Saturday 10 September 2016

ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు

ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
-        డానీ 



29.మతసామరస్య జీవితం

నేను ప్రతి శుక్రవారం మసీదుకు వెళతాను. రంజాన్ నెలలో ఉపవాసాలు వుంటాను. మరీ ఆరోగ్యం అనుమతించని కారణంగా రెండేళ్ళుగా చివరి వారం రోజులుమాత్రమే  ఉపవాసం వుండగలుగుతున్నాను. మా అమ్మానాన్నల్ని ఖననం చేసిన ఖబరస్తాన్ కు షబే ఖదర్ రోజు వెళ్ళాలనుకుంటాను. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా  ఆ ఖబరస్తాన్ ముందు ఆగి సలామ్ చేస్తాను.


మా ఇంట్లో రంజాన్ పండుగను వేడుకగా జరుపుకుంటాము. దీనికి ఒక సెంటిమెంట్‍ కూడా వుంది. 2004లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన ఒక నక్సలైట్ నాయకుడ్ని నేనూ అజిత ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో సురక్షితంగా దింపి వచ్చాము. దండకారణ్యంలో అజితకు పాల్సిపారిమ్ మలేరియా, డెంగూ సోకాయి. తీవ్రఅనారోగ్యం పాలయ్యింది. రోగం ముదిరి బ్లాక్ వాటర్ దశమొదలై సమస్త అవయవాలు దెబ్బతిన్నాయి.  ఆదశకు చేరుకున్నాక బతికినవాళ్ళు అప్పటికి భారత దేశంలో ఎవ్వరూ లేరు. తను చనిపోతుందని నవంబరు 16న కొందరు డాక్టర్లు ప్రకటించారు. ఆరోజు రంజాన్ పండుగ. వారం రోజుల ఉత్కంఠ తరువాత ఒక వైద్యశాస్త్ర అద్భుతంగా అజిత బతికింది. ఆ సందర్భంగా  కేర్-బంజారా హాస్పిటల్ కు  వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చిన ఆత్మీయుల్ని ఏడాదికి ఒకసారైనా కలుద్దామనుకున్నాము. మా కుటుంబ సభ్యులుతప్ప అప్పుడు వచ్చి పలకరించినవాళ్ళు, ఆర్ధికంగా ఆదుకున్నవాళ్ళు అందరూ హిందూ సమాజానికి చెందినవాళ్ళే. అలా మా ఇంట్లో రంజాన్ పండుగ హిందూ అతిధులతోనే జరుగుతుంది. దీన్నే ఈద్ మిలాప్ అనుకోవచ్చు.

పరోటా, పాయా, ఒక కూరగాయకూర, పెరుగు, యాపిల్ నా సహేరీ మెను. ఇఫ్తార్ తరువాత తెలంగాణలో హలీమ్ తిన్నట్టు ఆంధ్రాలో గెంజి తాగుతారు. అది కేరళ-తమిళ సాంప్రదాయం. ఏది వండాలో ఎలా వండాలో  అనే విషయాల్లో నాకు ఇతరులకు చికాకు కల్పించేంత నిర్ధిష్ట అభిరుచి వుంది. నా కోసం వంట చేయడం అంత ఈజీ వ్యవహారంకానప్పటికీ  రంజాన్ నెలలో నా సహేరీ, ఇఫ్తార్ ఏర్పాట్లు మా అత్తగారే చూసుకుంటారు.

వాళ్ల నాన్న కమ్యూనిస్టు కావడాన అజితకు పూజలూ వగయిరా అలవాటు లేదు. వినాయక చవితి, దశరా, దీపావళి సందర్భంగా ఇంట్లో మా అత్తగారు పిండివంటలు చేస్తారు. జనవరి 15 అజిత పుట్టిన రోజు కూడా కావడంతో సంక్రాంతిని మా ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తాం. అత్తగారు బిర్లా టెంపుల్ కు వెళతానంటే తీసుకుపోతాను.  కారు ప్రయాణం మధ్యలో ఏ దైనా గుడికి వెళ్ళి వస్తానంటే రోడ్డు మీద వెయిట్ చేస్తాను.

పాత్రికేయ వృత్తిలో భాగంగా అనేక హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆలయ మర్యాదలతో గర్భగుడి వరకు వెళ్ళిన సందర్భాలున్నాయి. బొట్టు పెట్టినా, హారతి ఇచ్చినా, శఠగోపం పెట్టినా నిరాకరించలేదు. నాస్తిక హేతువాద ఉపన్యాసాలు దంచలేదు. ఎంతో నిష్టగా చేయడంవల్ల కాబోలు గుళ్ళలో ప్రసాదాలు చాలా రుచిగా వుంటాయి. తిరుపతి వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామివార్ల ప్రసాదాలు   మళ్ళీ మళ్ళీ అడిగి తినాలనిపిస్తాయి. నరసాపురం పెద్ద దర్గాలో ఉర్సు సందర్భంగా చేసే ఉత్తిపలావు కూడా ఎంతో రుచిగా వుండేది.  నరసాపురం పాత బజారులో చిన్న మసీదు  పక్కనున్న హజ్రత్ ఖాంజాన్ ఖాన్ దర్గాలోని వలీవుల్లా మా పూర్వీకులే. ఆ నేపథ్యంలోనే మా ఇంటిపేర్ల చివర జర్రానీ అనే గౌరవనామం వచ్చిచేరింది. నేను రచయితను కావడంవల్ల ఆ దర్గా స్థలపురాణం రాయమంటూ చనిపోయే వరకూ మా అమ్మ పోరుతూనే వుండేది.

సేవాధర్మంగానో, స్నేహ ధర్మంగానో హిందూ యాగాలు, పూజలు, అంత్యక్రియలు  వంటివాటికి కూడా కొన్ని సందర్భాల్లో  ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. మంగళగిరి గుడిలో ఒకసారి, గుంటూరు గుడిలో ఇంకోసారి ఇద్దరు స్నేహితుల ప్రేమ వివాహం కోసం అమ్మాయిల తండ్రిగా మారి కన్యాదానం చేశాను.

క్రైస్తవ, శిక్కు, జైన, జొరాస్ట్రియన్ సమూహాలతోనూ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాజస్థాన్ కు చెందిన హరిప్రసాద్ ఖండేల్ వాల్ ఇంట్లో ఏడాదిన్నర  వున్నాను. టోటల్లీ వేగన్. ఆ కాలంలో  కోడికూర కాదుకదా కోడిగుడ్డు కూడా తినలేదు. ఓసారి వేసవిలో విజయవాడ వచ్చిన ఓ జైన గురువుకు గాల్పు కొడితే హాస్పిటల్ లో చేర్చారు. జైన గురువుల ఆహార నియమాలు చాలా కఠినంగా వుంటాయి. ఆ నాలుగు రోజులు వారికి ఆహార సరఫరాను పర్యవేక్షించే పనిని హరిభాయ్ నాకు అప్పచెప్పారు. విజయవాడ ఒన్ టౌన్ బంగారుకొట్ల బజార్ లోని బాలాజీ మందిరంలో జరిగే హోళీ వేడుకల్లో భంగు తాగడం భలే సరదాగా వుండేది.  

Pulihora and Palaavu

శ్రీరామ నవమి, వినాయక చవితి, దసరా సందర్భంగా ఆ తొమ్మిది రోజులూ నాటకాలు, బుర్రకథలు చూస్తూ ఆ పందిళ్ళలోనే వుండేవాళ్ళం. ఆ పందిళ్ళలో ముస్లీం వ్యాపారులు పగటి పూట నౌబత్ ఖానా ఏర్పాటు చేసేవారు.  అప్పట్లో శ్రీరామ నవమికి రామాలయంలో భోగం మేళం కూడా పెట్టేవారు. మాపేటలోని ముస్లిం మహిళల కోసం ఒక పూట పర్దాలు కట్టి ప్రత్యేక మేళం ఏర్పాటు చేసేవారు. సంక్రాంతి, శివరాత్రి, అంతర్వేది ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. నరసాపురం కనకదుర్గ గుడి పూజారి కొడుకు (తరువాత తనే పూజారి అయ్యాడు) మాకు మంచి దోస్తు. శనివారం సాయంత్రాలు కనకదుర్గ గుడి దగ్గర చేరేవాళ్ళం. అక్కడ కొబ్బరి చెక్కలు, అరటి పండ్లు తినడం ఒక సరదా. మా నాటక సమాజంలో నేనుతప్ప మిగిలినవాళ్ళందరూ హిందువులే. మాది పులిహోర-పలావు అనుబంధం.

కారంచేడు ఉద్యమ కాలంలో  నా షెల్టర్, భోజన వసతి మాదిగ సామాజికవర్గం, క్రైస్తవుల ఇళ్లలో వుండేది.

Beef and Pork
ముస్లింలు బీఫ్ తింటారనేది అందరికీ తెలిసిన విషయమే. నరసాపురం టేలర్ పేట మసీదు సమూహం బీఫ్ తినదు. పేద ముస్లింలతోపాటూ, చాకలి, కాపు సామాజికవర్గాలకు (ఉండవల్లి చల్లమ్మ) చెందిన పేద హిందువులు కూడా మా ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు.‍ నాకు 22 యేళ్ళు వచ్చే వరకు ఐదు తరాలు ఒకేచోట కలిసి జీవించాం. ఇళ్ళల్లో హిందువులు పనిచేస్తుండడంవల్ల మావాళ్ళు బీఫ్ తినడం మానేశారో, లేక ఓ ఆరుతరాల ముందే మావాళ్ళు స్వచ్చందంగానే అలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలీదు. ఇతర పట్టణాలలోని మా బంధువులు బీఫ్ తింటారు. వాళ్ల ఇళ్ళకు వెళ్ళినపుడు కూడా అలవాటు లేనికారణంగా మేము బీఫ్ తినేవాళ్ళంకాదు.

నక్సలైట్ గా క్రియాశీలంగావున్న కాలంలో అలవాటులేనివి కూడా తినాల్సివచ్చేది. విప్లవ జీవితంలో నాగుపాముల్ని కూర వండుకుని తినేవాళ్ళూ తారసపడ్డారు. గ్రామాలకు తరలండి కార్యక్రమం (విలేజ్ క్యాంపేయిన్) లో మేము అన్నం, కూరలు అడుక్కునేవాళ్ళం. అలాంటి సందర్భాల్లో గొడ్డుమాసం అనే ఏముందీ పంది మాసం కూడా ఒకసారి నా ప్లేటులోనికి వచ్చేసింది. కృష్ణాజిల్లా కాటూరు గ్రామంలో ఒకసారి ఎరుకలవారి పెళ్ళికి పిలిచారు. పందిపలావు వండారు. అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాననేది మీ ఊహకు వదిలేస్తున్నాను.  

లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆదివాసులతో నా అనుబంధం గర్వకారణమైనది. ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షుడిగావున్నప్పుడు బొక్కా పరంజ్యోతి, గోసాల ఆశీర్వాదంలతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా యానాది సంఘాల సమాఖ్యను నెలకొల్పి నెల్లూరులో యానాదుల మహాసభ నిర్వహించాము.  

అయితే, ఇతరులు చెట్లనీ పుట్టలని పూజిస్తారని నేను వాటిని పూజించను. గౌరవించడం వేరు; విశ్వసించడం వేరు. సందర్భం ఏదయినా నియమం మాత్రం ఒక్కటే. ఇతర మతస్తులు పవిత్రంగా భావించే వాటినీ గౌరవిస్తాను. వాళ్ళు మహాత్యంగా భావించే వేటినీ విశ్వశించను.  నా ధార్మిక విశ్వాసం చాలా చిన్నది; “లా ఇలాహా ఇల్లల్లా’. అంతే.

30. సిధ్ధాంత సామరస్య ఉద్యమం
Marx and Ambedkar

మా రెండవవాడు యూరప్ టూర్ కు వెళ్ళినపుడు ఈఫిల్ టవర్, పీసా టవర్, రోమ్ కోలాసియమ్ వగయిరాలు చూసినా చూడకపోయినా లండన్ హెగైట్ శ్మశానంలో కార్ల్ మార్క్స్ సమాధిని తప్పక చూసి రమ్మన్నాను. నేను ముహమ్మద్ ప్రవక్తను అభిమానించినంతగా  కార్ల్ మార్క్స్ ను గౌరవిస్తాను. ముస్లింవాదానికి సామ్యవాదం తోడుకావాలనేది నా అభిప్రాయం.  యూదుడయిన మార్క్స్ కు ఇస్లాం మీద ఎలాంటి అభిప్రాయాలుండేవి అనేవి ఇక్కడ అప్రస్తుతం. ఆయన ప్రతిపాదించిన కమ్యూనిజం మహత్తరమైనది. పీడిత సమూహాలకు అవసరమైనది.

అంబేడ్కర్ విషయామూ అంతే. భారత ముస్లీంలకు అంబేడ్కర్ తో కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. అలాంటి కొన్ని అంశాలను మినహాయిస్తే అంబేడ్కర్ ప్రతిపాదించిన దళిత విముక్తి సిధ్ధాంతం ఇతర పీడిత వర్గాలకు కూడా మహత్తరమైనది.

RGB Movement

లాల్ సలామ్, హర్యాలీ సలామ్, నీల్ సలామ్ నా సామాజిక సామరస్య సిధ్ధాంతం. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ (RGB).   శ్రామికులు, ఆదివాసులు, దళితులు, ముస్లింలు కలిసి నడిచినపుడే ఎవరికయినా విముక్తి సాధ్యం అవుతుంది. విడిగావుంటే ఎవరికీ విముక్తి దక్కదు. ఆర్జీబీ ఉద్యమం నేటి అవసరం. భాగవతంలో, తనను చంపుతారనే భయంతో  దేవకి పిల్లల్ని పుట్టగానే కంసుడు చంపేసినట్టు, బైబిల్ కథల్లో, పోటీ చక్రవర్తి పుడుతున్నాడనే భయంతో రోమన్ చక్రవర్తి హీరోద్ బెత్లెహేమ్ లోని పిల్లలందర్నీ చంపేసినట్టు (The Massacre of the Innocents) భారత దేశంలో శ్రామికులు, ఆదివాసులు, దళితులు, ముస్లింలతో ఒక సమాఖ్య ఏర్పడే అవకాశాల్ని పురిట్లోనే సంధికొట్టడానికి  అంతర్జాతీయంగా భారీ కుట్రలు సాగుతున్నాయి. 


31. ముస్లిం సమాజానికి అంతర్గత ముప్పుపై ఐదు ప్రశ్నలు

. ఈచర్చను ముగించడానికి ముందు స్కైబాబా ముందు ఐదు ప్రశ్నలు వుంచుతున్నాను. వాటికి సమాధానాల్ని వారు నాకు చెప్పనక్కర లేదు. బహిరంగంగా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కు చెపితేచాలు. 

1.     తాను  ముస్లిం అని ప్రకటించుకున్నా వారితో వివాదంలేదు.  తాను ముస్లిం కాదని  ప్రకటించుకున్నా వారితో వివాదంలేదు. ముస్లీం పదానికి వారిస్తున్న నిర్వచనం ఏమిటీ అనేదే  వివాదం.

పరిష్కారం – ఇప్పుడయినా ఫేస్ బుక్ ఫ్రెండ్స్‍ ముందు వారు ముస్లిం పదాన్ని  నిర్వచించాలి.

2.     వారు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని పాటిస్తున్నానన్నా వివాదంలేదు.  వారు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని పాటించనన్నా వివాదంలేదు.  ఇతరులు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని కోల్పోయారు అనడంతోనే వివాదం.  

పరిష్కారం -  ఇప్పుడయినా ఫేస్ బుక్ ఫ్రెండ్స్‍ ముందు వారు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని  వివరించడమేగాక వాటిని కోల్పోవడం అంటే ఏమిటో చెప్పాలి. 

3.     ముస్లింలకు విద్యా ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి  హామీ అమలు కోసం వారు ఉద్యమిస్తున్నా వివాదంలేదు.  ఉద్యమించలేనని  ప్రకటించినా వివాదంలేదు.   ముస్లింలకు ఆధునిక విద్యను అందించడానికి తాను రాత్రింబవళ్ళు కష్టపడిపోతున్నట్టు చెప్పుకోవడంతోనే వివాదం.

పరిష్కారం -  ఇప్పుడయినా ఫేస్ బుక్ ఫ్రెండ్స్‍ ముందు వారు విధ్యాఉపాధి రంగాల్లో ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఏం చేస్తున్నారో వివరించాలి. 

4.     తెలంగాణ పోలీసులు సాగించిన బూటకపు కాల్పులకు మత స్వభావం వుందని వారు చెప్పినా వివాదంలేదు.  మత స్వభావం లేదని వారు నిర్ధారించినా వివాదంలేదు.   ఏ ప్రభుత్వంలో అయినా ఎన్ కౌంటర్లు ఇలాగేవుంటాయని వారు సమర్ధిస్తేనే  వివాదం.   

పరిష్కారం -  ఇప్పుడయినా ఫేస్ బుక్ ఫ్రెండ్స్‍ ముందు వారు తెలంగాణలో సాగిన ఎన్ కౌంట్లర్ల స్వభావాన్ని వివరించాలి. 

5.     తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తదితర పథకాల్లో ముస్లింల వాటా ఎంత అని వారు అడిగినా వివాదంలేదు.  అడగలేనని చేతులెత్తేసినా వివాదంలేదు.  తాను తెలంగాణ పేద ముస్లింల ప్రతినిధినని చెప్పుకోవడంతోనే వివాదం.

పరిష్కారం -  ఇప్పుడయినా ఫేస్ బుక్ ఫ్రెండ్స్‍ ముందు వారు తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో  ముస్లింల వాటా సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని వివరించాలి. 



ముగింపు

ముస్లిం సమాజం గురించి  బయటి ప్రపంచానికి ఎంతోకొంత అవగాహన కల్పించడానికీ, వాళ్ళకు ముస్లిం సమాజం మీద సద్భావనను పెంచడానికీ ఈ సంవాదం ఒక అవకాశంగా కలిసివచ్చింది. అంతేతప్ప ఈ సంవాదాలవల్ల స్కైబాబాకు జ్ఞానోదయం అయిపోతుందని  నాకు ఏ దశలోనూ నమ్మకంలేదు. నా నమ్మకం తప్పని స్కైబాబా నిరూపిస్తే నాకన్నా ఆనందించేవారు మరొకరు వుండరు.

భారత ముస్లిం సమాజాన్ని బలహీన పరిచే ప్రయత్నాలు రాజ్య ప్రాయోజిత కార్యక్రమాలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం రెండు వైపుల నుండి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకవైపు, కులవ్యవస్థ సాగించే అణిచివేత నుండి బయటపడడానికి ఇస్లాంను స్వీకరించిన విశాల పీడిత సముహాలని తిరిగి వెనక్కి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు, ముస్లిం సమాజంలోనే కులచిచ్చును పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.

ముస్లింల వెనుకబాటుతనానికి వాళ్ళ అంతర్గత సంస్కృతే కారణమని ప్రచారం చేసే రచయితల్నీ, పాపులర్ ఇస్లాం పేరుతో ముస్లిం సమాజంలో బహుదేవతారాధనను,  విగ్రహారాధనను ప్రవేశపెట్టే ఆలోచనాపరుల్నీ అన్ని విధాలా ప్రోత్సహించడానికి జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక వందల సంస్థలు ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. అమేరికన్ ఫ్యామిలీ అసోసియేషన్, అమేరికన్ ఫ్రీడం లా సెంటర్, అమేరికన్ పబ్లిక్ పాలసీ అలయన్స్, అమేరికన్స్ ఫర్ పీస్ అండ్ టోలరెన్స్, కన్సర్నెడ్ విమెన్ ఫర్ అమేరిక, అమేరికన్ ఫ్రీడమ్ డిఫెన్స్ ఇనీషియేటివ్, ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్, ఆబ్ స్ట్రాక్షన్ ఫండ్, యాక్ట్ ఫర్ అమేరిక, అలేఘనీ ఫౌండేషన్, సారా స్కైఫ్ ఫౌండేషన్, అమేరికన్ సెంటర్ ఫర్ లా అండ్ జస్టీస్ వంటివి వీటిల్లో కొన్ని మాత్రమే. మొస్సద్ మానసిక పుత్రులుగా పుట్టిన ఈ సంస్థలన్నీ ప్రగతిశీల అభ్యుదయ వేదికల రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తున్నాయి.  భారీ నిధులు కేటాయించి పీఠాలు, పరిశోధన సంస్థలూ, ప్రచురణ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ముస్లిం మిల్లత్ (సౌభ్రాతృత్వం) ను వీలైనంతగా లోపలి నుండి బలహీనపరచాలనేది వీటి లక్ష్యం.

స్కైబాబా గతంలో  ఒక సందర్భంలో ముస్లిం సమాజాన్ని “అరే వో సూవర్ కే ఔలాద్! (ఒరేయ్! పంది సంతతి)” అని సంభోదించారు. కరడుగట్టిన హిందూత్వవాదులు సహితం ఇప్పటి వరకు ముస్లింలని ఇంతటి మాట అనలేదు.  ముస్లిం సమాజానికి అసహనం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు.  నిజానికి దానికి సహనం చాలా ఎక్కువ.  స్కైబాబా విషయంలో సంయమనం పాటించడమే దానికి గొప్ప ఉదాహరణ. ఒక పిచ్చోడి వెర్రి ప్రేలాపన అనుకుని వారిని ముస్లీం సమాజం మన్నించేసింది. మొస్సద్ మానసపుత్రుల్లో   ఫార్మర్ ముస్లిమ్స్ యునైటెడ్ అనే సంస్థ ఇటీవలి కాలంలో చాలా చురుగ్గా పనిచేస్తోంది. ముస్లిం సమాజం మీద ఇక్కడ స్కైబాబా చేస్తున్న వాదనలు వంటివాటినే  అది పశ్చిమ దేశాల్లో చేస్తూవుంటుంది. ఈ భావసారూప్యం యాధృఛ్ఛికం అయితే వేరే విషయంగానీ  కానీ, ఇది సంస్థాగతమని తేలితే మాత్రం భవిష్యత్తులో భారత ముస్లీం సమాజం వారి విషయంలో అంత  సంయమనాన్ని పాటించకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఆచార్య జయశంకర్ ఒకమాట అనేవారు;  “బయటివాడు అడ్డుపడితే పొలిమేర వరకు తరిమి కొడతాం. మనవాడే అడ్డుపడితే వెయ్యి అడుగుల లోతు గొయ్యి తవ్వి అడ్దంగా పాతిపెడతాం”! ఈ మాట ముస్లిం సమాజానికి కూడా ఆదర్శమే.


(అయిపోయింది)

PS
Sky Baba – Love and Hate Story.
షేక్ యూసుఫ్ బాబ (స్కైబాబ)తో నాది లవ్ అండ్ హేట్  స్టోరీ

తెలంగాణ పేదముస్లిం జీవితాల్లోని దయనీయ స్థితిగతుల్ని, సున్నిత భావోద్వేగాల్ని తెలుగు కథా సాహిత్యంలో తను హృద్యంగా ప్రతిఫలించాడు. ముస్లీం సమస్యల మీద తరచూ స్పందించడంతోపాటూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలోనూ క్రీయాశీలంగా పాల్గొన్నాడు. ప్రచురణకర్తగా ముస్లిం సమస్యలపై డజనుకు పైగా పుస్తకాలు ప్రచురించాడు. నిరుద్యోగాన్నీ, అనారోగ్యాన్నీ,  ఆర్ధిక ఇబ్బందుల్నీ లెఖ్ఖచేయక ముస్లింల సభ ఎక్కడ జరుగుతున్నా భజాన సంచి వేసుకుని వెళ్ళిపోతాడు. ఇవన్నీ నేను  అతనిలో గొప్పగా మెచ్చుకునే అంశాలు. సదభిప్రాయంతోనే మేమిద్దరం అనేక సభలు సమావేశాల్లో కలిసి పాలుపంచుకోవడమేగాక, కొన్ని సంస్థల్లో కలిసి పనిచేశాం

అయితే, స్కైబాబతో నేను తీవ్రంగా విభేదించే అంశాలు కూడా కొన్నున్నాయి. సాంప్రదాయ ముస్లిం సమూహాలను లోపల నుండి కాకపోయినా దగ్గర నుండి కూడా స్కైబాబ చూడలేదు. అతను పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మురికివాడల్లో నివశించే అతిపేద ముస్లిం సమూహాలను దగ్గరగా చూశాడు. కటిక పేదరికం మూలంగా ఆ సమూహాల్లో నిరక్షరాశ్యతతోపాటూ చేతబడులు, భూతవైద్యాలు వంటి అనేక క్షుద్ర సాంప్రదాయాలు కూడా వుంటాయి. వాటి వ్యతిరేక ప్రభావం అతని మీద బలంగావుంది. బహుశ అతను క్షుద్రసాంప్రదాయాలవల్ల  వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడివుంటాడు.

క్షుద్ర సాంప్రదాయాలు ఎక్కడున్నా ఖండించాల్సిందే. అయితే, పేద ముస్లీం సమూహాల్లోని క్షుద్ర సాంప్రదాయాల్ని చూసి అదే ఇస్లాం అని స్కైబాబా భ్రమపడతాడు. ఆ క్రమంలో క్షుద్ర సాంప్రదాయాలతోపాటూ ఇస్లాం మీద కూడా దండెత్తాలనుకుంటాడు. క్షుద్ర సాంప్రదాయాలు ఇస్లాంకు కూడా వ్యతిరేకం అని చెప్పినా అతను వినడు. అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారని ఇంకో ఆరోపణ చేస్తాడు. పోనీ తనదైన పధ్ధతుల్లో  నాస్తికునిగానో హేతువాదిగానో  కొనసాగుతాడా? అంటే అదీ చేయడు. తనను ముస్లిం ప్రతినిధిగా ప్రకటించుకోవడానికి ఆసక్తి చూపుతుంటాడు. ఇస్లాం లేకుండా ముస్లింలు వుండరన్న సామాజిక వాస్తవాన్ని అతను జీర్ణించుకోలేడు. నాస్థిక, హేతువాదాలకు కాలం చెల్లాకే దళిత, ముస్లీం తదితర అస్థిత్వవాదాలు ఆవిర్భవించాయన్న చారిత్రక వాస్తవాన్ని కూడా అతను గుర్తించడు.

 స్కైబాబా మతసామరస్యం గురించి కూడా తరచూ గొప్పగా చెపుతుంటాడుగానీ అక్కడా అతన్ని అదే గందరగోళం వెంటాడుతూ వుంటుంది. మతసామరస్యంతో హిందువులను పెళ్ళిచేసుకున్న ముస్లింలని మెచ్చుకోవాల్సిన సందర్భాల్లో సహితం "వాళ్ళు ముస్లిమేతరుల్ని పెళ్ళాడి ముస్లిమీయతకు దూరమయ్యారు" (ముస్లీంవాద సాహిత్యంపై చర్చ, వార్త దిన పత్రిక రచన పేజీ, 11-11-2017) అని ఫత్వాలు జారీ చేస్తాడు. ముస్లిమీయతను పొందడం అంటే ఏమిటో, కోల్పోవడం అంటే ఏమిటో వివరించాల్సివచ్చినపుడు  మాత్రం భయంతో వణికిపోతాడు.

ముస్లిం అస్థిత్వాన్ని వదులుకోలేక, ఇస్లాంను అంగీకరించలేక, ఇంకో మతాన్ని స్వీకరించలేక, నాస్తికునిగా ప్రకటించుకోలేక, మతసామరస్యాన్ని మెచ్చుకోలేక, మతాచారాలను పాటించలేక మేధోరంగంలో ఒక గందరగోళ స్థితిలో అతను కొనసాగుతుంటాడు.

భారత ముస్లిం సమాజాన్ని స్కైబాబా అతిశయంతో “అరే ఓ సూవర్ కే ఔలాద్!” అని సంభోదించిన సందర్భాలున్నాయి. కరడుగట్టిన  హిందూత్వ నాయకులు సహితం ఇప్పటి వరకు అంతటి సాహసం చేయలేదు. ఇలాంటి ప్రకటనలు, రచనలవల్ల ఇతర సమూహాల్లో ముస్లిం-ఇస్లాం ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక దాన్ని సరిదిద్దాల్సిన అవసరం వుందనీ  భావించాను. 2007లో వార్త దిన పత్రిక రచన పేజీలో ఒకసారి. 2016లో సాక్షి దినపత్రిక సాహిత్య పేజీలో ఇంకోసారి, దానికి కొనసాగింపుగా సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మరోసారి  మేమిద్దరం బాహాటంగా తలపడ్డాం. అస్మదీయులతో అంత తీవ్రంగా తలపడివుండాల్సింది కాదని మా ఇద్దరి ఉమ్మడిమిత్రులు కొందరు భావించారు.  వాళ్ళ సూచనను నేనూ ఒప్పుకుంటాను. నిజానికి ఆ చర్చల్లో స్కైబాబ నాకు కేవలం గమనం మాత్రమేగానీ గమ్యంకాదు.  బయటి నుండి నిరంతరం అనైతిక సాంస్కృతిక దాడిని ఎదుర్కొంటున్న ముస్లిం సమాజానికి తిరిగి ఆమోదాంశాన్ని  సాధించడమే నా అసలు లక్ష్యం.

ఇస్లాం గురించీ, ముస్లిం సమాజం గురించీ నాలుగు మంచిమాటలు చెపుతానంటే ప్రధాన స్రవంతి మీడియా అవకాశం కల్పించదు. మీడియాకు వివాదమంటేనే ఇష్టం. అది దాని రూపంముస్లీం సమాజానికి ఆమోదాంశాన్ని చేకూర్చే బాధ్యతను నెరవేర్చడానికి నేను ఈ వివాద రూపాన్నే ఎంచుకుని ప్రధాన స్రవంతి మీడియాను ఉపయోగించుకున్నాను. వివాదం వంకతో ఇస్లాం గురించీ, ముస్లిం సమాజం గురించీ నాలుగు మంచిమాటలు బయటి ప్రపంచానికి చెప్పగలిగాను.


పైగా, take  the center-stage అనే ఎత్తుగడ  ఎలానూ వుంది. మిత్రత్త్వంగానైనా, శతృత్త్వంగానైనా ముస్లీం ఆలోచనాపరులు ఎప్పుడూ  వెలుగులో వుండాలి, వార్తల్లో నిలవాలి అనేదే  మన వ్యూహం కావాలి. దానినే నేను పాటించాను!. ఈ క్రమంలో స్కైబాబకు కూడా ఇస్లాం గురించీ అవగాహన పెరిగితే అది వ్యక్తిగతంగా నాకేకాక సువిశాల ముస్లిం సమాజానికి కూడా తప్పక బోనస్ అవుతుంది.


Monday 5 September 2016

ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు

ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

-        డానీ 


27.  ముస్లింవాద సాహిత్యం

ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి. తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి. సాహిత్యరంగంలో ఇది వారి కోరిక.

అస్థిత్వవాద సాహిత్య నిర్మితి గురించి గతంలో చాలా వివరంగా మాట్లాడాను. . ఇప్పుడు మళ్ళీ సందర్భం వచ్చింది కనుక స్థూలంగా అయినా ప్రస్తావించాల్సివుంది.

నవల, కథ, నాటకం వంటి వర్ణనాత్మక ప్రక్రియలన్నింటిలోనూ సందర్భం, ఘర్షణ, పరిష్కారం (Set-up, Confrontation, Resolution) అనే మూడు అంకాలుంటాయి. మరీ అర్భకులుతప్ప ఈ మూడు అంకాల సూత్రాన్ని దాదాపు అందరూ పాటిస్తారు. నైపుణ్యం అనేది ఆయా రచయితల సాధన, స్తోమతల్నిబట్టి వుంటుంది.

అస్తిత్వవాద సాహిత్యానికి  కథాంశం (టాపిక్) కన్నా వస్తువు (కంటెంట్)  ప్రాణ ప్రదమైనది. కథాంశంలో అన్నీ ముస్లిం పాత్రలే వున్నప్పటికీ  వస్తువు ముస్లిం అస్థిత్వానికి వ్యతిరేకమైనది కావచ్చు. కథాంశంలో ఒక్క ముస్లిం పాత్ర కూడా లేనప్పటికీ  వస్తువు ముస్లిం అస్థిత్వానికి అనుకూలమైనది కావచ్చు.




ఘర్షణ చట్రంలోనికి  పరస్పర విరుధ్ధ శక్తుల్ని (ప్రొటాగోనిస్టులు, యాంటాగోనిస్టులు)  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రవేశపెట్టినపుడే ది అస్థిత్వవాద రచన అవుతుంది. స్త్రీవాద సాహిత్యంలో  స్త్రీలు, దళితవాద సాహిత్యంలో  దళితులు, ఆదివాసీవాద సాహిత్యంలో ఆదివాసులు, ముస్లింవాద సాహిత్యంలో ముస్లింలు  ప్రొటాగోనిస్టులుగానూ, పురుషులు, పెత్తందారీకులాలు, మైదానప్రాంతంవాళ్ళు, హిందూత్వవాదులు యాంటాగో నిస్టులుగానూ వుంటారు.

ముస్లీంవాద సాహిత్యంలో ముస్లిం ఆచార వ్యవహారాల్లోని “నెగటివ్” అంశాల్నీ,, అంతర్గతవెనుకబాటుతనాల్నీ” రాయాలన్నది స్కైబాబా ప్రతిపాదన. సాహిత్యంలో ముస్లీంలను యాంటాగోనిస్టులుగా ప్రవేశపెట్టాలనేది దాని సారాంశం. ఇదేమీ కొత్త ప్రతిపాదనకాదు. నిజానికి వర్తమాన సినిమాలతోసహా సాహిత్యంలో ముస్లింలను యాంటగోనిస్టులుగానే చిత్రిస్తున్నారు.  బయటివాళ్ళు చేస్తున్న పనిని లోపలి నుండి కూడా చేయాలనేది వారి ఆశయం.

దళితుల అంతర్గత వెనుకబాటుతనాలపై  రాసింది దళితవాద సాహిత్యం అవ్వనట్టే,  ముస్లింల అంతర్గత వెనుకబాటుతనాలపై  రాసింది ముస్లింవాద సాహిత్యం అవ్వదు; అది వేరే ఏదైనా కావచ్చు.  ముస్లీం వ్యతిరేక సాహిత్యం కూడా కావచ్చు.  రచయిత ఏ సమూహం పక్షాన రాస్తున్నాడో, ఆ సమూహాన్ని అణిచివేస్తున్న ప్రధాన శత్రువు ఎవరో, ఆ శత్రువును ఎలా ఎదుర్కోవాలో చెప్పనిది ఏదీ అస్థిత్వవాద సాహిత్యం అవ్వదు.  దళిత పాత్రను ప్రొటాగోనిస్టుగా కాకుండా యాంటాగో నిస్టుగా చిత్రిస్తే దాన్ని దళిత సాహిత్యం అనవచ్చా?


నిజానికి పరిశుధ్ధ సమూహం అంటూ ఈ భూమి మీద ఏదీ ఎక్కడా వుండదు. తప్పులు అన్ని సమూహాల్లోనూ వుంటాయి. ఎప్పుడయినా మొత్తమ్మీద ఏదీ పీడిత సమూహం? ఏది పీడక సమూహం అనేదే కొలమానం. అణగారిన సమూహాన్ని వీలయితే ఆదుకోవాలి. అంతేగానీ, అందులోని తప్పుల్ని వెతకడం పీడక దృక్పధం అవుతుంది.  

7.            బుర్ఖాలు – హిజబ్ లు
స్కైబాబాకు ఇష్టమైన టాపిక్కుల్లో బుర్ఖా ఒకటి. బుర్ఖాల మీద చర్చ ప్రాసంగితను కోల్పోయిందని వారికి జ్ఞానోదయం అయిందేమో;  ఈసారి ఆరోపణల్లో వాటి ప్రస్తావన లేదు. అయితే చాలా కాలం వారు సాహిత్యంలో  బుర్ఖా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు. అందువల్ల బుర్ఖా గురించి కూడా నాలుగు మాటలు రాయాల్సి వస్తున్నది. 

తలను కప్పుకోవడం ముస్లిం సాంప్రదాయం. ఇది మహిళలేకాకుండా పురుషులు కూడా పాటించాల్సిన వస్త్రనిబంధన. తల కప్పుకోవడంతో మొదలయిన హిజబ్ ఒక్కోప్రాంతంలో అక్కడి అవసరాలను బట్టి  ఛాతీ భాగాన్ని కప్పుకోవడంగానూ, పూర్తిగా శరీరాన్ని కప్పుకోవడంగానూ మారింది. సాంప్రదాయాన్ని పాటించే ముస్లిం పురుషులు సహితం తల నుండి కాళ్ళ వరకు ఒకే వస్త్రాన్ని ధరిస్తుంటారు.

తెలుగు-తెలంగాణ రాష్ట్రాల్లో బుర్ఖా సాంప్రదాయాన్ని లోతుగా పరిశీలించడానికి ముందు బుర్ఖా సాంప్రదాయాన్ని పాటించేవారికీ పాటించనివారికీ మధ్య ఒక విభజన రేఖను గీయాల్సిన అవసరం వుంది.

ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో బుర్ఖా సాంప్రదాయం అస్సలేలేదు. కొన్ని చోట్ల నామమాత్రంగా హిజబ్/ పర్దా సాంప్రదాయం మాత్రమే వుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని జిల్లాల్లో బుర్ఖా సాంప్రదాయం లేదు.  బుర్ఖా సాంప్రదాయంవున్న జిల్లాలలోనూ కొన్ని సముదాయాలు, కుటుంబాల్లో బుర్ఖా సాంప్రదాయం లేదు.  హైదరాబాద్ లో మాత్రం బుర్ఖా సాంప్రదాయం విస్తృతంగా వుంది. అది కూడా హైదరాబాద్ పాతబస్తీ పరిసరాల్లో వున్నంత విస్తృతంగా సికంద్రాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో లేదు.

హైదరాబాద్ పాతబస్తీ ముస్లిం మహిళలు ఏ అవసరాలకోసం బుర్ఖాను ధరిస్తున్నారో బుర్ఖా సాంప్రదాయమేలేనివాళ్ళు అర్ధం చేసుకోలేరు.  సతీసహగమనం నిరోధానికి కృషి చేయడానికి రాజా రామ్మోహన రాయ్ కూ, విధవా స్త్రీ పునర్ వివాహం కోసం ఉద్యమించడానికీ కందుకూరి వీరేశలింగం పంతులుకూ   లోకస్ స్టాండీ వుందని మనకు చరిత్ర చెపుతోంది. కోస్తాంధ్రా, రాయలసీమలతోపాటూ తెలంగాణలో బుర్ఖా సాంప్రదాయం లేని జిల్లాలు, సముదాయాలు, కుటుంబాలకు చెందిన ఆలోచనాపరులకు బుర్ఖా సాంప్రదాయం మీద మాట్లాడానికి లోకస్ స్టాండీ (నైతిక అర్హత) లేదు. వాళ్ళకు ఆ సాంప్రదాయపు లోతుపాతులు అవసరాలు తెలీవు.

ఏ మత సమూహంలో అయినా సాంప్రదాయాలకూ ఆర్ధిక స్థితిగతులకూ ఒక విలోమ సంబంధం వుంటుంది. అర్ధిక స్థితిగతులు పెరిగేకొద్దీ సాంప్రదాయాల సాంద్రత కూడా పెరుగుతుంటుంది. పేదవాళ్ళు ఒంటిని కప్పుకోవడమే మహత్తర విషయం అయినప్పుడు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ప్రత్యేక వంటకాలు వండి పూజలు పునస్కారాలూ చేయలేరు. ఆర్ధిక స్థితి మెరుగయిన తరువాతే పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు ధరించి ప్రత్యేక వంటకాలు వండి పూజలు పునస్కారాలూ చేసే అవకాశం వస్తుంది.  దీనినే తిరగేసి చూస్తే,  తమ ఆర్ధిక స్థితి మెరుగయిందని ప్రకటించడానికి కొన్ని కుటుంబాలు  పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు ధరించి ప్రత్యేక వంటకాలు వండి పూజలు పునస్కారాలూ నిర్వహిస్తుంటారు. సరిగ్గా అదే విధంగా తమ ఆర్ధిక స్థితి మెరుగయిందని ప్రకటించడానికి ముస్లిం కుటుంబాలు కూడా పర్దా, బుర్ఖా, ఉర్దూ తదితర సాంప్రదాయాలను అవలంభిస్తాయి. స్కైబాబాకు  ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియనట్లే ఎకనామిక్స్ ఆఫ్ కల్చర్ కూడా తెలీదు.

అంతమాత్రాన బుర్ఖా వేసుకోకపోతే ముస్లిం మహిళేకాదు, ఉర్దూ రాకపోతే ముస్లీమేకాదు అనుకోవడమూ అతివాదమే. మిడిమిడి జ్ఞానంతో చేసే పిల్లచేష్టలివి. ధార్మికరంగంలో ముస్లింలకు సంబంధించిన ప్రాధమిక ఐదు (ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్) నియమాల్లో ఇవేవీలేవు. 

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యంటీ ఖాన్ సాబ్ లాంటి ఉదారవాదులు సహితం బుర్ఖా అనేది అవసరాన్నిబట్టి ఏర్పడింది అనేవారు. అయితే ఆ అవసరం ఏమిటో తెలుగులో రికార్డు కానప్పటికీ ఆచరణలో సులువుగానే అర్ధం అవుతోంది.

ఇటీవలి కాలంలో  హిజబ్/బుర్ఖా సాంప్రదాయం రెండు రంగాల్లో  చాలా వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు, గతంలో ఈ సాంప్రదాయంలేని ముస్లిం ప్రాంతాలు కుటుంబాలలోనూ  బుర్ఖాలు వేసేవాళ్ళు పెరుగుతున్నారు.  మరోవైపు, హిందూ సమాజానికి చెందిన మహిళలు సహితం హిజబ్ వేసుకోవడం మొదలెట్టారు. కాలేజీ అమ్మాయిలు, వర్కింగ్ వుమెన్ అందరూ ఇప్పుడు రోడ్డు మీదికి రావడానికి ముందు హిజబ్ వేసుకుంటున్నారు. దానికి ఇంగ్లీషు పేరు స్కార్ఫ్. నిజానికి హిజబ్ వేసేవారు ముఖం కప్పుకోవాల్సిన అవసరంలేదు. కానీ స్కార్ఫ్ వాడే మహిళలందరూ ముఖం కూడా కప్పుకుంటున్నారు. మొదట్లో ఈ సాంప్రదాయం బైకుల మీద వెళ్ళే ఆమ్మాయిల్లో మాత్రమే కనిపించేది. ఇప్పుడు సిటీ బస్సులోనేగాక పాదచారుల్లోనూ ఈ సాంప్రదాయం విస్తరిస్తోంది. మహిళల భద్రతా రంగంలోనేగాక ఫ్యాషన్ రంగంలోనూ స్కార్ఫ్ ఇప్పుడు బజ్ వర్డ్!

బుర్ఖాలు వేసే మహిళలు తీవ్ర అణిచివేతకు గురవుతున్నారనీ, వారిలో భావవికాసం లోపిస్తున్నదని కొందరు అమాయకులు తెగ ఆందోళన పడిపోతుంటారు.  ఈ ఆరోపణల నిగ్గు తేల్చడానికి కొన్ని గణాంకాలను, కొన్ని కొత్త పరిణామాలనూ పరిశీలించాల్సివుంది.




బుర్ఖా సాంప్రదాయాన్ని  పాటించని ఆంధ్రప్రదేశ్  ముస్లిం మహిళలకన్నా  బుర్ఖా సాంప్రదాయాన్ని  విరివిగా పాటిస్తున్న హైదరాబాద్ ముస్లిం మహిళలు విద్యారంగంలో చాలా ముందున్నారని ఇటీవలి గణాంక వివరాలు చెపుతున్నాయి. బుర్ఖావేసే మహిళలు ఛాందసులుగా వుంటారని అనుకోవడానికి కూడా ఆధారాలు లేవు. హైదరాబాద్ లో బుర్ఖాలువేస్తూనే మోడల్స్, టీవీ యాంకర్లు, సినిమా యాక్టర్లుగా పనిచేస్తున్న ముస్లిం మహిళలు వున్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో  ప్రైమ్ టైమ్ న్యూస్ రీడర్ ఆఫీసుకు బుర్ఖాతోనే వస్తుంది. ఐటీ రంగ దిగ్గజం ఐబీయం హైదరాబాద్  ప్లాంట్  వున్నతాధికారి హిజబ్ తోనే మిడియా కాన్ఫెరెన్స్ లో పాల్గొంటుంది. ఐగేట్ బెంగళూరు ప్లాంట్ హెచ్ ఆర్ మేనేజర్ బుర్ఖాతోనే ఆఫీసుకు వెళుతుంది. భారత దేశపు వాణిజ్య విమానాల తొలి మహిళా పైలెట్ సయ్యదా సల్వా ఫాతిమా హిజబ్ వేసుకునే విధులు నిర్వహిస్తుంది.





ఈ చర్చ సాగుతున్న కాలంలోనే జరిగిన  రియో ఒలింపిక్స్ లో ముస్లిం యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విశేషమైతే, వారిలో మెడల్స్ సాధించినవాళ్ళు ఇరవై మంది వరకు వుండడం మరో విశేషం. 400-మీటర్ల హర్డిల్స్ లో డలైలా ముహమ్మద్వోన్, జుడోలో మజ్లిందా కెల్మెందీ, జిమ్నాస్టిక్స్ లో ఆలియా ముస్తఫీన, రెజ్లింగ్ లో మరియా స్టాద్నిక్, వెయిట్ లిఫ్టింగ్ లో ఝజీర జఫర్ కుల్,  వహ్యూని అగస్తియానీ  ప్రదర్శనలు దీనికి గొప్ప ఉదాహరణలు. వీరిలో ఎక్కువమంది తల మీద హిజబ్ తోనే పోటీల్లో పాల్గొన్నారు. (http://www.siasat.com/news/muslim-women-who-have-won-medals-rio-olympics-pics-inside-1006438/). స్కైబాబాకు గతమూ తెలీదు వర్తమానమూ తెలీదు.  సంస్కృతీ తెలీదు. సాంప్రదాయమూ తెలీదు. 



 తుంటరి,  తంపులమారి 

ఇస్లాం ధార్మిక అంశాలపై  నేను ఎన్నడూ చర్చను లేవదీయలేదు. అది నా కార్యక్షేత్రం కాదు. స్కైబాబానే కాఫిర్లు, ఇస్లామీయత, ముస్లీమీయత, ఫాతెహాలు వంటి ధార్మిక అంశాల్ని చర్చకు పెడుతుంటారు. నిజానికి ఆ విషయాల రాజకీయార్ధిక, తాత్విక ధార్మిక గాఢతలు ఆయనకు తెలీవు. ఆ విషయాల మీద వారి రచనలు ప్రభావశీలమైనవీకావు. అందువల్ల ఈరకం రచనల్ని ముస్లీం సమాజం కూడా పట్టించుకోదు; స్పందించదు. 

ఇలా స్పందించకపోయినా వారు భరించలేరు. “ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండింది.  కానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి”  అని మదనపడిపోతుంటారు. 

స్కైబాబాకున్న తుంటరి తంపులమారి తత్త్వం ఏమంటే తనను ఎవరూ పట్టించుకోనపుడు ఎవరో ఒకరి మీద కొన్ని నిందలు వేసి వివాదంలోనికి లాగడం. ఇదో రకం గుర్తింపు సంక్షోభం. “తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా” చేస్తున్నారని వారు నిరాధార ఆరోపణలు చేసి వెలుగులోనికి రావాలనుకుంటారు. తను అనేక  పుస్తకాలు ప్రచురించినట్టు వారే చెప్పుకుంటుంటారు. వాటిల్లో నా గురించి ఏమైనా రాశారేమో కూడా నాకు తెలీదు.  నేనైతే ఇప్పటి వరకు రెండే పుస్తాకాల్ని ప్రచురించాను. వాటిల్లో స్కైబాబా గురించిగానీ అలాంటివారి గురించిగానీ ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ ఒక్క  వాక్యం ఒక్క పదం కూడా లేదు. నేను కదలక పోవడం ఏమిటో? వారిని కదలనివ్వకపోవడం ఏమిటో? ఆయనకే తెలియాలి. ఆత్మన్యూనతాభావంతో సతమతమయ్యేవాళ్ళు ఇలాంటి చిల్లర నిందలేసి గుర్తింపు తెచ్చుకోవడానికి తంటాలు పడుతుంటారు. 

స్కైబాబా తంపులమారితనాన్ని వివరించడానికి ఫేస్  బుక్ మిత్రులుందరికీ తెలిసిన ఒక తాజా ఉదాహరణ ఇస్తాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక యోగాను జాతీయ థెరపీలా మార్చేశారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినం  సందర్భాంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా హడావిడి చేశాయి. మీడియాలో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చాయి. దాన్ని ఖండించ దలచిన నేను యోగా, నమాజ్ డ్రాయింగ్స్ పక్కపక్కన పోస్ట్ చేస్తూ “శరీరానికి వ్యాయామం, మనసుకు ప్రశాంత చేకూరాలంటే యోగాయేకాదు నమాజ్ కూడా చేయవచ్చు” అని రాశాను. 

అమేరిక ప్రభావంతో కొత్త ఉత్తేజాన్నిపొంది ఫేస్ బుక్ లో ‘ఇస్లాంభూతాన్ని’ భూతద్దంలో చూపెడుతున్న వాల్స్ ఇప్పుడు చాలానే వున్నాయి. స్కైబాబా అలాంటి వాల్స్ లోనికి వెళ్ళీ “మజీద్ ల, దువా చేస్తున్న బొమ్మలు పెట్టి ఎంతో మంది టాగ్ చేస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి” అని రాశారు. అది చూసి వారు కొత్తగా నాస్తిక-హేతువాదిగా మారారని అనిపించింది. వారు అలావున్నా అదో ఇది. కానీ వారు అలా వుండలేరు. వారు అలానే కాదు ఎలానూ వుండలేరు. 

నేను ఈ వ్యాస భాగాలు రాస్తున్న కాలంలోనే పది రోజుల క్రితం నా మెసేజ్ బాక్స్ కు వారు ఓ పాట వీడియో లింకు పంపించారు. దాన్ని వారే ప్రొడ్యూస్ చేశారు. అది నాకు నచ్చితే షేర్ చేయాలని కోరారు. వారి కోరిక ప్రకారం దాన్ని నేను షేర్ చేశాను. అందులో అజా, మసీదు,  నమాజ్ దృశ్యాలున్నాయి. నేను నమాజ్ డ్రాయింగ్స్ పెడితే వారు ఏకంగా నమాజ్ వీడియో క్లిప్పింగులు పెట్టారు. దీన్ని ఏమంటారూ? తంపులమారితనమా? అమాయకత్వమా? ఏం చేస్తున్నారో స్పృహలేనితనమా? వెర్రా? కపటమా? 
స్కైబాబా కమ్ కమాలుద్దీన్  ముల్లాల భాష

స్కైబాబా 2007 ద్వితీయార్ధంలో ముస్లీంవాదంపై  చర్చగా వార్తా దినపత్రిక సాహిత్య పేజీలో స్కైబాబా వరుసగా వ్యాసాలు రాస్తున్న కాలంలో కమాలుద్దీన్ పేరిట స్కైబాబాను సమర్ధిసూ‘సాహిత్య ముల్లాల ఫత్వాలకు కాలం చెల్లింది అనే వ్యాసం అదే పత్రిక అదే పేజీలో అచ్చయింది. 

అందులో వారు రాసిన వాక్యాలివి :

 “.... డానీ ముస్లిమేతరుల్ని పెండ్లాడి ముస్లిమీయతను కోల్పోయారు. హిందూ స్త్రీల ప్రభావంవల్ల ఇప్పటికే ముస్లిం సాహిత్యం చాలామంది సాహిత్యకారుల్ని కోల్పోయింది. ......... ముస్లింలుగా ఎప్పుడో చచ్చిపోయిన వీళ్ళు హఠాత్తుగా ఇప్పుడు కళ్ళు తెరచి తాము ముస్లీంలమని చెప్పుకోవడం మనుగడ కోసమే”

అప్పట్లో వీటిని అంతగా పట్టించుకోలేదుగానీ ఇప్పుడు సమయం వచ్చింది. మొదట్లో కమాలుద్దీన్ ని స్కైబాబాను సమర్ధించే ఒక రచయిత అనుకున్నాను. అయితే ఆ పేరుగల రచయితను అంతకు ముందుగానీ ఆ తరువాతగానీ  వ్యక్తిగతంగా కానీ రచనల్లోగానీ ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆ వ్యాసాన్ని స్కైబాబాయే రాశారనే అభిప్రాయానికే బలం చేకూరుతోంది.  దాదాపు నిర్ధారణ కూడా అయిపోయింది. 

ఒకవైపు, జమాత్ ల అతివాదాల మూలంగా ముస్లింలు ముస్లిమేతరుల మధ్య దూరం పెరిగిపోతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూనే మరోవైపు మతాంతర వివాహాలు చేసుకున్న ముస్లిం పురుషుల్ని “ ఇస్లామీయతను కోల్పోయారు” అంటూ  నిందించగల సమర్ధులు వారు.  మతాంతర వివాహాలు చేసుకునే ముస్లిం పురుషుల్ని హిందూత్వవాదులు లవ్ జిహాద్ అంటూ నిందిస్తున్నారు. స్కైబాబాది  కూడా సరిగ్గా  అదేమార్గం. తన వాదనతో వారు హిందూత్వవాదుల్ని సమర్ధిస్తాఉంటారు. మరోవైపు ఇస్లామీయతను/ముస్లిమీయతను కోల్పోయారంటూ మొరటు ముల్లాల భాషను ప్రయోగిస్తుంటారు. ఒకే సందర్భంలో నాస్తికునిగా, హిందూత్వవాదిగా, ముల్లాగా  ప్రవర్తించగలగడం ఒక్క స్కైబాబాకే సాధ్యం. 

వారికంటూ ఒక నీతి ఒక నియమం (స్టాండ్ పాయింట్) లేదు. ఒక నీతీ ఒక నియమం లేని వాళ్ళను ఏమైనా అనవచ్చుగానీ ఆలోచనాపరులు అని మాత్రం అనలేం. అంతకన్నా కీలకమైన విషయం ఏమంటే  వారు  ముస్లిం సమాజం లోపల నిలబడి  మాట్లాడుతున్నారో, బయట నిలబడి విమర్శిస్తున్నారో ఎన్నడూ తేల్చరు. నిరంతరం  లోపల-బయట ఆట ఆడుతుంటారు. 

ఈసారి చర్చలో కూడా ‘కొత్తగా ఇస్లాంవాది”నయ్యానని జులై 8న  వారు చేసిన ఆరోపణ కూడా కమాలుద్దీన్ గా మారువేషం వేసి చేసిన విమర్శలకు కొనసాగింపే.  ఈ ఆరోపణ మీద  వారిని కొన్ని వివరాలు అడగాలి. ముస్లిమీయత అంటే ఏమిటీ? ఏ విధులు నిర్వర్తిస్తే  ముస్లీమీయత/ ఇస్లామీయత వస్తుందీ? ముస్లీమీయత/ ఇస్లామీయత కొనసాగాలంటే ఏ విధులు నిర్వహిస్తూ వుండాలీ? ముస్లీమీయత/ ఇస్లామీయ్తల్ని కోల్పోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది?  అలా  కోల్పోయిన ముస్లీమీయత/ ఇస్లామీయ్తల్ని తిరిగిపొందాలంటే ఏ విధులు నిర్వహించాలీ? ఈప్రశ్నలకు స్కైబాబా వివరణ ఇవ్వకతప్పదు. ఎందుకంటే వారు చేసింది సిధ్ధాంత చర్చకాదు వ్యక్తిత్వహననం.  



“సాహిత్యంలో  వ్యక్తిగత జీవితాలు వుండవు. పబ్లిక్‍ లోకి రానంత వరకే ఏదైనా. పబ్లిక్ లోనికి వచ్చాక ఏదైనా అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది”అనే ‘హక్కు’ ను ఉపయోగించుకుంటూ  స్కైబాబా కమ్ కమాలుద్దీన్  నా వైవాహిక జీవితాన్ని బహిరంగ చర్చకు పెట్టారు. అంచేత ఇక్కడ అనివార్యంగా కొన్ని వ్యక్తిగత విషయాలను చెప్పాల్సి వస్తున్నది. 


PERSONAL  LIFE
నేను రెండుసార్లు పెళ్ళి చేసుకున్నాను. మొదటిసారి నా స్నేహితురాలు చొప్పరపు ఉషారాణిని 1978 ఆగస్టు 26న విజయవాడలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్ళి చేసుకున్నాను.  ఆమెది నరసాపురం; కాపు సామాజికవర్గం. మేము పెళ్ళి చేసుకోవడం వాళ్ళ కుటుంబంలో కొందరికి ఇష్టంలేదు.  కాపురానికి రాకముందే1978 అక్టోబరు 3న నరసాపురంలో ఆమె చనిపోయింది. ఆమె గుర్తుగానే నా కలం పేరు ఉషా యస్ డానీ అయింది. 

s

ఉషకు విప్లవ కమ్యూనిస్టు సంఘాలతో సంబంధాలుండేవి. ఆమె చనిపోయాక ఆ రాజకీయాల మీద నాకు ఆసక్తి పెరిగింది. వాటిల్లో నేను నా శక్తిమేరకు పెద్ద బాధ్యతల్నే నిర్వర్తించాను. నాకు అప్పచెప్పిన ప్రతి బాధ్యతనూ విజయవంతంగా నిర్వర్తించాను. లైఫ్ రిస్క్ వున్న సందర్భాలలోనూ ఎన్నడూ వెనకడుగు వేయలేదు.   

నా వ్యక్తిత్వం,  పనితీరు నచ్చి కృష్ణాజిల్లా రైతుకూలీ సంఘం కార్యదర్శి ఏలూరి భీమయ్య తన కుమార్తె ఏలూరి అజితను నాకు ఇచ్చి 1983 ఏప్రిల్ 27న కమ్యునిస్టుపార్టీ పెళ్ళి చేశారు. మతాంతర వివాహం కనుక చాలామంది మాది ప్రేమ వివాహం అనుకుంటుంటారు. మాది అరేంజెడ్‍ మ్యారేజ్. పెళ్ళికి ముందు మా మధ్య వ్యక్తిగత పరిచయం కూడా లేదు. కవి-విప్లవకారుడు నిమలూరి భాస్కరరావు (మల్లిక్) మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు. మా మావయ్య భీమయ్య పేదవారేమీ కాదు. పుట్టెడు సంతానం వున్న వ్యక్తీ కాదు. కృష్ణాజిల్లాలో (ఇప్పటి సీఆర్ డియే ప్రాంతంలో) పధ్నాలుగు ఎకరాల మధ్యతరగతి రైతు. నందిగామ, పెనుగంచిప్రోలు ప్రాంతంలో పరపతిగల కుటుంబం. వాళ్ళకు అజిత ఏకైక సంతానం. 

నా పెళ్ళికి ఇంకో ప్రత్యేకత కూడా వుంది. మా పెళ్ళికి పురోహితుడు చలసాని ప్రసాద్. ఆయన వంద వరకు పార్టీ పెళ్ళిళ్ళు చేశాడు.  వాళ్లంతా అనేక కారణాలతో విడిపోయారు. నేనూ అజిత దానికి మినహాయింపు. మేము కూడా విడిపోతే ఒక రికార్డు అవుతుందని చలసాని సరదాగా అంటూండేవాడు. ముస్లింల దాంపత్యం మీద సాధారణంగా  రెండు అపోహలు వుంటాయి. వాళ్ళు సులువుగా విడాకులు తీసుకుంటారనీ, నలుగుర్ని పెళ్ళిచేసుకుంటారనీ. ఈ  అపోహలు  తప్పని నిరూపించాల్సిన సామాజిక బాధ్యత నా మీద వుంది. 99 హిందూ జంటలు విడిపోయినా ఆ మత నమూహానికి రాని నిందను నేను ఒక్కడ్ని విడిపోతే నా మత సమూహం భరించాల్సి వుంటుందని నాకు తెలుసు. నేను నా మత సమూహానికి అలాంటి చెడ్ద పేరు తేదలచలేదు. 

వుభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఆధిపత్య సమూహం. కృష్ణాజిల్లాలో కమ్మ సామాజికవర్గం ఆధిపత్య సమూహం. ఒక ముస్లిం యువకుడు పశ్చిమ గోదావరిజిజాల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన అమ్మాయి ప్రేమను పొందడం, కృష్ణాజిల్లాలో  కమ్మ సామాజికవర్గానికి చెందిన కుటుంబంతో బంధుత్వాన్ని పొందడం అంత సామాన్యమైన విషయం కాదు. 

హిందూ సామాజంలోని కాపు, కమ్మ సామాజికవర్గాలతోనేకాదు ఈడిగ (గౌడ), దళిత సామాజికవర్గాలతోనూ నాకు బంధుత్వాలున్నాయి.  ఆ సామాజికవర్గాల్లో నాకు అక్కలు, బావలు, మరదళ్ళు, బావమరుదులు, తోడల్లుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు ఒకటేమిటీ అందరూ వున్నారు. అన్నట్టు నన్ను మంచి అల్లుడని మా అత్తరింటి వాళ్ళంతా అనుకుంటుంటారు. ఈ వివరాలు తెలిశాక నేను నాలుగుసార్లు ముస్లిమీయతను కోల్పోయానని ముల్లా స్కైబాబా ఒక ఫత్వా జారీ చేసినా ఆశ్చర్యపడాల్సిందేమీలేదు!  

నాస్తిక- హేతువాదాల మీద నాకు సదభిప్రాయం వుండేదికాదు. వర్గాన్ని గుర్తించనివాళ్ళతో శ్రామిక జనానికి ఒనగూడేది ఏమీ వుండదు. అయితే, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలంగా వున్న కాలంలో నేను నాన్ – ప్రాక్టీసింగ్ ముస్లింగా వుండేవాడిని.  

ఖలిస్తాన్ ఉద్యమ కాలంలో 1984 ప్రాంతాల్లో దేశమంతటా శిక్కు వ్యత్రేక ప్రచారం బలంగా సాగింది. ఆ సాహిత్యాన్ని చదువుతున్న సమయంలో ముస్లింలకు వ్యతిరేకంగా కూడా అలాంటి దుష్ప్రచారం సాగుతోందని తెలిసింది.  జాతియోద్యమంతోసహా అనేక రంగాల్లో దేశాభివృధ్ధికి ముస్లీంలు చేసిన కృషిని కప్పిపుచ్చే ప్రయత్నం ఒక పథకం ప్రకారం జరుగుతున్నదని అర్ధం అయింది. దీన్ని పట్టించుకోవాలి అనుకున్నాను. 1987 తరువాత గట్టిగా పట్టించుకోవడం మొదలెట్టాను. ఆ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల విరామం తరువాత 2000లో మళ్ళీ ప్రాక్టీసింగ్  ముస్లీంగా మారాను. 

స్కైబాబా మద్దతుదారులు ఎవరో నా వుంగరాల గురించి కూడా ఇటీవల ఫేస్ బుక్ లో చర్చ చేశారు. అదీ ఒకందుకు మంచిదే. అపోహలన్నీ దూరం కావలసిందే. కమ్యూనిస్టులు బంగారాన్ని ధరించడం మంచి సాంప్రదాయం కాదు.  ముస్లిం పురుషులు కూడా బంగారం ధరించకూడదు. బంగారు ఆభరణాలతో మసీదుల్లో ప్రవేశించకూడదు.  నా ఎడమ చేతివుంగ్రాన్ని ఉష ఇచ్చింది. కుడిచేతి వుంగరాన్ని అజిత ఇచ్చింది. ఉష చనిపోయిందిగాబట్టి ఆ వుంగరాన్ని తీసేయలేను. ఉష వుంగరాన్ని  కొనసాగించినంత కాలం అజిత వుంగరాన్ని నిరాకరించలేను. శుక్రవారం మసీదుకు వెళుతున్నప్పుడు వుంగరాలు తీసేస్తాను. రంజాన్ నెలంతా వుంగరాలు తొడగను. ఉష యిచ్చిన వుంగరం నక్సలైట్ వుద్యమంలో చాలా వుపయోగపడింది. ఆ వుంగరాన్ని తాకట్టు పెట్టే అప్పట్లో బహిరంగ సభలు జరిపేవాళ్ళం. ఆ వివరాలు శ్రీశ్రీ-విశ్వేశ్వరరావు -60 జ్ఞాపికలో రాశాను. 

మతసామరస్య జీవితం

నేను ప్రతి శుక్రవారం మసీదుకు వెళతాను. రంజాన్ నెలలో ఉపవాసాలు వుంటాను. మరీ ఆరోగ్యం అనుమతించని కారణంగా రెండేళ్ళుగా చివరి వారం రోజులే ఉపవాసం వుండగలుగుతున్నాను. మా అమ్మానాన్నల్ని ఖననం చేసిన ఖబరస్తాన్ కు షబే ఖదర్ రోజు వెళ్ళడం నేను పాటించే ఒక సాంప్రదాయం. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా  ఆ ఖబరస్తాన్ ముందు ఆగి సలామ్ చేస్తాను.

మా రెండవవాడు యూరప్ టూర్ కు వెళ్ళినపుడు ఈఫిల్ టవర్, పీసా టవర్ వగయిరాలు చూసినా చూడకపోయినా లండన్ హెగైట్ శ్మశానంలో కార్ల్ మార్క్స్ సమాధిని తప్పక చూసి రమ్మన్నాను. నేను ముహమ్మద్ ప్రవక్తను అభిమానించినంతగా  కార్ల్ మార్క్స్ ను గౌరవిస్తాను. ముస్లింవాదానికి సామ్యవాదం తోడుకావాలనేది నా ఆకాంక్ష. యూదుడయిన మార్క్స్ కు ఇస్లాం మీద ఎలాంటి అభిప్రాయాలుండేవి అనేవి ఇక్కడ అప్రస్తుతం. ఆయన ప్రతిపాదించిన కమ్యూనిజం మహత్తరమైనది. అంబేడ్కర్ విషయామూ అంతే. భారత ముస్లీంలకు అంబేడ్కర్ తో కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. అలాంటి కొన్ని మినహాయింపుల్ని పక్కనపెడితే అంబేడ్కర్ ప్రతిపాదించిన దళిత విముక్తి సిధ్ధాంతం మహత్తరమైనది.

నా సామాజిక సామరస్య సిధ్ధాంతం లాల్ సలామ్, నీల్ సలామ్, హర్యాలీ సలామ్. శ్రామికులు, ఆదివాసులు, దళితులు, ముస్లింలు కలిసి నడిచినపుడే ఎవరికయినా విముక్తి సాధ్యం అవుతుంది. విడిగావుంటే ఎవరికీ విముక్తి దక్కదు. భాగవతంలో తనను చంపబోయే  దేవకి పిల్లల్ని పుట్టగానే కంసుడు చంపేసినట్టు, బైబిల్ కథల్లో రోమన్ చక్రవర్తి హీరోద్ బెత్లెహేమ్ లోని పిల్లలందర్నీ చంపేసినట్టు (The Massacre of the Innocents) భారత దేశంలో శ్రామికులు, ఆదివాసులు, దళితులు, ముస్లింల సమాఖ్య ఏర్పడే అవకాశాల్ని పురిట్లోనే సంధికొట్టడానికి  అంతర్జాతీయంగా భారీ ప్రయత్నాలు సాగుతున్నాయి.  

మా ఇంట్లో రంజాన్ పండుగను వేడుకగా జరుపుకుంటాము. దీనికి ఒక సెంటిమెంట్‍ కూడా వుంది. 2004లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన ఒక నక్సలైట్ నాయకుడ్ని నేనూ అజిత ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో దింపి వచ్చాము. దండకారణ్యంలో అజితకు పాల్సిపారిమ్ మలేరియా, డెంగూ సోకాయి. తీవ్రఅనారోగ్యం పాలయ్యింది. తను చనిపోతుందని నవంబరు 16న డాక్టర్లు ప్రకటించారు. ఆరోజు రంజాన్ పండుగ. ఆ సందర్భంగా  కేర్-బంజారాకు  వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చిన ఆత్మీయుల్ని ఏడాదికి ఒకసారయినా కలుద్దామనుకున్నాము. మా కుటుంబ సభ్యులుతప్ప అప్పుడు వచ్చి పలకరించినవాళ్ళందరూ హిందూ సమాజానికి చెందినవాళ్ళే. అలా మా ఇంట్లో రంజాన్ పండుగ హిందూ అతిధులతోనే జరుగుతుంది. దీన్నే ఈద్ మిలాప్ అనుకోవచ్చు.

పరోటా, పాయా, ఒక కూరగాయకూర, పెరుగు, యాపిల్ నా సహేరీ మెను. ఇఫ్తార్ తరువాత తెలంగాణలో హలీమ్ తిన్నట్టు ఆంధ్రాలో గెంజి తాగుతారు. అది కేరళ-తమిళ సాంప్రదాయం. ఏది వండాలో ఎలా వండాలో  అనే విషయాల్లో నాకు ఇతరులకు చికాకు కల్పించేంత నిర్ధిష్ట అభిరుచి వుంది. నా కోసం వంట చేయడం అంత ఈజీ వ్యవహారంకానప్పటికీ  రంజాన్ నెలలో నా సహేరీ, ఇఫ్తార్ ఏర్పాట్లు మా అత్తగారే చూసుకుంటారు.

వాళ్ల నాన్న కమ్యూనిస్టు కావడాన అజితకు పూజలూ వగయిరా అలవాటు లేదు. వినాయక చవితి, దశరా, దీపావళి సందర్భంగా ఇంట్లో మా అత్తగారు పిండివంటలు చేస్తారు. జనవరి 15 అజిత పుట్టిన రోజు కూడా కావడంతో సంక్రాంతిని మా ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తాం. అత్తగారు బిర్లా టెంపుల్ కు వెళతానంటే తీసుకుపోతాను.  కారు ప్రయాణం మధ్యలో ఏ దైనా గుడికి వెళ్ళి వస్తానంటే రోడ్డు మీద వెయిట్ చేస్తాను.

పాత్రికేయ వృత్తిలో భాగంగా అనేక హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆలయ మర్యాదలతో గర్భగుడి వరకు వెళ్ళిన సందర్భాలున్నాయి. బొట్టు పెట్టినా, హారతి ఇచ్చినా, శఠగోపం పెట్టినా నిరాకరించలేదు. నాస్తిక హేతువాద ఉపన్యాసాలు దంచలేదు. ఎంతో నిష్టగా చేయడంవల్ల కాబోలు గుళ్ళలో ప్రసాదాలు చాలా రుచిగా వుంటాయి. తిరుపతి వేంకటేశ్వరస్వామివార్ల, అన్నవరం సత్యనారాయణస్వామివార్ల ప్రసాదాలు   మళ్ళీ మళ్ళీ అడిగి తినాలనిపిస్తాయి. నరసాపురం పెద్ద దర్గాలో ఉర్సు సందర్భంగా చేసే ఉత్తిపలావు కూడా ఎంత రుచిగా వుండేదో చెప్పలేను. నరసాపురం పాత బజారులో చిన్న మసీదు  పక్కనున్న హజ్రత్ ఖాంజాన్ ఖాన్ దర్గాలోని వలీవుల్లా మా పూర్వీకులే. ఆ నేపథ్యంలోనే మా ఇంటిపేర్ల చివర జర్రానీ అనే గౌరవనామం కూడా వచ్చిచేరింది. నేను రచయితను కావడంవల్ల ఆ దర్గా స్థలపురాణం రాయమంటూ చనిపోయే వరకూ మా అమ్మ పోరుతూనే వుండేది.

సేవాధర్మంగానో, స్నేహ ధర్మంగానో హిందూ యాగాలు, పూజలు, అంత్యక్రియలు  వంటివాటికి కూడా కొన్ని సందర్భాల్లో  ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. మంగళగిరి గుడిలో ఒకసారి, గుంటూరు గుడిలో ఇంకోసారి ఇద్దరు స్నేహితుల ప్రేమ వివాహం కోసం అమ్మాయిల తండ్రిగా మారి అళ్ళుళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను.

క్రైస్తవ, శిక్కు, జైన, జొరాస్ట్రియన్ సమూహాలతోనూ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాజస్థాన్ కు చెందిన హరిప్రసాద్ ఖండేల్ వాల్ ఇంట్లో ఏడాదిన్నర  వున్నాను. టోటల్లీ వేగన్. ఆ కాలంలో  కోడికూర కాదుకదా కోడిగుడ్డు కూడా తినలేదు. ఓసారి వేసవిలో విజయవాడ వచ్చిన ఓ జైన గురువుకు గాల్పు కొడితే హాస్పిటల్ లో చేర్చారు. జైన గురువుల ఆహార నియమాలు చాలా కఠినంగా వుంటాయి. ఆ నాలుగు రోజులు వారికి ఆహార సరఫరాను పర్యవేక్షించే పనిని హరిభాయ్ నాకు అప్పచెప్పారు. విజయవాడ ఒన్ టౌన్ బంగారుకొట్ల బజార్ లోని బాలాజీ మందిరంలో హోళీ వేడుకల కోసం భంగు తయారీ పనుల్లో నేనూ పాల్గొనేవాడ్ని.

శ్రీరామ నవమి, వినాయక చవితి, దసరా సందర్భంగా ఆ తొమ్మిది రోజులూ నాటకాలు, బుర్రకథలు చూస్తూ ఆ పందిళ్ళలోనే వుండేవాళ్ళం. అప్పట్లో శ్రీరామ నవమికి రామాలయంలో భోగం మేళం కూడా పెట్టేవారు. మాపేటలోని ముస్లిం మహిళలు చూడడం కోసం ఒక పూట పర్దాలు కట్టి ప్రత్యేక మేళం ఏర్పాటు చేసేవారు. సంక్రాంతి, శివరాత్రి, అంతర్వేది ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. నరసాపురం కనకదుర్గ గుడి పూజారి కొడుకు ( తరువాత తనే పూజారి అయ్యాడు) మాకు మంచి దోస్తు. శుక్రవారం మసీదుకు వెళ్ళినట్టు శనివారం కనకదుర్గ గుడి దగ్గర చేరేవాళ్ళం. అక్కడ కొబ్బరి చెక్కలు, అరటి పండ్లు తినడం ఒక సరదా. మా నాటక సమాజంలో నేనుతప్ప మిగిలినవాళ్ళందరూ హిందువులే. మాది పులిహోర-పలావు అనుబంధం.

కారంచేడు ఉద్యమ కాలంలో  నా షెల్టర్, భోజన వసతి మాదిగ సామాజికవర్గం, క్రైస్తవుల ఇళ్లలో వుండేది.

లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆదివాసులతో నా అనుబంధం మరీ ప్రత్యేకమైనది. అప్పట్లో బలహీనవర్గాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగావుండగా బొక్కాపరంజ్యోతి, గోసాల ఆశీర్వాదంతో కలిసి నెల్లూరులో యానాదుల మహాసభ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా యానాది సంఘాల సమాఖ్యను నెలకొల్పాము.
 

ఆదివాసులు చెట్లనీ పుట్టలని పూజిస్తారని నేను వాటిని పూజించను. అన్ని సందర్భాలలోనూ ఒక్కటే నియమం. ఇతర మతస్తులు పవిత్రంగా భావించే వేటినీ అగౌరవపరచను. వాళ్ళు మహాత్యంగా భావించే వేటినీ విశ్వశించను.  నా నమ్మకాలను పెళ్ళాం బిడ్డల మీద కూడా రుద్దను.  నా ధార్మిక విశ్వాసం చాలా చిన్నది; “లా ఇలాహా ఇల్లల్లా’. అంతే.