనా విధానం తప్పు. మనం ఆలోచించాల్సింది లోక్ సభ ఎన్నికల గురించి.

లోక్ సభలో ప్రస్తుతం 545 స్థానాలున్నాయి. 273 స్థానాలను మేజిక్ ఫిగర్ అంటారు. అంతకన్నా ఎక్కువ స్థానాలను దక్కించుకున్న వారికే కేంద్రంలో అధికారం వస్తుంది. ఒక్కో లోక్ సభా నియోజక వర్గంలో 15  నుండి 16  లక్షల మంది ఓటర్లు వుంటారు. వీటిల్లో 51 శాతానికి మించి ఓట్లు వచ్చిన వారే గెలుస్తారు.  పోల్ మేనేజ్మెంట్ చాలా పెద్ద ప్రాసెస్. అది ఓ ఏడాది రెండేళ్ళలో జరిగేదికాదు. ఇక డబ్బు అంటారా ఒక్కో ఎంపి అభ్యర్ధి 50 నుండి వంద కోట్ల రూపాయలు వరకు ఖర్చు పెడతారు. 

డబ్బుల విషయాన్ని పక్కన పెట్టండి. ఈనాటి సమావేశంలో 18 రాజకీయ పార్టీలు, 14 ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ పార్టీలన్నింటికీ కలిపి గత లోక్ సభ ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల రంగంలో మన సామర్ధ్యం ఎంత? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మనందరం కలిసి మహా అయితే  ఓ 3 శాతం ఓటర్లను మాత్రమే ప్రభావితం చేయగలము. గెలడానికి అవసరమైన మరో  48 శాతం ఓట్లను ఎక్కడి నుండి తెద్దామూ? 

ఈ సమావేశ నిర్వాహకులు ముందుగానే ఒక ప్రతిపాదన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదేమంటే “పాలకవర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజా రాజకీయ ఐక్య సంఘటన ఏర్పాటు చేయడం”. ఇక్కడ విభజన పాలకవర్గ పార్టీనా? కాదా? అన్నది కాదు; ఇక్కడ విభజన ప్రమాదకర బిజేపీ పక్షమా?  కాదా? అనేదే.  ఈ తీర్మానాన్ని, ‘బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రజా రాజకీయ ఐక్యసంఘటన ఏర్పాటు చేయడం’ అని సవరించాలని నేను కోరుతున్నాను. 

వంద కోట్ల ఓటర్లున్న దేశం మనది. బిజెపిని గద్దె దించాలంటే 50 కోట్ల ఓటర్ల మద్దతు కావాలి.  దానికి జాతీయ స్థాయిలో ఒక రాజకీయ మహాసంఘటన నిర్మించాలి. బిజెపిని తప్ప ఇంకే పార్టి వచ్చినా ఇందులో చేర్చుకోనేంత సువిశాల వేదిక కావాలి. 

కమ్యూనిస్టు పార్టీల మీద ఒక జోక్ వున్నది. వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వామపక్షాల ఐక్యత అంటుంటారు. ఎన్నికల్లో మాత్రం ఎవరిదారి వాళ్లు చూసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చే ప్రాధాన్యతను లోక్ సభ ఎన్నికలకు ఇవ్వరు. ముందు ఈ తీరు మారాలి. 

బిజెపిని గద్దె దించాలని మనం స్థిరంగా అనుకుంటున్నామా? లేక సరదాగా అనుకుంటున్నామా? బిజెపిని గద్దె దించాలని మనం గట్టిగా అనుకుంటుంటే జాతీయ ఐక్య సంఘటనలో తప్పనిసరిగా కాంగ్రెస్ వుండాలి. కాంగ్రెస్ లేకుండ ఎంత పెద్ద ఐక్య సంఘటన అయినా బిజెపిని గద్దె దించలేదు. 

కాంగ్రెస్ ప్రస్తావన రాగానే మనలో కొందరికి 1970ల నాటి  ఎమర్జెన్సీ మాత్రమే గుర్తుకు వస్తుందిగానీ, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ద్వారానే ఆనాటి ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించామన్న విషయం గుర్తుకు రాదు. సమిష్టి ప్రయోజనాలను నెరవేర్చాల్సిన సమయంలో పార్టి ప్రయోజనాలను, వ్యష్టి ప్రయోజనాలను ముందుకు పెట్టడం తప్పు. లోక్ సభ మైదానంలో బిజెపి తరువాత  అతి పెద్ద పార్టి కాంగ్రెస్.  దానిని పక్కన పెట్టడం అంటే మనం ఎన్నికలకు ముందే బిజెపిని గెలిపిస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. 

రెండు తెలుగు రాష్రాకాల్లో అసెంబ్లీ ఎన్నికలను మీరు మరచిపొండి. జగన్, టిడిపి, జనసేన, టిఆర్ ఎస్ / బిఆర్ ఎస్ లను మరచిపొండి. మనది సింగిల్ పాయింట్ ఎజెండా కావాలి. లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి. అంతే. బాఖీ సబ్ బక్వాస్! 

( 2023 జూన్ 14న ఎంసిపిఐ (యు) విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రసంగం ఆధారంగా)

Tuesday 13 June 2023

Muslim Social Project Concept & DPR

 

*ముస్లిం సోషల్ మీడియా ప్రాజెక్టు*


            ముస్లిం వ్యతిరేకత అనేది దాదాపుగా  నేటి సమస్త ప్రచార సాధనాల స్వభావంగా మారిపోయింది. భారత ప్రభుత్వం, దానితో ఆర్ధిక  ప్రయోజనాలున్న కార్పొరేట్లు, అధికార పార్టి అనుబంధ సంస్థలు, ప్రభుత్వ అండదండలున్న కొన్ని అరాచక బృందాలు ఇస్లామో ఫోబియాను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యవస్థీకృతంగా సంస్థాగతంగానూ, వ్యక్తిగత స్థాయిలోనూ సాగుతున్నది. 


            హిందువుల మనస్సులలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల  మీద ద్వేషాన్ని నింపడం ఈ ప్రచారానికి తక్ష్గణ లక్ష్యం. ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్టు సమూహాల నుండి తమకు ముప్పు ఉందని భావించే స్థితికి హిందూసమాజాన్ని భయపెట్టడం దీని రెండవ లక్షణం. 2014 నుండి కేంద్రంలోవున్న ప్రభుత్వం హిందువుల రక్షకురాలు అని నమ్మించడం దీని మూడవ లక్ష్యం.   మధ్యయుగాల్లో సాంస్కృతికంగా, ధార్మికంగా హిందువుల మీద ముస్లిం పరిపాలకులు సాగించారనే ప్రచారంలోవున్న  దౌర్జన్యాలకు  ప్రతీకారం తీర్చుకుని హిందూరాజ్యాన్ని పునరుధ్ధరించే చారిత్రక కర్తవ్యాలను నరేంద్ర మోదీ-అమిత్ షాల ప్రభుత్వం నిర్వర్తిస్తున్నదని నమ్మించడం దీని నాలుగవ లక్ష్యం. ప్రజల్లో ఇలాంటి నమ్మకాలు ప్రబలితే  ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను సులువుగా కప్పిపుచ్చవచ్చు. మరోవైపు, దేశసంపదను ప్రభుత్వం తనకు ఇష్టమయిన  కార్పొరేట్లకు కట్టబెట్టినా ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా వాళ్లను నిర్లిప్తంగా వుంచడానికి రక్షణ కవచంగా ఈ ప్రచారం పనికి వస్తుంది.  


            దేశంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముందు ముస్లింలనే దోషులుగా ప్రచారం చేస్తున్నారు. ఒక ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే దాన్నిమనుషుల మధ్య సహజంగా ఏర్పడే ప్రేమగా పరిగణించే రోజులు పోయాయి. మొత్తం ముస్లిం సమాజం ఏకమై ‘లవ్ జిహాద్’ కుట్రలతో హిందూ స్త్రీలను వలలో వేసుకుని వాళ్ళతో పిల్లల్ని కని ముస్లిం జనాభాను పెంచేసి దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేయబోతున్నారు అనే స్తాయిలో భయోత్పాతాన్ని సృస్ఠిస్తున్నారు.   


            ముస్లింలు అంటే పరాయివాళ్ళు, ఆక్రమణదారులు, చొరబాటుదార్లు,  ఉద్రవాదులు, దేశద్రోహులు, పిల్లల్నికనడమే పనిగా పెట్టుకున్నవారు వగయిరా నేరేటివ్స్ ఇప్పుడు చాలా బలంగా ప్రచారంలో వున్నాయి. దీని ప్రభావం సమాజం మీద చాలా బలంగా వున్నది.  


            కొన్నేళ్ల క్రితం బొంబే డైయింగ్  అధినేత నస్లీవాడియా మీద హత్యాయత్నం జరిగింది. నస్లీవాడియా  స్వయాన మొహమ్మదాలీ జిన్నాకు మనవడు.  ఈ కుట్ర వెనుక హిందూ సామాజికవర్గానికి చెందినవారున్నారని వెలుగులోనికి వచ్చింది. దాన్ని ముస్లిం సమాజం వాణిజ్య వివాదంగానే చూసిందేతప్ప హిందూ సమాజం కూడబలుక్కుని చేసిన ధార్మిక దాడి అనుకోలేదు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో అలాంటి ఒక వాణిజ్య వివాదంలో ఓ హిందూ వ్యాపారీ చనిపోయాడు. దానితో ముస్లింలు ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. మెజారిటి సమూహానికీ మైనారిటీ సమూహానికి తేడా అది. 


            సిఎఎ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ఢిల్లీ  షాహీన్ బాగ్ లో శాంతియుతంగా నిరసన  సాగిస్తుంటే ప్రభుత్వం సహించలేకపోయింది. జిహాద్ మొదలు అనేక నిందల్ని ఆమె మీద వేశారు. ఆమెకు మద్దతుగా నిలిచిన విశ్వవిద్యాలయ విద్యార్ధుల మీద  తీవ్ర నేరాలు మోపి కేసులు పెట్టారు.  


            ఇప్పుడు అన్యులు అనేమాట ముస్లింలకే పరిమితమైలేదు. కేంద్రప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకంగాని, పాలకుల వైఫల్యాల మీదగానీ  ఎవరు మాట్లాడినా వారంతా హిందూరాజ్య స్థాపనకు వ్యతిరేకుల కింద లెఖ్ఖ, రెండేళ్ల క్రితం రైతులు ఉద్యమిస్తే వాళ్లను ఖలిస్తానీలు అన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా పహిల్వాన్లు ఉద్యమిస్తుంటే వారి మీద వేయని నిందలు లేవు. నిరుద్యోగం పెరుగుతున్నదంటే వెనుక అర్బన్ నక్సలైట్లు వున్నారంటారు. ప్రభుత్వం మీద పల్లెత్తు మాట అన్నా ఒక నింద, ఒక కేసు ఖాయంలావుంది.  


            ఈ ప్రచారంలో అనేక విచిత్రాలు విడ్డూరాలు జరుగుతున్నాయి.  మన దేశంలో కొన్ని సమూహాలు ఆవుమాసం తినవు; కొన్ని సమూహాలు తింటాయి. ఇదొక చారిత్రక దశ. వ్యవసాయరంగంలో యంత్రాల ప్రవేశంతో  గిరాకీ పడిపోవడంతో ఆవుల రక్షణ కోసం కొన్ని జీవకారుణ్య సంఘాలు ఏర్పడడం మరో దశ.  గోరక్షణ మూకలు ఏర్పడి ఆవుమాసం తినేవారి మీద దాడులు చేయడం ఇంకో దశ.   గోరక్షణ మూకలు  ఆవుమాసం తినని వాళ్ల మీద కూడ దాడి చేయడం మరోదశ. ఇప్పుడు గోరక్షణ మూకలే ఆవుల్ని వధించి ఆ నేరాన్ని ముస్లింల మీద నెట్టడం కొత్త దశ.   


            ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ లో ముస్లింలు 2020 మార్చి నెలలో   సమావేశమై కోవిడ్ ను వ్యాప్తి చేయడానికి కుట్రపన్నారు అనే తీవ్ర ఆరోపణలతో భారీ ప్రచారం సాగింది. ఫేక్ వీడియోలతో సంఘ్ పరివార మీడియా చెలరేగిపోయింది. ముస్లింలను ‘సూపర్ స్ప్రెడర్స్’  అని నిందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు  మర్కజ్  లో సమావేశమయిన వారందరినీ అరెస్టు చేశారు. కేసు నెలల తరబడి నడిచింది. “మర్కజ్ లో అరెస్టయిన వారికి చేయించిన వైద్యపరీక్షల్లో ఎంతమందికి కోవిడ్ సోకినట్టు తేలిందీ?” అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అడిగారు.   “ఒక్కరూ లేరు? “  అని పోలీసులు సమాధానం ఇచ్చారు. కోవిడ్ సోకనివాళ్ళు ఇతరులకు ఎలా వ్యాప్తి చేస్తారూ? వాళ్లను సూపర్ స్ప్రెడర్లు అని ఎలా అంటారూ?” అంటూ న్యాయమూర్తి పోలీసులను మందలించి. నిందితుల్ని నిర్దోషులుగా తేల్చారు.  ఈ తీర్పుకు పెద్దగా ప్రచారం రాలేదు.  


            ఇటీవల జూన్ 2న ఒడిశా రాష్ట్రం బాలాసూర్ దగ్గర రైలు ప్రమాదం జరగినపుడు ప్రభుత్వం మూడు పనులు చేయాలి. ముందు; తక్షణ సహాయక, వైద్య చర్యలు మొదలెట్టాలి. మృతులు, క్షతగాత్రులకు నష్టపరిగారం ప్రకటించాలి. ఆ శాఖమంత్రిని నైతిక బాధ్యుడ్ని చేస్తూ పదవి నుండి తప్పించాలి. స్థానిక అధికారుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. సాంకేతిక నిపుణుల బృందాల్ని పంపించి ప్రమాదానికి కారణాలను గుర్తించి శాశ్విత నివారణ చర్యలు చేపట్టాలి.  


            `కేంద్ర ప్రభుత్వం ఈ పనుల్ని చేపట్టడానికి ముందే మోడీ మీడియా మేల్కొంది. ముస్లిం కుట్ర కోణాన్ని ప్రచారంలో పెట్టేసింది. ప్రమాద స్థలికి సమీపంలోనే మసీదు వుందనీ, ఆ రోజు శుక్రవారం కనుక చాలామంది ముస్లింలు గుమిగూడి వున్నారనీ, ఆ పరిసరాల్లో మయన్మార్ నుండి శరణార్ధులుగా (చొరబాటుదార్లుగా) వచ్చిన రోహింగ్యాలు వుంటున్నారనీ. ఆ స్టేషన్ మాస్టారు ముస్లిం అనీ అతనిప్పుడు పరారీలో వున్నాడనీ ఇలా సాగింది ప్రచారం. కొందరు దీనికి ‘ట్రైన్ జిహాద్’ అనే పేరు పెట్టారు.  వీటితోపాటూ కోన్ని ఫేక్ వీడియోలు, ఫొటోలు రంగప్రవేశం చేశాయి. వీటిల్లో ఏ ఒక్కటీ నిజం కాదు అని తరువాత తేలినా ముస్లిం సమాజాన్ని చాలా విజయవంతంగా బోనెక్కించేశారు.   


            ఇటీవలి కాలంలో రైళ్ల సంఖ్య భారీగా  పెరిగింది. ట్రాక్ లనే కాక, సిగ్నలింగ్ వ్యవస్థను, సిబ్బందిని అతిగా వాడాల్సి వస్తున్నది. రైళ్ళు పెరిగినట్టుగా టెక్నాలజీ సిబ్బంది పెరగలేదు. సురక్షిత చర్యల కోసం కేటాయించిన నిధుల్ని కూడ ఖర్చుచేయడం లేదు.  


            నిజానికి ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కమీషనర్ ఆఫ్ రైల్వే సేప్టి (CRS)ని రంగంలో దించాలి. అది ప్రమాద కారణాలను గుర్తించడమేగాక, ప్రమాద నివారణ చర్యల్ని కూడ సూచిస్తుంది. అలా కాకుండ కేంద్ర  ప్రభుత్వం సిబిఐని రంగంలో దించింది. అంతకు ముందు ఇంకో ప్రమాదం జరిగినపుడు ఎన్ ఐ ఏ ను పంపించారు. ఇవి రెండూ సాంకేతిక సంస్థలు కాదు; నేర పరిశోధనా సంస్థలు. వీటిని రంగంలో దించడం ద్వారా కుట్ర సిధ్ధాంతానికి  పుకార్లకు వీలు కల్పించే  తీరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.    


             అంతే కాదు ముస్లింల మీద కొంచెం సహానుభూతితో వ్యవహరించే రాజకీయ పార్టీల మీదా ఇలాంటి దుష్ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూయార్క్ పర్యటనలో వుండగా ఈ దుర్ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఒక బిజెపి నేత చర్చను దారి మళ్ళించారు. 


            ఇలాంటి సందర్భాలలోనే ముస్లింల గుడ్ విల్ ను పెంచి, ఫాసిస్టు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యేక మీడియా కావాల్సిన అవసరం ముందుకు వస్తోంది. మీడియా అనగానే మనలో చాలా మందికి పెద్దపెద్ద కలలు వచ్చేస్తాయి. శాటిలైట్ న్యూస్ ఛానళ్ళు, కనీసం కేబుల్ టీవీలు వుండాలి అనుకుంటారు. పాపులర్ శాటిలైట్ ఛానల్ అంటే వందకోట్ల వ్యవహారం. అంత పెద్ద పెట్టుబడిని సమీకరించడమూ కష్టం; నిర్వహణ వ్యయాన్ని తట్టుకోవడమూ కష్టం. శాటిలైట్ న్యూస్ ఛానళ్ళు, కేబుల్ టీవీల్లో ఫిక్సిడ్ పాయింట్ ఛార్ట్ (FPC) ను సరిగ్గా అమలు చేయాలంటే రోజుకు కనీసం 16 గంటల కంటెట్ ను ఉత్పత్తి చేయాలి. ఆ కంటెంట్ డైన మిక్ గా వుండాలంటే సిబ్బంది, ఎక్యూప్ మెంట్ చాలాపెద్ద స్థాయిలో కావాలి. ఆ ఖర్చుల్ని తిరిగి రాబట్టుకోవడానికి అనేక తప్పుడు, అనైతిక విధానాలను చేపట్టాలి. శాటిలైట్ ఛానల్ తో పోలిస్తే కేబుల్ టీవీలో పెట్టుబడి తక్కువేగానీ అదీ పెద్దగా సామాజిక ఫలితాలను ఇవ్వదు. పైగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ల  డౌన్ లోడ్ వేగం పెరిగాక  కేబుల్ టీవిలు కనుమరుగైపోతున్నాయి. 


            సాంకేతిక అభివృధ్ధి అపారంగా పెరుగుతున్న రోజుల్లో. మనకు అనువైనది ఒక మంచి యూ-ట్యూబ్ ఛానల్.  ఆ కంటెంట్ ను ట్విట్టర్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, వాట్స్ యాప్ వగయిరా  సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలోనూ వాడవచ్చు.


             హేట్-ముస్లిం, ఇస్లామో ఫోబియాలు కేవలం ముస్లింల సమస్య కాదు. ఇప్పుడది కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చనివారందరి సమస్య. దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి. దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మీడియా కావాలి. పిల్లి మెడలో గంట కట్టాల్సిన బాధ్యత ముస్లింలదే; భారతీయ ఫాసిజానికి ప్రధాన బాధితులు వారే గాబట్టి.


            ఇది అచ్చంగా ముస్లింల ఛానల్ కాదు.  ముస్లింలతోపాటూ, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు, పౌరహక్కులవాళ్ళు తదితరులందరూ పెట్టుబడిలో కాకపోయినా వ్యూవర్స్ సంఖ్యను పెంచడంలో తప్పక సహకరిస్తారు. సామాజిక ప్రయోజనం కోసం నడిపిస్తున్న ఛానల్ కనుక దీని  నుండి సాధారణంగా రెవెన్యూను ఆశించరాదు. ఎప్పుడైనా కమ్మర్షియల్ ప్రమోషనల్ యాడ్ వస్తే వస్తే దాన్ని బోనస్ గా భావించాలి. 


అహ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్,  ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)  

12 జూన్ 2023









Monday 12 June 2023

We can not protect Democratic Constitution without Political power

 *రాజ్యాధికారం లేకుండా ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోలేం!*

 

            మన సమాజంలో రెండు రకాల విద్వేషాలు దాదాపు ప్రతిచోటా బాహాటంగా కనిపిస్తున్నాయి. మొదటిది; ముస్లింల స్వయంఉపాధి మీద.  రెండోది; ఎస్టి, ఎస్సి, బిసిలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల మీద.

 

            సాంఘీక అణగారిన సమూహాల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక బిరడా బిగించింది. అంటే ఓసిలకు 50 శాతం రిజర్వేషన్లను పరిరక్షించింది. దేశ జనాభాలో అణగారిన సమూహాలు 70 శాతం వుంటే, యజమాని సామాజికవర్గాలు 30 శాతం వుంటాయి. 70 శాతానికి 50 శాతం, 30 శాతానికి 50 శాతం ఏ విధంగానూ సమతూకం కాదు. 

 

             సాంఘీక అణగారిన సమూహాలకు చట్టంలోవున్న ఆ యాభై శాతం రిజర్వేషన్లలో  సగం వరకు ఏదో ఒక వంకతో ప్రభుత్వాలు అమలు చేయవు. మరోవైపు, మార్కులు లేకపోయినా ర్యాంకులు రాకపోయినా  సాంఘీక అణగారిన సమూహాలకు ఉద్యోగాలు ఇచ్చేసి  నాణ్యతను చంపేస్తున్నారనే అక్కసు సమాజంలో ప్రబలుతూ వుంటుంది. నాణ్యతను పరిశీలించడానికి ఇంకో భారమితి వుంది. దేశంలో జరిగిన  భారి స్కాముల్లో కీలక పాత్ర వహించిన అధికారుల్లో యజమాని సామాజిక వర్గాలకు చెందిన వారు ఎంతమంది? శ్రామిక సామాజికవర్గాలకు చెందినవారు ఎంతమంది? అని గణాంకాలు తీస్తే ఆ నాణ్యత గుట్టు కూడా బయట పడిపోతుంది.

 

            ముస్లింలు ఆధునిక వృత్తి నిపుణులు. యంత్ర యుగంలో  మూడవ తరంగా వచ్చిన కంప్యూటర్లను సహితం హైస్కూలు చదువుకూడా లేని ఓ ముస్లిం సులువుగా రిపేర్  చేయగలడు.  ప్రభుత్వం వాళ్ళకు ఎలాంటి సహాయమూ చేయకపోవచ్చు. అయినా, వాళ్ళ స్వతంత్ర జీవన విధానం, బిందాస్ తీరు చాలా మందికి నచ్చదు.

 

            ఇటీవల సివిల్ సర్విస్ పరీక్షల్లో సాంఘీక అణగారిన సమూహాల అభ్యర్ధులు ఇండియా టాపర్లుగా వస్తున్నారు. ఇది యజమాని సామాజిక వర్గాలకు ఊహించని పరిణామం. నాణ్యత గురించి మాట్లాడే అవకాశం ఇప్పుడు వారికి లేదు.  ఇప్పుడు వాళ్ళూ రిజర్వేషన్లు కోరుతున్నారు. మొత్తం ఉద్యోగాలను సామాజికవర్గాల జనాభా దామాషా ప్రకారం కేటాయించడమే అంతిమ పరిష్కారం అవుతుంది. కానీ అలా జరగడంలేదు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్ధిక బలహీన వర్గాలకు (ఇడబ్ల్యూ ఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.   చట్టంలో ‘ఆర్ధిక బలహీన వర్గాలకు’ అని పేర్కొన్నా ప్రభుత్వ వుద్దేశ్యం మాత్రం  యజమాని కులాలకు అనే. అయితే ఇక్కడో చిక్కు వస్తుంది. యజమాని కులాలు ముస్లింలతో సహా అన్ని మత సమూహాల్లోనూ వుంటాయి. ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మత సమూహాలకూ ఈ సౌకర్యాన్ని అమలు చేస్తారా?

 

            అల్పాదాయవర్గాలకు  దాదాపు అన్ని ప్రభుత్వాలూ అనేక సంక్షేమ  పథకాలను రూపొందించి అమలు చేస్తుంటాయి. ఇందిరాగాంధీ గరీబీ హటావో, ఎన్టీఆర్ కిలో బియ్యం రెండు రూపాయలు, చంద్రబాబు రైతు రుణమాఫీ’ జగన్ నవరత్నాలు నరేంద్ర మోదీ ‘స్వఛ్ఛ భారత్’  వగయిరాలు  ఈ కోవలోనికి వస్తాయి. ఆదాయం ప్రాతిపదికగా వీటి లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు.

 

            రాజ్యాంగంలో ఎస్టి, ఎస్సీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లకు ఆదాయం ప్రాతిపదిక కానేకాదు. సాంఘీక వివక్ష, ఆధునిక  విద్య లేమి అనే రెండు అంశాలు మాత్రమే ప్రాతిపదికలు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నపుడు చాలా పెద్ద చర్చ, రచ్చ జరిగింది. అప్పటి బిజెపి రాష్ట్ర నాయకుడు జి. కిషన్ రెడ్డి  ముస్లింలలో కులాలు వుండవు కనుక వారికి రిజర్వేషన్లు ఇవ్వరాదు అని పెద్ద అభ్యంతరం లేవదీశారు.

 

            “హిందూ సమాజంలో కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు మద్దతు పలుకుతున్నారా?” అని ఓ మీడియా సమావేశంలో ఓ పాత్రికేయుడు ఆయన్ను అడిగాడు. చివరకు ముస్లిం సమాజంలో కుల వర్గీకరణ జరిపి 14 రకాల  బిసి కులాలను నిర్ధారించి వారికి  4 శాతం రిజర్వేషన్లు కల్పించారు.  ఓసి ముస్లింలు అనబడే సయ్యద్, పఠాన్, బేగ్, మొఘల్ తదితరులకు ఇందులో స్థానం కల్పించలేదు.

 

            మొత్తం భారత ముస్లిం సమాజమే సాంఘీక వివక్షకు గురవుతున్న కారణంగా వర్గీకరణ లేకుండ బిసి, ఓసి ముస్లింలకు కూడ రిజర్వేషన్ కల్పించాలని అప్పట్లో ఒక ఉద్యమం కూడ సాగింది గానీ వాళ్ళ ఆవేదనను పాలకులు పట్టించుకోలేదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వరాదంటూ  ఇంకొందరు  న్యాయస్థానాల్లో కేసులు వేశారు. నిజానికి మన రాజ్యాంగంలో కల్పించిన  రిజర్వేషన్లన్నీ మతప్రాతిపదిక మీదనే ఇచ్చారు. 

 

            సాంఘీక అణగారిన సమూహాల రిజర్వేషన్లను కొన్ని చోట్ల కులం పేరుతో, మరికొన్ని చోట్ల మతం పేరుతో వాళ్ళు అడ్డుకుంటూనే వున్నారు. వాళ్ళు అంటే ఎవరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు; మెజారిటీ సమూహపు యజమాని కులాలు. రిజర్వేషన్లకు  క్రీమీలేయర్ ట్యాగ్ ను తగిలించడం అంటే కొత్తగా ఆర్ధిక నిబంధను ప్రవేశపెట్టడం. ఇది రాజ్యాంగ ఆదర్శానికి విరుధ్ధం. అలా అనేక విధాలుగా వరుస ప్రభుత్వాలు సందర్భం దొరికినప్పుడెల్లా సాంఘీక అణగారిన సమూహాల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూనే వున్నాయి.

 

            మనుషులు, సంస్థలు, రాజకీయ పార్టీలు సాధారణంగా తమకే ఆచరణసాధ్యంకాని  ఆదర్శాలను వల్లిస్తుంటారు. మన రాజ్యాంగ సభలోని మెజారిటి సభ్యుల సాంఘీక స్వభావం, ప్రాపంచిన దృక్పథం వేరు; వాళ్ళు ఆమోదించిన ప్రజాస్వామిక ఆదర్శ రాజ్యాంగం వేరు. రెండూ పరస్పర విరుధ్ధ అంశాలు. రాజ్యాంగ సభ సభ్యుల్లో అత్యధికులు సంస్థానాలకు ప్రతినిధులు, యజమాని కులాలకు చెందినవారు. వాళ్ళేమీ అణగారిన సమూహాలకు చెందినవారు కాదు; అణగారిన సమూహాలను ఉధ్ధరించాలనే ఆదర్శాలు ఏ మాత్రం వున్నవారూ కాదు. ఒక అందమైన రాజ్యాంగం వుంటే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. దాన్ని ఆచరించే అధికారం తమ చేతుల్లోనే వుంటుంది కనుక ఇష్టమైతే దాన్ని ఆచరించవచ్చు, ఇష్టంలేకపోతే దాన్ని పక్కన పడేయవచ్చు అనే ధీమాలో వున్నారు.

 

            రాజ్యాంగ రచన కమిటికి అధ్యక్షునిగా వ్యవహరించిన అంబేడ్కర్ కు ఈ వైరుధ్యం ఈ పరిమితి సభ్యుల స్వభావం తెలియనిదికాదు. రాజ్యాంగసభలో 1949 నవంబరు 25న చేసిన చివరి ఉపన్యాసంలో ఈ అంశం మీద చాలా స్పష్టంగానే హెచ్చరికలు చేశాడు.

 

            "రాజ్యాంగం ఎంత గొప్పదయినాసరే దానిని అమలు చేసేవారు చెడ్డవారయితే అది చెడ్డదిగా మారిపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనాసరే దానిని అమలు చేసేవారు మంచివారయితే అది గొప్పదిగా మారిపోతుంది. రాజ్యాంగం పనితీరు రాజ్యాంగ స్వభావంపై ఆధారపడి ఉండదు; దాన్ని అమలుచేసే శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల్ని నడిపే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి వుంటుంది” అన్నాడు.

 

            రాజ్యాంగానికి నాలుగవ సవరణ సందర్భంగా 1955 మార్చి 19 న చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు. “దేవుడి కోసం మేము ఒక ఆలయాన్ని నిర్మించాము. దేవుడ్ని ప్రతిష్టించడానికి ముందే ఆ ఆలయాన్ని దెయ్యాలు ఆక్రమించుకున్నాయి.  అప్పుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడంతప్ప మనం ఏమి చేయగలం? అందుకే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడమే మంచిదని నేను భావించాను” అన్నాడు. దీన్ని తిరగేసి చూస్తే, దెయ్యాలే అంబేడ్కర్ చేత  దేవాలయాన్ని కట్టించుకున్నాయని సులువుగానే అర్ధం అవుతుంది.

 

            ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని రాజ్యాంగంగా మారుస్తామంటూ సంఘపరివారం ముఖ్యులు తరచూ ప్రకటనలు చేస్తుంటారు. నిజానికి మనుస్మృతి ద్వార సాధించదలచిన సామాజిక, ఆర్ధిక లక్ష్యాలను ప్రస్తుత రాజ్యాంగం ద్వార కూడ సాధించుకునే నైపుణ్యం సంఘపరివారానికి వుంది. అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగంకన్నా రాజ్యాధికారం ముఖ్యం. రాజ్యాధికారం గురించి మాట్లాడకుండ రాజ్యాంగం గురించి మాట్లాడడంవల్ల అణగారిన సమూహాల లక్ష్యాలు నెరవేరవు.

 

ఏయం ఖాన్ యజ్దానీ (ఉషా ఎస్ డానీ)

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు MTF కన్వీనర్)

9010757776


Published : 22 June 2023

https://www.facebook.com/photo/?fbid=2503525999795665&set=a.1593755074106100