Tuesday 18 February 2014

కరిగిన కల – కళ్ళెదుట నిజం!

కరిగిన కల – కళ్ళెదుట నిజం!   

ఏ. యం. ఖాన్ యజ్దాని (డానీ)


  తెలంగాణ అవిర్భవించింది. సమైక్య తెలుగురాష్ట్రం అధ్యాయం ముగిసింది.  ఇప్పుడు ఆరంభం అవ్వాల్సింది సీమాంధ్ర హక్కుల సాధన ఉద్యమం.

  తెలంగాణ అకాంక్ష  దాదాపు ఆరు దశబ్దాలుగా ఆ ప్రాంత ప్రజల్లో కొనసాగుతోంది, తరచూ  ప్రశాంతంగానూ, అంతర్లీనంగానూ, అప్పడప్పుడు వుధృతంగానూ కొనసాగిన ఆ వుద్యమం అంతిమంగా గమ్యానికి చేరుకుంది. సీమాంధ్రలో హక్కుల సాధన వుద్యమం చాలాకాలం క్రితమే ఆరంభం కావల్సివుండింది. కానీ, దాన్ని సమైక్యాంధ్ర భావుకత మింగేసింది.

  ప్రతి ఉద్యమంలోనూ సహజంగానే భావోద్వేగాలుంటాయి. ప్రజల భావోద్వేగాలని ఆచరణ సాధ్యమైన కోరికలుగా మార్చి, ఉద్యమాన్ని గమ్యానికి చేర్చడమే నాయకత్వం చేయాల్సినపని.  కేవలం భావోద్వేగాలు ఎన్నడూ ఏ ఉద్యమాన్నీ గమ్యానికి చేర్చలేవు. భావోద్వేగాలు ఆచరణాత్మక కోరికలుగా మారి, వాటికి సర్వత్రా ఆమోదాంశం లభించినపుడే అవి గమ్యం చేరుకోవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజల  భావోద్వేగాల్ని  "నీళ్ళు, నిధులు, నియామకాలు" అనే మూడు లౌకిక కోరికల రూపంలోనికి మార్చింది ఆచార్య జయశంకర్. దాన్ని గమ్యానికి చేర్చింది కేసిఆర్. ఈ సుదీర్ఘ ప్రక్రియకు తోడ్పడిన పాత్రధారులు, సూత్రధారుల జాబితా చాలా పెద్దదేవుంది.

  రాయలసీమ, తీరాంధ్ర ప్రజలకూ లౌకిక కోరికలు అనేకం వున్నాయి. విద్యా, వైద్య సౌకర్యాలు, ఉపాధికల్పన అవకాశాలు, సాగునీటి హక్కుల పరిరక్షణ మొదలయిన జాబితా చాలానేవుంది. మొదటి నుండీ రాజధాని అంశంతోసహా ఈ ఆంశాలన్నింటినీ చాలా మంది ప్రస్తావిస్తూనే వున్నారు. కానీ, హఠాత్తుగా ఎగువ నుండి సమైక్యవాదం ప్రవేశించి, లౌకిక కోర్కెల్ని తుఛ్ఛమైనవిగా కొట్టిపారేసి,  భావోద్వేగాలని రెచ్చగొట్టింది. అయినప్పటికీ ఆర్థిక అంశాల్ని చాలామంది చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు. పైన్నుండి దిగిన సమైక్యాంధ్ర హోరులో వాళ్ళ గొంతు అణగారిపోయింది.

  సమైక్యవాదం అంటేనే తెలీని సీమాంధ్రులకు తానే దాన్ని నేర్పించానని  నిన్నమొన్నటి వరకు ఒకాయన గొప్పగా చెప్పుకునేవారు. ప్రస్తుతం వారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు కనుక వారి విషయాన్ని వదిలేసి ఈ నినాదంలోని బూటకాన్ని ఇప్పుడైనా విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. సమైక్యవాదాన్ని సీమాంధ్రులకు నేర్పాలనుకోవడమే  మొదటి తప్పు.  సమైక్యం అన్నప్పుడు అన్ని ప్రాంతాలవారినీ కలుపుకోగలగాలి ఒక ప్రాంతానికే పరిమితమైనపుడు సమైక్యానికి అర్ధమేవుండదు. అర్ధమేలేనిది ఎన్నడూ విజయాన్ని సాధించదు.   సమైక్యాంధ్ర అనడం మరో తప్పిదం. ఆంధ్ర అనే పదానికి చరిత్ర  పాఠాల్లోంచి ఉదాహరణలు చూపి ఎంత విస్తృత అర్ధాన్నైనా ఇవ్వవచ్చు.గానీ  ఉద్యమాల్లో చరిత్రకన్నా వర్తమాన అవసరాలే బలంగా పనిచేస్తుంటాయి. ఒకవైపు తెలంగాణవాళ్ళు తమ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నపుడు, మరోవైపు, కోస్తాతోకన్నా  తెలంగాణతో కలిసి రాయల తెలంగాణగా ఎర్పడడమే మేలు అని రాయలసిమవాళ్ళు  బాహాటంగా ప్రకటిస్తున్నపుడు ఆంధ్రా అనే పదం సంకుచితమైపోతుందని గమనించకపోవడం ఘోరతప్పిదం.

సీమాంధ్ర అనే పదం కూడా సమగ్ర ప్రాతినిథ్యం వహించేదికాదు. ఇందులో ఆంధ్రా ఒక్కటే నిర్ధిష్ట నామవాచకం. సీమ అనేది రాయల సీమకు మాత్రమే ప్రత్యేకంగా ప్రాతినిథ్యం వహించే పదం ఏమీకాదు. సీమ అంటే కోనసీమ కావచ్చు, పట్టిసీమ కావచ్చు, నడిగడ్డసీమ కావచ్చు రాయలసీమ కూడా కావచ్చు.  ఇంతకీ సీమాంధ్రలో సీమ అంటే రాయలసీమ అనుకుంటే ఆంధ్ర అనేది కోస్తా ప్రాంతమనేగా అర్ధం. మూడు ప్రాంతాలు కలిసికట్టుగా ఒక రాష్ట్రంగా వుండాలనుకున్నప్పుడు ఒక ప్రాంతం పేరునే మిగిలిన ప్రాంతాలకు ఎలా పెడతారూ? ఒకవైపు రాయల తెలంగాణ అంటున్నపుడు రాయల ఆంధ్రా అంటే బాగుండేది. ప్రస్తుతం  సీమాంధ్రగా పిలుస్తున్న ప్రాంతాన్ని ఇక ముందయినా  రాయలాంధ్ర అనిపిలవాలి. 1956 లో ఏర్పడిన  ఆంధ్రప్రదేశ్ పేరులో తెలంగాణకి ప్రాతినిథ్యం లేకపోవడం కూడా విభజన ఉద్యమం తలెత్తడానికి అనేకానేక కారణాల్లో ఒకటి.

  అయితే,  ఆర్ధిక, లౌకిక దృక్పథాలతోనేకాక, భావోద్వేగాలతో సమైక్యవాదాన్ని నమ్మినవాళ్ళూ తప్పకవుంటారు. దాన్ని  బూటకం అంటే వారి మనోభావాలు నిజంగానే దెబ్బతినవచ్చు.  అలాంటి వారికి ఒక మనవి. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక   ఏపి ఎన్జీవోల సంఘ నాయకులు ఏం చేస్తున్నారో గమనిస్తే చాలు ఈ నినాదం బూటకం సులువుగా అర్ధం అవుతుంది. సందట్లో సడేమియాలా, రాష్ట్రం విడిపోక ముందే అలవెన్సులతోపాటూ ఉద్యోగ విరమణ వయస్సును కూడా  పెంచుకోవాలనే ఆతృతలో ఏపి ఎన్జీవో నాయకులు  తీరికలేకుండా వున్నారు. వారం క్రితం వరకూ వాళ్ళే  సమైక్యవాదానికి "రియల్ హీరోలు" చెలామణి అయ్యారు.

  తెలంగాణలో ప్రజల ఆకాంక్షల్ని ఆ ప్రాంత నాయకులు  ఉద్యమ డిమాండుగా మారిస్తే, రాయలాంధ్రలో ఆ ప్రాంత నాయకులు తమ కోరికల్ని ఉద్యమ డిమాండుగా మార్చారు. ప్రధానంగా ఈ అంశమే విభజన, సమైక్య ఉద్యమాల భవిష్యత్తుని నిర్ణయించింది. ప్రజలు రాయాల్సిన చరిత్రను పాలకవర్గాలు రాశాయి.  పాలకవర్గాలు రాసిన చరిత్రకు అనేక వెర్షన్లు వున్నాయి. ఒక వెర్షన్ ప్రకారం ఈ కథ 2004 ఎన్నికలకు ముందు మొదలై 2014 ఎన్నికల ముందు ముగిసింది. ఇంకో వెర్షన్ ప్రకారం 2009లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి పుట్టిన రోజున ఆరంభమై, 2014లో టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ పుట్టిన రోజున ( మరీ కఛ్ఛితంగా చెప్పాలంటే ఆ మరునాడు) ముగిసింది. మూడో వెర్షన్ ప్రకారం ఈ కథ రాజకీయ నాయకునిగా మారిన సీమాంధ్ర పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ సమైకాంధ్ర భావోద్వేగాన్ని సృష్టించడంతో  మొదలై, ఆయన రాజకీయసన్యాసంతో ముగిసింది.

ప్రతి జాతినీ ఉధ్ధరించడానికి ఒక అంబేడ్కర్ పుట్టినట్టు ప్రతిజాతిలోనూ దాన్ని అప్రతిష్టపాలు చేయడానికి  "ఖాసిం రిజ్వీ" ఒకడు పుడుతుంటాడు. దురదృష్టావశాత్తు రాయలాంధ్రలో చాలామంది ఖాసీం రజ్వీలు పుట్టారు. ఆ పలితాలని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.

  విభజన ప్రక్రియ మొదలయ్యాక రాజధాని ఎక్కడ? నిధులెక్కడా? ఉద్యోగాలు ఎక్కడా? నీళ్ళెక్కడా?  అని నిన్నటి మహానాయకులంతా ఇప్పుడు అమాయిక ముఖం పెట్టి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇంతకు ముందే ఈ ప్రశ్నల్ని అడిగినవాళ్లను  ఈ మహానాయకులే  విభజనవాదులని ముద్రవేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. "సమైక్యవాదం నినాదంకాదు; విధానం" అంటూ విరుచుకుపడ్డారు.  ఇందులో ఆసక్తికర అంశం ఏమంటే రాయలాంధ్రలో సమైక్యవాదానికి భిన్నమైన స్వరాన్ని వినిపించినవాళ్ళలో అత్యధికులు ఎస్సీ, యస్టీ, బీసీ, మతాల్పసంఖ్యాక వర్గాలవాళ్ళు.. విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశిస్తున్నపుడు అంతిమ పోరాటంగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన మహాధర్నా వేదిక నుండి మాట్లాడుతూ,  కిషోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మీ, చింతా మోహన్‌లను క్షమించేదిలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మణిక్యవరప్రసాద్, పీ. బాలరాజు కూడా సమైక్యవాదుల ఆగ్రహానికి గురయ్యారు. దీనినిబట్టి రాయలాంధ్రలో  సామాజికవర్గాల విభజన ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించడం కష్టం ఏమీకాదు. ఇప్పటివరకు  రాయలాంధ్రను వరకు ఏలినవారి హోరు చల్లబడింది కనుక సమీప భవిష్యత్తులో అక్కడ బలహీనవర్గాల గొంతు బలంగా వినిపించవచ్చు.

సీమాంధ్రలో ఇప్పటివరకు సాగినదానికన్నా రసవత్తరమైన  రాజకీయం ఇక ముందు వుధృతం కానుంది. వారం క్రితం వరకూ  సమైక్య ఆదర్శాన్ని వల్లించినవాళ్ళు సహితం ఇప్పుడు "తేడావస్తే రక్తపాతం సృష్టిస్తాం" అంటున్నారు. సంయుక్త తెలుగు రాష్ట్రంలో  నిన్నటి వరకు హైదరాబాద్ కోసం సాగిన యుధ్ధం ముగిసి, ఇప్పుడు రాయలాంధ్రలో రాజధాని నగరం కోసం పోరు మొదలయింది. రాయలసీమ _ కోస్తాంధ్ర ప్రాంతంలో రాజధాని నగరం అనగానే గుర్తుకు వచ్చే నగరాలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. ఇవికాక, విస్తారమైన ప్రభుత్వ భూములున్న అనేక పట్టణల పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రతి పట్టణానికీ తనదైన చరిత్ర,, సంస్కృతి, భౌగోళిక సౌకర్యాలేకాక, రాజకీయ కోణాలు సామాజికవర్గాల సమీకరణలు వున్నాయి. కొందరయితే తిరుపతి, వినుకొండ విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా తమ వాదనకు వత్తాసుగా ఉటంకిస్తున్నారు. 



రాయలాంధ్రులకు హైదరాబాద్ ఒక అందమైన కలేకావచ్చుగానీ, అదినేర్పిన కొన్ని చేదు పాఠాలున్నాయి.  అభివృధ్ధి కేంద్రీకరణ సృతి మించితే, అది అసమానతలకూ వివాదాలకూ, వినాశనానికి దారి తీస్తుందని హైదరాబాద్ అనుభవం చాటిచెప్పింది. మళ్ళీ ఆ పొరపాటు జరగ కూడదు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటూ ఉత్తర సర్కారు, రాయలసీమ ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీలు రానున్నాయి. ఒక ప్రాంతంలో అభివృధ్ధి ప్యాకేజీలు, మరో ప్రాంతంలో సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇంకో ప్రాంతంలో హైకోర్టు, మరోచోట జాతీయ విద్యాసంస్థలు నిర్మిస్తే అన్ని జిల్లాలూ సమానాభివృధ్ధి సాధించేందుకు వీలుంటుంది. ఇప్పుడు రాయలాంధ్రులు ఈ దిశగా ఆలోచన సాగించాలి. "తేడాలొస్తే ఫ్యాక్షనిజాన్ని పునరుధ్ధరిస్తాం" అని రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడు వుంటారు. ఇప్పుడు కావల్సింది రెచ్చగొట్టే ప్రసంగాలుకాదు.; సమిష్టిగా అభివృధ్ధిని సాధించడం. మనలో చాలా మంది ఇన్నాళ్ళూ కళ్ళు తెరచి చూడలేదుగానీ అభివృధ్ధిలో కొత్తపుంతలు తొక్కగల వనరులన్నీ రాయలాంధ్ర గడ్ద మీద వున్నాయి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

విజయవాడ
24   ఫిబ్రవరి  2014

ప్రచురణ :
ఆంధ్రప్రభ, ఎడిట్ పేజి, 26 ఫిబ్రవరి 2014


Wednesday 12 February 2014

మైకు ముక్క, పెప్పర్ స్ప్రే


మైకు ముక్క, పెప్పర్ స్ప్రే 
కాదేది ప్రతిదాడికి అనర్హం?  

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


మైకు ముక్క, పెప్పర్ స్ప్రే
కాదేది ప్రతిదాడికి అనర్హం?

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

సాంప్రదాయబధ్ధంగానో,  సాంప్రదాయ విరుధ్ధంగానో  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు - 2013 లోక్ సభలో ప్రవేశించేసింది. ఆ  విషయం లోక్ సభ అధికారిక  వెబ్ సైట్ లో  నమోదు అయిపోయింది. ఈ బిల్లు  పుట్టుక ఏమిటోగానీ దాని ప్రతీ కదలికాలోను మార్మికత  పుష్కలంగా  విస్తరిస్తోంది. రాష్ట్ర శాసనసభలో  బిల్లు పెట్టినపుడూ ఇలాంటి గందరగోళమే  చెలరేగింది. లోక్ సభలో బిల్లుపెట్టినపుడు అది పునరావృతమైంది. అయితే, రెండు సంఘటనల మధ్య ఒక గుణాత్మక తేడా వుంది. శాసనసభలో బిల్లును పెట్టినట్టు ప్రకటించిన  అప్పటి శాసన సభావ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, బిల్లును   ప్రవేశపెట్టినట్టు ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కమల్ నాథ్,  బిల్లు ప్రవేశాన్ని ధృవీకరించిన  లోక్  సభా స్పీకర్ మీరా కుమార్ ముగ్గురూ  యూపియే ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ఆశిస్సుల్ని  టోకుగా అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు మహాత్యం ఏమిటోగానీ దాని దెబ్బకు రాజకీయరంగం  అతలాకుతలమైపోతోంది. రాజకీయ పార్టీలు పార్టీల్లా వుండడంలేదు. రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లా వుండడంలేదు. దీనికి వామపక్షం, కుడిపక్షం అనే తేడాలేదు. ఏ పార్టీ అయినా ఒక్కటే. బీజేపి జాతీయ నాయకుడు యం. వెంకయ్య నాయుడిపై ఆ పార్టి తెలంగాణ శాసనసభ్యుడు యెన్నెం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు,  కమలవంశ భీష్ముడు  లాల్ కిషన్ అడ్వాణీ, రాజ్ నాధ్ సింగ్ ల మధ్య సాగుతున్న ప్రఛ్ఛన్న యుధ్ధం దీనికి తాజా ఉదాహరణైతే,  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినపుడు జరిగిన ముష్టియుధ్ధం దీనికి పరాకాష్ట.. ఎస్_కాంగ్రెస్, టి_కాంగ్రెస్  యంపీలు సోనియా గాంధి సాక్షిగా తలపడ్డారు. టీ_తమ్ముళ్ళు, ఎస్_తమ్ముళ్ళు తలపడ్డారు.

భారత పార్లమెంటు ప్రజాస్వామ్య చరిత్రలో ఫిబ్రవరి 13 బ్లాక్ డే అనడంలో ఎవ్వరికీ వీసమెత్తు అనుమానం కూడా లేదు. కానీ, ఆరోజు దాడి చేసిందెవరూ? దాడిపై  ప్రతిదాడి చేసిందెవరూ? అనే విషయంలో విభనవాదులు, సమైక్యవాదులిద్దరిదీ పొంతన కుదరని వాదన. విత్తు ముందా? చెట్టుముందా? అనేది తాత్విక సమస్య. కొందరికి చెట్టే ముందు అనిపించవచ్చు మరికొందరికి విత్తే ముందు అనిపించవచ్చు. ఎవరి దృక్పథం వారిది.  వాస్తవ నివేదిక ప్రకారం అయితే,  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతున్న సుశీల్ కుమార్ షిండేను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల్ని తెలంగాణ ఎంపీలు, మంత్రులు అడ్డుకున్నారు. ఈ అడ్డుకోవడం శృతిమించి కొట్టుకున్నారు. ద్వంద్వ యుధ్ధాలు, ముష్టి యుధ్ధాలు చేసుకున్నారు.

మొదటి నుండీ సమైక్యవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విజయవాడ యంపి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు  పెప్పర్ స్ప్రేకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.   పాతికేళ్ల క్రితం రాజీవ్ గాంధి హత్యకు గురైనపుడు ఆర్డీయస్ తో పాటూ లొట్టో రన్నింగ్ షూస్ ప్రాచూర్యంలోనికి వచ్చాయి. ఇప్పుడు బ్లాక్ డే సంఘటనతో పెప్పర్ స్ప్రేకు ఎక్కడలేని ప్రచారం వచ్చింది. నిర్భయ కేసు సందర్భంగా కూడా పెప్పర్ స్ప్రేకు రానంత ప్రచారాన్ని లగడపాటి పార్లమెంటు సాక్షిగా  కల్పించారు. రాజగోపాల్ క్రీడా సంఘాల్లోనూ క్రియాశీలంగా వున్నారు. వారు పార్లమెంటులో చెడుగుడు ఆడతామని ముందుగానే ప్రకటించారు. చెడుగుడులో కూత ఆపి  పెప్పర్ స్ప్రే చల్లవచ్చని ఇక ముందు కొత్త నిబంధనలూ రావచ్చు!

తెలంగాణ డిమాండు ముందుకు వచ్చాక అనేక వివాదాస్పద విలువలు పుట్టుకు వస్తున్నాయి. తెలంగాణ తల్లి బిడ్డలమైన తాము తెలుగు తల్లిని గౌరవించాల్సిన పనిలేదని (వీలైతే అవమానిస్తామని) టీ_జేయేసి ఛైర్మన్ కోదండరామ్ ఏడెనిమిదేళ్ళ క్రితం ఒక సంచలన ప్రకటన చేశారు. దానికి తార్కిక కొనసాగింపే ట్యాంకుబండ్ పై సీమాంధ్ర మహాపురుషుల విగ్రహల విధ్వంసం. తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు భారతదేశంలో ఎందుకు కలిసుండాలి? అని ఎస్_ తమ్ముళ్ళు కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నారు. భారత దేశం నుండి విడిపోయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్,  లా కొత్త దేశం ఏర్పాటు చేసుకుని, స్వంత పార్లమెంటు పెట్టుకుంటామని కూడా వాళ్ళంటున్నారు. "తెలంగాణపై యూ_టర్న్ లేదు. పార్టీ అధ్యక్షుడిగా చెపుతున్నాను. విభజన బిల్లుకు మేము మద్దతిస్తాము" అని కుండబద్దలుగొట్టిన బీజేపి అధినేత  రాజ్ నాథ్ సింగ్ పైన కూడా వాళ్ళు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయిన సమైక్యవాదం చివరకు దేశవిభజన వరకు చేరుకుంది. అతివాదం మితవాదం రెండూ ఒకటే అనడానికి ఇంతకన్నాగొప్ప ఉదాహరణ ఇంకేముంటుందీ?  భారత దేశం నుండి విడిపోతామని ఇంకెవరయినా ప్రకటించివుంటే కమలనాధులు ఈపాటికి ఉగ్రనరసింహులు అయిపోయేవారు. ఈసారి వాళ్ళు ఎస్_తమ్ముళ్లకు రాయితీ ఇచ్చినట్టున్నారు! వియ్యం పొందాలనుకున్నప్పుడు కొన్నింటిని సహించక తప్పదు. కొన్నింటిని వదులు కోకతప్పదు.

తొలుత వివాదాస్పందంగా కనిపించే ఇలాంటి డిమాండ్లు మారిన కాలంలో కొత్త విలువలుగానూ మారవచ్చు. తాము అణిచివేతకు గురవుతున్నామని భావించే ఏ సామాజికవర్గం కూడా ఇతర సామాజికవర్గాలను ప్రశాంతంగా వుండనివ్వదు. దానికి ఒక్కటే పరిష్కారం; అణిచివేతను అణిచివేయడం. అధికారంలో వున్నవాళ్ళకు అంతటి ఔదార్యం వుండదు. వాళ్ళు అణిచివేతను అణిచివేయడానికి బదులు అణగారిన వర్గాలని అణిచివేస్తారు.

రాష్ట్ర విభజన ఉద్యమంలో మొదటి ఘట్టంలో  జరిగిందే చివరి ఘట్టంలోనూ జరుగుతోంది. విభజనవాదుల మధ్య సమైక్యత పరిఢవిల్లుతుండగా, సమైక్యవాదుల మధ్య విభజన కొనసాగుతోంది. గురువారం లోక్ సభలో సాగిన భీభత్స ఘట్టంలోనూ, ఈ తేడా ప్రస్పుటంగా కనిపించింది. "తెలుగు ప్రజలు సమైక్యంగా వుంటే గెలుస్తారు; విడిపోతే ఓడిపోతారు అని పదేపదే చెప్పే సీమాంధ్ర నాయకులు ఆ విషయం తమకూ వర్తిస్తుందని గుర్తిస్తున్నట్టులేదు.

నాయకత్వంలో చీలిక వున్నప్పుడు ప్రజల్లో నిర్లిప్తత ప్రబలుతుంది. లోక్ సభలో తమ ప్రాంత ఎంపీల బహిష్కరణకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోల సంఘం ఇచ్చిన బంద్ పిలుపుకు సీమాంధ్ర ప్రజల నుండి నామమాత్రపు స్పందన మాత్రమే వచ్చింది. ప్రజల నిర్లిప్తత కారణంగా శుక్రవారం నాటి బంద్ కొన్ని పార్టూలు, సంఘాలు, నాయకుల సంస్థాగత వ్యవహారంగా మాత్రమే సాగింది. పైగా ఈ బంద్ లో నాయకుల మీద  కొన్ని ప్రతికూల సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఎస్ _కాంగ్రేస్ ప్రజాప్రతినిధులు తమ టీమ్ కెప్టెన్ గా భావిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను పలుచోట్ల టిడిపి నేతలు దహనం చేశారు.  కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల్ని ఏయూ విద్యార్ధి జేయేసి నేతలు తగలబెట్టారు.  ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతల స్వంత జిల్లా మాత్రమేగాక, ఇటీవల జగన్ రెండు నెలలపాటు సమైక్య శంఖారావాన్ని పూరించి వచ్చిన చిత్తూరు జిల్లాలో బంద్ కు నామమాత్రపు స్పందన కూడా రాలేదు.  లోక్ సభ సంఘటనతొ పెప్పర్ స్ప్రే వీరునిగా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ స్వంత నియోజకవర్గం విజయవాడలో బంద్ పాక్షికం అనదగ్గ స్థాయిలో కూడా జరగలేదు. దీనిని్బట్టి సీమాంధ్ర నాయకుల చేష్టలతో ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల నిర్లిప్తకు మరో కారణం కూడా వుండవచ్చు. విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశించకుండా తమనాయకులు అడ్డుకుంటారని సీమాంధ్ర ప్రజలు నమ్మకంతో వున్నారు. బిల్లు లోక్ సభలో ప్రవేశించడంతో ఇక సమైక్య అధ్యాయం ముగిసిందని కూడా వాళ్ళు ఓక నిర్ణయానికి వచ్చివుండవచ్చు.

సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభ ప్రవేశం  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిష్క్రమణకు ద్వారం తెరిచింది. . రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన  బిల్లునే పార్లమెంటులో పెడితే ముఖ్యమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేస్తానని వారు భీషణ ప్రతిజ్ఞ చేసివున్నారు. పంతం కోసమే కావచ్చుగానీ, రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన  బిల్లునే కామా, ఫుల్ స్టాప్ కూదా మార్చకుండా లోక్ సభలో ప్రవేశపెట్టించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి. ఇక ముఖ్యమంత్రి తన  ప్రతిజ్ఞను పాటించడం\మే తరువాయి!

నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రాజీనామా వ్యవహారం "గోడమీద రేపు" గా  సాగుతోంది. ముఖ్యమంత్రి వికెట్టు కూడా పడేసుకుంటే వెంటనే  పిచ్ మీద స్టంపులు పీకేసి ఆట అయిపోయింది అని ప్రకటించేస్తారని ఎస్_కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్ళు సీయం కుర్చీని మాత్రం వదలవద్దని కిరణ్ కుమార్ ను కోరుతూ వుండవచ్చు.

సరిగ్గా ఈ సంధి దశలోనే  సీమాంధ్రలో సరికొత్త రాజకీయం ఊపిరి పోసుకునే అవకాశం వుంది. ఏందుకంటే, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు సీమాంధ్రలో తమకుతామే సమైక్య వీరులమని ప్రచారం చేసుకుంటూ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో వున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేనపుడు ప్రజల దృష్టిలో వీరులుకాస్తా, పరాజితులు అవుతారు. చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది. పరాజితుల్నికాదు! పరాజితులు ముందు తాము ఓడిపోయి, తమను నమ్మినవాళ్లనూ ఓడిస్తారు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
14  ఫిబ్రవరి  2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
16   ఫిబ్రవరి  2014

రాష్ర్ట విభజనలో నాలుగు స్తంభాలాట!


రాష్ర్ట విభజన రాజకీయంలో నాలుగు స్తంభాలాట!

. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
 
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై దేశరాజధానిలో  నాలుగు స్థంభాలాట సాగుతోంది.  రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం, కాంగ్రెస్ కేంద్రకార్యాలయం, బీజేపి కేంద్రకార్యాలయంల చుట్టూ  విభజన వివాదం తిరుగుతోంది. విభజనవాదులు దీన్ని రాజకీయ అంశంగా భావించి, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపి అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ లను నమ్ముకుని ముందుకు సాగుతుంటే,  సమైక్యవాదులు దీన్ని రాజ్యాంగ ప్రక్రియగా భావించి రాష్ట్రపతి ప్రభన్ ముఖర్జీ పై వత్తిడి పెంచే పనిలో వున్నారు.
 
సీమాంధ్ర నేతల వ్యూహాలు ఎత్తుగడల్లో మొదటి నుండీ ఒక  అసంబధ్ధత కనిపిస్తూవుంది. మబ్బుల్లో నీళ్లని చూసి వాళ్ళు ముందుగా ముంత వలకబోసుకుంటారు. అవి కురిసే మబ్బులు కావని ఆలస్యంగా తెలుసుకుని, ఒకలబోసుకున్న నీళ్లను ముంతలో నింపడానికి ఇసకను పిండుతుంటారు.  అనుమానం వున్నవాళ్ళు నివృత్తి కోసం ఓ యాభై రోజులు వెనక్కి వెళితే చాలు. అంధ్రప్రదేశ్ పునర్  వ్యవస్థీకరణ బిల్లు  2013 రాష్ట్ర అసెంబ్లీకి చేరిన రోజు జరిగిన పరిణామాల్ని అప్పుడే ఎవరూ మరిచిపోయివుండరు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, కుర్చీలు విరగొట్టడాలూ, వెల్ లోనికిపోవడాలూ,  స్ఫీకర్ పోడియంను చుట్టుముట్టడాలూ, సభాకార్యక్రమాలను స్థంభింపచేయడాలు, స్పీకర్ మైకు విరగ్గొట్టడాలు ఎప్పుడూ జరిగేవే! ఆరో కొన్ని పరిణామాలు  అదనంగా కొత్తగా జరిగాయి.  సభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన బిల్లు ప్రతుల్ని కొందరు కాళ్ల కిందపెట్టి తొక్కేశారు. కొందరు. కొందరు ప్రతుల్ని చించి గాల్లోకి ఎగరేశారు, కొందరు చించిన ముక్కల్ని స్పీకర్ మొఖాన్న కొట్టారు. కొందరయితే  మీడియా పాయింట్ వద్ద బిల్లు ప్రతుల్ని తగలబెట్టారు.
 
ఇదేదో క్షణికోద్రేకంలో జరిగిన సంఘటనలు కావు. దాదాపు నెలరోజుల తరువాత జరిగే సంక్రాంతి పండగ సందర్భంగా బిల్లు ప్రతుల్ని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలని. ఏపీ ఎన్జీవోల సంఘం అగ్రనేత పరుచూరి అశోక్ బాబు పిలుపునిచ్చారు. దాన్ని చాలామంది నాయకులు ఆచరించడమేగాక, తమ పోరాటశీలతను చాటుకోవడానికి మీడియా కవరేజీని కూడా జాగ్రత్తగా చేయించుకున్నారు.
 
        సీమాంధ్రనాయకులు బిల్లు ప్రతులతో ఫుట్ బాల్, క్రికెట్ వగయిరా ఆటలు ఆడుతున్నప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోనే శీతాకాల విడిది చేసివున్నారు. మీడియా ద్వారనే కాకుండా,  తన సిబంది ద్వార కూడా సీమాంద్ర నాయకుల చేష్టలు రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలిసే వుంటాయి. అందులో ఏదైనా కొరవ వుంటే బిల్లును స్వాగతించే తెలంగాణ నేతలు  దాన్ని తీర్చు వుంటారు.
 
రాష్ట్రపతి పంపిన బిల్లుతో ఫుట్ బాల్ ఆడుకునీ, మొదాలు బిల్లే తప్పు, అందులోనూ నకిలీ అని అన్నవారికి ఇప్పుడు ఇప్పుడు పరిశుధ్ధాత్మ కలిగి,రాష్ట్రపతి అనగా రాజ్యాంగ అధినేత అని ఆదివాక్యం గుర్తుకు వచ్చింది.  రాష్ట్రపతి హైదరాబాద్ లో వున్నప్పుడు ఆయన పంపిన బిల్లును రాచి రంపాన పెట్టినవాళ్ళు, ఇప్పుడు ఆదే బిల్లును ఆపాలంటూ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.  
 
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నంత కాలం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు  ఇప్పుడు అంటున్నారు. రాజ్యాంగానికి పెద్ద దిక్కురాష్ట్రపతేననీ,  ఐదు కోట్ల సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది కూడాఆయనేనని మరీ చెపుతున్నారు. అంటే, అంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచే బాధ్యత రాష్ట్రపతిదే అనేది వారి భావం.  డిసెంబరుకూ  ఫిబ్రవరికీ ఎంత తేడా!
 
వివిధ సామాజికవర్గాలు రాజ్యాంగాన్నో, రాజ్యాంగంలోని కొన్ని అధీకరణాలనో  వ్యతిరేకించడం, చించిపారేయ్యడం, తగలబెట్టడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొత్తేమీ కాదు.  వెనుకబడిన తరగతులకు రాజ్యాంగంలో ఉద్దీపన సౌకర్యం కల్పించనందుకు అలనాటి అవిభక్త  మద్రాసు రాష్ట్రంలో  ఇవీ రామస్వామి నాయకర్   నాయకత్వన చాలా పెద్ద ఉద్యమం జరిగింది. వాళ్ళు రాజ్యాంగ ప్రతుల్ని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని సవరించే వరకు పోరాడారు. భారత రాజ్యాంగానికి మొదటి సవరణ వచ్చిందే ఆ ఫోరాటంవల్ల. ఆ పోరాటానికీ దిగి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 1951 మే 10 న  పార్లమెంటులో సవరణను ప్రతిపాదించగా 18 జూన్ న పార్లమెంటు దాన్ని  ఆమోదించింది. నరేంద్ర మోదీ మైకంలో హిందూ వెనుకబడిన కులాల నాయకులు ఇప్పుడు  బీజేపికి మద్దతు పలక వచ్చుగానీ, ఆ రోజు పార్లమెంటులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించింది నేటి బీజీపికి మాతృక అయిన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ.  అప్పట్లో వారు కాంగ్రెస్ నుండి బయటపడి జనసంఘ్  ను నిర్మించే పనిలోవున్నారు.  నెహ్రు ప్రతిపాదనను గట్టిగా సమర్ధించినవాడు బీఆర్ అంబేడ్కర్.  
 
రాష్టాన్ని సమైక్యంగా వుంచడానికి దేనికైనా సిధ్ధమేనని సీమాంధ్ర నేతలు అంటున్నారు.   ఇదొక నకిలీ సన్నధ్ధత. ఫేక్ ఎకాంప్లిస్!  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి సీమాంధ్ర నాయకులు చేయాల్సిన పని ఒక్కటే; తెలంగాణ ప్రజల నమ్మకాన్నీ, ప్రేమనూ పొందడం. కానీ, ఆ పని ఒక్కటితప్ప వాళ్ళు ఇతర  పనులు చాలా చేస్తున్నారు.  సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రతి పనీ వాళ్లను తెలంగాణ ప్రజలకు మరింత దూరం చేస్తోంది.  ఇలాంటి అనాలోచిత చర్యల ద్వార వాళ్ళు  తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య బావోద్వేగాలను  భావోద్రేకాలుగా మారుస్తున్నారనిపిస్తోంది.
 
మనకు నచ్చినా నచక పోయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  అంటే ఓట్లు, సీట్లే!   సీమాంధ్ర నాయకుల్లో అగ్రగణ్యులయిన కిరణ్ కుమార్ రెడ్డి,  చంద్రబాబు నాయుడు, జగన్ మోహన రెడ్డి తెలంగాణ ఓట్ల మీద ఆశల్ని  ఎప్పుడో  వదులుకున్నారు. వాళ్ల దృష్టి అంతా ఇప్పుడు రాబోయే సీమాంధ్ర రాష్ట్రానికి సియం కావడం ఎట్లా అన్నదే!  కొందరికి ఇది  అతిశయోక్తిగా వుండవచ్చుగానీ  వాళ్లదగ్గర మరో మార్గం లేదు.
 
        సీమాంధ్ర రాజధానిని ఎక్కడ నిర్మిస్తున్నారో? ఎలా నిర్మిస్తున్నారో కూడా బిల్లులోనే పేర్కొనాలి. సీమాంధ్రకు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీకి  ప్రణాళికా సంఘం నుంచి అనుమతి పొందాలి. పన్నులు తదితర చెల్లింపుల విషయంలో పదేళ్లపాటు కొత్త రాష్ట్రానికి రాయితీలు కల్పించాలి. హైదరాబాద్ ఆదాయ పంపిణీని స్పష్టం చేయాలి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సీమాంధ్ర విద్యార్థులు మరో పదేళ్లపాటు అక్కడ జరిగే అన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొనేందుకు వారిని స్థానికులుగా పరిగణించాలి. హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్స్  లో మరో పదేళ్లపాటు సీమాంధ్రులకు వైద్యసౌకర్యం కల్పించాలి. రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భద్రత కల్పించాలి. వంటి అనేక డిమాండ్లు సీమాంధ్ర నేతలు చెయ్యాల్సివుంది. కానీ, వాళ్ల కాళ్ల కింది కాలం ఎప్పుడో జారిపోయింది. వాళ్ళిప్పుడు  ముందుకు పోలేరు. వెనక్కి రాలేరు! ఇదో ప్రతిష్టంభన.
 
        ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు నినాదంతో ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలుత గంట కట్టిన బీజేపి ఇప్పుడు తెలంగాణతో పాటూ సీమాంధ్రలోనూ కొన్ని ఓట్లు పోగేసుకోవాలను కుంటోంది.  సీమాంధ్ర ప్రజలు కోరదలుచుకున్న ఓ పన్నెండు ఆంశాల కోర్కెల పట్టికను అది ముందుకు పెట్టింది.  తను పొందాలనుకున్న ఖ్యాతిని బీజేపి తన్నుకుపోతుంటే కాంగ్రెస్ చూస్తూ వూరుకుంటుందా?  ఊరుకోదనేదే సమాధానం! అప్పుడు బీజేపి కోరిన కోర్కెలన్నింటినీ  సీమాంధ్ర మంత్రుల నోట చెప్పించే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టనం చేస్తోంది,. ఘనతంతా కాంగ్రేశ్ కొట్టేసి, నిందలు మాత్రం తమ మీద నెట్టేస్తే బీజేపి ఊరుకుంటుందా?  

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336
 
హైదరాబాద్‌
ఫిబ్రవరి  2014
 
ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
 ఫిబ్రవరి  2014 

Tuesday 4 February 2014

ఎన్టీవి అనుబంధం

డానీ నోట్స్
4 ఫిబ్రవరి 2014

ఎన్టీవి అనుబంధం

N-TV లో గత ఐదున్నరేళ్ల కొలువును అద్భుతంగా ఆస్వాదించా. మధురవాణి ముచ్చట్లు, లల్లూ బ్రదర్స్, నా వార్తలు నా ఇష్టంమూడూ కలిపి రెండు వేల ఎపిసోడ్ల వరకు రాశాను. మనకు రాసే నైపుణ్యం వున్నా, రాసే ఆవకాశం రావడం మహత్తర విషయం. ఆ అవకాశం కల్పించిన NTV యాజమాన్యానికి ధన్యవాదాలు.

నన్ను ఎంతగానో ప్రోత్సహించిన డైరెక్టర్ రమాదేవి మేడంగారికీ, ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరీ గారికి, దివంగత బీఎల్ రావుగారికీ కృతజ్ఞతలు. నన్ను రచనా టెలివిజన్ లో అవకాశం ఇచ్చిన ఓల్గా గారికి ప్రత్యేక ధన్యవాదాలు!

        NTV లో నా విజయాలన్నీ సంపూర్ణంగా నావికావు; మా బృందానివి.  మా క్రియేటివ్ హెడ్ అడవి శ్రీనివాస్, క్యారికేచరిస్టు స్యూర్య, యానిమేటర్ శివ, వీడియో ఎడిటర్లు శ్రీనివాసరెడ్డి, రవి, మిమిక్రీ ఆర్టిస్టులు భవిరి రవి, అయ్యంగారి వసంతలక్ష్మి తదితరులకూ,  నా మూడు కార్యక్రమాల్ని ఇన్నాళ్ళూ  పర్యవేక్షించిన ఎడిటర్ వీఎస్ ఆర్  శాస్త్రి గారికీ  bbb కృతజ్ఞతలు.


నేను బయటికి రావడానికి ప్రత్యేక కారణాలు ఏమీలేవు. ఈ మధ్య నాలోని రచయిత తీవ్ర అసంతృప్తితో వున్నాడు; వాడికి కొన్ని రచనలు చేయడం ఇష్టంలేదు. కొన్ని వాతావరణాలు పడడంలేదు. నాలాగ వాడికీ శ్వాసనాళవ్యాధి వుంది. వాడిని సంతృప్తిపరచడం కూడా నా బాధ్యత కదా! అంతే. అంతకు మించి మరేమీలేదు! 

Saturday 1 February 2014

మూజువాణీ వ్యూహాన్ని కేంద్రమూ అనుసరిస్తే!

మూజువాణీ వ్యూహాన్ని కేంద్రమూ అనుసరిస్తే!
. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

భారత రాజ్యాంగాన్ని  మయసభ అనుకోవచ్చు. అందులో అనేక అంశాలు వున్నవి లేనట్టుగానూ, లేనివి వున్నట్టుగానూ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ శాసన సభ గురువారం  మూజువాణీ ఓటింగుతో చేసిన  తీర్మానాన్ని ప్రియదర్శిని అనుకోవచ్చు, అందులో, ఎవరికి నచ్చింది వారికి కనిపిస్తుంది. విభజనవాదులూ, సమైక్యవాదులూ ఎవరికి తోచిన అన్వయాన్ని వాళ్ళు చేసుకుని, అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ  సంబరాలు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పై రాష్ట్ర శాసన సభ అభిప్రాయాలు, సవరణలు తెలుసుకోవాలనే రాజ్యాంగ ప్రక్రియ మొత్తం ఏడువారాలు సాగి గురువారం ముగిసింది. సినిమావాళ్ళ భాషలో ఏడు వారాలంటే 50 రోజుల బొమ్మ. సినిమాల స్క్రీన్ ప్లేలకు  ఒక నిర్ధిష్ట చట్రం వుంటుంది. ఏర్పాటు, ఘర్షణ, పరిష్కారం అనే మూడు స్థూల అంకాలతోపాటూ, మిడ్ పాయింట్, పించ్ పాయింట్, ప్లాట్ పాయింట్ వంటి ఓ డజను మెలికలు అందులో వుంటాయి. ఇలాంటి సందర్భాల్లో  సిడ్ ఫీల్డ్ ను చాలామంది స్క్రీన్ ప్లే గురు అంటుంటారు. శాసనసభలో చర్చ అచ్చం సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే పారడిమ్ ప్రకారమే నడిచింది. మిడ్ పాయింట్ వరకు  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరక్కుండా సీమాంధ్ర ప్రతినిధులు అడ్డుకున్నారు. మిడ్ పాయింట్ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరణ తీర్మానంపై ఓటింగు జరక్కుండా తెలంగాణ ప్రతినిధులు అడ్డుకున్నారు. వాళ్ళు వీళ్ళు అయ్యారు. వీళ్ళువాళ్ళు అయ్యారుతప్ప యాక్షన్ ఒక్కటే! చివరకు విభజన బిల్లుపై చర్చ ముగియడమూ, తిరస్కరణ తీర్మానం ఆమోదం పొందడమూ రెండూ కొన్ని క్షణాల తేడాలో జరిగిపోయాయి.

        ఈ సినిమాలో నాటకీయ మలుపు అద్భుతంగా పండింది.  సిడ్ ఫీల్డ్ భాషలో దీన్ని ప్లాట్ పాయింట్ – 2  అంటారు. బిల్లు పేరుతో శాసనసభకు వచ్చింది చిత్తుప్రతి మాత్రమే అని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి పెను సంచలనం రేపారు. నేరం రుజువయ్యి శిక్షపడేంత వరకు దోషిని నిందితుడు లేదా ఆరోపితుడు అనాలి అన్నట్టు  చట్టసభల ఆమోదం పొందనంతవరకు ప్రతిపాదిత చట్టాన్ని డ్రాఫ్ట్  లేదా బిల్లు అనాలి.  డ్రాఫ్ట్ కాపీని తెలుగులో చిత్తుప్రతి, ముసాయిదా వగయిరా పేర్లతో వ్యవహరిస్తుంటారు.  దాని అర్ధం వాటికి ఎలాంటి విలువ లేదనికాదు. కేంద్ర హోంశాఖ మీద ప్రత్యక్షంగానూ, రాష్ట్రపతి మీద పరోక్షంగానూ ముఖ్యమంత్రి సంధించిన విమర్శల్లో నిజానిజాలెలావున్నా, వారు ఆశించిన సంచలనాన్ని మాత్రం అద్భుతంగా సాధించారు. మీడియాలోగానీ, రాజకీయాల్లోగానీ  సంయమనం కన్నా సంచలనాలకే ఎక్కువ ఆకర్షణ వుంటుంది.

        విభజన బిల్లు అసెంబ్లీ దశను కూడా దాటేసిందని తెలంగాణ నేతలు   సంబరాలు చేసుకుంటే,  ఏకంగా బిల్లునే తిరస్కరించేశామని సీమాంధ్ర నేతలు మిఠాయిలు పంచుకున్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు కొడుకుల తండ్రిపాత్ర పోషిస్తున్న చంద్రబాబు కూడా చాలా ఆనందపడివుంటారు, శాసనసభలో సమన్యాయ సిధ్ధాంతాన్ని వివరించాల్సిన ఇబ్బంది తప్పినందుకు. ముఖ్యమంత్రి అయ్యాక భారీ విజయాలు లేని కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా సీమాంధ్రలో సూపర్ స్టార్ అయిపోయారు. 

        ఇంతకీ ఏడు వారాల వ్యవధిలో అసెంబ్లీ సాధించిందేమిటీ? రాష్ట్ర విభజన కోసం సర్వశక్తులు పెట్టి పోరాడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్క సీమాంధ్ర ప్రజాప్రతినిధిని కూడా తమ వాదంతో ఒప్పించలేకపోయారు. సమైక్యవాదాన్ని పదేపదే వల్లించే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్క తెలంగాణ ప్రజాప్రతినిధి మనసును కూడా దోచుకోలేకపోయారు.  దీని అర్ధం ఏమిటీ? రెండు ప్రాంతాల మధ్య మానసిక విభజన మరింత కరడుగట్టింది. తెలంగాణ ప్రజాప్రతినిధులది ఎలాగూ విభజనవాదమే కనుక ఇది వారి విజయం. ఆ మేరకు ఇది సమైక్యవాదుల పరాజయం!  

శాసన సభలో సమైక్యవాదులు మూటగట్టుకున్న పరాజయాలు అంతటితో ఆగలేదు. రాష్ట్రం విడిపోతే, నష్టపరిహారంగా సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో ఒక్కరంటే ఒక్కరూ సభలో అడగలేదు. పోలవరం, పులిచింతల ముంపు ప్రాంతాల్ని సీమాంధ్రలో చేరిస్తే కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు భద్రత వుంటుందని ఎవ్వరూ అనలేదు. రేపటి సీమాంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ స్థాయి విద్యా, వైద్య సౌకర్యాల గురించిగానీ, ఉపాధికల్పన గురించిగానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. పార్టీలకు అతీతంగా సిమాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా  చేసింది ఒక్కటే;  జీవనాధారమైన ఆర్ధిక అంశాల్ని పక్కన పెట్టి ప్రజల్లో భావోద్వేగాల్ని మరింతగా రెచ్చగొట్టడం. రాష్ట్ర విభజనను నిలిపివేసినట్టు ఒక బూటకపు ప్రచారాన్ని ఇప్పుడు వాళ్ళు ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమకు  చేసిన అన్యాయాన్ని గుర్తించడానికి సీమాంధ్ర ప్రజలకు పెద్ద సమయం పట్టకపోవచ్చు. సమీప భవిష్యత్తులోనే ప్రజల తిరస్కారాన్ని ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ చవి చూస్తారు. బహుశ, వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలి ఎన్నికల్లోనే దీని ప్రభావం వుంటుంది.

అసెంబ్లీకి వచ్చిన బిల్లునే పార్లమెంటులో పెట్టాలనీ, అది  ఆమోదం పొందితే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ కొత్త సవాలు విసురుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.  ఇది బొత్తిగా అర్ధంలేని సవాలు. అసెంబ్లీకి వచ్చిన బిల్లునే పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారూ? బిల్లు మీద శాసనసభలో 86 మంది మాట్లాడారు. దాదాపు శాసనసభ్యులందరూ తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఇవికాక, బిల్లులోని వివిధ క్లాజులపై దాదాపు వెయ్యి సవరణలు, సూచనల్ని సభ్యులు  లిఖితపూర్వకంగా అందజేశారు, వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిగణన లోనికి తీసుకోకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నరని పిస్తోంది. శాసన సభలో ఏడు వారాలు సాగిన  చర్చను కేంద్ర ప్రభుత్వం పరిగణన లోనికి  తీసుకుంటే, పార్లమెంటులో  ప్రవేశపెట్టడానికి ముందు బిల్లులో అనివార్యంగా మార్పులు చేయాల్సి వుంటుంది. అది సహజ ప్రక్రియ.

బిల్లు సభకు రాకముందే ఫలితం అందరికీ తెలుసు. 119 నియోజకవర్గాల తెలంగాణ  ప్రతినిధులు బిల్లును ఆహ్వానిస్తారనీ, 175 నియోజకవర్గాల సీమాంధ్ర ప్రతినిధులు బిల్లును వ్యతిరేకిస్తారనీ. ఒకరిద్దరు సభ్యులు తప్ప మిగిలినవారందరూ ముందుగా ఊహించినట్టే ప్రవర్తించారు.  రాష్ట్రాన్ని కలిపివుంచడంపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మధ్య చెప్పుకోదగ్గ చీలిక వచ్చినా,  రాష్ట్రాన్ని విభజించడంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల మధ్య చెప్పుకోదగ్గ చీలిక వచ్చినా ఫలితాలు మారేవేమో. గానీ, శాసనసభ్యులందరూ తమ ప్రాంతపు భావోద్వేగాలకే కట్టుబడివున్నప్పుడు  ఫలితంలో మార్పు వచ్చే అవకాశాలు లేవు.

ప్రజాస్వామ్యం అంటే సంఖ్యాబలమే కనుక,  119కన్నా 175 పెద్ద సంఖ్య కనుక విజయం తమదే అని సీమాంధ్ర నాయకులు కొందరు అతి ఉత్సాహంతో వున్నారు.  వివాదం వచ్చినపుడు సంఖ్యాబలాన్ని అలా చూడరు. వివాద ప్రాంతంలో సంఖ్యాబలాన్ని మాత్రమే చూస్తారు. అలా చూస్తే తెలంగాణ ప్రాంతంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఒక్కరు మాత్రమే మాట్లడారు. వారు కూడా విభజన అనివార్యం అన్నారు. ఆ ప్రాంతపు మిగిలిన సభ్యులందరూ విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  అదే అంతిమ ప్రమాణం! 

చివరి బంతిని కిరణ్ కుమార్ భారీ షాట్ కొట్టి సోనియా మూతి పగులగొట్టారని ముఖ్యమంత్రి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కిరణ్ కొట్టిన షాట్ తమకు అనుకోని వరమని కాంగ్రెస్ అధిష్టానం కూడా  ఆనందిస్తోందని వారికి తెలిసి వుండకపోవచ్చు. రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన మూజువాణీ వ్యూహాన్నే రేపు  పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లును ఆమోదింప చేసుకోడానికి యూపియే  ఛైర్  పర్సన్ సోనియా గాంధి అనుసరించినా ఆశ్చర్యపడాల్సిన ఆవసరం లేదు. పైగా, శాసనసభలో ఇప్పుడు సీమాంధ్ర ప్రతినిధులు వ్యవహరించిన తీరు కాంగ్రెస్ అధిష్టానం రేపు పార్లమెంటులో అనుసరించే వ్యూహానికి నైతిక సమర్ధన ఇస్తుంది.


 (రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
1 ఫిబ్రవరి  2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

1 ఫిబ్రవరి  2014