Wednesday 19 July 2017

Can't We Stop the Cow-Terrorism?

గోగ్రవాదాన్ని ఆపలేమా?
-        ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

వర్తమాన భారత దేశంలో అణగారినవర్గాలు ఏవీ ప్రశాంతంగా, సంతృప్తిగా లేవు. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వాలు ప్రజల మధ్య చీలికలు తెచ్చి వాళ్ల మధ్య  తగవులు సృష్టించి తమ ప్రధాన బాధ్యతల నుండి తప్పుకుని కార్పొరేట్ల సేవల్లో తరిస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజల మధ్య చీలికలు తెచ్చే రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదకర ధోరణుల్ని అనుసరిస్తున్నాయి. వీటికి ముఖ్యంగా బలవుతున్నది ముస్లింలు, దళితులు, ఆదివాసులు.

సంఘ్ పరివారపు రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టి  బాబ్రీ మసీదు – రామజన్మభూమి వివాదాన్ని రెచ్చగొట్టి దాదాపు పాతికేళ్ళు రాజకీయ లబ్దిపొందింది. ఇప్పుడు నిమ్న కులాలతో కలుపుకుని దాదాపు 65 శాతంగావున్న హిందూ సమాజాన్ని  తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి కౄరమైన చీలిక సిధ్ధాంతాలను ప్రచారం చేస్తోంది. దానికోసం అది అనైతిక పధ్ధతుల్లో ముస్లింలు, దళితులు, ఆదివాసుల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శతృవర్గంగా చిత్రించి ప్రజల్లోని భావోద్వేగాలను భావోద్రేకాలుగా మారుస్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పతనానికి ఇది పరాకాష్ట.

ముస్లిం సమాజం మీద సంఘ్ పరివార శక్తులు ప్రధానంగా మూడు ఆరోపణలు చేస్తున్నాయి. పాకిస్తాన్ అభిమానం, ట్రిపుల్ తలాఖ్, బీఫ్‌. ఇవి మూడూ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు.

భారత  స్వాతంత్యం కోసం సాగిన జాతియోద్యమంలో  సంఘ్ పరివార శక్తులు ఒక్కటంటే ఒక్కటీ  పాల్గొనలేదు. పైగా అవి అప్పట్లో బ్రిటీష్ పాలకులకు అనుకూలంగా వున్నాయి. జాతియోద్యమంలో ప్రాణాల్ని సహితం ఫణంగా పెట్టి పోరాడిన ముస్లీంలు వందల సంఖ్యలో కనిపిస్తారు. దేశ విభజన సందర్భంగా ముస్లింలలో అత్యధికులు భారత దేశాన్ని అభిమానించి ఇక్కడే వుండిపోయారన్నది వాస్తవం. ఆ విభజన ఏ విధంగానూ మత విభజనకాదు. బహుకొద్ది మంది ముస్లింలు మాత్రమే  పాకిస్తాన్ కు వలస వెళ్ళారు. 1947లో విభజన జరిగింది పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే. మిగిలిన రాష్ట్రాలన్నీ సమైక్యంగానే వున్నాయి. కానీ, భారతదేశాన్ని మాతృభూమిగా  అభిమానించి ఇక్కడే వుండిపోయిన ముస్లింల మీద ఇప్పుడు అనైతిక దాడులు జరుగుతున్నాయి. ఇది జాతియోద్యమానికి అవమానకరం.
1990వ దశాబ్దంలో సరళీకృత ఆర్ధికవిధానం, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) ప్రవేశించాక మానవ విలువల్లో, సంబంధాల్లో అనేక మార్పులు వచ్చాయి. మనుషులు వ్యక్తులుగా (Man and individual)  మారిపోయారు. ఆమేరకు వ్యక్తిగత స్వార్ధం పెరిగిపోయింది. ఆ ప్రభావం దాంపత్య జీవితం మీద కూడా బలంగా పడింది. 20వ శతాబ్దం ఆరంభంలో పుట్టినవాళ్ళు భార్యాభర్తలు అంటే  జీవితకాలబంధం అనుకునేవారు. 20వ శతాబ్దం మధ్యలో పుట్టినవాళ్ళు దాన్ని సుదీర్ఘ అనుబంధంగా భావించేవారు. 21వ  శతాబ్దం ఆరంభంలో పుట్టినవాళ్ళు దాన్ని తాత్కాలిక బంధంగా భావిస్తున్నారు. ఫలితంగా, పెళ్ళికి ముందే ప్రేమికుల బ్రేక్-అప్ లు, పెళ్ళి తరువాత దంపతుల విడాకులు ఎక్కువైపోయాయి. ప్రపంచం అంతా ఇదే తీరున వుండడంతో ఆదుష్ప్రభావం ముస్లిం సమాజంలోనూ ప్రవేశించింది.   ఇప్పుడు మనం విమర్శించాల్సింది ఎల్.పీ.జీ. విధానాలను. కానీ, అందుకు విరుధ్ధంగా జరుగుతోంది. ఎల్.పీ.జీ. విధానాలను గట్టిగా సమర్ధిస్తున్నవారు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ముస్లింలలో మాత్రమే విడాకుల విధానం వున్నట్టు ఒక తప్పుడు ప్రచారం మొదలెట్టారు. సెల్ ఫోన్, యస్సెమ్మెస్, వాట్స్ అప్, ఈ-మెయిల్ ద్వార చెప్పే ట్రిపుల్ తలాఖ్ లు చెల్లవని, అలా చెప్పేవాళ్లని సంఘ బహిష్కరణ చేయాలని ముస్లిం ధార్మిక సంస్థలు చేస్తున్న ప్రకటనల్ని సహితం కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బీఫ్ అంటే ఆవుమాసం మాత్రమే కాదు. గేదె, దున్నపోతు, ఎద్దు, ఆవు తదితర మాంసాల్ని కలిపి బీఫ్ అంటారు. సాధారణంగా భారత మార్కెట్లలో దొరికేది మొదటి మూడు మాంసాలే. బీఫ్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో వున్న దేశాల్లో భారత దేశం ఒకటి. ఆ ఎగుమతి సంస్థల్లో అత్యధిక భాగం ముస్లిమేతరుల ఆధీనంలోనే వున్నాయి.

దేశంలోని దళిత, ముస్లీం సమాజాల్లో బీఫ్ తినే సాంప్రదాయం వుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, బీఫ్ తినడం ముస్లింలకు ధార్మిక విధి ఏమీకాదు. కేవలం ఇష్టాఇష్టాలకు సంబంధించిన అంశం. భారత ముస్లిం కుటుంబాలలో  60 శాతం బీఫ్ తినరు. మిగిలిన 40 శాతం కూడా పేదరికం కారణంగా మటన్ కొనుక్కోలేక బీఫ్ తింటారని ఆర్ధిక, సాంస్కృతిక పరిశోధనలు చెపుతున్నాయి.  పేదవాళ్ళకు చవకగా దొరికే మాంసాహారం గొడ్డుమాంసమే. ఏదో ఒక విధంగా ముస్లింలను దోషులుగా ప్రచారం చేయాలనే దురుద్దేశ్యమే తప్ప నిజానిజాలను అర్ధంచేసుకునే స్థితి ఎక్కడా కనిపించడంలేదు.

ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ దుష్ప్రచారం  నిజానికి కేంద్రంలోని అధికార  పార్టీ ప్రాయొజిత కార్యక్రమంగానే సాగుతున్నది.  దాడులు, హత్యలు కొనసాగిస్తున్నవారిలో బీజేపి, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్ కార్యకర్తలే ఎక్కువ మంది వుండడం విశేషం.
ఇలాంటి గోగ్రవాదుల  మూక దాడులు ముడేళ్ళ క్రితం వరకూ ఒకటి రెండే నమోదు అయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక గడిచిన మూడేళ్ళలో ఇలాంటి దాడులకు సంబంధించిన కేసులు 63 నమోదయ్యాయి. వీటిల్లో 28 మంది చనిపోగా, కొన్ని వందల మంది తీవ్రగాయాల పాలయ్యారు. హతుల్లో 24 మంది ముస్లింలు కాగా, నలుగురు దళితులు. ముస్లిముల తరువాత గోగ్రవాదుల లక్ష్యం దళితులే అని ఈ గణాంకాలు చెపుతున్నాయి.

బయటికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం లేని ఒక అభద్రతా  వాతావరణంలో ఈరోజు భారత ముస్లింలు బతుకుతున్నారు. రంజాన్ పండుగకు రెండు రోజులు ముందు దేశరాజధాని సరిహద్దుల్లో ఓ పదహారేళ్ళ యువకుడిని రైల్లో  కూర్చోవడానికి సీటు కోసం తగవుపడి చంపేశారు.  గతవారం ఝార్ఖండ్అస్సామ్ రాష్ట్రాల్లో ఇద్దర్ని రోడ్డు మీద అడ్డగించి చంపేశారు. ఈవారం కూడా దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటిది జరగలేదని చెప్పలేని పరిస్థితిలొ మనం వున్నాం.

బీఫ్ అనగానే ఏ మాంసమో తేల్చుకోకుండానే, ఆవుమాసం అనే నిర్ణయం చేసేసి,  ఇంట్లో బీఫ్ పెట్టుకున్నారంటూనో,  స్కూటరులోనో, కారులోనో బీఫ్ వుందంటూనో పాతిక ముఫ్ఫై మంది గుంపు తాము గోరక్షులమంటూ దారి కాచి దాడులు చేసేస్తున్నాయి. నీ దగ్గర గొడ్డు మాసం వుందంటున్నాయి. లేదని డిక్కీ విప్పి చూపినా నమ్మడంలేదు. “ఈరోజు కాజపోతే  నిన్న తిని వుంటావు?” “అప్పుడు తినక పోయినా … మీకు తినే సాంప్రదాయం వుందిగా” అని నిందిస్తూ చంపేస్తున్నారు గో-ఉగ్రవాదులు! ఆరోపణ వారిదే, తీర్పూ వారిదే, తీర్పును అమలు చేసేపనీ వారిదే. విచారణలేదు, నిజ నిర్ధారణలేదు. అడిగేవాడూ లేడు.

గోగ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోంది. మహాత్మా గాంధీజీ నివశించిన సబర్మతీ ఆశ్రమంలో చరఖా మీద నూలు వడుకుతూ  ప్రధాని మోదీజీ గోగ్రవాదులకు హెచ్చరికలు జారీచేశారు. దేశంలో కొన్ని అరాచకశక్తులు గో-రక్షకుల పేరున దుకాణలు తెరిచి కూర్చున్నాయని ఇంకో సందర్భంలో  వాళ్లను తీవ్రంగా విమర్శించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు ప్రధాని హెచ్చరికలకు భిన్నంగా వున్నాయి. ప్రధాని  పార్టీ కార్యకర్తలే మూక దాడుల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. గోగ్రవాదుల్ని కేసుల నుండి తప్పించడానికి బీజేపికి చెందిన న్యాయవాదులు, హిందూత్వ అభిమానులైన పోలీసులు, పబ్లిక్  ప్రాసిక్యూటర్లు చివరకు న్యాయమూర్తులు సహితం తమ వంతు కరసేవ చేస్తున్నారు.

దేశంలోని ఒక సామాజికవర్గం మీద ఇంతటి వివక్షతో  ప్రభుత్వ ప్రాయోజిత అనైతిక దాడి జరుగుతున్నప్పుడు ఆలోచనాపరులందరూ తరతమ బేధాలు లేకుండా ఖండించాలి. ముస్లింలు, దళితులు, ఆదివాసులు మాత్రమేగాక, అణగారిన కులాలు,  ఉదార, లౌకిక, సామ్యవాద,  ప్రజాస్వామ్య, పౌరహక్కుల, మానవ హక్కుల  వాదులు అందరూ కలిసి ఒక్క గొంతుకతో నినదించాల్సిన చారిత్రక సందర్భం ఇది.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ – 9010757776
హైదరాబాద్, 9 జులై 2017
ప్రచురణ :
మన తెలంగాణ, 11 జులై 2017


MADARASA LAMB

MADARASA LAMB  
మదర్సా మేకపిల్ల
ఉషా యస్ డానీ

         
కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం నుండి ట్రంప్ గారి అమెరికా తప్పుకున్నాక,

భూతాపం పెరిగి మాననజాతి మొత్తం అంతరించిపోయాక,

భూగ్రహం తోడేళ్లలోకంగా మారిపోయాక-

మన కథ మొదలయింది.



భూమి మీద మనుషులు వున్న రోజుల్లో  ఏలినవారు స్వాతంత్ర్యదినం, వంటి పండగలు చేసుకునేవారు. బీదాబిక్కి జనం కార్మికదినం వంటి పండగలు చేసుకునేవారు.

మనుషులు చచ్చి తోడేళ్ళ రాజ్యం వచ్చినా పండగల  నియమం మారలేదు. తోడేళ్ళ పండగలు జాతీయ దర్పంగా మారాయి. మేకల పండగలు అజ్ఞాతానికి వెళ్ళిపోయాయి 

          అయినా దేశంలో తోడేళ్ళు తినేయగా మిగిలిన మేకలకు తమ పండగలు చేసుకోవాలనే సరదా మనసులో ఎక్కడో దాగివుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి, మేకలు పండగలు చేసుకోరాదని తోడేళ్ళ రాజు ఎప్పుడూ అనలేదు. అయినా, పండగలు చేసుకోవాలంటే మేకలకు చచ్చేంత భయం.    

అలా ఒకసారి మేకలకు ఓ పండగ వచ్చింది. పెద్ద మేకలకు అనుభవం ఎక్కువ గాబట్టి ముందు జాగ్రత్తగా పండగ వద్దనుకున్నాయి. పిల్లమేకలకు అనుభవం లేదు గాబట్టి సరదాగా పండుగ చేసుకుందా మనుకున్నాయి.

పండుగ ముందు రోజు  ఖద్దౌలీ నుండి  నాలుగు తెల్లటి పిల్లమేకలు పొద్దున్నే టిఫిన్ బాక్సుల్లో రెండు కట్టలు గడ్డి కట్టుకుని ఢిల్లీ  వెళ్ళాయి.
 
ఖద్దౌలీ గ్రామం  ఫరీదాబాద్ లో వుందిఫరీదాబాద్ జిల్లా హర్యాణాలో వుంది. హర్యాణా రాష్ట్రం పరువు మర్యాదలకు ధర్మభూమిగా వుంది.

ఢిల్లీ చాందినీ చౌక్ లో కొత్త బట్టలు కొనుక్కుని, ఇంటి నుండి తెచ్చుకున్న గడ్డిని ఎర్రకోట ముందు నిలబడి తిని,  హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ లో గుక్కెడు నీళ్ళు  తాగి మథుర ప్యాసింజరు ఎక్కాయి ఆ తెల్లటి పిల్ల మేకలు.

అప్పుడు దేవుడు మంచి మూడ్ లో వున్నట్టున్నాడు. నిండా తోడేళ్ళున్న రైల్లోనూ పిల్లమేకలు నాలుగూ సర్దుకు కూర్చోవడానికి కొంచెం జాగా చూపించాడు.

పిల్ల మేకల ఆనందానికి హద్దులు లేవు. కొత్త బట్టల క్యారీ బ్యాగులు జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకుని, చేతుల్లో ఖాళీ టిఫిన్ బాక్సులు పట్టుకుని దేవునికి ధన్యవాదాలు చెప్పుకున్నాయి.  

తోడేళ్ళ రాజ్యంలో మేకలకు దేవుడే దిక్కు. ఎప్పుడయినా తినడానికి ఇంత తిండి దొరికినా, తాగడానికి ఇంత నీళ్ళు దొరికినా, చివరకు పీల్చడానికి ఇంత గాలి దొరికినా అవి తలపైకెత్తి  దేవుడు గొప్పవాడుఅంటాయి.

లోకంలో దురదృష్టవంతుల ఆనందం ఎక్కువ సేపు నిలవదు. పది నిమిషాల్లో ఓఖ్లా స్టేషన్ వచ్చేసింది. పెట్టెలోనికి ఒక పెద్ద తోడేళ్ల గుంపు ఎక్కింది.  పెట్టెలో సీట్లు లేకపోవడంతో ఆ గుంపులోని తోడేళ్ళు అటూ ఇటూ చూశాయిఎక్కడా జాగా కనిపించలేదు.

బండి కదిలి వేగాన్ని పుంజుకుంది.

నిలబడి ప్రయాణం చేస్తున్న కొత్త తోడేళ్ల గుంపుకు  ఓ మూల నక్కి కూర్చున్న పిల్ల మేకలు కనిపించాయి.  

మేకపిల్లలు సీట్లలో కూర్చోవడం తోడేళ్ళకు నచ్చలేదు. మేకల ముందు తాము నిలబడి వుండడం నచ్చలేదు. మేకలు తెల్లగా వుండడం నచ్చలేదు. వాటికి చిన్నగా గడ్డాలు వుండడం నచ్చలేదు. మేకల ఒళ్ళో కొత్తబట్టలు వుండడం నచ్చలేదు. టోటల్ గా ఆ రైలులో  మేకలు వుండడం నచ్చలేదు.

ఇంతలో రైలు తుగ్లకాబాద్ దాటి ఫరీదాబాద్ చేరుకుంది. బండి ఢిల్లీ సరిహద్దు దాటి హర్యాణాలో ప్రవేశించింది. హర్యాణా గాలిసోకగానే తోడేళ్ళ గుంపుకు పరువు ప్రతిష్టలు గుర్తుకొచ్చాయి.

హర్యాణా తోడేళ్ళకు ప్రాణంకన్నా పరువు మిన్న అని చెప్పుకుంటారు. అంటే పరువు కోసం అవి చచ్చిపోతాయని కాదు; చంపేస్తాయి అని

తోడేళ్ల రాజ్యంలో మేకలు  సీట్లో కూర్చోగా తోడేళ్ళు నిలబడి ప్రయాణం చేయడం ఎంత అప్రదిష్ట? ఎంత నామోషీ? అదీ హర్యాణాలో!

కొత్తగా బండి ఎక్కిన తోడేళ్ళ గుంపుకు ఒక్కసారిగా అసహనం ముంచుకొచ్చింది.

పరువు పూనకంలా మారడంతో ఆ గుంపులోని నాయక తోడేలు ఒకటి బోర విరుచుకుంటూ పిల్ల మేకల దగ్గరికి వెళ్ళి  నిలబడింది. పిల్లమేకలు కంగారుగా చూశాయి.  ఆ కంగారులో ఓ మేకపిల్ల తన ఒళ్ళోపెట్టుకున్న కొత్త బట్టల్నీ,  ఖాళీ టిఫిన్ బాక్సును  కింద పడేసుకుంది. 

లెగండ్రాఅని గద్దించింది బోరతోడేలు.

పిల్ల మేకలకు ఏమీ అర్ధం కాలేదు. అవి బిత్తరపోయి ఆ బోరతోడేలు కేసి చూశాయి.

లెగండ్రా. ఇవి మా రిజర్వుడు సీట్లుఅని గద్దించింది.

ఆ మేకపిల్లలు కూర్చున్న  బల్ల ఒక్కసారి అదిరిందిపిల్ల మేకలు మరింత కంగారు పడ్డాయి.

పెట్టెలోవున్న తోడేళ్ళన్నీ ముసిముసిగా నవ్వేయి.
తోడేళ్ళకు నవ్వు వచ్చినా ఊళ వేస్తాయి. కోపం వచ్చినా ఊళ వేస్తాయి.

ఆ నలుగురిలో అందరికన్నా చిన్నదయిన బుజ్జి మేకపిల్ల కొంచెం ధైర్యం చేసి గొంతు సవరించుకుంది.    

వ్హాట్ రిజర్వేషన్? దిసీజ్ పాసింజర్ ట్రైన్. అండ్ దిస్ ఒన్ ఈజ్ జనరల్ కంపార్ట్ మెంట్అంది

ఈసారి  రైలుపెట్టే అదిరింది.

మేకలకు చదువు అబ్బదని తోడేళ్లకు గట్టినమ్మకం. మేకపిల్లలకు ఈమధ్య మదర్సాల్లో ఇంగ్లీషు కూడా నేర్పుతున్నట్టు వాటికి ఇన్ఫర్మేషన్ లేదు.

బోరతోడేలుకు చిర్రెత్తుకొచ్చింది. తోడేలు ముందు మేకపిల్ల నోరు తెరచి మాట్లాడడమే నేరం. తర్కం  మాట్లాడడం  ఇంకా పెద్ద నేరం. ఇంగ్లీషులో మాట్లాడడం ఇంకాఇంకా పెద్ద నేరం.

ఒక బుజ్జి మేకపిల్ల ఇన్ని నేరాలు ఒక్కసారిగా చేసేస్తుంటే   ఆ బోర తోడేలుకు పట్టరానంత కోపం వచ్చింది.

లోకంలో ఎవరి రాజ్యంలో వాళ్ళు నేరాలు చేసుకుంటారు. అది రివాజు. అలాగే తోడేళ్ళ రాజ్యంలో తోడేళ్ళే నేరాలు చేసుకుంటాయి. అది సాంప్రదాయం. కానీ, తోడేళ్ళ రాజ్యంలో  మేకలు నేరాలు చేస్తానంటే మాత్రం కుదరదుఅది చట్టం.

రేయ్పిల్ల మేకా! ప్యాసింజర్ రైల్లో సీట్లే కాదురా ఈ రాజ్యంలో ప్రతీదీ  తోడేళ్లకే రిజర్వ్ చేసిపెట్టారురాఅని జ్ఞానబోధ చేసింది బోరతోడేలు.

వివాదం ముదురుతున్నట్టు పిల్లమేకలకు నెమ్మదిగా అర్ధమయింది. సీట్లు వదిలేద్దాం అన్నట్టు ఆ  పిల్ల మేకల్లో పెద్ద మేక మిగిలిన పిల్ల మేకలకు సౌంజ్ఞలు చేసింది. వెంటనే ఇంకో రెండు పిల్లమేకలు బట్టల సంచులు, టిఫిన్ బాక్సులు పట్టుకుని లేచి నిలబడ్డాయి.  

బుజ్జి పిల్లమేక లేవలేదు. బట్టల క్యారీ బ్యాగ్ ను, టిఫిన్ బాక్సును ఒళ్ళో గట్టిగా అదిమి పట్టుకుని కూర్చుంది.

అవమానం చిత్రమైన బాక్టీరియా లాంటిది. చదువుకోని మొద్దులకు అవమానం జరిగినా జరిగినట్టే తెలీదు. చదువుకున్న సున్నితులకు మాత్రం  అవమానం జరక్కముందే జరుగబోతున్నట్టు తెలిసిపోతుంది. బుజ్జి పిల్లమేక చదువుకోవడం తప్పయింది. తనకు అవమానం జరిగిందని దానికి అర్ధం అయింది. అది లేవనని మొండికేసింది

“సార్ !  మీకు సీట్లేగా కావలసిందీ? మా ముగ్గురి సీట్లో మీరే కూర్చోండి” అంది ఆ  పిల్లమేకల్లో పెద్ద మేక.

అప్పుడయినా ఆ బోరతోడేలు శాంతిస్తుందని పెద్ద మేకపిల్ల  అనుకుంది. కానీ, శాంతి ప్రతిపాదన బోరతోడేలుకు నచ్చలేదు.
అది బిగ్గరగా నవ్వింది.

“ తోడేళ్ళ రైలులో  ఒక మేక పిల్ల ఒక తోడేలుకు సీట్లు దానం చేస్తుందట!”  అంటూ అది ఇంకోసారి నవ్వింది.  

మూడు సీట్లు దక్కినందుకు దానికి ఏమాత్రం ఆనందంగాలేదు. ఆ బుజ్జిమేక పిల్ల అదురూ బెదురూ లేకుండా కూర్చోవడం దానికి అవమానంగా వుంది.

లేవరాబోరతోడేలు గట్టిగా ఊళ వేసింది

తోడేళ్ళు అంత గట్టిగా ఊళవేస్తే కొమ్ములు తిరిగిన పెద్దపెద్ద మేకలే భయంతో వణికిపోతాయి. కానీ బుజ్జి మేకపిల్ల తొణకలేదు.
 లేవనుఅంది.  

బుజ్జి మేకపిల్ల మొండి ధైర్యానికి మిగిలిన మూడు మేకపిల్లలు కంగారు పడ్డాయి.

హర్యాణా నేల మీద ఆ రైలుపెట్టెలో  బోరతోడేలు పరువుపోయింది
క పెద్ద తోడేలుకు ఒక పిల్లమేక ఎదిరించి జవాబు చెప్పేసింది.

తను అవమానిద్దామనుకున్నమేకపిల్లే తనను అవమానించడంతో బోరతోడేలు ఖంగు తిన్నది. తన గుంపు మనోభావాలను  తెలుసుకోవడానికి అది ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. బోరతోడేలుతో వచ్చిన  గుంపుతోపాటు పెట్టెలో వున్న తోడేళ్ళన్నీ ధర్మం దారి తప్పినట్టు  ఆవేశంతో ఊగిపోతున్నాయి.

దారితప్పిన ధర్మాన్ని తిరిగి పట్టాలు ఎక్కించే బాధ్యత ఇప్పుడు తన భుజాల మీదే వుందనుకుంది బోరతోడేలు. ఇక ఆ బుజ్జి మేకపిల్ల పని పట్టాలనుకుంది. రిజర్వేషన్ పాచిక పారక పోవడంతో కొత్త పాచికను బయటికి తీసింది.

తోడేళ్ళకు తెలివి తక్కువగానూ అతితెలివి ఎక్కువగానూ వుంటుంది. అలాగే తర్కం తక్కువగానూ కుతర్కం ఎక్కువగానూ వుంటుంది.

ఆ టిఫిన్ బాక్సు మూత తీసి చూపించుఅంది అధికార స్వరంతో.
తోడేళ్ళ రాజ్యంలో ప్రతితోడేలు తానే ఒక పోలీసు అనుకుంటుంది.
దేనికీ?” అనడిగింది బుజ్జి మేకపిల్ల.
నేను చూడాలి
బోరతోడేలు వైపు బుజ్జి పిల్లమేక తీక్షణంగా చూసింది.
కొన్ని సందర్భాల్లో కొన్ని చూపులకు చాలా అర్ధాలు వుంటాయి. కొందరు నోరు మెదపకుండానే చాలా మాట్లాడేస్తారు.
 “నా టిఫిన్ బాక్సు చూడ్డానికి నువ్వెవరుచెకింగ్ అధికారివాఐడెంటిటీ కార్డు వుందా? వుంటే చూపించువగయిరా పది ప్రశ్నలు వరుసపెట్టి అడిగేశాయి ఆ బుజ్జి మేకపిల్ల చూపులు.
ఆ చూపుల్ని బోరతోడేలు తట్టుకోలేకపోయింది.
దానికి ఉక్రోషం పొంగుకొచ్చింది.

ఏముంది అందులో?” మళ్ళీ గదమాయించింది.
మా భోజనం
మాంసమా?”
మేము మాసం తినం
మీ నాన్న తినేవాడా
మా నాన్న కూడా తినడు

రైలు ఫరీదాబాద్ న్యూటౌన్ స్టేషన్ లో ఆగింది.
పెట్టెలో ఉత్కంఠ పెరిగి ఉద్రిక్తంగా మారింది.

మరో డజను తోడేళ్ళు ఆ పెట్టెలో ఎక్కాయి. బోరతోడేలుకు మందిబలం అంతకంతకూ పెరుగుతోంది. బుజ్జిమేకపిల్ల జట్టుబలం అంతకంతకూ తగ్గుతోంది.

పోనీ మీ తాత, వాడూ కాకపోతే మీ ముత్తాత, వాడూ కాకపోతే వాళ్ల తాత. మాంసం తినేవారా? కాదా?” గట్టిగా ఊళవేస్తూ  అడిగింది బోరతోడేలు.

మేకలు ఎప్పుడూ మాంసం తినవు. మేక మాంసాన్నే తోడేళ్ళు తింటాయిఅనేసింది బుజ్జి మేకపిల్ల.

రైలు పెద్ద కుదుపుతో బయలుదేరింది.

బోరతోడేలు బిత్తరపోయింది. ఇంత చిన్న మేకపిల్ల అంత పెద్ద మాట అనేస్తుందని అది అనుకోలేదు. తన మీదే కాదు ఏకంగా తోడేలు జాతి మీదే నింద వేసేసింది ఓ పిల్లమేక.

హర్యాణా గాలిని ఛాతీ నిండా గట్టిగా పీల్చుకుని నిటారుగా నిలబడింది బోరతోడేలు. దాని ఛాతీ అసలే అరవై అంగుళాలు. కొలవాలంటే ఒక టేపు పూర్తిగా కావాలి.

మాటల యుధ్ధంలో గెలవలేనపుడు తోడేళ్ళు ఈటెల యుధ్ధం మొదలెడతాయి.
ముంచుకు వచ్చేస్తున్న ప్రమాదాన్ని మిగతా  మేకపిల్లలు పసికట్టాయి. బుజ్జి మేకపిల్ల చేయిపట్టుకుని డోరు వైపుకు లాక్కెళ్ళిపోయాయి.  

ఆ కంగారులో అవి ఢిల్లీలో కొన్న పండగ బట్టల్నీ, ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ బాక్సుల్ని కూడా పెట్టెలో వదిలేశాయి. వేగాన్ని పుంజుకుంటున్న రైల్లో నుండి వేగంగా దిగిపోయి అంతే వేగంగా వెనక పెట్టెలోకి ఎక్కేశాయి.

కొత్తపెట్టెలో కూర్చోవడానికి సీటు దొరక్కపోయినా తలదాచుకోవడానికి ఇంత చోటు దొరికింది. గండం గడిచినందుకు ఆ నాలుగు పిల్లమేకలూ గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక్కసారి నిట్టూర్చాయి. తల పైకెత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.

దేవుడు గొప్పవాడు అనడానికి మేకలు  అల్లాహో అక్బర్అంటాయి

లోకంలో ఎవరి భాష వారికి వుంటుంది. తోడేళ్ళ భాష మేకలకు అర్థం కాదు. మేకల భాష తోడేళ్ళకు అర్థంకాదు. మేకలు దేవుడ్ని తలుచుకున్నప్పుడల్లా తోడేళ్ళకు తెగ అసహనంగా వుంటుంది.  రాజ్యంలో మళ్ళీ అక్బర్ చక్రవర్తి పాలన రావాలని మేకలు కోరుకుంటున్నట్టు  తోడేళ్ళకు అనుమానం వస్తుంది.   

పరుగెత్తుకు  వచ్చిన ఆయాసం తీరేలోగానే మేకపిల్లలకు మరో ఆపద ముంచుకు వచ్చింది. ఆ పెట్టెలోనూ నిండా తోడేళ్ళే వున్నాయి. తోడేళ్ళ ముందు మేకలు తమ దేవుడ్ని తలుచుకోవడం ఎంత పెద్ద తప్పో  ఆ  పిల్ల మేకల్లో పెద్ద మేకకు గుర్తుకు వచ్చింది.

వచ్చేది బల్లభ్ ఘర్. మనం అక్కడ దిగిపోయి అసౌటీ వరకు నడిచిపోదాం. పది కిలోమీటర్లు. అయినాపరవాలేదుఅంది ఆ  పిల్ల మేకల్లో పెద్ద మేక. మిగతా మేకపిల్లలు సరేనంటూ తలాడించాయి.

 అది చాలా జాగ్రత్తలు తీసుకునే తన మాటలు ఇతర ప్యాసింజర్లకు వినపడకుండా చాలా నెమ్మదిగా చెప్పింది. అయితే, తోడేళ్ళకు మేకల లిప్ రీడింగు వచ్చని దానికి తెలియదు.

బల్లభ్ ఘర్ వచ్చేసింది. బండి పూర్తిగా ఆగక ముందే మూడు పిల్లమేకలు రైలు దిగేశాయి. బుజ్జి మేకపిల్ల రైలు దిగబోతుండగా ముందు కంపార్టుమెంటులోని తోడేళ్ళ గుంపు అక్కడికి వచ్చేసి వాళ్ళను చుట్టు ముట్టింది.

పది తోడేళ్ళు బుజ్జి మేకపిల్ల రెక్కలు పట్టి గాల్లోకి ఎత్తి తమ పెట్టెలోకి విసిరి పడేశాయి

ప్లాట్ ఫామ్ మీదున్న  మూడు పిల్లమేకలు భయపడిపోయి మే...మే.. అంటూ అరవడం మొదలెట్టాయి. పిల్ల మేకల్లో పెద్ద మేక పిల్ల పరుగు పరుగున వెళ్ళి అక్కడే నిలబడివున్న రైల్వే పోలీసుకు కంగారు కంగారుగా విషయం చెప్పింది.  బుజ్జి మేకపిల్లను కాపాడమని బతిమిలాడింది. మిగిలిన రెండు మేక పిల్లలు కూడా వచ్చి  రైల్వే పోలీసు కాళ్ళు పట్టుకుని ఏడ్వడం మొదలెట్టాయి.

రైల్వే పోలీసు అధికారి దుస్తుల్లోవున్న తోడేలు ఆ మేకపిల్లల్ని చూస్తూ చిద్విలాసంగా ఊళ వేసింది.
ఈలోగా రైలుబండి కూడా ఊళ వేసుకుంటూ  బయలు దేరింది.

మూడు పిల్లమేకలు యూనిఫామ్ లో వున్న తోడేలు దగ్గర వుండిపోయాయి.
బుజ్జి మేకపిల్ల పౌరదుస్తుల్లో వున్న తోడేళ్ళ మధ్య వుండిపోయింది.   

బండి వేగాన్ని పుంజుకుంది.
పరువుపోయిన రైల్లోనే  పరువు నిలబెట్టుకోవాలనుకుంది బోర తోడేలు.
శక్తి మేరకు దవడల్నితెరిచి నాలుకను బయటపెట్టి కోరలు చాచింది.

బుజ్జి మేకపిల్ల నిస్సహాయంగా తల దించుకుని నిలబడింది.

ప్రాణభయంతో వేట విలవిల్లాడుతున్నప్పుడు తోడేళ్లకు మహదానందంగా వుంటుంది. అలాంటి ఆనందాతిశయంతో చుట్టూ నిలబడిన సాటి తోడేళ్ళను ఒకసారి చూసింది బోరతోడేలు.

నువ్వు ధర్మాన్ని కాపాడు. ధర్మం నిన్ను కాపాడుతుందిఅంటూ గొంతు కలిపి ఊళలు వేయడం మొదలెట్టాయి పెట్టెలోని తోడేళ్ళు.

ఖాకీ దుస్తులేసుకుని పోలీసు అధికారులుగా వున్నా, నల్లగౌను తొడుక్కొని న్యాయమూర్తులుగా వున్నా, సూటు బూట్లేసుకుని జిల్లా కలక్టరుగా వున్నా,  మామూలు దుస్తులేసుకుని ప్రయాణికుల్లా వున్నా తోడేళ్ళ రాజ్యంలో అన్ని వేషాల్లోనూ తోడేళ్ళే వుంటాయి.

అయితే, తోడేళ్ళలోనూ కొన్ని మంచి తోడేళ్ళు వుంటాయి.  కానీ, ఆ జాతి తోడేళ్ళు ఇప్పుడు మేకలకన్నా వేగంగా అంతరించి పోతున్నాయిఅలాంటి తోడేలు  ఆ రోజు ఆ పెట్టెలో ఒక్కటీ లేదు.

ఒకడ్ని చంపితే హత్య, వంద మందిని చంపితే యుధ్ధం అని మధ్యయుగాల రాజులు అనుకునేవారు.
ఇప్పుడు కూడా చట్టాలు  పెద్దగా మారలేదు.
ఒక్కడే వెళ్ళి ఒకడ్ని చంపితే హత్య అవుతుంది.
వందమంది గుంపుగా వెళ్ళి ఒకడ్ని చంపితే దొమ్మి అవుతుంది
దొమ్మీ హత్యల్లో నేరం తక్కువ, శిక్ష తక్కువ, ఫలితం ఎక్కువ.

రైలు ఇంకా వేగాన్ని పుంజుకుంది. ఇంన్ గట్టిగా ఊళ వేస్తోంది.

బుజ్జి మేకపిల్లను రెండు చేతులతో గాల్లోకి  ఎత్తి, కోరలు చాచి, నోటి దగ్గరికి తీసుకుంది బోరతోడేలు.

మృత్యుకోరల్లో చిక్కుకున్న ఆ పిల్లమేక ముందుకాళ్ళ చిట్టి గిట్టలతో గట్టిగా కళ్ళు మూసుకుంది.
పండగ కోసం తల్లి మేక పెట్టిన గోరింటాకు  దాని చిన్ని గిట్టల మీద ఎర్రగా మెరుస్తోంది.
కొందరు భయం వేసినపుడు కళ్ళు మూసుకుంటారు.
కొందరు చిత్రహింసల్నితట్టుకోలేక కళ్ళు మూసుకుంటారు.
కానీ, భూమి మీద రాక్షసత్త్వాన్ని చూడలేక బుజ్జి మేకపిల్ల కళ్ళు మూసుకుంది.

తోడేళ్ళ రాజ్యంలో తోడేళ్ళ ధర్మం మాత్రమే వుంటుంది.

పెట్టెలోని తోడేళ్ళన్నీ కోరలు చాచి, నాలుకల్ని బయటపెట్టి, ఊళ వేస్తూ బోరతోడేలు చుట్టూ మూగాయి.

ఆ తరువాత ఏం జరిగిందో ....
ఆ రైలు వేగంలో కనిపించలేదు.
ఆ తోడేళ్ళ  ఊళల్లో వినిపించలేదు.

ఆ తరువాతి స్టేషన్ అసోటీ.

వంటి నిండా గాయాలతో నెత్తుటి ముద్దలా మారిన బుజ్జి మేకపిల్ల విసిరిన బంతిలా వచ్చి ప్లాట్ ఫామ్ మీద దబాలున పడింది.

మంచి తోడేలు ఒక్కటయినా ఆ ప్లాట్ ఫామ్ మీద కనిపిస్తుందన్న ఆశతో అది కళ్ళు పెద్దగా చేసి చూసింది.  రెండు మంచి తోడేళ్ళు అక్కడికి   చేరుకున్నాయిగానీ ఈలోపే బుజ్జిమేకపిల్ల కళ్ళు తెరిచే ప్రాణాలు వదిలింది.  

నేర పరిశోధన అధికారులకు ఇప్పుడు ఒకటే సందేహం;
బుజ్జి మేకపిల్ల రైల్లో చచ్చి, ప్లాట్ ఫామ్ మీద పడిందా?
రైల్లో నుండి పడి, ప్లాట్ ఫామ్ తగిలి చచ్చిందా? అని

అలాంటి సందేహాలులేని తోడేళ్ళ బండి గట్టిగా ఊళ వేసుకుంటూ ముందుకు సాగిపోయింది.

హైదరాబాద్

6 జులై 2017