Friday 20 November 2020

America Elections and Andhrapradesh Politics

 America Elections and Andhrapradesh Politics

అమెరికా ఎన్నికలు.. ఆంధ్రా రాజకీయం!

డానీ

Nov 20, 2020, 08:14 IST

Danny Article On Amaravati Politics And America Elections - Sakshi

విశ్లేషణ 

తను ఓడిపోతే అమెరికాలో అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ, శ్వేతజాతీయులకు భద్రత కరువవుతుందని ట్రంప్‌ గట్టిగా ప్రచారం చేసినా.. అమెరికా ఓటర్లు ట్రంప్‌నే పక్కన పడేశారు. అలాగే తనకు ఓటేయకపోతే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ చంద్రబాబు కూడ గత ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు ఆయన్నే అధికారం నుండి తొలగించారు. రాజధానిని మూడు విభాగాలుగా చేసి మూడు ప్రాంతాలకు పంచుతూ కొత్త ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది బిల్‌ వెనుక ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే సూత్రం ఉంది. దీన్ని పట్టించుకోకుండా ప్రజల ఆకాంక్షలను వమ్ముచేసి.. భద్రలోకం కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వాలకు అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ప్రజలు ఒకేలా బుద్ధి చెబుతారు. అభద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారు. 

అమెరికాలో మార్క్సిస్టుల ప్రభావంతో  ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ అంటూ మొదలయిన ఉద్యమంలో ఫాసిస్టు వ్యతిరేక బృందాలు (యాంటిఫా), ముస్లింలు, శ్వేతజాతీయుల్లోని ఉదారవాదులు, డెమోక్రాట్స్‌ తదితరులు కలవడంతో అది ‘‘ఆల్‌ లైవ్స్‌ మేటర్‌’’ ఉద్యమంగా మారింది. ట్రంపిజాన్ని మొత్తంగా ఓడించకపోయినా దాన్ని అధిగమించి అధికార పీఠాన్ని మార్చగల శక్తిగా ఆవిర్భవించింది. అమెరికా ఉద్యమం  ముందుకు తెచ్చిన ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే విలువలకు వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక  ప్రాసంగికత వుంది. గత ప్రభుత్వాధినేత చంద్రబాబు తన బ్రాండ్‌ ఇమేజ్‌గా ప్రచారం చేసుకున్న పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో ఈ సంబంధాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. 

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం – 2014లో జాతీయ హోదా కల్పించారు. ఇందులో ఇరిగేషన్, హైడల్‌ పవర్‌ అనే రెండు కాంపోనెంట్లు వున్నాయి. హైడల్‌ పవర్‌ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకూడదనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తానే స్వయంగా నిర్మించాలనుకుంది. ఇక ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వరకు ఎంత ఖర్చయితే అంత నూటికి నూరు శాతం నిధుల్ని కేటాయించాల్సిన  బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ చట్టబద్ధ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోజాలదు. ఇరిగేషన్‌ కాంపోనెంట్లో మళ్ళీ రెండు విభాగాలున్నాయి. మొదటిది ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, రెండోది డ్యామ్‌ నిర్మాణం.  2019 ఫిబ్రవరి 18 నాటికి ఈ రెండు విభాగాల నిర్మాణ  వ్యయం 55,548.87 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో, ఆర్‌–ఆర్‌ ప్యాకేజీ, డ్యామ్‌ నిర్మాణ వ్యయాలు దాదాపు 60 శాతం, 40 శాతంగా వుంటాయి. 

పోలవరం నిర్వాసితుల్లో అత్యధికులు ఆదివాసులు. 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రాజెక్టు ఆయకట్టులోనే  పునరావాసం ఏర్పాటు చేయాలి. సహాయక, పునరావాస (ఆర్‌–ఆర్‌) ప్యాకేజీని సంపూర్ణంగా అమలు పరిచాకే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన  పోలవరం ప్రాజెక్టు అ«థారిటీ (పీపీఏ) నుండి నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్‌–ఆర్‌ ప్యాకేజీని పక్కన పెట్టి ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మీద దృష్టిని సారించింది. ఆ విభాగంలో దాదాపు 16 వేల కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పుకుంది. అయితే ఆర్‌–ఆర్‌ ప్యాకేజీ విభాగంలో ఇప్పటివరకు నాలుగో వంతు కూడా ఖర్చుపెట్టలేదు. 

దాదాపు ఈ కాలంలోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ద్వారా రాజధాని అమరావతి ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి చారిత్రకంగా కొన్ని ఒప్పందాలున్నాయి.  1937 నవంబర్‌ 16 నాటి శ్రీభాగ్‌ ఒప్పందంలో ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకుని పోవడం’ అనే ప్రాతిపదికన రాయలసీమ, మధ్య ఆంధ్రా, ఉత్తరాంధ్రాలకు రాజధాని, హైకోర్టు, యూనివర్శిటీలను పంచుకున్నారు. ఆ ప్రకారం 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో మరో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్రరాష్ట్రం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. 2014 లో మళ్ళీ పునర్‌ వ్యవస్థీకరణ జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి అలనాటి ఆంధ్రరాష్ట్రం విడిపోయింది. అంటే శ్రీభాగ్‌ ఒప్పందం మళ్ళీ అమల్లోకి రావాలి. కానీ, అలా జరగలేదు. 

రాజధాని విభాగాల మీద రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు హక్కులు లేకుండా శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలన్నింటినీ అమరావతిలోనే నెలకొల్పే ప్రయత్నాలు సాగాయి. ఇవి అత్యంత సహజంగానే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నిరసనలకు దారి తీశాయి. వారు తమదైన రోజు కోసం ఎదురు చూశారు. ఆ ప్రాంతాల ‘విద్యావంతుల వేదికలు’, ‘డెవలప్‌మెంట్‌ ఫోరం’ల నినాదాల సారాంశం కూడా ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’. గత ప్రభుత్వం పోలవరం, అమరావతుల్లో అనుసరించిన అభివృద్ధి నమూనాలను గమనిస్తే అడవి, మైదానాల మధ్య వివక్ష ఏ స్థాయిలో సాగిందో అర్థం అవుతుంది. అమరావతి ప్రాజెక్టులో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌  ప్రాజెక్ట్‌ అంటూ భూ సమీకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ భూముల్ని పారిశ్రామిక, వాణిజ్య, నివాస భూములుగా మార్చి స్థానిక భూ యజమానుల సంపదను పెంచే పథకాలను రచించారు. 

పోలవరంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమూ లేదు; భూసేకరణ పథకాన్ని అమలుచేసే నిజాయితీ లేదు. స్థానికుల సంపదను పెంచే ఊసే లేదు. ఫలితంగా, పోలవరం ముంపు మండలాల్లో ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ వంటి నినాదాలు ముందుకు వచ్చాయి.  తను ఓడిపోతే అమెరికా కమ్యూనిస్టుల పాలవుతుందని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ, శ్వేతజాతీయులకు భద్రత కరువవుతుం దని ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌ గట్టిగా ప్రచారం చేశారు. కానీ అమెరికా ఓటర్లు ట్రంప్‌నే పక్కన పడేశారు. దాదాపు ట్రంప్‌ పద్ధతుల్లోనే తనకు ఓటేయకపోతే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ  చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు వారినే అధికారం నుండి తొలగించారు. 

ఆ ప్రాంతాల్లోని 87 శాతం అసెంబ్లీ సీట్లలో గత అధికార పార్టీ ఓడి పోయింది. ఎన్నికల్ని ప్రజాభీష్టానికి భారమితిగా భావిస్తే, అమరావతి పోలవరం ప్రాజెక్టుల గురించి బాబు చేసిన ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆసక్తి లేదని తేలిపోయింది. యాదృచ్ఛి కమే కావచ్చుగానీ, రాజధానిని మూడు విభాగాలుగా చేసి మూడు ప్రాంతాలకు పంచుతూ కొత్త ప్రభుత్వం తెచ్చినది ఆంధ్రప్రదేశ్‌ డీసెం ట్రలైజేషన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆల్‌ రీజియన్స్‌ బిల్‌ వెనుక ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే సూత్రం వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అధికశాతం రాజకీయ పార్టీలకు విజయవాడ, గుంటూరుల్లో ఆర్థిక పునాదులున్నాయి. అవి విజయవాడ, గుంటూరు రంగు కళ్ళద్దాల నుండి రాష్ట్రాన్ని చూడడం మొదలెట్టాయి. రాష్ట్రంలో మరో 11 జిల్లాలున్నాయని గత ఎన్నికల్లో ప్రజలు గుర్తు చేసినా ఆ పార్టీలకు అర్థం కాలేదు. రాజధానికి చెందిన రెండు విభాగాలను అమరావతి నుండి తరలించడాన్ని నిలిపివేయాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఇటీవల హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. అంతటి స్థిర నిర్ణయాన్ని వారు పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ విషయంలో ప్రదర్శించలేకపోయారు. ఏమిటీ దీని అర్థం? 

 పెట్టుబడిదారీ వ్యవస్థ పుంజుకుంటున్న దశలో ప్రాజెక్టులకు గొప్ప గౌరవం వుండేది. ఆధునిక దేవాలయాలు అని కొనియాడేవారు. అదొక దశ. సరళీకృత అర్థిక విధానం విజృంభించాక ప్రాజెక్టుల లోపల దాగున్న చీకటి కోణాలు వెలుగులోనికి రావడం మొదలయింది. ప్రాజెక్టులు భౌగోళికంగా ధనిక, పేద వర్గాల మధ్య ఒక విభజన రేఖను గీస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఆయకట్టులోని భూ యజమానులకు నిస్సందేహంగా వరమే; కానీ రిజర్వాయర్‌ ముంపు ప్రాంత నివాసులకు అది శాపం. నీటిపారుదల ప్రాజెక్టులు వ్యవసాయ భూములున్నవారి సంపదను పెంచడమేగాక భూమిలేనివాళ్ళ కష్టాలనూ పెంచుతాయి. అమరావతి ప్రాజెక్టు వల్ల విజయవాడ గుంటూరు నగరాల్లో భూముల ధరలు, ఇళ్ళ అద్దెలు భారీగా పెరిగిన మాట వాస్తవం. కానీ, స్వంత భూమిలేక అద్దె ఇళ్లలో వుండేవాళ్ళ పరిస్థితి ఏమిటీ? అంచేత, ఆధునికానంతర కాలంలో ప్రాజెక్టుల మీద పునరాలోచనలు మొదలయ్యాయి. ప్రాజెక్టులవల్ల లబ్ధిపొందని సామాజిక వర్గాలకు నగదు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు ఈ నేపథ్యంలోనే వచ్చాయి. ఈ సందర్భంలో  ప్రస్ఫుటంగా కనిపించే అమానుషం ఏమంటే ప్రాజెక్టులవల్ల లబ్ధిపొందిన వర్గాలు నగదు బదిలీ పథకాలని ‘పప్పుబెల్లాలు’ అంటూ హేళన చేస్తాయి. ‘పప్పుబెల్లాల’ పంపిణీలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతున్నదని పెద్ద గోల చేస్తాయి. ఇది ఆర్థిక అహంకారం. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే భద్రలోకం సంపదను మరింతగా పెంచడం మాత్రమే. ఇది అసలు సిసలు ఆర్థిక అహంభావం.  భద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ప్రజలు ఒకేలా బుద్ధి చెపుతారు. అభద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారు. 

(రచయిత సీనియర్‌ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు మొబైల్‌ : 90107 57776)

రచన :  6 నవంబరు 2020

ప్రచురణ :  సాక్షి దినపత్రిక, 20 బనవంబరు 2020


https://www.sakshi.com/telugu-news/guest-columns/danny-article-amaravati-politics-and-america-elections-1328374?fbclid=IwAR2Dy5gH9n9bDUB0SbPMNheA8irDl8z98gubu1shmICNnkdx6yZPgUdt3II




Wednesday 18 November 2020

Unity and Struggle and People's War

 పీపుల్స్ వార్ తో ఐక్యత ఘర్షణ

 

ముందు నేను 1978లో  సివోసిలో చేరాను. సివోసి రద్దు అయి మరో పార్టీతో కలిసి 1980లో పీపుల్స్ వార్ గా మారింది. కృష్ణాజిల్లాతో పాటూ వుభయగోదావరి జిల్లాల ప్రాంతీయ కమిటీలో బరువైన బాధ్యతల్నే నిర్వర్తించాను. పీపుల్స్ వార్ నాకు నచ్చినంత కాలం అందులో వున్నాను. క్రమంగా అందులో బ్యూరాక్రటికి ధోరణి పెరిగింది. దాన్ని అప్పుడే విమర్శించాను. 1989 ఎన్నికల తరువాత పీపుల్స్ వార్ నాకు అస్సలు నచ్చలేదు. అందులో బ్యూరాక్రటిక్ ధోరణి భరించలేనంతగా పెరిగిపోయింది. 1990లో పూర్తిగా బయటికి వచ్చేశాను. అయితే, దాని మీద కొంత కాలం ఒకరకం గౌరవం కొనసాగింది.  మనం పుట్టిన ఊరి మీద, మనం పని చేసిన పార్టి మీద మనకు ఒకరకం భావోద్వేగం వుంటుంది. ఇదీ అలాంటిదే. 2004లో పీపుల్స్ వార్ రద్దు కావడంతో ఆ చివరి అనుబంధం కూడా తెగిపోయింది.

 

పీపుల్స్ వార్ జత కలిసిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ మీద నాకు ఎన్నడూ సదభిప్రాయంలేదు. నక్సల్ బరీ పంథాలో ప్రజా సంఘాలను జత చేసిన ఘనత పీపుల్స్ వార్ కు వుండేది.  ఎంసిసి ప్రజా సంఘాలకు వ్యతిరేకం. అది అతివాద పార్టి. ఆ పార్టి పెట్టిన షరతుల మేరకు పీపుల్స్ వార్ తన ప్రజా సంఘాలను కూడ రద్దు చేసుకుంది. అది చాలా స్పష్టంగా వెనకడుగు అని నా అభిప్రాయం.

 

2004లో కొత్తగా ఏర్పడిన సిపిఐ మావోయిస్టు పార్టి తాత్విక రంగంలో గానీ, సామాజిక రంగంలోగానీ, ఉద్యమ విభాగంలోగానీ గత పీపుల్స్ వార్ తో పోలిస్తే కొత్తగా  ఆవిష్కరించిన అంశం ఒక్కటంటే ఒక్కటీ నా దృష్టికి రాలేదు. అంచేత నేను ఎన్నడూ మావోయిస్టు పార్టీని పట్టించుకోలేదు.

 

ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు  ప్రస్తావిస్తున్నారని కొందరు అడుగుతున్నారు. నిన్న రాత్రి నెల్లూరు రాజశేఖర్ – విశ్లేషణలో డా. కె. విజయకుమార్ ప్రసంగాన్ని విన్నాను.  వారు తమ ప్రసంగంలో పీపుల్స్ వార్ ప్రస్తావన అనేక సార్లు చేశారు. సామాజిక అంశాల మీద ఆ పార్టి అవగాహనను గొప్పగా వివరించారు. కానీ సిపిఐ మావోయిస్టు ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అంచేత వారి ఉపన్యాసం గతానికి సంబంధించింది అనిపించింది. అది ముగిసిన అధ్యాయం అని చెప్పడం అవసరం అనుకున్నాను. డా. కె. విజయకుమార్ ఇప్పుడు పీపుల్స్ వార్ ను పునరుధ్ధరించ దలిస్తే అది వేరే విషయం.

 

నేను ముస్లిం సామాజిక వర్గంలో పుట్టాను. ముస్లిం సామాజికవర్గ ప్రతినిధిగానూ భావిస్తాను. నేను దేవుడ్ని నమ్ముతాను. మార్ క్సిస్టులు మతం పేరుతోసాగే  దోపిడిని వ్యతిరేకించాలిగానీ  మత విశ్వాసాలని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చనిపోయాక కామ్రేడ్స్‍ చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్యలను దహనం చేశారు; ముజఫర్ అహ్మద్, మగ్ధూం మొహియుద్దీన్, ఎంటీ ఖాన్, ఎస్ ఎం రవూఫ్ తదితరుల్ని ఖననం చేశారు. అంటే ఆ కామ్రేడ్లకు చనిపోయాక మతం వచ్చింది. ఇవన్నీ వాళ్ల కుటుంబీకులు చేసిన అంత్యక్రియలుకావు. పార్టీలు జరిపించిన అంత్యక్రియలు. తేడా ఒక్కటే భౌతిక కాయం మీద ఎర్రజెండా కప్పుతారు. ఖననం ఖననం ఖననమే. దహనం దహనమే. చివరకు కార్ల్ మార్ క్స్ ను కూడ యూదుల శ్మశానంలోనే ఖననం చేశాడు ఏంగిల్స్. మార్ క్స్ ఏంగిల్స్ కన్నా గొప్ప మార్ క్సిస్టులు మన కాలంలో వున్నారనుకోను.  

 

పీపుల్స్ వార్ అధ్యాయాన్ని నేను ముగించలేదు. ఆ పార్టీయే తన అధ్యాయాన్ని తానే ముగించుకుంది. ఒక పార్టీలో వున్నా లేకున్నా స్వతంత్ర  మార్ క్సియన్లు చాలా మంది వుంటారు. నేను ఆ కోవకు చెందుతాను. మార్ క్సిస్టుగా వుండడం నాకు ఇష్టం. చాలా మంది కమ్యూనిస్టు, మావోయిస్టు అభిమానులమనే  పేరుతో   పిచ్చి భాషల్లో మాట్లాడుతుంటారు. మార్ క్సియన్ భాషలో మాట్లాడేవారితో సంవాదానికి  నేను ఎప్పుడూ సిధ్ధమే.

Sunday 8 November 2020

Amaravati Capital – 10 Points

 Amaravati Capital – 10 Points

అమరావతి రాజధాని – 10 అంశాలు

 

1.        రాయలసీమ, ఉత్తరాంధ్రా మనోభావాలను పరిగణన లోనికి తీసుకోకుండ రాజధానికి చెందిన మూడు విభాగాలనూ అమరావతిలోనే నెలకొల్పొడం అంటే మరోసారి రాష్ట్ర విభజనకు బీజాలు వేయడమే.

2.        అమరావతిలో రాజధాని నిర్మాణానికి అనుసరించిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంగానీ, ల్యాండ్ పూలింగ్ స్కీం గానీ ఫక్తు రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్స్.

3.        ఎకరం వ్యవసాయ భూమి ఇస్తే, దాన్ని నగరీకరించి, ఇప్పుడు  ఇచ్చిన ఎకరం భూమి విలువకు  పది రెట్లు ఎక్కువ ఖరీదు చేసే పావు ఎకరం భూమి ఇస్తానని భూ యజమానులను బిల్డర్ ఊరించాడు. హైదరాబాద్ లో కూడ అలాంటి వెంచర్ వేసి సంపదను పెంచినట్టు బిల్డర్ చెప్పుకున్నాడు.

4.        “సంపద పెంచుతాను” అనడం ఆ బిల్డర్ కంపెనీ క్యాప్షన్.

5.        సంపద పెరుగుతుందంటే ఎవరికయినా సరే మనసు లాగుతుంది.

6.        గ్రామంలో వ్యవసాయ భూమితో సరిపెట్టుకోవడంకన్నా రాజధాని నగరంలో కమ్మర్షియల్ ల్యాండ్ ను పొందడం లాభదాయకం అనే ఆశతో భూ యజమానులు తమ భూముల్ని బిల్డర్ కు అప్పచెప్పారు.

7.        కాంపిటీటర్  వస్తే తన ప్రాజెక్టును అటక ఎక్కిస్తాడని తెలిసినా  పాత బిల్డర్ చట్ట బధ్ధంగా  కనీస ప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదు.

8.        బిల్డర్ సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయలేదు.

9.        బిల్డర్ చేతిలో భూయజమానులు నష్టపోయారు. వాళ్ళ మీద సానుభూతిని చూపాల్సిందే.

10.   విచిత్రం ఏమంటే అమరావతి భూ యజమానులు ఇప్పటికీ పాత బిల్డర్ నే నమ్ముతున్నారు.

Tuesday 3 November 2020

Bahujans and Workers needs a New Political Party

 బహుజనులు శ్రామికులకు కలిపి ఒక కొత్త రాజకీయ పార్టి కావాలి.

-  డానీ


కాంగ్రెస్ బిజెపిల మధ్య తేడా పలుచని పొర లాంటిది. కాంగ్రెస్ అంటే మితవాద బిజేపి; బిజేపి అంటే మతవాద కాంగ్రెస్ అనే మాట ఎలాగూ వుంది.

పివి నరసింహారావు హయాంలో కాంగ్రెస్ పార్టి చారిత్రక తప్పిదాలు అనేకం చేసింది. సోనియా గాంధి ఆ పార్టికి పునర్జన్మ నిచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ ఆ పార్టి భారీ తప్పులు చేసింది. ఎన్నికల్లో బిజేపి మీద పైచేయి సాధించాలంటే ఆ పార్టి అనుసరించే మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మతసామరస్య శేణుల్ని ఐక్యం చేయాలనే జ్ఞానోదయం రాహుల్ గాంధీకి కలగలేదు. మతతత్వ రాజకీయాల్ని మతతత్వ రాజకీయాలతోనే ఓడించాలని రాహుల్ గాంధీ భావించారు. మతత్వానికి Original Equipment (OE)  బిజేపి రంగంలో వున్నప్పుడు, మతత్వానికి Replacement Equipment (RE) అయిన కాంగ్రెస్ కు ఓట్లేందుకు వేస్తారూ? సరిదిద్దుకోలేని తప్పిదం అది. దానితో భారత రాజకీయాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది.

ఇక బహుజన సమాజ్ పార్టీలో మాయావతిది ఎన్నడూ కాన్షీరామ్ స్థాయి కాదు. లోక్ జనశక్తి, రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (అథవాలే)లా ఇప్పుడు బిఎస్పీ కూడ దళిత నాయకులు గల ఒక రాజకీయ పార్టి మాత్రమే. అంత వరకే దానికి విలువ. ఇతర పార్టీల్లో వుండే అవలక్షణాలన్నీ ఇప్పుడు బిఎస్పీలో కూడ వున్నాయి. బిఎస్పీకి మైనార్టీల మీద ప్రత్యేక అభిమానం వున్నట్టు కనిపించదు.  బిజేపితో రాజకీయ హానీమూన్ గడిపిన సందర్భాలు కాన్షిరామ్ హయాంలోనే మొదలయ్యాయి. పైగా, బాబ్రీ మసీదు కూల్చివేత తరువాతనే బిజేపితో బిఎస్పి పొత్తు కుదుర్చుకుంది. ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రముఖ దళిత నేతలు బిజేపి నేతలతో కలిసి బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాలు వున్నాయి. బిజేపికన్నా కాంగ్రెస్ భిన్నం కానట్టే బిఎస్పీ కూడ భిన్నం కాదు.

మరోవైపు, వామపక్షాలు సహితం స్వీయ తప్పిదాలతో క్రమంగా  ప్రజల విశ్వసనీయతను కోల్పోయాయి. వామపక్షాలకు ఇప్పుడు సంఘటిత కార్మిక రంగం కొంత వరకు ప్రాణరక్షణ ఔషధంగా  వుంది. గత లోక్ సభ ఎన్నికల్లో 1.75 శాతం ఓట్లతో సిపియం 10వ స్థానానికి పడిపోయింది. సిపిఐకు ఒక్క శాతం ఓట్లు కూడ పడలేదు. దానికి పడ్డ ఓట్లు 0.58 శాతం. సాయుధ పోరాటం ఒక్కటే శరణ్యం అని భావించే ‘విప్లవ’ కమ్యూనిస్టు పార్టీలకు ప్రధాన స్రవంతితో సంబంధాలు తెగిపోయి రెండు దశాబ్దాలు అవుతోంది.  ప్రధాన స్రవంతి కూడ ఆ ‘విప్లవ’ పార్టీలని మరిచిపోయి చాలా కాలం అయింది.

ఎవరయినా ముచ్చటపడి గ్రేడింగ్ ఇవ్వదలుచుకుంటే, ప్రజలకు బిజేపికన్నా కాంగ్రెస్ తక్కువ ప్రమాదకారి; కాంగ్రెస్ కన్నా బిఎస్పీ తక్కువ ప్రమాదకారి, బిఎస్పీకన్నా వామపక్షాలు తక్కువ ప్రమాదకారులు అనుకోవచ్చు.

ఎస్టీ, ఎస్ సి, బిసి, మైనార్టీలు, మహిళలు, ఓసీల్లోని పేదలు, శ్రామికులకు ప్రాతినిథ్యం వహించే ఒక కొత్త పార్టి ఆవిర్భవించాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు చర్చ ఆ దిశగా సాగితే మేలు జరుగుతుంది.

విజయవాడ

2 నవంబరు 2020