Monday 25 December 2017

Is Marriage Protection Only For Muslim Women?


‘వివాహహక్కుల రక్షణ’ ముస్లిం మహిళలకేనా?
-     అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

        ముస్లిం సమాజంలో వైవాహిక బంధం లోనికి ప్రవేశించడానికి ఒక్కటే పధ్ధతుంది; ట్రిపుల్ ఖుబూల్. అలాగే, వైవాహికబంధాన్ని తెంచుకోవడానికి కూడా ఒక్కటే పధ్ధతుంది; ట్రిపుల్ తలాఖ్.
        ముస్లిం వివాహ సాంప్రదాయాన్ని, హిందూ వివాహ సాంప్రదాయంతో పోల్చడమే తప్పు.  హిందూ వివాహం శాశ్విత బంధం. ముస్లిం వివాహం ఒక ఒప్పందం. దీని విధివిధానాలు ఆధునిక ‘అగ్రిమెంట్ మేరేజ్’ కు దగ్గరగా వుంటాయి. ఒప్పందం అంటేనే పరస్పర అంగీకారం మీద జీవిత కాలం కొనసాగనూవచ్చు; జీవిత భాగస్వాముల్లో ఏ ఒక్కరికి అభ్యంతరంవున్నా ఏ దశలో అయినా విడిపోనూవచ్చు.
        శాశ్వితమనుకునే హిందూ వైవాహిక సాంప్రదాయం నుండి బయటపడడానికి  మహిళలు విడాకుల చట్టాన్ని కోరుకోవడాన్నీ మనం చూశాం. అశాశ్వితమనుకునే ముస్లిం వైవాహిక సాంప్రదాయంలోనే శాశ్వితంగా వుండిపోవాలని కోరుకుంటున్న మహిళల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
        ట్రిపుల్ తలాఖ్ వేరు, ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ వేరు. ట్రిపుల్ తలాఖ్ అనేది ముస్లిం సమాజంలో అనాదిగా వుంది; ఇక ముందు కూడా వుంటుంది. ఇప్పుడు వివాదం సాగుతున్నది ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ గురించి మాత్రమే.  దీనిని తలాఖ్- ఏ- బిద్దత్ (చిటికెల్లో విడాకులు) అంటారు.  ఇది ఇస్లామిక్ సాంప్రదాయంకాదు. ఖురాన్ లోగానీ, హదీస్ లోగానీ దానికి సమర్ధన లేదు. అంచేత ముస్లిం పౌరస్మృతి  (షరియా)లోనూ దానికి సమర్ధన లేదు.  
        ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ అనేది ఇటీవల అతికొద్ది మంది ముస్లిం భర్తలు అనుసరించిన ఒక అరాచక విడాకుల విధానం. ఎస్సెమ్మెస్, ఇ-మెయిల్, వాట్స్ అప్, మెసెంజర్ తదితర అత్యాధునిక సమాచార మాధ్యమాల ద్వార వాళ్ళు విడాకుల్ని ప్రకటిస్తున్నారు. ఒక విధంగా ఇది ఐటీ విప్లవం సృష్టించిన ఒక వికారం. దీన్ని ముస్లిం సమాజం సహితం తీవ్రంగా ఖండిస్తూనే వుంది.
        ఇస్లాం మూలసూత్రాలకు చిటికెల్లో విడాకుల  ఆచారం అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తారంగా పరిశీలించింది. చివరకు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ అనేది ఇస్లాం ఆదర్శాలకు విరుధ్ధమని చట్టపరంగా చెల్లదని ఈ ఏడాది ఆగస్టు 22న  తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు  తీర్పు మీద సాధారణ ముస్లిం సమాజం మాత్రమేకాక ఇస్లాం మత పెద్దలు సహితం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. సుప్రీం కోర్టు ఇస్లాం ధర్మాలను కొనియాడడంవల్ల ముస్లిం సమాజానికి నైతిక మద్దతు కూడా లభించింది. అయితే, కేసు విచారణ సందర్భంగా సాంప్రదాయ మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ముస్లిం వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ముస్లిం వివాహ వ్యవస్థను ఒక నరకంగానూ, ముస్లిం పురుషుల్ని నరరూప రాక్షసులుగానూ వాటిల్లో చిత్రించారు.
        సుప్రీం కోర్టు తీర్పు తరువాత కూడా ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ సంఘటనలు మరికొన్ని తమ దృష్టికి రావడంతో వాటిపై తాము స్పందించి దాని నిషేధానికి ఒక చట్టాన్ని తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్ర హోం, న్యాయశాఖలు  సంయుక్తంగా రూపొందించిన ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017కు డిసెంబరు 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రంగం సిధ్ధమైంది. వుభయ సభల్లోనూ అధికార పార్టీకి అవసరమైన సంఖ్యాబలం వున్నకారణంగా ఈ బిల్లు చట్టంగా మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.  
        ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను నేరంగా పరిగణించాలనేది ఈ చట్టంలో ప్రధానాంశం. అలాంటి నేరానికి పాల్పడిన భర్తలకు మూడేళ్ల వరకు  జైలు శిక్ష విధించాలనీ, యుక్త వయసు రాని పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కావాలంటే తల్లి తీసుకోవచ్చనీ, వాళ్ళ జీవనభృతిని భర్త భరించాలనే అంశాలు ఈ బిల్లులో వున్నాయి.
        ఒక మతసమూహపు ఆచారవ్యవహారాలపై ఒక చట్టాన్ని తేదలిచినపుడు సంబంధిత సమాజపు అభిప్రాయాలను కూడా పరిగణన లోనికి తీసుకుని వుండాల్సింది. కానీ, అలా జరగలేదు. మరోమాటల్లో ఇది మైనారిటీల సాంస్కృతిక వ్యవహారాల్లో  ఏకపక్షంగా జోక్యం చేయడమే అవుతుంది.
        ప్రభుత్వానికి మహిళల గౌరవ మర్యాదలు స్వేచ్చా స్వాతంత్ర్యాల మీద అంతగా ప్రేమ వుంటే దేశంలోని అన్ని మత సమూహాల్లోని మహిళలకు వర్తించేలా ఒక సమగ్ర చట్టాన్ని తెస్తే బాగుండేది. ప్రత్యేకంగా ముస్లిం మహిళ వైవాహిక హక్కుల పరిరక్షణ కోసమే కొత్త చట్టం తేవడం దేనికీ? ఈ అంశాన్ని తాము మతవిశ్వాసాల ప్రాతిపదికగా చూడడం లేదనీ, లింగన్యాయం, లింగ సమానత్వం, మహిళల గౌరవం తదితర మానవీయ కోణంలో చూస్తున్నామని కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర ప్రసాద్ అంటున్నారు.
        కేంద్ర ప్రభుత్వానికి ఇంతటి ముస్లిం మహిళాభిమానం వుండడం మహత్తర విషయమే. పదిమంది కాదు ఒక్కరు బాధితులైనా ప్రభుత్వం స్పందించాల్సిందే. కానీ, దేశవ్యాప్తంగా ముస్లిం మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు అన్నింటి మీదా ప్రభుత్వం అలాగే స్పందిస్తున్నాదా?. మాలియాన, ముజఫర్ నగర్ హత్యలు, అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళలు ఇంతకన్నా పెద్ద సంఖ్యలో, ఇంతకన్నా హృదయ విదారకంగా రోదించారు. ప్రభుత్వంలో అప్పుడెప్పుడూ ఇలాంటి ముస్లిం మహిళా సానుభూతి కనిపించలేదు.
                భార్య ఇష్టం లేకుండా సాగించే సంభోగాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తల్ని  శిక్షించేలా ఒక చట్టం చేయాలని సుప్రీం కోర్టు ఆ మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వైవాహిక అత్యాచారం మీద ఢిల్లీ హై కోర్టులో ఇంకో  ప్రజా ప్రయోజన వాజ్యం నడుస్తున్నది. పధ్ధెనిమి సంవత్సరాలు దాటని భార్యతో సంభోగం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తను శిక్షించాలనేది దీని సారాంశం. ఢిల్లీ హై కోర్టులోని ‘పిల్’ను కూడా తన పరిధిలోనికి తీసుకోవడంతో ఈ అశం ఇప్పుడు సుప్రీం కోర్టు పరిధిలోవుంది.
        ట్రిపుల్ తలాక్ బాధిత స్త్రీల కన్నా వైవాహిక అత్యాచార బాధిత స్త్రీల సంఖ్య నిస్సందేహంగా వందల వేల రెట్లు ఎక్కువగా వుంటుంది. ఆ పురుషుల్ని శిక్షించడానికీ ఆ స్త్రీలని రక్షించడానికీ, మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం తెచ్చే సాహసం కేంద్ర ప్రభుత్వానికి వున్నదా? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది.
        పైగా, వైవాహిక అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను చదివితే వారి మహిళాభిమానం ఎంత గొప్పదో  అర్ధం అవుతుంది. “భార్య అత్యాచారం అనుకున్నది భర్తకు అత్యాచారంగా కనిపించపోవచ్చు.  … ఇలాంటి చట్టాలను కనుక తీసుకుని వస్తే వివాహ వ్యవస్తే మొత్తంగా కూలిపోతుంది. భర్తల్ని వేధించడానికి భార్యల చేతికి ఆయుధాలను అందుబాటులో వుంచినట్టవుతుంది” అని అందులో పేర్కొన్నారు.  ఇదే మాటను ముస్లిం సమాజం విషయంలో ఎందుకు చెప్పలేదన్నది కీలక అంశం. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలూ? ముస్లిం భర్తల్ని వేధించడానికీ ఆ చట్టం భార్యల చేతులకు ఆయుధాలను అందుబాటులో వుంచినట్టు కాదా? తద్వార వివాహ వ్యవస్తే మొత్తంగా కూలిపోదా? పౌరుల మత విశ్వాసాలు ఎలావున్నా ప్రభుత్వానికి మతపక్షపాతం వుండడం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుధ్ధం. 

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ అధ్యక్షుడు)
సెల్ నెం. 9010757776

హైదరాబాద్
23 డిసెంబరు 2017
ప్రచురణ :
ఆంధ్రజ్యోతి దినపత్రిక 26 డిసెంబరు 2017

Saturday 23 December 2017

Review on Volga's Novel Yashobudhdha

ఆమె-అతడు- సంఘం
 వోల్గా నవలయశోబుధ్ధపరామర్శ
 - ఉషా యస్ డానీ

పాత రచనల్ని పరిచయం చేయడానికి విమర్శకుల దగ్గర పాత పరికరాలు వుంటే సరిపోతాయి. కానీ, కొత్త రచనల్ని పరామర్శించడానికి పాత పరికరాలు సరిపోవు; కొత్త పరికరాలని కనిపెట్టాల్సి వుంటుంది. వోల్గా వంటి ప్రముఖ రచయిత్రి  రాసిన కొత్త  చారిత్రక నవలయశోబుధ్ధను పరిచయం చేయాల్సి వచ్చినపుడు అలాంటి కొత్త పరికరాల అవసరం మరీ ఎక్కువగా వుంటుంది.  
అస్తిత్వవాదయుగంలో  సాహిత్యం పెద్ద కుదుపుకు గురవుతుంది. అనేక కొత్త ప్రక్రియలు పుట్టుకువస్తాయి. పాత ప్రక్రియలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. తాము కొత్తగా చెప్పదలచిన అంశాన్ని ప్రభావశీలంగా వ్యక్తంచేయడానికి పురాణ పాత్రల్ని ఆశ్రయించే సాంప్రదాయం చాలా కాలంగా వుంది. దాదాపు ఏడు దశాబ్దాల క్రితమే చెలం తాను ప్రవచించే స్త్రీ స్వేచ్చను ప్రచారం చేయడానికి  (సతీ)’సావిత్రినాటకాన్ని పునర్-రచించాడు. గౌతమ బుధ్ధుని భార్యగా మనకు అతి స్వల్పంగా మాత్రమే తెలిసిన యశోధర అనే చారిత్రక పాత్ర ద్వార ఆధునిక స్త్రీవాదాన్ని బలంగా వ్యక్తం చేయడానికి ఇప్పుడు ఓల్గా పూనుకున్నారు.  
వర్తమాన సమాజంలో మరో విధంగానూ బౌధ్ధధార్మిక చింతనను పుఃనపరిశీలించాల్సివుంది. అహింసో పరమధర్మం అన్న ధార్మిక ప్రతిపాదన శ్రీలంక, మయన్మార్ దేశాల్లో అధికారమతంగా మారి అక్కడి ఉపజాతులైన తమిళులు, రోహింగ్యాల మీద మానవ హననానికి పూనుకుంది. అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.  
సాహిత్యంలో చరిత్ర మనకు రెండు రకాలుగా అందుబాటులో వుంటుంది. మొదటిదివిశ్లేషణాత్మక చరిత్ర (analytical history) రెండోది, వర్ణనాత్మక చరిత్ర (narrative history). విశ్లేషణాత్మక చరిత్ర ప్రధానంగా పరిశోధకుల ప్రక్రియ. దాన్ని రాయడం చదవడం కూడా ఒక క్లిష్ట ప్రక్రియ. నవలాకారులు సాధారణంగా వర్ణనాత్మక చరిత్ర రచన ప్రక్రియను ఎంచుకుంటారుస్కాటిష్ చరిత్రకారుడు విలియమ్ హామిల్టన్ డాల్రెంపుల్ వర్ణనాత్మక చరిత్ర రచన ప్రక్రియను ఇటీవల గొప్పగా అభివృధ్ధి చేశాడు.  
చారిత్రక పాత్రలతో కాల్పానిక ప్రత్యామ్నాయ చరిత్ర రచనలు (fictional alternate history writings) కూడా  వస్తున్నాయి. క్వింటిన్ టోరంటినో 2009లో రాసి తీసిన ‘Inglourious Basterds’ సినిమా అలాంటి కాల్పానిక ప్రత్యామ్నాయ చరిత్ర రచనే. సినిమా చివర్లో హిట్లర్, గోబెల్స్  తదితర నాజీ ప్రముఖులందరినీ ఒక  యూదు బాధితురాలు ఒక సినిమా థియేటరులో బంధించి తగలబెట్టేస్తుంది. ఇదొక కొత్త ప్రయోగం
వర్ణనాత్మక చరిత్ర రచన ప్రక్రియ కూడా మరలా రెండు రకాలు; సాంప్రదాయ వర్ణనాత్మక చరిత్ర, ఆధునిక వర్ణనాత్మక చరిత్ర. సాధారణంగా ప్రతి ప్రబంధంలోనూ  ఒక ప్రధాన పాత్రతోపాటూ అనేక ఉప పాత్రలు వుంటాయి. సాంప్రదాయ వర్ణనాత్మక చరిత్ర ప్రక్రియలో  రచయితలు చరిత్రలో స్థిరపడిన ప్రధానపాత్రను కేంద్రంగా చేసుకుని కథ చెపుతారు. అలా కాకుండా  చరిత్రలో అంతగా ప్రాధాన్యంలేని పాత్రను ఎంచుకుని ప్రధానపాత్రగా మార్చి కథ చెప్పడం ఆధునిక వర్ణనాత్మక చరిత్ర అవుతుంది. యశోబుధ్ధ నవల రాయడానికి ఓల్గా ఆధునిక వర్ణణాత్మక చరిత్ర రచన శైలిని ఎంచుకున్నారు. ఇందులో ప్రధాన పాత్ర యశోధరది; ఉపపాత్ర సిధ్ధార్ధుడిది. ప్రధాన స్రవంతిలోని ఉపపాత్రను అస్తిత్వవాద సాహిత్యంలో ప్రధాన పాత్రను చేసి రాయడాన్ని స్పిన్ ఆఫ్ (spin off) కథ అంటున్నారు. అలాంటి స్పిన్ఆఫ్ ప్రక్రియలో వచ్చిన  కొత్త నవల యశోబుధ్ధ. ఇది ఒక కాల్పానిక ప్రత్యామ్నాయ చారిత్రక నవల.
సంఘ శ్రేయస్సు కోసం పాటుపడడంలో యశోధరకు గౌతమునితో సరి సమానమైన జ్ఞాన సముపార్జన తృష్ణ వుండేదని చెప్పడమే ఓల్గా నవల లక్ష్యం. మరో మాటల్లో ఇదిఆమె-అతడు-సంఘంముక్కోణ ప్రేమకథ. గౌతముడు సంఘాన్ని ప్రేమిస్తాడు. యశోధర కూడా అంతే ప్రగాఢంగా సంఘాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వెరసి ఒక సంఘ శ్రేయస్సును సాధిస్తారు
తెలుగు సాహిత్యంలో స్త్రీవాదానికి నాందీ పలికిన ముఖ్యుల్లో ఓల్గా ఒకరు. మాతృస్వామిక వ్యవస్థను కోరుకునే స్త్రీవాదం అత్యంత సహజంగానే పితృస్వామిక వ్యవస్థనూ, పురుషాధిపత్యాన్నీ వ్యతిరేకిస్తుంది. అయితే, ‘యశోబుధ్ధలో సిధ్ధార్ధుని గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం రానివ్వరు రచయిత్రి. స్త్రీ పురుషుల మధ్య ఘర్షణను నివారించి ఒక శాంతియుత సమానత్వాన్ని స్థాపించడానికి నవల ఆద్యంతం కృషి చేస్తుంది. స్త్రీవాదంలో కొత్తగా వస్తున్న అవగాహనగా  దీన్ని భావించవచ్చు
గౌతముడు సమస్త బంధాలు, ఐశ్వర్యాలను వదిలి వెళ్ళి బోధివృక్షం కింద  జ్ఞానాన్ని పొంది గౌతమబుధ్ధుడు అయితేయశోధర సమస్త బంధాలు, ఐశ్వర్యాల నడుమ వుంటూవంటింట్లోనేజ్ఞానాన్ని పొంది యశోబుధ్ధ అయ్యిందనేది నవల థీమ్
యశోధర చాలా చురుకైన ఆలోచనాపరురాలు. ఆమెయే చొరవ తీసుకుని బుధ్ధునితో ప్రేమను ప్రతిపాదిస్తుంది. ఇద్దరి మధ్య ఆడామగా తేడాయేకాదు చిన్నా పెద్దా అనే తేడా కూడా లేదు. సిధ్ధార్ధుడు, యశోధర ఇద్దరూ ఒకే క్షత్రీయ వంశంలో పుట్టారు. ఇద్దరూ ఒకే సంవత్సరంలో ఒకే మాసంలో పుట్టారుపదహారవ ఏట ఇద్దరూ ఇష్టపడే పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళది పెద్దలు కుదిర్చిన  ప్రేమవివాహం. పదమూడు సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. గౌతముడు 29 యేట ఇల్లు వదిలి వెళ్ళిపోయి గౌతమ బుధ్ధుడయ్యాడు. యశోధర బౌధ్ధ బిక్షుణి గా మారి 78 యేళ్ళు బతికింది. తరువాత రెండేళ్ళకు గౌతమ బుధ్ధుడు పరినిర్వాణ చెందాడు. ఇది స్థూలంగా యశోబుధ్ధ కథ
సాహిత్య ప్రక్రియల్లో ప్రతిదానికీ ప్రభావశీలమైన ఒక ప్రత్యేకత వుంటుంది. కవిత్వం ప్రధానంగా భావోద్వేగాలను అత్యున్నతస్థాయికి ప్రేరేపిస్తుంది. వ్యాస ప్రక్రియ ప్రధానంగా  మేధోమధనం సాగిస్తుంది. కథ-నవల ప్రక్రియలు ప్రధానం మనచుట్టూ వున్న వ్యక్తుల గురించి అవగాహనను పెంచుతాయి. ఒక ప్రక్రియలో ఒక అంశం ప్రధానంగా వున్నంత మాత్రాన అందులో ఇతర అంశాలు వుండవనికాదు. కవిత్వంలోనూ మేధోమధనం అంశ వుండవచ్చు; కథ-నవలల్లోనూ భావోద్వేగాల ప్రేరణ వుండవచ్చు; అలాగే వ్యాసాల్లోనూ వ్యక్తిత్వ చిత్రణ వుండవచ్చు; ప్రక్రియలో ఏది ప్రధానం అనేదే ముఖ్యం. విషయం తెలిసినవాళ్ళు ప్రక్రియకు ఎక్కువ న్యాయం చేస్తారు. వోల్గా కవయిత్రి, రచయిత్రి కూడా. రెండు ప్రక్రియల ప్రత్యేకతలు సహితం వారికి స్పష్టంగా తెలుసు. ‘యశోబుధ్ధఅచ్చమైన నవల
కథా, నవల కూడా రెండు భిన్నమైన ప్రక్రియలు. కథ సంఘటన ప్రధానమైనది; నవల పాత్ర ప్రధానమైనది. మళ్ళీ దాని అర్ధం కథల్లో పాత్రలు వుండవనీకాదు; నవలల్లో సంఘటనలు వుండవనీ కాదు. నవల ఆద్యంతం యశోధర వ్యక్తిత్వంలోని  విభిన్న పార్శ్వాలను చిత్రిస్తుంది
ఇటు గౌతముని  జీవితంలోనూ, అటు యశోధర జీవితంలోనూ అత్యంత కీలక సంఘటన గౌతముని మహాభినిష్క్రమణం. ఇది చాలా నాటకీయ సన్నివేశం. దీని గురించి అనేక ప్రక్షిప్తాలు కూడా ప్రచారంలో వున్నాయిగౌతముడు అర్ధరాత్రి తల్లిదండ్రులకు, భార్యా పిల్లలకు చెప్పకుండా వారంతా నిద్రిస్తున్న వేళ నిశ్శబ్దంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు ప్రచారంలో వున్న ఒక పెద్ద కట్టుకథను ఛేదించడమే ఓల్గా తన లక్ష్యంగా పెట్టుకున్నారనిపిస్తుంది
ప్రకృతి యధాస్థితిలో కొనసాగుతుందని గత కాలపు తత్వవేత్తలు అందరూ గట్టిగా నమ్మేవాళ్ళు. మార్పు అనేదే ప్రకృతి నియమం అని గుర్తించిన తొలి తత్త్వవేత్త  గౌతమ బుధ్ధుడు. “ మనిషీ ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేయలేడు. ఎందుకంటే; అది అదే నదికాదు; అతను అదే మనిషికాడుఅని ప్రకటించిన గ్రీకుతత్త్వవేత్త హెరాక్లిటస్ కన్నా గౌతమ బుధ్ధుడు పాతికేళ్ళు ముందువాడు
వోల్గా నవలలో మార్పు సిధ్ధాంతాన్ని ప్రేమకు కూడా అన్వయిస్తాడు గౌతముడుయశోధర పెళ్ళి ప్రస్తావన చేసినపుడుఇప్పుడు క్షణాన నాకు మన  బాంధవ్యం అత్యంత ప్రియంగా వుంది. కానీ, భావన మారవచ్చు” (పేజీ 47) అంటాడు.  “మార్పు అనివార్యం. … ఇప్పటి ఆనందం శాశ్వితంగా వుండదు. మారుతుంది. నా సత్యాన్వేషణ నాకు ఆనందాన్ని ఇస్తే నీకు దుఃఖ్ఖాన్ని ఇవ్వవచ్చుఅంటాడుయశోధరకు కూడా తాత్విక ఆసక్తి ఎక్కువ. “మీరు వెతకబోయే సత్యంఏమిటో తెలుసుకోవాలని వుందిఅంటుంది.  “(సత్యాన్ని) తెలుసుకునే క్రమంలో నేను నీ పక్కన వుండకపోవచ్చు. బహుశ వుండనుఅని స్పష్టం చేస్తాడు గౌతముడు. దానికి యశోధర కూడా దీటుగా స్పందిస్తుంది.  “మీరు సంఘాన్ని గమనించినట్టు నేను మన బాంధవ్యాన్ని గమనిస్తాను. మీకు కలిగే జ్ఞానం నాకూ కలుగుతుంది కదా!” అంటుంది. నవ దంపతుల తొలిరాత్రి కూడా వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషనే జరుగుతుంది. “నా చిత్తం అన్వేషణకు పదమని ఆదేశించిన నాడు నువ్వు నాకు బంధనమై బాధిస్తావేమో?” అని సందేహిస్తాడు గౌతముడు. “ ఆదేశం వచ్చే వరకూ మీ మనస్సులోని ప్రతి ఆలోచనా తరంగాన్నీ నన్ను తాకనివ్వండి. అప్పుడు ఆదేశం నేను కూడా ఇవ్వగలుగుతానుఅంటుంది యశోధర. (పేజీ 56). తాను తండ్రికాబోతున్నట్టు తెలిసినపుడు కూడా  గౌతముడు సంధిగ్ధంలో పడతాడు. “నా వైరాగ్య పూర్ణచంద్రోదయానికి అడ్డుపడే గ్రహణం కానుందా? నీ ప్రసవమూ, శిశు జననమూ?” అని అడుగుతాడు. “ఐతే ఏం? గ్రహణం కొన్ని నిముషాలలో ముగిసే ప్రక్రియ. తరువాత చంద్రుని ప్రకాశం చంద్రునిదే!“ అంటుంది యశోధర. గ్రహణానికి ప్రతీకగానే రాహువు పేరును తన బిడ్డకు పెట్టాలని ప్రతిపాదిస్తాడు భర్త. గౌతముడు పుట్టిన ఏడో రోజున అతని తల్లి మాయాదేవీ చనిపోయిందితన బిడ్డకు వ్యవధి అయినా ఇవ్వగలరా? అని గౌతముడ్ని కోరుతుంది యశోధర. రాహులుడు పుట్టిన ఏదో రోజున  గౌతముడు తమను వదిలి వెళ్ళిపోక తప్పదని యశోధరకు ముందుగానే తెలుసు. అసలు యశోధరే గౌతముడిని సత్యాన్వేషణకు ప్రోత్సహించి పంపిందనేది వోల్గా అభిప్రాయం
ఇందులో యశోధరకు ఒక సమంజసమైన సామాజిక స్వార్ధం వుంది. తండ్రి బింబాననుడు ఒకసారి యజ్ఞాన్ని తల పెట్టినపుడు దాన్ని అపడానికి ఆమె విఫలయత్నం చేస్తుంది. యజ్ఞం పేరుతో కొనసాగే బ్రాహ్మణ అధిపత్యాన్నీ, పశువుల బలిని తీవ్రంగా విమర్శిస్తుంది. ఆమె మాటల్ని బింబాననుడు వినకపోగా కూతురికి పిచ్చి ఎక్కిందని నిందలేస్తాడు. దానితో యశోధర మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి. స్త్రీలను  ఆలోచనాపరులుగా, సత్యాన్వేషకులుగా సమాజం ఆమోదించదని బాధపడుతుందిస్త్రీలకు అలాంటి ఆమోదం దొరకడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేస్తుంది. గౌతముడు స్త్రీలను గురించిన సత్యాన్ని కనుగొని, స్త్రీలకు జ్ఞాన మార్గపు ద్వారాల్ని తెరిచినప్పుడు మాత్రమే  అది సాధ్యం అవుతుందని ఒక నిర్ధారణకు వస్తుంది. “మీరు ఆలస్యం చేయకండి. బంధాల నుండి బయటపడి మానవోధ్ధరణకు కావలసిన జ్ఞానాన్ని వెతుక్కొంటూ వెళ్లండిఅంటూ గౌతముడ్ని అదేశిస్తుంది! (పేజీ 90). 
వర్ణనాత్మక సాహిత్యంలో ఒక విచిత్రం వుంటుంది. దాన్ని చదువుతున్నప్పుడు పాఠకుడు రెండు రకాల అనుభూతులకు లోనవుతాడు. ఇందులో మొదటిది, పుస్తకంలో రచయిత ప్రస్తావించిన పాత్రలు, సన్నివేశాలకు సంబంధించిన అనుభూతులు. రెండోది పాత్రలు, సన్నివేశాలకూ పోలిన నిజజీవిత మనుషులు, సంఘటనలకు  సంబంధించిన అనుభూతులు. ఇలా ఒకే సందర్భంలో సమాంతరంగా రెండు రకాల అనుభూతుల్ని ఆస్వాదించడం అద్భుతంగా వుంటుంది. అదే వర్ణనాత్మక సాహిత్య తక్షణ ప్రయోజనం. ఇందులో దీర్ఘకాలిక ప్రయోజనం కూడా మరొకటి వుంటుంది. అదేమంటే, తరచూ వర్ణనాత్మక సాహిత్యాన్ని చదివే వారికి తమ చుట్టువున్న మనుషులువాళ్ళ మనస్తత్వాలు  మరింత లోతుగా, మరింత వివరంగా అర్ధం అవుతుంటాయి.  
ఉద్యమాలతో అనుబంధం వున్నవారికి ఉద్యమకారులు కుటుంబాలను వదిలేసే సంఘటనలు కూడా తెలిసే వుంటాయి. యశోబుధ్ధలో గౌతముని మహాభినిష్క్రమణ ఘట్టాన్ని చదుతున్నప్పుడు సహజంగానే అలాంటి నిజజీవిత సంఘటనలు గుర్తుకు వస్తాయి. మిత్రులకు నిమలూరి భాస్కరరావుగా, సాహిత్యకారులకు అజ్ఞాత సూర్యునిగా, ఉద్యమకారులకు మల్లిక్ గా సుపరిచితుడయిన నరసారావుపేట వాసి జీవితంలోనూ ఇలాంటి ఘటన ఒకటి వుంది. 1970 దశకంలో ఉద్యమ అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుని ఆయనో రోజు ఉద్యోగాన్నీ, భార్యా పిల్లల్నీ వదిలేసి ఇంటి నుండి బయట పడి నరసారావుపేట బస్ స్టాండుకు చేరుకున్నాడు. కారణం వల్లనో ఆయన ఎక్కాల్సిన బస్సు రెండు మూడు గంటలు ఆలస్యం అయింది. ఈలోగా ఒక మిత్రుడు బస్ స్టాండ్ లో ఆయన్ను కలిసి దుర్వార్త చెప్పాడు. ఆయన రెండేళ్ళ కొడుకు ప్రమాదావశాత్తు వేడి పెనం మీద పడి పాక్షికంగా కాలిపోగా ఫలానా ఆసుపత్రిలో చేర్చారన్నది వార్త సారాంశం. చాలా ఉత్కంఠ సందర్భం అది. కొడుక్కి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స, భార్య విలాపం ఒకవైపు; ఉద్యమం, సామాజిక బాధ్యత, త్యాగం మరో వైపు లాగుతుంటే కొద్ది సేపు మనసులో ఘర్షణపడి, చివరకు బస్సెక్కి అజ్ఞాత జీవితానికి వెళ్ళి పోయాడు నిమలూరి భాస్కర రావు.
ఇంతటి భావోద్వేగపు సన్నివేశంలో ఒక పాక్షికత వుంది. ఒక సంకుచితత్వం కూడా వుంది. కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతున్న వ్యక్తి భావోద్వేగాలను మాత్రమే మనం చూడగలిగాం. ఆయన వదిలేసిన కుటుంబ సభ్యుల భావోద్వేగాలను చూడలేకపోయాం. యశోబుధ్ధలో లోటు రాకుండా ఓల్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహాభినిష్క్రమణ ఘట్టంలో ఫోకస్ ను గౌతముని మీద కాకుండా యశోధర మీద పెట్టారు.

ఆరోజు భర్త తమను వదిలి వెళ్ళిపోతాడనీ, అత్తామామలు గుండెలుపగిలేలా ఏడుస్తారనీ  ఆమెకు తెలుసు. తనను చూస్తే అత్తామామల బాధ మరింత పెరుగుతుందనివాళ్ళు తన మీద విపరీతమయిన జాలి చూపిస్తారని కూడా ఆమె ఊహించింది. తనను విడిచిపోతున్న భర్తవల్ల సంఘ శ్రేయస్సు  జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసంతప్ప ఆమెకు బాధ లేదు. ఆ రాత్రి వసుంధర ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారుఝామున పసికందు పక్క తడుపుకుని యేడ్వడం మొదలెట్టినపుడే ఆమెకు మెలుకువ వచ్చింది.  

తరువాతి కాలంలో యశోధర ప్రోద్బలంతోనే బుధ్ధుని తల్లి గౌతమి తొలి భిక్షుణిగా మారుతుంది. ఆమె వెనుక యశోధర కూడా భిక్షుణిగా మారుతుంది.   బౌధ్ధారామాల్లో స్త్రీల ప్రవేశం మీద  తొలుత తటపటాయించిన బుధ్ధుడు తరువాత కొన్ని షరతులతో వాళ్లను ఆమోదించాడుధార్మిక రంగంలో స్త్రీలకు కూడా గౌరవప్రదమైన ప్రవేశం లభించడంతో యశోధర జీవితకాల స్వప్నం ఫలించింది.
మనం ఎందుకు బయలు దేరామో మరిచిపోతే ఎప్పటికీ గమ్యానికి చేరుకోలేము అని కవి వాక్యం ఒకటుంది. అది సాహిత్య రచనకు కూడా ఉపయోగపడుతుంది. ప్రణాళికాబధ్ధాంగా రచనలు చేసేవాళ్ళు ముందు చివరి వాక్యాన్ని రాసిన తరువాతే  మొదటి వాక్యాన్ని రాస్తారు. గమ్యం నిర్ధారణ అయ్యాక మొదలెట్టే రచనల్లో గమనం పూర్తిగా రచయిత అదుపులో వుంటుంది. అలా గమ్యాన్ని ముందుగా నిర్ధారించుకోకపోతే  రాసే క్రమంలో పాత్రలూ, సంఘటనలు రచయితల్ని దారి మళ్ళించి వాళ్ళు చెప్పాలనుకున్నదాన్ని స్పష్టంగా చెప్పనీయకుండా చేసేస్తాయి.  
జాగ్రత్తగా పరిశీలిస్తే మహాభినిష్క్రమణ ఘట్టంలో యశోధర పాత్రని అభివృధ్ధి చేసిన తరువాతే ఓల్గా నవలను రాయడం మొదలెట్టారేమో అనిపిస్తుంది. ఆరంభ సన్నివేశంలో యశోధర ఉద్యాన వనంలో పూలు కోస్తూ వుంటుంది. దాని కోసం చెట్లకు క్షమాపణలు చెపుతుంటుంది. “ తల్లి నుండి బిడ్డలను వేరు చేస్తున్నాను. కానీ, అందరికీ తల్లి అయిన దేవత మెడలో వాటిని అలంకరించి వాటి జన్మను సార్ధకం చేస్తానుఅని వాగ్దానం చేస్తుంది. నవల చివర్లో అత్తమామల్ని ఓదాడుస్తున్నపుడు  “శుధ్ధోధనుడు, గౌతమీల నుండి సిధ్ధార్ధుడ్ని వేరు చేస్తున్నాను. కానీ, అందరికీ తల్లి అయిన సంఘం మెడలో సిధ్ధార్ధుడ్ని అలంకరించి అతని జన్మను సార్ధకం చేస్తానుఅని అన్నట్టుగా దీన్ని అన్వయించుకోవాలి. అప్పుడు నవల ఆరంభానికీ  ముగింపుతో వున్న సంబంధమేగాక వాటిని చిత్రించడంలో రచయిత్రి ప్రదర్శించిన నైపుణ్యమూ అర్ధం అవుతాయి
చారిత్రక నవల ఓల్గాకు కొత్త ప్రక్రియే అయినప్పటికీ రెండున్నర వేల యేళ్ల క్రితపు వాతావరణంలో ప్రశాంతంగా సాగిపోతుంది రచన. సంభాషణల్లో బుధ్ధుని తర్కంయశోధర చతురత ఎక్కడా పాత్ర పరిధిని దాటవు. బుధ్ధునికి సంతానం కలగడం లేదని తెగ బాధపడే గౌతమి సందర్భంలో  కోడలితోఒక్కసారి రుతుక్రమాన్ని అతిక్రమిస్తే కూడా ఎంతో అందంగా ఆనందంగా వుంటుందమ్మాఅంటుంది. నవలలో ఇలాంటి అనేక సంభాషణలు పాఠకుల్ని అలరిస్తాయి
ఎవరయినా ఆసక్తిగా చరిత్రను చదివేది గతాన్ని సంస్కరించడానికి కాదు; వర్తమానాన్ని సంస్కరించి మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి. నవల చివర్లో యశోధర తన తోటి భిక్కువైన కుశాలతో “(గ్రామస్తులు) తమ సంపదను పెంచుకోవాలనే కోరికతో అశాంతిగా జ్వలిస్తున్నారు. పుత్ర వ్యామోహంతో వారికి విలాస జీవితాలను అలవాటు చేసి వారిలో అహంకారాన్ని చేతులారా పెంచి, అహంకారం తిరిగి తమ మీదే దాడి చేస్తుంటే బాధతో కుమిలిపోతున్నారు. ( తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా) తమ బాధ ఇతరులకు లేదే అనే అసూయనూ, ఎలాగైనా ఎదుటి వారిని బాధపట్టి సంతోషించాలనే మనస్తత్వాన్ని  కలిగి వుంటున్నారుఅని విచారాన్ని వ్యక్తం చేస్తుంది. రెండున్నర వేల యేళ్ల క్రితం సమాజం అలా వుందోలేదోగానీ ఇప్పుడయితే సరిగ్గా అలాగే వుంది. అంచేత ఇది గతం మీద చేసిన వ్యాఖ్య కాదు; వర్తమాన సమాజం మీద చేసిన వ్యాఖ్యఇలాంటి వర్తమాన ప్రయోజనాల కోసం కూడా పుస్తకాన్ని చదవాలి
  పుస్తకాన్ని మూసే సమయానికి అప్పుడే అయిపోయిందా అనిపించడం కూడా రచయిత్రి ఎంచుకున్న సరళ శైలిని ఒకరకంగా మెచ్చుకోవడమే. తెలుగు నవలా సాహిత్యంలో వోల్గా స్థానాన్ని ఇంకో మెట్టు పెంచే రచన ఇది.

( 14 డిసెంబరు 2017 హైదరాబాద్ రవీంద్ర భారతీలో యశోబుధ్ధ పుస్తక పరిచయ సభలో చేసిన ప్రసంగం ఆధారంగా)

మొబైల్ – 9010757776

15 డిసెంబరు 2017