Wednesday 13 April 2016

People's Media

ప్రజామీడియా
- డానీ

ఇప్పటి వాతావరణంలో ప్రజామీడియా అనేది నిస్సందేహంగా దుష్టసమాసమే!  

ప్రజలకు సమాచారాన్ని అందజేయడం (Dissemination of news) వార్తా పత్రికల  కార్యకలాపం అనేది చాలా పాతకాలపు మాట. ఇరవయ్యవ శతాబ్దపు తొలి అర్ధభాగంలోనే అది అంతరించిపోయింది.  అప్పట్లో పత్రికల ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటూ కొంత లాభాన్ని కూడా ఇచ్చి ప్రజలు కొనేవాళ్ళు. అప్పుడు పత్రికల మీద పాఠకులకు నిజంగానే అదుపు వుండేది.  కాంగ్రెస్ వాళ్లయినా, కమ్యూనిస్టులయినా పార్టీ పత్రికల్ని సామూహికంగా చదవడం, అందులోని వార్తలు, వ్యాసాల  మీద తమ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం వంటి సాంప్రదాయం ఓ అర్ధశతాబ్దం ముందు  వరకు వుండేవి. తమకు నచ్చని వార్త వచ్చినపుడు వాటి నిర్వాహకుల్ని నిలదీసిన సందర్భాలు కూడా వుండేవి.

వాణిజ్య మీడియా కార్పొరేట్ మీడియాగా రూపాంతరం చెందాక సన్నివేశం మారిపోయింది. ఇప్పుడు పాఠకులుగానీ, ప్రేక్షకులుగానీ మీడియాకు గిట్టుబాటు ధరకాదుకదా కనీస ధర కూడా ఇవ్వాల్సిన పనిలేదు. ఎవ్వరూ ఇవ్వడంలేదు కూడా. అంచేత మీడియా మీద వాళ్లకు ఎలాంటి అదుపు లేదు.  మనం ఐదు రూపాయలు పెట్టి కొనే దినపత్రిక ఉత్పత్తి ఖర్చు పాతిక రూపాయలకు పైనే వుంటుంది.  ఆ అయిదు రుపాయల్లో కూడా  ప్రచురణ సంస్థకు దక్కేది చాలా స్వల్పం. అందులో అత్యధిక భాగం న్యూస్ పేపరు ఏజెంటు కమీషన్ కు, రనాణా ఖర్చులకు సరిపోతాయి. న్యూస్ ఛానళ్లకు కూడా  ప్రేక్షకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.  వాళ్ళు నెలవారీ చెల్లించేది లోకల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వో ల సేవలకేగానీ టీవీ ఛానళ్ళకు మాత్రం కాదు.

పాఠకులు, ప్రేక్షకులు చెల్లించనపుడు మీడియాను పోషించేది ఎవరూ? లాభాలను అర్జించిపెట్టేది ఎవరూ? అనేది ప్రాణప్రదమైన అంశం. ఇప్పటి మీడియాకు పాఠకులు, ప్రేక్షకులు గమ్యంకాదు; గమనం మాత్రమే.  మీడియా వ్యవస్థలో పాఠకులు, ప్రేక్షకులది నిజంగానే ప్రేక్షకపాత్ర మాత్రమే. 

వర్తమాన మీడియాను  పోషించేది ప్రధానంగా  కార్పొరేట్ సంస్థలు. కార్పొరేట్ సంస్కృతిని అలవరచుకున్న రాజకీయ పార్టీలు. ఇక భారీ నిర్మాణసంస్థలు, స్వామీజీలు, ఆ బాపతువాళ్లను కూడా మీడియా పోషకుల జాబితాలో చేర్చవచ్చు. పైకి కనిపించే  వాణిజ్య ప్రకటనల రూపంలోనేకాక పైకి కనిపించని అనేక ఇతర రూపాల్లో కూడా  వాళ్ళు మీడియాను పోషిస్తుంటాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా వ్యవస్థ మొత్తంగానే ఒక ప్రాయోజిత కార్యక్రమం.

వాణిజ్య ప్రకటనకర్తల కోసం  మీడియా రెండు విధులు నిర్వర్తిస్తుంది. మొదటిది, పోషకులకు అవసరమైన వినియోగదారులు, ఓటర్లు,  భక్తుల్ని అది పాఠకులు, ప్రేక్షకుల రూపంలో  సమకూర్చి పెడుతుంది. రెండోది; తన పోషకులకు అవసరమైన , ఇష్టమైన వార్తలు, కార్యక్రమాలను మాత్రమే తన పాఠకులు, ప్రేక్షకులకు అందిస్తుంది. తన పోషకులకు రుచించని వార్తల్ని అది దాచిపెడుతుంది. తన పోషకుల్ని విమర్శించే భావాలు, శక్తుల మీద తనే ఒక ప్రచారపోరాటం చేస్తుంది. అబధ్ధాలు చెప్పడం మీడియా ప్రధాన లక్ష్యం కాదుగానీ, కొన్ని సందర్భాల్లో అపధ్ధర్మంగా   అబధ్ధాలు, అసత్యాలు  ప్రచారం చేయడానికి కూడా  అది వెనుకాడదు. సారాంశంలో మీడియా అనేది కార్పొరేట్ సంస్థలు, రాజకీయపార్టీలకు ప్రజాసంబంధాల వ్యవహారకర్తగా పనిచేస్తుంది. 

పాఠకులు, ప్రేక్షకుల్లో వినియోగ సంస్కృతి కలవారు మాత్రమే మీడియాకు, అంటే, దాని పోషకులకు కావాలి. వినియోగ సంస్కృతికలవారిని సమీకరించలేని మీడియా సంస్థల్ని స్పాన్సర్లు పక్కన పెడతారు. ప్రత్యామ్నాయ భావాల్ని ప్రచురించే మీడియా సంస్థలకు వాణిజ్య ప్రకటనలు రావు. 

వినియోగదారీ సంస్కృతిని సమర్ధంగా ప్రచారం చేయగల సిబ్బంది, కొనుగోలు వాతావరణాన్ని సృష్టించగలిగిన నిపుణులు, మార్కెట్ లో ఉత్తేజాన్ని నింపగలిగిన ఆలోచనాపరులు మాత్రమే మీడియాకు కావాలి. అయితే, అప్పుడప్పుడు అందుకు భిన్నమైన వారిని కూడా మీడియా తనలో ఇముడ్చుకుంటుంది. అది వాళ్ల మీద ప్రేమతోకాదు. మీడియాకు ఒక ఆమోదాంశం కావాలి.  తాను నిష్పక్షపాతంగా వుంటున్నట్టు, భిన్నత్త్వానికి చోటు కల్పిస్తున్నట్టు మీడియా నటిస్తుంది. మీడియాలో భిన్నత్వానికి ప్రాతిధ్యం వహించే మేధావులు కూడా తమకు నచ్చని భావాలు, పరిణామాలతో ప్రణయకలహాల  వరకే పరిమితం కావాలి. అంతేతప్పా, వాటితో  చావో రేవో తేల్చేసుకుంటామంటే మాత్రం మీడియా వాళ్ళకు మొదటి దాన్నే ప్రదానం చేస్తుంది. 

డాక్టరుగా మారి సమాజసేవ చేస్తాను అనేవాళ్ళు మనకు తరసిల్లినట్టే జర్నలిస్టుగామారి సమాజసేవ చేస్తాను అనేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. వాళ్ల సత్ సంకల్పాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదుగానీ  కార్పొరేట్ ఆసుపత్రులు, మీడియా సంస్థలు ఆవిర్భవించేది   సామాన్య ప్రజలకు సేవచేయడానికి కాదు; లాభాలు గడించడానికి. 

ప్రజలు తమకు అనుకూలమైన మీడియా కావాలని బలంగా కోరుకుంటే వాళ్ళు మీడియాకు గిట్టుబాటు ధరను చెల్లించితీరాలి.  అలా చెల్లించడానికి ప్రజలు  సిధ్ధంకానంత కాలం  ప్రజామీడియా బతికి బట్టకట్టదు.

హైదరాబాద్
13 ఏప్రిల్ 2016